రాజ్యప్రచారకుల నివేదిక
మెక్సికోలో “ఆత్మయందు తీవ్రతగలవారైయుండుట”
దేశమంతయు ఆత్మయందు తీవ్రతగలవారై పనితో కదలింపబడుచున్నట్లున్నదని మెక్సికోలోని వాచ్‌టవర్ సొసైటి బ్రాంచి ఆఫీసు వ్రాయుచున్నది. అది ఎంతసత్యము! ఆ దేశములో కదలించివేయునట్టి పని ఆగస్టుతో వరుసగా 70 నెలసరి శిఖరాగ్రసంఖ్యలతో 2,77,436 ప్రచారకులకు చేరుకొనుటతో రుజువగుచున్నది. అదియేగాక 4,00,000 కంటె ఎక్కువ బైబిలు పఠనములు రిపోర్టుచేయబడినవి. గతసంవత్సరము జ్ఞాపకార్థదినమునకు హాజరైన వారిసంఖ్య 10,46,291కి చేరినది. భవిష్యత్తు అభివృద్ధికి ఎంతటి మంచి ఆధారము!
1989కి ఒక ఉన్నతాంశమేమనగా మెక్సికోలోని యెహోవాసాక్షులు కలిగియున్న స్థానములో మార్పు. తత్ఫలితముగా మొట్టమొదటిసారిగా యింటింటిసేవా ప్రకటన పనిలో బైబిలును ఉపయోగించవచ్చును. కూటములను ప్రార్థనతో ప్రారంభించవచ్చును. ఇది వెంటనే ప్రభావమును చూపినది. రెండునెలలో ప్రచారకుల సంఖ్య 17,000లకు పెరిగినది.
ఈ అభివృద్ధియందు సహోదరులకు కలిగిన సంతోషమును వారుచేసిన వ్యాఖ్యానములందు చూడవచ్చును. ఒకరు యిలా వ్రాసెను: “ఆ ఉత్తరమును సంఘములో చదివినప్పుడు అనుకొనకుండా కొట్టబడిన చప్పట్లతో రెండుసార్లు దానికి అంతరాయము కలిగెను. అది పులకరింపజేయునదై యుండెను!” ఇంకొకరు యిలా అన్నారు: “ఆనందముతో వచ్చిన కన్నీటిని మేము ఆపుకోలేకపోయాము. మంచి క్రమబద్ధతను పాటించుటయందు దానిఫలితములు కన్పించుచున్నవి. ప్రతిఒక్కరు ప్రారంభప్రార్థనకు రావలయునని కోరుచున్నారు.”
ఇంకొక సాక్షి యిలా చెప్పెను: “‘మా ప్రాంతములో’ కేథలిక్ బైబిలుపఠన కార్యక్రమమందు చురుకుగా పాల్గొనుచున్న ఒకస్త్రీ యిలా వ్యాఖ్యానించెను: ‘కేవలము వారిమాటలు మరియు పత్రికలతోనే (సాక్షులు) మానోట మాటరానియ్యకుండా చేసారు. ఇప్పుడు వారు యిండ్లయొద్ద బైబిలులు తెరచుచున్నారు కావున ఇక మేము పూర్తిగా పోయినట్లే!’”
మెక్సికోలోని యెహోవాసాక్షులు బైబిలుతో తటస్థసాక్ష్యమిచ్చుటకును ప్రాముఖ్యతనిచ్చుచున్నారు. ఒక సహోదరి ఒకామెను కలువగా ఆమె గర్భస్రావమునుగూర్చి మీ తలంపేమని యడిగెను. అందుకు సాక్షి యిలా ప్రత్యుత్తరమిచ్చెను: “నేను ఏమి అనుకొంటున్నాను అనునది బైబిలంత ప్రాముఖ్యముకాదు.” అనేకలేఖనములు చదివినతరువాత సహోదరి యిలా తర్కించెను: “సృష్టికర్తకు ప్రాణము ఎంతో ప్రాముఖ్యమైనది, చివరకు యింకా జన్మించని వారి ప్రాణముకూడా అంతే ప్రాముఖ్యము.”
అప్పుడు ఆ స్త్రీ తనకు తొలిసారిగా సంతానము కలుగ బోవుచున్నదనియు, పుట్టబోవుబిడ్డ అసహజముగా జన్మించుననియు వైద్యపరీక్షలు తెలిపినట్లు తెలియజేసినది. ఆమె డాక్టరు ఆమెను గర్భస్రావము చేయించుకొనవలెనని కోరాడు, తనభర్తయు అందుకు అంగీకరించాడు, కాని ఆమె మాత్రము ఇంకా ఒక నిర్ణయమునకు రాలేదు. ఈ ప్రచారకురాలు యింకను బైబిలునుండి ఎక్కువగా తర్కించి తనపేరును తెలియజేసి ఎవరిదారిన వారు వెళ్లిపోయారు.
అయిదు సంవత్సరముల తర్వాత ఒక జిల్లా సమావేశములో ఒక దంపతులు తమ బిడ్డతో ఈ సహోదరిని ఆమె భర్తను చూడాలనుకున్నారు. ఆమె ఆ మొదటి స్త్రీయే! జరిగిన దేమి? ఈ సాక్షితో మాట్లాడిన తరువాత ఆ స్త్రీ తనకుబిడ్డ కావలెనని నిర్ణయించుకొంది. ఆమె డాక్టరు తనను మరలా చూచుటకు తిరస్కరించాడు. ఒక వేళ బిడ్డగాని ఏదైన లోపముతో జన్మిస్తే తనను వదలివేస్తానని భర్త ఆమెను బెదరించాడు. చివరకు ప్రసవ సమయమొచ్చినప్పుడు ఆమెకు దొరకగలిగిన డాక్టరుయొద్దకు వెళ్లెను.
బిడ్డ పుట్టినవెంటనే డాక్టరు “ఆమెకు అభివందనములను చెప్పి నీకు చక్కని పాప పుట్టినదని చెప్పెను.” తనచెవులనే తాను నమ్మలేక పాపను జాగ్రత్తగా పరీక్షచేయుమని అడిగెను. డాక్టరు ఇదొక అద్భుతమని చెప్పెను. ఆమె తాను ప్రాణముయొక్క పవిత్రతయెడల యెహోవాదృష్టిని గౌరవించగల ధైర్యమును కలిగియున్నందుకు ఆమె సంతోషించెను. తదుపరి చక్కని ఆ బిడ్డకు ఆ సహోదరి పేరుపెట్టెను. ఆమెకు వెళ్లగలశక్తి కలగగానే సాక్షులకొరకు వెదకి వారితో బైబిలును పఠించుట ప్రారంభించెను. ఒక్క సంవత్సరములోపల తాను తన భర్తయు బాప్తిస్మము పొందిరి.
అపొస్తలుడైన పౌలు గట్టిగా యిట్లు పురికొల్పెను: “ఆత్మయందు తీవ్రతగలవారై, యెహోవాను సేవించుడి” (రోమా 12:11 NW) ప్రతిచోటయున్న నిజక్రైస్తవులవలెనె మెక్సికోలోని యెహోవాసాక్షులు ఈ హెచ్చరికకు వారిపూర్ణహృదయముతో ప్రత్యుత్తరమిచ్చిరి. అందుకే దేశమంతయు ఆత్మయందు తీవ్రతగలవారై ఆత్మీయ కార్యముతో కదలుచున్నది. తనయందు యథార్థత గలవారిని ఎంత నిండుగా యెహోవా దీవించును! (w90 1/1)