“గాఢాంధకారపు లోయలో” సాంత్వన పొందడం
బార్బ్ర ష్రెయిజర్
అన్నీ సక్రమంగా జరుగుతున్న కొన్ని సమయాల్లో, నా జీవితం ఆహ్లాదకరమైన “పచ్చికగల చోట్ల” మాదిరిగా అనిపించేది. అయితే, “గాఢాంధకారపు లోయలో” ప్రయాణించడం ఎలాగుంటుందో కూడా నాకు తెలిసింది. అయినప్పటికీ, యెహోవా మన కాపరి కనుక, మనమెలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలమని నాకు నమ్మకముంది.—కీర్తన 23:1-4.
నేనూ నా భర్తా 1993వ సంవత్సరంలో దాదాపు 70 ఏండ్ల వయస్సులో ఉండగా, మేము క్రొత్త సాహసానికి—ఇక్వెడార్లో బైబిలు బోధకుల అవసరం ఎక్కువగా ఉన్నచోట సేవచేసే సాహసానికి బయల్దేరాలని నిర్ణయించుకున్నాం. పుట్టుకతో అమెరికన్లమైనప్పటికీ, మేము స్పానిష్ భాష మాట్లాడేవాళ్ళం, మాకు అప్పట్లో మరే ఆర్థిక బాధ్యతలు లేవు. ఇక్వెడార్లో ‘మనుష్యులను పట్టే జాలరుల’ పని ఫలదాయకంగా ఉంటుందని మాకు తెలుసు గనుక, ఆ ఫలవంతమైన జలాల్లో మా వలలు వేసి చూడాలని మేము పథకం వేసుకున్నాం.—మత్తయి 4:19.
ఇక్వెడార్లోని వాచ్ టవర్ సొసైటీ బ్రాంచ్ ఆఫీసులో ఉత్తేజకరమైన రోజులను గడిపిన తర్వాత, మాచాలాకు వెళ్లే ఆతురతతో—ప్రత్యేక అవసరమున్న నగరాల్లో అది ఒకటి—మేము గ్వాయాక్విల్‌లోని బస్‌స్టాండ్‌కు వెళ్ళాం. బస్‌కోసం వేచివుండగా, నా భర్త ఫ్రెడ్‌కు అకస్మాత్తుగా వంట్లో నలతగా అనిపించింది. కనుక మేము ప్రయాణం వాయిదా వేద్దామని నిర్ణయించుకున్నాం. ఫ్రెడ్ మా లగేజ్‌తోపాటు కూర్చుని ఉండగా, మేము బ్రాంచ్‌కు తిరిగి వెళ్ళే ఏర్పాట్లు చేసుకునేందుకు ఫోన్ చేయడానికని నేను వెళ్ళాను. కొన్ని నిమిషాల తర్వాత నేను తిరిగి వచ్చేసరికి, నా భర్త కనిపించలేదు!
ఫ్రెడ్‌ను ప్రాణాలతో మళ్ళీ చూడలేకపోయాను. బస్స్టాండ్లోనే, నేను అక్కడలేని ఆ కొద్ది సమయంలోనే, ఆయనకు విపరీతమైన గుండెపోటు వచ్చింది. నేను అమిత భావోద్వేగంతో ఆయన కోసం చూస్తుండగా, ఫ్రెడ్‌ను ఆసుపత్రికి తీసుకువెళ్ళారని బస్‌స్టాండ్‌లోని ఒక అధికారి నా దగ్గరికి వచ్చి చెప్పారు. నేను ఆసుపత్రికి వెళ్లేసరికి ఆయన అప్పటికే చనిపోయారని నాకు తెలిసింది.
పరిచయంలేని దేశంలో అకస్మాత్తుగా నేను ఇల్లూవాకిలీ లేని, ఆసరాగా భర్తలేని దానినైపోయాను. “ఆసరాగా” అని ఎందుకంటున్నానంటే, ఫ్రెడ్ మా ఇద్దరి విషయాల్లోనూ చొరవతీసుకుని, సంస్థీకరించేవారు. నాది బలమైన వ్యక్తిత్వం కాదు, ఆయన నాయకత్వం వహించడం నాకు సంతోషంగానే ఉండేది. కానీ ఇప్పుడు నేనే నిర్ణయాలు తీసుకోవాలి, నా జీవితాన్ని సంస్థీకరించుకోవాలి, దానికి తోడు నా దుఃఖాన్ని అధిగమించాలి. అది చాలా కృంగదీసే అనుభూతిని—నేను “గాఢాంధకారపు లోయలో”కి పడిపోయినటువంటి అనుభూతిని కలిగించింది. నా అంతట నేను పరిస్థితిని ఎదుర్కోవడం నేర్చుకోగలనా?
సత్యాన్ని తెలుసుకుని మా జీవితాలను నిరాడంబరమైనవిగా చేసుకోవడం
నేనూ, ఫ్రెడ్డూ మొదటిసారి కలిసినప్పటికే ఇద్దరమూ వివాహం చేసుకుని విడాకులు తీసుకున్న వ్యక్తులమే. మా మధ్య ఉండిన మంచి స్నేహం సన్నిహిత సంబంధంగా మారింది. ఆ తర్వాత వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అమెరికాలోని, వాషింగ్టన్‌లోని సీఅటల్లో పేరుకు మాత్రం చర్చికి వెళ్ళేవాళ్ళం. ఉత్సాహంగా ఉండే జేమీ అనే యువ పయినీర్ (పూర్తికాల సువార్తికురాలు) మా ఇంటికి వచ్చేదాకా, మా జీవితంలో మతానికి అంత ప్రాముఖ్యత ఉండేది కాదు. ఆమె ఎంతో ప్రశాంతంగా కనిపించింది కనుక, నాతో బైబిలు పఠించేందుకు ఆమె చేసిన ప్రతిపాదనను అంగీకరించాను.
ఫ్రెడ్ కూడా ఆసక్తి చూపించేసరికి, జేమీ తల్లిదండ్రులు మాతో బైబిలు పఠనాన్ని నిర్వహించారు. ఒక సంవత్సరం తర్వాత, 1968వ సంవత్సరంలో మేమిద్దరం బాప్తిస్మం పొందాం. ఆరంభం నుండీ, దేవుని రాజ్య ఆసక్తులను మా జీవితంలో మొదటి స్థానంలో ఉంచేందుకు శ్రద్ధచూపించాం. (మత్తయి 6:33) మాతో బైబిలు పఠించిన దంపతులు లుర్న్, రూడీ నుస్ట్లు ఈ విషయంలో నిస్సంశయంగా మంచి మాదిరినుంచారు. మేము బాప్తిస్మం పొంది ఎంతో కాలం గడవకముందే, అమెరికాలోని తూర్పు తీర ప్రాంతంలో ఎంతో అవసరత ఉన్న ఒక నగరానికి వాళ్ళు తరలి వెళ్ళారు. ఇది మేమూ అలాగే చేయాలన్న ఆసక్తి విత్తనాలను మా హృదయాల్లో నాటింది.
మేము మరోచోటికి వెళ్లాలనుకోవడానికి మరో కారణముంది. ఫ్రెడ్ పెద్ద డిపార్డ్మెంట్ స్టోర్ మ్యానేజర్గా పనిచేసేవాడు. అది పూర్తి అవధానాన్ని తీసుకునే పని. మరో ప్రాంతానికి వెళ్తే, తన జీవితాన్ని మరింత సరళతరం చేసుకునేందుకూ, సత్యము మీదా, మా ఇద్దరు పిల్లల మీదా మరింత అవధానం ఉంచేందుకూ సాధ్యమౌతుందని ఆయన గ్రహించాడు. నా మొదటి వివాహంలో నాకు ఒక కుమార్తె ఉంది, ఆమెకు ఇప్పుడు పెళ్ళయ్యింది. ఆమే, ఆమె భర్తా కూడా సత్యాన్ని స్వీకరించారు. కనుక సీఅటల్ను వదిలిపెట్టిపోవాలన్న నిర్ణయం కాస్త బాధ కలిగించింది. అయినప్పటికీ, వాళ్ళు మా లక్ష్యాలను అర్థం చేసుకుని, మా నిర్ణయానికి మద్దతునిచ్చారు.
అలా మేము 1973లో స్పెయిన్‌కు తరలివెళ్ళాం. ఆ సమయంలో, ఆ దేశంలో సువార్త ప్రచారకుల అవసరతా, నాయకత్వం వహించే సహోదరుల అవసరతా చాలా ఉండేది. మేము జాగ్రత్తగా ఖర్చుచేస్తే, మేము ఆదా చేసిన డబ్బు స్పెయిన్‌లో అయ్యే ఖర్చులకు సరిపోతుందనీ, మా సమయంలో ఎక్కువ భాగం పరిచర్యలో ఉపయోగించవచ్చనీ ఆయన అంచనా వేశారు. మేము చేసిందదే. త్వరలోనే ఫ్రెడ్ సంఘ పెద్దగా సేవచేయనారంభించారు, 1983కెల్లా మేమిరువురమూ పయినీర్లమయ్యాం.
మేము స్పెయిన్‌లో అక్కడి భాషను నేర్చుకుని, అనేక అనుభవాలను ఆస్వాదిస్తూ 20 సంవత్సరాలు సేవచేశాం. తరచూ, నేనూ, ఫ్రెడ్డూ కలిసి ప్రకటించేవాళ్ళం, వివాహిత దంపతులతో పఠనాలను నిర్వహించేవాళ్ళం. వాళ్లలో అనేకులు ఇప్పుడు బాప్తిస్మం పొందిన సాక్షులే. స్పెయిన్‌లో కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత, మా పిల్లల్లోని అందరి కన్నా చిన్నవాళ్ళైన హైడీ, మైక్‌లు కూడా పయినీర్ సేవను చేపట్టారు. మాకు భౌతికంగా ఎక్కువగా లేకపోయినప్పటికీ, అదే నా జీవితంలోని అత్యంత సంతోషకరమైన సమయం. మా జీవితాలు చాలా సరళంగా ఉండేవి. మేము కుటుంబంగా చాలా సమయాన్ని కలిసి గడపగల్గేవాళ్లం. మేము చాలా జాగ్రత్తగా బడ్జెట్ వేసుకున్నాం గనుక, మేం ఆదా చేసుకున్న డబ్బు బైబిలు వృత్తాంతంలోని విధవరాలి నూనెలా ఎప్పటికీ అయిపోలేదు.—1 రాజులు 17:14-16.
మరోసారి దేశం మారడం
1992 అయ్యేసరికి, మేము మరోచోటికి వెళ్ళడాన్ని గురించి ఆలోచించనారంభించాం. మా పిల్లలు పెద్దవారయ్యారు, స్పెయిన్‌లోని అవసరత మునుపటికన్నా తక్కువే. ఇక్వెడార్లో సేవచేసిన ఒక మిషనరీ మాకు తెలుసు. ఆ దేశంలోని పయినీర్ల మరియు పెద్దల అత్యవసరాన్ని గురించి ఆయన మాకు చెప్పారు. మరో క్రొత్త దేశంలో సేవనారంభించడాన్ని గురించి తలంచలేనంతటి వృద్ధులమా మేము? మాకిద్దరికీ మంచి ఆరోగ్యముంది, అలాగే ప్రకటన పని అంటే మక్కువే గనుక, మేమలా అనుకోలేదు. గనుక మేము ఇక్వెడార్ బ్రాంచ్‌ను సంప్రదించి, మేము పథకాలు వేసుకోవడం మొదలుపెట్టాం. వాస్తవానికి, స్పెయిన్‌లో ఉత్తర భాగాన సేవచేస్తున్న మా కూతురు హైడీ మరియు ఆమె భర్త క్వాన్ మాన్వల్ కూడా మాతో చేరాలని ఆతృతతో ఉన్నారు.
చివరికి ఫిబ్రవరి 1993 అయ్యేసరికి, మేము మా కార్యాలన్నింటినీ చూసుకుని, క్రొత్త దేశానికి చేరుకున్నాం. ఇక్వెడార్లో చాలామంది బైబిలు పఠించాలనే ఆతృతతో ఉన్నారు. అక్కడ పయినీరింగ్ చేయవచ్చనే ఆశతో మేమిద్దరమూ ఎంతో థ్రిల్‌గా ఉన్నాం. బ్రాంచ్‌లో సాహార్ద్రమైన స్వాగతాన్ని స్వీకరించిన తర్వాత, ప్రత్యేక అవసరతలు గల స్థలాలుగా సిఫారసు చేయబడిన అనేక నగరాలను సందర్శించాలని మేము పథకాలు వేసుకున్నాం. అయితే అప్పుడే నా భర్త చనిపోయారు.
“గాఢాంధకారపు లోయ”లో
మొదట నిర్ఘాంతపోయాను. తర్వాత అసలు నమ్మలేకపోయాను. ఫ్రెడ్‌కు వంట్లో నలతగా ఉండడమన్నది చాలా అరుదు. నేను ఇప్పుడు ఏమి చెయ్యాలి? ఎక్కడికి వెళ్ళాలి? నేనేమి చేయాలో నాకు సరిగా అర్థం కాలేదు.
నా జీవితంలోని అతిచెడ్డవైన ఆ ఘడియల్లో, సానుభూతిగల సహోదర సహోదరీల ఆలంబనతో ఆశీర్వదించబడ్డాను. వారిలో చాలా మందికి నేను పరిచయం కూడా లేను. బ్రాంచ్‌లోని సహోదరులు చాలా దయగలవారు, అంత్యక్రియల ఏర్పాట్లతో సహా ప్రతి విషయాన్నీ వాళ్లే చూసుకున్నారు. ముఖ్యంగా బోనో సహోదరుడూ, బోనో సహోదరీ నాకు చూపించిన ప్రేమను గుర్తుచేసుకుంటాను. నా అంతట నేను ఎన్నడూ ఏమీ చేయలేదని వాళ్ళకు అవగతమైంది. ఈడత్ బోనో నేను ఒంటరిగా భావించకుండా ఉండేందుకని, అనేక రాత్రులు నా గదిలోనే నిద్రపోయింది. వాస్తవానికి బేతేలు కుటుంబమంతా కూడా అలాంటి ప్రేమనూ, పరిగణననూ చూపించింది. వాళ్ళు ప్రేమ అనే వెచ్చని సంరక్షణ రగ్గును నాకు కప్పారా అన్నట్లు ఉండేది.
కొన్ని రోజుల్లో నా ముగ్గురు పిల్లలూ నాతోపాటు ఉన్నారు. వాళ్ళిచ్చిన ఆసరా వెలకట్టలేనిది. ప్రేమపూర్వకంగా ఉండే అనేకులు పగలు సమయం నా చుట్టూ ఉన్నప్పటికీ, సుదీర్ఘంగా ఉండే రాత్రులను వెళ్ళబుచ్చడం చాలా కష్టంగా ఉండేది. అలాంటి సమయాల్లోనే యెహోవా నన్ను సంరక్షించాడు. నేను భయంకరమైన ఒంటరితనానికి గురైనప్పుడల్లా, ఆయనవైపుకు మళ్లి, ప్రార్థన చేయగా, ఆయన నన్ను ఓదార్చాడు.
అంత్యక్రియల తర్వాత, నేను నా జీవితంతో ఏమి చేయాలన్న ప్రశ్న ఎదురైంది. నేను ఇక్వెడార్లోనే ఉండాలని కోరుకున్నాను. ఎందుకంటే మేమిద్దరం ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయమది. కాని నేను ఒంటరిగా ఆ పని చేయగలనని అనుకోలేదు. కనుక, సమీప భవిష్యత్‌లో ఇక్వెడార్కు వచ్చేయాలనుకున్న హైడీ మరియు క్వాన్ మాన్వల్ వెంటనే వచ్చేందుకూ, మేము కలిసి సేవచేయగలిగేందుకూ తమ కార్యాల్లో కావలసిన సర్దుబాట్లు చేసుకున్నారు.
ఒక్క నెలలోనే, బ్రాంచ్ సిఫారసు చేసిన ఇతర నగరాల్లో ఒకటైన లాహాలో ఒక ఇల్లు దొరికింది. వెంటనే, కార్యాలను సంస్థీకరించడంలో, ఇంట్లో సెటిల్ అవ్వడంలో, క్రొత్త దేశంలో ప్రకటనా పని ఆరంభించడంలో బిజీ అయ్యాను. అలా చేయడం నా దుఃఖాన్ని కొంతమేరకు తగ్గించింది. అంతేకాకుండా ఫ్రెడ్‌తో ఎక్కువ సన్నిహితంగా ఉండే నా కూతురు ఎదుట ఏడ్వగల్గేదాన్ని, అది నా అనుభూతులను బహిర్గతం చేసేందుకు నాకు సహాయపడింది.
అయినప్పటికీ, రెండు నెలల తర్వాత, నేను నా క్రొత్త దినచర్యలో స్థిరపడ్డాక, నేను ఎంతో కోల్పోయానన్న స్పృహ మరింత తీవ్రమైంది. నేనూ, ఫ్రెడ్డూ కలిసి గడిపిన సంతోషకరమైన ఘడియలను గుర్తు చేసుకుంటే అవి నన్ను మరింత కృంగదీస్తున్నాయి గనుక వాటిని గురించి నేనిక తలపోయలేనని కనుగొన్నాను. ఒక్కోరోజు గడుస్తున్న కొలదీ నేను గత స్మృతుల తలుపును బలవంతంగా మూసివేసేదాన్ని. భవిష్యత్తును గురించి ఎక్కువగా ఆలోచించలేకపోయాను. అయినప్పటికీ, ప్రతిరోజు అర్థవంతమైన పనేదైనా చేసేందుకు, ముఖ్యంగా ప్రకటనా పనిని చేసేందుకు ప్రయత్నించాను. అదే నేను తట్టుకోగల్గేలా చేసింది.
ప్రకటించడానికీ, బైబిలు నేర్పడానికీ ఎల్లప్పుడూ ఇష్టపడ్డాను. ఇక్వెడార్లోని ప్రజలు చక్కగా ఆహ్వానిస్తారు కనుక, ఈ పని ఆహ్లాదకరంగా ఉండేది. నేను ఇంటింటి సేవ చేయడానికి వెళ్ళిన మొదట్లో, నేను కలిసిన పెళ్ళైన ఒక యువతి, “తప్పకుండా, నేను బైబిలు గురించి తెలుసుకోవడానికి ఇష్టపడతాను!” అని అనింది. నేను ఇక్వెడార్లో ఆరంభించిన మొదటి పఠనం ఆమెదే. ప్రకటనా పనిలో నాకు కలిగిన ఆ అనుభవం నా అవధానాన్నంతా తీసుకుంది, నేను నా సొంత దుఃఖాన్ని గురించి అతిగా తలపోయకుండా చేసింది. యెహోవా నా ప్రాంతీయ సేవను సమృద్ధంగా ఆశీర్వదించాడు. నేను సువార్త ప్రకటన కోసం వెళ్లిన ప్రతిసారీ కూడా చాలా మంచి అనుభవం కలిగేది.
పయినీర్‌గా కొనసాగడం నిస్సందేహంగా ఆశీర్వాదంగా ఉండేది. అది నేను దానికి అనుగుణ్యంగా జీవించే బాధ్యతను నాపై ఉంచి, ప్రతిరోజు సకారాత్మకమైనదేదైనా చేసే తరుణాన్నిచ్చింది. కొద్ది కాలంలోనే నేను ఆరు బైబిలు పఠనాలను ప్రారంభించాను.
నేను నా పరిచర్యలో పొందిన సంతృప్తిని సోదాహరణంగా తెలియజేసేందుకు, బైబిలు బోధల మీద ఇటీవలే నిజమైన మెప్పుదలను కనబరచిన ఒక మధ్యవయస్కురాలైన మహిళను గురించి చెబుతానుండండి. నేను ఆమెకు ఒక లేఖనాన్ని చూపించినప్పుడు, ఆమె మొదట దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలని కోరుకుంది. ఆ తర్వాత ఆమె దాని సలహాను ఆచరణలో పెట్టేందుకు సుముఖత చూపింది. ఆమె గతంలో అనైతిక జీవితాన్ని గడిపినప్పటికీ, తనతో ఆమె జీవించాలని కోరుకున్న ఒక పురుషుడు ఇటీవలే లైంగిక సంపర్కం కోసం ప్రతిపాదించినప్పుడు ఆమె ఆయన ప్రతిపాదనను ఖండితంగా నిరాకరించింది. తాను లేఖనాధార ప్రమాణాలను స్థిరంగా పాటించడంలో ఎంతో సంతోషిస్తుందనీ, మునుపెన్నడూ ఎరుగని మనశ్శాంతిని ఇప్పుడు అనుభవిస్తుందనీ నాకు చెప్పింది. అలాంటి పఠనాలు నా హృదయానికి వెచ్చదనాన్నిచ్చి, నేను ఉపయోగకరమైనదానిననే అనుభూతినిస్తాయి.
నా ఆనందాన్ని కాపాడుకోవడం
శిష్యులను చేసే పని నాకు ఎంతో ఆనందాన్నిస్తున్నప్పటికీ, నా దుఃఖం అంత త్వరగా మటుమాయం కాలేదు. నా విషయంలో, విచారం అనేది వస్తుంది, పోతుంది. నా కూతురూ, అల్లుడూ నాకు చాలా చక్కని మద్దతునిచ్చారు. కానీ వాళ్ళు ప్రత్యేక ఘడియలను కలిసి గడపడాన్ని చూసినప్పుడు నేను కోల్పోయిన విషయం మరెక్కువ అనుభవంలోకి వస్తుంది. నా భర్తను చాలాసార్లు తలంచుకుంటాను. మాది అంత సన్నిహిత అనుబంధమైనందువల్ల మాత్రమే కాదు గానీ, నేను అనేక విషయాల్లో ఆయన మీదే ఆధారపడేదాన్నన్నది కూడా దానికి కారణమే. ఆయనతో మాట్లాడలేకపోవడం, ఆయనను సలహా అడగలేకపోవడం, లేదా ఆయనతో ప్రాంతీయ సేవలోని అనుభవాలను పంచుకోలేకపోవడం నాకు ఎంతో విచారాన్నీ, శూన్యతా భావాన్నీ కలిగించిన సమయాలున్నాయి. దానినధిగమించడం ఎంతమాత్రమూ సులభం కాదు.
అలాంటి సందర్భాల్లో నాకు సహాయపడేదేమిటి? నేను యెహోవాకు హృదయపూర్వకంగా ప్రార్థించి, వేరే దేనిని గురించైనా, అనుకూలమైన మరే విషయాన్ని గురించైనా తలపోసేందుకు నాకు సహాయం చేయమని కోరేదాన్ని. (ఫిలిప్పీయులు 4:6-8) ఆయన నిజంగానే నాకు సహాయం చేస్తున్నాడు. నేనూ, ఫ్రెడ్డూ కలసి ఆస్వాదించిన మంచి సమయాలను గురించి కొన్ని సంవత్సరాల తర్వాత మాట్లాడగలిగాను. అలా స్వస్థతా ప్రక్రియ నెమ్మదిగా జరగనారంభించింది. కీర్తనల రచయితైన దావీదులా, నేను “గాఢాంధకారపు లోయలో” నడిచినటువంటి అనుభూతి కలుగుతోంది. కాని నన్ను ఓదార్చేందుకు యెహోవా ఉన్నాడు. నమ్మకమైన సహోదరులు నన్ను సరైన దిశలోకి దయాపూర్వకంగా నడిపించారు.
నేను నేర్చుకున్న పాఠాలు
ఎప్పుడూ ఫ్రెడ్డే నాయకత్వం వహించేవాడు గనుక, నేనే చొరవ తీసుకుని, నా అంతట నేనే కార్యాలను చేయగలనని నేనెన్నడూ అనుకోలేదు. కానీ యెహోవా, నా కుటుంబమూ, సహోదరులూ నాకు సహాయం చేయడం వలన నా అంతట నేను చేసుకోగల్గుతున్నాను. కొన్ని విధాల్లో నేను మునుపటికన్నా దృఢంగా ఉన్నాను. మునుపటి కన్నా, ఇప్పుడు యెహోవావైపుకు ఎక్కువ మరలుతున్నాను, నా అంతట నేను నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటున్నాను.
అవసరత ఎక్కువగా ఉన్న స్పెయిన్‌లో నేనూ, ఫ్రెడ్డూ 20 సంవత్సరాలు కలిసి సేవ చేయగల్గినందుకు సంతోషిస్తున్నాను. ఈ లోక విధానంలో, రోజులు గడుస్తున్న కొలది ఏమి జరుగుతుందో మనకెవరికీ తెలియదు. మనకు అవకాశం ఉన్నప్పుడే మనం యెహోవా కోసమూ, మన కుటుంబం కోసమూ చేయగల్గేదంతా చేయడం ప్రాముఖ్యమని అనుకుంటున్నాను. ఆ సంవత్సరాలు మా జీవితాలను, మా వైవాహిక జీవితాన్ని ఆనందభరితం చేశాయి. నేను నష్టపోయినదాన్ని సహించేందుకు అవి నన్ను సిద్ధం చేశాయని నమ్ముతున్నాను. ఫ్రెడ్ మరణించక ముందే, పయినీరింగే మా జీవన మార్గమైనందువల్ల, క్రొత్త వాస్తవ పరిస్థితులను అంగీకరించడానికి కఠిన యత్నం చేస్తుండగా, ఆ జీవన మార్గం నేను నెరవేర్చవలసిన సంకల్పమొకటుందన్న స్పృహను ఇచ్చింది.
ఫ్రెడ్ చనిపోయినప్పుడు, నా జీవితం కూడా ముగిసిపోయినట్లు నాకు మొదట అనిపించింది. కాని, నిజమది కాదు. యెహోవా సేవలో నేను చేయవలసిన పని ఉంది, నేను సహాయపడవలసిన ప్రజలున్నారు. నా చుట్టూ ఉన్న అనేకులకు ఇప్పటికీ సత్యం అవసరమై ఉందన్న వాస్తవం దృష్ట్యా, ఆ పనిని ఎలా విడిచిపెట్టగలను? యేసు క్రీస్తు చెప్పినట్లే, ఇతరులకు సహాయం చేయడం నాకూ శ్రేయస్కరమే. (అపొస్తలుల కార్యములు 20:35) ప్రాంతీయ పరిచర్యలో నాకు కలిగిన అనుభవాలు నేను ఎదురుచూడగల విషయాలను, పథకం వేయవలసిన విషయాలను చూపించాయి.
కొన్ని రోజుల క్రితం, సుపరిచితమైన ఒంటరితనపు అనుభూతి మళ్ళీ నన్ను పీడించింది. అయితే నేను బైబిలు పఠనం కోసం ఇంటి నుండి బయలుదేరగా, నా మనస్సు ఆనందంతో ఉరకలు వేసినట్లు గుర్తించాను. రెండు గంటల తర్వాత నేను ఎంతో సంతృప్తితో, ఆనందంతో ఇంటికి తిరిగి వచ్చాను. కీర్తనల రచయిత చెప్పినట్లు, మనం కొన్నిసార్లు ‘కన్నీళ్లు విడుస్తూ విత్తి’ ఉండవచ్చు, కానీ యెహోవా మన ప్రయత్నాలను ఆశీర్వదిస్తాడు, మనం ‘సంతోషగానముతో పంట కోస్తాం.’—కీర్తన 126:5, 6.
ఇటీవలే, అధిక రక్తపోటు వల్ల నా పట్టికలో మళ్ళీ కాస్త సవరింపులు చేసుకోవలసి వచ్చింది, నేను ఇప్పుడు క్రమమైన సహాయ పయినీరును. ప్రస్తుత లోక విధానంలో, నా నష్టాన్ని పూర్తిగా భర్తీ చేసుకోగలనని అనుకోనప్పటికీ, సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నాను. నా ముగ్గురు పిల్లలూ పూర్తికాల పరిచర్యలో ఉండడాన్ని చూడడం నాకు ఆనందాన్నిస్తుంది. మరి ముఖ్యంగా, క్రొత్త లోకంలో నేను ఫ్రెడ్‌ను తిరిగి కలవడం కోసం ఎదురు చూస్తున్నాను. నేను ఇక్వెడార్లో చేయగల్గుతున్న పనిని—మా పథకాలు ఫలించాయన్న విషయాన్ని—ఆయన తెలుసుకున్నప్పుడు తప్పకుండా పులకించిపోతారు.
కీర్తనల రచయిత మాటలు నా విషయంలో నిజమని తేలాలని ప్రార్థిస్తున్నాను. ఆయనిలా అన్నాడు: “నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను.”—కీర్తన 23:6.
[12వ పేజీలోని చిత్రం]
ఇక్వెడార్లోని సాన్ లూకాస్లోని లాహాలో పరిచర్యలో