భూగోళవ్యాప్త విషాదాన్ని ఎలా నివారించాలి
ఐక్యరాజ్య సమితి దాన్ని ఒక “భూగోళవ్యాప్త విషాదం” అని పిలిచింది —అలా పిలవడం సముచితమే. గర్భందాల్చడం, ప్రసవ సమయంలో కష్టమవ్వడం మూలంగా ప్రపంచవ్యాప్తంగా, ప్రతి నిమిషానికొక మహిళ చనిపోతుంది.
ఈ మరణాల్లో అనేకం, వర్ధమాన దేశాల్లోనే జరుగుతున్నాయి. గర్భధారణ సంబంధిత కారణాల మూలంగా యూరప్‌లో ప్రతి 10,000 మంది స్త్రీలలో కేవలం ఒకరు చొప్పున, అమెరికాలో ప్రతి 12,500 మంది స్త్రీలలో ఒకరు చొప్పున మరణిస్తుండగా, లాటిన్ అమెరికాలో 73 మందికి ఒకరు చొప్పున, ఆసియాలో 54 మందికి ఒకరు చొప్పున, ఆఫ్రికాలో భయంకరమైన రీతిలో 21మందికి ఒకరు చొప్పున మరణాల నిష్పత్తి పెరిగింది!
ప్రతిసంవత్సరం సంభవించే గర్భధారణ సంబంధిత 6,00,000 మరణాలలో అనేకం, నిపుణులైన మంత్రసానుల సహాయంతో నివారించవచ్చు గనుక ఐక్యరాజ్య సమితి బాలల నిధి (యూనిసెఫ్), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు హెచ్ ఒ) మంత్రసానులుగా స్త్రీలకు (పురుషులకు) తర్ఫీదునివ్వడాన్ని ఇప్పుడు నొక్కి చెబుతున్నాయి.
కావల్సినంత మంది డాక్టర్లు అందుబాటులో లేని దేశాల్లో శిక్షణ పొందిన మంత్రసానులంటే అది జీవన్మరణాలకు మధ్యనున్న వ్యత్యాసంలాంటిదని అర్థం. శిక్షణ పొందిన మంత్రసానులకు మరింత అధికారాన్ని ఇవ్వడం ఇప్పటికే ఫలితాలను తీసుకొచ్చిందని యూనిసెఫ్ డాక్టరైన ఫ్రాన్స్ డోనా, ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహాదారిణియైన ఆన్ థాంప్సన్ ఇటీవల ఐక్యరాజ్య సమితి రేడియోలో చెప్పారు. ఉదాహరణకు, ప్రసవానంతరం బయటకి వెలువడకుండా ఉండిపోయిన మావిని తొలగించేందుకు మంత్రసానులు అనుమతి పొందినప్పటి నుంచీ ఆఫ్రికాలోని అనేక దేశాల్లో ప్రసూతి సమయంలో సంభవించే మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని వారు చెపుతున్నారు. ఇండోనేషియాలో ఇదే విధమైన పురోభివృద్ది జరుగుతోంది, ఒక ప్రాజెక్టు అక్కడ ఒక్కో గ్రామానికి ఇద్దరు మంత్రసానుల చొప్పున శిక్షణనివ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకూ అలా 55,000 మంది సుశిక్షితులైన మంత్రసానులు పంపించబడ్డారు.
“అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా మంత్రసానులు ఉన్నారు” అని ఐక్యరాజ్య సమితి రేడియో కార్యక్రమం పర్స్పెక్టివ్ పేర్కొంది. ఫ్రాన్స్, నెదర్లాండ్స్, స్వీడన్, యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాలు, మంత్రసానుల పారంపర్యాన్ని ఎన్నడూ చేజార్చుకోలేదు. అమెరికాలోనైతే, మంత్రసానరికం పునర్జీవించబడుతోంది. ఈ దేశాలు మంత్రసానులను విలువైనవారిగా పరిగణిస్తాయి, ఎందుకంటే వాళ్లు వ్యక్తిగతమైన శ్రద్ధను విడువకుండా అందజేస్తారని ఆన్ థాంప్సన్ చెబుతోంది. ఆమె కూడా శిక్షణ పొందిన ఒక మంత్రసాని. “పురిటి నొప్పులు 24 గంటలపాటు ఉంటాయి, ఆ 24 గంటలపాటు దగ్గరే కూర్చుని ఉండడానికి వైద్యులకు సమయం ఉండదు.” అయినప్పటికీ, “జాలిచూపించే, పరిజ్ఞానంగల, అర్థంచేసుకునే వారి సాన్నిధ్యం, స్త్రీకి అభయహస్తాన్ని ఇవ్వగలదు.” గనుక సురక్షితమైన ప్రసవానికి దోహదపడే కారకాల్లో అది ఒకటని ఆమె తెలియజేసింది.
“ప్రతీ సంవత్సరం 6 కోట్ల ప్రసవాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో స్త్రీపట్ల కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు గానీ, శిక్షణ పొందని పారంపర్య మంత్రసాని గానీ శ్రద్ధ చూపించడం జరుగుతుంది—లేకపోతే శ్రద్ధచూపించే వాళ్లు ఎవ్వరూ ఉండరు” అని కూడా పర్స్పెక్టివ్ పేర్కొంది. దాన్ని మార్చడానికి ఐక్యరాజ్య సమితి కృషి సల్పుతోంది. ఒక ప్రారంభంగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ 1998 ప్రపంచ ఆరోగ్య దినాన్ని “సురక్షిత మాతృత్వం” అనే అంశంపై కేంద్రీకరింపచేసింది. “రాగల 2, 3 సంవత్సరాల్లో దాన్ని సాధించలేమని మాకు తెలుసు” అని డా. డోనా తెలియజేసింది. అయితే, “ప్రసవ కాలంలో ప్రతీ స్త్రీ దగ్గరా సుశిక్షితులైన ఒక మంత్రసాని” ఉండాలన్నదే వారి లక్ష్యం.
[31వ పేజీలోని చిత్రసౌజన్యం]
UN/J. Isaac