కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g03 7/8 పేజీలు 20-23
  • నాజీవితాన్నే మార్చివేసిన గాయం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నాజీవితాన్నే మార్చివేసిన గాయం
  • తేజరిల్లు!—2003
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రతికూల భావాలు
  • వైద్య సమస్య
  • సానుకూల వైఖరి
  • బలపరిచే ఇతర సహాయకాలు
  • ఇతరులకు సేవచేయడం మన బాధను తగ్గిస్తుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • మాంత్రికులు కాదు, దేవుళ్లూ కాదు
    తేజరిల్లు!—1994
  • యెహోవా నిశ్చయమైన మద్దతుకు కృతజ్ఞతలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • దేవుని కాపుదల నుండి నేనెలా ప్రయోజనం పొందాను
    తేజరిల్లు!—1995
మరిన్ని
తేజరిల్లు!—2003
g03 7/8 పేజీలు 20-23

నాజీవితాన్నే మార్చివేసిన గాయం

స్టాన్‌లీ ఓమ్‌బివా చెప్పినది

1982లో వేగంగా వస్తున్న ఒక వాహనం నన్ను ఢీకొంది. నేను చికిత్స పొందాను, నా మెడకు ఛాతికి మధ్య భాగంలోని వెన్నుపూస మధ్య ఉండే డిస్కు పక్కకు తప్పిపోవడం వల్ల నొప్పితో అప్పుడప్పుడు బాధపడుతున్నప్పటికీ, త్వరలోనే నేను నా దైనందిన కార్యకలాపాల్లో నిమగ్నమయ్యాను. అయితే 15 సంవత్సరాల తర్వాత, నా జీవితంలో విశ్వాసాన్ని బాగా పరీక్షించే అనుభవాన్ని ఎదుర్కొన్నాను.

నాకు ప్రమాదం జరగడానికి ముందు, ప్రమాదం తర్వాత కొంతకాలం వరకు, నేను బలంగానే ఉండేవాడిని. వారాంతాల్లో నేను 10 నుండి 13 కిలోమీటర్ల వరకు జాగింగ్‌, స్క్వాష్‌ ఆడడము వంటి వాటితో నియమానుసారంగా వ్యాయామం చేసేవాడిని, శ్రమతోకూడిన పనులు కూడా చేసేవాడిని. నేను యెహోవాసాక్షుల రాజ్యమందిరాల నిర్మాణాల్లోనూ, మేము ఉంటున్న నైరోబీలోని కెన్యాలో ఒక పెద్ద అసెంబ్లీ హాల్‌ నిర్మించడంలోనూ సహాయం చేశాను.

అప్పట్లో అంటే 1997లో, నా ఛాతిలో నొప్పి తరచుగా రావడం, ఆ నొప్పి మరింత తీవ్రంగా ఉండడం మొదలైంది. వెన్నుపూసల మధ్యనుండే ఒక డిస్కు స్థానభ్రంశం చెందిందని, దానివల్ల నా వెన్నెముకపై ఒత్తిడి పడుతోందని ఒక వైద్య పరీక్షలో వెల్లడైంది. ఇది నేను మొదట్లో చెప్పిన ప్రమాద పరిణామమే అని తేలింది.

నా ఆరోగ్యం క్షీణించిపోవడానికి ముందు, నాకు సేల్స్‌మాన్‌ ఉద్యోగం దొరికింది. ఆ ఉద్యోగంలో కుటుంబ ఆరోగ్య భీమా పథక సౌలభ్యం కూడా ఉండేది. వ్యాపార ప్రపంచంలో నా భవిష్యత్తు ఉజ్వలంగా ఉన్నట్లనిపించింది. కానీ 1998 మధ్యలో నా ఛాతి నుండి కాళ్ళ వరకు తీవ్రంగా మొద్దుబారిపోవడం ఆరంభమైంది. రోజురోజుకూ నా ఆరోగ్యం క్షీణించసాగింది.

ఎక్కువ కాలం కాకముందే నా ఉద్యోగం పోయింది, దానితోపాటు అన్ని ప్రయోజనాలూ పోయాయి. అప్పుడు మా ఇద్దరు కూతుర్లు సిల్వియాకు 13, విల్‌హెల్మినాకు 10 ఏండ్లు ఉండేవి. నాకు ఉద్యోగం లేకపోవడం వల్ల, నా భార్య నెలాఖరుకు ఏమి తెచ్చేదో దానిపైనే మేము ఆధారపడాల్సివచ్చేది. మేము అంతగా అవసరంలేని వాటిని తగ్గించుకొని, ఎదురైన కొత్త పరిస్థితులతో మా జీవితాలను సర్దుబాటు చేసుకున్నాము. నిత్యావసరాలను తీర్చుకోవడంలో మేము నెగ్గుకురాగలిగాము.

ప్రతికూల భావాలు

నాకు నా పరిస్థితి గురించి అర్థమైనకొలది నేను ప్రతికూలంగా మారి, నా గురించే ఆలోచించుకోవడం, విసుక్కోవడం ప్రారంభించానని అంగీకరించవలసిందే. కొన్నిసార్లు నేను కోపగించుకోవడం, గొడవపడడం, ప్రతి చిన్న విషయానికి వాదించడం వంటివి చేసేవాడిని. ఎప్పుడూ క్రుంగిపోయినట్లుగా ఉండేవాడిని. నా ఒత్తిడిని చవిచూడనివారు మా కుటుంబంలో ఎవ్వరూ లేరు. నా భార్యా కూతుర్లు తమకు ఏమాత్రం తెలియని అసాధారణమయిన పరిస్థితిని ఎదుర్కొన్నారు.

నా భావాలు సరైనవేనని నాకు అప్పుడప్పుడు అనిపించేది. నా బరువు చాలా వేగంగా పెరిగిపోయింది. మలమూత్రాలు నియంత్రించుకోవడంలో చాలా ఇబ్బందులు పడ్డాను. నేను తరచూ బాగా కలవరపడేవాడిని. చాలాతరచుగా కళ్ళనిండా కన్నీళ్ళతో ఒంటరిగా ఒక మూలకు కూర్చునేవాడిని. నేను చాలా కోపగించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి, అవి దాదాపు హాస్యాస్పదంగా ఉండేవి. నేను నా పరిస్థితితో సరైన రీతిలో వ్యవహరించడం లేదని నాకు తెలుసు.

మనకెలాంటి కష్టమొచ్చినా దేవుణ్ణి నిందించకూడదని, నేను యెహోవాసాక్షుల క్రైస్తవ సంఘంలో ఒక పెద్దగా నా తోటి క్రైస్తవులకు ఎన్నోసార్లు సలహా ఇచ్చాను. కానీ స్వయంగా నేనే, ‘యెహోవా నాకెందుకిలా జరగనిచ్చాడు?’ అని తరచూ ప్రశ్నించుకుంటుండేవాడిని. నేను ఇతరులను బలపరచడానికి, ప్రోత్సహించడానికి 1 కొరింథీయులు 10:13 వంటి లేఖనాలను ఉపయోగించినప్పటికీ, నేను అనుభవిస్తున్న బాధ భరించలేనిదిగా భావించేవాడిని!

వైద్య సమస్య

మంచి చికిత్స పొందడం నాకు పెద్ద సమస్యగా మారింది. నేను ఒకేరోజు ఒక ఫిజియో థెరపిస్టును, ఒక కిరోప్రాక్టర్‌ను, ఒక ఆక్యుపంక్చరిస్టును కలవాల్సి వచ్చేది. అప్పుడు ఏదైనా కాస్త ఉపశమనం పొందినా, అదీ కొద్దిసేపే. నేను ఒక ఆర్థోపెడిక్‌ సర్జన్‌ను, ఒక న్యూరోసర్జన్‌తోపాటు చాలామంది డాక్టర్లను సంప్రదించాను. అందరూ ఒకే అంశంతో ఏకీభవించారు: నొప్పి తగ్గించాలన్నా, బెసిగిన డిస్కును తీయాలన్నా ఆపరేషన్‌ చేయాలి. బైబిలు ఆధారితమైన నా విశ్వాసాల కారణంగా, ఎలాంటి పరిస్థితుల్లోనూ రక్తం ఎక్కించకూడదని నేను ఆ వైద్య నిపుణులకు స్పష్టంగా వివరించాను.​—అపొస్తలుల కార్యములు 15:28, 29.

మొదటి సర్జన్‌, నా వీపు వైపు నుండి ఆపరేషన్‌ చేస్తానని చెప్పాడు. అయితే ఆ పద్ధతి చాలా ప్రమాదకరంగా ఉండవచ్చునని నాకు వివరించారు. అంతేగాక ఆ సర్జన్‌ రక్తం ఉపయోగించే విషయంలో గ్యారంటీ ఇవ్వలేనని చెప్పాడు. నేను ఆయన దగ్గరకు మళ్ళీ వెళ్ళలేదు.

ఇక రెండవ సర్జన్‌ ఏమో, నా మెడ దగ్గరకోసి అక్కడనుండి వెన్నెముకకు ఆపరేషన్‌ చేస్తానని చెప్పాడు. ఆ పద్ధతి నాకు భయానకంగా అనిపించింది. రక్తం ఎక్కించకూడదనే విషయంలో ఆయనకేమీ అభ్యంతరం లేకున్నా, వెంటనే ఆపరేషను చేయాలని చెప్పి ఆయన కొన్ని వివరాలు ఇచ్చాడు. నేను ఆయనను కూడా మళ్లీ కలవలేదు.

అయితే మా ప్రాంతంలోని ఆసుపత్రి అనుసంధాన కమిటీలో పనిచేస్తున్న యెహోవాసాక్షుల సహాయంతో, నాకు సహకరించే ఒక డాక్టరును నేను కలుసుకోగలిగాను. ఈ మూడవ సర్జన్‌ ప్రతిపాదించిన పద్ధతి కూడా రెండవ సర్జన్‌ ప్రతిపాదించినటువంటిదే; మెడ దగ్గర కోసి ఆపరేషన్‌ చేసే పద్ధతి. ప్రమాదాలు పరిమితంగా ఉంటాయని ఆయన వివరించాడు.

ఆపరేషన్‌ ఎలా చేస్తారనే దాని గురించి ఇచ్చిన స్పష్టమైన వివరణ నన్ను భయకంపితుణ్ణి చేసింది. గుండె, కాలేయం వంటి అతి సున్నితమైన శరీరావయవాలకు సమీపంలో ఆ ఆపరేషన్‌ చేయబడుతుందని తెలిసి నేను చాలా భయపడ్డాను. ఆపరేషన్‌ తర్వాత నేను బ్రతికి బయటపడతానా? అనిపించింది. అయితే అలాంటి ప్రతికూల భావాలు నా చింతలను ఏ మాత్రం తగ్గించలేదు.

ఎట్టకేలకు 1998, నవంబరు 25న నైరోబి ఆసుపత్రిలో నాకు ఆపరేషన్‌ అయింది, నాలుగు గంటలపాటు జరిగిన ఆ ఆపరేషన్‌ విజయవంతమైంది. ఆ ఆపరేషన్‌లో వస్తికపు ఎముక నుండి చిన్న ముక్కతీసి, ఆ ముక్కను తీర్చిదిద్ది, వ్యాధిగ్రస్తమైన చోట ఒక లోహపు ప్లేటును స్క్రూలను ఉపయోగించి దాన్ని బిగించారు. అది సహాయపడింది. కానీ అది నా సమస్యలన్నింటినీ దూరం చేయలేదు. నేను నడిచేటప్పుడు చాలా అసౌకర్యంగా ఉండేది. తరచూ మొద్దుబారడం వల్ల కలిగే బాధను నేను ఇప్పటికీ అనుభవిస్తున్నాను.

సానుకూల వైఖరి

మొదట్లో పేర్కొన్నట్లు నేను నా దైన్య పరిస్థితి గురించి విచారిస్తూ, లోలోపల క్రుంగిపోతూ చాలా ఘోరమైన కాలాన్ని గడిపాను. దీనికి విరుద్ధంగా, చాలామంది వైద్య సిబ్బంది నేను ప్రశాంతంగా ఆశావాదంతో ఉన్నానని ప్రశంసించేవారు. వారలా భావించడానికి కారణమేమిటి? నాకు నొప్పి తీవ్రంగా ఉన్నప్పటికీ, నేను వారితో నాకు దేవునిపై ఉన్న విశ్వాసం గురించి మాట్లాడడం వారు గమనించారు.

నేను అనుభవిస్తున్న దాన్ని బట్టి నేను అప్పుడప్పుడు కోపగించుకోవడం, కఠినంగా ప్రవర్తించడం చేసినప్పటికీ, నేను యెహోవాపైనే ఆధారపడి ఉన్నాను. నా కష్ట సమయమంతటా కూడా ఆయన నాకు సర్వదా ఎంతో మద్దతునిచ్చాడు, నేను కొన్నిసార్లు సిగ్గుపడ్డాను కూడా. నేను నా పరిస్థితిలో ఊరట పొందేందుకు, నాకు తెలిసిన కొన్ని లేఖనాలను చదివి ధ్యానించాలని గట్టిగా తీర్మానించుకున్నాను. వాటిలో కొన్ని ఇవి:

ప్రకటన 21:4: “[దేవుడు] వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు.” కన్నీరు, వేదన శాశ్వతంగా తీసివేయబడే నూతనలోకం గురించిన బైబిలు వాగ్దానాన్ని మననం చేసుకోవడం నిజంగా ఊరటనిచ్చింది.

హెబ్రీయులు 6:10: “మీరు చేసిన కార్యమును, . . . తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు.” నేను శారీరకంగా ఎక్కువ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ, నేను ఆయన సేవలో చేసిన ప్రయత్నాలను యెహోవా విలువైనవిగా ఎంచుతాడని నాకు తెలుసు.

యాకోబు 1:13: “దేవుడు కీడువిషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు​—నేను దేవునిచేత శోధింపబడుచున్నానని అనకూడదు.” అదెంత నిజమో కదా! నా బాధలను యెహోవా అనుమతించినప్పటికీ, వాటికి కారకుడు ఆయన ఎంతమాత్రము కాదు.

ఫిలిప్పీయులు 4:6, 7: “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.” నాకు కావలసిన మనశ్శాంతిని పొందడానికి, ఈ పరిస్థితిలో విజ్ఞతతో వ్యవహరించేందుకు ప్రార్థన నాకు చాలా సహాయపడింది.

విపద్దశలో ఉన్నవారిని ప్రోత్సహించేందుకు నేను ఈ లేఖనాలను ఉపయోగించాను​—అవి వారికి నిజంగా సహాయపడ్డాయి! కానీ నేనప్పుడు వాటి పూర్తి విలువను గ్రహించలేదని తెలుసుకున్నాను. నేను ఈ అనారోగ్య పరిస్థితిలో అణకువగా ఉండి, యెహోవాపై పూర్తిగా ఆధారపడడాన్ని నేర్చుకున్నాను.

బలపరిచే ఇతర సహాయకాలు

క్రైస్తవ సహోదరత్వము, కష్టసమయాల్లో స్తంభములాగ ఆధారముగా ఉంటుందని చాలామంది మాట్లాడతారు. కానీ మనం కొన్నిసార్లు మన క్రైస్తవ సహోదర సహోదరీలను ఎంత తేలిగ్గా తీసుకుంటాం! వారి సహాయం పరిమితంగానే ఉంటుండవచ్చు, కానీ వాళ్ళు మనకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. నా విషయంలో అలాగే జరిగింది. వాళ్ళు తరచూ నన్ను చూడడానికి ఆసుపత్రికి వచ్చేవారు, కొన్నిసార్లైతే తెల్లవారు జామునే అక్కడికి చేరుకునేవారు. వాళ్ళు నా చికిత్స ఖర్చులకు కూడా సహాయం చేశారు. నా దీనావస్థకు చలించి, నాకు సహాయం చేయడానికి వచ్చిన వారందరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

ప్రస్తుత పరిస్థితిలో నేను చేయగలిగేది చాలా తక్కువ అని, మా స్థానిక సంఘంలోని సాక్షులకు తెలుసు. ప్రస్తుతం నేను మా సంఘ పైవిచారణకర్తగా సేవ చేస్తున్నాను, చక్కని మద్దతిస్తున్న క్రైస్తవ సభతో కలిసి నేనా పని చేస్తున్నాను. నేను ప్రకటనా పనిలో ఎన్నడూ క్రమం తప్పలేదు. నేను తీవ్ర బాధలో ఉన్న కాలంలో, ఇద్దరు వ్యక్తులు తమ జీవితాలను యెహోవాకు సమర్పించుకునేంత మేరకు సహాయం చేశాను. వారిలో ఒకరు ఇప్పుడు నైరోబిలోని యెహోవాసాక్షుల సంఘంలో పరిచర్య సేవకుడిగా సేవచేస్తున్నాడు.

నేను నా భార్యకు ఇప్పటికీ మాటల్లో కృతజ్ఞతలు చెప్పలేను, ఆమె నా దురవస్థలోని కాలమంతా నాకు మద్దతునిచ్చింది. ఆమె నా కోపాన్ని, అస్థిర భావాలను, అసమంజస స్వభావాన్ని, నిరాశానిస్పృహలను అన్నింటినీ సహించింది. నేను బాధతో విలవిలలాడినప్పుడల్లా ఆమె నన్ను ఓదార్చి ధైర్యపరచింది. కష్టకాలంలో సర్దుకుపోవడంలో ఆమె కనబరచిన శక్తి సామర్థ్యాలకు నాకు ఇప్పటికీ ఆశ్చర్యం కలుగుతుంది. ఆమె నాకు నిజంగా ‘విడువక ప్రేమించే నిజమైన స్నేహితురాలు.’​—సామెతలు 17:17.

మా కూతుర్లు నా పరిస్థితితో సర్దుకుపోవడం నేర్చుకున్నారు. వారు చేయగలిగిన సహాయం వాళ్ళూ చేస్తారు. నా అవసరాలేమిటో అర్థం చేసుకొని వెంటనే సహాయం చేస్తారు, వాళ్ళమ్మ ఇంట్లో లేనప్పుడు నాకు బాసటగా ఉన్నారు. నాకు బలహీనంగా అనిపించినప్పుడల్లా సిల్వియా నాకు “ఊతమిచ్చే చేతికఱ్ఱ”లా ఉండి ఇంట్లో అటూ ఇటూ తిరిగేందుకు సహాయపడుతుంది.

చిన్నమ్మాయి మీనా సంగతి ఏమిటి? నాకో సందర్భం గుర్తుంది, ఒకసారి నేను ఇంట్లోనే కిందపడిపోయి లేవలేని పరిస్థితిలో ఉన్నాను. అప్పుడు ఇంట్లో ఆమె మాత్రమే ఉంది. ఆమె తన శక్తినంతా కూడగట్టుకొని నన్ను నా గదిలోకి తీసుకువచ్చింది. అప్పుడు నన్నెలా లేపగలిగిందో ఆమెకే తెలియదని ఇప్పటికీ అంటుంది. ధైర్యవంతమైన ఆ చర్య నేను ఎన్నటికీ మరచిపోలేను.

నేను ఈ గాయంతో తలపడిన అతికష్టమైన పోరాటం, నా జీవితంలో ఎన్నడూ చేయని పోరాటం. ఆ పోరాటంలో నేను ఇప్పటికీ పోరాడుతున్నాను. నా జీవితాన్ని, నా విశ్వాసాన్ని ఇంత పరీక్షకు గురిచేసింది ఏదీ లేదు. నేను అణకువ, సహేతుకత, పరానుభూతి గురించి నేర్చుకున్నాను. నేను యెహోవాను పూర్తిగా నమ్ముకొని, కృతనిశ్చయంతో ఉండడం, నేను ఈ సమస్యను విజయవంతంగా ఎదుర్కోవడానికి సహాయపడింది.

“ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై యుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు” అని అపొస్తలుడైన పౌలు అన్న మాటల్లోని సత్యాన్ని నేను తెలుసుకున్నాను. (2 కొరింథీయులు 4:7) ‘క్రొత్త ఆకాశములు క్రొత్త భూమి’ వస్తాయనే దేవుని వాగ్దానములో నేనెంతో ఓదార్పు పొందాను. (2 పేతురు 3:13) ఆ నూతనలోకం వరకు నాకు బలమిమ్మని నేను యెహోవాను ప్రార్థిస్తున్నాను, ఎందుకంటే నేను ఇప్పటికీ బలహీనంగానే ఉన్నాను, నా స్వశక్తితో నేను ఎక్కువగా ఏమీ చేయలేను. (g03 4/22)

[22వ పేజీలోని చిత్రాలు]

నా కుటుంబంతో కలిసి చేసిన క్రైస్తవ పరిచర్య, నేను సహించడానికి సహాయపడింది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి