కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 10/8 పేజీలు 6-8
  • ప్రేమా నిరీక్షణలు అంతరించిపోయినప్పుడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రేమా నిరీక్షణలు అంతరించిపోయినప్పుడు
  • తేజరిల్లు!—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • జీవ-రక్షక లక్షణమా?
  • నిరాశ ఏర్పడవచ్చు
  • ఆత్మహత్య—యువతను పీడిస్తున్న మహామారి
    తేజరిల్లు!—1998
  • ఆత్మహత్యే పరిష్కారమా?
    తేజరిల్లు!—1994
  • ప్రేమా నిరీక్షణల పునరాగమనంతో
    తేజరిల్లు!—1998
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
మరిన్ని
తేజరిల్లు!—1998
g98 10/8 పేజీలు 6-8

ప్రేమా నిరీక్షణలు అంతరించిపోయినప్పుడు

కెనడాకు చెందిన 17 ఏళ్ల అమ్మాయి తాను చనిపోవాలనుకోవడానికిగల కారణాలను వ్రాసిపెట్టింది. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి: ‘ఒంటరితనం, నా భవిష్యత్తును గురించిన భయం; తోటి పనివారికంటే నేను నిజంగా తక్కువదాన్నని భావించడం; అణు యుద్ధం; ఓజోన్‌ పొర నాశనం; నేను చాలా వికారంగా ఉంటాను, కాబట్టి నాకెప్పటికి పెళ్లికాదు గనుక నేను ఒంటరిదాన్నైపోతాను; జీవించడానికి తగిన కారణముందని నేను అనుకోవడం లేదు ఇక ఆ విషయాన్ని తెలుసుకోవడానికి వేచి చూడడమెందుకు; నా మరణం వల్ల అందరికీ భారం తగ్గుతుంది; మళ్లీ ఇక ఎవరూ నన్ను బాధపెట్టలేరు.’

అనేకమంది యౌవనులు తమను తాము చంపుకోవడానికి కారణాలు వీటిలో కొన్ని అయ్యుండవచ్చా? కెనడాలో, “మోటారు వాహనాల దుర్ఘటనలు మినహాయించి (యౌవనస్థుల) మరణానికి అత్యంత సాధారణమైయున్న కారణం ఆత్మహత్యే.”—ది గ్లోబ్‌ అండ్‌ మెయిల్‌.

దక్షిణ ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసరైన రేయాజ్‌ హసన్‌ తన పరిశోధక వ్యాసమైన “జీవించని జీవితాలు—యువత ఆత్మహత్యల తీరు” అనేదానిలో ఇలా పేర్కొన్నాడు: “ఈ విషయానికి సంబంధించిన మరియు యౌవనస్థుల ఆత్మహత్యల పెరుగుదలను విశేషంగా ప్రభావితం చేసినట్లు కనిపిస్తున్న సామాజిక కారణాలు అనేకం ఉన్నాయి. అవేమిటంటే, యువత మధ్య అత్యధికంగా ఉన్న నిరుద్యోగ రేటు; ఆస్ట్రేలియా కుటుంబంలో వస్తున్న మార్పులు; మత్తుపదార్థాల అత్యధిక ఉపయోగం మరియు దుర్వినియోగం; అధికమౌతున్న యువత దౌర్జన్యం; మానసిక ఆరోగ్యం; ‘సిద్ధాంతపరమైన స్వేచ్ఛకూ’ అనుభవపూర్వక వ్యక్తి స్వాతంత్ర్యానికీ మధ్య పెరిగిపోతున్న తేడా.” ఆ తర్వాత ఆ పరిశోధక వ్యాసం, అనేక సర్వేల ఫలితాలు భవిష్యత్తు గురించి నిరాశావాద భావాన్ని వ్యక్తపర్చాయని చెబుతూ, ఇలా సూచించింది, “యౌవనస్థుల్లో అధికశాతం మంది తమ భవిష్యత్తు గురించీ ప్రపంచ భవిష్యత్తు గురించీ భయభ్రాంతులౌతున్నారు. వాళ్లు అణు యుద్ధంతో నాశనమైపోయిన, కాలుష్యం మూలంగా పర్యావరణ క్షీణత మూలంగా ధ్వంసమైపోయిన ప్రపంచాన్ని తమ మనోఫలకంపై చూస్తున్నారు. సాంకేతికత అదుపుతప్పిపోయి నిరుద్యోగం రాజ్యమేలుతున్న అమానుష సమాజాన్ని చూస్తున్నారు.”

16 నుండి 24 ఏళ్ల మధ్యనున్నవారిపై జరిపిన ఒక సర్వే ప్రకారం, ధనికులకూ పేదవారికీ మధ్య పెరిగిపోతున్న దూరం, తల్లి/తండ్రి మాత్రమే ఉన్న కుటుంబాల సంఖ్యలో పెరుగుదల, మారణాయుధాల వినియోగంలో పెరుగుదల, పిల్లలపై అత్యాచారం, “భవిష్యత్తు మీద విశ్వాసం లేకపోవడం” వంటివి ఆత్మహత్యకు అదనపు కారణాలు.

అమెరికాలో, “[యువత ఆత్మహత్యకు] ప్రముఖ కారణం మారణాయుధాలు ఉండడమే కావచ్చు. ఏవిధమైన మానసిక వైకల్యాలూ లేని, ఆత్మహత్యకు పాల్పడిన యువతతో అలా ఆత్మహత్యకు పాల్పడని యువతను పోల్చిచూస్తూ చేసిన ఒక అధ్యయనంలో ఒకేఒక్క తేడాను కనుగొనడం జరిగింది: గుండ్లు నింపిన తుపాకి ఇంట్లో ఉండడమే. తుపాకీలు ప్రజలను చంపవు గానీ ప్రజలే ప్రజలను చంపుతారన్న తలంపు సమంజసమైనది కాదు” అని న్యూస్‌వీక్‌ నివేదిస్తుంది. లక్షలాది గృహాల్లో గుండ్లు నింపిన తుపాకిలున్నాయ్‌!

భయమూ మరియు పట్టించుకోని సమాజమూ బలహీనులైన యువతను ఆత్మహత్యవైపుకు నెట్టేస్తాయి. ఇది పరిశీలించండి: 12 నుండి 19 ఏళ్లమధ్యనున్న వారిపై జరిగిన హింసాయుత నేరాల రేటు సామాన్య జనాభాపై జరిగిన నేరాల రేటు కంటే రెండింతలకన్నా ఎక్కువగా ఉంది. “14 నుండి 24 ఏళ్ల మధ్యనున్న యువతులు ఎక్కువగా మానభంగానికి గురయ్యే అవకాశం ఉందని” అధ్యయనాలు కనుగొన్నట్లు మాక్లీన్స్‌ పత్రిక నివేదించింది. “స్త్రీలను ప్రేమిస్తున్నామని చెప్పుకునేవారే ఎక్కువగా స్త్రీలను మానభంగం చేస్తూ, వారిని హత్య చేస్తున్నారు.” ఫలితం? ఇవీ, మరితర భయాలూ “ఈ యువతుల నమ్మకాన్ని, భద్రతాభావాన్ని హరించివేస్తున్నాయి.” మానభంగానికి గురై బ్రతికి బయటపడినవారిని ఒక అధ్యయనంలో ఇంటర్వ్యూ చేసినప్పుడు వారిలో దాదాపు మూడొంతుల మంది ఆత్మహత్య చేసుకోవాలనుకున్నవారేనని తెలిసింది.

న్యూజీలాండ్‌ నుండి వచ్చిన ఒక నివేదిక, యువత ఆత్మహత్యలకు మరో కారణాన్ని ఇలా తెలియజేస్తుంది: “వ్యక్తి విజయాన్ని సంపద సౌందర్య అధికారాలతో కొలిచే సర్వవ్యాప్త భౌతికవాదపు లోకసంబంధ విలువలు, అనేకమంది యౌవనులు తాము ఎందుకూ పనికిరానివాళ్లమనీ సమాజంచే బహిష్కరించబడిన వాళ్లమనీ భావించేలా చేస్తున్నాయి.” ది ఫ్యూచరిస్ట్‌ ఇలా జతచేస్తోంది: “తమకు అన్నీ కావాలనే, త్వరగా పొందాలనే, వెంటనే తృప్తిపొందాలనే బలమైన కోరిక [యువతకు] ఉంటుంది. టీవీ కార్యక్రమాల్లో వారికిష్టమైనవి ధారావాహిక నాటికలు. అధునాతన వస్త్రధారణతో, ఎంతో డబ్బూ పలుకుబడీ ఉండి, మరీ కష్టపడి పనిచేయాల్సిన అవసరంలేని అలాంటి అందమైన ప్రజలతోనే తమ ప్రపంచం కూడా నిండిపోవాలని వారు కలలుగంటారు.” అలాంటి అవాస్తవికమైన, నెరవేర సాధ్యంకాని కోరికల పరిమాణమే ఎంతో నిరాశను కలిగించి, ఆత్మహత్యకు నడిపించగలదని అనిపిస్తుంది.

జీవ-రక్షక లక్షణమా?

“వాన వెలసిన తర్వాత వచ్చే సూర్యకాంతిలా ప్రేమ ఓదార్పునిస్తుంది” అని వ్రాశాడు షేక్స్‌పియర్‌. “ప్రేమ శాశ్వతకాలముండును” అని చెబుతుంది బైబిలు. (1 కొరింథీయులు 13:8) ఆత్మహత్య చేసుకునేందుకు మొగ్గు చూపించే యువత సమస్యకు ఆ లక్షణంలో ఒక కీలకం ఉంది—ప్రేమా సంభాషణల కొరకైన వారి ఆకాంక్ష. ది అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఎన్‌సైక్లోపీడియ ఆఫ్‌ మెడిసిన్‌ ఇలా తెలియజేస్తుంది: “ఆత్మహత్య చేసుకునే వాళ్లు సాధారణంగా ఎంతో ఒంటరితనాన్ని అనుభవిస్తుంటారు, సానుభూతితో విని అర్థంచేసుకునేవారితో మాట్లాడగల ఒక్క అవకాశం చాలు కొన్నిసార్లు వారు నిరాశతోకూడిన ఆ చర్య తీసుకోకుండా ఉండడానికి.”

యువతకు ప్రేమా, తాము అయినవారన్న అనుభూతీ చాలా అవసరం. తమకు ఏమాత్రం అధికారంలేని ఈ ప్రేమరహితమైన నాశనకరమైన లోకంలో ఒక్కో రోజూ గడుస్తుంటే ఆ అవసరం తీరడం కష్టతరమైపోతుంది. కుటుంబం విచ్ఛిన్నమవ్వడం మూలంగా, విడాకుల మూలంగా ఏర్పడే తల్లిదండ్రుల నిరాదరణ యువత ఆత్మహత్యకు ఎంతగానో కారణం కాగలదు. ఆ నిరాదరణ అనేక రీతుల్లో వ్యక్తపర్చబడవచ్చు.

ఇంట్లో తమ పిల్లలతో చాలా అరుదుగా సమయం గడిపే తల్లిదండ్రుల విషయాన్ని పరిశీలించండి. తల్లి, తండ్రి తమ ఉద్యోగాల్లో పూర్తిగా నిమగ్నమై ఉండవచ్చు లేదా పిల్లలు పాల్గొనలేని ఏదో విధమైన వినోదంలో వారు నిమగ్నమై ఉండవచ్చు. పిల్లలకు పరోక్షంగా లభించే సందేశమేమిటంటే, స్పష్టమైన నిరాదరణ. ప్రముఖ విలేఖరీ పరిశోధకుడూ అయిన హ్యూ మకే ఇలా పేర్కొన్నాడు, “తల్లిదండ్రులు అంతకంతకూ స్వార్థపరులైపోతున్నారు. వారు తమ జీవన శైలిని కాపాడుకోవడానికి తమకే ప్రాధాన్యతనిచ్చుకుంటారు. . . . నిక్కచ్చిగా చెప్పాలంటే, పిల్లలుండే విషయంలో నేడు ప్రజలకు సానుకూల దృష్టి లేదు . . . జీవితం కష్టసాధ్యమైపోయింది, ప్రజలు మరీ స్వార్థపరులైపోతున్నారు.”

ఇక, కొన్ని పురుషాధిక్య సమాజాల్లో పురుషులు పిల్లల ఆలనాపాలనా చూడడానికి ఇష్టపడకపోవచ్చు. విలేఖరి అయిన కేట్‌ లెగ్‌ చక్కగా ఇలా చెబుతున్నాడు: “ప్రజా సేవలో భాగం వహించడానికి మొగ్గు చూపే పురుషులు సాధారణంగా పిల్లల ఆలనాపాలనా చూసుకోవడం కన్నా ఎక్కువగా యుద్ధ సంబంధమైన పనులను ఎంపిక చేసుకుంటారు . . . వాళ్లు ఇతరుల పట్ల శ్రద్ధతీసుకోవడం వంటివి ఇమిడివుండే పనులకంటే ప్రజా-బాహ్య శక్తులతో పోరాడడం ఇమిడివుండే శక్తివంతమైన, సంభాషణారహిత వీరత్వాన్ని కోరుకుంటారు.” నేడు ఇతరుల పట్ల శ్రద్ధతీసుకోవలసిన అవసరత ఎక్కువగాగల పనుల్లో ఒకటి తల్లి/తండ్రిగా ఉండడం. సరైన విధంగా పెంచలేకపోవడం పిల్లవాడిని నిరాకరించడంతో సమానం. ఫలితంగా, మీ కుమారుడు లేదా కుమార్తె ప్రతికూల వ్యక్తిత్వాన్ని వృద్ధిచేసుకుంటారు, సరైన సామాజిక నైపుణ్యాలను అలవర్చుకోలేకపోతారు. ది ఎడ్యుకేషన్‌ డైజెస్ట్‌ ఇలా పేర్కొంటుంది: “పిల్లలు తమ గురించి తాము అనుకూలమైన అభిప్రాయాన్ని కలిగిలేకపోతే, వారు తమ కోసం తాము శ్రేష్ఠమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఆధారం ఉండదు.”

నిరాశ ఏర్పడవచ్చు

నిరాశ ఆత్మహత్యకు నడిపే ముఖ్యకారకమని పరిశోధకులు విశ్వసిస్తున్నారు. ఆస్ట్రేలియాలో యువత ఆత్మహత్య గురించి వ్రాసే రచయితయైన గేయల్‌ మేసన్‌ ఇలా పేర్కొన్నాడు: “నిరాశ కృంగుదలతోకంటే ఆత్మహత్యా తలంపులతో ఎక్కువ పరస్పర సంబంధాన్ని కల్గివున్నట్లు పరిగణించబడుతుంది. నిరాశ కొన్నిసార్లు కృంగుదల సూచక లక్షణంగా నిర్వచించబడుతుంది. . . . అది సాధారణంగా మామూలు నిరాశాభావపు రూపాన్ని తీసుకుంటుంది, యువత భవిష్యత్తుకు సంబంధించిన అంటే ముఖ్యంగా వారి ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించిన నిరాశావాద రూపాన్ని సంతరించుకుంటుంది: తక్కువ మోతాదులో, భూగోళ పరిస్థితికి సంబంధించి ఒక విధమైన నిస్పృహ రూపాన్ని సంతరించుకుంటుంది.”

నిజాయితీ విషయంలో పౌర నాయకుల నీచమైన ఉదాహరణలు యువత తమ స్వంత నైతిక విలువల స్థాయిని పెంచుకునేందుకు ప్రేరేపించవు. “నిజాయితిగా ఉండడానికి నేనెందుకు కృషి చేయాలి?” అనే దృక్పథం ఏర్పడుతుంది. వేషధారణను గుర్తించడంలో యువతకుండే సామర్థ్యాన్ని గురించి హార్పర్స్‌ మ్యాగజైన్‌ ఇలా వ్యాఖ్యానిస్తోంది: “యువతకు వేషధారణను గ్రహించే నేర్పుంది గనుక వారు చక్కని చదువరులు—అయితే వాళ్లు పుస్తకాల చదువరులు కాదు. వాళ్లు అంత సునిశితంగా చదవగలిగేది తాము జీవనోపాధిని సంపాదించుకోవలసిన లోకం నుండి వెలువడుతున్న సామాజిక సూచనలను.” ఆ సూచనలు ఏమని చెబుతున్నాయి? రచయిత స్టెఫెనీ డౌరిక్‌ ఇలా పేర్కొంటున్నాడు: “ఎలా జీవించాలనే దాన్ని గురించిన సమాచారం మనకు ఇంతకన్నా ఎక్కువగా మరెన్నడూ అందుబాటులో లేదు. మనం ఇంతకన్నా సంపన్నవంతులుగా లేదా ఇంతకన్నా విద్యావంతులుగా మునుపెన్నడూ ఉండలేదు, అయినా సర్వత్రా నిరాశ ఉంది.” రాజకీయ, మతపరమైన సమాజంలో పైస్థాయిలో మంచి మాదిరికరమైనవారు చాలా అరుదుగా ఉన్నారు. డౌరిక్‌ కొన్ని యుక్తమైన ప్రశ్నలను అడుగుతున్నాడు: “మనం జ్ఞానాన్ని, స్థితిస్థాపకతను, చివరికి అర్థవిహీనమైన బాధ నుండి అర్థాన్ని ఎలా పొందగలం? స్వార్థం, నిర్హేతుకమైన క్రోధం, అత్యాశ నిండివున్న వాతావరణంలో మనం ప్రేమను ఎలా వృద్ధిచేసుకోగలం?”

ఈ ప్రశ్నలకు సమాధానాలను మీరు మా తర్వాతి శీర్షికలో కనుగొంటారు, అవి మీకు ఆశ్చర్యాన్ని కల్గించవచ్చు.

[6వ పేజీలోని చిత్రం]

“యౌవనస్థుల్లోని ఎక్కువశాతం మంది తమ భవిష్యత్తు గురించి, ప్రపంచ భవిష్యత్తు గురించి భయాందోళనలు కల్గివున్నారు”

[7వ పేజీలోని చిత్రం]

“సానుభూతితో విని అర్థంచేసుకునేవారితో మాట్లాడగల ఒక్క అవకాశం చాలు కొన్నిసార్లు వారు నిరాశతోకూడిన ఆ చర్య తీసుకోకుండా ఉండడానికి”

[6వ పేజీలోని బాక్సు]

ఆత్మహత్యా ప్రయత్న సూచకాలు

• నిద్రపట్టకపోవడం, ఆకలిలేకపోవడం

• ఒంటరితనం, సమాజం నుండి తనను తాను వేరు చేసుకోవడం, దుర్ఘటనలకు ఉన్ముఖమై ఉండడం

• ఇంటినుండి పారిపోవడం

• రూపంలో ఆకస్మికమైన మార్పులు రావడం

• మత్తుపదార్థాల మరియు మత్తుపానీయాల దుర్వినియోగం

• కలత, దురాక్రమణ చేయడం

• మరణం గురించి మాట్లాడడం; స్వనాశనం గురించి వ్రాతపూర్వక సందేశాలు; హింసాత్మక చిత్రాలు, ప్రాముఖ్యంగా తనను తాను హింసించుకుంటున్నట్లు సూచించే చిత్రాలు

• అపరాధ భావాలు

• నిరాశ, చింత, కృంగుదల, మానసిక ఆందోళన

• తనకు సొంతమైనవాటిని ఇచ్చివేయడం

• అవధానం ఎక్కువసేపు నిలుపలేకపోవడం

• ఆహ్లాదకరమైన కార్యకలాపాల్లో ఆసక్తి లేకపోవడం

• స్వయం-విమర్శ

• లైంగిక విచ్చలవిడితనం

• పాఠశాల చదువులో హఠాత్తుగా శ్రద్ధ క్షీణించిపోవడం, పాఠశాలకు సరిగా వెళ్లకపోవడం

• ఏదైనా మతసంబంధ తెగలో లేక గుంపులో సభ్యత్వం కలిగివుండడం

• కృంగుదల తర్వాత హాయిగా ఉన్న అనుభూతిని పొందడం

ఫిలిప్‌ జి. పాట్రస్‌ మరియు టోన్య కె. శామూ వ్రాసిన టీన్స్‌ ఇన్‌ క్రైసిస్‌ (అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ స్కూల్‌ అడ్మినిస్ట్రేటర్స్‌) మరియు డిప్రెషన్‌ అండ్‌ సూయిసైడ్‌ ఇన్‌ చిల్డ్రన్‌ అండ్‌ అడోలసెంట్స్‌ ఆధారంగా

[7వ పేజీలోని చిత్రాలు]

జీవితంపట్ల మరింత అవగాహన కలిగి ఉండేందుకు ఒక యౌవనస్థునికి ప్రేమానురాగాలు సహాయం చేయగలవు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి