1914 ప్రపంచమును దిగ్భ్రాంతి పరచిన సంవత్సరము
“పందొమ్మిది వందల పధ్నాలుగు నుండి పద్దెనిమిది వరకు జరిగిన ఆ మహాసంగ్రామము, మనకాలమును ఆ కాలమును వేరుచేయుచు దహన భూమిలో కనబడు మార్గమువలె వున్నది. అనేక ప్రాణాలను బలిగొనుటలో, . . . నమ్మకాలను వమ్ముచేయుటలో, తలంపులను మార్చుటలో, నిరాశానిస్పృహల మాన్పలేని గాయాలను మిగుల్చుటలో అది రెండు శకాలమధ్య భౌతిక, మానసిక అగాధాన్ని సృష్టించింది.”—బార్బరా టెక్‌మెన్ వ్రాసిన, ది ప్రౌడ్ టవర్—ఎ పోర్ట్రెయిట్ ఆఫ్ ది వరల్డ్ బిఫోర్ ది వార్ 1890-1914.
“అదింకా—సంపూర్ణ చరిత్ర కాకపోయిననూ—దాదాపు చరిత్రలో ఒక భాగమే, ఎందుకనగా విశేషమైన ఈ ఇరవయ్యో శతాబ్దపు ప్రారంభమందు యౌవనస్థులుగా వున్న వేలాదిమంది ప్రజలు ఇంకా జీవించేయున్నారు.”—లిన్ మెక్ డొనాల్డ్ వ్రాసిన 1914 అను పుస్తకంనుండి, ఇది 1987లో ప్రచురింపబడెను.
ఆ 1914వ సంవత్సరమంటే ఎందుకంత ఆసక్తి? దానికి ‘గతం కాదు భవితవ్యమే నాకు ప్రాముఖ్యమని’ బహుశః మీరనవచ్చును. భూవ్యాప్త కలుషితము, కుటుంబ జీవితము చిన్నాభిన్నమగుట, నేరాలు పెరిగిపోవుట, మానసిక రుగ్మత, నిరుద్యోగమువంటి సమస్యలతో మానవుని భవిష్యత్తు అగమ్యగోచరంగా కన్పించవచ్చు. అయితే, 1914యొక్క ప్రాముఖ్యతను పరిశీలించిన అనేకులు, మరిశ్రేష్ఠమైన భవిష్యత్తు కొరకు ఒక నిరీక్షణను కనుగొన్నారు.
“వేదనలకు ప్రారంభము” అని పిలువబడిన దానిని మానవజాతి 1914లో అనుభవించెనని కావలికోట దశాబ్దాలుగా వివరించెను. ఆ మాటలు, మానవుని దుష్ట విధానాంతమునకు ముందు జరుగునని యేసుక్రీస్తు చెప్పిన గొప్ప ప్రవచనములో ఒక భాగమైయున్నవి.—మత్తయి 24:7, 8.
పందొమ్మిదివందల పధ్నాలుగులో నాటకీయముగా జరిగిన ఆ సంఘటనలను, మానవజాతిలోని కొద్ది శాతము మంది ప్రజలు నేటికీ ఇంకనూ గుర్తుతెచ్చుకొనగలరు. నాశనము కాకుండా దేవుడు భూమిని రక్షించుటకు ముందే ఆ వృద్ధ తరము గతించిపోవునా? బైబిలు ప్రవచనము ప్రకారము వారట్లు గతింపరు. “మీరీ సంగతులన్నియు జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే యున్నాడని తెలిసికొనుడి. ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని” యేసు వాగ్దానము చేసెను.—మత్తయి 24:33, 34.
పందొమ్మిదివందల పధ్నాలుగవ సంవత్సరము ఎందుకంత చారిత్రక ప్రాముఖ్యతను కలిగియున్నదో గుణగ్రహించుటకు, 1914 మధ్యకాలము వరకున్న ప్రపంచ పరిస్థితిని ఒకసారి ఆలోచించుము. ఆ కాలానికి ముందు, రష్యాయొక్క త్సారు నికొలస్, జర్మనీయొక్క కైసర్ విల్‌హెల్మ్ వంటి సామ్రాట్టులు, ఆస్ట్రియా-హంగేరి చక్రవర్తియగు ఫ్రాంట్స్ యోజెఫ్ వంటివారు గొప్ప అధికారము చెలాయించిరి. వీరిలో ప్రతిఒక్కరు నలభైలక్షలకంటే ఎక్కువ మందిని సమీకరించి వారిని యుద్ధరంగానికి పంపించగల్గిన వారే. అయితే, ఒక గొప్ప “క్రైస్తవ జనాంగము” యొక్క వివిధ భాగాల పరిపాలనను దేవుడు వారికి అప్పగించెనని ప్రకటించుచు, వారి మూలపురుషులు పరిశుద్ధ మైత్రి అని పిలువబడిన దానిపై సంతకాలు చేసిరి.
ది ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారము, ఈ దస్తావేజు “19వ శతాబ్ద కాలమందు ఐరోపా దౌత్యవిధానముపై ఒక శక్తివంతమైన ప్రభావమును చూపెను.” ప్రజాస్వామ్య ఉద్యమాలను వ్యతిరేకించుటకు, రాజులకివ్వబడిన దైవిక హక్కు అని పిలువబడిన దానిని సమర్థించుటకు అది ఉపయోగింపబడెను. “క్రైస్తవ రాజులమైన మనము, పరలోకమునుండి మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధ విధిని కలిగియున్నాము, అదేమనగా [రాజుల దైవికహక్కు] అను సూత్రమును సమర్థించుటే” అని కైసర్ విల్‌హెల్మ్, త్సారు నికొలస్‌కు వ్రాసెను. అంటే ఐరోపా రాజులు ఏదో విధంగా దేవుని రాజ్యముతో సంబంధము కలిగియున్నారని దీని భావమా? (1 కొరింథీయులు 4:8 పోల్చుము.) ఆ రాజులను బలపరచిన చర్చీల విషయమేమి? క్రైస్తవులమని వారు చెప్పుకొనుట శుద్ధమైనదేనా? ఈ ప్రశ్నలకు సమాధానములు 1914 తర్వాతి సంవత్సరములలో స్పష్టమాయెను.
అకస్మాత్తుగా, ఆగష్టులో
“ఐరోపా 1914 వసంతకాలం, వేసవికాలంలో అసాధారణమైన నెమ్మది ననుభవించెనని” బ్రిటీషు రాజనీతిజ్ఞుడైన విన్‌స్టంట్ చర్చిల్ వ్రాసెను. ప్రజలు భవిష్యత్తునుగూర్చి సాధారణ ఆశాభావాన్నే కలిగియుండిరి. “1914లో ప్రపంచము పూర్తిగా నిరీక్షణతో, ఆశచూపునదిగా ఉండెనని” లూయిస్ సిండర్ తన పుస్తకమగు వరల్డ్ వార్ Iలో వ్రాసెను.
నిజమే, అనేక సంవత్సరాలు జర్మనీ, బ్రిటనుల మధ్య బద్ధవైరుధ్యము ఉండెను. అయినప్పటికిని, చరిత్రకారుడైన జి. పి. గూచ్ తన పుస్తకమగు అండర్ సిక్స్ రీయిన్స్‌లో, “ఐరోపా సంఘర్షణ 1911, 1912, లేక 1913లో కంటే 1914లో తక్కువగా కన్పించింది . . . గత సంవత్సరాలలోకంటె ప్రభుత్వాలమధ్య సంబంధబాంధవ్యాలు మెరుగ్గావుండెనని” వ్రాసెను. 1914లో బ్రిటన్ మంత్రివర్గ సభ్యుడైన, విన్‌స్టన్ చర్చిల్ ఇట్లనెను: “సమాధానము కలిగియుండుటకు, జర్మనీ మావంటి మనస్సునే కలిగియున్నట్లు కన్పించుచున్నది.”
అయితే, 1914 జూన్ 28న ఆస్ట్రియా-హంగేరి సామ్రాజ్యపు యువరాజైన సారాజివో హత్యతో ప్రపంచ అవధిపై కారు మేఘాలు క్రమ్మాయి. ఒకనెల తర్వాత, చక్రవర్తియగు ఫ్రాంట్స్ యోజెఫ్ సెర్బియాపై యుద్ధము ప్రకటించి, ఆ రాజ్యముపై దాడిచేయుమని తన సైనిక దళాలకు ఆజ్ఞాపించెను. అదే సమయములో, 1914 ఆగష్టు 3వ తేదీ రాత్రి కైసర్ విల్‌హెల్మ్ ఆజ్ఞమేరకు పెద్ద జర్మనీ సైన్యము అకస్మాత్తుగా బెల్జియం రాజ్యంపై దాడిచేసి ఫ్రాన్సువైపు తమ యుద్ధాన్ని కొనసాగించినవి. ఆ మరుసటి దినమే బ్రిటను జర్మనీపై యుద్ధాన్ని ప్రకటించింది. ఇక త్సారు నికొలస్, జర్మనీతో, ఆస్ట్రియా-హంగేరితో యుద్ధం చేయడానికి బహువిస్తారమైన రష్యా సైన్యాల సమీకరణకు ఆజ్ఞాపించెను. పరస్పర సంహారముతో ఐరోపా రాజులు ఆ ఖండమును రక్తముతో నింపకుండా ఆపుటలో పరిశుద్ధ మైత్రి విఫలమాయెను. కాని ఇంకా పెద్దవైన దిగ్భ్రాంతికర సంఘటనలు జరుగనై యుండెను.
క్రిస్మస్‌తో ముగిసెనా?
యుద్ధము జరుగుట ప్రజల ఆశాభావాన్ని అణగార్చలేదు. అది ఒక శ్రేష్ఠమైన ప్రపంచాన్ని ఉత్పన్నము చేయునని అనేకులు నమ్మిరి, కాగా ఐరోపా అంతటా దానికి తమ మద్దతును తెలియజేస్తూ పెద్ద జనసందోహములు సమకూడెను. “1914లో కేవలము సైనిక విధానమును మినహాయించి, ఎవరునూ యుద్ధ ప్రమాదములను అంత గంభీరముగా పట్టించుకోలేదు. . . . ఒక సామాజిక విపత్తును ఎవరునూ ఎదురుచూడలేదు” అని తన పుస్తకమగు ది స్ట్రగుల్ ఫర్ మాస్టరీ ఇన్ యూరోప్—1848-1918లో ఎ. జె. పి. టేలర్ వ్రాశాడు. బదులుగా, అది కేవలము కొన్ని నెలలలోనే ముగియునని అనేకులు జోస్యం చెప్పారు.
ఏమైనప్పటికిని, యూరోపియన్లు 1914లో తమ క్రిస్మస్‌ను ఆచరించుటకు ఎంతోముందే, అటు దక్షిణాన స్విట్జర్లాండు మొదలుకొని ఇటు ఉత్తరాన బెల్జియం తీరంవరకు పొడవునా 700 కిలోమీటర్లకు పైగా పూర్తిగా ప్రతిష్టంభించు కందకాలలో సైన్యంవుండెను. ఇది పశ్చిమ సైనికశ్రేణి అని పిలువబడెను, మరియు జర్మను రచయితయగు హెర్‌బర్ట్ సెల్జ్‌బాక్ తన డైరీలో 1914 సంవత్సరపు చివరిదినమందు తాను వ్రాసిన దానిలో దీనినిగూర్చి ప్రస్తావించెను. ఆ వ్రాయబడినది ఇట్లు చదువబడుచున్నది: “ఈ భయంకర యుద్ధము నిర్విరామముగా జరుగుచునే యున్నది, కొన్ని వారాలలోనే అది ముగియునని ప్రతివారు అనుకున్నారు, కానీ దానిముగింపు కనుచూపుమేరలో లేదు.” అదే సమయములో, ఐరోపాలోని ఇతర ప్రాంతాలలో రష్యా, జర్మనీ, ఆస్ట్రియా-హంగేరి, సెర్బియాల సైనిక దళాల మధ్య రక్తపాత సంఘర్షణలు చెలరేగెను. అనతికాలంలోనే ఈ సమరం ఐరోపాను దాటిపోగా, సముద్రాలమీద, ఆఫ్రికా, మధ్యప్రాచ్యమందు మరియు ఫసిఫిక్ ద్వీపాలలో యుద్ధాలు జరిగెను.
నాలుగు సంవత్సరాల తర్వాత ఐరోపా నాశనము చేయబడెను. జర్మనీ, రష్యా, ఆస్ట్రియా-హంగేరి, వీటిలో ప్రతిదీ 10 నుండి 20 లక్షల మధ్య సైనికులను కోల్పోయెను. 1917లో జరిగిన బోల్షెవిక్ తిరుగుబాటునందు రష్యా తన సామ్రాజ్యమును సహితము కోల్పోయెను. ఐరోపా రాజులు, వారిని బలపరచిన మతనాయకులు ఎంతగా హతాశులైరి! ఆధునిక చరిత్రకారులు ఇంకనూ ఆశ్చర్యమును వ్యక్తము చేయుచున్నారు. తన పుస్తకమగు రాయల్ సన్‌సెట్‌లో గార్డన్ బ్రూక్ షెపర్డ్ ఇలా అడుగుచున్నాడు: “ఎక్కువగా రక్తసంబంధము లేక వివాహముద్వారా బంధుత్వము కలిగియున్న పాలకులు మరియు రాజరికమును కాపాడుటకు అంకితమైన వారందరు, తమలో అనేకమందిని ఉనికిలో లేకుండా చేసిన మరియు బ్రతికిబయటపడిన వారినందరిని బలహీనపరిచిన ఈ బంధుజన రక్తతర్పణ జరుగుటకు తమనుతాము ఎట్లు అనుమతించుకొనిరి?”
ఫ్రాన్సు రిపబ్లిక్ కూడ పదిలక్షలకుపైగా సైనికులను పోగొట్టుకొన్నది, మరియు యుద్ధానికి ఎంతోకాలము ముందే రాజరికం బలహీనపడిన బ్రిటీషు సామ్రాజ్యం 9 లక్షలకుపైగా సైనికులను పోగొట్టుకొన్నది. మొత్తంమీద 90 లక్షలమంది సైనికులు చనిపోగా, 2 కోట్ల 10 లక్షలమంది క్షతగాత్రులైరి. యుద్ధేతర నష్టాలనుగూర్చి ది వరల్డ్ బుక్ ఎన్‌సైక్లోపీడియా ఇట్లనుచున్నది: “రోగాలవలన, ఆహారంలేక అలమటించుట వలన, ఇతర యుద్ధసంబంధ కారణాలవలన ఎంతమంది పౌరులు చనిపోయారో ఎవరికీ తెలియదు. సైనికులు ఎంతమంది చనిపోయారో అంతమంది పౌరులు చనిపోయారని కొందరు చరిత్రకారులు నమ్ముచున్నారు.” 1918లో ప్రబలిన స్పానిష్ ఫ్లూ వలన భూవ్యాప్తముగా మరొక 2 కోట్ల 10 లక్షలమంది తమ ప్రాణాలు కోల్పోయారు.
సమూలమైన మార్పు
ఆ మహాయుద్ధము తర్వాత ప్రపంచము, ఒకప్పుడు పిలువబడినట్లు అదేరీతిలో ఉండలేదు. క్రైస్తవమత సామ్రాజ్యమందలి అనేక చర్చీలు అమితోత్సాహముతో దానిలో పాల్గొనినందున, బ్రతికిబయటపడిన వారిలో భ్రమ తొలగిన వారనేకులు మతానికి తమ వెన్నుజూపి నాస్తికవాద పక్షముచేరిరి. ఇతరులైతే వస్తుదాయక సంపద, సుఖభోగముల వైపు తిరిగిరి. పండితుడైన మోడ్రిస్ ఎకిస్టిన్స్ తనపుస్తకమగు రైట్స్ ఆఫ్ స్ప్రింగ్‌లో వ్రాసిన ప్రకారము, 1920వ దశాబ్దము “అసాధారణ నిష్పత్తిలో అమితమైన భోగలాలసత్వమునకు, స్వార్థసుఖభోగమునకు సాక్షిగా నిలిచెను.”
“యుద్ధము, నైతిక కట్టడలపై దాడిచేసెనని” పండితుడైన ఎకిస్టిన్స్ వివరించెను. మూకుమ్మడిగా సంహరించుట నైతికముగా మంచిపనేనని మతనాయకులు, సైనికాధికారులు, రాజకీయనాయకులు ఇరుపక్షాల ప్రజలకు ఉపదేశించిరి. ఇది, “కేవలము యూదా-క్రైస్తవ నీతిశాస్త్రమందు వేళ్లూనికొనియుండెనని చెప్పబడిన నైతిక నియమముపై అసభ్యకరమైన ముట్టడియై యుండెనని” ఎకిస్టిన్స్ అంగీకరించుచున్నాడు. ఆయనింకా, “పశ్చిమశ్రేణి సైనిక శిబిరాలలో వేశ్యాగృహాలుకూడ క్రమముగా ఒక ప్రముఖ భాగమై పోయినవని . . . యుద్ధరంగమందలి పౌర వ్యవహారాలలో సహితము నైతికత్వము బొత్తిగా దిగజారిపోయెనని. వ్యభిచారము విశృంఖలముగా పెరిగిపోయెనని” చెప్పుచున్నాడు.
నిజమే, 1914 ఎంతో మార్పును తెచ్చెను. అది ఒక శ్రేష్ఠమైన ప్రపంచమును ఉత్పన్నము చేయలేదు, ఆలాగే అనేకమంది ప్రజలు నిరీక్షించినట్లు అది “సమస్త యుద్ధాలను అంతమొందించు యుద్ధము” కాలేదు. బదులుగా, చరిత్రకారిణియైన బార్బారా టచ్‌మేన్ వ్యాఖ్యానించినట్లు: “1914 వరకు వున్న భ్రాంతిజనకమైన, ఉత్సాహపూరిత విషయాల సాధ్యత అంతా మాయ అనే సాగర గర్భానికి నెమ్మదిగా మునిగిపోయెను.”
ఏదియేమైననూ, 1914 విశాదమును చూసిన కొందరు ఆ సంవత్సరములో జరిగిన సంఘటనలకు ఆశ్చర్యపడలేదు. వాస్తవానికి, ఆ యుద్ధం ప్రబలకముందే, వారు “భయంకరమైన కష్టకాలమును” ఎదురుచూచుచుండిరి. వారెవరు? ఇతరులకు తెలియని దేనిని వారు ఎరిగియుండిరి? (w92 5/1)
[5వ పేజీలోని బాక్సు]
1914లో బ్రిటీషు ఆశాభావం
“దాదాపు ఒక శతాబ్దకాలము నుండి మా ద్వీపముచుట్టునున్న సముద్రములో ఏ శత్రువు కన్పించలేదు. . . . ఈ ప్రశాంత సాగరతీరాలకు ముప్పు వచ్చునని ఊహించనే లేదు. . . . లండను క్రితమెన్నడూ ఇంత ఆనందముగా సౌభాగ్యముగా ఉన్నట్లు కన్పించలేదు. . . . క్రితమెన్నడూ ఇంతగా చేయగల, చూడగల, వినగల విలువైనదిగా ఉండలేదు. 1914లోని ఆ పూర్వ కాలములో వృద్ధులేమి, యౌవనస్థులేమి తాముచూచుచున్న దానినిగూర్చి ఏ సందేహమును కలిగిలేకుండిరి. వాస్తవానికి అది ఒక శకాంతమై యుండెను.”—జియోఫ్రే మార్కుస్ వ్రాసిన, బిఫోర్ ది ల్యాంప్స్ వెన్ట్ అవుట్.