పరదైసా, పాడుదిబ్బా మీరేది ఇష్టపడతారు?
అతడెవరో, ఏమిటో ఎవరైనా ఇట్టే గుర్తుపట్టేయొచ్చు. ఒక యూరపు యాత్రికుడు విశ్రాంతిని కోరుతు, ఉద్యానవనంలాంటి ద్వీపమందు సూర్యరశ్మివలన కలిగే ఆనందాన్ని అనుభవించాలని ఆతురపడుచున్నాడు. సముద్రపు ఇసుక తిన్నెలు దాటి, వదిలేసిన ఖాళీ సీసాలు, డబ్బాలు, ప్లాస్టిక్ సంచులు, చూయింగ్ గమ్ మరియు చాక్లెట్ల కాగితాలు, వార్తాపత్రికలు, వారపత్రికల మధ్య జాగ్రత్తగా అడుగులేస్తూ నడుస్తున్నాడు. అలా నడుస్తూ తాను చేరవచ్చింది ఇలాంటి ఉద్యానవనానికా అని ఆశ్చర్యపడుతూ, అతడెంతో విసుక్కున్నాడు.
మీకలాంటి అనుభవం ఎప్పుడైనా కలిగిందా? ప్రజలు తమ సెలవుల్ని ఏదైనా ఉద్యానవనంలాంటి ప్రదేశంలో గడపాలని కలలుగంటారు, అయితే వారక్కడ చేరుకున్నాక, ఆ ప్రదేశాన్నొక కసువుదొడ్డిగా మార్చడంలో ఏమాత్రం బాధపడరెందుకు?
“ఉద్యానవనంలో” కాదు
అనేకమంది యాత్రికులు వెళ్లే “ఉద్యానవనాల” అందం, శుచి, శుభ్రతయెడల ఈ లెక్కలేనితనం ఏమంత గొప్ప విషయం కాదు. దాదాపు ప్రతిచోట కాలుష్యమున్న కారణంగా ఆధునిక సమాజం బహుగా పీడింపబడుతుంది. టన్నుల కొలది వ్యర్థ పదార్థాలను కలుగజేయడం ద్వారా అనేక వ్యాపార సంస్థలు ఎక్కువ మోతాదులో కాలుష్యాన్ని కల్గిస్తున్నవి. సరిగా నిర్వీర్యం చేయబడని విషపదార్థాలు, ప్రమాదవశాత్తు సముద్రంపాలయ్యే చమురు భూమిని జీవనానికి పనికిరాకుండాచేస్తూ, అందులోని అనేక ప్రాంతాలు నాశనమయ్యే ప్రమాదాన్ని తెస్తున్నవి.
యుద్ధాలు కూడ కాలుష్యాన్ని సృష్టిస్తున్నవి. ప్రపంచం తీవ్ర భయంతో చూసిన 1991 నాటి పర్షియన్ గల్ఫ్‌యుద్ధం క్రొత్త పుంతలు తొక్కింది. ఇరాకీ సైన్యాలు కావాలనే దాదాపు 600 చమురు బావులకు నిప్పుపెట్టి, కువైట్‌ను “ప్రకటన గ్రంథమందలి అగ్నిగుండంగా” మార్చాయని ఒక యూరోపియన్ వార్తాపత్రిక వర్ణించింది. జర్మను పత్రికయగు గావో “మానవులు కలిగించిన పర్యావరణ విపత్తుల్లో ఇది మహాగొప్పది” అని ఆ మహాగ్నిని పిలిచింది.
యుద్ధం ముగిసినప్పుడు, పరిశుభ్రం చేసే పని వెంటనే మొదలయ్యింది. రగులుతున్న చమురు బావుల్ని ఆర్పడానికే అనేక నెలలు ఎంతో కష్టపడాల్సివచ్చింది. కువైట్‌లో పెరిగిన కాలుష్యం అక్కడి మరణాల సంఖ్యను 10 శాతానికి పెంచవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్టు చేసింది.
తక్కువ ప్రమాదకరం కాని మిక్కిలి బాధాకరం
ప్రముఖమైన, ప్రమాదకరమైన ప్రతి బారీ పర్యావరణ కాలుష్యానికి, వేలాది చిన్నచిన్న ఉదాహరణలున్నాయి. వీధుల్లో ఇష్టానుసారంగా చెత్తాచెదారం పడేసేవారు, గోడలపై నినాదాలు వ్రాసే “చిత్రకారులు” అంత ప్రమాదకరమైన కాలుష్యకారులు కాకపోవచ్చు, అయితే వారు ఈ భూమి ఒక పరదైసుగా మారగల్గే సాధ్యతను నిరాకరణ చేసినవారు కాగలరు.
కొన్ని ప్రాంతాల్లో గోడలపై రాతలు ఎంత సాధారణమంటే పౌరులు “ఆ రాతల్నే పట్టించుకోరు,” వాటిని దాదాపు చదువనే చదవరు. అలాంటివి భూగర్భమందు నడిచే రైలు పెట్టెలపై, భవనాల గోడలపై, టెలిఫోను బూత్‌లపై ఎక్కువగా ఉంటాయి. అలాంటి రాతలు ఇక ప్రజా మరుగుదొడ్లకు మాత్రమే పరిమితం కావడం లేదు.
కొన్ని నగరాల్లో చాలావరకు పాడుబడిన, నిర్మానుష్యమైన ఇళ్లే కన్పిస్తాయి. నివాస ప్రాంతాలు అశుభ్రమైన ఇళ్లూ వాకిళ్లతో కళంకపర్చబడివున్నాయి. కనులపండుగచేసే వ్యవసాయ క్షేత్రాలు పాడైన కార్లతో, పారవేసిన యంత్రభాగాలతో, పనికిరాని వస్తువుల కుప్పలతో పేరుకుపోతున్నవి.
కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు తమ చుట్టూవున్న అపరిశుభ్రతను, మాలిన్యమును పట్టించుకోనట్లు కన్పిస్తున్నది. మురికి బట్టలు వేసుకోవడం, చింపిరి జుట్టుతో తిరగడం అంగీకృతం మాత్రంకాదు అది ఫ్యాషను కూడ. శుచి, శుభ్రతను మెచ్చుకొనేవారు పాతకాలపు వారిగా దృష్టింపబడుతున్నారు.
ఎంతటి బృహత్కార్యము!
మన భూగ్రహపు సముద్ర తీరాలను, అరణ్యాలను, పర్వత ప్రాంతాలను టూరిస్ట్ పత్రికల మెరిసే అట్టలపైవుండే ఉద్యానవన చిత్రాలలోవలె మార్చుట ఎంత బృహత్తర కార్యక్రమమై ఉంటుంది! ఇక నగరాలు, పట్టణాలు, వ్యవసాయ క్షేత్రాలు, ప్రజల విషయంలో చేయాల్సిన పనినిగూర్చి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదనుకోండి.
ముందు ప్రస్తావించబడిన యాత్రికుడు ఆ రోజు పారిశుధ్యపు పనివారు వచ్చి పనికిరాని ఆ వస్తువుల్ని ఏరిపారేయడం చూసి ముచ్చటపడ్డాడు. అయితే వారు పగిలిపోయిన గ్లాసు ముక్కల్ని, సీసాల మూతల్ని, టిన్ను మూతల్ని, లెక్కలేనన్ని సిగరెట్ పీకల్ని వదిలివేసారు. కాబట్టి పరిశుభ్రం చేయబడినను, ఆ ప్రాంతం ఉద్యానవనానికి మారుగా అదింకా కసువుదొడ్డినే పోలివున్నదనుటకు కావల్సినంత సాక్ష్యమున్నది.
భౌగోళిక కసువుదొడ్డిగా మారుట నుండి మన భూగృహం కాపాడబడునట్లు భూగోళాన్ని శుభ్రపరచాలంటే అలాంటి పనికిరాని నాశనకారకాలన్నింటిని తీసివేయడం అవసరం. అటువంటి పరిశుభ్రపు పని జరుగుననే ఉత్తరాపేక్షలు ఏమైనా కలవా? అట్లయిన, అదెలా జరుగుతుంది? దానిని ఎవరు చేస్తారు, ఎప్పుడు?