బైబిలు ఉద్దేశం
“లోకసంబంధులు కారు”—దాని భావమేమిటి?
సా. శ. నాల్గవ శతాబ్దంలో, క్రైస్తవులని చెప్పుకున్న వేలాదిమంది ఐగుప్తు ఎడారుల్లో ఏకాంతంగా జీవించేందుకు తమ ఆస్తుల్నీ బంధువుల్నీ, తమ జీవన విధానాన్ని విడిచిపెట్టారు. “నేను వేరై ఉంటాను” అనే అర్థాన్నిచ్చే గ్రీకు పదమైన ఏన్‌ఖోరియో నుండి వీళ్లు ఏన్‌ఖోరైట్లుగా ప్రసిద్ధిగాంచారు. తమ సమకాలీనుల నుండి తమను తాము వేరుపర్చుకున్న వాళ్లుగా వారిని ఓ చరిత్రకారుడు వర్ణిస్తున్నాడు. మానవ సమాజాన్నుండి వేరుపర్చుకోవడం ద్వారా తాము ‘లోకసంబంధులు కాని’వారిగా ఉండే క్రైస్తవ కట్టడకు విధేయత చూపిస్తున్నామని ఏన్‌ఖోరైట్లు తలంచారు.—యోహాను 15:19.
“ఇహలోకమాలిన్యము . . .[అం]టకుండ” జాగ్రత్తపడమని బైబిలు క్రైస్తవులకు ఉద్బోధిస్తోంది. (యాకోబు 1:27) లేఖనాలు స్పష్టంగా ఇలా హెచ్చరిస్తున్నాయి: “వ్యభిచారిణులారా, యీ లోకస్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి యెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.” (యాకోబు 4:4) అయితే, అక్షరార్థంగా ఇతరులనుండి వేరై, ఏన్‌ఖోరైట్లుగా ఉండాలని క్రైస్తవులు కోరబడుతున్నారని దీని భావమా? తమ మత నమ్మకాల్లో పాలు పంచుకొననివారి నుండి తమను తాము వేరుపర్చుకోవాలా?
క్రైస్తవులు సంఘ వ్యతిరేకులు కారు
లోకసంబంధులుగా ఉండకూడదనే భావన, దేవుని నుండి వేర్పర్చుకున్న మానవ సమాజంలోని అధిక సంఖ్యాకుల నుండి క్రైస్తవులు తమను తాము వేరుచేసుకునే అవసరతను ఉన్నతపర్చే అనేక బైబిలు వృత్తాంతాల్లో చర్చించబడింది. (2 కొరింథీయులు 6:14-17; ఎఫెసీయులు 4:18; 2 పేతురు 2:20 పోల్చండి.) అందుకే, లోకం దురాశతో వెంబడించే ఐశ్వర్యమూ, అధికారమూ, వినోదాల్లో విపరీతమైన విచ్ఛలవిడితనమూ వంటి యెహోవా నీతియుక్త మార్గాలకు విరుద్ధమైన దృక్పథాల్నీ, సంభాషణనూ, ప్రవర్తననూ నిజ క్రైస్తవులు జ్ఞానయుక్తంగా విడనాడాలి. (1 యోహాను 2:15-17) యుద్ధాల్లో, రాజకీయాల్లో తటస్థంగా ఉండడం ద్వారా కూడా వాళ్లు లోకం నుండి వేరుపర్చుకుంటారు.
తన శిష్యులు “లోకసంబంధులు కారు” అని యేసుక్రీస్తు చెప్పాడు. అయితే ఆయన దేవునికి ఇలా కూడా ప్రార్థించాడు: “నీవు లోకములో నుండి వారిని తీసికొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను.” (యోహాను 17:14-16) స్పష్టంగా, క్రైస్తవులు కాని వారితో అన్ని సంబంధాల్ని తెంచుకుంటూ ఆయన శిష్యులు సమాజ వ్యతిరేకులవ్వాలని యేసు కోరుకోలేదు. నిజానికి, ఇతరులతో ఏ సంబంధాలూ లేకుండా ప్రత్యేకపర్చుకోవడమనేది ఓ క్రైస్తవున్ని “బహిరంగముగాను, ఇంటింటను” ప్రకటించే బోధించే తన నియామకాన్ని నెరవేర్చకుండా ఆటంకపరుస్తుంది.—అపొస్తలుల కార్యములు 20:20; మత్తయి 5:16; 1 కొరింథీయులు 5:9, 10.
లోక మాలిన్యం అంటకుండా ఉండమనే సలహా, తాము ఇతరులకన్నా ఉన్నతులమని పరిగణించు ఏ ఆధారాన్నీ క్రైస్తవులకు ఇవ్వడం లేదు. యెహోవాకు భయపడువారు “అహంకారము”ను అసహ్యించుకుంటారు. (సామెతలు 8:13) “ఎవడైనను వట్టివాడైయుండి తాను ఎన్నికైన వాడనని యెంచుకొనినయెడల తన్ను తానే మోసపరచుకొనును” అని గలతీయులు 6:3 చెబుతోంది. “అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు” గనుక తాము ఉన్నతులమని తలంచువారు తమను తామే మోసపర్చుకుంటారు.—రోమీయులు 3:23.
‘ఎవనిని దూషింపవద్దు’
యేసు కాలంలో, తమ మతగుంపులకు చెందని వారినందరినీ ఏవగించుకొనిన ప్రజలు ఉన్నారు. వీరిలో పరిసయ్యులున్నారు. వాళ్లు మోషే ధర్మశాస్త్రంలోనూ, అలాగే యూదా పారంపర్యపు ప్రతీ చిన్న వివరణల్లోనూ నిష్ణాతులు. (మత్తయి 15:1, 2; 23:2) మతపరమైన అనేక ఆచారాల్ని జాగ్రత్తగా అనుసరించడంలో వాళ్లు గర్వించేవారు. కేవలం తమ బుద్ధి కుశలత ద్వారా సాధించిన వాటిని బట్టీ, మతాధికారాన్ని బట్టీ తాము ఇతరులకన్నా అధికులమన్నట్టు పరిసయ్యులు ప్రవర్తించేవారు. “ధర్మశాస్త్ర మెరుగని యీ జనసమూహము శాపగ్రస్తమైనదని” చెప్పడం ద్వారా తమ మత ఛాందస దృక్పథాన్నీ, గర్వంతో కూడిన దృక్పథాన్నీ వ్యక్తపర్చారు.—యోహాను 7:49.
పరిసయ్యులుకాని వారిని కించపర్చే పేరును కూడా పరిసయ్యులు పెట్టారు. ఆమ్‌హారైట్స్ అనే హెబ్రీ పదం మొదట్లో, సమాజంలో నియమబద్ధంగా జీవించే సభ్యుల్ని సూచించేందుకు అనుకూలంగా ఉపయోగించబడేది. కానీ కాలక్రమేణా గర్విష్టులైన యూదా మతనాయకులు ఆమ్‌హారైట్స్ భావాన్ని కించపర్చేదానిగా మార్చేశారు. క్రైస్తవులమని చెప్పుకున్న వారితో పాటూ ఇతర మతగుంపులూ తమ మత విశ్వాసాలకు భిన్నమైన విశ్వాసాల్ని కల్గివున్న ప్రజల్ని నీచమైన రీతిలో సూచించడంలో “అన్యులు,” “హీతన్” వంటి పదాల్ని ఉపయోగించారు.
అయితే, క్రైస్తవత్వాన్ని అంగీకరించని వారిని మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు ఏ విధంగా దృష్టించారు? “సాత్వికముతో”నూ “భయముతో”నూ [“ప్రగాఢమైన గౌరవంతోనూ” NW] అవిశ్వాసులతో వ్యవహరించాలని క్రీస్తు శిష్యులు బోధించబడ్డారు. (2 తిమోతి 2:26; 1 పేతురు 3:15) ఈ విషయంలో అపొస్తలుడైన పౌలు ఓ మంచి మాదిరిని ఉంచాడు. ఆయన సమీపించదగినవాడే గానీ అహంభావికాడు. ఇతరులకన్నా మిన్నగా తనను తాను హెచ్చించుకోడానికి బదులుగా ఆయన వినయవంతుడూ, క్షేమాభివృద్ధిని కలుగజేయువాడూ అయివున్నాడు. (1 కొరింథీయులు 9:22, 23) తాను తీతుకు రాసిన ఉత్తరంలో, “మనుష్యులందరియెడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు, ఎవనిని దూషింపక, జగడమాడనివారును శాంతులునై యుండవలెనని” పౌలు ఉద్బోధిస్తున్నాడు.—తీతు 3:1, 2.
బైబిల్లో “అవిశ్వాసి” అనే పదం, కొన్నిసార్లు క్రైస్తవులుకాని వారిని సూచించేందుకు ఉపయోగించబడింది. అయినప్పటికీ, “అవిశ్వాసి” అనే పదం ఓ అధికారిక బిరుదుగానో లేక లేబుల్‌గానో ఉపయోగించబడిందని అనడానికి ఎటువంటి రుజువూ లేదు. నిశ్చయంగా, కించపర్చడం, అప్రతిష్ఠపాలు చేయడం అనేవి బైబిలు సూత్రాలకు విరుద్ధమైనవిగా ఉంటాయి గనుక క్రైస్తవులుకాని వారిని అలా చేసేందుకు అది ఉపయోగించబడలేదు. (సామెతలు 24:9) నేడు యెహోవాసాక్షులు అవిశ్వాసుల ఎడల కఠినంగా లేక నిర్దయగా ఉండకుండా జాగ్రత్తవహిస్తారు. సాక్షులుకాని బంధువుల్నిగానీ లేక పొరుగువార్నిగానీ కించపర్చే పదాలతో పిలవడం అనాగరికమైనదిగా వారు పరిగణిస్తారు. “ప్రభువుయొక్క దాసుడు . . . అందరి యెడల సాధువుగా . . . ఉండవలెను” అని చెబుతున్న బైబిలు సలహాను వారు అనుసరిస్తారు.—2 తిమోతి 2:26.
‘అందరికీ మేలు చేయండి’
లోకంతో సన్నిహిత సంబంధాన్ని కల్గివుండడం వల్ల వచ్చే అపాయాల్ని, విశేషంగా దైవిక ప్రమాణాల ఎడల తీవ్రమైన అగౌరవాన్ని చూపించే వారితో సన్నిహితంగా ఉండడంవల్ల వచ్చే అపాయాల్ని గుర్తించడం ప్రాముఖ్యం. (1 కొరింథీయులు 15:33 పోల్చండి.) కానీ, ‘అందరియెడల . . . మేలు చేయమని’ బైబిలు సలహా ఇస్తున్నప్పుడు, ‘అందరు’ అనే పదంలో క్రైస్తవ విశ్వాసాల్లో నమ్మకంలేని వారూ చేరివున్నారు. (గలతీయులు 6:10) కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మొదటి శతాబ్దంనాటి క్రైస్తవులు అవిశ్వాసులతో కలిసి భోజనం చేశారనే విషయం స్పష్టమే. (1 కొరింథీయులు 10:27) అందుకే, నేడు క్రైస్తవులు అవిశ్వాసుల్ని తమ తోటి మనుష్యులుగా దృష్టిస్తూ, వారితో సమతూకమైన రీతిలో వ్యవహరిస్తారు.—మత్తయి 22:39.
ఓ వ్యక్తికి బైబిలు సత్యాలు పరిచయం లేనందువల్ల అతడు అమర్యాదస్థుడనో లేక దుర్నీతిపరుడనో ఊహించడం తగదు. పరిస్థితులూ ప్రజలూ వేరువేరు. అందుకే, ప్రతీ క్రైస్తవుడూ తానెంత మేరకు అవిశ్వాసులతో తన సంబంధాన్ని క్రమబద్ధీకరించుకోవచ్చు అనే విషయాన్ని తనకు తానుగా నిర్ణయించుకోవాలి. అయినప్పటికీ, ఏన్‌ఖోరైట్లు చేసినట్లుగా భౌతికంగా తనను తాను వేరుపర్చుకోడం లేక పరిసయ్యులు చేసినట్లుగా ఉన్నతులమని భావించడం ఓ క్రైస్తవునికి అనావశ్యకం, అలాగే లేఖనాధారమైనది కూడా కాదు.