యెహోవా వాక్యము వ్యాపించుట!
“ప్రభావముతో యెహోవా వాక్యము ప్రబలమై వ్యాపించెను.”—అపొ.కార్యములు 19:20 NW.
1. ఈ బైబిలు పుస్తకమగు అపొస్తలుల కార్యముల పఠనములో ఏయే విషయములు పరిగణలోనికి వచ్చును?
యెహోవా కార్యమునకు ద్వారము తెరచుచుండెను. ప్రత్యేకముగా “అన్యజనులకు అపొస్తలుడైన,” పౌలు ఆ పనిని ముందుకు తీసుకువెళ్లెను. (రోమీయులు 11:13) నిజముగా, అపొస్తలుల కార్యములను గూర్చిన మన పఠనములో, ఆయన పులకరింపజేయు మిషనరీ యాత్రలందు పాల్గొనుటను మనము కనుగొందుము.—అపొ.కార్యములు 16:6–19:41.
2. (ఎ) సా.శ. 50 నుండి సా.శ. 56 వరకు దైవప్రేరణగల రచయితగా పౌలు ఎట్లు సేవచేసెను? (బి) పౌలు మరియు యితరుల పరిచర్యను దేవుడు ఆశీర్వదించుచుండగా ఏమి జరిగెను?
2 పౌలు దైవప్రేరణగల రచయితయై కూడ యున్నాడు. ఆయన సా.శ. 50 నుండి సా.శ. 56 మధ్య కొరింథునుండి 1, 2 థెస్సలొనీకయులకు, అదే పట్టణము లేక సిరియా అంతియొకయనుండి గలతీయులకు, 1 కొరింథీయులు ఎఫెసునుండి, 2 కొరింథీయులకు మాసిదోనియనుండి, రోమీయులకు కొరింథునుండి వ్రాసెను. పౌలు మరియు యితరుల పరిచర్యను దేవుడు ఆశీర్వదించుచుండగా, “ప్రభావముతో యెహోవా వాక్యము ప్రబలమై వ్యాపించెను.”—అపొ.కార్యములు 19:20 NW.
ఆసియా నుండి ఐరోపాకు
3. పరిశుద్ధాత్మ నడిపింపు సంబంధముగా పౌలు అతని సహవాసులు ఎట్లు శ్రేష్టమైన మాదిరినుంచిరి?
3 పరిశుద్ధాత్మద్వారాగల నడిపింపును స్వీకరించుటలో పౌలు అతని సహవాసులు శ్రేష్ఠమైన మాదిరినుంచిరి. (16:6-10) బహుశ స్వరములను విన్పింపజేసి బయల్పరచుట, స్వప్నములు, లేక దర్శనములద్వారా ఆత్మ వారు ఆసియ జిల్లాలో బితూనియ రాష్ట్రములో ప్రకటించకుండ ఆటంకపరచెను, కాగా ఈ ప్రాంతములలో సువార్త తర్వాత ప్రకటింపబడెను. (అపొ.కార్యములు 18:18-21; 1 పేతురు 1:1, 2) ప్రవేశించుటను తొలుత ఆత్మ వారినెందుకు అడ్డగించెను? శ్రమించువారు కొద్దిమందియే కలరు, కాగా ఆత్మ ఐరోపాలో ఎక్కువ ఫలవంతమైన క్షేత్రములకు వారిని నడిపించుచుండెను. అదేవిధముగా ఈనాడు ఒకప్రాంతమునకు మార్గము ఆటంకపరచబడినప్పుడు, యెహోవా సాక్షులు మరొకచోట ప్రకటింతురు, నిశ్చయముగా దేవుని ఆత్మ వారిని గొర్రెవంటివారి యొద్దకు నడిపించును.
4. మాసిదోనియలో సహాయమును ఆర్ధించిన మనుష్యునిగూర్చిన పౌలు దర్శనమునకు ప్రతిస్పందన ఏమైయుండెను?
4 అప్పుడు పౌలు అతని సహవాసులు మిషనరీ క్షేత్రముగా, ఆసియా మైనర్లోని ఒకప్రాంతమైన ముసియను ‘దాటిపోయిరి.’ అయితే దర్శనములో పౌలు మాసిదోనియలో ఒక మనుష్యుడు సహాయమును అర్ధించుచున్నట్లు చూసెను. కావున సరియైన సమయమునకు మిషనరీలు బాల్కన్ ద్వీపకల్ప ప్రాంతమైన మాసిదోనియకు వెళ్లిరి. అదేప్రకారముగా, రాజ్య ప్రచారకుల అవసరము ఎక్కడ ఎక్కువగా ఉన్నదో అక్కడ సేవచేయుటకు అనేకమంది సాక్షులు పరిశుద్ధాత్మద్వారా నడిపింపబడుచున్నారు.
5. (ఎ) యెహోవా వాక్యము ఫిలిప్పీలో వ్యాపించెనని ఎందుకు చెప్పవచ్చును? (బి) ప్రస్తుత-దిన సాక్షులు అనేకమంది ఏవిధముగా లూదియను పోలియున్నారు?
5 యెహోవా వాక్యము మాసిదోనియలో వ్యాపించెను. (16:11-15) రోము పౌరులు ఎక్కువగా నివసించు ఫిలిప్పీలో, చాలా తక్కువగా యూదులు ఉండిరి మరియు అక్కడ సమాజమందిరము లేకుండెను. కాబట్టి, పట్టణము వెలుపట నదీతీరమున “ప్రార్థన జరుగు స్థలము” నకు వెళ్లిరి. అక్కడ చేరియున్న వారిలో వారు లూదియను కనుగొనిరి, ఈమె బహుశ ఆసియా మైనర్లో అద్దకపు పరిశ్రమకు పేరుగాంచిన తుయతైరనుండి వచ్చిన యూదామత ప్రవిష్టురాలై యుండవచ్చును. ఆమె ఊదారంగు పొడిని లేక ఆ రంగు అద్దకము చేయబడిన వస్త్రములను అమ్ముకొనునదై యుండెను. లూదియ, ఆమె కుటుంబ సభ్యులు బాప్తిస్మము తీసుకొనిన తర్వాత, ఆమె ఎంత మనఃపూర్వకముగా ఆతిథ్యమిచ్చెననగా, లూకా దానినిగూర్చి యిలా వ్రాసెను: ఆమె “వచ్చియుండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను.” ఈనాడు అటువంటి సహోదరీలకు మనము కృతజ్ఞత గలవారమై యున్నాము.
చెరసాల నాయకుడు విశ్వాసియగుట
6. దయ్యముల కార్యము ఎట్లు ఫిలిప్పీలో పౌలు, సీల చెరసాలలో వేయబడుటకు నడిపించెను?
6 ఫిలిప్పీలో జరుగుచున్న ఆత్మీయ అభివృద్ధుల యెడల సాతాను బహుశ కోపముగల వాడైయుండవచ్చును, ఏలయనగా, అక్కడి దయ్యముల కార్యము పౌలు సీల చెరసాలలో వేయబడుటకు నడిపించెను. (16:16-24) కొన్ని దినములపాటు “దయ్యము పట్టినదై సోదెచెప్పు” (అక్షరార్థముగా, “పుతోను అను ఆత్మ”) చిన్నది వారిని వెంబడించెను. పైతాన్ అను పేరుగల సర్పమును సంహరించాడను పేరుగల దేవతయగు అపొలో దేవుని వేషమును ఆ దయ్యము ధరించియుండవచ్చును. సోదెచెప్పుటచేత ఆమె తన యజమానులకు బహులాభము సంపాదించుచుండెను. అంతెందుకు, ఆమె రైతులకు ఎప్పుడు నాట్లు వేయవలెను, ఆడపిల్లలు ఎప్పుడు పెండ్లాడవలెను, గని కార్మికులు ఎక్కడ బంగారము కొరకు చూడవలెను తదితర విషయములను చెప్పియుండవచ్చును. ఆమె వారిని వెంబడించుచు: “ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణమార్గమును ప్రచురించువారై యున్నారు.” అని కేకలువేసి చెప్పుచుండెను. ఆమె మాటలు దైవప్రేరితమని కన్పించునట్లు చేయుటకు దయ్యములు ఆమెను ఉపయోగించియుండవచ్చును, అయితే యెహోవానుగూర్చి రక్షణకొరకైన ఆయన ఏర్పాటునుగూర్చి ప్రకటించుటకు దయ్యములకు ఎలాంటి హక్కు లేదు. ఈ వేధింపునకు విసిగివేసారినవాడై పౌలు యేసు నామమున ఆ దయ్యమును వెళ్లగొట్టెను. వారి వ్యాపారము నాశనమైనందున, ఆ చిన్నదాని యజమానులు పౌలును సీలను సంతచావడిలోనికి ఈడ్చుకొనిపోయిరి, అక్కడ వారు బెత్తములతో కొట్టబడిరి. (2 కొరింథీయులు 11:25) ఆపిమ్మట వారిని చెరసాలలో వేయించి వారికాళ్లకు బొండవేసి బిగించిరి. ఒకనికి బహుగా నొప్పి కల్గుటకు కారణమగునట్లు కాళ్లను వెడల్పు చేయుటకు వీలుగా అటువంటి ఉపకరణములు కదిపి సవరించునవిగా యుండెను.
7. ఫిలిప్పీలో పౌలు, సీల చెరసాలలో వేయబడుట ఎవరికి మరియు ఎట్లు ఆశీర్వాదమునకు నడిపించెను?
7 ఈ విధముగా చెరసాలలో వేయబడుట చెరసాల నాయకుడు అతని కుటుంబము ఆశీర్వదించబడుటకు నడిపెను. (16:25-40) దాదాపు మధ్యరాత్రివేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండగా, నిశ్చయముగా ఆయన వారికి తోడైయుండెను. (కీర్తన 42:8) అప్పుడు అకస్మాత్తుగా కలిగిన భూకంపము వలన, తలుపులు తెరచుకొనెను మరియు సంకెళ్లు గోడలు లేక దూలముల కొక్కెములనుండి వేరైపోవుటచేత వారి బంధకములన్నియు ఊడిపోయెను. ఖైదీలు పారిపోయినందున తనకు మరణశిక్ష వచ్చునని చెరసాల నాయకుడు భయపడి, ఆత్మహత్య చేసుకొనబోవుచుండగా, పౌలు: “నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనేయున్నామని” చెప్పెను. అతడు పౌలును, సీలను వెలుపలికి తీసుకొనివచ్చి, తానెట్లు రక్షణపొందగలనని వారినడిగెను. దానికి వారు, “ప్రభువైన యేసునందు విశ్వాసముంచుమని” జవాబిచ్చిరి. యెహోవా వాక్యము వినినమీదట, “వెంటనే అతడును అతని ఇంటివారందరును బాప్తిస్మము పొందిరి.” అది ఎంత ఆనందమును తెచ్చెను!
8. ఫిలిప్పీ న్యాయాధిపతులు ఎటువంటి చర్య తీసుకొనిరి, మరియు వారు బహిరంగముగా తమ తప్పిదమును ఒప్పుకొనినట్లయిన ఏమి సాధింపబడవచ్చును?
8 ఆ మరుసటి దినమున, న్యాయాధిపతులు పౌలును సీలను విడుదల చేయుమని కబురు పంపించిరి. అయితే పౌలు: ‘వారు న్యాయము విచారింపకయే రోమీయులమైన మమ్మును కొట్టించి చెరసాలలో వేయించిరి. యిప్పుడు మమ్మును రహస్యముగా వెళ్లగొట్టుదురా? వారే వచ్చి మమ్మును వెలుపలికి తీసుకొని పోవలెనని’ చెప్పెను. వారు చేసిన తప్పిదమును న్యాయాధిపతులు బహిరంగముగా ఒప్పుకొనినట్లయిన, వారు యితర క్రైస్తవులను కొట్టుటకు మరియు చెరసాలలో వేయుటకు వెనుకాడవచ్చును. రోమా పౌరులను వెళ్లగొట్టలేనివారై, న్యాయాధిపతులు వచ్చి సహోదరులు వెళ్లవలసిందిగా వేడుకొనిరి, అయితే వీరు తోటి విశ్వాసులను ప్రోత్సహించిన తర్వాతగాని వెళ్లలేదు. అటువంటి శ్రద్ధ యిప్పుడు భూవ్యాప్తముగా దేవుని ప్రజలను ప్రోత్సహించుటకు గవర్నింగ్బాడి సభ్యులను మరియు యితర ప్రయాణ ప్రతినిధులను కదిలించుచున్నది.
యెహోవా వాక్యము థెస్సలొనీక మరియు బెరయలో వ్యాపించుట
9. యిప్పటికిని యెహోవా సాక్షులు ఉపయోగించు ఏ పద్ధతిద్వారా, పౌలు మెస్సీయా శ్రమపడి మృతులలోనుండి లేవవలెనని ‘వివరించి నిరూపించెను’?
9 తర్వాత మాసిదోనియ ముఖ్య పట్టణమును, ముఖ్య సముద్ర రేవును అయిన థెస్సలొనీకలో దేవుని వాక్యము వ్యాపించెను. (17:1-9) అక్కడ పౌలు యూదులతో మెస్సీయా శ్రమపడి మృతులలోనుండి లేవవలెనని, తర్కించి “వివరించుచు నిరూపించెను.” (యెహోవా సాక్షులు యిప్పటికిని చేయునట్లుగానే, పౌలు నెరవేర్పునందలి సంఘటనలతో ప్రవచనములను పోల్చుచు అట్లు చేసెను.) ఆ విధముగా కొందరు యూదులు అనేకమంది యూదామత ప్రవిష్టులు మరియు యితరులు విశ్వాసులైరి. మత్సరపడిన కొందరు యూదులు వారిమీద దాడి చేయుటకు అల్లరిమూక నొకదానిని తయారుచేసిరి, అయితే పౌలును సీలను కనుగొనలేక వారు యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారులయొద్దకు తీసుకొనివెళ్లి వారు రాజద్రోహము చేయుచున్నారని ఆరోపించిరి, యిప్పటికిని అదే అబద్ధ ఆరోపణ యెహోవా ప్రజలమీద చేయబడుచున్నది. అయితే, తగిన “జామీను” యిచ్చినమీదట వారు సహోదరులను విడుదల చేసిరి.
10. ఏ భావమునందు బెరయలోని యూదులు లేఖనములను ‘జాగ్రత్తగా పరిశీలించుచు’ వచ్చిరి?
10 ఆ పిమ్మట పౌలు, సీల బయలుదేరి బెరయకు వెళ్లిరి. (17:10-15) అక్కడ యూదులు ‘లేఖనములను జాగ్రత్తగా పరిశీలించిరి,’ ఈనాడును ప్రజలట్లే చేయవలెనని యెహోవా సాక్షులు ప్రోత్సహింతురు. బెరయ నివాసులు పౌలును సందేహించలేదు అయితే యేసే మెస్సీయాయని నిరూపించుటకు వారు పరిశోధన చేసిరి. ఫలితము? అనేకమంది యూదులు కొందరు గ్రీసు దేశస్థులు (బహుశ యూదామత ప్రవిష్టులు) విశ్వాసులైరి. థెస్సలొనీకలోని యూదులు జనసమూహములను రేపినప్పుడు, సహోదరులు పౌలుకు రక్షణగా సముద్రతీరమువరకు వచ్చిరి, వారిలో బహుశ కొందరు ఆయనతోకూడ ఏథెన్సుయొక్క రేవు పట్టణమైన పైరేయియస్కు (ఆధునిక-దిన పైరేయివ్స్) వెళ్లు ఓడ ఎక్కివెళ్లివుండవచ్చును.
యెహోవా వాక్యము ఏథెన్సులో వ్యాపించుట
11. (ఎ) ఏథెన్సులో పౌలు ఎట్లు ధైర్యముగా సాక్ష్యమిచ్చెను, అయితే ఎవరు ఆయనతో తర్కనకుదిగి వాదించిరి? (బి) పౌలు “వదరుబోతు” అని మాట్లాడినప్పుడు వారిలో కొందరి భావమేమై యుండెను?
11 ధైర్యముగా ఏథెన్సులో సాక్ష్యము యివ్వబడెను. (17:16-21) పౌలు యేసునుగూర్చి పునరుత్థానమునుగూర్చి మాట్లాడినందున, తాత్వికులు ఆయనతో తర్కవాదనకు దిగిరి. వారిలో కొందరు సుఖభోగములను నెక్కిచెప్పు ఎపికూరీయులై యుండిరి. కాగా యితరులు స్వయం క్రమశిక్షణను నొక్కితెల్పు స్తొయకులై యుండిరి. వారిలో కొందరు ‘ఈ వదరుబోతు చెప్పునదేమిటి?’ అనిరి. “వదరుబోతు” (అక్షరార్థముగా “గింజలు ఏరువాడు”) అనుమాట పౌలు పక్షినిపోలి అక్కడక్కడి గింజలు ఏరుకొనువానిగా, మిడిమిడి జ్ఞానముగలవాడేగాని వివేకము లేనివాడను భావమునిచ్చినది. మరికొందరు, “వీడు అన్యదేవతలను ప్రచురించుచున్నాడని” చెప్పుకొనిరి. యిది గంభీరమై యుండెను, ఏలయనగా సోక్రటీసు ఆ ఆరోపణ మీదనే తన ప్రాణములను పోగొట్టుకొనెను. ఆ వెంటనే పౌలు అరేయొపగునొద్దకు (మార్సు కొండ) తీసుకొనివెళ్లబడెను, అక్కడ ఆక్రొపొలిస్ దగ్గర ఆరుబయట సర్వోన్నత న్యాయసభ సమావేశమై యుండవచ్చును.
12. (ఎ) అరేయొపగునొద్ద పౌలు యిచ్చిన ప్రసంగములో మంచి బహిరంగ ప్రసంగముయొక్క ఏ అంశములు కలవు? (బి) దేవునిగూర్చి ఏ అంశములను పౌలు ప్రస్తావించెను, దాని ఫలితమేమై యుండెను?
12 యెహోవా సాక్షుల దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో బోధింపబడునట్లుగా—అరేయొపగు దగ్గర పౌలు యిచ్చిన ప్రసంగము ప్రభావితమైన ఉపోద్ఘాతము, న్యాయసమ్మతముగా వృద్ధిచేయుట, మరియు ఒప్పింపజేయు తర్కములను కలిగియున్న శ్రేష్ఠమైన ఉదాహరణయై యున్నది. (17:22-34) ఏథెన్సువారలు యితరులకంటే అమిత భక్తిపరులని ఆయన అనెను. అంతెందుకు, వారు బహుశ ఏ దేవతనైనను తక్కువచేయుటను విడనాడుటకు “తెలియబడని దేవునికొక” బలిపీఠమును కలిగియుండిరి. “ఒకనినుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి,” ఉదాహరణకు కనానీయులను ఎప్పుడు పెరికివేయవలెననుటవంటి “నిర్ణయకాలమును వారి నివాసస్థలముయొక్క పొలిమేరలను ఏర్పరచిన” సృష్టికర్తనుగూర్చి పౌలు మాట్లాడెను. (ఆదికాండము 15:13-21; దానియేలు 2:21; 7:12) వారి కవీశ్వరులైన ఆరేటస్ మరియు క్లెన్థెస్ మాటలను ఎత్తిచూపుచు మానవసృష్టి యెహోవాద్వారా కలిగెనని ప్రస్తావించుచు, “మనము దేవుని సంతానమైనందున” ఆ దేవుని కనుగొనవచ్చునని పౌలు చెప్పెను. దేవుని సంతానముగా అసంపూర్ణ మానవుడు తయారుచేయు ఒక విగ్రహముగా పరిపూర్ణ సృష్టికర్తయుండునని మనము తలంచకూడదు. ఆ అజ్ఞానకాలములను దేవుడు చూసిచూడనట్లుగా ఉండెను, అయితే యిప్పుడాయన మానవజాతి మారుమనస్సు పొందవలెనని చెప్పుచున్నాడు, ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత తీర్పుతీర్చుటకు ఒక దినమును నిర్ణయించియున్నాడు. పౌలు “యేసునుగూర్చి సువార్త ప్రకటించుచుండెను” గనుక, ఆ న్యాయాధిపతి క్రీస్తని అతని భావమని ఆయన ప్రేక్షకులు ఎరిగియుండిరి. (అపొ.కార్యములు 17:18; యోహాను 5:22, 30) పశ్చాత్తాపమును గూర్చిన మాట ఎపికూరీయులకు చికాకు కల్గించినవి, గ్రీకు తాత్వికులు అమర్త్యతనుగూర్చి పలుకబడు మాటలను తప్ప మరణ పునరుత్థానములనుగూర్చిన మాటలను అంగీకరించలేరు. స్పష్టముగా, సువార్తను యిప్పుడును ఖాతరుచేయని అనేకులవలెనే కొందరు యిట్లనిరి: ‘నీవు చెప్పునది యింకొకసారి వింటాము.’ అయితే న్యాయాధిపతియైన దియొనూసియ మరియు మరికొందరు విశ్వాసులైరి.
దేవుని వాక్యము కొరింథులో వ్యాపించుట
13. పరిచర్యనందు పౌలు తననుతాను ఎట్లు పోషించుకొనెను, మనము ఏ ఆధునిక-దిన సమాంతరమును కనుగొందుము?
13 అకయ రాష్ట్రమునకు ముఖ్యపట్టణమైన కొరింథుకు పౌలు వెళ్లెను. (18:1-11) అక్కడ ఆయన అకులను ప్రిస్కిల్లను కనుగొనెను, వీరు క్లౌదియ కైసరు రోమా పౌరులు కాని యూదులందరు రోమును విడిచిపోవలెనని యూదులకు ఆజ్ఞాపించినందున అక్కడకు వచ్చిరి. పరిచర్యయందు తననుతాను పోషించుకొను నిమిత్తము పౌలు ఈ క్రైస్తవ దంపతులతో కలిసి డేరాలు తయారుచేసెను. (1 కొరింథీయులు 16:19; 2 కొరింథీయులు 11:9) ముదకదైన మేక-వెంట్రుకల బట్టను కత్తిరించుట కుట్టుట కష్టమైన పని. అదేప్రకారముగా యెహోవా సాక్షులు వారి వస్తుదాయక అవసరతలకై ఉద్యోగము చేయుదురు, అయితే పరిచర్య వారి వృత్తియైయున్నది.
14. (ఎ) కొరింథులో యూదులద్వారా తదేకమైన వ్యతిరేకతను ఎదుర్కొనినవాడై, పౌలు ఏమి చేసెను? (బి) పౌలు కొరింథులో నిలిచియుండవలెనని ఆయనకు ఎట్లు అభయమివ్వబడెను, అయితే ఈనాడు యెహోవా ప్రజలు ఎట్లు నడిపింపబడుచున్నారు?
14 క్రీస్తే మెస్సీయాయని ప్రకటించుచుండగా కొరింథులోని యూదులు ఆయనను ఎడతెగక దూషించుచు వచ్చిరి. కాబట్టి వారియెడల తన బాధ్యత ఏమి లేదనుటకు వారివైపు తన వస్త్రములను దులిపి, ఆయన వచ్చి బహుశ రోము పౌరుడైన తీతియు యూస్తు యింట కూటములను జరిపించుటకు ఆరంభించెను. అనేకమంది (సమాజమందిరపు మాజీ అధికారియైన క్రిస్పు అతని యింటివారిని కలుపుకొని) బాప్తిస్మము తీసుకొనిన విశ్వాసులైరి. యూదుల వైరస్వభావమువలన కొరింథులో ఎందుకు ఉండవలెనని పౌలు అనుకొనినట్లయిన, దర్శనమందు ప్రభువు ఆయనతో చెప్పిన ఈ మాటలతో ఆ సందేహము తీరిపోయెను: ‘భయపడకుము. మౌనముగా ఉండకుము. నేను నీకు తోడైయున్నాను, ఏ నరుడును నీకు హానిచేయడు. ఈ పట్టణములో నాకు బహుజనమున్నది.’ కాగా పౌలు దేవుని వాక్యమును బోధించుచు, ఒక సంవత్సరముమీద ఆరునెలలు అక్కడ గడిపెను. ప్రస్తుతము యెహోవా ప్రజలకు అటువంటి దర్శనములు కలుగకపోయినను, ప్రార్థన మరియు పరిశుద్ధాత్మ నడిపింపు సహాయముద్వారా రాజ్యాసక్తులకు సంబంధించి జ్ఞానయుక్తముగా అటువంటి నిర్ణయములను చేయుదురు.
15. పౌలు రోము రాజప్రతినిధియైన గల్లియోను ఎదుటకు తీసుకువెళ్లబడినప్పుడు ఏమి సంభవించెను?
15 యూదులు పౌలును రోము రాజప్రతినిధిగా న్యాయముతీర్చు జూనియస్ గల్లియోను యొద్దకు తీసుకువెళ్లిరి. (18:12-17) పౌలు చట్టవిరుద్ధముగా మతమార్పిడి చేయుచున్నాడని ఆరోపించిరి—యిదేవిధమైన అబద్ధమైన ఆరోపణను గ్రీకు మతనాయకులు యిప్పుడు యెహోవా సాక్షులకు వ్యతిరేకముగా చేయుచున్నారు. పౌలు చెడ్డపనిచేసిన దోషికాదని, యూదులు రోము సంక్షేమమును, చట్టమును లక్ష్యపెట్టనివారని ఎరిగినవాడై గల్లియోను వారిని తోలివేసెను. అక్కడ చేరినవారు క్రొత్త సమాజమందిరపు అధికారియైన సోస్తెనేసును పట్టుకొని కొట్టినను, పౌలుకు వ్యతిరేకముగా అల్లరిమూకను రేపిన నాయకునిగా అతనికి తగిన శాస్తి జరిగినదని బహుశ తలంచి గల్లియోను కలుగజేసుకొనలేదు.
16. ఒకానొక మ్రొక్కుబడి సంబంధముగా పౌలు తలవెండ్రుకలు కత్తిరించుకొనుట ఎందుకు అంగీకరింపబడునదై యున్నది?
16 పౌలు ఆసియా మైనర్ నందలి ఒక పట్టణమైన కెంక్రేయలోని ఏగియన్ రేవునుండి ఎఫెసుకు వెళ్లెను. (18:18-22) ఆ ప్రయాణమునకు ముందు ఆయన ‘తనకు మ్రొక్కుబడియున్నందున తలవెండ్రుకలు కత్తిరించుకొనెను.’ పౌలు యేసు అనుచరునిగా కాకముందు మ్రొక్కుబడి చేసుకొనెనా లేక అది మ్రొక్కుబడి ప్రారంభకాలమా లేక ముగింపు కాలమా అను విషయము చెప్పబడలేదు. క్రైస్తవులు ధర్మశాస్త్రముక్రింద లేరు, అయితే అది దేవుడనుగ్రహించినది మరియు పరిశుద్ధమునైయున్నది, అటువంటి మ్రొక్కుబడిని చెల్లించుటలో పాపమేమియు లేదు. (రోమీయులు 6:14; 7:6, 12; గలతీయులు 5:18) ఎఫెసులో పౌలు యూదులతో తర్కించిన తదుపరి, దేవుని చిత్తమైతే మరలా వచ్చెదనని వారికి వాగ్ధానము చేసెను. (ఆ వాగ్ధానము ఆ తర్వాత నెరవేరెను.) ఆయన సిరియలోని అంతియొకయకు తిరిగివచ్చుటతో ఆయన రెండవ మిషనరీ యాత్ర ముగించబడెను.
ఎఫెసులో యెహోవా వాక్యము వ్యాపించుట
17. బాప్తిస్మము సంబంధముగా, అపొల్లకు కొంతమంది యితరులకు ఏ ఉపదేశము అవసరమై యుండెను?
17 త్వరలోనే పౌలు తన మూడవ మిషనరీ యాత్రను (సా.శ. 52-56 ఆ ప్రాంతములో) ప్రారంభించెను. (18:23-19:7) ఈలోపున ఎఫెసులో, అపొల్ల యేసునుగూర్చి బోధించెను, అయితే అతడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా చేసిన పాపములకు పశ్చాత్తాప సూచనగా కేవలము యోహాను బాప్తిస్మమునుగూర్చి మాత్రమే ఎరిగియుండెను. యేసువలె బాప్తిస్మము పొందుటయందు ఒకడు నీటిలో ముంచబడుటయు కుమ్మరింపబడు పరిశుద్ధాత్మను పొందుటయు అని బహుశ వివరించుచు, అకులయు ప్రిస్కిల్లయు “దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచిరి.” సా.శ. 33లో పెంతెకొస్తునాడు పరిశుద్ధాత్మద్వారా బాప్తిస్మము పొందుట జరిగినదగ్గరనుండి, యోహాను బాప్తిస్మముతో బాప్తిస్మము పొందిన ఎవరైనను మరలా యేసు నామమున బాప్తిస్మము తీసుకొనుట అవసరమై యుండెను. (మత్తయి 3:11, 16; అపొ.కార్యములు 2:38) ఆ తర్వాత ఎఫెసులో యోహాను బాప్తిస్మము తీసుకొనిన 12 మంది మనుష్యులు “ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి.” కేవలము యిక్కడ మాత్రమే రెండవసారి బాప్తిస్మము పొందుటనుగూర్చి లేఖనములలో వ్రాయబడియున్నది. పౌలు వారిమీద చేతులుంచగా, వారు పరిశుద్ధాత్మను పొందిరి, కాగా పరలోక అంగీకారమునకు రెండు అద్భుతమైన సూచనలుగా వారు భాషలతో మాటలాడిరి మరియు ప్రవచించిరి.
18. ఎఫెసులో ఉండగా ఎక్కడ పౌలు సాక్ష్యమిచ్చెను, దాని ఫలితమేమై యుండెను?
18 దాదాపు 3 లక్షల మంది నివాసులుగల ఎఫెసు పట్టణములో పౌలు నిశ్చయముగా ఎంతో పనిరద్దీని కలిగియుండెను. (19:8-10) అర్తెమి దేవతయొక్క ఆలయము ప్రాచీన ప్రపంచమందు ఏడు వింతలలో ఒకటైయుండెను, దాని నాటకశాలలో 25,000 మంది కూర్చొనవీలుండెను. సమాజమందిరములో పౌలు అంగీకరింపజేయు తర్కములద్వారా ‘ఒప్పించుచు వచ్చెను,’ అయితే కొందరు ఈ మార్గమును, లేక క్రీస్తునందలి విశ్వాసముమీద ఆధారపడిన జీవ విధానమును దూషించినందున ఆయన వారిని విడిచివెళ్లెను. పౌలు ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో మాట్లాడుచు వచ్చెను, కాగా “వాక్యము” ఆసియా జిల్లయంతటిలో వ్యాప్తిచెందెను.
19. ‘యెహోవా వాక్యము ప్రబలమై వ్యాపించుటకు’ కారణమైనదేది ఎఫెసులో జరిగెను?
19 స్వస్థతలు చేకూర్చుటకు, దయ్యములను వెళ్లగొట్టుటకు శక్తిమంతుని చేయుటద్వారా పౌలు పనికి దేవుడు తన అంగీకారమును చూపించెను. (19:11-20) ముఖ్యయాజకుడైన స్కెవయ ఏడుగురు కుమారులు యేసు నామమున దయ్యమును వెళ్లగొట్టలేకపోయిరి, ఎందుకనగా వారు దేవునికి క్రీస్తునకు ప్రాతినిధ్యము వహించలేదు. వారు చివరకు దయ్యము పట్టినవానిద్వారా గాయపరచబడిరి. యిది ప్రజలను భయబ్రాంతులను చేసెను, గనుక “ప్రభువైన యేసు నామము ఘనపరచబడెను.” విశ్వాసులైనవారు తమ మంత్రతంత్ర అభ్యాసములను విసర్జించి మంత్రోచ్ఛారణలు మంత్రతంత్ర సూత్రములు కలిగియున్న తమ పుస్తకములను బహిరంగముగా కాల్చివేసిరి. “అందుచేత యింత ప్రభావముతో యెహోవా వాక్యము ప్రబలమై వ్యాపించెను” అని లూకా వ్రాసెను. ఈనాడు కూడ దేవుని సేవకులు దయ్యముల ప్రభావమునుండి ప్రజలను విడుదల చేయుటకు సహాయము చేయుదురు.—ద్వితీయోపదేశకాండము 18:10-12.
మత అసహనము విజయము సాధించదు
20. ఎఫెసులో వెండిలోహపు పనివారు ఎందుకు కలహము రేపిరి, మరియు అది ఎట్లు సమసిపోయెను?
20 ఎఫెసులోని క్రైస్తవులవలెనే, యెహోవా సాక్షులు తరచుగా కోపముగల అల్లరిమూకలను ఎదుర్కొనిరి. (19:21-41) విశ్వాసులు పెరుగుచుండగా కొద్దిమంది మాత్రమే అనేక వక్షములుగల సస్యశ్యామలతకు దేవతయైన అర్తెమిదేవికి వెండి గుళ్లను చేయించుటకు వచ్చుటతో దేమేత్రియు, యితర వెండిలోహపు పనివారు ధనమును పోగొట్టుకొనిరి. దేమేత్రియద్వారా రెచ్చగొట్టబడిన అల్లరిమూక ఒకటి పౌలు సహవాసులైన గాయును అరిస్తర్కును పట్టుకొని నాటకశాలలోనికి తీసుకొనిపోయిరి, అయితే శిష్యులు పౌలును లోనికి వెళ్లనివ్వలేదు. పండుగలకు ఆటలకు అధికారులైన వారు సహితము పౌలు అందుకు సాహసించవద్దని వేడుకొనిరి. దాదాపు రెండు గంటలసేపు, ఆ అల్లరిమూక: “ఎఫెసీయుల అర్తెమిదేవి మహాదేవి!” అని కేకలువేసిరి. చివరకు కరణము (పురపాలక ప్రభుత్వమును నడిపించువాడు) న్యాయనిర్ణయములు చేయు న్యాయాధిపతులకు వారి అభియోగములను తెల్పవచ్చునని లేకపోతే ప్రజల “క్రమమైన సభలో” వారి విషయము పరిష్కారము కావచ్చునని కంసాలులకు తెలియజేసెను. లేనియెడల అల్లరితో క్రమము తప్పిన ఈ సమావేశము విషయమై రోము విచారణచేయవచ్చును. అట్లు చెప్పుటతో, ఆయన వారినందరిని తోలివేసెను.
21. దేవుడు ఏవిధముగా పౌలు పనిని ఆశీర్వదించెను, మరియు ఈనాడు యెహోవా సాక్షుల పనిని ఆయన ఎట్లు ఆశీర్వదించుచున్నాడు?
21 అనేక పరీక్షలను ఎదుర్కొనుటకు దేవుడు పౌలుకు సహాయము చేయుటయేగాక, మత తప్పిదములను విసర్జించి సత్యమునకు హత్తుకొనునట్లు ప్రజలకు సహాయముచేయ చేసిన ఆయన ప్రయత్నములను ఆశీర్వదించెను. (పోల్చుము యిర్మీయా 1:9, 10.) అదేప్రకారము మనపనిని మన పరలోకపు తండ్రి ఆశీర్వదించుచున్నందుకు మనమెంతగా కృతజ్ఞులమై యున్నాము! ఆ విధముగా, మొదటి శతాబ్దములో వలెనే, ‘యెహోవా వాక్యము ప్రబలమై వ్యాపించుచున్నది.’ (w90 6/15)
మీరెట్లు ప్రత్యుత్తరమిత్తురు?
◻ పరిశుద్ధాత్మ నడిపింపును అంగీకరించుటలో పౌలు ఎలాంటి మాదిరినుంచెను?
◻ యెహోవా సేవకులు యింకను ఉపయోగించు ఏ పద్ధతిద్వారా పౌలు సంగతులను ‘వివరించి నిరూపించెను’?
◻ అరేయొపగు దగ్గర పౌలు ప్రసంగమునకు వచ్చిన, మరియు యెహోవా సాక్షుల ప్రకటింపు పనికివచ్చు ప్రత్యుత్తరముల మధ్య ఏ సమాంతరము కలదు?
◻ పౌలు పరిచర్యయందు తననుతాను ఎట్లు పోషించుకొనెను, దీనికి ఏ ఆధునిక-దిన సమాంతరము కలదు?
◻ పౌలు పనియెడల చేసినట్లుగానే ఈనాడు దేవుడెట్లు యెహోవా సాక్షుల పనిని ఆశీర్వదించెను?
[26, 27వ పేజీలోని చిత్రాలు]
యెహోవా వాక్యము ఈ ప్రాంతములలో వ్యాపించెను
1. ఫిలిప్పీ
2. మరియు 3. ఏథెన్సు
4. మరియు 6. ఎఫెసీ
5. రోము
[క్రెడిట్ లైను]
Photo No. 4: Manley Studios