పాఠకులనుండి ప్రశ్నలు
లూకా 1:62 సూచిస్తున్నట్లు కన్పించు వాక్యంప్రకారం, బాప్తిస్మమిచ్చు యోహాను తండ్రియగు, జెకర్యా మూగవానిగాను, ఆలాగే చెవిటివానిగాను చేయబడెనా?
జెకర్యా చెవిటివానిగాకూడా చేయబడెనను అభిప్రాయమునకు కొందరు వచ్చిరి. బైబిలు వృత్తాంతమందు మనమిట్లు చదువుదుము: “వారు . . . తండ్రి పేరునుబట్టి జెకర్యా అను పేరు వానికి [పిల్లవానికి] పెట్టబోవుచుండగా తల్లి—ఆలాగు వద్దు; వానికి యోహానను పేరు పెట్టవలెనని చెప్పెను. అందుకు వారు—నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడును లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలుచేసి అడిగిరి. అతడు వ్రాతపలక తెమ్మని—వాని పేరు యోహానని వ్రాసెను.”—లూకా 1:59-63.
అయిననూ, ఈ వృత్తాంతములో ఏదియు ప్రత్యేకించి జెకర్యా కొంతకాలము వరకు వినలేకపోయెనని చెప్పుటలేదు.
అంతకు పూర్వము గబ్రియేలను దేవదూత యోహానని పిలువబడు కుమారుడు పుట్టబోవునని జెకర్యాకు ప్రకటించెను. వృద్ధుడైన జెకర్యాకు దానిని నమ్మలేకపోయెను. అందుకు ప్రత్యుత్తరముగా ఆ దేవదూత, “నా మాటలు వాటికాలమందు నెరవేరును; నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై యుందువని అతనితో చెప్పెను.” (లూకా 1:13, 18-20) జెకర్యా వినికిడి శక్తిని కాదుగాని, మాట్లాడు శక్తిని కోల్పోతాడని దేవదూత చెప్పెను.
ఆ వృత్తాంతము ఇంకనూ తెల్పునదేమనగా, “అతడు [ఆలయమునుండి] వెలుపలికి వచ్చినప్పుడు వారితో [వేచియున్న ప్రజలతో] మాటలాడలేక పోయినందున, ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి; అప్పుడతడు వారికి సంజ్ఞలుచేయుచు, మూగవాడై యుండెను.” (లూకా 1:22) ఇక్కడ “మూగ” అని భాషాంతరము చేయబడిన గ్రీకు పదము, మాటలోను వినుటలోను లేక రెంటిలో బలహీనము చేయబడెనను తలంపునిచ్చుచున్నది. (లూకా 7:22) మరి జెకర్యా విషయమేమి? అతడు స్వస్థపరచబడినప్పుడు ఏమి జరిగెనో ఆలోచించుము. “వెంటనే అతని నోరు తెరవబడి, నాలుక సడలి, అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగెను.” (లూకా 1:64) జెకర్యా మాటలాడు సామర్థ్యము మాత్రమే బలహీనపరచబడెననే అభిప్రాయానికి అది కారణయుక్తముగా నడిపించుచున్నది.
అయితే, ఇతరులెందుకు జెకర్యాను “వానికి [పిల్లవానికి] ఏ పేరు పెట్టగోరుచున్నావని . . . సంజ్ఞలుచేసి అడిగిరి”? కొందరు అనువాదకులు దీనిని “సంజ్ఞల భాషలో” లేక “సంజ్ఞ భాష నుపయోగించి” అనికూడా భాషాంతరము చేశారు.
దేవదూత ప్రకటించిన దగ్గరనుండి మూగవాడైన జెకర్యా, తనను వ్యక్తపరచుకొనుటకు ఒక విధమైన సంజ్ఞల భాషలో తరచూ సైగలుచేస్తూ చెప్పవలసివచ్చేది. ఉదాహరణకు, అతడు ఆలయములో ఉన్నవారికి “సంజ్ఞలు చేయుచు” నుండెను. (లూకా 1:21, 22) ఆ తర్వాత పలకతెమ్మని అడిగినప్పుడు, ఆయన సంజ్ఞలను లేక అభినయములను ఉపయోగించియుండవచ్చును. (లూకా 1:63) కాబట్టి, ఆయన మూగవానిగాయున్న కాలములో ఆయన చుట్టుప్రక్కలనున్న వారుకూడా అభినయములను ఉపయోగించుటకు మొగ్గుచూపు సాధ్యత కలదు.
ఏమైనను, లూకా 1:62లో ప్రస్తావించబడిన సంజ్ఞలకు బహుశః మరియెక్కువ వివరణ ఉన్నది. ఎలీసబెతు అంతకుముందే తన కుమారుని పేరును గూర్చి తెలియజేసెను. కావున, ఆమెతో విభేదించకుండా, వారు తర్వాతి చర్య మరియు సరియైన చర్యగా నిర్ణయము కొరకు ఆమె భర్తను అడిగి యుండవచ్చును. వారు దానిని కేవలము తల ఊపుటద్వారా లేక ఒక సంజ్ఞద్వారా చేయగలరు. చదువుటకు వారు తమ ప్రశ్నను జెకర్యాకు వ్రాసియివ్వలేదను వాస్తవము అతడు తన భార్య మాటలను వినెనని రుజువు చేయుచున్నది. ‘సరే, మనందరము (జెకర్యా, మీరుకూడ) ఆమె చెప్పిన పేరు విన్నాము కదా, పిల్లవాని పేరు విషయములో చివరకు నీ నిర్ణయమేమిటి?’ అను భావమునిచ్చు విధముగా కేవలము తల ఊపుట లేక ఆయనవైపు తదనుగుణ్యమైన సంజ్ఞచేయుట సరిపోయి ఉండేది.
ఆ వెంటనే పరిస్థితిని తారుమారు చేయుచు మరొక అద్భుతము జరిగెను. “వెంటనే అతని నోరు తెరవబడి, నాలుక సడలి, అతడు . . . మాటలాడసాగెను.” (లూకా 1:64) వినికిడి శక్తిని అతడు కోల్పోనట్లయితే అతని వినికిడిని గూర్చి ప్రస్తావించ నవసరము లేదు. (w92 4/1)