ఆసక్తిగల యెహోవాసాక్షులు కదలి వెళ్లుచున్నారు!
యెహోవా యొక్క మొదటిశతాబ్దపు సాక్షులు ఆసక్తి మరియు ధైర్యముతో పనిచేయు ప్రజలైయున్నారు. “మీరు. . .వెళ్లి సమస్తజనులను నాకు శిష్యులనుగా చేయుడి” అని యేసు యిచ్చిన ఆజ్ఞను వారు ఎంతో ఆతురతతో నెరవేర్చిరి.—మత్తయి 28:19, 20.
అయితే క్రీస్తు తొలి అనుచరులు ఆ ఆజ్ఞను ఎంతో గంభీరముగా తీసుకొన్నారని మనకెలా తెలియును? నిజముగా వారు యెహోవాకు ఆసక్తిగల సాక్షులైయుండి, నిజముగా కదలి వెళ్లియున్నారని బైబిలు పుస్తకమైన అపొస్తలులకార్యములు ఎందుకు, రుజువు చేయుచున్నది!
ప్రయోజనములు మరియు ఇతర అంశములు
మూడవ సువార్త పుస్తకము మరియు అపొస్తలులకార్యముల భాష మరియు వ్రాతతీరులోని సారూప్యతను గమనించిన రెండునూ, ఒకరిద్వారానే అనగా —“ప్రియుడైన వైద్యుడగు లూకా” ద్వారానే వ్రాయబడినట్లు సూచిస్తున్నది. (కొలస్సయులు 4:14) అపొస్తలులకార్యములలోగల అద్వితీయమైన అంశములలో సంభాషణలు మరియు ప్రార్థనలుయున్నవి. పుస్తకములోని 20 శాతము దాదాపు పేతురు మరియు పౌలు నిజవిశ్వాసమును రుజువుచేయుచు చేసినటువంటి ప్రసంగములతో నిండియున్నది.
అపొస్తలులకార్యములు పుస్తకము దాదాపు సా.శ. 61లో రోములో వ్రాయబడినది. అందుకే కైసరు యెదుట పౌలు నిలువబడుటనుగాని, లేక దాదాపు సా.శ. 64లో క్రైస్తవులపైకి నీరో తెచ్చిన హింసనుగాని అది తెలుపుటలేదు.—2 తిమోతి 4:11.
లూకా సువార్తవలెనె అపొస్తలులకార్యములు థెయొఫిలాను, ఉద్దేశించి వ్రాయబడెను. విశ్వాసమును బలపరిచి, క్రెస్తవత్వపు వ్యాప్తిని తెలియజేయుటకు వ్రాయబడినది. (లూకా1:1-4; అ.కార్యములు1:1, 2) ఈ పుస్తకము యధార్థపరులైన తమసేవకులకు యెహోవా హస్తము తోడైయుండెనని రుజువుచేయుచున్నది. ఇది తన ఆత్మయొక్క శక్తిని మనకు తెలియపరచి దైవప్రేరేపిత ప్రవచనమందు మన నమ్మకమును బలపరచును. మరియు అపొస్తలుల కార్యములు మనకు యెహోవాకు స్వయంత్యాగపూరితమైన సాక్షులుగా యుండి, హింసను సహించుటకును, రాజ్యనిరీక్షణయందు మన విశ్వాసమును పెంపొందించుటకును సహాయముచేయును.
చారిత్రక యధార్ధత
పౌలు సహవాసిగాయుండి లూకా వారిప్రయాణములను వ్రాసెను. ఆయన కండ్లారా చూచినవారితో మాట్లాడెను. ఈ కారణములు మరియు విపులమైన ఆయన పరిశోధన తనవ్రాతలను చారిత్రక యధార్థవిషయములో అత్యుత్తమమైనవానిగా చేసినవి.
అందుకే విద్వాంసుడైన రామ్‌సే ఇలాచెప్పగలిగెను: “లూకా ఉత్తమశ్రేణికి చెందిన చరిత్రకారుడు. ఆయనవాక్యములు కేవలము నమ్మయోగ్యమైన వాస్తవికతలేగాక, ఆయన నిజమైన చారిత్రాత్మక జ్ఞానమును కలిగియున్నాడు. ఈ వ్రాతగాన్ని చరిత్రకారులలో అతి గొప్పవారిలో చేర్చవలసియున్నాము.”
పేతురు—ఒక నమ్మకమైన సాక్షి
దేవునిచే ఇవ్వబడిన ఈ సువార్తను ప్రకటించుపని కేవలము యెహోవా పరిశుద్ధాత్మ శక్తిమూలముగానే చేయబడగలదు. తత్ఫలితంగా, యేసు అనుచరులు పరిశుద్ధాత్మను పొందినప్పుడు వారు యెరూషలేములోను, యూదయ, సమరయ మరియు “భూదిగంతములవరకును ఆయనకు సాక్షులైయుందురు.” సా.శ. 33 పెంతెకొస్తుదినమున వారు పరిశుద్ధాత్మతో నింపబడిరి. అప్పటికి ఉదయము 9.గంటలే యైనది కావున కొందరు తలంచినట్లు వారు త్రాగి మత్తులుకాలేదు. పేతురు ఉత్తేజభరితమైన సాక్ష్యమునివ్వగా 3,000 మంది బాప్తిస్మము పొందిరి. మతసంబంధమైన విరోధులు రాజ్యప్రచారకులను నోరుమూయింప ప్రయత్నించారుగాని వారి ప్రార్థనకు సమాధానముగా, దేవుడు తనసాక్షులు తనవాక్యమును ధైర్యముగా మాట్లాడునట్లు చేసెను. మరలా బెదరించబడినప్పుడు వారు యిలా ప్రత్త్యుత్తరమిచ్చారు: “మేము మనుష్యులకు కాదు దేవునికే లోబడవలెను గదా!” వారు యింటింటికి ప్రకటించుటలో కొనసాగుకొలది పని ముందుకు నడచినది.—1:1–5:42.
యెహోవా ఆత్మపై ఆధారపడుటయనునది తనసాక్షులు హింసను సహించుటకు సహాయపడును. కావున, నమ్మకమైన సాక్షియగు స్తెఫను రాళ్లతో చంపబడినతరువాత, యేసు అనుచరులు చెదరిపోయారు, కాని ఇది వాక్యవ్యాప్తికే దోహదపడినది. సువార్తికుడైన ఫిలిప్పు సమరయలో పయినీరుగాయుండెను. ఆశ్చర్యకరమగురీతిలో క్రూరముగా హింసించువాడైన తార్సువాడగు సౌలు మార్చబడ్డాడు. అపొస్తలుడైన పౌలుగా దమస్కులో ఆయన తీవ్రహింసకు గురియైననూ, తననుచంపు యూదుల కుట్రనుండి తప్పించుకొనెను. ఆ తదుపరి యెరూషలేములోని అపొస్తలులతో పౌలు కొద్దికాలము కలసియుండి పరిచర్యయందు కదలివెళ్లెను—6:1–9:31.
అపొస్తలుల కార్యములు ఇంకను చూపుదానినిబట్టి యెహోవాహస్తము తనసాక్షులకు తోడుగాయున్నది. పేతురు దొర్కాను (తబీతా) మృతులలోనుండి లేపెను. కైసరయలోనుండి వచ్చిన పిలుపుమేరకు కొర్నేలికి, తనయింటివారికి, మరియు స్నేహితులకు ఆయన సువార్తను ప్రకటించాడు. యేసు శిష్యులగుటకు అన్యులలో మొదటివారిగా వారు బాప్తిస్మము పొందియున్నారు. అప్పటితో అనగా సా.శ. 36నకు “డెబ్బది వారములు” ఆ విధముగా ముగిసెను. (దానియేలు 9:24) ఆ తరువాత కొద్దికాలమునకు హేరోదు అగ్రిప్ప1 అపొస్తలుడైన యాకోబును చంపించి పేతురును బంధించెను. అయితే అపొస్తలుడు చెరసాలనుండి దేవదూతద్వారా విడుదల చేయబడతాడు, మరియు యెహోవాయొక్క వాక్యము ‘ప్రబలమై వ్యాపించుచుండెను’.—9:32–12:25.
పౌలు యొక్క మూడు మిషనరీ ప్రయాణములు
పౌలు వలె తమ్మునుతాము దేవునిసేవలో ఉపయోగించుకొనువారలకు ఆశీర్వాదములు విస్తారముగా లభించును. ఆయన మొదటి మిషనరీ ప్రయాణము సిరియా అంతియొకయలో ప్రారంభమగును. ద్వీపమైన కుప్రలో సెర్గిపౌలు అను అధిపతి మరియు యితరులనేకులు విశ్వసించిరి. పంపూలియలోనున్న పెర్గేలో వారినివిడిచి మార్కు అను మారుపేరుగల యోహాను యెరూషలేమునకు వెళ్లెను. అయితే పౌలును బర్నబాయు పిసిదియలోనున్న అంతియొకయకు వెళ్లిరి. లుస్త్రలో యూదులు హింసను కలుగజేసిరి. రాళ్లతో కొట్టబడి చంపబడినవానిగా వదలివేయబడినను మరలా పౌలు తేరుకొనిలేచి పరిచర్యనుకొనసాగించెను. చివరకు పౌలు మరియు బర్నబా మొదటి మిషనరీ ప్రయాణమును ముగించుకొని సిరియాలోని అంతియొకయకు తిరిగివచ్చిరి.—13:1–14:28
మొదటి శతాబ్దపు గవర్నింగ్‌బాడి వలెనె ఈనాటి గవర్నింగ్‌బాడి కూడా ఉత్పన్నమగు ప్రశ్నలను పరిశుద్ధాత్మ నడిపింపుద్వారా పరిష్కరించును. “విగ్రహములకు అర్పించినవాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును, విసర్జింపవలెను,” అను “అవశ్యమైనవాటి”లో సున్నతి భాగమైలేదు. (15:28, 29) పౌలు మరియు బర్నబాసు తమ రెండవ మిషనరీ ప్రయాణమును ప్రారంభించునపుడు తిమోతి వారితో చేరెను. మాసిదోనియాను దర్శించుమను పిలుపు మేరకు వెంటనే బయలువెళ్లిరి. అయితే ఫిలిప్పీనందు సాక్ష్యమిచ్చుట అలజడికిని మరియు చెరసాలలో వేయబడుటకును కారణమాయెను. అయితే పౌలును బర్నబాయును భూకంపమువలన విడిపింపబడి చెరసాల నాయకునికి అతని ఇంటనున్నవారికి ప్రకటించిరి. అప్పుడు అతడును అతని యింటివారును విశ్వాసులైరి.—15:1–16:40.
యెహోవాసేవకులు పట్టుదలతో ఆయనవాక్యమును పఠించువారైయుండవలెను. లేఖనమును పరిశోధించు బెరయలోనివారు మరియు పౌలు ఆలాగుననే చేసిరి. ఏథెన్సులోని అరేయొపగు మధ్య యెహోవాయొక్క సృష్టికర్తృత్వమునుగూర్చి సాక్ష్యమివ్వగా కొందరు విశ్వాసులైరి. తరువాత కొరింథులో ఎంతో ఆసక్తి కనపడగా ఆయన అచ్చట 18 నెలలు గడిపెను. అక్కడయున్నప్పుడే ఆయన థెస్సలొనీకయులకు తన మొదటి, రెండవ పత్రికలను వ్రాసెను. సీల, తిమోతిలను విడిచి ఓడయెక్కి ఎఫెసునకు వచ్చెను. పిదప కైసరయకును ఆ తరువాత యెరూషలేమునకు వెళ్లెను. అక్కడనుండి ఆ తరువాత అంతియొకయకు వచ్చుటతో ఆయన రెండవమిషనరీ ప్రయాణము ముగిసెను.—17:1–18:22.
పౌలు చూపినట్లుగా క్రెస్తవపరిచర్యలో యింటింటికి వెళ్లి సాక్ష్యమిచ్చుట ఒక ప్రాముఖ్యమైన భాగమైయున్నది. అపొస్తలుని మూడవ మిషనరీ ప్రయాణము (సా.శ. 52-56) చాలావరకు రెండవసారి వెళ్లినచోటులకే పరిమితమైయున్నది. ఎఫెసులో పౌలు పరిచర్య వ్యతిరేకతను రేకెత్తించెను. అక్కడ నుండియే ఆయన కొరింథీయులకు తనమొదటి పత్రికను వ్రాసెను. కొరింథీయులకు తన రెండవపత్రిక మాసిదోనియాలో నుండి వ్రాయగా, కొరింథీలోనున్నప్పుడు రోమీయులకు వ్రాసెను. మిలేతులో పౌలు ఎఫెసులోని పెద్దలతో కలిసి బహిరంగముగాను యింటింటికి ఆయనెట్లు ప్రకటించినది వారికి తెలియజేసెను. ఆయన యెరూషలేమునకు వచ్చుటతో తన మూడవ మిషనరీ ప్రయాణము ముగిసెను.—18:23–21:14.
హింస విఫలమగుట
యెహోవాయొక్క నమ్మకమైన సాక్షుల పెదవులను హింస మూయించలేదు. యెరూషలేము దేవాలయముయొద్ద జనసమూహములు బలత్కారముగా తనపైబడినప్పుడు, ఆయనవారికి బహుధైర్యముగా సాక్ష్యమిచ్చెను. తనను సైనిక రక్షణతో కైసరయలోనున్న గవర్నరు ఫేలిక్సునొద్దకు పంపినప్పుడు ఆయనను చంపవలెనను కుట్ర విఫలమాయెను. ఫేలిక్సు పౌలునుండి సొమ్మును ఆశించినవాడై రెండు సంవత్సరములు ఆయనను బంధీగానే యుంచెను. కాని ఆ సొమ్మును పౌలునుండి పొందలేక పోయెను. అతని స్థానములో వచ్చిన ఫేస్తు కైసరు యొద్దకు పంపమని కోరిన పౌలు విన్నపమును అంగీకరించెను. అయితే రోమునకు వెళ్లకముందు అపొస్తలుడు అద్భుతమైనరీతిగా తనవిధానమును సమర్ధించుకొంటూ రాజైన అగ్రిప్ప ముందు ఉత్తేజపూరితంగా మాటలాడెను.—21:15–26:32.
వస్తున్న శోధనలకు భయపడనివారై, యెహోవాసేవకులు ప్రకటించుచు ముందుకు సాగెదరు. ఇది పౌలు విషయములోను సత్యమే. తాను కైసరుకు మనవి చేసుకొంటానని కోరినందున అపొస్తలుడు లూకాతో సా.శ. 58లో రోముకు బయలుదేరెను. లుకియ లోని మూర యొద్ద వేరొక ఓడలో ప్రవేశించిరి. వారి ఓడ బ్రద్దలై మెలితేలో దిగిన తరువాత ఇటలీ వెళ్లు మరొక మరొక ఓడనెక్కిరి. సైనికులచేతిలో బంధీగా యుంచబడిననూ తనను కలియుప్రజలతో సువార్తను ప్రకటించుచున్నాడు. ఈ బంధములో నున్నప్పుడే ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలొస్సయులకు, ఫిలొమోను, మరియు హెబ్రీయులకు పత్రికలు వ్రాసెను.—27:1-28:31.
ఎల్లప్పుడును కదలివెళ్లుచున్నారు
అపొస్తలుల కార్యముల పుస్తకము దేవునికుమారునిచే ప్రారంభించబడిన పని మొదటి శతాబ్దపు యెహోవాసాక్షులచే నమ్మకముగా కొనసాగింపబడినదని చూపుచున్నది. అవును, దేవుని పరిశుద్ధాత్మ శక్తి క్రింద ఆసక్తితో వారు సాక్ష్యమిచ్చారు.
యేసుతొలి అనుచరులు ప్రార్థనపూర్వకముగా దేవునిపై ఆధారపడినందున ఆయనహస్తము వారికి తోడైయుండెను. వేలకొలదిగా విశ్వాసులై, ‘ఆకాశము క్రిందనున్న సమస్తసృష్టికి సువార్త ప్రకటింపబడెను.’ (కొలస్సయులకు 1:23) నిజముగా అప్పుడును మరియు ఇప్పుడును నిజమైన క్రైస్తవులు ముందుకు కదలివెళ్లుచున్న ఆసక్తిగల యెహోవాసాక్షులుగా నిరూపించుకొనియున్నారు! (w90 5/15)
[30వ పేజీలోని బాక్సు/చిత్రం]
శతాధిపతియైన కొర్నేలి: కొర్నేలి ఒక సైనికాధికారి లేక శతాధిపతి. (10:1) ఒక శతాధిపతి సంవత్సర జీతము దాదాపు కాల్బలపు సైనికునికంటె అయిదు రెట్లు ఎక్కువగాయుండును. లేక 1,200 దేనారములు, లేదా అంతకంటె ఎక్కువయు యుండవచ్చును. తాను పదవి విరమణ చేసిన తరువాత తాను కొంత మొత్తము డబ్బును లేక భూమిని పొందెను. ఆయన సైనిక వస్త్రములు రంగులతో నిండినదై వెండి శిరస్త్రాణము, చిన్నచొక్కాలాంటి వస్త్రము మంచినూలుతో చేయబడినదై క్రింది అంచులు అందముగా చిత్రించబడినవి. లెక్కప్రకారము ఒక శతాధిపతి పటాలమునందు 100మంది పురుషులు ఉండవలసియుండెను. కాని కొన్నిసార్లు కేవలము 80 లేక ఆపై కొంతమంది యుండెడివారు. “ఇటలీ పటాలములో” కేవలము రోమా పౌరులు లేక ఇటలీలో స్వతంత్రులై యున్నవారు మాత్రమే తీసుకొనబడిరి.
[30వ పేజీలోని బాక్సు/చిత్రం]
మిద్దె మీద ప్రార్ధన చేయుట: పేతురు మిద్దెమీద (యింటిపైకప్పు) ప్రార్థనచేసినప్పుడు ఆయన డంబముగా బయటకు కనిపించవలెనని చేసినవాడైయుండలేదు. (10:9) చాలావరకు పైభాగమున కట్టబడిన పిట్టగోడ తాను బయటకు కనిపించకుండా చేసియుండును. (ద్వితీ. 22:8) మరియు మిద్దె పైకప్పు విశ్రాంతి తీసుకొనుటకును, సాయంకాలమందు వీధిలో యుండు శబ్దమునుండి తప్పించుకొనుటకును మంచిస్థలమై యుండును.
[30వ పేజీలోని బాక్సు]
మానవరూపమును దాల్చిరని తలంచబడిన దేవుళ్లు: లుస్త్రలో యున్న కుంటివానిని పౌలు బాగుచేయుట అందలి నివాసులు దేవతలు మనుష్యరూపము దాల్చిరని తలంచుటకు కారణమైనది. (14:8-18) గ్రీకుల ముఖ్యదేవుడైన ద్యుపతి ఆ పట్టణములో ఒక ఆలయమును కలిగియుండెను. అతని కుమారుడైన హెర్మే దేవతలకు వార్తాహరునిగాను ఉండి తనవాగ్ధాటికి పేరుగాంచియుండెను. మాట్లాడుటలో నాయకత్వము వహించినందున ప్రజలు పౌలును హెర్మేయుననియు, బర్నబాను ద్యుపతియనియు దృష్టించిరి. సాధారణముగా అబద్ద దేవతల విగ్రహములను పూలదండలతో లేక దేవదారు ఆకులతో పూజించేవారు. అయితే పౌలు మరియు బర్నబా అట్టి విగ్రహారాధనసంబంధమైన పద్దతిని త్రోసిపుచ్చిరి.
[30వ పేజీలోని బాక్సు/చిత్రం]
చెరసాల నాయకుడు విశ్వసించుట: భూకంపము చెరసాల తలుపులను తెరచి లోపలిబందీలను విడిచిపెట్టగా ఫిలిప్పీయుడైన చెరసాలనాయకుడు తన్నుతాను చంపుకొనబోయెను. (16:25-27) ఎందుకు? ఎందుకనగా రోమాచట్టము తప్పించుకొన్నవాని శిక్షను చెరసాలనాయకుడు భరించవలెను. బహుశా కొంతమంది ఖైదీలకు విధించబడిన బాధతో చంపబడు శిక్షకన్న తన్నతాను ఆత్మహత్యచేసుకొనుటే మంచిదని చెరసాలనాయకుడు ఎన్నుకొనెను. ఏమైనను ఆయన సువార్తను అంగీకరించి “వెంటనే తాను తనయింటివారును బాప్తిస్మము పొందిరి.”—16:28-34.
[31వ పేజీలోని బాక్సు/చిత్రం]
కైసరు ఎదుటకు వెళ్లుట: పుట్టుకనుండి రోమా పౌరునిగాయున్నందున కేసును కైసరు ఎదుటకు తీసుకొనిపోయి, రోములోనే విమర్శింపబడు అధికారమును పౌలు కలిగియున్నాడు. (25:10-12) ఒక రోమా పౌరుడు విమర్శింపబడకముందే బంధింపబడుట, కొట్టబడుట లేక శిక్షింపబడుట కూడదు.—16:35-40; 22:22-29; 26:32.
[క్రెడిట్ లైను]
Musei Capitolini, Roma.
[31వ పేజీలోని బాక్సు/చిత్రం]
అర్తెమి దేవాలయమును కాచువాడు: పౌలు ప్రకటన పనిమూలముగా కలతచెందినవాడై, వెండిబంగారములను తయారుచేయు దేమేత్రి అల్లరిదొమ్మిని రేపెట్టెను. అయితే కరణము ఆ గుంపును సముదాయించెను. (19:23-41) ఈ వెండిపనిచేయువారు దేవాలయములో అతి పరిశుద్ధభాగమందు చిన్న వెండి గుళ్లనుచేసిరి. అందు అనేక స్తనములను కలిగి ఫలమునకు దేవతయగు అరైమిని ఉంచుదురు. తమ దేవత గౌరవార్థమును పట్టణములు ఒకదానికొకటి పోటిపడేవి.
[31వ పేజీలోని బాక్సు/చిత్రం]
సముద్రములో కష్టము: పౌలును తీసుకువెళ్లుచున్న ఓడను ఉరాకూలోను అను పెనుగాలి కొట్టగా ‘పడవను భద్రపరచుకొనుట బహుకష్టతరమాయెను.’ ఈ పడవ సాధారణముగా ఓడ వెనుక భాగమున కట్టుకొనివెళ్లు చిన్న బోటు. తుఫాను సమయములో ఓడపైగల స్థంభమునుండి కలుగు భారమునుండి తప్పించుకొనుటకు ఓడతో త్రాళ్లను తీసుకొనివెళ్లేవారు. (27:17) ఈ నావికులు నాలుగు లంగరులువేశారు, మరియు చుక్కానుల కట్లనువిప్పారు. ఇవి ఓడను మలుపుటకు వినియోగించబడెను. (27:29, 40) అలెక్సంద్రియ ఓడపైన ద్యుపతి కుమారుల (అశ్వినీ) చిహ్నముగలదు. వీరు కోస్టర్ మరియు పోలెక్స్ వీరు నావికులకు సంరక్షకులుగా యెంచబడిరి.