కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 5/15 పేజీలు 8-11
  • ధనాపేక్ష కలిగివుంటే తప్పేమిటి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ధనాపేక్ష కలిగివుంటే తప్పేమిటి?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ధనం విషయంలో సమతూకమైన దృష్టి
  • గతం నేర్పే ఓ పాఠం
  • డబ్బు కొనలేని ఆనందాలు
  • “అది రెక్కలు ధరించి యెగిరిపోవును”
  • శాశ్వత ఆనందానికి మూలము
  • జీవితంలో డబ్బుకున్న స్థానం ఏంటి?
    తేజరిల్లు!—2015
  • డబ్బు అన్ని రకాల చెడుకు కారణమా?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • డబ్బు విషయంలో జ్ఞానయుక్తమైన దృక్పథమేమిటి?
    తేజరిల్లు!—2007
  • డబ్బు సంపాదించడంలో తప్పేమిటి?
    తేజరిల్లు!—1997
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 5/15 పేజీలు 8-11

ధనాపేక్ష కలిగివుంటే తప్పేమిటి?

ఒకానొక బీద ఆఫ్రికా సమాజంలో పాల్‌, మేరి ఒక సూపర్‌ మార్కెట్టు నడిపారు.a వారు రాత్రనక పగలనక కష్టపడి పనిచేసి బాగా డబ్బు కూడబెట్టారు. కొంతకాలానికి ఖరీదైన ఫర్నిచర్‌తో నిండిన తన క్రొత్త పెద్ద ఇంటిని గూర్చి మేరి గొప్పగా చెప్పుకోగల్గింది. ఇక పాల్‌ విషయానికొస్తే అతనొక ఖరీదైన కారుకు యజమానయ్యాడు.

ఒకరోజు ప్రభుత్వాన్ని వ్యతిరేకించే ఒక గుంపొకటి పాల్‌ దగ్గరకు వచ్చింది. వారతన్ని “మా పనికి మద్దతుగా మీ వ్యాపారం మాకు ప్రతినెల కొంతడబ్బు [100డాలర్లు] విరాళంగా ఇవ్వాలని” వత్తిడిచేశారు. రాజకీయ పోరాటాల్లో ఎవరి పక్షమైననూ వహించడానికి ఇష్టపడనివారై పాల్‌, మేరీలు ధైర్యంగా అలా యివ్వడానికి నిరాకరించారు. వారి తటస్థ వైఖరి కారణంగా, వారికి ప్రభుత్వాన్నుండి ఆర్థిక మద్దతు లభిస్తుందని అనుమానించడం జరిగింది. ఒక వారాంతమందు, పాల్‌, మేరీలు ఆ పట్టణంలోలేని సమయంలో వారి దుకాణాన్ని కొల్లగొట్టి, వారి కారును వారి ముచ్చటైన గృహాన్ని తగులబెట్టారు.

నిజంగా, అదొక దుఃఖకర సంఘటన, అయితే దానినుండి మనమేమి నేర్చుకోగలం? ధనవంతులగుటకు కష్టపడి పనిచేసిన అనేకులు తమ ధనసంపత్తిని దోచేసిన విపత్తులకు గురికాలేదు, అయినను భవిష్యత్తు సంగతేమి? “ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములు హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయునని” బైబిలెందుకు చెప్పుచున్నది?—1 తిమోతి 6:9.

ధనం విషయంలో సమతూకమైన దృష్టి

బైబిలు ప్రకారంగా, క్రైస్తవుడు తనపై ఆధారపడిన కుటుంబ సభ్యులను పోషించాలి. నిరుద్యోగము లేదా ఆరోగ్యసమస్యల వంటి పరిస్థితులు కొన్నిసార్లు దీనిని కష్టతరంచేస్తాయి. మరోవైపున, ఉద్దేశపూర్వకంగా తన కుటుంబాన్ని పోషించడాన్ని నిర్లక్ష్యంచేసే క్రైస్తవుడు “విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును.”—1 తిమోతి 5:8.

కొన్ని మారుమూల ప్రాంతాల్లో, ప్రజలు స్వంత పొలాల్లో పంట పండించుకుని, పశువులు పెంచుతూ జీవిస్తూవుంటారు. కొందరైతే తమ జీవితావసరాలకు కావల్సిన వస్తువులు, సేవల కొరకు వస్తుమార్పిడి చేయుట వలన వారికి డబ్బు అవసరత అంతగా ఉండదు. అయితే, సాధారణంగా తమ కుటుంబాల్ని పోషించడానికి కుటుంబ యజమానులు జీతానికి ఏదొక ఉద్యోగం చేస్తుంటారు. అలా వారు సంపాదించిన డబ్బును తమ కుటుంబ సంక్షేమానికి దోహదపడే ఆహార పదార్థాలు, వస్తువులు కొనడానికి ఉపయోగిస్తుంటారు. దానికితోడు, జ్ఞానయుక్తంగా పొదుపుచేసిన డబ్బు ఏదైనా కష్టం కలిగినప్పుడు లేదా విపత్తు సంభవించినప్పుడు రక్షిత ధనంగా పనికొస్తుంది. ఉదాహరణకు, వైద్యపరమైన ఖర్చులకు లేదా ఇంటిని బాగుచేసికొనుటకు దానిని ఉపయోగించవచ్చు. అందుకే, “ద్రవ్యము ఆశ్రయాస్పదమని,” “ద్రవ్యము అన్నిటికి అక్కరకు వచ్చునని” బైబిలు వాస్తవికంగా తెలియజేస్తుంది.—ప్రసంగి 7:12; 10:19.

డబ్బుతో ఎన్నో పనులు నెరవేర్చవచ్చును గనుక, దాని శక్తిపై అవాస్తవిక దృక్కోణమును వృద్ధిచేసుకునే ప్రమాదం కలదు. ఇతర మరి ప్రాముఖ్యమైన సంగతులతో పోల్చినప్పుడు దానికున్న పరిమితుల విషయంలో క్రైస్తవుడు జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు, బైబిలు దైవిక జ్ఞానముతో డబ్బుకున్న విలువను పోలుస్తూ ఇట్లంటున్నది: “జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము; అయితే జ్ఞానము దాని పొందినవారి ప్రాణమును రక్షించును; ఇదే జ్ఞానమువలన కలుగు లాభము.” (ప్రసంగి 7:12) ఏ విధంగా ఈ దైవిక జ్ఞానము డబ్బుకంటె ఎక్కువ లాభదాయకము?

గతం నేర్పే ఓ పాఠం

డబ్బుకంటె దైవిక జ్ఞానమెలా లాభదాయకమో సా.శ. 66లో యెరూషలేము నందు సంభవించిన సంఘటనలు దృష్టాంతపరస్తున్నవి. దాడికి వచ్చిన రోమా సైన్యాలను వెనక్కి తరిమిన తరువాత, యెరూషలేములోని యూదులిప్పుడు వ్యాపార ఉత్తరాపేక్షలు చాలా బాగున్నవని నమ్మారు. వారికి క్రొత్తగా లభించిన స్వాతంత్రమునుబట్టి ఉత్సహించుటలో తమ స్వంత ద్రవ్యాన్ని తామే ముద్రించుకోవడం ఆరంభించారు. హెబ్రీలో “సీయోను స్వాతంత్ర్యమునకు,” మరియు “పరిశుద్ధ యెరూషలేము” అను మాటలతో తమ నాణాలను ముద్రించారు. ప్రతి నూతన సంవత్సరం గుర్తింపబడులాగున “రెండవ సంవత్సరం,” “మూడవ సంవత్సరం,” “నాల్గవ సంవత్సరం” అను మాటలతో అవి తయారుచేయబడేవి. సా.శ. 70వ సంవత్సరాన్ని సూచిస్తూ “ఐదవ సంవత్సరం” అని వ్రాయబడిన కొన్ని అరుదైన నాణాలను సహితం పురావస్తు శాస్త్రజ్ఞులు త్రవ్వకాలలో వెలికితీశారు. క్రైస్తవులుగా మారిన యూదులు శాశ్వత స్వాతంత్ర్యానికి సూచనగా ఆ క్రొత్త యూదయ ద్రవ్యాన్ని దృష్టించారా?

లేదు. ఎందుకంటే వారు తమ యజమాని చెప్పిన జ్ఞానయుక్తమైన మాటలను తమ మనస్సులో ఉంచుకొన్నారు. సా.శ. 66లో జరిగిన రోమా సైన్యాల ముట్టడిని గూర్చి యేసు ప్రవచించాడు. అది సంభవించినప్పుడు తన అనుచరులు ‘యెరూషలేమును విడిచి పారిపోవలెనని’ వారికి సలహా చెప్పాడు. (లూకా 21:20-22) యూదా క్రైస్తవులు అలానే చేశారని చరిత్ర ధృవపరుస్తున్నది. యెరూషలేమును విడుచుటకు వారు ఆస్తులను, సంపాద్యమును, వ్యాపార అవకాశాలను నష్టపోవుటకు ఇష్టపడ్డారు. నాలుగు సంవత్సరాల తర్వాత, రోమా సైన్యాలు తిరిగివచ్చి ముట్టడివేసి పట్టణాన్ని ధ్వంసం చేశాయి.

ప్రత్యక్షసాక్షియైన చరిత్రకారుడగు జోసీఫస్‌ చెప్పిన ప్రకారం, “ఆ పట్టణంలో బంగారం వ్యాపారం బహు విస్తారంగా సాగింది.” అయితే “క్రమేపి నీచమై” “ప్రతి ఇంటిని, కుటుంబాన్ని కబళించిన” కరవునుండి, ఆ విస్తారమైన ధనం యెరూషలేమును కాపాడలేక పోయింది. కొంతమంది నివాసులు బంగారు నాణాలు మ్రింగి పట్టణం నుండి పారిపోవడానికి ప్రయత్నించారు. కాని శత్రువులు వారిని పట్టుకొని డబ్బుకొరకు వారి కడుపులు చీల్చి హతంచేశారు. “ధనవంతుని విషయానికొస్తే, పట్టణం విడిచిపారిపోవడం ఎంత ప్రమాదకరమో దానిలో ఉండుట కూడ అంతప్రమాదకరమై యుండెను; ఎందుకంటే దేశం విడిచి పారిపోతున్నారని ఆరోపించి ఎందరినో చంపి డబ్బు దోచుకోవడం జరిగిందని” జోసీఫస్‌ వివరిస్తున్నాడు.

ముట్టడి వేసి ఆరునెలలు కాకముందే, యెరూషలేము నాశనం చేయబడగా, దాదాపు పది లక్షలమంది నివాసులు కరవుచేత, తెగులుచేత, కత్తివాతకూలి మరణించారు. ధనాపేక్ష అనేకమందిని అవివేకులను చేసి, వారు నాశనమగుటకు కారణమైంది, అయితే జ్ఞానయుక్తముగా చెప్పిన మాటలను అన్వయించుట యూదా క్రైస్తవులు తప్పించుకొనేటట్లు చేసింది.

ఆపత్కాలమందు ప్రజలను రక్షించడంలో డబ్బు విఫలం కావడం చరిత్రలో కేవలం అదొక్క సంఘటనే కాదు. ధనాపేక్ష ఎంత క్రూరమైన యజమానిగా ఉండగలదు! (మత్తయి 6:24) అంతేకాకుండ, అది నీ ప్రస్తుత ఆనందాన్ని కూడా దోచేయగలదు.

డబ్బు కొనలేని ఆనందాలు

ధనవంతుడను కావాలనే కోరిక అధిక ధనం అవసరంలేని అనేక ఆనందాల విషయంలో ఒక వ్యక్తిని అంధునిగా చేస్తుంది. ఉదాహరణకు, ఆనందంగల కుటుంబ సంబంధాలు, నిజమైన స్నేహితులు, ప్రకృతి అద్భుతాలు, కడురమ్యమైన సూర్యాస్తమయం, ఉరుములతో కూడిన వర్షాలు, నక్షత్రాలు నిండిన ఆకాశం, జంతువుల ఆటలు, లేదా పాడుచేయబడని అరణ్యమందలి చెట్లు, పుష్పాలను గూర్చి ఆలోచించండి.

నిజమే, కొంతమంది ధనవంతులు పైన ప్రస్తావించబడిన ఆనందాలను అనుభవించుటకు ఎక్కువ సమయం కలిగియుంటారు, అయితే వారిలో అనేకులు తమ ధనాన్ని దాచుకోవడానికి ప్రయత్నించడంలో లేదా పెంచుకోవడంలో తీవ్ర పనిరద్దీని కలిగియున్నారు. ఖాళీ సమయమున్న వారుకూడ ఆనందించలేకపోతున్నారనడం ఆశ్చర్యంగా అన్పించవచ్చును. ఇది ఆధునిక పరిశోధకులను ఆశ్చర్యపరుస్తున్నది. “అనేకమంది ప్రజలు ఎంతో ఆశతో అపేక్షిస్తూ, అది ప్రతి సమస్యకు పరిష్కారమనుకొని దానిని సంపాదించినప్పుడు, రిక్తతనుండి మనోకృంగుదల వరకు వివిధ స్థాయిల్లో వారు అనుభవిస్తున్నారనే దానిని మనమెలా వివరించగలం?” అని థామస్‌ వైజ్‌మ్యాన్‌ తన పుస్తకమగు ది మనీ మోటివ్‌—ఎ స్టడీ ఆఫ్‌ యాన్‌ అబ్‌సెషన్‌ లో ప్రశ్నించాడు.

ధనవంతుని ఆనందాన్ని దోచుకోగల ఒక సంగతేమనగా, అతని నిజమైన స్నేహితులెవరో తెలుసుకోవడం చాలా కష్టం. సంపన్నవంతుడైన రాజగు సొలొమోను “ఆస్తి యెక్కువైన యెడల దాని భక్షించువారును ఎక్కువ” కావడాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. (ప్రసంగి 5:11) తమ సంపత్తి విలువను పెంచుకోవడానికి లేదా కాపాడుకోవడానికి అనేకమంది ధనవంతులు చింతిస్తుంటారు. తరచు ఇది వారి నిద్రానందాన్ని దోచేస్తుంటుంది. బైబిలిలా వివరిస్తుంది: “కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు; అయితే ఐశ్వర్యవంతులకు తమ ధనసమృద్ధిచేత నిద్రపట్టదు.”—ప్రసంగి 5:12.

ధనాపేక్ష కుటుంబ, స్నేహితులమధ్య సంబంధాలను పాడుచేయగలదు ఎందుకంటే అది ఒకడు అవినీతికార్యాల్ని, నేరకృత్యాల్ని చేయునట్లు శోధిస్తుంది. ధనాపేక్షులు తరచు జూదానికి దిగుతుంటారు. విచారకరమైన విషయమేమంటే, మరొక్కసారి జూదమాడుదామనే కోరిక అనేకమందిని అప్పులపాలు జేస్తుంది. “వారు నాదగ్గరకు వచ్చేసరికి సాధారణంగా యథాస్థితికి రాలేనివారిగా ఉంటారు. వారి ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇళ్లు పోగొట్టుకుంటారు, ఫలితంగా వారి కుటుంబ సభ్యులు వారిని విడిచి వెళ్లిపోతారని” ఒక దక్షిణాఫ్రికా దేశపు మానసిక వైద్యుడు అన్నాడు. బైబిలు హెచ్చరిక ఎంత వాస్తవమై యున్నది: “నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనొందక పోడు.”—సామెతలు 28:20.

“అది రెక్కలు ధరించి యెగిరిపోవును”

ధనాపేక్ష ఎంతో ప్రమాదకరమైనదనుటకు గల మరో కారణమేమనగా అంతర్జాతీయంగా డబ్బు విలువను స్థిరంగా ఉంచడానికి లేదా సంపూర్ణంగా సహకరించడానికి మానవ ప్రభుత్వాలకు శక్తిలేదని నిరూపించబడింది. ఆలాగే వారికి ఆర్థికమాంద్యాన్ని, ఆర్థికవిలువలు పడిపోవడాన్ని, స్టాక్‌ మార్కెట్‌ విచ్ఛిన్నమవడాన్ని ఆపే శక్తి లేదు. మోసము, దొంగతనము, ద్రవ్యోల్బణము కూడ ప్రేరేపిత వాక్య సత్యాన్ని నొక్కితెల్పుచున్నవి. “ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము. నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాని విడిచిపెట్టుము. నీవు దానిమీద దృష్టి నిలిపినతోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి యెగిరిపోవును.”—సామెతలు 23:4, 5.

ద్రవ్యోల్బణము. ఈ సమస్య కేవలము బీద దేశములకు మాత్రమే పరిమితం కాలేదు. ఈ శతాబ్దపు తొలిభాగంలో, మధ్య ఐరోపాలోని పారిశ్రామిక దేశాల్లో ఈ ద్రవ్యోల్బణము బాగా పెరిగిపోయింది. ఉదాహరణకు, మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు, జర్మన్‌ మార్కు, బ్రిటీషు షిల్లింగ్‌కు, ఫ్రెంచ్‌ ఫ్రాంక్‌కు, లేదా ఒక ఇటాలియన్‌ లిరాకు దాదాపు సరిసమానంగా ఉండింది. పది సంవత్సరాల తర్వాత షిల్లింగ్‌, ఫ్రాంక్‌, లిరా రమారమి 1,00,000,00,00,000 మార్కులకు సమానమయ్యెను. సంపన్న సమాజ ప్రజలపై పెరుగుచున్న ద్రవ్యోల్బణము ఎలాంటి ప్రభావము కలిగియుంటుంది? “ఓడిపోయిన మధ్య యూరపు శక్తులకు 1920వ దశాబ్దపు తొలిభాగంలో సంభవించినది తీసుకుంటే, ఏ సమాజం కూడ పతనం కాకుండ, మారకుండా ఉండదనే భయం అలాంటి పేరాశను, హింసను, అసంతోషాన్ని, ద్వేషాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చునని” ఆడమ్‌ ఫెర్‌గసన్‌ తన పుస్తకమగు వెన్‌ మనీ డైస్‌ లో చెప్పాడు.

జర్మనీ 1923లో ఆ 12 సున్నాలను కొట్టేసి తమ కరెన్సీకి క్రొత్త విలువ ఇవ్వడంతో 1,00,000,00,00,000 పాత మార్కులు ఒక క్రొత్త మార్కుకు సమానమైపోయాయి. ఈ చర్య ద్రవ్యోల్బణాన్ని ఆపుజేసినను అది ఇతర వినాశకర పరిణామములను కలిగివుండెను. ఫెర్‌గసన్‌ యిలా వివరిస్తున్నాడు: “వేలాదిమందిని దివాలా ఎత్తించిన, లక్షలాదిమంది జీవనోపాధిని దోచేసిన, మరియు ఇతర లక్షలాదిమంది ఆశలనే అణగార్చిన ఆర్థిక స్థిరీకరణయొక్క పునఃస్థాపన ప్రపంచమంతా చెల్లించాల్సిన మరింత భయంకరమైన మూల్యాన్ని పరోక్షముగా ప్రబలింపజేసింది.” ఆ గ్రంథకర్త తన మనస్సులో కలిగియున్న ఆ “భయంకరమైన మూల్యం” ఏమనగా నాజీవాదం అధికారానికి రావడం, రెండవ ప్రపంచ యుద్ధం జరగడమే.

గతంలో విఫలమైన అనేక పెద్ద బ్యాంకు ఖాతాలు, ప్రపంచవ్యాప్త ఆర్థిక అస్థిరతగల ఈ కాలంలో ఒక గంభీరమైన హెచ్చరికనివ్వాలి. డబ్బు విఫలమౌతుందని దేవుని కుమారుడే స్వయంగా హెచ్చరించాడు, కాగా అనేకమార్లు నిశ్చయంగా అలానే జరిగింది. (లూకా 16:9) అయితే ఈ దుష్ట లోకంపై యెహోవా దేవుడు తన తీర్పు విధించినప్పుడు మహాగొప్పదైన, బహుళ వ్యాప్తమైన ఆర్థిక వైఫల్యత సంభవిస్తుంది. “ఉగ్రతదినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణమునుండి రక్షించును.”—సామెతలు 11:4.

కాబట్టి, మనలో ప్రతిఒక్కరము మన నిజమైన స్నేహితులగు యెహోవా దేవుని మరియు యేసుక్రీస్తు యెదుట మన నీతి స్థానాన్ని కాపాడుకొనుటకు కృషిసల్పాలి!

శాశ్వత ఆనందానికి మూలము

ముందు ప్రస్తావించబడిన పాల్‌, మేరీలు యెహోవాసాక్షులే. అనేక సంవత్సరాలు వారు పూర్తికాల సువార్త సేవలో భాగం వహించారు. అయితే, ధనం సంపాదించవలెనను వారి కోరిక వారు క్రైస్తవ సంఘ కూటాలకు హాజరుకాకుండ మానుకోవడానికి కారణమయ్యింది. దానితో వారు పరిచర్యయందు యితరులతో తమ విశ్వాసాన్ని పంచుకోవడాన్ని ఆపుజేశారు. అయితే వారు మేల్కొన్నారు. సమస్తం దోచుకొనబడి, ఇల్లు గుల్లయిన తర్వాత “కేవలం కొద్ది నిమిషాల్లోనే నిష్ప్రయోజనం కాగల దానికొరకు నా సమయాన్నంతా, శ్రమనంతా ధారపోయడం ఎంత అవివేకమో నేనిప్పుడు చూడగల్గుతున్నానని” మేరీ అన్నది. సంతోషకరమైన విషయమేమంటే, ఈ దంపతులు మరియెక్కువ ఆలస్యం కాకముందే ఒక పాఠం నేర్చుకున్నారు. అవును ధనాపేక్ష కలిగించగల మహాగొప్ప హాని ఏమంటే ఒక వ్యక్తి యెహోవా దేవునితో యేసుక్రీస్తుతో కలిగియున్న అంగీకృత స్థానాన్ని అది దోచేస్తుంది. ఈ స్నేహితులు లేకుండా, ఈ దుష్ట లోకాంతము నుండి తప్పించుకొని నీతియుక్తమైన వాగ్దాన నూతన లోకంలో ప్రవేశిస్తామని మనమెలా నిరీక్షించగలము?—మత్తయి 6:19-21, 31-34; 2 పేతురు 3:13.

కావున నీవు ధనవంతుడవైనా, లేదా బీదవాడివైనా నీలో ధనాపేక్ష వృద్ధికాకుండ జాగ్రత్తపడుము. అన్నింటికంటె గొప్పదైన సంపదను అనగా యెహోవా దేవుని యెదుట అంగీకృత స్థానాన్ని సంపాదించి దాన్ని కాపాడుకొనుటకు పనిచేయుము. అత్యవసర ఆహ్వానానికి తదేక ధ్యానమిచ్చుట ద్వారా నీవు దీనిని చేయగలవు: “ఆత్మయు పెండ్లి కుమార్తెయు ‘రమ్ము’ అని చెప్పుచున్నారు; వినువాడును ‘రమ్ము’ అని చెప్పవలెను; దప్పిగొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.”—ప్రకటన 22:17.

[అధస్సూచీలు]

a వారి అసలు పేర్లు ఉపయోగింపబడలేదు.

[8, 9వ పేజీలోని చిత్రాలు]

యూదుల తిరుగుబాటు కాలంలో “రెండవ సంవత్సరము” అనే వ్రాతతో తయారుచేయబడిన నాణెముయొక్క ఇరువైపులు

[క్రెడిట్‌ లైను]

Pictorial Archive (Near Eastern History) Est.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి