“వశము చేయబడిన వారు,” యెహోవా ఏర్పాటు
“అన్యులు నిలువబడి మీ మందలు మేపెదరు.”—యెషయా 61:5.
1. “దయచేయువాడు” అనుమాట యెహోవాను మన మనస్సులలోనికి ఎందుకు తేవచ్చును?
దేవుడెంత ఉదారముగా ఇచ్చువాడు! అపొస్తలుడైన పౌలు ఇట్లనెను: “[యెహోవా] అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు.” (అపొ. కార్యములు 17:25) దేవునినుండి పొందు అనేక ‘మంచి యీవులను మరియు సంపూర్ణమైన ప్రతి వరమును’ ధ్యానించుట మూలముగా మనలో ప్రతిఒక్కరము ప్రయోజనము పొందగలము.—యాకోబు 1:5, 17; కీర్తన 29:11; మత్తయి 7:7; 10:19; 13:12; 21:43.
2, 3. (ఎ) దేవుడిచ్చిన ఈవులకు మనమెట్లు ప్రతిస్పందించవలెను? (బి) ఏ భావములో లేవీయులు “వశము చేయబడిన” వారైయుండిరి?
2 యెహోవాకు తానెట్లు తిరిగి చెల్లించవలెనని కీర్తనల రచయిత మంచి కారణముతోనే ఆలోచించెను. (కీర్తన 116:12) మానవులు కలిగియున్న లేక ఇవ్వగల ఏదియు నిజానికి మన సృష్టికర్తకు అవసరము లేదు. (కీర్తన 50:10, 12) అయితే, ప్రజలు ప్రశంసతో సత్యారాధనయందు తమను సమర్పించుకొనుట తనను ప్రీతిపరచునని, యెహోవా సూచించుచున్నాడు. (హెబ్రీయులు 10:5-7 పోల్చుము.) మానవులందరు తమ సృష్టికర్తకు తమనుతాము సమర్పించుకొనవలెను. అప్పుడాయన అందుకు ప్రతిగా, ప్రాచీన లేవీయుల కిచ్చినట్లు, మరెన్నో ఆధిక్యతలను విస్తరింపజేయ వచ్చును. ఇశ్రాయేలీయులందరు దేవునికి సమర్పించుకొనిననూ, గుడారమందును మరియు ఆలయమందును బలులు అర్పించుటకు అహరోను కుటుంబీకులైన లేవీయులను ఆయన ఎన్నుకొనెను. మరి మిగిలిన లేవీయుల విషయమేమి?
3 యెహోవా మోషేకు ఇట్లు సెలవిచ్చెను: “లేవీ గోత్రికులను తీసికొని [రమ్ము] . . . వారు . . . గుడారముయొక్క ఉపకరణములన్నిటిని . . . కాపాడవలెను. కాగా నీవు లేవీయులను అహరోనుకును అతని కుమారులకును అప్పగింపవలెను . . . వారు ఇశ్రాయేలీయులలోనుండి అతని వశము చేయబడినవారు [హెబ్రీ, నెతునీమ్].” (సంఖ్యాకాండము 3:6, 8, 9, 41) గుడారమందలి సేవను నిర్వర్తించుటకు ఆ లేవీయులు అహరోను “వశము” చేయబడిరి, కావున దేవుడు ఇట్లు చెప్పగలిగెను: “ఇశ్రాయేలీయులలో వారు నా వశము చేయబడినవారు.” (సంఖ్యాకాండము 8:16, 19; 18:6) లేవీయులలో కొందరు చిన్నచిన్న పనులు చేయగా, ఇతరులు దేవుని నియమములను బోధించుటవంటి, విశిష్ఠమైన ఆధిక్యతలను పొందారు. (సంఖ్యాకాండము 1:50, 51; 1 దినవృత్తాంతములు 6:48; 23:3, 4, 24-32; 2 దినవృత్తాంతములు 35:3-5) మనమిప్పుడు “వశము చేయబడిన” వేరే ప్రజలు, వారి ఆధునిక సమాంతరము మీదికి దృష్టి మళ్లిద్దాము.
బబులోనునుండి ఇశ్రాయేలీయులు తిరిగివచ్చుట
4, 5. (ఎ) ఏ ఇశ్రాయేలీయులు బబులోను చెరనుండి తిరిగివచ్చిరి? (బి) ఆధునిక కాలములలో, ఇశ్రాయేలీయులు చెరనుండి తిరిగివచ్చుటకు ఏది సాదృశ్యముగా ఉన్నది?
4 గవర్నరయిన జెరుబ్బాబెలు నడిపింపు క్రింద, ఇశ్రాయేలీయుల శేషము సత్యారాధనను తిరిగి నెలకొల్పుటకు బబులోనునుండి తమ దేశమునకు ఎట్లు మరలివచ్చిరో ఎజ్రా మరియు నెహెమ్యా వివరించుచున్నారు. ఇలా తిరిగివచ్చినవారు మొత్తము 42,360 మందియని ఈ రెండు వృత్తాంతములు నివేదించుచున్నవి. వారిలో వేలాదిమంది “ఇశ్రాయేలీయులై” యుండిరి. తర్వాత ఆ నివేదికలు యాజకులనుగూర్చి తెల్పుచున్నవి. ఆ తర్వాత లేవీయుల గాయకులు, ద్వారపాలకులతో కూడిన, 350 మంది లేవీయుల ప్రస్తావన కలదు. తమ వంశావళిని నిరూపించుకొనలేని—బహుశః యాజకులుకూడా చేరియున్న—ఇశ్రాయేలీయులుగా అనిపించుచున్న వేలాదిమందిని గూర్చికూడ ఎజ్రా, నెహెమ్యాలు వ్రాయుచున్నారు.—ఎజ్రా 1:1, 2; 2:2-42, 59-64; నెహెమ్యా 7:7-45, 61-66.
5 చెరగా కొనిపోబడి, ఆ తర్వాత యెరూషలేము, యూదాలకు తిరిగివచ్చిన ఈ ఇశ్రాయేలీయుల శేషము దేవునియెడల అసాధారణమైన భక్తిని, సత్యారాధనకు లోతైన అంకితభావమును కనబరచిరి. గమనించబడినట్లుగానే, ఆధునిక కాలములలో, 1919లో మహాబబులోను చెరనుండి బయటకు వచ్చిన ఆత్మీయ ఇశ్రాయేలీయుల శేషమందు దీనికి సరియైన సాదృశ్యమును మనము చూచెదము.
6. మన కాలములో ఆత్మీయ ఇశ్రాయేలీయులను దేవుడు ఎట్లు వాడుకున్నాడు?
6 పందొమ్మిది వందల పందొమ్మిదిలో వారు విడుదల అయినప్పటినుండి, క్రీస్తు అభిషక్త సహోదరుల శేషము సత్యారాధనయందు ఆసక్తితో ముందుకుసాగిరి. “దేవుని ఇశ్రాయేలుగా” తయారగు 1,44,000 మందిలోని చివరి సభ్యులను సమకూర్చుటకు వారు చేసిన ప్రయత్నములను యెహోవా ఆశీర్వదించెను. (గలతీయులు 6:16; ప్రకటన 7:3, 4) ఒక గుంపుగా, ‘నమ్మకమును బుద్ధిమంతుడునగు’ దాసుని తరగతియైన అభిషక్త శేషము జీవమునిచ్చు ఆత్మీయాహారమును సమృద్ధిగా అందించుటకు ఉపయోగించబడుచున్నారు. ఈ ఆత్మీయాహారమును భూవ్యాప్తముగా పంచిపెట్టుటకు వారెంతో కష్టపడి పనిచేశారు.—మత్తయి 24:45-47.
7. సత్యారాధనలో అభిషక్తులతోపాటు ఎవరు సహవాసము చేయుచున్నారు?
7 ముందున్న శీర్షిక చూపించినట్లుగా, త్వరలో రానైయున్న మహాశ్రమలను దాటుకొనివత్తురని దేవుడనుగ్రహించిన నిరీక్షణగల లక్షలాదిమంది “వేరే గొఱ్ఱెలు” ప్రస్తుతము యెహోవా ప్రజలలో ఉన్నారు. ఆకలిదప్పులు, దుఃఖభరిత బాష్పబిందువులు ఉండని, భూమిపై వారు నిరంతరము యెహోవాను సేవించుటకు కోరుకొనుచున్నారు. (యోహాను 10:16; ప్రకటన 7:9-17; 21:3-5) అటువంటి వారికి సాదృశ్యముగా దేనినైననూ మనము బబులోనునుండి తిరిగివచ్చినవారి వృత్తాంతమందు కనుగొందుమా? అవును మనమట్లు కనుగొందుము!
ఇశ్రాయేలీయులు కానివారుకూడ తిరిగివచ్చుట
8. బబులోనునుండి తిరిగివచ్చిన ఇశ్రాయేలీయులతో ఎవరు కలిసివచ్చారు?
8 వాగ్దాన దేశమునకు తిరిగిరమ్మని బబులోనులోని యెహోవాను ప్రేమించువారికి పిలుపు ఇవ్వబడినప్పుడు, వేలాదిమంది ఇశ్రాయేలీయులు కానివారు దానికి ప్రతిస్పందించిరి. ఎజ్రా మరియు నెహెమ్యాలు వ్రాసిన వరుస క్రమములో, “నెతీనీయులు” (“వశము చేయబడినవారు” అని భావము) మరియు “సొలొమోను సేవకుల వంశస్థులను” గూర్చి మనము చదువుదుము. వీరందరి సంఖ్య ఎంతనగా 392. ఆ వృత్తాంతాలు 7,500లకు పైగావున్న ఇతరులనుగూర్చి కూడా ప్రస్తావించుచున్నవి. వారిలో ‘పనివారు, పనికత్తెలు,’ ఆలాగే లేవీయులు కాని ‘స్త్రీపురుష గాయకులును’ ఉండిరి. (ఎజ్రా 2:43-58, 65; నెహెమ్యా 7:46-60, 67) తిరిగివచ్చుటకు అంతమంది ఇశ్రాయేలీయులు కానివారిని కదిలించినదేమి?
9. చెరనుండి తిరిగి వచ్చుటలో దేవుని ఆత్మ ఎట్లు ఇమిడియుండెను?
9 “ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించెనో వారందరు . . . యెహోవా మందిరము కట్టుటకు ప్రయాణమైరి” అని ఎజ్రా 1:5 మాట్లాడుచున్నది. అవును, తిరిగివచ్చినవారందరిని యెహోవా కదిలించెను. వారి ఆత్మను, అనగా వారి బలమైన మనోభావమును ఆయన ప్రేరేపించెను. పరలోకమునుండి కూడా, దేవుడు తన చురుకైన శక్తియగు పరిశుద్ధాత్మచే దీనిని చేయగలడు. ఆ విధముగా, “యెహోవా మందిరము కట్టుటకు ప్రయాణమైన” వారందరికి “[దేవుని] ఆత్మ” సహాయము చేసెను.—జెకర్యా 4:1, 6; హగ్గయి 1:14.
ఆధునిక-దిన సమాంతరము
10, 11. బబులోనునుండి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులు కానివారి సంబంధముగా ఏ సమాంతరము చూపవచ్చును?
10 తిరిగివచ్చిన అటువంటి ఇశ్రాయేలీయులు కానివారు ఎవరికి ఛాయారూపముగా ఉన్నారు? ‘నెతీనీయులు ఈనాడు “వేరే గొఱ్ఱెలకు” సాదృశ్యముగా ఉన్నారని’ అనేకమంది క్రైస్తవులు, ప్రత్యుత్తర మివ్వవచ్చును. నిజమే, అయితే కేవలము నెతీనీయులే కాదు; తిరిగివచ్చిన ఇశ్రాయేలీయులు కానివారందరు ఆత్మీయ ఇశ్రాయేలీయులు కాని ఈనాటి క్రైస్తవులను సూచించుచున్నారు.
11 యు మే సర్‌వైవ్ అర్మగెద్దోన్ ఇన్‌టు గాడ్స్ న్యూ వరల్డ్a అను పుస్తకము ఇలా వ్యాఖ్యానించినది: “గవర్నరయిన జెరుబ్బాబెలుతో బబులోనును విడిచివచ్చిన వారు కేవలము 42,360 మంది ఇశ్రాయేలీయుల శేషము మాత్రమే కాదు . . . అక్కడ వేలాదిమంది ఇశ్రాయేలీయులు కానివారును కలరు . . . నెతీనీయులతోపాటు అక్కడ ఇతర ఇశ్రాయేలీయులు కానివారు, దాసులు, వృత్తిరీత్యా గాయకులుగాయున్న స్త్రీపురుషులు, రాజైన సొలొమోను సేవకుల వంశస్థులును ఉండిరి.” ఆ పుస్తకము వివరించినదేమనగా, “ఆ నెతీనీయులు, దాసులు, గాయకులు, సొలొమోను సేవకుల వంశస్థులు, ఇశ్రాయేలీయులు కానివారందరు, చెరగానున్న ఆ దేశమును వదలి ఇశ్రాయేలీయుల శేషముతో తిరిగివచ్చిరి . . . కావున ఆత్మీయ ఇశ్రాయేలీయులు కాని విభిన్న జాతుల ప్రజలు ఈనాడు ఆత్మీయ ఇశ్రాయేలీయుల శేషముతో సహవసించి వారితోకూడ యెహోవా దేవుని ఆరాధనను ప్రోత్సహింతురని తలంచుట సరియేనా? అవును, అది సరియైనదే.” అటువంటి వారు ‘సాదృశ్యముగా ఆధునిక-దిన నెతీనీయులుగా, గాయకులుగా, సొలొమోను సేవకుల వంశస్థులుగా తయారైరి.’
12. ఆత్మీయ ఇశ్రాయేలీయుల కొరకు దేవుడు ఏ ప్రత్యేక రీతిలో తన ఆత్మను ఉపయోగించును, అయితే తన సత్యారాధికులందరికి అది అందుబాటులో కలదని మనమెందుకు నిశ్చయత కలిగియుండగలము?
12 ప్రాచీనకాల మాదిరివలెనే, భూమిపై జీవించుటకు నిరీక్షించుచున్న వారికికూడ దేవుడు తన ఆత్మను అనుగ్రహించుచున్నాడు. నిజమే వారు తిరిగి జన్మించలేదు. 1,44,000 మందిలో ప్రతిఒక్కరు కేవలము ఒక్కసారి మాత్రమే దేవుని ఆత్మీయ కుమారులుగా జన్మించి, పరిశుద్ధాత్మతో అభిషేకించబడు అనుభవమును కలిగియున్నారు. (యోహాను 3:3-5; రోమీయులు 8:16; ఎఫెసీయులు 1:13, 14) ఆ విధముగా అభిషేకించుట, చిన్నమంద పక్షముగా దేవుని ఆత్మను ఉన్నతముగా వ్యక్తముచేయుటే. అయితే ఆయన చిత్తమును నెరవేర్చుటకు కూడా దేవుని ఆత్మ అవసరము. కావున, యేసు ఇట్లనెను: ‘పరలోకమందున్న తండ్రి తనను అడుగువారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించును.’ (లూకా 11:13) అడుగు వ్యక్తి పరలోక నిరీక్షణ గలవాడైననూ లేక వేరేగొర్రెలలోని వాడైననూ, ఆయన చిత్తమును నెరవేర్చుటకు యెహోవా ఆత్మ సమృద్ధిగా అందుబాటులో ఉన్నది.
13. దేవుని సేవకులందరిమీద ఆత్మ ఎట్లు పనిచేయగలదు?
13 యెరూషలేముకు తిరిగివచ్చుటకు దేవుని ఆత్మ అటు ఇశ్రాయేలీయులను ఇటు ఇశ్రాయేలీయులు కానివారిని కదిలించెను, మరియు అది ఈనాడు ఆయన యథార్థ ప్రజలందరిని బలపరచి, వారికి సహాయము చేయుచున్నది. దేవుడనుగ్రహించిన నిరీక్షణనుబట్టి ఒక క్రైస్తవుని జీవితము పరలోక సంబంధమైననూ లేక భూసంబంధమైననూ, అతడు సువార్తను ప్రకటించవలెను, కాగా ఆ పనిలో నమ్మకముగా ఉండుటకు పరిశుద్ధాత్మ అతనిని బలపరచును. మన నిరీక్షణ ఏదైనను, మనలో ప్రతిఒక్కరము ఆత్మ ఫలములను పెంపొందించుకొనవలెను. అవి మనందరికి సంపూర్ణముగా అవసరము.—గలతీయులు 5:22-26.
ప్రత్యేక సేవకొరకు వశముచేయబడిరి
14, 15. (ఎ) తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులు కానివారి మధ్య, ఏ రెండు గుంపులు ప్రత్యేకింపబడెను? (బి) నెతీనీయులు ఎవరు, వారేమి చేసిరి?
14 తిరిగివచ్చుటకు ఆత్మ ప్రేరేపించిన వేలాదిమంది ఇశ్రాయేలీయులు కానివారిలో దేవుని వాక్యము ప్రత్యేకించి చెప్పుచున్న రెండు చిన్న గుంపులు కలవు. వారు నెతీనీయులు మరియు సొలొమోను సేవకుల వంశస్థులై యున్నారు. వారెవరు? వారేమి చేసిరి? ఈనాడు అది ఏ భావము నివ్వవచ్చును?
15 నెతీనీయులు ఇశ్రాయేలీయులు కానివారి వంశస్థులనుండి వచ్చిన గుంపువారై, వారు లేవీయులతో పరిచర్యచేయు ఆధిక్యతను పొందారు. కనానునుండి వచ్చి “సమాజము కొరకును యెహోవా . . . బలిపీఠము కొరకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను” నియమింపబడిన గిబియోనీయులను గుర్తు తెచ్చుకొనుము. (యెహోషువ 9:27) బహుశః వారి వంశస్థులలో కొందరు బబులోనునుండి తిరిగివచ్చుచున్న నెతీనీయులలో ఉండవచ్చును, ఆలాగే దావీదు పరిపాలనలో మరియు ఇతర కాలములలో నెతీనీయులుగా చేర్చబడిన ఇతరులైకూడ ఉండవచ్చును. (ఎజ్రా 8:20) నెతీనీయులు ఏమిచేసిరి? యాజకులకు సహాయము చేయుటకు లేవీయులు ఇవ్వబడగా, ఆ తర్వాత లేవీయులకు సహాయము చేయుటకు నెతీనీయులు ఇవ్వబడిరి. సున్నతిపొందిన పరదేశులకు సహితము, ఇది ఆధిక్యతయై యుండెను.
16. కొంత కాలమునకు నెతీనీయుల పాత్ర ఎట్లు మారెను?
16 ఆ గుంపు బబులోనునుండి తిరిగివచ్చినప్పుడు, వారిలో యాజకులకు లేక నెతీనీయులకు, “సొలొమోను సేవకుల వంశస్థులకు” పోల్చినప్పుడు లేవీయులు కొద్దిమందే ఉండిరి. (ఎజ్రా 8:15-20) డా. జేమ్స్ హేస్టింగ్స్ రచించిన డిక్షనరీ ఆఫ్ ది బైబిల్, ఇలా వ్యాఖ్యానించెను: “కొంతకాలమైన పిదప [నెతీనీయులు] పవిత్ర అధికారిక తరగతిగా ఎంత సంపూర్ణముగా స్థిరపడిరంటే, వారికి ఆధిక్యతలు ఇవ్వబడుటను మనము కనుగొందుము.” ప్రబోధాత్మకమైన పత్రికయగు వీటస్ టెస్టమెన్‌టమ్ వ్రాయునదేమనగా, “ఒక మార్పు జరిగింది. చెరనుండి తిరిగివచ్చిన తరువాత, వీరు [పరదేశులు] ఇక ఎంతమాత్రము దేవాలయపు దాసులుగా కాదుగాని, దేవాలయములో నియమించబడిన ఇతర సభ్యులకు పోలిన హోదాను అనుభవించు పరిచారకులుగా ఎంచబడిరి.”—“మారిన స్థాయి” అను బాక్సును చూడుము.
17. నెతీనీయులు ఎందుకు ఎక్కువ పనిని పొందారు, దీనికొరకు ఏ బైబిలు నిదర్శనము కలదు?
17 కానీ, నెతీనీయులు యాజకులకు, లేవీయులకు సరిసమానులు కాలేదు. ఆ యాజకులు, లేవీయులు ఇశ్రాయేలీయులైయుండి యెహోవాచే ఎన్నుకొనబడిరి మరియు ఇశ్రాయేలీయులు కానివారిని వీరి స్థానములలో భర్తీచేయుటకు వీలులేదు. అయినను, లేవీయుల సంఖ్య తగ్గినప్పుడు, దేవునిసేవ మరియెక్కువగా చేయుటకు నెతీనీయులకు పని అప్పగింపబడినదని తెల్పు బైబిలు సూచనలు కలవు. వారికి ఆలయమునకు సమీపములోనే నివాస గృహములు ఇవ్వబడెను. నెహెమ్యా దినములలో వారు ఆలయమునకు సమీపమునగల ప్రాకారములకు మరమ్మత్తు చేయుటలో యాజకులతో కలిసి పనిచేసిరి. (నెహెమ్యా 3:22-26) ఆలయపు సేవ కారణముగా పన్ను చెల్లించుటనుండి లేవీయులు మినహాయింపబడినట్లే, నెతీనీయులును పన్నుల విషయములో మినహాయింపబడవలెనని పారశీక రాజు శాసనము చేసెను. (ఎజ్రా 7:24) “వశము చేయబడిన” వీరు (లేవీయులు, నెతీనీయులు) ఆత్మీయ విషయములతో ఎంత దగ్గర సంబంధమును కలిగియుండిరో మరియు లేవీయులవలె వారు ఎన్నడునూ లెక్కింపబడక పోయినను, అవసరమునుబట్టి నెతీనీయులకు అప్పగింపబడిన పనులు ఎట్లు పెరిగెనో ఇది సూచించుచున్నది. తిరిగివచ్చుటకు ఆ తర్వాత ఎజ్రా చెరకొనిపోబడిన వారిని పోగుచేసినప్పుడు, తొలుత లేవీయులు ఎవరును వారిలో లేకుండెను. కావున కొందరినైనా పోగుచేయవలెనని ఆయన తన ప్రయత్నములను తీవ్రతరము చేసెను. తత్ఫలితముగా “[మన] దేవుని మందిరమునకు పరిచారకులుగా” సేవచేయుటకు 38 మంది లేవీయులు 220 మంది నెతీనీయులు తిరిగివచ్చిరి.—ఎజ్రా 8:15-20.
18. సొలొమోను సేవకుల వంశస్థులు ఏ పనిని నిర్వర్తించి యుండవచ్చును?
18 ప్రత్యేకింపబడిన ఇశ్రాయేలీయులు కాని రెండవ గుంపు సొలొమోను సేవకుల వంశస్థులై యుండిరి. వారినిగూర్చి బైబిలు కొద్ది వివరాలనే అందజేయుచున్నది. వారిలో కొందరు “సోపెరెతు వంశస్థులు.” ఎజ్రా దానిని హాసోపెరెతు అని వ్రాయుచు, ఆ పేరుకు ఒక నిర్దిష్ట ఉపపదమును చేర్చుచున్నాడు. దానికి “శాస్త్రి” అని భావము. (ఎజ్రా 2:55; నెహెమ్యా 7:57) ఆ విధముగా, బహుశః ఆలయ/నిర్వాహక శాస్త్రులుగా, వారు శాస్త్రులు లేక నకలువ్రాయు సిబ్బందిగా ఉండవచ్చును. వారు విదేశీయులైననూ, సొలొమోను సేవకుల వంశస్థులు బబులోనును విడిచి యెహోవా ఆరాధనను పునరుద్ధరించుటలో భాగము వహించుటకు తిరిగివచ్చుట ద్వారా ఆయనయెడల తమ భక్తిని నిరూపించుకొనిరి.
ఈనాడు మనలను మనము సమర్పించుకొనుట
19. ఈనాటి అభిషక్తులు మరియు వేరేగొర్రెల మధ్య ఏ సంబంధము కలదు?
19 పవిత్రారాధనలో నాయకత్వం వహించుటకును, సువార్తను ప్రకటించుటకు, దేవుడు మన కాలములో అభిషక్త శేషమును బలముగా ఉపయోగించెను. (మార్కు 13:10) వేరే గొర్రెలవారు వేలమంది, ఆ తర్వాత లక్షలాదిమంది ఆరాధనయందు తమతో పాల్గొనుటను చూచి వీరెంతగా ఆనందించిరో! ఆలాగే శేషించినవారికి, వేరే గొర్రెలకు మధ్య ఎంత ఆనందకరమైన సహకారము ఉన్నది!—యోహాను 10:16.
20. నెతీనీయులు, సొలొమోను సేవకుల వంశస్థులకు సమాంతరముగానున్న విషయమై ఏ నూతన అవగాహన సహేతుకమై యున్నది?
20 ప్రాచీన బబులోను చెరనుండి తిరిగివచ్చిన ఇశ్రాయేలీయులు కానివారందరు, ప్రస్తుతము ఆత్మీయ ఇశ్రాయేలీయుల శేషముతో సేవించుచున్న వేరేగొర్రెలకు సమాంతరముగా ఉన్నారు. మరి బైబిలు నెతీనీయులను, సొలొమోను సేవకుల వంశస్థులను ప్రత్యేకించి చెప్పుచున్నదాని విషయమేమి? ఈ వృత్తాంతములో నెతీనీయులు, సొలొమోను సేవకుల వంశస్థులు తిరిగివచ్చిన ఇశ్రాయేలీయులు కాని వారికంటే మిన్నగా ఆధిక్యతలు ఇవ్వబడిరి. పరిణతిచెందిన, ఇష్టపూర్వముగా వచ్చిన కొంతమంది వేరేగొర్రెల వారికి దేవుడు ఈనాడు ఆధిక్యతలను, అదనంగా విధులను విస్తరింపజేయుటకు ఇది ఒక చక్కని ఛాయారూపముగా ఉండగలదు.
21. భూనిరీక్షణగల కొంతమంది సహోదరులు ఎట్లు అదనపు విధులను, ఆధిక్యతలను పొందారు?
21 నెతీనీయులకు అదనంగా ఇవ్వబడిన ఆధిక్యతలు సూటిగా ఆత్మీయ కార్యములకు సంబంధము కలిగియుండెను. సొలొమోను సేవకుల వంశస్థులు పరిపాలక బాధ్యతలు పొందినట్లుగా కన్పించుచున్నది. అదే ప్రకారము ఈనాడు, వారి అవసరతల యెడల శ్రద్ధచూపుటకు, యెహోవా ‘మనుష్యులకు ఈవులనిచ్చి’ తన ప్రజలను ఆశీర్వదించెను. (ఎఫెసీయులు 4:8, 11, 12) ఈ ఏర్పాటునందు, వందలాదిమంది పరిణతిచెందిన, అనుభవముగల సహోదరులు చేరియున్నారు. ప్రాంతీయ కాపరులుగా, జిల్లాకాపరులుగా మరియు వాచ్‌టవర్ సొసైటియొక్క 98 బ్రాంచికార్యాలయముల బ్రాంచి కమిటీలలో సేవచేయుచు, వీరు ‘మందలను కాయుటలో’ భాగము వహించుచున్నారు. (యెషయా 61:5) సొసైటియొక్క ప్రపంచ కేంద్రకార్యాలయములో “నమ్మకమైన గృహనిర్వాహకుడు” అతని పరిపాలక సభయొక్క నడిపింపుక్రింద, సామర్థ్యముగల పురుషులు ఆత్మీయాహారమును సిద్ధముచేయుటలో సహాయము చేయుటకు శిక్షణ పొందుచున్నారు. (లూకా 12:42) బేతెలు గృహములను, కర్మాగారములను నిర్వహించుటకు మరియు క్రొత్త బ్రాంచి వసతులను, క్రైస్తవ ఆరాధన కొరకు మందిరాలను నిర్మించుటలో ప్రపంచవ్యాప్త కార్యక్రమములను పర్యవేక్షించుటకు ఇతర దీర్ఘకాల సమర్పిత స్వచ్ఛంద సేవకులు శిక్షణ ఇవ్వబడిరి. రాజులైన యాజకుల భాగముగా తయారగు అభిషక్త శేషమునకు సన్నిహిత సహాయకులుగా సేవచేయుటలో వారు ఉన్నతస్థాయికి చేరుకున్నారు.—1 కొరింథీయులు 4:17; 14:40; 1 పేతురు 2:9 పోల్చుము.
22. వేరేగొర్రెలలోని కొందరికి ఇప్పుడు బరువైన బాధ్యతలు ఇవ్వబడుట ఎందుకు సరియైయున్నది, మరియు మనము దీని విషయమై ఎట్లు ప్రతిస్పందించవలెను?
22 ప్రాచీన కాలములలో, యాజకులు, లేవీయులు యూదుల మధ్య సేవచేశారు. (యోహాను 1:19) అయితే ఈనాడు, భూమిమీది ఆత్మీయ ఇశ్రాయేలీయుల శేషము అంతకంతకు తక్కువ కావలెను. (యోహాను 3:30 తేడాచూడుము.) చివరకు, మహా బబులోను నాశనమైన తరువాత, ‘ముద్రింపబడిన’ 1,44,000 మంది గొర్రెపిల్ల వివాహమునకు పరలోకములో ఉందురు. (ప్రకటన 7:1-3; 19:1-8) అయితే ఇప్పుడు వేరే గొర్రెలు అంతకంతకు పెరుగవలెను. నెతీనీయులకు, సొలొమోను సేవకుల వంశస్థులకు పోలికగాయున్న వారిలోని కొందరికి, అభిషక్తుల శేషముయొక్క పర్యవేక్షణలో బరువైన బాధ్యతలు ఇవ్వబడుచున్నవను వాస్తవము వారు అహంకారులగుటకు లేక స్వయం-ప్రాముఖ్యతను భావించునట్లు చేయదు. (రోమీయులు 12:3) దేవుని ప్రజలు “మహాశ్రమలనుండి” వచ్చునప్పుడు, వేరే గొర్రెలమధ్య నాయకత్వము వహించుటకు సిద్ధముచేయబడిన అనుభవజ్ఞులైన పురుషులు, అనగా—“అధికారులు”—ఉందురని ఇది మనకు నమ్మకము నిచ్చుచున్నది.—ప్రకటన 7:14; యెషయా 32:1; వీటితో అపొ. కార్యములు 6:2-7ను పోల్చుము.
23. దేవుని సేవ విషయములో మనమందరము అంకితభావాన్ని ఎందుకు పెంపొందించుకొనవలెను?
23 బబులోనునుండి తిరిగివచ్చిన వారందరు కష్టించి పనిచేయుటకు మరియు యెహోవా ఆరాధన తమ మనస్సులలో మరియు హృదయములో అతి ఉన్నతముగా నున్నదని నిరూపించుటకు ఇచ్ఛయించుకొని యుండిరి. ఈనాడును విషయమట్లే ఉన్నది. అభిషక్తుల శేషముతో కలిసి, “అన్యులు నిలువబడి . . . మందలను మేపెదరు.” (యెషయా 61:5) కావున దేవుడనుగ్రహించిన ఏ నిరీక్షణను మనము కలిగియున్నను, హార్‌మెగిద్దోనులో యెహోవా మహిమపరచబడు దినమునకు ముందు ఆత్మచే నియమించబడిన పెద్దలకు ఏ ఆధిక్యతలు విస్తరింపజేయబడినను, మనమందరము నిస్వార్థమైన, పరిపూర్ణమైన, అంకితభావాన్ని పెంపొందించుకుందము గాక. యెహోవా అనుగ్రహించిన మహాగొప్ప ప్రయోజనములన్నింటి కొరకు మనమేదియు ఎన్నటికిని తిరిగి ఆయనకు చెల్లించలేకపోయినను, ఆయన సంస్థలో మనమేది చేసినను దానియందు పూర్ణాత్మ గలవారమై యుందము గాక. (కీర్తన 116:12-14; కొలొస్సయులు 3:23) ఆ విధముగా, వేరే గొర్రెలలోని ఇతరులు ‘భూలోకమందు రాజులుగా ఏలుటకు’ నిర్దేశింపబడిన అభిషక్తులతో కలిసి సన్నిహితముగా సేవచేయుచుండగా, మనమందరము సత్యారాధన కొరకు మనలను అర్పించుకొనగలము.—ప్రకటన 5:9, 10. (w92 4/15)
[అధస్సూచీలు]
a పుటలు 142-8; ఇది వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి ఆఫ్ న్యూయార్క్ Inc. వారిచే ప్రచురింపబడినది.
గుర్తుంచుకొనవలసిన అంశములు
◻ ప్రాచీన ఇశ్రాయేలీయులలో ఏ విధముగా లేవీయులు “వశము చేయబడిన” వారైరి?
◻ ఇశ్రాయేలీయులు కాని ఎవరు చెరనుండి తిరిగివచ్చిరి, వారు ఎవరికి ఛాయారూపముగా ఉన్నారు?
◻ నెతీనీయుల సంబంధముగా ఏ మార్పు జరిగినట్లు కన్పించుచున్నది?
◻ నెతీనీయులు, సొలొమోను సేవకుల వంశస్థుల సంబంధముగా, ఇప్పుడు ఏ సమాంతరము సరియైయున్నది?
◻ అభిషక్తులు మరియు వేరేగొర్రెల మధ్య సహకారముద్వారా ఏ నమ్మకము ఉద్భవించినది?
[28వ పేజీలోని బాక్సు]
మారిన స్థాయి
చెరనుండి తిరిగివచ్చిన ఇశ్రాయేలీయులు కానివారు కొందరు అనుభవించిన మార్పులనుగూర్చి అనేక బైబిలు పదకోశాలు మరియు సర్వసంగ్రహ నిఘంటువులు వ్యాఖ్యానించుచున్నవి. ఉదాహరణకు, “ఛేంజ్ ఇన్ దెయిర్ పోజిషన్” అను శీర్షికనామము క్రింద ఎన్‌సైక్లోపీడియా బిబ్లికా ఇట్లు చెప్పుచున్నది: “ముందే సూచించినట్లుగా, వారి సామాజిక స్థితి, అవసరమునుబట్టి ఉన్నతి చేయబడెను. [నెతీనీయులు] ఆ పదముయొక్క నిష్కర్ష భావమందు వారు ఎంతమాత్రము దాసులుగా ఉండలేదు.” (సంపాదకులు, చాన్ మరియు బ్లాక్, సంపుటి 3, పుట 3399) ది సైక్లోపీడియా ఆఫ్ బిబ్లికల్ లిటరేచర్ నందు, జాన్ కిటో ఇలా వ్రాయుచున్నాడు: “పాలస్తీనాయందు వీరిలో [నెతీనీయులు] అనేకులు ఈ దీనస్థాయికి మరలా వత్తురని ఎదురుచూడనిదై యుండెను . . . అలా ఈ వ్యక్తులు కనబరచిన స్వచ్ఛంద అంకితభావము నెతీనీయుల స్థాయిని గణనీయముగా పెంచెను.” (సంపుటి 2, పుట 417) ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బైబిల్ ఎన్‌సైక్లోపీడియా ఇలా సూచించుచున్నది: “ఈ సహవాసము మరియు సొలొమోను కాలమునాటి వారి పూర్వచరిత్ర వెలుగులో, రెండవసారి కట్టిన ఆలయములో సొలొమోను సేవకులు ప్రాముఖ్యమైన బాధ్యతలను కలిగియుండిరని ఊహించి చెప్పవచ్చును.”—సంపాదకుడు జి. డబ్ల్యు. బ్రామిలే, సంపుటి 4, పుట 570.
[29వ పేజీలోని చిత్రాలు]
యెరూషలేమును పునర్నిర్మించుటకు ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చినప్పుడు, వేలాదిమంది ఇశ్రాయేలీయులు కానివారు వారిని వెంబడించిరి
[క్రెడిట్ లైను]
Pictorial Archive (Near Eastern History) Est.
[31వ పేజీలోని చిత్రాలు]
కొరియా బ్రాంచి కమిటీ. ప్రాచీన నెతీనీయుల వలెనే, వేరేగొర్రెలలోని పురుషులు ఈనాడు సత్యారాధనలో బరువైన బాధ్యతలను కలిగియున్నారు