ఎందుకింత నిరాశ?
మరి శ్రేష్ఠమైన జీవితము కొరకైన నిరీక్షణ—చివరకు నిజమాయెను! 1989 నవంబరులో బెర్లిన్ గోడ పడగొట్టబడినప్పుడు తూర్పు జర్మనీలో నివసిస్తున్న అనేకమంది ప్రజలు దీనిని నమ్మిరి. అయితే ఒక సంవత్సరము తరువాత, “బెర్లిన్ గోడద్వారా కాపాడబడిన జీవితముకంటె పెట్టుబడిదారీ ప్రజస్వామ్య లోకము వ్యవహరించుటకు మరింత కఠినముగా ఉందని తాము కనుగొన్నట్లు” వారు ఫిర్యాదు చేశారు. దాని ఫలితము? నిస్పృహ మరియు పెరుగుచున్న నిరాశ.
అంతరంగిక, సామాజిక హింసవలన ప్రజలు భద్రతను వెతుక్కుంటూ నివాస స్థలాలను విడిచి వెళ్లుటకు వత్తిడి రావచ్చును, అయితే కేవలము కొద్దిమంది మాత్రమే ఆ భద్రతను కనుగొందురు. కొంతమంది నగర వీధులనాశ్రయించు నిరాశ్రయులుగా తయారు కావచ్చును. కొన్నిదేశాలలో వీరిలో అనేకులు చట్టపరముగా చిక్కైన కార్యపద్ధతిలో ఇరుక్కుపోవుదురు. ఉద్యోగము లేనందువల్ల ఇల్లు ఉండదు, ఇంటి చిరునామా లేనందున వారికి ఉద్యోగం దొరకదు. ప్రభుత్వ సంక్షేమ సంస్థలు సహాయపడుటకు ప్రయత్నిస్తాయిగాని, సమస్యలు పరిష్కారం కావడానికి సమయం పడుతుంది. కావున నిరాశ, విసుగు చోటుచేసుకుంటాయి.
అనేకమంది స్త్రీలు నిరాశతో నిజముగా విపరీతమైన చర్యలకు నడిపించబడుతున్నారు. ఉమెన్ అండ్ క్రైమ్ ఇన్ ది 1990స్ నందలి ఒక నివేదికలో, న్యాయశాస్త్ర ఉపన్యాసకురాలు డా. సూసన్ ఎడ్వర్డ్స్ ఇలా వివరిస్తుంది: “యౌవన స్త్రీలు [వ్యభిచార కూపములో] కూరుకొనిపోవుట సూటిగా ఆర్ధిక అవసరాల ఫలితమేగాని, స్వయం-క్రమశిక్షణ లేకపోవుట, లేదా కుటుంబ చరిత్ర దానికి కారణము కాదు.” అదేప్రకారము, ఉద్యోగాల వేటలో ఇల్లువదిలి వెళ్లు యువకులు తరచు దేనిని కనుగొనలేక పోతున్నారు. అలా నిరాశనిండిన వారై కొందరు ఆహారము మరియు నిలువ నీడ కొరకు సలింగసంయోగులకు తమ శరీరములు అప్పగించుకొను ‘అద్దెకు దొరుకు-కుర్రాళ్లుగా,’ నేరస్థుల చేతులలో కీలుబొమ్మలుగా తయారవుతున్నారు.
కఠినమైన రాజకీయ పరిస్థితులు, హింస, ఆర్ధిక ఇబ్బందులు, ఇవన్నియు వేరువేరు స్థాయిలో నిరాశను కల్గించవచ్చును. పెరుగుచున్న ఆర్ధిక సమస్యలతో వ్యవహరించుచు తమ సంపన్న జీవిత శైలిని కాపాడుకొనుటకు ప్రయత్నించు వృత్తి యోగ్యతలుగల ప్రజలు సహితము దీనికి దూరముగా లేరు. దాని ఫలితమేమి? ప్రాచీనకాల రాజైన సొలొమోను చెప్పినట్లుగా, “అన్యాయము చేయుట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవుదురు.”a (ప్రసంగి 7:7) అవును, నిరాశ అంతకంతకు అనేకమందిని విపరీతమైన పరిష్కార మార్గమును ఎన్నుకొనుటకు—అనగా ఆత్మహత్యకు నడిపించుచున్నది.
తీవ్రమైన పరిష్కార మార్గము
యౌవనస్థులలో అనేక ఆత్మహత్యల సంఘటనలు, వారిలో అనేకమంది నిరాశనే తెగులుకు గురియగుతున్నారని చూపిస్తుంది. ఒక బ్రిటీషు పత్రికా విలేఖరి ఇలా ప్రశ్నించాడు: “మన కాలమందలి కౌమారదశలోని పిల్లలలో అత్యంత నిరాశకు కారణమైనదేమిటి?” విషం మ్రింగుటకు ప్రయత్నించి ఆస్పత్రిపాలైన 8 నుండి 16 సంవత్సరముల వయస్సుగల పిల్లలను గూర్చి అధ్యయనం చేసిన, లండన్ మానసిక శాస్త్ర సంస్థకు చెందిన డా. ఎరిక్ టేలర్ ఇలా నివేదిస్తున్నాడు: “జరుగుచున్న విషయాలనుగూర్చి ఎంతమంది పిల్లలు నిరాశచెందారు, ఆశవదులుకున్నారనునది ఒక ప్రధానమైన సంగతియై యున్నది.” తమకు అత్యవసరంగా సహాయం కావాలని సూచిస్తూ ఇష్టపూర్వకంగా విషం తీసుకుని మరణవాత పడని సందర్భాలు ప్రతియేటా 1,00,000 కలవని బ్రిటన్ నివేదికలు అంచనా వేసినవి.
బ్రిటీషు ధర్మాదాయ సంస్థ ఒకటి నిరాశచెందిన వారియెడల కనికరము చూపవలెనని ముమ్మరముగా ప్రయత్నం చేసెను. ఈ విధముగా దాని సలహాదారులు “మరణానికి ప్రత్యామ్నాయమును” అందించుటకు ప్రయత్నించిరి. అయిననూ, ప్రజలను నిరాశకు గురిచేయు సమస్యలను పరిష్కరించుట తమవశములో లేదని వారు అంగీకరించుచున్నారు.
ఆత్మహత్యల గతి “సమాజమందు సామాజిక సమైక్యతా కొరత, ఒంటరితనపు తలంపుల పరిమాణమును” ప్రతిబింబిస్తున్నదని ది సన్‌డే కరస్పాండెంట్, అను వార్తాపత్రిక వ్యాఖ్యానిస్తున్నది. ఈనాడు ఆత్మహత్యల సంఖ్య ఎందుకింత ఎక్కువగా ఉన్నది? ఆ వార్తాపత్రిక దానికి “నిరాశ్రయత, త్రాగుబోతుతనము, ఎయిడ్స్ ప్రమాదం, మానసిక వైద్యశాలలు మూసివేయబడుట” వంటి కారణాలు వారిని నిరాశా అగాధములకు నడిపించును, తద్వారా తమ ప్రాణాలు తీసుకోవడమే వారి సమస్యలకు పరిష్కారముగా వారు ఎంచుదురని పేర్కొన్నది.
నిరాశను తొలగించు నిరీక్షణ ఏమైనా కలదా? అవును, దానికి “మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి” అని యేసు యిచ్చిన బలమైన పిలుపు ఆధారముగా ఉన్నది. (లూకా 21:28) ఆయన భావమేమి? ఏ నిరీక్షణ కలదు? (w92 7/1)
[అధస్సూచీలు]
a హారిస్, ఆర్చర్, వాల్ట్‌కే సంపాదకత్వము వహించిన, థియొలాజికల్ వర్డ్‌బుక్ ఆఫ్ ది ఓల్డ్ టెస్ట్‌మెంట్ ప్రకారము “అన్యాయము” అని అనువదించబడిన పదముయొక్క ఆదిమభాషా మూలార్థము బలహీనులపై “భారముమోపుట, అణగద్రొక్కుట, నలుగగొట్టుటకు” సంబంధించినదై యున్నది.