వినోదాన్ని ఎంచుకోవడంలో ఎంపికగలవారై ఉండండి
పిల్లలపై వినోదం ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? అధ్యాపకుడూ డాక్టరూ అయిన అల్వన్ పూసాన్ 30 సంవత్సరాలుగా పిల్లలతో పనిచేశాడు. లైంగికతనూ, హింసలనూ ప్రదర్శించే ఫిల్ములు అలాంటి ప్రవర్తన సాధారణమైనదని యౌవనస్థులకు బోధిస్తాయని ఆయన నమ్ముతున్నాడు. ఆయన మరో అపాయాన్ని ఈ మాటల్లో తెలియజేస్తున్నాడు: “అలాంటి సినిమాలు చూసి ఇంటికి తిరిగివచ్చిన పిల్లలు భయపడిపోవడాన్ని—లేదా మరీ తగాదాలకు దిగడాన్ని నేను చూశాను. కొందరు పిల్లలైతే అంటిపెట్టుకుని ఉండే లేదా వేలు నోట్లో పెట్టుకుని చీకే లేదా పడక తడిపే పాత అలవాట్లకు మళ్ళడాన్ని చూశాను.” ఈ డాక్టర్ అభిప్రాయం ప్రకారం, అలాంటి ప్రవర్తనకు శారీరక లేదా లైంగిక అత్యాచారం లేదా యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో నివసించడం వంటి ఇతర సంభవాలు కారణం కాగలవని నిపుణులు రుజువు చేశారు. ఈ కారణాలు చెప్పడానికి కొన్ని మాత్రమే. “మనమెవరమూ కూడా కావాలని ఒక బిడ్డను అలాంటి పరిస్థితుల్లో ఉంచం. అయినప్పటికీ, వాళ్ళు నిజ జీవితంలో చూడకూడదని మనం అనుకునేవి వాళ్ళు తెరమీద చూస్తుంటే మనం వారించడం లేదు.”
ఎంపిక చేసుకునేవారై ఉండేందుకూ, తాము ఎంచుకునే వినోదం బైబిలు సూత్రాలను ఉల్లంఘించట్లేదని నిశ్చయపరచుకునేవారై ఉండేందుకూ క్రైస్తవులకు హేతుబద్ధమైన కారణముంది. ఉదాహరణకు, కీర్తన 11:5 ఇలా చెబుతుంది: “యెహోవా నీతిమంతులను పరిశీలించును దుష్టులును బలాత్కారాసక్తులును ఆయనకు అసహ్యులు.” క్రైస్తవ అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, . . . ధనాపేక్షను చంపి వేయుడి. ఇప్పుడైతే మీరు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి.”—కొలొస్సయులు 3:5, 8.
కనుక తమ పిల్లల కోసం, అలాగే తమ కోసం తాము ఎంచుకునే వినోదం “శరీరకార్యము”లకు ప్రోద్బలాన్నివ్వకుండా ఉండేలా తల్లిదండ్రులు జాగ్రత్తపడాలి. (గలతీయులు 5:19-21) వారు తమ వినోదము యొక్క పరిమాణ, నాణ్యతలను పరిగణనలోకి తీసుకుని ఎంపికచేసేవారై ఉండాలి.—ఎఫెసీయులు 5:15-17.