భవిష్య—శీతోష్ణస్థితి
మన వాయుమండల కాలుష్యమనేది మానవులు సృష్టించిన పర్యావరణ సమస్యల్లో కేవలమొకటి మాత్రమే. ఆ పర్యావరణ సమస్యల్లో పెద్ద ఎత్తున అడవుల్ని నరికివేయడమూ, జంతుజాలాల్ని నాశనం చేయడమూ, నదుల్నీ సరస్సుల్నీ సముద్రాల్నీ కాలుష్యానికి గురిచేయడమూ వంటివి చేరివున్నాయి. ఈ సమస్యల్లో ప్రతీదాన్నీ జాగ్రత్తగా విశ్లేషించి, వాటిని సరిదిద్దేందుకు ప్రతిపాదనలు చేయబడ్డాయి. ఈ సమస్యలనేవి భూగోళవ్యాప్తంగా ఉన్నాయి గనుక, వాటికి భూగోళవ్యాప్త పరిష్కారాలు అవసరం. సమస్యలు ఏమిటన్న విషయంలోనూ, వాటిని సరిదిద్దడానికి చేపట్టే చర్యల విషయంలోనూ అంతటా ఏకీభావం ఉంది. ఏ సంవత్సరానికా సంవత్సరం, చర్యలు తీసుకోమనే పిలుపుల్ని మనం వింటాం. కానీ, చేతల్లో కన్పించేది మాత్రం శూన్యం. జరిగేదంతా ఏమిటంటే, తరచూ విధానకర్తలు సమస్యలను చూచి గగ్గోలుపెట్టి, ఏదొకటి చేయాల్సిందేనని ఏకీభవిస్తారు కానీ వాస్తవానికి, “మా వల్ల కాదు, ఇప్పుడు కాదు” అనే మాటలను జతచేస్తారు.
1970లో, మొట్టమొదటి ధరిత్రి దినోత్సవమందు న్యూయార్క్ సిటీలోని ప్రదర్శకులు ఓ పెద్ద సైన్‌బోర్డును ప్రదర్శించారు. దానిపై భూగోళం “హెల్ప్!! హెల్ప్!!” అని గగ్గోలు పెడుతున్నట్టు చిత్రీకరించారు. ఆ విజ్ఞాపనకు ఎవరైనా ప్రతిస్పందిస్తారా? దేవుని వాక్యం ఇలా జవాబిస్తోంది: “రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగుదురు వారి సంకల్పములు నాడే నశించును.” (కీర్తన 146:3, 4) సృష్టికర్తకు మాత్రమే శక్తీ, జ్ఞానమూ, చిత్తమూ ఉందనీ, మానవాళి ఎదుర్కొంటున్న సంక్లిష్టమైన సమస్యలన్నింటినీ ఆయన మాత్రమే పరిష్కరిస్తాడనీ ఆ కీర్తనల గ్రంథకర్త తర్వాత వచనాల్లో చూపిస్తున్నాడు. మనమిలా చదువుతాం: “ఎవడు తన దేవుడైన యెహోవామీద ఆశపెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు.”—కీర్తన 146:5, 6.
సృష్టికర్త యొక్క ప్రేమపూర్వక వాగ్దానం
భూమి దేవుని నుండి వచ్చిన బహుమానం. భూగోళపు శీతోష్ణస్థితిని ఆహ్లాదకరమైనదిగా చేసే సంక్లిష్టమైన, అద్భుతకరమైన యాంత్రిక విధానాలతో దాన్ని ఆయనే రూపొందించి, సృష్టించాడు. (కీర్తన 115:15, 16) బైబిలు ఇలా చెబుతోంది: “[దేవుడు] తన బలముచేత భూమిని సృష్టించెను, తన జ్ఞానముచేత ప్రపంచమును [“ఫలభరితమైన నేలను,” NW] స్థాపించెను, తన ప్రజ్ఞచేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఆజ్ఞ నియ్యగా జలరాసులు ఆకాశమండలములో పుట్టును, భూమ్యంత భాగములలోనుండి ఆయన ఆవిరి ఎక్కజేయును, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారములలోనుండి గాలిని రావించును.”—యిర్మీయా 10:12, 13.
మానవజాతి ఎడల సృష్టికర్తకున్న ప్రేమను ప్రాచీనకాలంనాటి లుస్త్రలో ఉన్న ప్రజలకు పౌలు వర్ణించాడు. ఆయనిలా అన్నాడు: “[దేవుడు] ఆకాశమునుండి మీకు వర్షమును, ఫలవంతములైన రుతువులను దయచేయుచు, ఆహారము ననుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలుచేయుటచేత తన్ను గూర్చి సాక్ష్యములేకుండ చేయలే[దు].”—అపొస్తలుల కార్యములు 14:17.
మన భూగ్రహం యొక్క భవిష్యత్తు మానవ ప్రయత్నాలపైనా ఒప్పందాలపైనా ఆధారపడిలేదు. శీతోష్ణస్థితిని అదుపులో ఉంచగల శక్తిగలవాడు తన ప్రాచీనకాలంనాటి ప్రజలకు దాన్ని గురించి ఇలా వాగ్దానం చేశాడు: “మీ వర్షకాలములలో మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలములచెట్లు ఫలించును.” (లేవీయకాండము 26:4) అలాంటి పరిస్థితుల్ని ప్రజలు భూవ్యాప్తంగా త్వరలోనే అనుభవిస్తారు. విధేయులైన మానవులు వినాశనకర తుపాన్లకూ, ప్రచండమైన గాలివానలకూ, వరదలకూ, కరవులకూ లేక మరే ఇతర విధములైన ప్రకృతిసిద్ధ విపత్తులకూ బెదరరు.
సముద్ర తరంగాలూ, గాలీ, వాతావరణమూ అనేవి ఆహ్లాదకరమైనవిగా ఉంటాయి. అప్పుడు కూడా ప్రజలు వాతావరణాన్ని గురించి మాట్లాడతారు గానీ, దాన్ని గూర్చి వాళ్లేమీ చేయరు. దేవుడు తీసుకురానైవున్న భవిష్యత్తులో, వాతావరణాన్ని సరిచేసేందుకు మనమేమీ చేయనక్కర లేనంత మహత్తరంగా ఉంటుంది జీవితం.