వాతావరణాన్ని గూర్చిన చర్చ
మీరెక్కడ నివసిస్తున్నప్పటికీ, మీరెవరైనప్పటికీ వాతావరణం మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. పగటివేళ వేడిగానూ, ఎండ తీక్షణంగానూ ఉంటే, మీరు తేలికైన వస్త్రాల్ని ధరిస్తారు. మరి అదే చలిగా ఉంటే, మీరు స్వెట్టర్ల దగ్గరకూ, మఫ్లర్ల దగ్గరకూ పరిగెడతారు. వర్షమొస్తే? గొడుగును చేతబట్టుకుంటారు.
కొన్నిసార్లు, వాతావరణం మనకు ఆహ్లాదాన్ని కల్గిస్తుంది; మరి కొన్నిసార్లు, మనకు చికాకును కల్గిస్తుంది. అప్పుడప్పుడూ, అది తుపాన్ల రూపంలోనో, ప్రచండమైన గాలివానల రూపంలోనో, అనావృష్టి రూపంలోనో, మంచు తుపాన్ల రూపంలోనో లేక ఋతు పవనాల రూపంలోనో ఓ హంతకిగా మారుతుంది. మీరు దాన్ని ఇష్టపడినా, ఇష్టపడకపోయినా, దాన్ని తిట్టుకున్నా లేక నిర్లక్ష్యంచేసినా సరే, వాతావరణం మనం పుట్టినప్పటి నుండి గిట్టేంతవరకూ మన జీవితాల్ని ప్రభావితం చేస్తూ, అది ఎల్లప్పుడూ ఉంటుంది.
“వాతావరణం గురించి అంతా మాట్లాడేవాళ్లేగానీ దాన్ని పట్టించుకొనే నాధుడొక్కడూ లేడు” అని చమత్కరించారొకరు ఒకప్పుడు. నిజానికి, వాతావరణాన్ని ఏ విధంగానైనా మార్చాలని చూస్తే అది ఎల్లప్పుడూ మన శక్తికి అతీతంగా ఉన్నట్టు కనబడుతుంది. అయితే, దాన్నిక ఎంత మాత్రం నమ్మనటువంటి సైంటిస్టుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మన వాయుమండలంలోనికి కార్బన్‌డయాక్సైడ్‌నూ, మరితర వాయువుల్నీ విడిచిపెట్టడమనేది దీర్ఘకాలిక వాతావరణ స్థితిగతుల్లో అంటే, మన శీతోష్ణస్థితిలో మార్పును తీసుకురాబోతోందని వాళ్లు చెబుతారు.
నిపుణులు చెప్పినదాని ప్రకారంగా, రాబోయే ఈ మార్పు ఎలా ఉంటుంది? బహుశా మరింత అధికారిక జవాబు, శీతోష్ణస్థితి మార్పులపై ఇంటర్ గవర్నమెంటల్ నిపుణుల గుంపు (ఐపిసిసి) దగ్గర నుండి వస్తోంది. ఆ జవాబు 80 దేశాల నుండి వచ్చిన 2,500కన్నా ఎక్కువమంది పర్యావరణవేత్తల, ఆర్థికవేత్తల, రిస్క్-విశ్లేషకుల నైపుణ్యవంతమైన అభిప్రాయంపై ఆధారపడివుంది. 1995నాటి తమ రిపోర్టులో, ఐపిసిసి భూగోళ శీతోష్ణస్థితి అంతకంతకూ వేడెక్కుతుందని నిర్ధారించింది. రాగల శతాబ్దకాలంలో, పరిస్థితులు ఇలాగే గనుక కొనసాగితే, ఉష్ణోగ్రతాస్థాయి 3.5 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరిగే అవకాశంవుంది.
ఉష్ణోగ్రత కొన్ని డిగ్రీల సెల్సియస్ వరకూ అదనంగా పెరగడమనేది బహుశా అంతగా చింతించాల్సినదిగా అనిపించక పోయినప్పటికీ, ప్రపంచ శీతోష్ణస్థితిలోని ఏ కొద్దిపాటి ఉష్ణోగ్రతా మార్పైనా సరే, దుష్పరిణామాల్ని తీసుకురాగలదు. రాగల శతాబ్దంలో అనేకమంది ఎదురు చూస్తున్న పరిణామాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.
వాతావరణంలో ప్రాంతీయ వైపరీత్యాలు. కొన్ని ప్రాంతాల్లో, అనావృష్టి దీర్ఘకాలంగా ఉండగలదు. మరికొన్ని ప్రాంతాలు అతివృష్టికి గురికావచ్చు. గాలివానలూ, వరదలూ మరింత ఉద్ధృతంకాగలవు; ప్రచండమైన గాలివానలు మరింత నష్టాన్ని తెచ్చిపెట్టగలవు. వరదల మూలంగానూ, క్షామం మూలంగానూ లక్షలాదిమంది ఇప్పటికే మరణిస్తున్నా, భూగ్రహం వేడెక్కడం వల్ల మరణాల రేటు మరింత పెరగగలదు.
ఆరోగ్యానికి మరింత చేటు. ఉష్ణ సంబంధిత రోగాలూ, మరణాలూ మరింత పెరగగలవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయం ప్రకారంగా, భూగ్రహం వేడెక్కడం వల్ల మలేరియా, డెంగ్యూ వంటి ఉష్ణమండల రోగాల్ని ఉత్పన్నంచేసే కీటకాలు మరింత వ్యాపించగలవు. అంతేగాక, ప్రాంతీయ వర్షపాతంలో, హిమపాతంలో వచ్చిన మార్పుల మూలంగా మంచినీటి వనరులు తగ్గిపోవడమనేది నీటి ద్వారా సంక్రమించే, ఆహారం ద్వారా సంక్రమించే కొన్ని రకాలైన రోగాలకూ, పరాన్న జీవుల పెరుగుదలకూ కారణంకాగలదు.
ప్రకృతిసిద్ధమైన నివాస స్థలాలు ముప్పుకు గురికావచ్చు. మన గాలినీ నీటినీ వడపోసే అడవులూ, చిత్తడి నేలలూ అధిక ఉష్టోగ్రతల ద్వారా, వర్షపాతంలోని మార్పుల ద్వారా అపాయానికి గురికావచ్చు. అడవులు మరింత తరచుగానూ, మరింత తీవ్రంగానూ తగలబడవచ్చు.
పెరిగే సముద్ర మట్టాలు. సముద్రాన్ని అదుపులో ఉంచడానికి ఖరీదైన ప్రాజెక్టులను చేపట్టకపోతే, దిగువ కోస్తాతీర ప్రాంతాల్లో జీవించేవాళ్లు అక్కడ నుండి తరలి వెళ్లాల్సి ఉండవచ్చు. కొన్ని ద్వీపాలు పూర్తిగా మునిగిపోవచ్చు.
అలాంటి భయాలు సమంజసమైనవేనా? భూగోళపు శీతోష్ణస్థితి వేడెక్కుతుందా? అలా అయితే, దానికి కారకులు మానవులేనా? అంత ప్రమాదం పొంచివుంది గనుకే ఈ ప్రశ్నల్ని గూర్చి ఇంత తీవ్రంగా నిపుణులు చర్చించుకోవడంలో ఆశ్చర్యమేమీలేదు. ఇందులో చేరివున్న కొన్ని వివాదాంశాల్నీ, మన గ్రహ భవిష్యత్తును గురించి చింతించాల్సిన అవసరం ఉందా లేదా అనే ప్రశ్ననూ తర్వాతి రెండు శీర్షికలూ పరిశీలిస్తాయి.