కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 4/8 పేజీలు 17-19
  • ఆత్మహత్యే పరిష్కారమా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆత్మహత్యే పరిష్కారమా?
  • తేజరిల్లు!—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • కొందరు అలా ఎందుకు భావిస్తారు
  • కుటుంబ దురవస్థ
  • దురవస్థకు ఇతర కారణాలు
  • సహాయాన్ని పొందటం
  • తాళుకొనుట
  • ఆత్మహత్య—యువతను పీడిస్తున్న మహామారి
    తేజరిల్లు!—1998
  • నాకు చనిపోవాలని ఉంది—ఆత్మహత్య చేసుకోవాలని అనిపించినప్పుడు బైబిలు నాకు సహాయం చేయగలదా?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ప్రేమా నిరీక్షణలు అంతరించిపోయినప్పుడు
    తేజరిల్లు!—1998
  • ప్రేమా నిరీక్షణల పునరాగమనంతో
    తేజరిల్లు!—1998
మరిన్ని
తేజరిల్లు!—1994
g94 4/8 పేజీలు 17-19

యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .

ఆత్మహత్యే పరిష్కారమా?

“ప్రతి ఉదయం నిద్రలేవాలంటే నాకు విసుగువస్తోంది. నేను తప్పిపోయాను. నాకు కోపం వస్తోంది. నా హృదయం బాధపడుతోంది. . . . కావున నేను జీవించడం చాలించాలని తలస్తున్నాను. . . . నాకు చావాలని లేదు, కాని నేను తప్పక చావవలసి ఉందని నేను భావిస్తున్నాను. . . . నేను భవిష్యత్తు వైపు చూస్తే, నాకు కేవలం అంధకారం మరియు బాధ మాత్రమే కనిపిస్తున్నాయి.”—21 సంవత్సరాల పీటర్‌ నుండి ఆత్మహత్యా పత్రం.a

అమెరికాలో దాదాపు 20 లక్షలమంది యౌవనులు ఆత్మహత్యా ప్రయత్నం చేశారని నిపుణులు నొక్కి చెబుతున్నారు. విచారకరంగా, ప్రతి సంవత్సరం ఇంచుమించు 5,000 మంది సఫలీకృతులౌతున్నారు. అయితే ఆత్మహత్య అమెరికాకు క్రొత్తదేమి కాదు. ఇండియాలో గత 1990లో 30,000 మంది యౌవనులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇజ్రాయేల్‌, కెనడా, థాయిలాండ్‌, న్యూజీలాండ్‌, నెదర్లాండ్స్‌, ఫిన్‌లాండ్‌, ఫ్రాన్స్‌, స్విట్జర్‌లాండ్‌ మరియు స్పెయిన్‌ వంటి దేశాల్లో యౌవనుల ఆత్మహత్యల సంఖ్యలు గణనీయంగా పెరిగిపోయాయి.

ఎవరైనా దుఃఖంలో మునిగిపోయి—మానసిక బాధ అనే చిక్కుల్లో చిక్కుకొని దానినుండి తప్పించుకునే మార్గం లేనట్లు అనిపిస్తే అప్పుడేమి చేయాలి? ఆత్మహత్యే గత్యంతరం అనిపించవచ్చు, కాని వాస్తవానికి అది ఒక విచారకరమైన వృధా ప్రయాస తప్ప అంతకంటే ఎక్కువేమి కాదు. దాని పర్యవసానంగా స్నేహితులకు మరియు కుటుంబానికి అది దుఃఖాన్ని, బాధను తప్ప ఇంకేమి మిగల్చదు. భవిష్యత్తు ఎంత అంధకారమయంగా కనిపించినా, సమస్యలు ఎంత భయబ్రాంతంగా వున్నా, ఒకడు తనను తాను చంపుకొనటం మాత్రం పరిష్కారం కాదు.

కొందరు అలా ఎందుకు భావిస్తారు

వ్యధ అంటే ఏమిటో నీతిమంతుడైన యోబుకు తెలిసి ఉండెను. తన కుటుంబాన్ని, తన సంపదను, తన మంచి ఆరోగ్యాన్ని కోల్పోయి, ఆయనిలా చెప్పాడు: “ఈ నా యెముకలను చూచుటకన్న మరణమొందుట నాకిష్టము.” (యోబు 7:15) కొంతమంది యౌవనులు ఈనాడు అదే విధంగా భావించారు. ఒక రచయిత యిలా వ్రాశాడు: “వేదన . . . బాధకు (గాయం మరియు భయం యొక్క భావనలకు) దారి తీస్తుంది [అది] మళ్లీ రక్షణకు (బాధనుండి తప్పించుకునే ప్రయత్నాలకు) దారి తీస్తుంది.” కావున, సహించలేము అన్పించే బాధను తప్పించుకొనే తప్పుడు మార్గమే ఆత్మహత్య.

అటువంటి బాధను ఏది కలిగిస్తుంది? తమ తలిదండ్రులు, ప్రియుడు, లేక ప్రియురాలితో తీవ్రమైన వాదనవంటి ఏ సంఘటనల వలననైనా అది మొదలు కావచ్చు. తన ప్రియురాలినుండి విడిపోయిన తరువాత, 16 సంవత్సరాల బ్రాడ్‌ దుఃఖానికి గురయ్యాడు. అయిననూ, అతను తన భావాలను గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. అతను ఉరి వేసుకొనటం ద్వారా దాన్నంతటిని ముగించాడు.

పంతొమ్మిది సంవత్సరాల సునీత తన ప్రియునితో అవినీతికరమైన సంబంధాలను కలిగి ఉందనే విషయం ఆమె తలిదండ్రులకు తెలిసినప్పుడు ఆమె కృంగిపోయింది. “నేను జీవిస్తున్న పద్ధతిలో కొనసాగటం నాకు ఇష్టంలేదని నాకు తెలుసు,” అని ఆమె జ్ఞాపకం తెచ్చుకుంటోంది. “అందుకని నేను ఒక రాత్రి ఇంటికి వచ్చి, ఏస్ప్రిన్‌ మాత్రలు మింగటం ప్రారంభించాను. మర్నాటి ఉదయానికల్లా నేను రక్తం కక్కుకుంటున్నాను. నేను నా జీవితాన్ని కాదు నా జీవన విధానాన్ని అంతమొందించాలని అనుకున్నాను.”

పాఠశాల కూడ తీవ్రమైన ఒత్తిడికి మూలం కాగలదు. వైద్యుడు కావాలని తన తలిదండ్రులచే (వారు కూడ వైద్యులే) బలవంత పెట్టబడిన యౌవనుడైన ఆషిష్‌ నిద్రలేమిని వృద్ధిపరచుకొని ఇతరులకు దూరం అయ్యాడు. తన తలిదండ్రుల విద్యాసంబంధ ఆశయాలకు సరితూగలేక, ఆషిష్‌ నిద్రమాత్రలను ఎక్కువ మోతాదులో మింగాడు. ఇది ఒకరికి బైబిలులోని సామెతలు 15:13 ను జ్ఞప్తికి తెస్తుంది: “మనోదుఃఖమువలన ఆత్మ నలిగిపోవును.”

కుటుంబ దురవస్థ

కుటుంబ అలజడి—తలిదండ్రులు విడాకులు తీసుకొనటం లేక విడిపోవటం, కుటుంబ సభ్యుని మరణం, లేక ఒక క్రొత్త ప్రదేశానికి వెళ్లటం వంటివి కూడ—కొందరు యౌవనులు ఆత్మహత్య చేసుకొనటానికి కారకం అయ్యింది. ఉదాహరణకు, పైన పేర్కొనబడిన బ్రాడ్‌, కారు ప్రమాదంలో ఇద్దరు సన్నిహిత స్నేహితులను మరియు ఒక మేనళ్లున్ని పోగొట్టుకున్నాడు. తరువాత అతని కుటుంబం ఆర్థిక ఇబ్బందులను అనుభవించింది. బ్రాడ్‌ ఇక తట్టుకొనలేక పోయాడు. “నేను ఆపదలతో నిండియున్నాను . . . అవి నన్ను చుట్టూర చుట్టుకొని యున్నవి.” అని మొర్రపెట్టిన కీర్తనల గ్రంథకర్తవలె అతను భావించి ఉండవచ్చు.—కీర్తన 88:3, 17.

దిగ్భ్రాంతి కలిగించే సంఖ్యలో యౌవనులు ఇంకొక విధమైన ఒత్తిడికి గురౌతున్నారు: శారీరక, భావోద్రేక, మరియు లైంగిక దురాచారము. ఇండియాలోని కేరళ రాష్ట్రం, యౌవనస్థుల ఆత్మహత్య విషయంలో ఆ దేశమంతటిలో ఎక్కువ సంఖ్యలను కలిగి ఉంది. యౌవన బాలికలు అనేకమంది తమ తండ్రుల దురాచారం వలన తమ్ముని తాము హతమార్చుకొనటానికి ప్రయత్నించారు. పిల్లలపై జరుపబడుతున్న ఇతర విధములైన దురాచారాలు ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారులవలె ప్రబలిపోతున్నాయి, మరి వాటి అమాయకపు బాధితుల దుఃఖం చాలా తీవ్రంగా ఉండవచ్చు.

దురవస్థకు ఇతర కారణాలు

కాని అన్ని ఆత్మహత్యా భావాలు కూడ బయటి విషయాల వలన కలుగవు. వివాహం కాని యౌవనులపై జరపబడిన ఒక పరిశోధన నివేదిక యిలా చెబుతోంది: “లైంగిక సంపర్కం మరియు మద్యపానం చేసే మగవారు మరియు ఆడవారు కూడ దానికి దూరంగా ఉండే వారికంటే ఎక్కువ [ఆత్మహత్య] ప్రమాదాన్ని కలిగి ఉంటారు.” సునీత అవినీతి ఆమెను గర్భవతిని చేసింది—ఆమె దానిని గర్భస్రావం ద్వారా అంతమొందించింది. (1 కొరింథీయులు 6:18 పోల్చండి.) తప్పుచేశాననే మనస్సాక్షి వలన పీడింపబడి, ఆమె మరణించాలని కోరుకుంది. అదేవిధంగా, బ్రాడ్‌ 14 ఏళ్ల వయస్సు నుండే మద్యపానంతో చెలగాటం ఆడుతున్నాడు, అతనింకా క్రమంగా మద్యాన్ని సేవిస్తూనేవున్నాడు. అవును, మద్యాన్ని దుర్వినియోగం చేసినప్పుడు, అది ‘కట్లపామువలె కాటువేయును.’—సామెతలు 23:32.

ఒక వ్యక్తి యొక్క స్వంత “అంతరంగమందు విచారముల” వలన కూడ ఆత్మహత్య చేసుకోవాలన్న భావనలు ఉత్పన్నం కావచ్చు. (కీర్తన 94:19) వేర్వేరు జీవశాస్త్రీయ కారకాల వలన కూడ కృంగదీసే ఆలోచనలు పుట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఉదాహరణకు, ప్రారంభంలో చెప్పబడిన పీటర్‌, అతని ఆత్మహత్యకు మునుపు అతని మెదడులో రసాయన అసమతౌల్యాన్ని కలిగి ఉండెనని పరీక్షలలో తేలింది. కృంగదీసే భావాలను పరిశీలించకపోతే అవి తీవ్రతరం అవుతాయి; ఆత్మహత్యే శరణ్యంగా అనిపించటం ప్రారంభం కావచ్చు.

సహాయాన్ని పొందటం

అయితే, ఆత్మహత్యే శరణ్యంగా భావించ కూడదు. మనము దానిని గుణగ్రహించినను లేకపోయినను, మానసిక ఆరోగ్య నిపుణులైన ఏలెన్‌ ఎల్‌. బెర్‌మాన్‌ మరియు డేవిడ్‌ ఏ. జోబ్స్‌, ‘ఒత్తిడి మరియు సంఘర్షణను విజయవంతంగా ఎదుర్కొనగల బాహ్య మరియు అంతర్గత మూలాలు’ అని పిలిచేవి మనం అందరము కలిగి ఉన్నాము. ఒక మూలము కుటుంబము మరియు స్నేహితులు కావచ్చు. సామెతలు 12:25 యిలా చెబుతుంది: “ఒకని హృదయములోని విచారము దాని క్రుంగజేయును దయగల మాట దాని సంతోషపెట్టును.” అవును, అర్థం చేసుకునే ఒక వ్యక్తి నుండి వచ్చే దయగల మాట పరిస్థితిని పూర్తిగా మార్చివేయ వచ్చు!

కావున ఎవరైనా కృంగిపోయి ఉంటే లేక విచారంగా ఉంటే, అతను ఒంటరిగా బాధపడ కూడదని సలహా ఇవ్వబడుతోంది. (సామెతలు 18:1) బాధపడే వాడు తాను నమ్మే వ్యక్తికి తన భావాలనన్నింటినీ తెలియజేయవచ్చు. ఎవరితోనైనా మాట్లాడటం ఒకరి భావోద్రేకాల తీవ్రతను తగ్గించటానికి సహాయం చేస్తుంది, మరి అది వారికి ఆ సమస్యపై క్రొత్త దృక్కోణాన్ని అందించ గలదు. ఒకవేళ ఎవరైనా ఒక స్నేహితున్ని లేక ప్రియున్ని మరణమందు పోగొట్టుకున్నందుకు మనస్సు విరిగి ఉంటే, వారు తమకు నమ్మకమున్న వారితో ఈ విషయాన్ని చర్చించవచ్చు. అలా కోల్పోయిన వాటి బాధను గమనించి దుఃఖాన్ని అనుభవిస్తే, ఒక వ్యక్తికి ఓదార్పు లభిస్తుంది. (ప్రసంగి 7:1-3) ఆత్మహత్య చేసుకోవాలన్న తపన మళ్లీ కలిగితే తాను నమ్మే వ్యక్తిని కలుసుకునేలా వాగ్దానం చేయటం సహాయకరంగా ఉండవచ్చు.

నిజమే, ఎవరినైనా నమ్మటం చాలా కష్టంగా ఉంటుంది. కాని జీవితమే ఆపదల్లో ఉన్నందున, అంతటి తెగువ చూపటం సబబు కాదా? విషయాలను ఒకరితో చెప్పుకుంటే తమకు హాని కలిగించుకోవాలనే తపన తగ్గవచ్చు. ‘ఎవరితో?’ అని కొందరు అడుగవచ్చు. ఒకవేళ అతని తలిదండ్రులు దేవునికి భయపడే వారైతే, వారికే ‘ఒకని హృదయాన్ని ఇవ్వడానికి’ ఎందుకు ప్రయత్నించ కూడదు. (సామెతలు 23:26) అనేకులు భావించే దానికంటే వారు ఎక్కువ అర్థం చేసుకొనగలిగి సహాయం చేయవచ్చు. ఒకవేళ అదనపు సహకారం అవసరమనిపిస్తే—వైద్యుని పరీక్ష వంటిది—వారు దాని కొరకు ఏర్పాటు చేయగలరు.

క్రైస్తవ సంఘంలోని సభ్యులు సహాయానికి ఇంకొక మూలము. దురవస్థకు గురైన వారికి సంఘంలోని ఆత్మీయంగా పెద్ద వయస్కులైన పురుషులు మద్దతునిచ్చి సహాయం చేయగలరు. (యెషయా 32:1, 2; యాకోబు 5:14, 15) తన ఆత్మహత్యా ప్రయత్నం తరువాత, సునీత ఒక పూర్తికాల సువార్తీకురాలి (పయనీరు) నుండి సహాయాన్ని పొందింది. “ఆమె అన్ని సందర్భాల్లో నన్ను అంటిపెట్టుకొని ఉండేది. ఆమె గనుక ఉండక పోతే, నేను నిజంగానే పిచ్చిదాన్నైపోయే దాన్ని,” అని సునీత చెబుతుంది.

తాళుకొనుట

సహాయం పొందటానికి అంతర్గత మూలాలు కూడ ఉన్నాయి. ఉదాహరణకు, తప్పుచేశాననే భావాల బాధ ఏదైనా తప్పిదం చేయటం వలన కలుగుతుందా? (కీర్తన 31:10 పోల్చండి.) అటువంటి భావాలు పేరుకుపోవటాన్ని అనుమతించే బదులు, ఆ విషయాన్ని చక్కపెట్టడాని కొరకు చర్యలు తీసుకోవడం మంచిది. (యెషయా 1:18; 2 కొరింథీయులు 7:11 ను పోల్చండి.) తమ తలిదండ్రులతో ఒప్పుకొనటం ఒక అనుకూలమైన చర్య కాగలదు. మొదట వారు నొచ్చుకుంటారన్నది వాస్తవమే. కాని వారు సహాయాన్ని ఇవ్వటంపై ఎక్కువ శ్రద్ధను చూపుతారు. యథార్థంగా పశ్చాత్తాపపడే వారిని యెహోవా ‘బహుగా క్షమించును’ అనే నిశ్చయత కూడ మనకు ఉంది. (యెషయా 55:7) పశ్చాత్తాపం చెందే వారి పాపాలను యేసు విమోచన బలి కప్పివేస్తుంది.—రోమీయులు 3:23, 24.

సహాయాన్ని పొందటానికి క్రైస్తవులు విశ్వాసమును, లేఖనాలను గురించిన జ్ఞానమును, మరియు యెహోవా దేవునితో తమ సంబంధమును కలిగి ఉన్నారు. అనేక సందర్భాల్లో కీర్తనల గ్రంథకర్త అయిన దావీదు ఎంతగా దురవస్థకు గురయ్యాడంటే, అతనిలా చెప్పాడు: “శత్రువులు . . . నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు.” అతను అలాగే కృంగిపోలేదు. ఆయనిలా వ్రాశాడు “నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను. ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను.” “నీ క్రియలన్నియు ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను.”—కీర్తన 142:1; 143:3-5.

తమ్మును తాము గాయపరచుకోవాలనే కోరిక ప్రభలమైతే, వారు ప్రార్థనలో యెహోవాకు మొరపెట్టుకోవాలి. ఆయన బాధను అర్థం చేసుకుంటాడు మరి బాధపడుతున్న వారు జీవించాలని కోరుతున్నాడు! (కీర్తన 56:8) ఆయన బాధను తాళుకొనుటకు సహాయపడే “బలాధిక్యము”ను అందించగలడు. (2 కొరింథీయులు 4:7) స్వయంగా చేసుకున్న హత్య కుటుంబానికి, స్నేహితులకు, మరి యెహోవాకు కూడ ఎంత బాధను కలిగిస్తుందో ఆ విషయాన్ని కూడ ఒకరు ఆలోచించాలి. అటువంటి విషయాలను గురించి ఆలోచించటం ఒక వ్యక్తి జీవించి ఉండటానికి చక్కగా సహాయం చేయగలదు.

కొందరికి ఆ బాధ ఎన్నటికీ తొలగనిదిగా కనిపించిననూ, అదే విధమైన బాధను అనుభవించి జీవించిన వారు ఉన్నారను విషయం వారికి ఆదరణను ఇవ్వగలదు. పరిస్థితులు మారగలవని మరి మారతాయని వారు అనుభవపూర్వకంగా చెప్పగల్గుతున్నారు. అటువంటి బాధాకరమైన సమయాన్ని ఓర్చుకొనటానికి ఇతరులు సహాయం చేయగలరు. కృంగిపోయిన వారు తమకు కావలసిన సహాయాన్ని వెదకి—జీవితాన్ని కొనసాగించాలి!

[అధస్సూచీలు]

a కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

[18వ పేజీలోని చిత్రం]

బాధాకరమైన భావాలను గురించి ఎవరితోనైనా మాట్లాడటం మంచిది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి