కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 6/8 పేజీలు 4-9
  • గందరగోళపు వాతావరణం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • గందరగోళపు వాతావరణం
  • తేజరిల్లు!—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అనిశ్చయతలు వివాదాంశాన్ని తెస్తాయి
  • ఏం జరిగింది ఇప్పటివరకూ?
  • మార్పుకు చెల్లించాల్సిన మూల్యం
  • మన అమూల్యమైన వాతావరణం
    తేజరిల్లు!—1995
  • మన వాతావరణానికి హాని కలిగినప్పుడు
    తేజరిల్లు!—1995
  • ప్రపంచ జనాభా—భవిష్యత్తు సంగతేమిటి?
    తేజరిల్లు!—1992
  • పగడపు దిబ్బలను కాపాడేందుకు ఏమి చేయవచ్చు?
    తేజరిల్లు!—1996
తేజరిల్లు!—1998
g98 6/8 పేజీలు 4-9

గందరగోళపు వాతావరణం

ఎన్నెన్నో విధాలుగా, మనలో అనేకులం కర్బన ఆధారిత ఇంధనాలపై ఆధారపడి ఉన్నాం. పెట్రోలు లేక డీసిల్‌తో నడిచే కార్లనూ, వాహనాల్నీ మనం నడుపుతాం. బొగ్గునూ, సహజమైన వాయువుల్నీ లేక చమురునూ దహించే పవర్‌ ప్లాంట్‌ల ద్వారా ఉత్పత్తయ్యే విద్యుచ్ఛక్తిని వాడతాం. కట్టెల్నీ, బొగ్గునూ, సహజ వాయువుల్నీ, రాక్షస బొగ్గునూ ఉపయోగించి ఆహారాన్ని వండుకుంటాం లేక వేడిచేసుకుంటాం. ఇవన్నీ కలిసి వాయుమండలానికి కార్బన్‌డయాక్సైడ్‌ను జత చేస్తాయి. ఆ వాయువు సూర్యుని నుండి వస్తున్న ఉష్ణాన్ని బయటకుపోకుండా అడ్డుకొంటుంది.

బయటకు పోనివ్వకుండా ఉష్ణోగ్రతను అడ్డుకొనే ఇతర గ్రీన్‌హౌస్‌ (హరితగృహ) వాయువులను కూడా మనం వాయుమండలానికి జోడిస్తాము. వ్యవసాయ రంగంలో వాడిన నత్రజని సంబంధిత ఎరువుల నుండి ఉత్పన్నమైన నైట్రస్‌ ఆక్సైడ్‌ వాయుమండలంలోనికి విడుదల చేయబడుతుంది. వరిచేలూ, పశువుల శాలలూ మిథేన్‌ వాయువును విడుదల చేస్తాయి. ప్లాస్టిక్‌ ఫోమ్‌ల తయారీ నుండీ, మరితర పారిశ్రామిక ప్రక్రియల నుండీ క్లోరోఫ్లోరోకార్బన్‌లు (సిఎఫ్‌సిలు) వెలువడుతున్నాయి. సిఎఫ్‌సిలు ఉష్ణోగ్రతను బయటకు పోకుండా అడ్డుకోవడం మాత్రమేగాక భూగోళపు స్ట్రాటో ఆవరణ పొరయైన ఓజోను పొరను కూడా నాశనం చేస్తున్నాయి.

ఇప్పుడు క్రమబద్ధీకరించబడిన సిఎఫ్‌సిలను మినహాయించి, ఉష్ణోగ్రత బయటకు పోకుండా అడ్డుకొనే మిగిలిన ఈ వాయువులు, అంతకంతకూ పెరుగుతున్న స్థాయిలో వాయుమండలంలోనికి విడుదల చేయబడుతున్నాయి. భూమిపై పెరుగుతున్న జనాభా సంఖ్యా, దానితోపాటు పెరుగుతున్న ఇంధన వినియోగమూ, పారిశ్రామిక, వ్యవసాయ కార్యకలాపాలూ దీనికి పాక్షికంగా దోహదపడ్డాయి. వాషింగ్టన్‌ ఆధారిత పర్యావరణ రక్షణ ఏజన్సీ ప్రకారంగా, ప్రస్తుతం ప్రతీ ఏటా 600 కోట్ల టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ వాయువునూ, మరితర గ్రీన్‌హౌస్‌ వాయువుల్నీ మానవులు వాతావరణంలోనికి విడిచిపెడుతున్నారు. ఈ గ్రీన్‌హౌస్‌ వాయువులు ఊరకనే అంతరించిపోవు; అవి వాయుమండలంలో దశాబ్దాల తరబడి సంచరిస్తాయి.

సాధారణంగా రెండు విషయాల్లో మట్టుకు సైంటిస్ట్‌లు ఎంతో నమ్మకంగా ఉన్నారు. మొదటిది, ఇటీవల దశాబ్దాల్లో, శతాబ్దాల్లో వాయుమండలంలోని కార్బన్‌డయాక్సైడ్‌, మరితర గ్రీన్‌హౌస్‌ వాయువుల మొత్తం పెరిగింది. రెండవది, గత వందేళ్లుగా, భూగోళపు సగటు ఉపరితల ఉష్ణోగ్రత 0.3 డిగ్రీల సెల్సియస్‌ నుండి 0.6 డిగ్రీల సెల్సియస్‌ వరకూ పెరిగింది.

భూగోళం అంతకంతకూ వేడెక్కిపోవడానికీ, మానవుని మూలంగా ఉత్పన్నమైన గ్రీన్‌హౌస్‌ వాయువులకూ సంబంధమేమైనా ఉందా? అనే ప్రశ్న తలెత్తుతుంది. కొంతమంది సైంటిస్టులు వాటికి సంబంధమేమీ లేదని చెబుతూ పెరుగుదల సహజమైన వ్యత్యాసాలలోపలే జరుగుతుందనీ, దానికి బహుశా సూర్యుడే కారణమై ఉండవచ్చనీ సూచిస్తున్నారు. అయితే, శీతోష్ణస్థితి మార్పుపై ఇంటర్‌ గవర్నమెంటల్‌ గుంపు నివేదించిన నివేదికలోని మాటలతో అనేకమంది శీతోష్ణస్థితి నిపుణులు ఏకీభవిస్తారు. ఉష్ణోగ్రతలోని పెరుగుదలనేది “పూర్తిగా సహజమైనదని అనడం వాస్తవం కాకపోవచ్చు” అనీ, “భౌగోళిక శీతోష్ణస్థితిపై గుర్తించదగిన మానవ ప్రభావం ఉందనే విషయాన్ని తగినన్ని రుజువులు సూచిస్తున్నాయి” అనీ అది తెలియజేసింది. కానీ, భూగ్రహపు ఉష్ణోగ్రతను మానవ కార్యకలాపాలు పెంచుతున్నాయా లేదా అనే విషయం—ముఖ్యంగా 21వ శతాబ్దంలో లోకం ఎంత త్వరగా వేడెక్కిపోతుందో, మరి పర్యవసానాలు ఏమై ఉండవచ్చన్న విషయం అనిశ్చయంగానే ఉంది.

అనిశ్చయతలు వివాదాంశాన్ని తెస్తాయి

భవిష్య గ్రీన్‌హౌస్‌ ఎఫెక్ట్‌ను (హరితగృహ ప్రభావాన్ని) గురించి శీతోష్ణస్థితి నిపుణులు ముందుగా చెప్పేటప్పుడు, వాళ్లు ప్రపంచంలోని అత్యంత వేగంగా పనిచేసే, అతి శక్తివంతమైన కంప్యూటర్లపై కన్పించే శీతోష్ణస్థితి మోడల్స్‌పై ఆధారపడతారు. అయితే, భూగ్రహపు శీతోష్ణస్థితి అనేది భూభ్రమణపు, వాయుమండలపు, సముద్రపు, హిమపు, నేల స్వరూపాల యొక్క, సూర్యుని యొక్క విపరీతమైన సంక్లిష్టపు ప్రతిచర్యల ద్వారా నిర్ధారించబడుతుంది. భౌగోళిక శీతోష్ణస్థితిపై అనేక కారకాలు అంత విస్తృత పరిమాణంలో ప్రభావం చూపుతుండడం మూలాన, ఇప్పటి నుండి రాగల 50 లేక 100 ఏళ్లలో ఏం జరగనైవుందో ఖచ్చితంగా ముందే చెప్పడం ఏ కంప్యూటర్‌కూ సాధ్యంకాదు. సైన్స్‌ పత్రిక ఇటీవల ఇలా గుర్తించింది: “మానవ కార్యకలాపాలు భూగ్రహపు ఉష్ణోగ్రతను పెంచనారంభించాయనే విషయంగానీ—లేక గ్రీన్‌హౌస్‌ వార్మింగ్‌ సంభవించినపుడు అది ఎంత తీవ్రంగా ఉంటుందనే విషయంగానీ ఏమాత్రం స్పష్టం కాలేదని అనేకమంది శీతోష్ణస్థితి నిపుణులు హెచ్చరిస్తున్నారు.”

ఈ అనిశ్చయతలు ఏ ముప్పూ వాటిల్లదని సులభంగా త్రోసిపుచ్చేలా చేస్తాయి. యథాతథంగా కొనసాగడంలో ఆర్థికపరమైన ఆసక్తిని కనబరిచే భారీ పరిశ్రమలతోపాటూ భూగోళపు ఉష్ణోగ్రత పెరుగుతుందన్న విషయంలో సంశయాన్ని కల్గివున్న సైంటిస్టులు ఖరీదైనదిగా కాగల దిద్దుబాటు చర్యలను చేపట్టే నిర్ణయం తీసుకోవడానికి ప్రస్తుత పరిజ్ఞానం సరిపోదని వాదిస్తారు. భవిష్యత్తు కొంతమంది అనుకొన్నంత దుర్భరంగా మారకపోవచ్చని వాళ్లు చెబుతారు.

విజ్ఞానశాస్త్ర అనిశ్చయతలు, పాలసీ (విధాన) నిర్మాణకులను చేతులు కట్టుకు కూర్చొనే వ్యక్తులుగా చేయకూడదని చెబుతూ పర్యావరణవేత్తలు త్రిప్పికొడతారు. భవిష్యత్తులో శీతోష్ణస్థితి కొందరు తలంచినంత దుర్భరంగా మారకపోవచ్చు. వాస్తవమే అయినప్పటికీ, పరిస్థితి మరింత అధ్వాన్నం కాగల్గే అవకాశం కూడా ఉంది. అంతేగాక, భవిష్యత్తులో ఏం జరగుతుందనేది కచ్చితంగా తెలియదంటే, రాగల అపాయాన్ని తగ్గించివేసేందుకు ఏం చేయకుండా చేతులు ముడుచుకు కూర్చోవాలని అర్థంకాదని వాళ్లు తర్కిస్తారు. ఉదాహరణకు, పొగత్రాగడం మానివేసిన ప్రజలు, తామొకవేళ స్మోకింగ్‌ చేస్తూనే ఉంటే 30 లేక 40 ఏళ్ల తర్వాత తప్పకుండా ఊపిరితిత్తుల క్యాన్సరుకి గురౌతారనే విషయంలో విజ్ఞానశాస్త్ర సంబంధమైన రుజువు కావాలని పట్టు పట్టరు. వాళ్లు దానివల్ల వచ్చే అపాయాన్ని గుర్తించి, ఆ అపాయం వచ్చే అవకాశాల్ని తగ్గించివేయాలని లేక రాకుండా చేయాలని కోరుకొన్నందుననే వాళ్లు పొగత్రాగడం మానేశారు.

ఏం జరిగింది ఇప్పటివరకూ?

భూగోళం వేడెక్కడాన్ని గూర్చిన సమస్య విస్తృతి విషయంలోనూ అసలు సమస్యనేది ఉందా అన్న విషయంలోనూ ఎన్నెన్నో వాదోపవాదాలు ఉన్నందున, దాన్ని గురించి ఏం చేయాలనే విషయంపై వేర్వేరు అభిప్రాయాలుండడంలో ఆశ్చర్యమేమీలేదు. సంవత్సరాలుగా, పర్యావరణ బృందాలు ఎక్కువగా కాలుష్యరహిత శక్తివనరుల్ని వినియోగించమని ప్రోత్సహించాయి. సూర్యున్నుండీ, గాలినుండీ, నదులనుండీ, భూగర్భ ఆవిరి రిజర్వాయర్లనుండీ, ఉష్ణజలాల్నుండీ శక్తిని ఉత్పత్తి చేయవచ్చు.

ఉష్ణాన్ని అడ్డుకొనే వాయువుల విడుదలను తగ్గించేటట్లు చట్టాల్ని ప్రవేశపెట్టమని కూడా పర్యావరణవేత్తలు ప్రభుత్వాలకు ఉద్బోధిస్తున్నారు. ప్రభుత్వాలు కాగితాలపై సంతకాలతో ప్రతిస్పందించాయి. ఉదాహరణకు, బ్రెజిల్‌లోని రియో డి జనియోరో నందు 1992లో జరిగిన ఎర్త్‌ సమ్మిట్‌లో దాదాపు 150 దేశాలకు చెందిన ప్రతినిధులు గ్రీన్‌హౌస్‌ వాయువులు విడుదల కావడాన్ని, ప్రత్యేకంగా కార్బన్‌డయాక్సైడ్‌ విడుదలను తగ్గించేందుకైన తమ నిబద్ధతను స్థిరంగా నొక్కిచెబుతూ ఒక ఒప్పందంపై సంతకం చేశారు. 2000 సంవత్సరం నాటికి, పారిశ్రామిక దేశాలు విడుదల చేస్తున్న గ్రీన్‌హౌస్‌ వాయువుల స్థాయిని 1990నాటి స్థాయికి తగ్గించడమే లక్ష్యమైవుంది. ఈ దిశలో కొన్ని దేశాలు పురోభివృద్ధి చెందగా, అనేక ధనిక దేశాలు తాము చేసిన కొద్దిపాటి వాగ్దానాన్నీ కాస్తంత కూడా నిలుపుకోలేక పోయాయి. కోత విధించడానికి బదులు, అనేక దేశాలు మునుపెన్నటికన్నా మరిన్ని గ్రీన్‌హౌస్‌ వాయువుల్ని ఉత్పన్నం చేస్తున్నాయి కూడా! ఉదాహరణకు, అమెరికాలో, 2000 సంవత్సరం నాటికి, వెలువడుతున్న కార్బన్‌డయాక్సైడ్‌ శాతం 1990నాటి కన్నా బహుశా 11 శాతం ఎక్కువగా ఉంటుందని తలంచబడుతోంది.

ఇటీవలెనే, అంతర్జాతీయ ఒప్పందాలకు “కొక్కెములు” తగిలించే (గట్టిగా అమలు పరచే) చర్యలు తీసుకోబడుతున్నాయి. 1992నాటి ఒప్పందం ప్రకారం, విడుదలవుతున్న గ్రీన్‌హౌస్‌ వాయువుల మొత్తంపై కోతలను ఇష్టమైతే చేపట్టడం లేకపోతే లేదు అన్నట్టుగా గాక, కోతలను నిర్బంధంగా అమలుచేసే లక్ష్యాల్ని పెట్టాలని కొంతమంది డిమాండ్‌ చేస్తున్నారు.

మార్పుకు చెల్లించాల్సిన మూల్యం

పుడమి స్నేహితులుగా దృష్టించబడాలని రాజకీయ నాయకులు పరితపిస్తారు. అయితే, మార్పు వల్ల ఆర్థికవ్యవస్థపైకి రాగల పర్యవసానాలపై కూడా వాళ్లు ఓ కన్నేసి ఉంచుతారు. ఎకానమిస్ట్‌ పత్రిక ప్రకారంగా, శక్తి కొరకు ప్రపంచదేశాల్లోని 90 శాతం కర్బన సంబంధిత ఇంధనంపై ఆధారపడి ఉన్నందున, వాటి వాడకాన్ని నిలిపివేయడం పెద్ద మార్పుల్ని తెస్తుంది; మరి ఆ మార్పుకు చెల్లించాల్సివచ్చే మూల్యమనేది తీవ్రమైన వివాదమై కూర్చుంది.

2010 సంవత్సరం నాటికి, ఉష్ణం బయటకు పోకుండా అడ్డుకొనే గ్రీన్‌హౌస్‌ వాయువులను 1990లో ఉన్నవాటికన్నా 10 శాతం తగ్గించడానికి చెల్లించే మూల్యమెంతౌతుంది? దానికి జవాబు మీరెవర్ని అడుగుతారనే దానిపై ఆధారపడివుంటుంది. గ్రీన్‌హౌస్‌ వాయువుల్ని వాయుమండలంలోనికి మరే ఇతర దేశాలకన్నా ఎక్కువగా విడిచిపెడుతున్న దేశమైన అమెరికాలోని వారి అభిప్రాయాల్ని పరిశీలించండి. అంత శాతం మేరకు గ్రీన్‌హౌస్‌ వాయువులను తగ్గించివేస్తే, అమెరికా ఆర్థికవ్యవస్థకు ప్రతి సంవత్సరం వందలాది కోట్ల డాలర్ల మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందనీ, 6 లక్షలమంది ప్రజలకు పని లేకుండా పోతుందనీ పారిశ్రామిక వ్యూహ రచనా నిపుణులు హెచ్చరిస్తున్నారు. దానికి భిన్నంగా, అంత శాతం మేరకు తగ్గించే లక్ష్యాన్ని సాధించడమనేది ప్రతీ సంవత్సరమూ ఆర్థికంగా వందలాది డాలర్లను ఆదా చేస్తుందనీ, 7,73,000 క్రొత్త ఉద్యోగాల్ని ఉత్పన్నం చేస్తుందనీ పర్యావరణవేత్తలు చెబుతారు.

సత్వర చర్యలు చేపట్టాలని పర్యావరణవేత్తలు పిలుపులను ఇస్తున్నా, భూగోళం వేడెక్కడం మూలంగా రాబోయే ముప్పును తగ్గించివేసేందుకూ, భూనిక్షిప్త ఇంధనాల్ని ఉపయోగించకపోవడం మూలంగా కల్గే ఆర్థిక తాకిడిని కొండంతలుగా చేసి చెప్పేందుకూ తమ దగ్గరున్న గణనీయమైన ఫండ్స్‌నూ, పేరు ప్రఖ్యాతులనూ ఉపయోగించే భారీ పరిశ్రమలు అంటే మోటారు వాహనాల్ని తయారుచేసే కంపెనీలూ, ఆయిల్‌ కంపెనీలూ, బొగ్గు ఉత్పత్తిచేసే కంపెనీలూ ఉన్నాయి.

వాదోపవాదాలు కొనసాగుతూనే ఉంటాయి. అయితే, మానవులు శీతోష్ణస్థితిని మారుస్తూ, దాన్ని గురించి వట్టి కబుర్లు చెప్పడం తప్ప ఏమీ చేయకపోతే, వాతావరణాన్ని గురించి అంతా మాట్లాడేవాళ్లే గానీ దాన్ని గురించి పట్టించుకొనే నాధుడొక్కడూ లేడనే మాట ఓ అశుభసూచకమైన అర్థాన్ని సంతరించుకుంటుంది.

[5వ పేజీలోని బాక్సు]

క్యోటో ప్రొటోకాల్‌

1997 డిసెంబరు నెలలో, 161 దేశాల నుండి వచ్చిన 2,200కన్నా ఎక్కువమంది ప్రతినిధులు గ్లోబల్‌ వార్మింగ్‌ (భూగోళం వేడెక్కడం) మూలంగా కలిగే ముప్పును గూర్చి ఏమైనా చేసేందుకు ఒక ఒప్పందాన్ని లేక ప్రొటోకాల్ని కుదుర్చుకొనేందుకు జపాన్‌లోని క్యోటోనందు సమకూడారు. ఒక వారానికి పైబడి చర్చలు జరిపిన తర్వాత, అభివృద్ధిచెందిన దేశాలు 2012వ సంవత్సరంనాటికి గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదలను, 1990నాటి స్థాయికన్నా సగటున 5.2 శాతానికి తగ్గించాలని తీర్మానించారు. ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించిన దేశాలకు విధించే జుల్మానాల గురించి తర్వాత నిర్ధారించబడుతుంది. ఆ ఒప్పందానికి అన్ని దేశాలూ కట్టుబడి ఉంటాయని భావిస్తే, 5.2 శాతం కోత ఎంత వ్యత్యాసాన్ని కలుగజేస్తుందంటారు? అతి స్వల్ప వ్యత్యాసాన్ని మాత్రమే కలుగజేస్తుందనే విషయం సుస్పష్టం. టైమ్‌ పత్రిక ఇలా రిపోర్టు చేసింది: “పారిశ్రామిక విప్లవం ప్రారంభమైననాటి నుండీ వాయుమండలంలో నిర్మితమౌతున్న గ్రీన్‌హౌస్‌ వాయువులను గణనీయంగా తగ్గించివేయడానికి 60% కోత అవసరమౌతుంది.”

[7వ పేజీలోని బాక్సు/చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

గ్రీన్‌హౌస్‌ ఎఫెక్ట్‌ చిత్రీకరణ

గ్రీన్‌హౌస్‌ ఎఫెక్ట్‌: గ్రీన్‌హౌస్‌లోని అద్దాల పలకల్లా, భూ వాయుమండలం సూర్యున్నుండి వచ్చే ఉష్ణాన్ని అడ్డుకొంటుంది. సూర్యుని నుండి వచ్చే వెలుతురు భూమి వేడెక్కేలా చేస్తుంది అయితే, ఉత్పన్నమైన ఉష్ణం అంటే ఇన్‌ఫ్రారెడ్‌ రేడియేషన్‌ (పరారుణ వికిరణం) ద్వారా కొనిపోబడిన ఉష్ణం వాయుమండలాన్ని సులభంగా తప్పించుకుని పోలేదు. దానికి బదులుగా, గ్రీన్‌హౌస్‌ వాయువులు ఇన్‌ఫ్రారెడ్‌ రేడియేషన్‌ని అడ్డుకొని, దానిలో కొంత భాగాన్ని భూమివైపుకి వెనక్కి పంపిస్తాయి, ఆ విధంగా వేడెక్కిపోయిన భూ ఉపరితలానికి మరింత వేడిని చేరుస్తాయి.

1. సూర్యుడు

2. చిక్కుకుపోయిన ఇన్‌ఫ్రారెడ్‌ రేడియేషన్‌

3. గ్రీన్‌హౌస్‌ వాయువులు

4. తప్పించుకున్న రేడియేషన్‌

[8వ పేజీలోని బాక్సు/చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

శీతోష్ణస్థితిని నియంత్రించే శక్తులు

భూగోళం వేడెక్కడంపై ప్రస్తుతం జరుగుతున్న వాగ్వివాదాల్ని అర్థం చేసుకోవాలంటే, మన శీతోష్ణస్థితిని రూపొందించే కొన్ని భయోత్పాత శక్తుల్ని అర్థంచేసుకోవడం అవసరం. కొన్ని ప్రాథమిక విషయాల్ని మనం పరిశీలిద్దాం.

1. సూర్యుడు—ఉష్ణానికీ, వెలుతురుకూ మూలం

భూమిపై జీవం, మనం సూర్యుడు అని పిలిచే భారీ న్యూక్లియర్‌ కొలిమిపై ఆధారపడి ఉంది. మన భూగోళంవంటి భూగోళాలు పదిలక్షలకన్నా ఎక్కువ పట్టేంత సైజులో ఉన్న సూర్య గ్రహం ఉష్ణాన్నీ, వెలుతుర్నీ విశ్వసించదగిన రీతిలో సరఫరా చేస్తుంది. సూర్యుని అవుట్‌పుట్‌లో క్షీణత ఏర్పడితే మన గ్రహం మంచుతో కప్పబడి పోతుంది; అవుట్‌పుట్‌లో పెరుగుదల సంభవిస్తే మన భూగోళం కాలుతున్న మూకుడులా మారుతుంది. సూర్యున్నుండి 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో భూమి తన కక్ష్యలో తిరుగుతుంది గనుక, సూర్యునిలో నుండి వెలువడే 200 కోట్లలో ఒక్క వంతు శక్తిని మాత్రమే అది తీసుకొంటుంది. అయినా, జీవం వర్థిల్లడానికి తగిన శీతోష్ణస్థితిని ఉత్పన్నం చేయడానికి ఇది సరిగ్గా తగినంత మోతాదులో ఉంది.

2. వాయుమండలం —భూమికున్న వెచ్చని కంబళి

సూర్యుడు మాత్రమే భూగోళపు ఉష్ణోగ్రతను నిర్ధారించడంలేదు; ఇందులో మన వాయుమండలం కూడా ఓ ప్రముఖమైన భూమికను పోషిస్తోంది. భూమీ, చంద్రుడూ సూర్యున్నుండి సమానమైన దూరంలో ఉన్నాయి, కాబట్టి ఆ రెండూ వాటి వాటి నిష్పత్తుల ప్రకారంగా ఇంచుమించుగా సమానమైన మోతాదులో సూర్యున్నుండి ఉష్ణాన్ని పొందుతాయి. అయితే, భూమి ఉష్ణోగ్రతాస్థాయి సగటున 15 డిగ్రీల సెల్సియస్‌ ఉండగా, చంద్రుని ఉష్ణోగ్రతాస్థాయి సగటున ఎముకలు కొరికేంత తక్కువ స్థాయిలో మైనస్‌ 18 డిగ్రీల సెల్సియస్‌ ఉంటుంది. ఎందుకీ వ్యత్యాసం? భూమికి వాయుమండలం ఉంది; చంద్రునికి లేదు.

మన వాయుమండలం అంటే ఆక్సిజన్‌, నైట్రోజన్‌, మరితర వాయువులనే పుడమి పొత్తిగుడ్డలు సూర్యున్నుండి వచ్చే ఉష్ణోగ్రతలో కొంత భాగాన్ని పట్టివుంచుతున్నాయి, మిగతా దాన్ని వదిలిపెడుతున్నాయి. ఈ ప్రక్రియ తరచూ గ్రీన్‌హౌస్‌కి పోల్చబడింది. మొక్కల కోసం గ్లాస్‌తోగానీ లేక ప్లాస్టిక్‌తోగానీ రూపొందించబడిన గోడలూ, పైకప్పూగల కట్టడమే గ్రీన్‌హౌస్‌యని బహుశా మీకు తెలిసే ఉంటుంది. సూర్యరశ్మి లోపలికి సులభంగా ప్రవేశించి, లోపలి భాగాన్ని వెచ్చబరుస్తుంది. అదే సమయంలో, పైకప్పూ దాని గోడలూ ఉష్ణం బయటికిపోయే ప్రక్రియ వేగాన్ని తగ్గిస్తాయి.

అదే విధంగా, మన వాయుమండలం భూ ఉపరితలాన్ని వెచ్చపరచేలా సూర్యరశ్మిని తనగుండా రానిస్తుంది. భూమి పరారుణ వికిరణంగా వాయుమండలంలోనికి ఉష్ణశక్తిని తిరిగి పంపిస్తుంది. వికిరణమయిన ఈ ఉష్ణశక్తిలో అధికభాగాన్ని వాయుమండలంలోని కొన్ని వాయువులు సంగ్రహిస్తాయి. అలా సంగ్రహించిన ఉష్ణశక్తిని భూగోళపు వెచ్చదనాన్ని మరింతగా వేడెక్కించేలా మళ్ళీ భూమిపైకి పంపిస్తాయి. భూగోళాన్ని ఇలా వేడెక్కించే ప్రక్రియయే గ్రీన్‌హౌస్‌ ఎఫెక్ట్‌ అని పిలువబడుతుంది. సూర్యుని నుండి వచ్చే ఉష్ణాన్ని మన వాయుమండలం గనుక ఇలా పట్టి ఉంచకపోతే, చంద్రుని లాగానే భూమి కూడా నిర్జీవంగా ఉండేది.

3. నీటి బాష్పం—అత్యంత అవసరమైన గ్రీన్‌హౌస్‌ వాయువు

మన వాయుమండలంలో 99 శాతం నైట్రోజన్‌, ఆక్సిజన్‌ అనే రెండు వాయువులతో రూపొందించబడింది. భూమిపై ఉన్న జీవరాశికి మద్దతునిచ్చే సంక్లిష్ట చక్రాల్లో ఓ ప్రాముఖ్యమైన పాత్రను ఆ వాయువులు నిర్వహిస్తున్నా, శీతోష్ణస్థితిని క్రమబద్ధీకరించడంలో అవి ప్రత్యక్షంగా ఏ విధమైన పాత్రనూ ఇంచుమించుగా నిర్వహించడంలేదు. శీతోష్ణస్థితిని క్రమబద్ధీకరించే పని వాయుమండలంలో మిగిలిన ఒక శాతం గ్రీన్‌హౌస్‌ వాయువులపై పడుతుంది. ఈ గ్రీన్‌హౌస్‌ వాయువుల్లో నీటి బాష్పమూ, కార్బన్‌డయాక్సైడ్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌, మిథేన్‌, క్లోరోప్లోరోకార్బన్స్‌, ఓజోను చేరివున్నాయి.

గ్రీన్‌హౌస్‌ వాయువులలో నీటి బాష్పం అతి ప్రాముఖ్యమైనది. దాన్ని ద్రవరూపంలోనే చూడడానికి అలవాటు పడిపోయాం గనుక నీటి బాష్పం ఒక వాయువని సాధారణంగా అనుకోం. కానీ, వాయుమండలంలో ఉన్న నీటి బాష్పంలోని ప్రతీ మోలిక్యుల్‌లోనూ ఉష్ణశక్తి ఉంటుంది. ఉదాహరణకు, మేఘంలోని నీటి బాష్పం చల్లబడి, ద్రవీభవించినప్పుడు, ఉష్ణం విడుదలై శక్తివంతమైన వాయుమండల సంవహన ప్రవాహాలకు కారణమౌతుంది. మన వాయుమండలంలోని నీటి బాష్పపు శక్తివంతమైన కదలిక, వాతావరణాన్నీ శీతోష్ణస్థితినీ రెండింటినీ నిర్ధారించడంలో కీలకమైన సంకీర్ణ పాత్రను నిర్వహిస్తుంది.

4. కార్బన్‌డయాక్సైడ్‌—జీవానికి అత్యావశ్యకం

భూగోళం వేడెక్కడాన్ని గూర్చిన చర్చల్లో అతి తరచుగా మాట్లాడే వాయువే కార్బన్‌డయాక్సైడ్‌. కార్బన్‌డయాక్సైడ్‌ను కేవలమొక కాలుష్యకారకంగా నిందించడమనేది తప్పుద్రోవ పట్టించడమే అవుతుంది. కిరణజన్య సంయోగక్రియలో అంటే ఆకుపచ్చని మొక్కలు తమకుగా తాము ఆహారాన్ని తయారు చేసుకొనే ప్రక్రియలో ఒక ప్రాముఖ్యమైన ఘటకాంశమే కార్బన్‌డయాక్సైడ్‌. మానవులూ, జంతువులూ ఆక్సిజన్‌ను పీల్చుకొని, కార్బన్‌డయాక్సైడ్‌ని విడిచిపెట్టడం జరుగుతుంది. మొక్కలు కార్బన్‌డయాక్సైడ్‌ని తీసుకొని ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. వాస్తవానికది, భూమిపై జీవాన్ని సాధ్యంచేసే సృష్టికర్త ఏర్పాట్లలో ఒకటైవుంది.a అయితే, వాయుమండలంలో కావాల్సిన దానికంటే మరీ ఎక్కువ కార్బన్‌డయాక్సైడ్‌ను కల్గివుండడమనేది కప్పుకోవడానికి మంచంపై మరొక దుప్పటిని అదనంగా వేసినట్టౌతుంది. అది మరింత వేడి అయ్యేలా చేయగలదు.

శక్తుల సంక్లిష్ట క్రమం

సూర్యుడూ, వాయుమండలమూ మాత్రమే శీతోష్ణస్థితిని నిర్ధారించడంలేదు. ఇలా నిర్ధారించే వాటిలో సముద్రాలూ, ఐస్‌క్యాప్‌లూ, ఉపరితల ఖనిజాలూ, పచ్చదనమూ, భూ ఆవరణ వ్యవస్థా, జీవరసాయన భూ ప్రక్రియా పద్ధతుల క్రమమూ, భూకక్ష్య యొక్క యాంత్రిక పద్ధతులూ చేరివున్నాయి. శీతోష్ణస్థితిని గూర్చిన అధ్యయనంలో భూమికి సంబంధించిన శాస్త్రాలన్నీ దాదాపుగా చేరివున్నాయి.

సూర్యుడు

వాయుమండలం

నీటి బాష్ఫం (H2O)

కార్బన్‌డయాక్సైడ్‌ (CO2)

[అధస్సూచి]

a ఇంచుమించుగా భూమిపై ఉన్న జీవరాశి యావత్తూ, కర్బన సమ్మేళన (ఆర్గానిక్‌) మూలాల నుండి శక్తిని పొందుతుంది, ఆ విధంగా అవి ప్రత్యక్షంగానైనా లేక పరోక్షంగానైనా సూర్యరశ్మిపై ఆధారపడుతున్నాయి. అయినా, అకర్బన సమ్మేళపు (ఇనార్గానిక్‌) రసాయనాల నుండి వచ్చే శక్తిని పొందడం ద్వారా, సముద్రపు అట్టడుగు నేలపై ఉన్న గాఢాంధకారంలో వర్థిల్లుతున్న జీవమూ ఉంది. కిరణజన్య సంయోగక్రియకు బదులుగా, రసాయన సంశ్లేషణ అని పిలువబడిన ప్రక్రియను ఈ జీవరాసులు ఉపయోగిస్తాయి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి