నిరీక్షణ నిరాశను జయిస్తుంది
వెబ్‌స్టర్స్ నైన్త్ న్యూ కాలేజియేట్ డిక్షనరీ, నిరాశను “నిరీక్షణను బొత్తిగా పోగొట్టుకొనుట” యని నిర్వచించుచున్నది. కాబట్టి, నిరాశను జయించుటకు మనకు నిశ్చయంగా నిరీక్షణ అవసరము!
దురదృష్టవంతుడైన ఒక వ్యక్తి బ్రతుకు వీధిన పడినను, నిరీక్షణ కలిగియున్నట్లయితే అతడు బొత్తిగా నిరాశచెందడు. మానసికంగా కృంగి బాధలు అనుభవించుచున్న వారికి సహితము నిరీక్షణ ధైర్యాన్ని, భరించడానికి శక్తిని ఇచ్చును. అయితే ఆ నిరీక్షణ ఆధారపడదగినదై యుండవలెను! దీని భావమేమి?
నిరీక్షణకు ఆధారము
పితరుడైన అబ్రాహాము భార్యయగు, శారాకు సంభవించిన దానిని ఆలోచించుము. 90 సంవత్సరాల వయస్సు వస్తున్ననూ ఆమె ఇంకనూ గొడ్రాలుగా ఉండి, పిల్లలు కనలేదని నిరాశ చెందెను. అయిననూ, ఆమె భర్తకు 99 సంవత్సరాల వయస్సప్పుడు, అనేక సంవత్సరాల క్రితం తానుచేసిన వాగ్దానమును—అబ్రాహాము నిజముగా ఒక “సంతానమును” లేక వారసుని పొందునని—యెహోవా పునరుద్ఘాటించెను. అది ఆధారపడదగిన వాగ్దానమని అబ్రాహాము ఎరిగియుండెను. అట్టి అద్భుతకరమైన సంఘటన జరిగినప్పుడు అనగా శారా ఇస్సాకును కనినప్పుడు, ఆమె ఎంతగా సంతోషించెనో ఊహించుము. (ఆదికాండము 12:2, 3; 17:1-4, 19; 21:2) “అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి, ఆయన [అబ్రాహాము] . . . రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను” అని అపొస్తలుడైన పౌలు సహితము వివరించినట్లు, దేవునియందలి అబ్రాహాము నమ్మకము వమ్ముకాలేదు.—రోమీయులు 4:20, 21.
తన కాలమందు క్రైస్తవులుగా మారిన యూదులకు వ్రాయుచూ, రెండు బలమైన కారణములనుబట్టి యేసుక్రీస్తు ద్వారా రక్షణకొరకు దేవుడు చేసిన వాగ్దానముపై ఆధారపడవచ్చునని పౌలు తర్కించెను. అబ్రాహాముకు దేవుడు చేసిన వాగ్దానమును, దానితోపాటు ఆయన చేసిన దైవిక ప్రమాణమును ఎత్తివ్రాయుచు, పౌలు ఇట్లు వాదించెను: “మనుష్యులు తమకంటె గొప్పవారితోడు అని ప్రమాణము చేతురు; వారి ప్రతి వివాదములోను వివాదాంశమును పరిష్కారము చేయునది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలెనని ఉద్దేశించినవాడై, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులనుబట్టి, మనయెదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణముచేసి వాగ్దానమును దృఢపరచెను.” (హెబ్రీయులు 6:16-18) అవును, దేవుని వాగ్దానములు సత్యమును, ఆధారపడదగినవై యున్నవి. యెహోవా సర్వశక్తిగలవాడు, ఆయన వాక్య నెరవేర్పుకు హామి ఇవ్వగల మహోన్నతుడై యున్నాడు.
“నిశ్చలమును, స్థిరమునైన”—నిరీక్షణ
ఆ విధముగా, క్రైస్తవ నిరీక్షణ, “నిశ్చలమును, స్థిరమునై” యున్నదని పౌలు వ్రాశాడు. (హెబ్రీయులు 6:19) తన నిరీక్షణ ఎక్కడ వేళ్లూనికొనియుండెనో పౌలు ఎరిగియుండెను. ఆయనిలా వివరించుచున్నాడు: “ఈ నిరీక్షణ . . . తెరలోపల ప్రవేశించుచున్నది.” దీని భావమేమి? ఇక్కడ పౌలు యెరూషలేములోని ప్రాచీన దేవాలయమును గూర్చి మాట్లాడుచున్నాడు. దానియందు అతి పరిశుద్ధ స్థలమును మిగతా స్థలముతో వేరుచేయుటకు ఒక తెర ఉండెడిది. (నిర్గమకాండము 26:31, 33; మత్తయి 27:51) నిజమే, యెరూషలేము నందలి అక్షరార్థ దేవాలయము ఎప్పుడో నాశనము చేయబడెను. కాబట్టి, ఈనాడు ఈ అతి పరిశుద్ధ స్థలము దేనికి సాదృశ్యముగా ఉన్నది?
దేవుడు సింహాసనాసీనుడైయున్న పరలోకమునకది సాదృశ్యముగా ఉన్నది. యేసు పరలోకమునకు ఎక్కిపోయిన తర్వాత ఆయన, “హస్తకృతమైన [యెరూషలేములోని దేవాలయమందలి] పరిశుద్ధ స్థలములో . . . ప్రవేశింపలేదు గాని, యిప్పుడు మనకొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను” అని చెప్పుచూ పౌలు దీనిని వివరించెను. (హెబ్రీయులు 9:24) కావున నిరాశకు వ్యతిరేకముగా పోరాడుటకు మనకు సహాయముచేయు క్రైస్తవ నిరీక్షణ మానవ రాజకీయవాదులపై కాదుగాని పరలోక ఏర్పాటుపై ఆధారపడియున్నది. ఇది దేవుడు నియమించిన యేసుక్రీస్తుపై ఆధారపడియున్నది. ఈయన తన ప్రాణమును మన పాపముల నిమిత్తము విమోచన క్రయధనముగా అర్పించి ఇప్పుడు మన పక్షముగా దేవుని సముఖమున నిలువబడి యున్నాడు. (1 యోహాను 2:1, 2) అంతేకాకుండా, ఈ పత్రిక పుటలలో తరచు చూపించబడినట్లుగా, ఈ యేసే దేవుని పరలోక రాజ్యమును పాలించు రాజుగా దేవునిచే నియమించబడి 1914 నుండి ఆ పాలనను కొనసాగించుచున్నాడు. ఈ పరలోక రాజ్యము త్వరలోనే అనేకమందిని నిరాశకు గురిచేయు సంగతులను తొలగించివేయును.
“ఆత్మకు లంగరువలెనున్న”—నిరీక్షణ
యేసుద్వారా రక్షణ కొరకైన వారి నిరీక్షణ స్థిరమైనదని తన పాఠకులను ఒప్పించుటకు, పౌలు ఒక సాదృశ్యమును ఉపయోగించెను. “ఈ నిరీక్షణ మన ఆత్మకు లంగరువలె” నున్నదని ఆయన వివరించెను.—హెబ్రీయులు 6:19.
పౌలువంటి ప్రయాణికులకు లంగరు అంటే ఏమిటో బాగుగా తెలియును. ఇనుముతో తయారుచేయబడి సముద్ర గర్భాన్ని కరచిపట్టుకొను రెండు కోరలుండు ప్రాచీనకాల లంగరులు ఆధునిక కాల లంగరులను పోలియుండెను. షుమారు సా.శ. 58లో పౌలు రోమాకు ప్రయాణమై వెళ్లుచున్న ఓడ ఒడ్డుకుచేరి నేలకు కొట్టుకొను ప్రమాద స్థితికి వచ్చెను. అయితే ఆ నావ కాస్తలోతున్న చోటికి రాగానే, దాని నావికులు “ఓడ అమరలోనుండి . . . లంగరులు వేసిరి.” ఆ లంగరుల మూలముగా, ఓడ ఆ తుపాను తాకిడిని తప్పించుకొని సురక్షితముగా సాగిపోయెను.—అపొ. కార్యములు 27:29, 39, 40, 44.
కాబట్టి, ఆర్ధిక ఇబ్బందిని, భౌతిక లేదా భావోద్రేక రుగ్మతను, లేక నీ గమనమందు ఎదురయ్యే ఎటువంటి ‘పెనుగాలుల’ నైనను నీవు తప్పించుకొన గల్గుటకు, నీ నిరీక్షణను లంగరంత సురక్షితము చేసికొనుటకు నీవేమి చేయవలెను? బైబిలు వాగ్దానములు నమ్మదగినవని మొదట నీకైనీవు నమ్మిక కలిగియుండుము. “సమస్తమును పరీక్షించుము.” (1 థెస్సలొనీకయులు 5:21) ఉదాహరణకు, ఈసారి మరలా యెహోవాసాక్షులు నీతో మాట్లాడునప్పుడు, వారు చెప్పుదానిని ఆలకించుము. నీవు నివసించు ప్రాంతమును వారు అరుదుగా సందర్శిస్తునట్లయితే, నీకు సమీపమునగల రాజ్యమందిరములో వారిని కనుగొనుము. నీవు వారితో చేరవలెనని బలవంతము చేయుట జరుగదు, గాని నీకు అనుకూలముగా ఎక్కడైననూ, ఏ సమయములోనైనను ఒక ఉచిత బైబిలు పఠనమును ఏర్పాటు చేసికొనుటకు నీవు ఆహ్వానింపబడుదువు.
అటువంటి పఠనము దేవుడు “తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడను” అభయమును నీకిచ్చును. (హెబ్రీయులు 11:6) త్వరలోనే రాజైన యేసుక్రీస్తు అధికారము క్రిందగల దేవుని రాజ్యము, ఈనాడు అనేకమందిని నిరాశకు గురిచేయు అవినీతిని, అసమానతలను నిర్మూలించునని నీవు నేర్చుకొందువు. ఆ రాజ్యము క్రింద, ఈ భూమిపై పరదైసు పునరుద్ధరింపబడును, కాగా ఆయనను ప్రేమించు వారికి దేవుడు నిత్యజీవము ననుగ్రహించును. (సామెతలు కీర్తన 37:29; ప్రకటన 21:4) ఎంతటి మహత్తరమైన నిరీక్షణ!
ఈ నిరీక్షణ సత్యమైయున్నదని చూచుటకు బైబిలును జాగ్రత్తగా చదువుము. ఆ పిమ్మట దేవునితో సన్నిహిత వ్యక్తిగత అనుబంధమును వృద్ధిచేసికొనుటకు పనిచేయుచు, అబ్రాహాము వలెనే ఆయన స్నేహితునిగా తయారగుము. (యాకోబు 2:23) యెహోవా “ప్రార్థన ఆలకించువాడు” గనుక, నీ చింతయావత్తు ఆయనకు విన్నవించుకొనుము. చిత్తశుద్ధితో నీవు సమీపించినట్లయితే, ఆ ప్రార్థన నీ భారము దించుకొనుటకు, నిరాశను జయించుటకు నీకు సహాయము చేయును. దేవుని ఆత్మ నిన్ను కృంగదీయు పరిస్థితియే మారిపోవుటకు మార్గాన్ని సుగమం చేయవచ్చును.—కీర్తన 55:22; 65:2; 1 యోహాను 5:14, 15.
“చేపట్టుము”
“సమస్తమును పరీక్షించుమని” తన తోటి శిష్యులకు సిఫారసు చేసిన పిదప, పౌలు ఇంకను ఇట్లనెను: “మేలైనదానిని చేపట్టుము.” (1 థెస్సలొనీకయులు 5:21) దీనిని చేయుటకు ఒక మార్గమేమనగా ఆ క్రైస్తవ నిరీక్షణను చేపట్టిన ప్రజలతో సహవసించుటయే. జ్ఞానియగు రాజైన సొలొమోను ఇలా హెచ్చరించాడు: “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.” (సామెతలు 13:20) దురభిమానము లేక ఇబ్బందికర భావనలు మంచి సహవాసమును వెదకుట నుండి నిన్ను అడ్డగించనీయకుము. ఉదాహరణకు, గతమందు ఏ నిరీక్షణలేని ప్రజలు ఇప్పుడు యెహోవాసాక్షుల మధ్య వున్నారు. అయితే తోటి విశ్వాసుల సంతోషదాయకమైన సహవాసముతోపాటు వారి బైబిలు పఠనము, యెహోవాతో వారి సంబంధమును బలపరచుటయే గాకుండ వారికి ఆధారపడదగిన, లంగరును పోలిన నిరీక్షణను సమకూర్చుచున్నది. ఇది నిజముగా నిరాశను జయించునా? అవును అది నిశ్చయముగా జయించును.
ఆన్‌మేరీ విషయమే తీసుకోండి, భర్తపెట్టే హింసలు భరించలేక జీవితంమీద విరక్తి చెందింది. ఆమె ఇలా వివరిస్తున్నది: “నేను ప్రాణం తీసుకుందామని నిర్ణయించుకొన్నాను, కాని ఏ కారణంచేతనో మొదట దేవునికి ప్రార్థనచేయాలని నేను అనుకున్నాను. నేనిలా ప్రార్థించినట్లు గుర్తుంది, ‘నాకెందుకు సహాయం చేయవు? ఇంతకాలంగా నేను నిన్ను నమ్ముకున్నానే, నాకేం ప్రయోజనం కలుగలేదు.’ అలా ఈ జీవితానికి సంకల్పమే లేదని నాకిక మరణమే మేలని తలంచుచు నేను నా ప్రార్థనను ముగించాను. అదే సమయంలో ఎవరో తలుపు తట్టారు. కాని కొంతసేపటికి ఆ వచ్చినవాళ్లు వెళ్లిపోతారని నేను దానిని లెక్కచేయలేదు.
“తలుపు తట్టడం ఆగలేదు, నాకు కోపంవచ్చి, నా కళ్లు తుడుచుకొని వెళ్లి ఆ వచ్చినదెవరో చూసి త్వరగా నేను అనుకున్నది ముగించాలని అనుకున్నాను.” కాని, ఆన్‌మేరీ అంటుంది “యెహోవాకు కృతజ్ఞతలు, నేననుకున్నట్లు జరుగలేదు, ఎందుకంటే నేను తలుపు తెరిచి, అక్కడ ఇద్దరు స్త్రీలు నిలువబడి యుండడం చూశాను. నిజమే నేనెంతో కలవరంతో ఉన్నాను, వారేమి చెబుతున్నారో నేను నిజంగా అర్థంచేసికోలేదు. అయితే వారు జీవితానికొక సంకల్పమున్నదని వివరించే పుస్తకాన్ని నాకు చూపించారు. జీవితం మీద ఆసక్తిని పునరుజ్జీవింప చేసుకొనుటకు నాకు అవసరమైనదదే.” ఆమెను సందర్శించ వచ్చినవారు ఆమెతో క్రమముగా బైబిలు పఠనము చేయుటకు ఏర్పాటుచేశారు. ఆన్‌మేరీ దేవునికి స్నేహితురాలిగా తయారవడాన్ని నేర్చుకున్నది. కాగా, ఇది ఆమె జీవితానికొక సంకల్పాన్నిచ్చింది. ఇప్పుడామె దేవునియందు నమ్మకాన్ని వృద్ధిచేసుకొనుటలో ఇతరులకు సహాయము చేస్తున్నది.
ఇమిడియున్న యావత్తు ఏమిటో తెలిసికోకుండా నీవు బహుశ నిరాశ అంతం కావాలని నిరీక్షించి యుండవచ్చును. అయితే “నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక” అని నీవెప్పుడైనా ప్రార్థించి యుంటే, సహృదయులైన ప్రజలను నిరాశకు గురిచేయు సమస్త సంగతులను అంతమొందించు యేసుక్రీస్తు అధికారము క్రిందగల దేవునిరాజ్య రాకడ కొరకు నీవు ప్రార్థించావు. (మత్తయి 6:10) నీ వ్యక్తిగత బైబిలు పఠనము, అదే నమ్మకాన్ని కలిగియున్న ప్రజలతో నీ క్రమమైన సహవాసము యెహోవా రాజ్యము వచ్చి, మన భూమికి పరదైసు తేవాలను నీ నిరీక్షణపై పట్టును బలపరచును. (1 తిమోతి 6:12, 19) ఈ మహత్తరమైన నిరీక్షణనే ఈ పత్రిక ప్రతి సంచికలోను ప్రకటించుచున్నది. నిరాశకు వ్యతిరేకముగా పోరాడుటకు హృదయపూర్వకముగా ఈ నిరీక్షణను హత్తుకొనుము. నిజానికి, నిరీక్షణ ‘నిరుత్సాహమునకు దారితీయదు.’—రోమీయులు 5:5. (w92 7/1)
[7వ పేజీలోని చిత్రాలు]
బైబిలును పఠించుట మన “ఆత్మకు లంగరువలె” పనిచేయు నిరీక్షణనిచ్చును