హృదయంనుండి, మనస్సునుండి కాలుష్యాన్ని పెరికివేయుట
యెహోవా దేవుడు మానవులకు అశుద్ధత, అక్రమమును గూర్చిన వాంఛనివ్వలేదు. వారి భూగృహము పరిశుభ్రమైన, క్రమమైన అందమైన పరదైసుగా ఉండుటకు రూపింపబడెను. అది అసహ్యమైన పాడుదిబ్బగా మారుటకు ఆయన సంకల్పించలేదు.—ఆదికాండము 2:8, 9.
అయితే, మానవులు దైవిక నడిపింపును నిరాకరించిన తర్వాత, వారు తమ స్వంత ప్రపంచ విధానమును నిర్మించుకొనుటకు ఆరంభించారు. దైవిక జ్ఞానం, అనుభవం లేనందున వారు కష్టపడి నేర్చుకోవాల్సివచ్చింది. మానవులు తమంతటతాము జయప్రదంగా పరిపాలించుకోలేరని చెప్పిన బైబిలు సత్యాన్ని చరిత్ర రూఢిపరస్తున్నది; వేలాది సంవత్సరాలుగా “ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొనుట” జరిగింది. (ప్రసంగి 8:9; యిర్మీయా 10:23) దాని సమస్త రూపములందు కాలుష్యాన్ని గూర్చిన ఆధునిక సమస్య, మానవ దుష్పరిపాలన యొక్క పరిణామమై యున్నది.
దేవుని దృష్టిని హత్తుకొనుట
దేవుని ప్రీతిపర్చాలనే కోరికగల ప్రజలు పరిశుభ్రత యెడల సృష్టికర్త ప్రమాణములకు తగినట్టు జీవించుటకు కృషిచేస్తారు. జెకొస్లోవాకియా నందలి ప్రాగ్, 1991 మధ్యకాలమందు అంతర్జాతీయ సమావేశం జరపాలని నిర్ణయించినప్పుడు యెహోవాసాక్షులు ఈ విధమైన సమస్యనే ఎదుర్కొన్నారు.a ఒకపెద్ద గుంపును సౌకర్యవంతంగా కూర్చోపెట్టగల స్ట్రాహాఫ్ స్టేడియంలో 75,000 మంది హాజరుకాబోతున్నారు. అయితే ఆ స్టేడియం గత ఐదు సంవత్సరాలుగా ఉపయోగింపబడ్డం లేదు. దానిని బాగుచేసే అవకాశంలేక, వాతావరణ పరిస్థితులనుబట్టి బాగా పాడైపోయింది. దాదాపు 1,500 మంది యెహోవాసాక్షులు 65,000 గంటలు కష్టపడి దానిని బాగుచేసి మరలా రంగువేశారు. సమావేశ సమయానికి ఈ పరిశుభ్రం చేసేపని దాన్ని సత్యదేవుడైన యెహోవాను ఆరాధించే యోగ్యమైన స్థలంగా మార్చివేసింది.
పరిశుభ్రతకు, క్రమానికి లోకం ఏమంత మెప్పుదలను చూపించకుండా ఉండగా, యెహోవాసాక్షులు భిన్నంగా ఉండుటకు వారినేది పురికొల్పింది? క్రైస్తవులు స్వార్థము, శ్రద్ధచూపకపోవడం, పేరాశ, ప్రేమలేకపోవడం వంటి ప్రతికూల లక్షణాలను పెరికివేయవలెనని చెప్పిన బైబిలు సలహాయెడల వారికున్న మెప్పుదలే వారినలా పురికొల్పుతుంది. “ప్రాచీన స్వభావమును దాని క్రియలతోకూడ పరిత్యజించుము” అని బైబిలు చెప్పుచున్నది. దాని స్థానమందు “జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును” ధరించుకొనండి. అనగా పరిశుభ్రత, క్రమము మరియు అందము కొరకైన ప్రేమచే నిండిన స్వభావమందు కలుషితపర్చే ఉద్దేశాలకే తావుండదు.—కొలొస్సయులు 3:9, 10; 2 కొరింథీయులు 7:1; ఫిలిప్పీయులు 4:8; తీతు 2:14.
క్రైస్తవులు కాలుష్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని, విచక్షణలేకుండా కాలుష్యాన్ని కలిగించడం లేదా ప్రభుత్వాలుచేయు కాలుష్యనివారణా నియమాలను అవిధేయతతో ఉల్లఘించకూడదని నవీన స్వభావం కోరుతుంది. చెత్తాచెదారం పోగవడానికి నడిపే నిర్లక్ష్య, స్వార్థపరమైన, సోమరితనంతో కూడిన దృక్పథాల నవలంబించకుండా విసర్జించుటకు అది వారికి సహాయం చేస్తుంది. ఇతరుల ఆస్తులను గౌరవించడాన్ని పురికొల్పుట ద్వారా, మీరు మీ భావావేశాలను సరదాగా లేదా చిత్రలేఖనానికి ప్రత్యామ్నాయంగా గోడలపై వ్రాయడానికి అది తావివ్వదు. గృహాలు, కార్లు, బట్టలు, శరీరాలు శుభ్రంగా ఉంచుకోవడాన్ని అది కోరుతుంది.—యాకోబు 1:21 పోల్చండి.
ఈ నవీన స్వభావాన్ని ధరించుకోవడానికి ప్రజలు ఇష్టపడకపోతే, దేవుడు వారిని తన రానైయున్న పరదైసులో ప్రవేశించకుండా అడ్డగిస్తే ఆయన్ని తప్పుపట్టగలమా? అలా తప్పుపట్టలేము. కాలుష్య స్వభావాలను తన హృదయమందు, మనస్సునందు ఇంకను కలిగియున్న ఎవరైనను పునరుద్ధింపబడిన భూపరదైసు అందాన్ని చెడగొట్టే వారిగానే కాకుండ, దానిని కాపాడాలనే కోరికున్న వారికి ఎంతో దుఃఖాన్ని కలుగజేయు వారైయుంటారు. కావున “భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకు” దేవుడు చేసిన తీర్మానము నీతియుక్తమైనదే కాదు ప్రేమగలది కూడ.—ప్రకటన 11:18; 21:8.
చురుగ్గా పాల్గొనాలా?
కాబట్టి, కాలుష్య నివారణ లేదా పరిశుభ్రపరచే పథకాల్లో క్రైస్తవులు చురుగ్గా పాల్గొనాలని దీని భావమా?
కాలుష్యం నిజంగా ఆరోగ్యానికి, ప్రజా భద్రతకు ప్రమాదకరమైనదే. యెహోవా ఇశ్రాయేలీయులకు యెహోవా ఇచ్చిన నియమాలనుండి ఆయన అటువంటి విషయాలయెడల శ్రద్ధకలిగియున్నాడనే విషయాన్ని మనం చూడగలం. (నిర్గమకాండము 21:28-34; ద్వితీయోపదేశకాండము 22:8; 23:12-14) అయితే ఏ సమయంలో కూడ ప్రజా భద్రతకు సంబంధించిన విషయాలను గూర్చి ఇతరులపై వత్తిడి తీసుకురావలెనని ఆయనెన్నడు వారిని నిర్దేశించలేదు; లేదా మొదటి శతాబ్దపు క్రైస్తవులు అలాచేయాలని ఎన్నడూ చెప్పబడలేదు.
పర్యావరణ విషయాలు ఈనాడు సులభంగా రాజకీయ వివాదాంశములుగా మారగలవు. నిజానికి, ఈ పర్యావరణ సమస్యల్ని పరిష్కరించే నిర్ధిష్ట ఉద్దేశంతోనే కొన్ని రాజకీయ పార్టీలు అవతరించాయి. ఇలాంటి రాజకీయ విషయాలు తనపై ప్రభావం చూపుటకు ఒక క్రైస్తవుడు అనుమతించినట్లయిన అతడెంత మాత్రము రాజకీయముగా తటస్థముగా ఉండడు. తన శిష్యులకు యేసు ఈ సూత్రమునిచ్చాడు: “నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు.” ఆ కట్టడను నిరాకరించు క్రైస్తవుడు “నిరర్థకులై పోవుచున్న యీ లోకాధికారులతో” పొత్తుపెట్టుకునే ప్రమాదంలో పడిపోగలడు.—యోహాను 17:16; 1 కొరింథీయులు 2:6.
యేసు తన కాలమందలి సామాజిక సమస్యలన్నింటిని పరిష్కరించుటకు ప్రయత్నించలేదు; లేదా అలాచేయండని తన శిష్యులకూ చెప్పలేదు. ఆయన వారికిచ్చిన ఆజ్ఞ ఏమనగా, “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; . . . వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి.” పర్యావరణ పథకాలను గూర్చి ఆయన వారికి ఆజ్ఞాపించలేదు.—మత్తయి 28:19, 20.
ఒక క్రైస్తవుని జీవితములో ఏది ప్రముఖమై యుండవలెనో వివరిస్తూ క్రీస్తు ఇట్లన్నాడు: “మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి.” (మత్తయి 6:33) తన మెస్సీయ రాజ్యము ద్వారా ఎప్పుడైతే యెహోవా భూవ్యాప్తముగా తన నీతి సూత్రాలను అమలుచేస్తాడో, అప్పుడు పర్యావరణ సమస్యలు అందరి సంతృప్తిమేరకు శాశ్వతంగా పరిష్కరింపబడతాయి.
ఆ విధంగా, యెహోవాసాక్షులు ఒక సమతూకమైన స్థానం వహిస్తారు. రోమీయులు 13:1-7 దృష్ట్యా, పర్యావరణాన్ని నియంత్రించే ప్రభుత్వ నియమాలకు మనఃపూర్వకంగా విధేయులగుట వారి విద్యుక్త ధర్మం. దానికితోడు, గోడలపై వ్రాయకుండా, విచక్షణా రహితంగా చెత్తపారవేయకుండా ఇతరుల ఆస్తులను అనగా ప్రభుత్వ, పరుల ఆస్తులయెడల గౌరవం చూపుటకు పొరుగువారియెడల వారికున్న దైవిక ప్రేమ వారిని పురికొల్పుతుంది. అయితే పరిశుభ్రపరచే ఈ లోక ప్రణాళికల్లో వారు నాయకత్వం వహించాలని వారికి నిర్దేశింపబడలేదు. శాశ్వత మేలుచేయు మార్గమిదేనని గ్రహించి వారు యుక్తరీతిలో దేవుని రాజ్య వర్తమానాన్ని ప్రకటించుటను మొదట ఉంచుతారు.
ఆత్మీయముగా పరిశుభ్రంచేయుట
రక్తం చిందించుట ద్వారా, లైంగిక దుర్నీతి జీవిత విధానాన్ని అవలంబించడం ద్వారా, లేదా పవిత్ర సంగతులయెడల అగౌరవం చూపుట ద్వారా భూమిని కలుషితం చేస్తే కలిగే పరిణామాలను గూర్చి ప్రాచీన ఇశ్రాయేలీయులు పదేపదే హెచ్చరింపబడ్డారు. (సంఖ్యాకాండము 35:33; యిర్మీయా 3:1, 2; మలాకీ 1:7, 8) భౌతిక కాలుష్యం విషయంలో దోషులు కాగల్గినను భౌతిక కాలుష్యం విషయంలో కాక, ప్రాముఖ్యముగా వారు ఆత్మీయ కాలుష్యం విషయంలో ఖండింపబడ్డారు.b
కాబట్టి, నేడు ఒక క్రైస్తవుడు ఆత్మీయ కలుషితము లేదా అపరిశుభ్రతను విసర్జించుటకు కృషిచేస్తాడు. అతడు హృదయమునుండి, మనస్సునుండి కాలుష్య భావాలను పెరికివేయగల “నవీన స్వభావమును” ధరించుకొనుట ద్వారా దీన్నిచేస్తాడు. తమయందు మత, నైతిక పరిశుభ్రత ఆలాగే గమనించదగిన శారీరక పరిశుభ్రతను సాధించుటతోపాటు ఈ ఆత్మీయ పరిశుభ్రతా పనినుండి 40 లక్షలకుపైగా గల యెహోవాసాక్షులు ప్రయోజనము పొందుతున్నారు.—ఎఫెసీయులు 4:22-24.
ఆత్మీయ పరిశుభ్రతా ప్రత్యేక కార్యమునకు సమయమిదే. యుక్త సమయమున కాలుష్యరహిత పర్యావరణమును అందించుటకు మన ఈ భూగృహము పాడుదిబ్బగా మారకుండా కాపాడుటకు దానికవసరమైన భౌతిక పారిశుద్ధ్య కార్యక్రమము మొదలవుతుంది.—ప్రసంగి 3:1.
[అధస్సూచీలు]
a తూర్పు ఐరోపాలో జరిగిన ఈ సమావేశముల పరంపరను గూర్చిన వివరణాత్మక రిపోర్టు కొరకు, డిశంబరు 22, 1991 అవేక్! చూడండి.
b లోహశుద్ధి విధానాలతో ఇశ్రాయేలీయులకు పరిచయముండెను. వారి రాగి గనుల్లో కొన్నింటియందు శిధిలాలు దొరికాయి, దేవాలయ వస్తువులను చేయుటకు వారు రాగి కరిగించి శుద్ధిచేసేవారు. (1 రాజులు 7:14-46 పోల్చండి.) ఈ లోహశుద్ధి కార్యక్రమం ఇతర సమస్యలతోపాటు ఆవిరి, లోహపు మడ్డి, లోహపు వ్యర్థపదార్థ తెట్టులతో కొంతమేరకు కాలుష్యం కల్గించకుండ బహుశ సాధ్యపడేది కాదు. అయినను, జనులు అంతగా నివసింపని, దూరముగానున్న ఈ ప్రాంతమందు స్థానికముగా కొంత పరిమాణములో జరిగింపబడిన అపరిశుభ్రతను సహించుటకు యెహోవా ఇష్టపడ్డాడు.