యెహోవా యొక్క పవిత్రారాధన నిమిత్తం అసూయ కలిగి ఉండుట
“ఆయన నామము అసూయగల యెహోవా; ఆయన అసూయగల దేవుడు.”—నిర్గమకాండము 34:14, NW.
1. దేవుని ప్రముఖ లక్షణం ఏమిటి, అది ఆయన అసూయతో ఎలాంటి సంబంధం కలిగి ఉంది?
యెహోవా తనను తాను “అసూయగల దేవుడు” అని వర్ణించుకుంటున్నాడు. “అసూయ” అనే పదానికి ప్రతికూల భావముంది గనుక ఆయనలా ఎందుకు వర్ణించుకుంటున్నాడని మీరు ఆశ్చర్యపడవచ్చు. నిస్సందేహంగా, దేవుని ప్రముఖ లక్షణం ప్రేమే. (1 యోహాను 4:8) కావున ఆయనలో ఉండే ఎలాంటి అసూయాభావాలైనా మానవజాతి మంచి కొరకే అయ్యుండాలి. వాస్తవానికి, విశ్వం యొక్క శాంతి, సామరస్యాలకు దేవుని అసూయ చాలా అవసరమని మనం చూస్తాము.
2. “అసూయ”కుగల హెబ్రీ పదాన్ని అనువదించే కొన్ని విధానాలేవి?
2 “అసూయ”కు సంబంధించిన హెబ్రీ పదాలు లేఖనాల్లో 80 కంటే ఎక్కువసార్లు కనిపిస్తాయి. ఈ ఉదాహరణల్లో దాదాపు సగం యెహోవా దేవునికి సూచించబడ్డాయి. “దేవునికి అన్వయించబడినప్పుడు అసూయ యొక్క రూపకల్పన ఒక కుటిల భావోద్రేకమనే అర్థాన్ని కలిగివుండదు, అయితే దానికి భిన్నంగా యెహోవా ఆరాధన యొక్క ప్రత్యేకత్వాన్ని నొక్కి చెబుతుందని” జి. హెచ్. లివింగ్స్టన్ వివరిస్తున్నాడు. (ది పెంటాటెక్ ఇన్ ఇట్స్ కల్చురల్ ఎన్వైరన్మెంట్) అందుకే, నూతన లోక అనువాదం కొన్నిసార్లు హెబ్రీ నామవాచకాన్ని, “అవిభాగిత భక్తిని నొక్కి తెల్పడం” అని అనువదించింది. (యెహెజ్కేలు 5:13) ఇతర సముచితమైన అనువాదాలు “నమ్మకత్వం” లేక “ఆసక్తి” అని ఉన్నాయి.—కీర్తన 79:5; యెషయా 9:7.
3. అసూయ కొన్నిసార్లు మంచికి కూడా ఏయే విధాలుగా దోహదపడగలదు?
3 మనిషి అసూయపడే సామర్థ్యంతో సృష్టించబడ్డాడు, అయితే మానవజాతి పాపంలో పడిపోవడం అసూయ వక్రీకరింపబడటానికి దారి తీసింది. అయినప్పటికీ, మానవుల అసూయ మంచికి నడిపే శక్తిలా పనిచేయగలదు. అది ఒక వ్యక్తి తనకు ప్రియమైన వారిని చెడు ప్రభావాలనుండి రక్షించడానికి పురికొల్పగలదు. అంతేకాకుండా, మానవులు యెహోవా కొరకు మరియు ఆయన ఆరాధన కొరకు అసూయను యుక్తంగా చూపగలరు. (1 రాజులు 19:10) యెహోవా కొరకు ఉండాల్సిన అలాంటి అసూయపట్ల సరైన అవగాహనను తెలియపర్చడానికి, ఆ హెబ్రీ నామవాచకాన్ని, ఆయనపట్ల ‘ఎటువంటి విరోధాన్నీ సహించని’ అని అనువదించవచ్చు.—2 రాజులు 10:16.
బంగారు దూడ
4. ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో నీతియుక్తమైన అసూయ ఇమిడివున్న ఏ ఆజ్ఞ ఉంది?
4 సీనాయి పర్వతం వద్ద ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని అందుకున్న తర్వాత జరిగినది నీతియుక్త అసూయకు ఒక ఉదాహరణ కాగలదు. మానవ-నిర్మిత దేవుళ్లను ఆరాధించకూడదని వారికి పదే పదే హెచ్చరించబడింది. యెహోవా వారికిలా చెప్పాడు: ‘నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను [లేక, ‘అసూయగల (ఆసక్తిగల) దేవుడను; విరోధాన్ని ఓర్చుకొనని దేవుడను’].’ (నిర్గమకాండము 20:5; నిర్గమకాండము 20:22, 23; 22:20; 23:13, 24, 32, 33 పోల్చండి.) యెహోవా వారిని దీవించి, వారిని వాగ్దాన దేశంలోకి తెస్తానని వాగ్దానం చేస్తూ, ఇశ్రాయేలీయులతో ఒక నిబంధన చేశాడు. (నిర్గమకాండము 23:22, 31) దానికి ఆ ప్రజలు, “యెహోవా చెప్పినవన్నియు చేయుచు విధేయులమైయుందుమనిరి.”—నిర్గమకాండము 24:7.
5, 6. (ఎ) సీనాయి పర్వతం వద్ద బసచేసి ఉన్నప్పుడు, ఇశ్రాయేలీయులు ఎలా ఘోరంగా పాపం చేశారు? (బి) యెహోవా మరియు ఆయన యథార్థ ఆరాధికులు సీనాయి వద్ద నీతియుక్తమైన అసూయను ఎలా చూపించారు?
5 అయినప్పటికీ ఇశ్రాయేలీయులు త్వరలోనే దేవునికి విరుద్ధంగా పాపం చేశారు. వారింకా సీనాయి పర్వతం దిగువన బసచేసి ఉన్నారు. దేవునినుండి అదనపు నియమాలను అందుకుంటూ, మోషే అనేక దినాలుగా పర్వతంపైనే ఉన్నాడు, మరి తమ కొరకు దేవున్ని చేసివ్వమని మోషే అన్నయైన అహరోనును ప్రజలు ఒత్తిడి చేశారు. అహరోను సమ్మతించి ప్రజలు అందజేసిన బంగారంతో దూడను చేశాడు. ఆ విగ్రహం యెహోవాకు ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పడం జరిగింది. (కీర్తన 106:20) మర్నాడు వారు బలులు అర్పించి దానికి ‘సాగిలపడ’ సాగిరి. ఆ పిమ్మట వారు “ఆడుటకు” ప్రారంభించారు.—నిర్గమకాండము 32:1, 4, 6, 8, 17-19.
6 ఇశ్రాయేలీయులు వేడుక జరుపుకొంటుండగా మోషే పర్వతంపైనుండి దిగి వచ్చాడు. వారి అవమానకర ప్రవర్తనను చూసిన తర్వాత, ఆయనిలా అడిగాడు: ‘యెహోవా పక్షమున నున్న వారెవరు?’ (నిర్గమకాండము 32:25, 26) లేవీయులందరు మోషే వద్దకు వచ్చారు, ఖడ్గం తీసుకుని విగ్రహారాధికులైన తిరుగుబాటుదారులను వధించమని ఆయన వారికి చెప్పాడు. దేవుని పవిత్రారాధన నిమిత్తం తమకున్న అసూయను వ్యక్తం చేస్తూ, తప్పిదస్థులైన తమ సహోదరులలో దాదాపు 3,000 మందిని లేవీయులు చంపారు. తప్పించుకున్న వారిపై తెగులును పంపిస్తూ యెహోవా వారి క్రియను బలపర్చాడు. (నిర్గమకాండము 32:28, 35) తర్వాత దేవుడు ఈ ఆజ్ఞను మళ్లీ ఇచ్చాడు: “వేరొక దేవునికి నమస్కారము చేయకూడదు, ఆయన నామము అసూయగల యెహోవా; ఆయన అసూయగల దేవుడు.”—నిర్గమకాండము 34:14, NW.
బయల్పెయోరు
7, 8. (ఎ) బయల్పెయోరు సంబంధంగా అనేకమంది ఇశ్రాయేలీయులు ఎలా గంభీరమైన విగ్రహారాధనలో పడిపోయారు? (బి) యెహోవానుండి వచ్చిన తెగులు ఎలా అంతమయ్యింది?
7 నలభై సంవత్సరాల తర్వాత, ఇశ్రాయేలు జనాంగం వాగ్దాన దేశంలోకి ప్రవేశించబోతుండగా, మోయాబురాండ్రు మరియు మిద్యానీయురాండ్రైన ఆకర్షణీయమైన స్త్రీలు, ఇటు వచ్చి తమ ఆతిథ్యాన్ని అనుభవించమని ఇశ్రాయేలీయులను ఆకర్షించారు. ఈ పురుషులు అబద్ధ దేవుళ్ల ఆరాధికులతో దగ్గరి సంబంధాన్ని నిరాకరించి ఉండవలసింది. (నిర్గమకాండము 34:12, 15) బదులుగా, ఆ స్త్రీలతో వ్యభిచరించి, బయల్పెయోరుకు మ్రొక్కడంలో వారితో కలిసేందుకు, వారు వధకు వెళ్లే ఎద్దుల్లా పరుగుతీశారు.—సామెతలు 7:21, 22; సంఖ్యాకాండము 25:1-3.
8 ఈ అవమానకర లైంగిక ఆరాధనలో పాల్గొన్న వారిని చంపేందుకు యెహోవా తెగులును పంపాడు. నిర్దోషులైన ఇశ్రాయేలీయులు తమ అపరాధులైన సహోదరులను చంపాలని కూడా యెహోవా ఆజ్ఞాపించాడు. దానికి పూర్తి విరుద్ధంగా, జిమ్రీ అనే పేరుగల ఇశ్రాయేలులోని ఒక ప్రధాని, మిద్యాను రాకుమారితో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం కొరకు ఆమెను తన గుడారంలోకి తీసుకువచ్చాడు. దీన్ని చూసి, దేవునికి భయపడే యాజకుడైన ఫీనెహాసు లైంగిక దుర్నీతిగల ఆ జంటను హతమార్చాడు. దేవుడు తెగులును ఆపుతూ, ఇలా ప్రకటించాడు: “ఫీనెహాసు . . . నా కోపాన్ని ఇశ్రాయేలీయులపైనుండి మరల్చాడు; నన్ను కదిపినటువంటి అదే అసూయతో కూడిన కోపాన్ని వారిమధ్య అతను ప్రదర్శించాడు, కావున నా అసూయతో నేను ఇశ్రాయేలీయులను హతమార్చలేదు.” (సంఖ్యాకాండము 25:11, ద న్యూ ఇంగ్లీష్ బైబిల్) అయితే జనాంగం నాశనాన్ని తప్పించుకున్నప్పటికీ కనీసం 23,000 మంది ఇశ్రాయేలీయులు చనిపోయారు. (1 కొరింథీయులు 10:8) వారు వాగ్దాన దేశంలో ప్రవేశించాలని తామెంతో కాలంగా కలిగి ఉండిన నిరీక్షణను పోగొట్టుకున్నారు.
ఒక హెచ్చరికా గుణపాఠం
9. యెహోవా యొక్క పవిత్రారాధన నిమిత్తం వారు అసూయ కలిగిలేనందున ఇశ్రాయేలు మరియు యూదా ప్రజలకు ఏమి జరిగింది?
9 దుఃఖకరంగా, ఇశ్రాయేలీయులు ఈ గుణపాఠాలను త్వరలో మర్చిపోయారు. వారు యెహోవా యొక్క పవిత్రారాధన నిమిత్తం అసూయ కలిగి ఉన్నట్లు నిరూపించుకోలేదు. “విగ్రహములను పెట్టుకొని [దేవునికి] రోషము [“అసూయ,” NW] కలుగజేసిరి.” (కీర్తనలు 78:58) దాని ఫలితంగా, పది గోత్రాల ఇశ్రాయేలు సా.శ.పూ 740లో అషూరీయులచేత చెరపట్టబడి కొనిపోబడటానికి యెహోవా అనుమతించాడు. వారి రాజధాని నగరమైన యెరూషలేము సా.శ.పూ 607లో నాశనం చేయబడినప్పుడు, మిగిలిన రెండు గోత్రాల యూదా రాజ్యం కూడా అలాంటి శిక్షనే అనుభవించింది. అనేకులు చంపబడగా, బ్రదికివున్న వారు బబులోనుకు చెరగా కొనిపోబడ్డారు. నేడు క్రైస్తవులందరికీ ఎంతటి హెచ్చరికా ఉదాహరణో కదా!—1 కొరింథీయులు 10:6, 11.
10. పశ్చాత్తాపం చెందని విగ్రహారాధికులకు ఏమి సంభవిస్తుంది?
10 భూమిపైని జనాబాలో మూడవ వంతు—అంటే దాదాపు 190 కోట్ల మంది—తాము క్రైస్తవులమని చెప్పుకుంటున్నారు. (1994 బ్రిటానికా బుక్ ఆఫ్ ద ఇయర్) వీరిలో చాలామంది, తమ ఆరాధనలో ప్రతిమలు, విగ్రహాలు మరియు సిలువలను ఉపయోగించే చర్చీలకు సంబంధించిన వారే. తమ విగ్రహారాధన చేత తనకు అసూయ కలిగించిన తన స్వంత ప్రజలనే యెహోవా శిక్షించకుండా వదిలిపెట్ట లేదు. వస్తువుల సహాయంతో ఆరాధించే నామకార్థ క్రైస్తవులను కూడా ఆయన శిక్షించకుండా వదిలిపెట్టడు. “దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెన”ని యేసుక్రీస్తు చెప్పాడు. (యోహాను 4:24) అంతేకాకుండా, విగ్రహారాధన నుండి జాగ్రత్తపడమని బైబిలు క్రైస్తవులను హెచ్చరిస్తుంది. (1 యోహాను 5:21) దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనని వారిలో పశ్చాత్తాపం చెందని విగ్రహారాధికులు ఉంటారు.—గలతీయులు 5:20, 21.
11. ఓ విగ్రహం ఎదుట సాగిలపడకపోయినప్పటికీ, ఒక క్రైస్తవుడు ఎలా విగ్రహారాధన చేసిన పాపి కాగలడు, మరి అలాంటి విగ్రహారాధనను విసర్జించడానికి ఒకరికి ఏమి సహాయం చేయగలదు? (ఎఫెసీయులు 5:5)
11 ఒక నిజ క్రైస్తవుడు ఓ విగ్రహం ఎదుట సాగిలపడకపోయినప్పటికీ, విగ్రహారాధన సంబంధమైనది, అపవిత్రమైనది మరియు పాపభరితమైనదని దేవుడు దృష్టించే దేన్నైనా అతడు విసర్జించాలి. ఉదాహరణకు, “భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహరాధనయైన ధనాపేక్షను చంపి వేయుడి. వాటివలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును” అని బైబిలు హెచ్చరిస్తుంది. (కొలొస్సయులు 3:5, 6, ఇటాలిక్కులు మావి.) ఈ మాటలకు లోబడాలంటే లైంగిక దుర్నీతికరమైన ప్రవర్తనను త్యజించవలసి ఉంటుంది. అలా చేయాలంటే అపవిత్రమైన, లైంగిక కోరికలను ఉత్పన్నం చేసేందుకు రూపొందింపబడిన వినోదాన్ని మానుకోవాల్సి ఉంటుంది. అలాంటి తృష్ణను తీర్చుకునే బదులు, నిజక్రైస్తవులు దేవుని పవిత్రారాధన నిమిత్తం అసూయ కలిగి ఉంటారు.
దైవిక అసూయ యొక్క తదుపరి ఉదాహరణలు
12, 13. దేవుని పవిత్రారాధన నిమిత్తం అసూయను చూపడంలో యేసు ఎలా అత్యున్నత మాదిరినుంచాడు?
12 దేవుని పవిత్రారాధన నిమిత్తం అసూయ చూపిన మానవుని అత్యంత గణనీయ మాదిరి యేసుక్రీస్తే. తన పరిచర్య యొక్క మొదటి సంవత్సరంలో, ఆలయ ఆవరణంలో అమ్మకం చేస్తున్న పేరాశపరులైన వ్యాపారులను ఆయన చూశాడు. బయటనుండి వచ్చిన యూదులకు, ఆలయ పన్నుగా అంగీకరింపబడే రూకల కొరకు తమ దేశ ద్రవ్య చలామణికి రూకలు మార్చేవారి సేవల అవసరం ఉండవచ్చు. దేవుని ధర్మశాస్త్రానుసారంగా అర్పించవలసిన బలుల నిమిత్తం కూడా వారు జంతువులు మరియు పక్షులను కొనవలసిన అవసరం ఉంటుంది. అలాంటి వ్యాపార లావాదేవీలు దేవాలయ ఆవరణం వెలుపల జరిగి ఉండవలసింది. ఇంకా ఘోరంగా, వ్యాపారస్థులు అన్యాయంగా అత్యంత ఎక్కువ ధరలు వసూలు చేస్తూ తమ సహోదరుల మతపర అవసరతలనుబట్టి అయుక్తంగా లాభం పొందుతుండిరన్నది స్పష్టం. దేవుని పవిత్రారాధన నిమిత్తం అసూయతో నిండినవాడై, గొర్రెలను మరియు ఎడ్లను తోలివేయడానికి యేసు కొరడాను ఉపయోగించాడు. “నా తండ్రి యిల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడని” చెబుతూ ఆయన రూకలు మార్చేవారి బల్లలను కూడా పడద్రోశాడు. (యోహాను 2:14-16) అలా యేసు కీర్తన 69:9 నందలి మాటలను నెరవేర్చాడు: ‘నీ యింటినిగూర్చిన ఆసక్తి [లేక, “అసూయ,” బయింగ్టన్] నన్ను భక్షించియున్నది.’
13 మూడు సంవత్సరాల తర్వాత, పేరాశగల వ్యాపారస్థులు యెహోవా యొక్క ఆలయానికి రావడాన్ని ఆయన మళ్లీ చూశాడు. యేసు దాన్ని రెండవసారి శుభ్రపరుస్తాడా? దేవుని పవిత్రారాధన నిమిత్తం ఆయన కలిగి ఉన్న అసూయ, ఆయన తన పరిచర్యను ప్రారంభించినప్పుడు ఎంత దృఢంగా ఉందో అప్పుడుకూడా అంత దృఢంగానే ఉంది. ఆయన అమ్మేవారిని మరి కొనేవారిని కూడా బయటకు వెళ్లగొట్టాడు. “నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిర”ని చెబుతూ, తన చర్యలకు ఇంకా దృఢమైన కారణాన్ని ఆయన చూపించాడు. (మార్కు 11:17) దైవిక అసూయను ఎడతెగక చూపడంలో ఎంతటి అద్భుతమైన మాదిరి!
14. పవిత్రారాధన నిమిత్తం యేసుకున్న అసూయ మనలనెలా ప్రభావితం చేయాలి?
14 ఇప్పుడు మహిమనొందిన ప్రభువగు యేసుక్రీస్తు వ్యక్తిత్వం మారలేదు. (హెబ్రీయులు 13:8) ఈ 20వ శతాబ్దంలో, ఆయన భూమిపై ఉన్నప్పుడు తన తండ్రి యొక్క పవిత్రారాధన నిమిత్తం ఎంత అసూయ కలిగి ఉండెనో, నేడు కూడా అలాగే ఉన్నాడు. ఏడు సంఘాలకు యేసు పంపిన, ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉన్న వర్తమానంలో దీన్ని చూడవచ్చు. ఇవి తమ ప్రముఖ అన్వయింపును ఇప్పుడు, అంటే “ప్రభువు దిన”మందే కలిగి ఉన్నాయి. (ప్రకటన 1:10; 2:1–3:22) దర్శనంలో అపొస్తలుడైన యోహాను మహిమనొందిన యేసుక్రీస్తు “నేత్రములు అగ్ని జ్వాలవలె” ఉండటం చూశాడు. (ప్రకటన 1:14) యెహోవా సేవకు తగినంత పరిశుభ్రంగా మరియు అంగీకారయోగ్యంగా ఉన్నవో లేవో అని ఆయన సంఘాలను పర్యవేక్షిస్తుండగా ఏదీ ఆయన దృష్టిని తప్పించుకోలేదని ఇది సూచిస్తుంది. దేవుడు మరియు ధనము—ఇద్దరు యజమానులకు సేవ చేయడానికి ప్రయత్నించవద్దని యేసు ఇచ్చిన హెచ్చరికను ప్రస్తుతదిన క్రైస్తవులు మనస్సునందుంచుకోవాలి. (మత్తయి 6:24) లవొదికయ సంఘమందలి వస్తుసంపదపట్ల ఆసక్తిగల సభ్యులకు యేసు ఇలా చెప్పాడు: “నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటనుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను. . . . ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము.” (ప్రకటన 3:14-19) మాట ద్వారా మాదిరి ద్వారా, నియమిత సంఘ పెద్దలు తమ తోటి విశ్వాసులు వస్తుసంపద యొక్క ఉరిని త్యజించడానికి సహాయం చేయాలి. పెద్దలు లైంగికత పట్ల ఆసక్తిగల ఈ ప్రపంచపు నైతిక పతనం నుండి కూడా మందను రక్షించాలి. అంతేగాక, దేవుని ప్రజలు యెజెబెలు ప్రభావాన్ని సంఘంలో ఎంత మాత్రం సహించకూడదు.—హెబ్రీయులు 12:14, 15; ప్రకటన 2:20.
15. యెహోవా ఆరాధన నిమిత్తం అసూయను చూపడంలో అపొస్తలుడైన పౌలు యేసునెలా అనుకరించాడు?
15 అపొస్తలుడైన పౌలు క్రీస్తును అనుకరించాడు. క్రొత్తగా బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవులను ఆత్మీయపరంగా చెడ్డవైన ప్రభావాలనుండి కాపాడడానికి, ఆయనిలా చెప్పాడు: “దైవాసూయతో మీ నిమిత్తము అసూయ కలిగి ఉన్నాను.” (2 కొరింథీయులు 11:2, NW) దానికి ముందు, కలుషితపర్చే ప్రభావాన్ని కలిగివున్న ఒక పశ్చాత్తాపం చెందని వ్యభిచారిని బహిష్కరించమని అదే సంఘానికి నడిపింపునివ్వడానికి, పవిత్రారాధన నిమిత్తం ఆయనకున్న అసూయ పౌలును పురికొల్పింది. యెహోవాసాక్షుల 75,500 సంఘాలను పవిత్రంగా ఉంచడానికి పెద్దలు నేడు ప్రయాసపడుతుండగా, ఆ సందర్భంలో ఇవ్వబడిన ప్రేరేపిత సలహాలు వారికెంతో గొప్ప సహాయంగా ఉన్నాయి.—1 కొరింథీయులు 5:1, 9-13.
దేవుని అసూయ ఆయన ప్రజలకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది
16, 17. (ఎ) ప్రాచీన యూదాను దేవుడు శిక్షించినప్పుడు, జనాంగాలెలాంటి దృక్పథాన్ని చూపించాయి? (బి) యూదా 70 సంవత్సరాల చెర తర్వాత, యెరూషలేము నిమిత్తం తన అసూయను యెహోవా ఎలా ప్రదర్శించాడు?
16 యూదా ప్రజలు చెరపట్టబడి బబులోనుకు కొనిపోబడటానికి అనుమతించడం ద్వారా దేవుడు వారిని శిక్షించినప్పుడు, వారు అపహసించబడ్డారు. (కీర్తన 137:3) అసూయతో కూడిన ద్వేషంతో, దేవుని ప్రజలపై కష్టాలను తీసుకురాడానికి ఎదోమీయులు బబులోనీయులకు సహాయం కూడా చేశారు, మరి యెహోవా దాన్ని జ్ఞాపకం ఉంచుకున్నాడు. (యెహెజ్కేలు 35:11; 36:15) చెరపట్టబడిన వారిలో బ్రతికియున్నవారు పశ్చాత్తాపపడ్డారు, మరి 70 సంవత్సరాల తర్వాత, యెహోవా వారికి తమ దేశాన్ని తిరిగి ఇచ్చాడు.
17 మొదట్లో, యూదాలో ఉన్న ప్రజలు దయనీయ స్థితిలో ఉన్నారు. యెరూషలేము పట్టణం మరియు దాని దేవాలయం పాడుబడి పోయాయి. దేవాలయాన్ని నిర్మించేందుకు చేసిన ప్రతి ప్రయత్నాన్ని చుట్టుప్రక్కలున్న జనాంగాలు వ్యతిరేకించాయి. (ఎజ్రా 4:4, 23, 24) యెహోవా దీని గురించి ఎలా భావించాడు? ప్రేరేపిత వృత్తాంతమిలా చెబుతుంది: “సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు—నేను యెరూషలేము విషయములోను సీయోను విషయములోను అధికాసక్తి [“అసూయ,” NW] కలిగియున్నాను; నిమ్మళముగా ఉన్న అన్యజనులమీద నేను బహుగా కోపించుచున్నాను; ఏలయనగా నేను కొంచెము కోపపడగా కీడుచేయవలెనన్న తాత్పర్యముతో వారు సహాయులైరి. కాబట్టి యెహోవా సెలవిచ్చునదేమనగా—వాత్సల్యముగలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగియున్నాను; అందులో నా మందిరము కట్టబడును . . . ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.” (జెకర్యా 1:14-16) ఈ వాగ్దానానికి అనుగుణంగా, ఆలయం మరియు యెరూషలేము పట్టణం విజయవంతంగా పునర్నిర్మింపబడ్డాయి.
18. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో నిజ క్రైస్తవులు ఏమి అనుభవించారు?
18 నిజక్రైస్తవ సంఘం కూడా 20వ శతాబ్దంలో అలాంటి అనుభవాన్నే కలిగి ఉంది. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో, తన ప్రజలు ఆ ప్రాపంచిక వివాదంలో సంపూర్ణ తటస్థతను కలిగి లేనందుకు యెహోవా వారిని గద్దించాడు. (యోహాను 17:16) రాజకీయ శక్తులు వారిని అణచి వేయడానికి దేవుడు అనుమతించాడు, మరి క్రైస్తవమత సామ్రాజ్య మతనాయకులు ఈ విపత్తును చూసి ఆనందించారు. వాస్తవానికి, అప్పుడు బైబిలు విద్యార్థులని పిలువబడిన యెహోవాసాక్షుల పనిని రాజకీయవేత్తలు నిషేధించేలా చేయడంలో మత నాయకులదే ఎక్కువ హస్తం ఉంది.—ప్రకటన 11:7, 10.
19. మరి 1919 నుండి తన ఆరాధన నిమిత్తం యెహోవా అసూయను ఎలా చూపించాడు?
19 అయితే, యెహోవా తన ఆరాధన నిమిత్తం అసూయను చూపి, యుద్ధం తర్వాతి సంవత్సరమైన 1919లో పశ్చాత్తాపం చూపిన తన ప్రజల పక్షం వహించి వారిని పునఃస్థాపించాడు. (ప్రకటన 11:11, 12) దాని ఫలితంగా, 1918లో 4,000 కంటే తక్కువ ఉన్న యెహోవా స్తుతికర్తల సంఖ్య నేడు 50 లక్షలకంటే ఎక్కువకు పెరిగింది. (యెషయా 60:22) త్వరలో, తన పవిత్రారాధన నిమిత్తం యెహోవా అసూయ మరింత నాటకీయ విధాలలో ప్రదర్శించబడుతుంది.
దైవిక అసూయ యొక్క భవిష్యత్ కార్యాలు
20. పవిత్రారాధన నిమిత్తం తనకుగల అసూయను దేవుడు త్వరలో ఎలా చూపిస్తాడు?
20 శతాబ్దాలుగా క్రైస్తవమత సామ్రాజ్య చర్చీలు, యెహోవాకు అసూయ కలిగించిన మతభ్రష్ట యూదుల మార్గాన్ని అవలంబించాయి. (యెహెజ్కేలు 8:3, 17, 18) ఐక్యరాజ్యసమితి సభ్యుల హృదయాల్లో ఒక విపత్కర తలంపును పెట్టడం ద్వారా యెహోవా దేవుడు త్వరలో చర్య గైకొంటాడు. ఈ రాజకీయ శక్తులు క్రైస్తవమత సామ్రాజ్యాన్ని దాని మిగతా భాగాన్ని నిర్మానుష్యం చేయడానికి అది నడుపుతుంది. (ప్రకటన 17:16, 17) సత్యారాధికులు ఆ భయంకరమైన దైవిక తీర్పు అమలు జరగడాన్ని తప్పించుకుని సజీవంగా మిగులుతారు. ఇలా చెబుతున్న పరలోక జీవుల మాటలకు వారు ప్రతిస్పందిస్తారు: ‘ప్రభువును స్తుతించుడి, . . . తన వ్యభిచారముతో [దాని అబద్ధ బోధలు మరియు నీచ రాజకీయానికి మద్దతు ఇవ్వడంతో] భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు [అబద్ధ మతానికి] ఆయన తీర్పుతీర్చి తన దాసుల రక్తమునుబట్టి దానికి ప్రతిదండన చేసెను.’—ప్రకటన 19:1, 2.
21. (ఎ) అబద్ధ మతం నాశనం చేయబడిన తర్వాత సాతాను మరియు అతని విధానం ఏమి చేస్తుంది? (బి) దేవుడెలా ప్రతిస్పందిస్తాడు?
21 ప్రపంచ అబద్ధమత సామ్రాజ్య నాశనం తర్వాత ఏమి సంభవిస్తుంది? యెహోవా ప్రజలపై ప్రపంచవ్యాప్తంగా దాడి చేసేందుకు సిద్ధపడటానికి సాతాను రాజకీయ శక్తులను పురికొల్పుతాడు. భూమిపైనుండి సత్యారాధనను తుడిచి పెట్టాలన్న సాతాను ప్రయత్నానికి సత్య దేవుడెలా ప్రతిస్పందిస్తాడు? యెహెజ్కేలు 38:19-23 మనకిలా చెబుతుంది: “నేను రోషమును [లేక, అసూయను] మహా రౌద్రమును గలిగినవాడనై యీలాగు ప్రమాణముచేసితిని. . . . ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. తెగులు పంపి హత్య కలుగజేసి అతనిమీదను [సాతాను] అతని సైన్యపు వారి మీదను అతనితోకూడిన జనము లనేకములమీదను ప్రళయమైన వానను పెద్ద వడగండ్లను అగ్నిగంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యెమాడుదును. నేను యెహోవానైయున్నానని అన్యజనులు అనేకులు తెలిసికొనునట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకొని వారి యెదుట నన్ను తెలియపరచుకొందును.”—జెఫన్యా 1:18; 3:8 కూడా చూడండి.
22. యెహోవా పవిత్రారాధన నిమిత్తం మనం అసూయ కలిగి ఉన్నామని మనమెలా చూపగలము?
22 విశ్వసర్వాధిపతి తన సత్యారాధికుల నిమిత్తం అసూయతో శ్రద్ధ వహిస్తాడన్నది తెలుసుకోవడం ఎంతటి ఓదార్పుకరమైన విషయమో కదా! ఆయన మిక్కటమైన కనికరంపట్ల సంపూర్ణ మెప్పుతో, యెహోవా దేవుని పవిత్రారాధన నిమిత్తం అసూయ కలిగి ఉందాము. మనం ఆసక్తితో సువార్తను ప్రకటించడంలో కొనసాగుదాం మరి యెహోవా తన గొప్ప నామాన్ని మహిమపరచి, పవిత్రపరచే మహిమాన్విత దినం కొరకు నమ్మకంగా ఎదురు చూద్దాము.—మత్తయి 24:14.
ధ్యానించాల్సిన అంశాలు
◻ యెహోవా నిమిత్తం అసూయ కలిగి ఉండటమంటే భావమేమిటి?
◻ ప్రాచీన ఇశ్రాయేలీయులు చూపిన మాదిరి నుండి మనమేమి నేర్చుకోగలము?
◻ యెహోవాకు అసూయ కల్గించడాన్ని మనమెలా నివారించగలము?
◻ దేవుడు మరియు క్రీస్తు పవిత్రారాధన నిమిత్తం అసూయను ఎలా ప్రదర్శించారు?
[12వ పేజీలోని బాక్సు]
ప్రేమ అసూయపడదు
ఈర్ష్యను గురించి, 19వ శతాబ్దపు బైబిలు విద్వాంసుడైన ఆల్బర్ట్ బాన్స్ ఇలా వ్రాశాడు: “అది దుష్టత్వం యొక్క అతి సామాన్య ప్రదర్శన, మరి మానవుని తుచ్చ స్థితిని స్పష్టంగా చూపుతుంది.” ఆయనింకా ఇలా చెప్పాడు: “అన్ని యుద్ధాలను, అలజడులను మరియు ప్రాపంచిక పధకాలను వాటి మూలాలను—పేరుకు క్రైస్తవులుగా పిలువబడే వారి మతానికి మచ్చతెచ్చి వారిని లోకసంబంధులను చేసే పధకాలు, సంకల్పాలనీ—వారి వాటిలో ఎన్నింటిని అసూయకు ఆపాదించవచ్చో కనుగొని ఆశ్చర్యపోతాడు. ఇతరులు మనకంటే ఎక్కువ సంపద కలిగి ఉన్నారని మనం బాధపడతాము; ఇతరులు కలిగివున్న వాటిని మనం కలిగివుండాలని మనం కోరుకుంటాము, అలా పొందగల హక్కు మనకు లేకపోయినా సరే; వాటిని అనుభవించడంలోని వారి ఆనందాన్ని తగ్గించడానికి, లేక వాటిని తాము పొందడానికి, లేక వారు సాధారణంగా కలిగి ఉండాల్సినంత వారు కలిగి లేరని చూపించడానికి ప్రయత్నించే విభిన్న నీచ పద్ధతులకు ఇది దారి తీస్తుంది. . . . అలా మన గుండెల్లోని అసూయాలక్షణం చల్లబడుతుంది.”—రోమీయులు 1:29; యాకోబు 4:5.
దానికి భిన్నంగా, ప్రేమను గురించి అది “ఈర్ష్య పడదు” అని బాన్స్ ఆసక్తికరమైన వ్యాఖ్యానం చేశాడు. (1 కొరింథీయులు 13:4, కింగ్ జేమ్స్ వర్షన్) ఆయనిలా వ్రాశాడు: “ఇతరులు అనుభవిస్తున్న ఆనందాన్నిబట్టి ప్రేమ ఈర్ష్యపడదు; అది వారి శ్రేయస్సునందు సంతోషిస్తుంది . . . వారి సంతోషం అధికమౌతుండగా, ప్రేమచేత ప్రభావితం చేయబడిన వారి ఆనందాన్ని తగ్గించరు; వారు కలిగివున్న సంపత్తినిబట్టి వారు ఇబ్బందిపడేలా చేయరు; వారి సంతోషాన్ని తగ్గించాలని వీరు కృషి చేయరు; తాము అంత గొప్పగా ఆశీర్వదింపబడలేదని చూపి వారు సణగరు లేక నిరాశ చెందరు. . . . మనం ఇతరులను ప్రేమిస్తే—వారి సంతోషంలో ఆనందిస్తే, మనం వారిని చూసి ఈర్ష్యపడకూడదు.”
[10వ పేజీలోని చిత్రం]
యెహోవా యొక్క పవిత్రారాధన నిమిత్తం ఫీనెహాసు అసూయ కలిగి ఉన్నాడు