యెహోవా రాజ్యమును నిర్భయముగా ప్రకటించుము!
“ఆయన తనయొద్దకు వచ్చు వారినందరిని సన్మానించి . . . దేవునిరాజ్యమునుగూర్చి ప్రకటించుచుండెను.”—అపొస్తలుల కార్యములు 28:30, 31 NW.
1, 2. అపొస్తలుడైన పౌలు దైవికమద్దతుకు ఏ సాక్ష్యమును కలిగియుండెను, ఆయన ఏ మాదిరినుంచెను?
యెహోవా ఎల్లప్పుడు రాజ్యప్రచారకులను ఉన్నతపరచును. పౌలు విషయంలో ఇది ఎంత సత్యము! దైవిక మద్దతుతో ఆయన పాలకులముందు నిలబడి, దొమ్మి మూకల ముట్టడులను సహించినవాడై నిర్భయముగా యెహోవా రాజ్యమును ప్రకటించెను.
2 రోమునందు బంధీగాయుండికూడా పౌలు “తనయొద్దకు వచ్చు వారినందరిని సన్మానించి . . . దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచుండెను.” (అపొస్తలుల కార్యములు 28:30, 31) ఈనాటి యెహోవాసాక్షులకు అది ఎంతమంచి మాదిరి! బైబిలు పుస్తకమగు అపొస్తలులకార్యముల చివరి అధ్యాయములలో లూకాచే తెలియపరచబడిన పౌలు పరిచర్యనుండి మనమెంతో నేర్చుకొనగలము—20:1-28:31.
తోటివిశ్వాసులు నిర్మించబడిరి
3. త్రోయలో ఏమి జరిగినది, మన దినములకు ఏ సమాంతరమును తీసుకొనవచ్చును?
3 ఎఫెసునందు దొమ్మిమూకయొక్క అలజడి అణిగిన తరువాత పౌలు తన మూడవ మిషనరీ యాత్రను కొనసాగించెను. (20:1-12) ఆయన ఓడలో సిరియ వెళ్లబోవు చుండగా తనకు వ్యతిరేకముగా యూదులు కుట్రపన్నుచున్నారని ఆయన తెలుసుకొనెను. బహుశా, అదే ఓడఎక్కి పౌలును చంపవలెనని వారు కుట్రపన్నియున్నందున ఆయన మాసిదోనియా గుండా వెళ్లెను. త్రోయలో ఒక వారము గడిపి ఈనాడు యెహోవాసాక్షుల మధ్య ప్రయాణకాపరులు చేయునట్లు ఆయన తోటివిశ్వాసులను నిర్మించెను. వారిని వదలి వెళ్లు ముందురాత్రి ప్రసంగించుచు అర్థరాత్రి వరకు విస్తరించుచు మాటలాడుచుండగా, ఐతుకు కిటికిలో కూర్చుండి నిద్రభారమువలన జోగి మూడవ అంతస్థునుండి క్రిందపడి చనిపోగా, పౌలు అతనిని బ్రతికించెను. ఇది ఎంతటి సంతోషమును కలుగజేసి వుంటుంది! అట్లయిన అనేక లక్షలమంది నూతనలోకములోనికి పునరుత్థానమైనప్పుడు కలుగు ఆనందమునుగూర్చి తలంచుము.—యోహాను 5:28, 29.
4. పరిచర్యనుగూర్చి ఎఫెసు పెద్దలకు పౌలు ఏమి బోధించెను?
4 యెరూషలేమునకు వచ్చుచుండగా మిలేతుయొద్ద పౌలు ఎఫెసులోని పెద్దలను కలిసికొనెను. (20:13-21) “దేవునియెదుట మారుమనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలెనని యూదులకును గ్రీసు దేశస్థులకును” “ఇంటింట” ఆయన ఏలాగు సాక్ష్యమిచ్చుచుండెనో వారికి గుర్తుచేసెను. చివరకు పెద్దలైనవారు మారుమనస్సుపొంది విశ్వాసమును కలిగియుండిరి. ఈనాడు యెహోవా సాక్షుల వలన చేయబడుదానివలెనే, ఇంటింటి పరిచర్యయందు రాజ్యమును నిర్భయముగా ప్రకటించుటకు కూడా అపొస్తలుడు వారికి తర్ఫీదు నిచ్చుచుండెను.
5. (ఎ) పరిశుద్ధాత్మ నడిపింపు విషయములో పౌలు ఎట్లు మాదిరికరముగా యున్నాడు? (బి) “యావత్తుమందనుగూర్చి జాగ్రత్తగా” ఉండు ఉపదేశము పెద్దలకు ఎందుకు అవసరమైయున్నది?
5 దేవుని పరిశుద్ధాత్మ నడిపింపును అంగీకరించుటలో పౌలు మాదిరియైయున్నాడు. (20:22-30) “ఆత్మయందు బంధింపబడినవాడై” లేక దాని నడిపింపును వెంటాడుటను విధిగా భావించుకొనినవాడై బంధకములు మరియు శ్రమలు తనకొరకు వేచియున్నను అపొస్తలుడు యెరూషలేమునకు వెళ్లుచున్నాడు. ఆయన తన ప్రాణమును విలువైనదిగా ఎంచినను, దేవునియెదుట యథార్థతను కాపాడుకొనుట తనకు ప్రాముఖ్యమైయుండెను. మనకును అది అట్లేయుండవలెను. పౌలు “పరిశుద్ధాత్మ వారిని దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆయావత్తు మందను గూర్చి . . .జాగ్రత్త కలిగియుండుడని” పెద్దలను గట్టిగా పురికొల్పెను. తాను “వెళ్లిపోయిన తరువాత” (స్పష్టంగా మరణమందు), “క్రూరమైన తోడేళ్లు” “మందను కనికరింపరు.” అట్టి మనుష్యులు పెద్దలలోనుండే బయలు వెళ్లునప్పుడు, ఎక్కువ గ్రహింపులేని శిష్యులు వారి వంకర బోధలను అంగీకరింతురు.—2 థెస్సలొనీకయులు 2:6.
6. (ఎ) పౌలు ఎందుకు నమ్మకముగా పెద్దలను దేవునికప్పగించగలిగెను? (బి) అపొస్తలుల కార్యములు 20:35 లోని సూత్రమును పౌలు ఎట్లు అనుసరించెను?
6 పెద్దలు మతభ్రష్టత్వమునుండి కాపాడుటకు మెలకువగా ఉండవలసియుండిరి. (20:31-38) “పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యమ”గు పరలోక రాజ్యమును పొందుటకు సహాయపడునట్టి పరిశుద్ధశక్తిగల హెబ్రీలేఖనములను మరియు యేసు బోధలను అపొస్తలుడు వారికి బోధించెను. తనకొరకు మరియు తనసహచరుల అవసరతలకొరకు పనిచేయుటద్వారా పెద్దలు కష్టించిపనిచేయువారై యుండవలెననియు పౌలు ప్రోత్సహించెను. (అపొస్తలుల కార్యములు 18:1-3; 1 థెస్సలొనీకయులు 2:9) మనము అటువంటి విధానమునే అనుకరించి నిత్యజీవము పొందుటకు ఇతరులకు సహాయపడినట్లయిన “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము” అను యేసు మాటలను గుణగ్రహింతుము. సువార్తలలో కనుగొనబడు ఈ వాక్య భావము ఒక్క పౌలువలననే ఎత్తిచెప్పబడినది. బహుశా పౌలు దీనిని ప్రేరణవలననో లేక నోటిమాటను బట్టియో పొందియుండవచ్చును. పౌలువలె మనలను మనము త్యాగముచేసు కొనవారమైనట్లయిన మనము ఎంతో సంతోషమును అనుభవించగలము. ఎందుకు, తన ఎడబాటు ఎఫెసు పెద్దలకు పెద్ద దుఃఖమును కలుగజేయునంతగా ఆయన తన్నుతాను వ్యయపరచుకొనెను.
యెహోవాచిత్తము జరుగునుగాక
7. దేవుని చిత్తమునకు లోబడుటలో పౌలు ఎట్లు మాదిరినుంచెను?
7 పౌలు మూడవ మిషనరీయాత్ర ముగియ బోవుచుండగా (56 సా.శ.) దేవునిచిత్తమునకు లోబడుటలో ఆయన మంచిమాదిరి చూపెను. (21:1-14) పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచించు కన్యకలైన నలుగురు కుమార్తెలుగల ఫిలిప్పుయొద్ద ఆయన, ఆయన సహచరులు కైసరయలో ఉండిరి. అక్కడ అగబు అను ఒక క్రైస్తవ ప్రవక్త పౌలు నడికట్టు తీసికొని, తనచేతులను కాళ్లను కట్టుకొని పరిశుద్ధాత్మచేత నడిపింపబడినవాడై ఈ నడికట్టుగల మనుష్యుని ఈలాగు బంధించి అన్యజనులచేతికి అప్పగింతురని చెప్పెను. అందుకు పౌలు “ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని” చెప్పెను. దానికి శిష్యులు “యెహోవా చిత్తము జరుగునుగాక” అని ఊరకుండిరి.
8. మంచిసలహాను తీసుకొనుటకు కొన్నిసార్లు కష్టముగా ఉన్నట్లయిన దేనిని మనము జ్ఞాపకముంచు కొనవచ్చును?
8 పౌలు యెరూషలేములోని పెద్దలతో తన పరిచర్యద్వారా దేవుడు అన్యజనుల మధ్య ఏమి చేశాడో తెలియజేసెను. (21:15-26) మంచి సలహాను తీసుకొనుటను మనము కష్టముగా కనుగొనినప్పుడు, పౌలు దానినెట్లు అంగీకరించాడో గుర్తుకు తెచ్చుకొనవచ్చును. ఆయన అన్యజనులలోని యూదులకు “మోషేను విడిచి పెట్టవలెనని” బోధించుటలేదని రుజువు పరచుటకు తనకును తనతోయున్న నలుగురు మనుష్యులకును వారికయ్యెడి తగులుబడిని పెట్టుకొని ఆచారసంబంధమైన శుద్ధిచేసుకొనుమని పెద్దలు సలహా ఇవ్వగా ఆయన దానిని పాటించెను. యేసు మరణము ధర్మశాస్త్రమును ఆచరణనుండి తీసివేసినను, మ్రొక్కుబడులను గూర్చిన దాని అంశాలను నెరవేర్చుటలో పౌలు తప్పిదముచేయలేదు.—రోమీయులు 7:12-14.
గుంపుచే ముట్టడింపబడినను బెదరకుండుట
9. అల్లరిమూక దొమ్మిగా పైబడుటలో పౌలు అనుభవమునకు మరియు ఈనాటి యెహోవాసాక్షుల అనుభవమునకు మధ్య ఎటువంటి సమాంతరము కలదు?
9 యెహోవాసాక్షులు తరచు అల్లరి మూకయొక్క హింసయందును దేవునియెదుట తమ యథార్థతను కాపాడుకొనిరి. (ఉదాహరణకు, 1975 యెహోవాసాక్షుల ఇయర్ పుస్తకము, పేజీలు 180-90 చూడుము.) అలాగే ఆసియా మైనరునందలి యూదులు పౌలుపైకి అల్లరిమూకను గుమికూర్చారు. (21:27-40) ఎఫెసీయుడైన త్రోఫిము ఆయనతోకూడ ఉండుటను చూచి దేవాలయములోనికి గ్రీకులను తీసుకొనిపోవుటద్వారా దేవాలయమును కలుషితము చేయుచున్నాడని ఆయనను అసత్యముగా నిందించిరి. రోమను పటాలపు పైయధికారి క్లౌదియ లూసియ తన మనుష్యులతో కూడ దొమ్మి జరుగు స్థలమున ప్రవేశించు సమయమునకు దాదాపు పౌలు చంపబడబోవుచుండెను. ముందుగనే ప్రవచింపబడిరీతిగా (యూదుల వలన) లూసియ పౌలును సంకెళ్లతో బంధించెను. (అ.కార్యములు 21:11) అపొస్తలుడు దేవాలయ ఆవరణకు కలుసుకొనియున్న సైనిక గదిలోనికి తీసుకుపోవబడనైయుండగా ఈయన దేవాలయములోనికి వెళ్లుటకు అనుమతించబడగల యూదుడేగాని రాజుపైకి ప్రజలను రేపు రాజద్రోహి కాదని లూసియ తెలిసికొనెను. పౌలు మాట్లాడుటకు అనుమతి తీసికొని ప్రజలతో హెబ్రీ భాషలో మాట్లాడెను.
10. యెరూషలేములోని యూదులు పౌలు ప్రసంగమును ఎట్లు తీసికొనిరి, మరియు ఎందుకు ఆయన కొరడాలతో కొట్టబడలేదు?
10 పౌలు నిర్భయమైన సాక్ష్యమిచ్చెను. (22:1-30) ఎంతో ఉన్నతముగా గౌరవించబడియున్న గమలీయేలుచే ఉపదేశమునొందిన యూదుడనని తన్నతాను గుర్తించుకొని, ఈ మార్గము చొప్పున నడచు వారిని హింసించుటకై దమస్కునకు వెళ్లునప్పుడు మహిమగల యేసును చూచి దృష్టిని కోల్పోగా అననీయ ద్వారా మరల దృష్టినిపొందితినని అపొస్తలుడు వివరించెను. తరువాత ప్రభువు పౌలుతో “వెళ్లుము, నేను దూరముగా అన్యజనులయొద్దకు నిన్ను పంపుదునని” చెప్పెను. ఆమాటలు అరణ్యములో మెరుపువలె ఉండెను. పౌలు బ్రతుకతగడు అని కేకలు వేయుచు జనసమూహము తమపైబట్టలు విదుల్చుకొని ఆకాశముతట్టు కోపముతో దుమ్మెత్తిపోసిరి. కావున యూదులు పౌలుకు విరోధముగా ఈలాగు కేకలువేసిన హేతువేమో తెలిసికొనుటకై కొరడాలతో కొట్టుచు పౌలును కోటలోనికి తీసికొనిపొండని లూసియ చెప్పెను. రోమీయుడైన మనుష్యుని శిక్ష విధింపకయే కొరడాలతో కొట్టుటకు మీకు అధికారమున్నదా? అని పౌలు ప్రశ్నింపగా కొరడాతో కొట్టుట (చర్మపు తాళ్లతో చివర్లలో ముడులు లేక లోహపు ముక్కలు కలిగియుండునది) మానిరి. పౌలు రోమా పౌరుడని తెలిసికొని లూసియ భయపడి ఆయనపై యూదులు ఎందుకు నేరము మోపుచున్నారో తెలుసుకొనుటకు మహాసభ ఎదుట నిలబెట్టెను.
11. ఏవిషయమందు పౌలు పరిసయ్యుడైయున్నాడు?
11 పౌలు మహాసభయెదుట తన వాదమును సమర్థించుకొనుటకు ఆరంభించి “మంచి మనసాక్షిగలవాడనై దేవునియెదుట నడుచుకొంటినని” చెప్పినప్పుడు ప్రధానయాజకుడైన అననీయ అతని కొట్టుడని ఆజ్ఞాపించెను. (23:1-10) అందుకు పౌలు “సున్నముకొట్టిన గోడా, దేవుడు నిన్ను కొట్టును” అని అనగా, కొందరు “నీవు దేవుని ప్రధానయాజకుని దూషించెదవా? అని అడిగిరి.” తాను కలిగియున్న దృష్టిమాంద్యమును బట్టి పౌలు అననీయను గుర్తించియుండకపోవచ్చును. అయితే సభ పరిసయ్యులు మరియు సద్ధూకయ్యులతో కూడినదని గ్రహించి, నేను “మృతుల పునరుత్థానమును గూర్చి విమర్శింపబడుచున్న” “పరిసయ్యుడను” అని పౌలు చెప్పినప్పుడు మహాసభ రెండు పక్షములాయెను. ఎందుకనగా పరిసయ్యులు పునరుత్థానమును నమ్ముదురు. సద్దూకయ్యులు నమ్మరు. అప్పుడు వారిరువురి మధ్య లూసియ పౌలును కాపాడ వలసినంతటి తీవ్రకలహము చెలరేగెను.
12. యెరూషలేములో తనప్రాణమును తీయుటకు పన్నిన కుట్రనుండి పౌలు ఎట్లు తప్పించుకొనెను?
12 అటు తరువాత తన ప్రాణమును తీయుటకు పన్నిన కుట్రనుండి పౌలు తప్పించుకొనెను. (23:11-35) ఆయనను చంపువరకు అన్నపానములు పుచ్చుకొనమని 40 మంది యూదులు ఒట్టుపెట్టుకొనగా ఈ సంగతిని పౌలు మేనల్లుడు పౌలుకును మరియు లూసియకును తెలియజేసెను. అంతట సైనిక భద్రతతో యూదయ పరిపాలనను చూచు ముఖ్యపట్టణమైన కైసరయకు అధిపతియైన ఫేలిక్సుయొద్దకు అపొస్తలుడు తీసుకొనిపోబడగా, హేరోదు నీసంగతి విచారింతునని పౌలును అధికారమందిరములో ఉంచెను.
పరిపాలకుల ముందు నిర్భయము
13. దేనినిగూర్చి పౌలు ఫెలిక్సునకు సాక్ష్యమిచ్చెను, మరియు దాని ఫలితమేమి?
13 త్వరలో అపొస్తలుడు తనపై మోపబడిన అబద్ధనేరములను గూర్చి తన్నుతాను సమర్థించుకొని ఫేలిక్సుకు నిర్భయముగా సాక్ష్యమిచ్చెను. (24:1-27) నేరము మోపు యూదులముందు తాను అల్లరి మూకను పురికొల్పలేదనియు, ధర్మశాస్త్రమందును, ప్రవక్త గ్రంథములయందును వ్రాయబడినవాటిని నమ్మి “నీతిమంతులకును మరియు అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నదని నిరీక్షించుచున్నట్టు” తెలియజేసెను. పౌలు “దాన ద్రవ్య కానుకలను” (బహుశా హింసవలన దారిద్ర్యమునకు లోనైన యేసు అనుచరులకు చందాలు) యెరూషలేమునకు తీసికొనివెళ్లి ఆచారప్రకారము శుద్ధిచేసికొనినవాడైయుండెను. ఫేలిక్సు విమర్శను తదుపరి సమయమునకు నిర్ణయించినను పౌలు తనకును తన భార్యయైన ద్రుసిల్లకును (హేరోదు అగ్రిప్ప I కుమార్తె) క్రీస్తును గూర్చియు, నీతినిగూర్చియు, ఆశానిగ్రహము, రాబోవు విమర్శనుగూర్చియు ప్రకటించెను. అట్టి ప్రసంగమునకు ఫేలిక్సు భయపడి పౌలును అప్పటికి ఆపు చేయించెను. ఏమైనను తరువాత పౌలువలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటిమాటికి అపొస్తలుని పిలిపించెనుగాని తనకు ఏమియు దొరకలేదు. పౌలు నిర్దొషియని ఫేలిక్సు ఎరిగియున్నను, యూదులవలన మంచివాడు అని అనిపించుకొనవలెనని కోరి ఆయనను బంధకములలోనే విడిచిపెట్టిపోగా రెండు సంవత్సరములైన తరువాత ఫేలిక్సుకు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను.
14. ఫేస్తు ఎదుట నిలబడినప్పుడు పౌలు చట్టబద్ధమైన ఏ ఆధిక్యతను ఉపయోగించుకొనెను, దీనిలో ఏ సమాంతరమును నీవు కనుకొనగలవు?
14 ఫేస్తు ఎదుటకూడ పౌలు నిర్భయముగా తన వాదమును సమర్థించుకొనెను. (25:1-12) అపొస్తలుడు మరణమునకు తగినదేదైన చేసినయెడల, అందుకు వెనుకతీయడు. అయితే యూదులచేత మంచివాడని అనిపించుకొనుటకు ఎవరును తనను అప్పగించలేరు. తాను తనకున్న రోమా పౌరసత్వపు హక్కును ఉపయోగించుకొని రోములోనే “కైసరు ఎదుటనే చెప్పుకొందునని” తెలిపెను. (ఆ సమయమున నీరో ఎదుట) ఆ విన్నపము అంగీకరించబడి ప్రవచింపబడినరీతిగా ఆవిధముగా ఆయన “రోమాలో . . . సాక్ష్య”మిచ్చును. (అపొస్తలుల కార్యములు 23:11) యెహోవాసాక్షులు కూడ “సువార్తపక్షమున వాదించుటకు చట్టపరంగా దానిని స్థిరపరచుటయందును” తమకున్న ఆధిక్యతను ఉపయోగించుకొందురు.—ఫిలిప్పీయులు 1:7.
15. (ఎ) పౌలు రాజైన అగ్రిప్ప మరియు కైసరు ఎదుట నిలబడినప్పుడు ఏ ప్రవచనము నెరవేరెను? (బి) సౌలు ఎట్లు “ములుకోలలకు ఎదురుతన్నెను”?
15 యూదయ ఉత్తరప్రాంతపు రాజైన హేరోదు అగ్రిప్ప II అతని సహోదరియగు బెర్నీకేయు (ఈమెతో ఆయన రక్తసంధితో కలిగియుండు లైంగిక సాంగత్యమును కలిగియుండెను.) కైసరయలో ఫేస్తును దర్శించుటకు వచ్చి పౌలునుగూర్చి వినిరి. (25:13-26:23) అగ్రిప్ప మరియు కైసరుకు సాక్ష్యమిచ్చుటతో రాజుల యెదుట సాక్ష్యమిచ్చు ప్రవచనమును పౌలు నెరవేర్చెను. దమస్కునకు వెళ్లు మార్గమున ఏమి జరిగినదో అగ్రిప్పకు చెప్పిన తరువాత “మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని” యేసు చెప్పిన దానిని పౌలు సూచించెను. ములుకోలలకు ఎదురు తిరుగుట ద్వారా మొండిపట్టుగల ఎద్దు తన్నుతాను ఎట్లు గాయపరచుకొనునో అట్లే సౌలు దేవుని మద్దతు ఉన్న యేసు అనుచరులకు వ్యతిరేకముగా పోరాడుటద్వారా తన్నుతాను గాయపరచుకొనినవాడైయుండెను.
16. పౌలు సాక్ష్యమునకు ఫేస్తు మరియు అగ్రిప్ప ఎట్లు ప్రతిస్పందించిరి?
16 ఫేస్తు మరియు అగ్రిప్ప ఎట్లు ప్రతిస్పందించారు? (26:24-32) పునరుత్థానమునుగూర్చి అర్థముచేసికొనలేక పౌలుయొక్క ఒప్పుదలనుగూర్చి ఆశ్చర్యపడినవాడై ఫేస్తు: “అతి విద్యవలన నీకు వెఱ్ఱిపట్టినదని” అనెను. అలాగే ఇప్పుడు యెహోవా సాక్షులు పౌలువలెనే “సత్యమును స్వస్థబుద్ధియుగల మాటలనే చెప్పుచున్నను” కొందరు వారికి వెఱ్ఱిపట్టినదని ఆరోపించుచున్నారు. అగ్రిప్ప అంతయు విని కైసరు ఎదుట చెప్పుకొందునని అననియెడల పౌలును విడుదల చేయవచ్చునని తెలియజేసి పౌలుతో “ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావే” అని అనెను.
సముద్రములో అపాయములు
17. పౌలు రోమాకు వెళ్లు ప్రయాణమందు సముద్రములో ఎదుర్కొనిన కష్టములను నీవెట్లు వర్ణించుదువు?
17 పౌలుయొక్క రోమా ప్రయాణము ఆయనను “సముద్రములోని అపాయములకు గురిచేసెను.” (2 కొరింథీయులు 11:24-27) కైసరయనుండి రోమునకు ఓడలో వెళ్లు ఖైదీలు యూలి అనబడు సైనికాధికారి క్రిందకు అప్పగింపబడిరి. (27:1-26) వారి ఓడ సీదోనుకు చేరినప్పుడు తనను ఆత్మీయముగా పరమార్శించిన విశ్వాసులను దర్శించుటకు పౌలు అనుమతించబడెను. (3 యోహాను 14ను పోల్చుము.) యూలి ఆసియామైనరునందలి మూరలో ఇటలీ వెళ్లనైయున్న ధాన్యపు ఓడలో ఖైదీలను ఎక్కించెను. బలమైన గాలులు ఉన్నను క్రేతు పట్టణమైన లసైయకు దగ్గరలో మంచిరేవులు అను స్థలమునకు వారు చేరుకోగలిగిరి. అక్కడనుండి బయలుదేరి ఫీనిక్సునకు వెళ్లుచుండగా ఈశాన్యపు పెనుగాలి ఓడను ఆవరించినది. ఉత్తర ఆఫ్రికా యొక్క సూర్తిసను ఇసుక తిప్పమీద పడుదుమేమోయను భయముతో చాపలు దింపివేసి కొట్టుకొనిపోయిరి. ఓడ పగలకుండునట్లు ఓడచుట్టు త్రాళ్లను బిగించి కట్టిరి. మిక్కిలి పెద్దగాలి కొట్టుచున్నందున సరకులు పారవేయసాగిరి. మూడవదినమందు ఓడసామాగ్రిని పారవేసిరి. తప్పించుకొందుమను ఆశ బొత్తిగా గతించగా దేవదూత పౌలునకు అగుపించి తాను కైసరు ఎదుట నిలబడవలసియున్నందున భయపడవద్దని తెలిపెను. ప్రయాణీకులందరు ఒక ద్వీపమునకు కొట్టుకొని పోవుదురని చెప్పినప్పుడు అది వారికెంత భారమును తొలగించునదాయెను!
18. పౌలు మరియు తనతో ఓడలో ప్రయాణించువారికి చివరకు ఏమి సంభవించినది?
18 ఓడలోని ప్రయాణీకులు ఆపదను తప్పించుకొనిరి. (27:27-44) పదునాలుగవ దినమున మధ్యరాత్రికి ఒక దేశము దగ్గరపడుచున్నదని గ్రహించుకొన్నారు. బుడుదువేసి దానిని ఖాయపరచుకొని, రాతి తిప్పలుగల చోట్లపడుదుమేమో అని భయపడి లంగరులు వేసిరి. పౌలు బలవంతపెట్టగా అందుయున్న 276 మంది ఆహారము పుచ్చుకొని, ఆ తరువాత గోధుమలను సముద్రములో పారబోసి ఓడ తేలికచేసిరి. ఉదయమైనప్పుడు నావికులు లంగరుల త్రాళ్లుకోసి, చుక్కానుల కట్లువిప్పి, తెరచాపగాలికెత్తి సరిగా దరికి నడిపించిరి. అనివి కూరుకొనిపోయి కదలక యుండెను, అమరము ఆ దెబ్బకు బద్దలై పోసాగెను. అయితే అందరు తప్పించుకొని దరిచేరిరి.
19. మెలితేలో పౌలునకు ఏమి జరిగినది, మరియు అక్కడ ఆయన ఇతరులకు ఏమిచేసెను?
19 ఓడబద్దలైనందున తడిసి, అలసిపోయిన వారు తాము మెలితే చేరుకొన్నట్లు కనుగొనిరి. అచ్చట ఆ ద్వీపవాసులు వారికి చేసిన “ఉపచార మింతంతకాదు.” (28:1-16) అచ్చట పౌలు పుల్లలేరి నిప్పులమీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టుకొనెను. (ప్రస్తుతము మెలితేలో విష సర్పములు లేవు. అయితే ఇది ఒక “విషప్రాణియైయుండెను.”) మెలితే ద్వీపవాసులు పౌలును నరహంతకుడనుకొని “న్యాయమాతనిని” బ్రదుకనియ్యదని తలంచిరి. అయితే ఆయన శరీరము వాచకయు, అకస్మాత్తుగా పడిచచ్చుటయు జరుగనప్పుడు ఆయనను వారు ఇతడొక దేవత అని చెప్పసాగిరి. మెలితేలో ముఖ్యుడైన పొప్లి తండ్రితో సహా పౌలు అనేకులను స్వస్థపరచెను. మూడునెలల తరువాత పౌలు, లూకా మరియు అరిస్తార్కు “అశ్విని” చిహ్నముగల (నావికులకు తోడైయుండు కేస్టరు మరియు పోలక్స్ అను జంట దేవతలు) ఓడనెక్కి బయలుదేరిరి. పొతియొలీకి వచ్చిన తరువాత యూలి తన మార్గమున వెళ్లిపోయెను. ముఖ్యపట్టణమైన రోమా నుండి క్రైస్తవులు వారిని ఎదుర్కొనుటకై అప్పీయా సంతపేట వరకును త్రిసత్రములవరకును వచ్చినపుడు పౌలు ధైర్యము తెచ్చుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లించెను. చివరకు రోమాకు వచ్చినప్పుడు తనకు కావలియున్న సైనికులతోకూడ ప్రత్యేకముగా ఉండుటకు సెలవుపొందెను.
యెహోవా రాజ్యమును ప్రకటించుచునే ఉండుట!
20. రోమాలోని తన ఇంటిలో ఏ పనితో పౌలు రద్దీగా యుండెను?
20 రోమాలో పౌలు తనయింటనుండి ధైర్యముగా యెహోవా రాజ్యమును ప్రకటించెను. (28:17-31) ముఖ్యులైన యూదా మనుష్యులకు “ఇశ్రాయేలుయొక్క నిరీక్షణకోసము ఈ గొలుసుతో కట్టబడియున్నానని” ఆయన చెప్పెను. మనమును బాధపడుటకు ఇష్టపడవలసిన ఆ నిరీక్షణయందు మెస్సియాను అంగీకరించుట ఇమిడియున్నది. (ఫిలిప్పీయులు 1:29) ఆ యూదులలో అనేకులు నమ్మకపోయినను అనేకమంది అన్యులు మరియు యూదా శేషము మంచి హృదయస్థితిని కలిగియుండిరి. (యెషయా 6:9, 10) తన యొద్దకు వచ్చు వారినందరిని చేర్చుకొని రెండు సంవత్సరములు (సా.శ. 59-61) పౌలు “ఏ ఆటంకమును లేక పూర్ణధైర్యముతో దేవుని రాజ్యమునుగూర్చి ప్రకటించుచు, ప్రభువైన యేసు క్రీస్తునుగూర్చిన సంగతులు బోధించుచు ఉండెను.”
21. తన భూజీవిత అంతమునకు, పౌలు ఏమాదిరి ఉంచిపోయెను?
21 నీరో పౌలును నిర్దోషిగా ఎంచి విడుదల చేసినట్లు స్పష్టమగుచున్నది. తరువాత అపొస్తలుడు తనపనిని తిమోతి మరియు తీతు సహవాసముతో తిరిగి ప్రారంభించాడు. అయినను ఆయన మరలా చెరసాలలో వేయబడి, బహుశా నీరో చేతులలోనే హతసాక్షియైనట్లున్నది. (2 తిమోతి 4:6-8) అయితే అంతవరకు పౌలు రాజ్యమును నిర్భయముగా ప్రకటించువానిగా మంచి మాదిరిని ఉంచిపోయెను. ఈ అంత్యదినములలో దేవునికి సమర్పించుకొన్న వారందరు అదే ఆత్మతో యెహోవారాజ్యమును ప్రకటించుదురుగాక! (w90 6/15)
మీరు ఎట్లు జవాబిచ్చెదరు?
◻ పరిచారక సంబంధమైన ఏ శిక్షణను పౌలు ఎఫెసు పెద్దలకు ఇచ్చెను?
◻ దేవుని చిత్తమునకు లోబడుటయందు పౌలు ఎట్లు మాదిరినుంచెను?
◻ అల్లరిమూక పైబడుటయందు పౌలు అనుభవములకును, ఈనాటి యెహోవాసాక్షుల అనుభవమునకు ఎలాంటి పోలిక కలదు?
◻ గవర్నరు ఫేస్తుముందు నిలబడినప్పుడు చట్టబద్ధమైన ఏ ఆధిక్యతను పౌలు ఉపయోగించుకొనెను, ఆధునిక దినమందు ఇది ఏ సమాంతరమును కలిగియున్నది?
◻ రోమాలోని తన ఇంటిలో ఏపనితో పౌలు రద్దీగా ఉండెను, ఇది ఏ మాదిరినుంచుచున్నది?