నిందారహితులుగా నడిచినందుకు వారికి ప్రతిఫలమివ్వబడింది
యెహోవా తన నమ్మకమైన దాసులను దీవించి, ప్రతిఫలమిస్తాడు. దేవుని సంకల్పాలు ఎలా నెరవేరుతాయో చూసేందుకు వారు కొంతకాలం వేచివుండవలసిన అవసరత ఉండవచ్చు. అయినా ఆయన ఆశీర్వాదాన్ని అనుభవించినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో కదా!
రెండు వేల సంవత్సరాలకు పూర్వం, అహరోను కుటుంబానికి చెందిన యూదా యాజకుడైన జెకర్యా, అతని భార్య ఎలీసబెతు యిరువురి విషయంలో యిది చక్కగా ఉదహరించబడింది. ఇశ్రాయేలీయులు తనను నమ్మకంగా సేవించినట్లయితే, వారికి సంతానమిచ్చి ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. పిల్లలు బహుమానమని ఆయన అన్నాడు. (లేవీయకాండము 26:9; కీర్తన 127:3) అయినప్పటికీ, జెకర్యా ఎలీసబెతులు పిల్లలు లేని, బహుకాలము గడచిన వృద్ధులు.—లూకా 1:1-7.
జెకర్యా, ఎలీసబెతులైన “వీరిద్దరు ప్రభువుయొక్క సకలమైన ఆజ్ఞలచొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై యుండిరి,” అని లేఖనాలు చెబుతున్నాయి. (లూకా 1:6) వారు దేవున్ని ఎంతో ప్రేమించారు గనుక, నీతిని వెంబడించి ఆయన ఆజ్ఞలను గైకొనడం వారికి ఏమాత్రం భారంగా లేదు.—1 యోహాను 5:3.
ఎదురు చూడని ఆశీర్వాదాలు
సా.శ.పూ. 3వ సంవత్సరపు వసంతకాల తుది భాగానికి లేదా వేసవికాల తొలి భాగానికి తిరిగి వెళ్దాము. యూదయను హేరోదు ది గ్రేట్ రాజుగా ఏలుతున్నాడు. ఒకనాడు, యాజకుడైన జెకర్యా యెరూషలేములోని ఆలయ పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తాడు. ప్రజలు వెలుపల కూడుకొని ప్రార్థన చేస్తుండగా, బంగారు బలిపీఠంపై ఆయన ధూపం వేస్తాడు. బహుశా అనుదిన సేవలో అతి ఘనమైనదిగా ఎంచబడే దీన్ని బలి అర్పించిన తర్వాత చేస్తారు. ఓ యాజకునికి తన జీవిత కాలంలో యీ ఆధిక్యత బహుశా, ఒకే ఒక్కసారి కలుగవచ్చు.
జెకర్యా తన కళ్ళను నమ్మలేకపోతున్నాడు. అదిగో యెహోవా దూత ధూపవేదికకు కుడివైపున నిలిచి ఉన్నాడు! వృద్ధుడైన యాజకుడు వ్యాకులపడి, భయకంపితుడౌతాడు. అయితే దూత యిలా అంటాడు: “జెకర్యా భయపడకుము; నీ ప్రార్థన వినబడినది, నీ భార్యయైన ఎలీసబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు.” అవును, ఎలీసబెతు, జెకర్యాల పట్టుదలతోకూడిన ప్రార్థనలను యెహోవా విన్నాడు.—లూకా 1:8-13.
దూత ఇంకా యిలా చెప్పాడు: “అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై, ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక, తన తల్లిగర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై” యుండును. యోహాను దేవుని పరిశుద్ధాత్మతో నిండినవాడై జీవితాంతం నాజీరుగా ఉంటాడు. దూత యింకా యిలా చెబుతున్నాడు: “ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానము ననుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలీయాయొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్లును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును; అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు.”—లూకా 1:14-17.
జెకర్యా యిలా అడుగుతాడు: “యిది నాకేలాగు తెలియును? నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడచినది.” దూత యిలా జవాబిస్తాడు: “నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును; నీతో మాటలాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. మరియు నా మాటలు వాటికాలమందు నెరవేరును నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై యుందువు.” జెకర్యా ఆలయం నుండి బయటకు వచ్చినప్పుడు, మాట్లాడలేకపోయాడు, అతడు ఏదో దివ్యమైన దృశ్యాన్ని చూశాడని అక్కడి ప్రజలు గ్రహించారు. సైగలు చేయడం, తన తలంపులను తెలపడానికి సంజ్ఞలను ఉపయోగించడమే ఆయన చేయగల్గింది. తన సేవ పూర్తయినప్పుడు, ఆయన తిరిగి యింటికి వెళ్తాడు.—లూకా 1:18-23.
సంతోషానికి కారణం
వాగ్దానం ప్రకారం, ఎలీసబెతుకు త్వరలోనే సంతోషించడానికి కారణం లభించింది. గొడ్రాలన్న నిందను తొలగిస్తూ, ఆమె గర్భవతి అవుతుంది. ఆమె బంధువైన మరియతో ఆ గబ్రియేలే యీ విధంగా చెప్పడం వల్ల ఆమె కూడా సంతోషిస్తుంది: “ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు; ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును.” మరియ “ప్రభువు దాసురాలు” అనే పాత్ర నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది.—లూకా 1:24-38.
యూదయ దేశములోని కొండ సీమలోనున్న ఒక పట్టణములోని జెకర్యా, ఎలీసబెతుల యింటికి మరియ వెంటనే వెళ్తుంది. మరియ వందన వచనము వినగానే ఎలీసబెతు గర్భములో ఉన్న శిశువు గంతులు వేస్తాడు. దేవుని పరిశుద్ధాత్మ ప్రభావంతో ఎలీసబెతు యీ విధంగా బిగ్గరగా అంటుంది: “స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును నా ప్రభువు తల్లి నాయొద్దకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించెను? ఇదిగో నీ శుభవచనము నా చెవినపడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు.” మరియ గొప్ప సంతోషంతో స్పందిస్తుంది. ఆమె ఎలీసబెతుతో మూడు నెలలు ఉంటుంది.—లూకా 1:39-56.
యోహాను పుట్టాడు
కొంతకాలానికి వృద్ధులైన జెకర్యా ఎలీసబెతులకు, కొడుకు పుట్టాడు. ఎనిమిదవ రోజున శిశువు సున్నతి పొందాడు. ఆ బాలునికి జెకర్యా అనే పేరు పెట్టాలని బంధువులు అనుకుంటారు, కాని ఎలీసబెతు యిలా అంటుంది: “ఆలాగు వద్దు; వానికి యోహానను పేరు పెట్టవలెను.” ఇప్పటికీ మాట్లాడలేని ఆమె భర్త అందుకు అంగీకరించాడా? ఆయన వ్రాత పలక మీద యిలా వ్రాశాడు: “వాని పేరు యోహాను.” తక్షణమే, జెకర్యా నాలుక సడలి, అతడు యెహోవాను స్తుతిస్తూ మాట్లాడనారంభిస్తాడు.—లూకా 1:57-66.
పరిశుద్ధాత్మతో నిండినవాడై, ఆనందభరితుడైన ఆ యాజకుడు ప్రవచిస్తాడు. జనములన్నియు నీ సంతానము వలన ఆశీర్వదించబడును అనే అబ్రాహాము నిబంధనకు అనుగుణంగా వాగ్దత్త విమోచకుడు, అంటే ‘దావీదు వంశములోని రక్షణ శృంగం’ అప్పటికే ఊపిరిపోసుకున్నాడని చెబుతాడు. (ఆదికాండము 22:15-18) మెస్సీయాకు ముందుగా వచ్చేవాడుగా, జెకర్యాకు అద్భుతంగా పుట్టిన అతని స్వంత కుమారుడు ‘ప్రజలకు రక్షణజ్ఞానమునిచ్చుటకు ప్రభువునకు ముందుగా నడుస్తాడు.’ సంవత్సరాలు గడుస్తుండగా, యోహాను ఎదిగి, ఆత్మయందు బలము పొందుతాడు.—లూకా 1:67-80.
సమృద్ధిగా ప్రతిఫలమివ్వబడింది
జెకర్యా, ఎలీసబెతుల విశ్వాసానికి, ఓర్పుకు మంచి మాదిరులుగా ఉన్నారు. దేవుని అనుగ్రహం కొరకు వేచివుండవలసివచ్చినప్పటికీ, వారు యెహోవాను నమ్మకంగా సేవించడంలో కొనసాగారు, వారు బహుకాలము గడిచిన వృద్ధులైనప్పుడే గొప్ప ఆశీర్వాదాలను పొందారు.
అయినా, ఎలీసబెతు, జెకర్యాలు ఎంతటి ఆశీర్వాదాలను అనుభవించారు! పరిశుద్ధాత్మ ప్రభావం వలన వారిద్దరూ ప్రవచించారు. మెస్సీయాకు ముందుగా నడిచే, బాప్తిస్మమిచ్చు యోహానుకు తల్లిదండ్రులు మరియు ఉపదేశకులు అయ్యే ఆధిక్యతను వారు పొందారు. అంతేకాక, దేవుడు వాళ్లని నీతిమంతులుగా ఎంచాడు. అలాగే, నేడు ఎవరైతే దైవిక మార్గాన్ని వెంబడిస్తారో వారు దేవునితో నీతియుక్తమైన స్థానాన్ని కలిగి ఉండగలరు, యెహోవా ఆజ్ఞల ప్రకారం నిందారహితులుగా నడవడంవల్ల ఆశీర్వాదకరమైన ఎన్నో ప్రతిఫలాలను పొందుతారు.