ఆహారం పట్టించుకోవల్సిన ఒక విషయం
“నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము” అని బైబిలు ప్రసంగి 9:7లో అంటుంది. నిజానికి తినడం కేవలం ఒక ఆవశ్యకమైన విషయం మాత్రమే కాదు గానీ జీవితంలో అత్యంత ఆహ్లాదకరమైన వాటిలో ఒకటి.
34 ఏండ్ల థామస్ విషయమే తీసుకోండి. ఆయనకు మాంసం అంటే చాలా ఇష్టం. ఆయన ప్రతిరోజూ మాంసం తింటాడు—ఒక్కోసారి ఒక్క రోజులోనే ఎన్నోసార్లు తింటాడు. ఆయన ఉదయంపూట తినేదాన్లో సాధారణంగా పాలు, కొన్ని గుడ్లు, వెన్న బాగా పట్టించిన బ్రెడ్డు లేదా టోస్టు, వీటన్నిటితోపాటు సాసేజ్, లేకపోతే బేకన్ ఉంటాయి. ఫాస్ట్-ఫుడ్ స్థలాల్లో ఆయన ఛీజ్బర్గర్లు, ఫ్రెంచి ఫ్రైలు, మిల్క్ షేక్‌లు ఆర్డరు చేస్తాడు. ఇంటి బయట తినేటప్పుడు ఆయన ఆంట్రేగా బీఫ్స్టేక్ను ఎంపిక చేసుకుంటాడు. ఆయనకిష్టమైన రెస్టారెంటు 680 గ్రాముల స్టేక్, సౌర్ క్రీమ్ నింపిన బేక్ చేయబడిన బంగాళాదుంపలు సర్వ్ చేస్తుంది, అంతా సరీగ్గా ఆయనకిష్టమైనట్లే చేస్తుంది. చాక్లెట్ ఐస్‌క్రీమ్ పైపూతగా ఉన్న చాక్లెట్ కేకు ఆయనకు ఇష్టమైన డిజర్ట్.
థామస్ 178 సెంటీమీటర్ల పొడవూ, 89 కిలోల బరువూ ఉన్నాడు; ఆయన అమెరికా ప్రభుత్వపు 1995 ఆహార నియమాల నిర్దేశకాల ప్రకారం 9 కిలోలు ఎక్కువ బరువున్నాడు. “నేను నా బరువు గురించి అంతగా చింతించడంలేదు” అంటున్నాడు థామస్. “నా ఆరోగ్యం అద్భుతంగా ఉంది. నేను గత 12 సంవత్సరాల్లో ఒక్క పనిదినాన్ని కూడా మిస్సవ్వలేదు. 680 గ్రాముల స్టేక్ తిన్నప్పుడు తప్పించి నేను చాలామట్టుకు చక్కగా, శక్తిమంతంగా ఉన్నట్లు భావిస్తాను.”
అయితే, థామస్ ఆహారపుటలవాట్లు ఆయనను నెమ్మదిగా హార్ట్ ఎటాక్‌కి లోనయ్యేలా చేస్తూ, ఆయనపై ఘోరమైన ప్రభావాన్ని చూపగలవా? మనం చనిపోయే విధానం (ఆంగ్లం) అనే తన పుస్తకంలో డా. షర్వన్ న్యూలాండ్ ‘ఆత్మహత్యా సదృశ్యంగావుండే జీవిత విధానాల’ గురించి మాట్లాడుతున్నాడు, ఈ తరహా జీవిత విధానాల్లో ‘రెడ్ మీట్, పెద్ద పెద్ద బేకన్ మాంసం ముక్కలు, వెన్న’ వంటివాటితోకూడిన ఆహారాన్ని ఆయన ఇముడ్చుతున్నాడు.
అనేకుల్లో కొన్ని రకాల ఆహారపదార్థాలు గుండె జబ్బులకు దారితీసేలా ఎలా చేస్తాయి? వాటిలో ప్రమాదాన్ని కలుగజేసేది ఏముంది? ఈ ప్రశ్నలను చర్చించడానికి ముందు, బరువెక్కువ ఉండడం ఆరోగ్యానికి ఎటువంటి హానిని కలుగజేస్తుందో మనం చూద్దాం.
[3వ పేజీలోని చిత్రం]
ఇటువంటి ఆహారం అంత పట్టించుకోవాల్సిన విషయంగా ఎందుకు ఉండాలి?