మా పాఠకుల నుండి
నేనెందుకు ఏకాగ్రత చూపలేకపోతున్నాను? యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . నేనెందుకు ఏకాగ్రత చూపలేకపోతున్నాను? (ఆగస్టు 8, 1998) శీర్షికను చదివినప్పుడు నేను ఆనందంతో ఏడ్చాను. నాకు 18 ఏండ్లు, నేను పూర్తికాల పరిచర్య చేస్తున్నాను. నేను ఏకాగ్రత చూపలేకపోయేదాన్ని, క్షేత్ర పరిచర్యలో ప్రజలకు సహాయపడేందుకు ఏకాగ్రత కల్గివుండటం ఎంతో ప్రాముఖ్యం గనుక నేను దాని గురించి ఎక్కువ కలత పడేదాన్ని. నేను విషయాలను గుర్తుంచుకోలేను, వాటిని విశ్లేషించలేను గనుక కృంగుదలకు లోనయ్యేంత పరిస్థితికి చేరుకున్నాను. బైబిలు చెబుతున్నట్టుగా యెహోవా తగిన సమయంలో ఆహారాన్ని అందజేస్తాడన్న విషయం వాస్తవం.
ఎ. ఆర్. కె. ఆర్., అమెరికా
ప్రయాణీకుల కొరకు టిప్స్ “డెంగ్యూ ఒక్క కాటుతో వచ్చే జ్వరం” (ఆగస్టు 8, 1998) శీర్షికలో ఉన్న “ప్రయాణీకుల కొరకు టిప్స్”లో, రాత్రిపూట దోమతెరను, క్రిమి సంహారక రసాయనాలు పూసివున్న దోమతెరను వాడాలన్న ఒక టిప్‌ను ఇవ్వడం మర్చిపోయారు.
ఐ. హెచ్., ఇంగ్లాండ్
మా పాఠకుని వ్యాఖ్యానాన్ని మెచ్చుకుంటున్నాము. మలేరియా వ్యాప్తిని అరికట్టడంలో ఈ టిప్ ప్రత్యేకించి ఉపయోగకరమైనది. (తేజరిల్లు! ఆగస్టు 8 1997 సంచిక 31వ పేజి చూడండి.) అయినప్పటికీ, యు.ఎస్. సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ చెబుతున్నట్లుగా, డెంగ్యూ జ్వరం రావడానికి కారణమయ్యే దోమ “ఆహారం కోసం మనుషులపై పగటిపూటే దాడిచేయడానికి సుముఖత చూపిస్తుంది.” సర్వసాధారణంగా అది “ఉదయం సూర్యోదయానంతరం కొన్ని గంటలలోపు, సాయంత్రం చీకటి పడటానికి ముందు కొన్ని గంటలలోను” కుడుతుంది. కాబట్టి రాత్రిపూట దోమతెరలను వాడటం, ఈ వ్యాధిని నివారించడంలో అంత ప్రభావవంతంగా ఉండకపోవచ్చు.—ఎడిటర్.
ప్రకటనలు మా అమ్మాయి యెహోవాసాక్షి కాదు. ఆమె ప్రకటనల రంగంలో పనిచేస్తోంది గనుక ఆమెకు “ప్రకటనలు—మీరెలా ప్రభావితులౌతున్నారు?” అనే శీర్షికల పరంపర ఉన్న సెప్టెంబరు 8, 1998 తేజరిల్లు! సంచికను పోస్టులో పంపించాను. ఆమె దాన్ని చదివి ఎంతో మెచ్చుకుంటూ మీ రచయితలకు ఒప్పించే కళలోని మెలకువలు తెలుసు అని చెప్పింది.
ఆర్. ఎస్., యునైటెడ్ స్టేట్స్
సాతానును నిందించాలా? నాకు 17 ఏండ్లు. నేను ఈ మధ్యనే మొదటిసారిగా తేజరిల్లు!ను చదివాను. ఇప్పుడు నేను దానికి అతుక్కుపోయాను! “బైబిలు ఉద్దేశము: మన పాపాలకు సాతానును నిందించాలా?” (అక్టోబరు 8, 1998) లాంటి విలువైన సమాచారం అందులో ఉంది. ఆ శీర్షికను చదివేంత వరకూ, నేను పాపం చేసినప్పుడు సాతాన్ని నిందించవచ్చని అనుకునే వాణ్ని. ఏదిఏమైనా, మీ పత్రిక చాలా బాగుంది, ప్రతి ఒక్కరికీ దాన్ని చదవమని నేను సిఫారసు చేస్తాను. దయచేసి మీ మెయిలింగ్ లిస్ట్‌లో నన్నూ చేర్చుకోండి!
ఎమ్. ఎమ్., అమెరికా
యువత ఆత్మహత్యలు “నేటి యువతకు ఏ నిరీక్షణ ఉంది?” (అక్టోబరు 8, 1998) లోని శీర్షికల పరంపరకు మీకు నా కృతజ్ఞతలు తెలియజేయాలను కుంటున్నాను. ఇవి చదివాక నాకు దుఃఖమాగలేదు. నేను చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాను. కానీ నేను ఆత్మహత్యను చేసుకోలేకపోయినందుకు సంతోషిస్తున్నాను.
ఎ. జెడ్., జెక్ రిపబ్లిక్
సున్నితమైన విషయంపైన మంచి అవగాహనగల శీర్షికలు ఇవి. వైద్యపరంగా చూస్తే నేను డిప్రెషన్‌కి గురైవున్నప్పుడే, ఈ సంవత్సరం మొదట్లో నా జీవితాన్ని అంతం చేసుకోవడానికి ప్రయత్నించాను. సమయానుకూలమైన ఆ విషయాంశాన్ని ప్రచురించినందుకు మీకు కృతజ్ఞతలు. అది నా జీవితాన్ని కాపాడింది.
ఆర్. పి., ఇంగ్లాండ్
విచారకరంగా, నా క్లాస్ మేట్‌లలో ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. అందులో ఒకరు, తన భవిష్యత్తు అంతా కష్టాలమయం తప్ప ఆశాజనకంగాలేనట్టు పరిగణించినందున ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ శీర్షిక ఆచరణాత్మకమైనది, ఎందుకంటే ఇది మన భవిష్యత్తు ఎలా అర్థవంతమైనదిగా ఉండగలదో స్పష్టంగానూ, నిర్దిష్టమైన రీతిలోనూ వివరించింది.
ఆర్. డి., స్పెయిన్
మీ శీర్షికలు నా హృదయాన్ని తాకాయి. ప్రేమగల తండ్రిగా యెహోవా దేవుడే నాతో మాట్లాడినట్లుగా ఉంది. నా చిన్నప్పుడు మా నాన్న చేత దుర్వ్యవహారానికి గురై బాధ పడ్డాను. నిష్ప్రయోజకుడిగా భావించి తరచూ చనిపోవాలనుకునే వాణ్ని. కానీ ఇప్పుడు, మీ శీర్షిక చెబుతున్నట్లుగా, “వాస్తవమైన జీవము”పట్ల కోరికను పెంపొందించుకుంటున్నాను.—1 తిమోతి 6:19.
ఎస్. ఆర్. బ్రెజిల్
మా కృతజ్ఞతలు, ప్రత్యేకించి యువత నుంచి వచ్చిన వ్యాఖ్యానాలకు, వాటిలో అనేకం కొద్ది మాటల్లోనైనా సమస్యలకు పరిష్కారాన్ని కల్గివున్నాయి.
డబ్లు. హెచ్. జర్మనీ