మీ ఆహారపుటలవాట్లు అవి మిమ్మల్ని చంపగలవా?
“మీ కరోనరీ ధమనుల్లో ఒకదాన్లో తీవ్రమైన ఆటంకం వచ్చింది, దాదాపు 95% అడ్డంకు ఏర్పడింది . . . చాలా తొందర్లోనే మీకు గుండెపోటు వచ్చే సాధ్యత ఎంతో ఉంది.”
ముప్ఫైరెండేళ్ల జో, తన ఛాతీ నొప్పికిగల కారణాన్ని నిర్ధారించడానికి తనను పరీక్షించిన కార్డియాలజిస్టు చెప్పిన ఆ మాటల్ని నమ్మలేకపోయాడు. గుండె జబ్బుల వలన చనిపోయేవారిలో దాదాపు సగంమందికి తమకు అసలు అటువంటి జబ్బు ఉందన్న విషయం కూడా తెలియదు.
కానీ జో పరిస్థితికి దారి తీసిందేమిటి? ‘నేను 32 సంవత్సరాలపాటు ఒక సాధారణ అమెరికన్ తినే “మాంసాన్నీ, పాల ఉత్పత్తుల్నీ” తిన్నాను’ అని జో వాపోతున్నాడు. ‘అమెరికన్ ఆహారపుటలవాట్లు నా ఆరోగ్యానికి ప్రమాదకరమైనవన్న వాస్తవాన్ని నేను నిర్లక్ష్యం చేశాను’ అంటున్నాడాయన.
మీ ఆహారపుటలవాట్లు, గుండెపోటు
జో ఆహారంలోని లోపమేమిటి? ప్రధానంగా దాన్లో కొలెస్ట్రాల్‌తోపాటు క్రొవ్వు—ప్రత్యేకంగా సంతృప్త క్రొవ్వు—చాలా ఎక్కువ మోతాదులో ఉంది. జో తన చిన్నప్పటినుండి దాదాపు తాను తినే ప్రతి చెమ్చాడు భోజనంతో కరోనరీ గుండె వ్యాధి వచ్చే ప్రమాదాన్ని తెచ్చిపెట్టుకుంటున్నాడు. నిజానికి, అమెరికాలోని మరణాలకు కారణమౌతున్న పది ప్రధాన కారకాల్లో ఐదింటికి ఎక్కువ-క్రొవ్వున్న ఆహారం ముడిపెట్టబడుతుంది. జాబితాలో అన్నింటికన్నా ముందు కరోనరీ వ్యాధి ఉంది.
ఏడు దేశాల్లో 40 నుండి 49 సంవత్సరాల మధ్యవయస్సులో ఉన్న దాదాపు 12,000 మంది పురుషులపై జరిపిన ఒక అధ్యయనంలో ఆహారమూ, గుండె వ్యాధిల మధ్య సంబంధం స్పష్టమైంది. గుండెపోటు రేటు విషయంలో ఉన్న గొప్ప తేడాలు చాలా విషయాల్ని వెలికితెచ్చాయి. ఫిన్‌లాండ్‌లోని పురుషులు తాము తీసుకునే కేలరీల్లో 20 శాతాన్ని సంతృప్త క్రొవ్వుల రూపంలో పొందుతున్నందున వారి రక్త కొలెస్ట్రాల్ మోతాదు ఎక్కువుండగా, జపాన్‌లోని పురుషులు తమ కేలరీల్లో కేవలం 5 శాతాన్ని మాత్రమే సంతృప్త క్రొవ్వుల రూపంలో పొందుతున్నందున వీరి రక్త కొలెస్ట్రాల్ మోతాదులు తక్కువగా ఉన్నాయి. మరి జపాన్‌లోని పురుషులకన్నా ఫిన్‌లాండ్‌లోని పురుషులకు గుండెపోటు రేటు ఆరు రెట్లు ఎక్కువగా ఉంది!
అయితే, కరోనరీ గుండె వ్యాధి జపాన్‌లో ఇక ఎంతమాత్రం అరుదుకాదు. గత కొన్ని సంవత్సరాల్లో పాశ్చాత్య-శైలిలోని ఫాస్ట్ ఫుడ్స్ అక్కడ ప్రజాదరణ పొందడం మూలాన జంతువుల క్రొవ్వుల వినియోగం 800 శాతం పెరిగింది. ఇప్పుడు, జపాన్‌లోని బాలలు అదే వయస్సుగల అమెరికా బాలలకన్నా ఎక్కువ రక్త కొలెస్ట్రాల్ మోతాదులను కల్గివున్నారు! స్పష్టంగా, ఆహారంలో క్రొవ్వునూ, కొలెస్ట్రాల్‌నూ తీసుకోవడం జీవితాన్ని ప్రమాదంలో పెట్టే పరిస్థితులను ప్రాముఖ్యంగా గుండె జబ్బులను కలుగజేశాయి.
కొలెస్ట్రాల్ పాత్ర
కొలెస్ట్రాల్ అనేది తెల్లగావుండే మైనంవంటి పదార్థం, ఇది జీవానికి అత్యావశ్యకం. అది మానవులందరి కణాల్లోనూ, అన్ని జంతువుల కణాల్లోనూ కనుగొనబడుతుంది. మన కాలేయం కొలెస్ట్రాల్‌ను ఉత్పత్తి చేస్తుంది, మరి అది మనం తినే ఆహారంలో వివిధ పరిమాణాల్లో ఉంటుంది. రక్తం కొలెస్ట్రాల్‌ను లిపోప్రొటీన్‌లు అని పిలువబడే అణువుల్లో కణాలదగ్గరికి తీసుకెళ్తుంది, ఈ లిపోప్రొటీన్‌లలో కొలెస్ట్రాల్, క్రొవ్వులు, ప్రొటీన్‌లు ఉంటాయి. రక్త కొలెస్ట్రాల్‌లో అధికభాగాన్ని తీసుకెళ్లే రెండు రకాల లిపోప్రొటీన్‌లు: లో-డెన్సిటీ లిపోప్రొటీన్‌లు (LDL), హై-డెన్సిటీ లిపోప్రొటీన్‌లు (HDL).
LDLలలో కొలెస్ట్రాల్ సమృద్ధిగా ఉంటుంది. అవి రక్తప్రవాహంలో ప్రవహిస్తూ, కణకుడ్యంపైనున్న LDL గ్రాహకాల ద్వారా కణాల్లోకి ప్రవేశిస్తాయి, కణాలు తమ ఉపయోగార్థం వీటిని విచ్ఛిన్నం చేస్తాయి. శరీరంలో ఉండే చాలామట్టుకు కణాల్లో అటువంటి గ్రాహకాలు ఉంటాయి, మరి అవి కొంత మొత్తంలోని LDLను తీసేసుకుంటాయి. కానీ రక్త ప్రవాహంలోని 70 శాతం LDLని కాలేయంలోవున్న LDL గ్రాహకాలు తీసివేసేలా కాలేయం రూపనిర్మాణం చేయబడింది.
మరోవైపు HDLలు కొలెస్ట్రాల్-దాహంగల అణువులు. అవి రక్తప్రవాహంలో ప్రయాణిస్తుండగా అదనపు కొలెస్ట్రాల్‌ను పీల్చుకుని దానిని కాలేయానికి రవాణా చేస్తాయి. కాలేయం కొలెస్ట్రాల్‌ను విచ్ఛిన్నం చేసి, దాన్ని శరీరం నుండి తీసివేస్తుంది. ఆ విధంగా శరీరం, తనకు అవసరమైన కొలెస్ట్రాల్‌ను ఉపయోగించుకుని, మిగతాదాన్ని విసర్జించే విధంగా అద్భుతంగా రూపనిర్మాణం చేయబడింది.
రక్తంలో LDL అధికంగా ఉన్నప్పుడు సమస్య వస్తుంది. ఇది ధమనుల గోడలపై ప్లాక్ అభివృద్ధిచెందే సాధ్యతను పెంచుతుంది. ప్లాక్ అభివృద్ధిచెందినప్పుడు ధమనులు సంకుచితంగా అయిపోయి, వీటిద్వారా ఆక్సిజన్‌ను తీసుకెళ్లే రక్తం పరిమాణం తగ్గిపోతుంది. ఈ పరిస్థితే అథిరోస్‌క్లీరోసిస్ అని పిలువబడుతుంది. ఈ ప్రక్రియ నెమ్మదిగానూ, నిశ్శబ్దంగానూ కొనసాగుతుంది, చిహ్నాల్ని గ్రహించేంతగా కనబడ్డానికి దశాబ్దాలు పడుతుంది. ఒక చిహ్నం ఏమిటంటే ఆంజైనా పెక్టోరిస్ లేదా ఛాతీ నొప్పి. జో అనుభవించిందదే.
కరోనరీ ధమని పూర్తిగా మూసుకుపోయినప్పుడు—తరచూ ఇది రక్త కుదుప ద్వారా ఏర్పడుతుంది—ఆ ధమని ద్వారా రక్తాన్ని పొందే గుండె భాగం చనిపోతుంది. దాని ఫలితంగానే బాగా ప్రాణాంతకంగా ఉండే మయోకార్డియల్ ఇన్‌ఫార్క్‌షన్ అకస్మాత్తుగా వస్తుంది—దీన్నే సాధారణంగా గుండెపోటు అని పిలుస్తారు. ఒక కరోనరీ ధమనిలో పాక్షికంగా అడ్డంకు ఏర్పడినా అది గుండె ధాతువు చనిపోవడానికి కారణం కావచ్చు, కానీ ఇది శారీరకంగా అసౌకర్యంగా ఉన్నట్లు అన్పించేలా చేయకపోవచ్చు. శరీరంలోని ఇతర భాగాల్లోని ధమనుల్లో అవాంతరం ఏర్పడడం మూర్ఛకు, కాళ్లలో గ్యాంగ్రీన్ వ్యాపించడానికీ, చివరికి మూత్రపిండాలు పనిచేయకపోవడానికీ కారణం కావచ్చు.
అందుకనే LDLని చెడ్డ కొలెస్ట్రాల్ అనీ, HDLని మంచి కొలెస్ట్రాల్ అనీ పిలవడంలో ఆశ్చర్యం లేదు. పరీక్షల్లో LDL ఎక్కువుందనో, లేకపోతే HDL తక్కువుందనో తేలితే గుండె వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువుంటుంది.a ఒక వ్యక్తిలో ఆంజైనా వంటి గమనార్హమైన చిహ్నాలు కనిపించడానికి ఎంతో కాలం ముందే ఒక చిన్న రక్త పరీక్ష రాబోతున్న ప్రమాదాన్ని సాధారణంగా సూచిస్తుంది. అందుకని, మీ రక్త-కొలెస్ట్రాల్ మోతాదును అదుపులో ఉంచుకోవడం ప్రాముఖ్యం. ఈ మోతాదును మీ ఆహారం ఎలా ప్రభావం చూపిస్తోందో మనమిప్పుడు చూద్దాం.
రక్త కొలెస్ట్రాల్, ఆహారం
జంతువులనుండి తయారుచేయబడిన ఆహార పదార్థాల్లో కొలెస్ట్రాల్ సహజ భాగంగా ఉంటుంది. మాంసం, గ్రుడ్లు, చేపలు, చికెన్, పాల ఉత్పత్తులు వీటన్నింట్లో కొలెస్ట్రాల్ ఉంటుంది. మరోవైపు, మొక్కలనుండి తయారుచేసిన ఆహార పదార్థాల్లో కొలెస్ట్రాల్ ఉండదు.
శరీరం తనకవసరమైన కొలెస్ట్రాల్‌నంతటినీ ఉత్పత్తి చేస్తుంది, అందుకని కొలెస్ట్రాల్‌వున్న ఆహారాన్ని తీసుకుంటే ఆ కొలెస్ట్రాల్ అదనం అన్నమాట. ఆహారంలో మనం తీసుకునే కొలెస్ట్రాల్‌లో చాలాభాగం చివరికి కాలేయంలోకి వెళ్తుంది. సాధారణంగా కొలెస్ట్రాల్‌వున్న ఆహారం తీసుకున్నప్పుడు ఆ కొలెస్ట్రాల్ కాలేయంలోనికి ప్రవేశిస్తుండగా, కాలేయం దాన్ని విధాయితం చేస్తూ తాను ఉత్పత్తి చేసే కొలెస్ట్రాల్‌ను తగ్గించేస్తుంది. దీనివల్ల రక్తంలోవున్న పూర్తి కొలెస్ట్రాల్ క్రమబద్ధీకరించబడుతుంది.
అయితే, మనం తీసుకునే ఆహారంలో కొలెస్ట్రాల్, కాలేయం విధాయితం చేయలేనంత సమృద్ధిగా ఉంటే, అప్పుడేమి జరుగుతుంది? అప్పుడు ఆ కొలెస్ట్రాల్ తిన్నగా ధమనుల గోడల్లోని కణాల్లోనికే ప్రవేశించే సాధ్యత ఎక్కువౌతుంది. అది అలా ప్రవేశించినప్పుడు అధిరోస్‌క్లీరోసిస్ ప్రక్రియ సంభవిస్తుంది. ముఖ్యంగా మనం శరీరంలోనికి తీసుకునే ఆహారంలో కొలెస్ట్రాల్ ఎంత ఉందన్నది పట్టించుకోకుండా శరీరం అంతే మొత్తంలోని కొలెస్ట్రాల్‌ను ఉత్పత్తి చేస్తూ ఉన్నప్పుడు పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అమెరికాలో, ప్రతి 5 గురిలో ఒక్కరికి ఈ సమస్య ఉంది.
అందుకే మరి, మీ ఆహారంలో మీరు తీసుకునే కొలెస్ట్రాల్‌లో కోత విధించడం జ్ఞానయుక్తమైన పని. కానీ మన ఆహారంలోని మరో అంశం, రక్త కొలెస్ట్రాల్ మోతాదుపైన మరింత గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ అంశమే—సంతృప్త క్రొవ్వులు.
క్రొవ్వులు, కొలెస్ట్రాల్
క్రొవ్వుల్లో రెండు వర్గాలున్నాయి: సంతృప్త, అసంతృప్త. అసంతృప్త క్రొవ్వులు ఏక అసంతృప్త క్రొవ్వులైనా కావచ్చు లేక బహు అసంతృప్త క్రొవ్వులైనా కావచ్చు. సంతృప్త క్రొవ్వుల కన్నా అసంతృప్త క్రొవ్వులు మీకు మంచిది, ఎందుకంటే సంతృప్త క్రొవ్వులు తీసుకోవడం రక్తంలోని కొలెస్ట్రాల్ మోతాదును పెంచుతుంది. సంతృప్త క్రొవ్వులు దీన్ని రెండు విధాలుగా చేస్తాయి: అవి కాలేయంలో ఎక్కువ కొలెస్ట్రాల్‌ను సృష్టించేందుకు సహాయపడతాయి, కాలేయ కణాలపైవున్న LDL గ్రాహకాలను అణచివేస్తాయి. తద్వారా రక్తంలోనుండి LDLను తీసివేయడంలో వేగం తగ్గుతుంది.
సంతృప్త క్రొవ్వులు ప్రాథమికంగా జంతువుల నుండి ఉత్పత్తి చేసిన వెన్న, గ్రుడ్డు సొన, లార్డ్, పాలు, ఐస్ క్రీమ్, మాంసం వంటివాట్లోనూ, చికెన్ వంటి ఆహార పదార్థాల్లోనూ కనుగొనబడతాయి. అవి చాక్లెట్, కొబ్బరీ, కొబ్బరి నూనెలు, వనస్పతి, పామ్ నూనెల్లో కూడా సమృద్ధిగా ఉంటాయి. సంతృప్త క్రొవ్వులు గది ఉష్ణోగ్రతలో ఘనపదార్థంగా ఉంటాయి.
మరోవైపు, అసంతృప్త క్రొవ్వులు గది ఉష్ణోగ్రతలో ద్రవరూపంలో ఉంటాయి. సంతృప్త క్రొవ్వులు ఉన్న ఆహార పదార్థాలకు బదులుగా ఏక అసంతృప్త క్రొవ్వులూ, బహు అసంతృప్త క్రొవ్వులూ ఉన్న ఆహార పదార్థాలను తీసుకున్నట్లైతే, అవి మీ రక్త-కొలెస్ట్రాల్ మోతాదును తగ్గించడానికి సహాయం చేయగలవు.b పూర్ణధాన్యాల నూనె, ప్రొద్దు తిరుగుడు పువ్వు గింజల నూనెల్లో ఎక్కువగా ఉండే బహు అసంతృప్త క్రొవ్వులు మంచి చెడ్డ కొలెస్ట్రాల్‌లను తగ్గించేస్తాయి, అయితే ఆలివ్ నూనెలో, కనోలా నూనెలో సమృద్ధిగా ఉన్న ఏక అసంతృప్త క్రొవ్వులు మంచి కొలెస్ట్రాల్‌పై ఏమాత్రం ప్రభావం చూపకుండానే కేవలం చెడ్డ కొలెస్ట్రాల్‌ను మాత్రమే తగ్గిస్తాయి.
క్రొవ్వులు మన ఆహారంలోని ఆవశ్యకమైన భాగమన్నది వాస్తవం. అవి లేకుండా ఉదాహరణకు, A, D, E, K, విటమిన్‌ల అవశోషణ జరగదు. అయితే, శరీరానికి కావాల్సిన క్రొవ్వు మొత్తం చాలా తక్కువ. కూరగాయలూ, బీన్స్, ధాన్యాలూ, పండ్లూ వంటి వాటి వినియోగం ద్వారా సులభంగా ఆ చిన్న మొత్తం లభిస్తుంది. అందుకని సంతృప్త క్రొవ్వులను తీసుకోవడాన్ని తగ్గిస్తే, శరీరానికి అవసరమైన పోషకాల్లో తగ్గుదల సంభవించదు.
క్రొవ్వులనూ, కొలెస్ట్రాల్‌నూ తగ్గించడం ఎందుకు?
క్రొవ్వులూ, కొలెస్ట్రాల్‌లు సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకున్నంత మాత్రాన రక్త కొలెస్ట్రాల్ పెరిగిపోతుందా? అలా కానవసరం లేదు. ప్రారంభ శీర్షికలో ప్రస్తావించబడిన థామస్ తేజరిల్లు!తో జరిగిన తన ఇంటర్వ్యూ తర్వాత రక్త పరీక్షను చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. పరీక్షల్లో తన కొలెస్ట్రాల్ మోతాదులు వాంఛనీయమైన పరిధుల్లోనే ఉన్నట్లు తేలింది. స్పష్టంగానే ఆయన కాలేయం కొలెస్ట్రాల్ మోతాదును క్రమబద్ధీకరించగల్గుతుంది.
అయితే, దీనర్థం థామస్‌కి ప్రమాదమేమీ లేదని కాదు. ఆహారంలో తీసుకునే కొలెస్ట్రాల్, రక్త కొలెస్ట్రాల్‌పై ఏమాత్రం ప్రభావం చూపనవసరం లేకుండానే కరోనరీ గుండె వ్యాధిని కల్గించగలదని ఇటీవలి అధ్యయనాలు సూచిస్తున్నాయి. “కొలెస్ట్రాల్ సమృద్ధిగా ఉన్న ఆహార పదార్థాలు రక్త కొలెస్ట్రాల్ తక్కువున్న ప్రజల్లో కూడా గుండె జబ్బులు ఎక్కువయ్యేలా చేయగలదు” అంటున్నాడు నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీకి చెందిన డా. జెరిమయా స్టామ్‌లర్. “అందుకనే తక్కువ కొలెస్ట్రాల్‌ను తీసుకోవడంపై అందరూ శ్రద్ధవహించాలి, వారి రక్త కొలెస్ట్రాల్ మోతాదు ఎంత ఉన్నాసరే” అంటున్నాడాయన.
ఆహారంలో క్రొవ్వుంటుందనే విషయం కూడా పరిగణించాలి. రక్తంలో మరీ ఎక్కువగా క్రొవ్వువుండడం, అది సంతృప్త రూపంలో ఉన్నా లేక అసంతృప్త రూపంలో ఉన్నా, ఎర్ర రక్త కణాలు దగ్గరికి పోగయ్యేలా చేస్తుంది. ఆ విధంగా చిక్కబడిన రక్తం సన్నని కేశనాళాల్లోనుండి ప్రవహించదు, ఇందువలన ధాతువులకు అవసరమైన పోషకాలు లభించవు. దగ్గరికి పోగైన కణాలు ధమనుల్లో ప్రయాణిస్తూ ధమనుల గోడలు పంపిణీ అవుతున్న ప్రాణవాయువుకు కూడా విఘాతం కల్గిస్తాయి. ఇది గోడ ఉపరితలంపై నష్టాన్ని కలిగిస్తుంది, అప్పుడు ఆ ప్రాంతంలో ప్లాక్ సులభంగా ఏర్పడుతుంది. అయితే క్రొవ్వును పెద్ద మొత్తాల్లో తీసుకోవడంలో మరో ప్రమాదం ఉంది.
క్యాన్సర్, ఆహారం
“క్రొవ్వులన్నీ—అవి సంతృప్త క్రొవ్వులైనా, అసంతృప్త క్రొవ్వులైనా—కొన్ని రకాల క్యాన్సర్ కణాల పెరుగుదలకు దోహదపడతాయి” అని డా. జాన్ ఏ. మెక్‌డూగల్ అంటున్నాడు. ఆహారంలో క్రొవ్వు ఎక్కువగా ఉండే పాశ్చాత్య దేశాలకూ అభివృద్ధిచెందుతున్న దేశాలకూ మధ్య తేడాలు ప్రమాదసూచకంగా ఉన్నట్లు కోలోరెక్టల్ క్యాన్సరు, రొమ్ము క్యాన్సర్‌లలో అంతర్జాతీయ పెరుగుదలపై చేయబడిన ఒక సర్వే చూపించింది. ఉదాహరణకు, అమెరికాలో కోలోరెక్టల్ క్యాన్సరు స్త్రీపురుషుల్లో అత్యంత సాధారణంగా వచ్చే క్యాన్సర్‌లలో రెండవదిగా ఉంది, స్త్రీల్లో రొమ్ము క్యాన్సర్ అత్యంత సాధారణం.
అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం, క్రొత్త జీవనశైలికీ, ఆహారానికీ వారు ఎంత త్వరగా అలవాటు పడతారనే దాని ఆధారంగా, క్యాన్సరు చాలా ఎక్కువగా ఉన్న దేశాల్లోకి తిరిగి వెళ్లిన ప్రజలు చివరికి ఆ దేశంలోని క్యాన్సర్ రేటును పెంపొందించుకుంటున్నారు. “హవాయికి వలసవచ్చిన జపానీయులు పాశ్చాత్య క్యాన్సరు విధానాన్ని—పెద్ద ప్రేవు క్యాన్సరు, రొమ్ము క్యాన్సరుల్లో పెరుగుదలను, కడుపు క్యాన్సర్‌లో తగ్గుదలను—పెంచుకుంటున్నారు, ఇది జపాన్‌వారి క్యాన్సర్ విధానానికి సరీగ్గా వ్యతిరిక్తంగా ఉంది” అని ఆ క్యాన్సర్ సొసైటీవారి వంటకాల పుస్తకం అంటుంది. స్పష్టంగా క్యాన్సరు ఆహారంతో ముడిపెట్టబడివుంది.
మీ ఆహారంలో పూర్తి క్రొవ్వులు, సంతృప్త క్రొవ్వులు, కొలెస్ట్రాల్, కేలరీలు హెచ్చైన మోతాదుల్లో ఉన్నట్లైతే మీరు కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మంచి ఆహారపుటలవాట్లు మంచి ఆరోగ్యానికి నడిపించడమేగాక చెడు ఆహారపుటలవాట్ల ప్రభావాలను రూపుమాపగలవు కూడాను. సాధారణంగా 40,000 డాలర్లు లేక అంతకు ఎక్కువే ఖర్చయ్యే బాధాకరమైన బైపాస్ సర్జరీకన్నా మంచి ఆహారపుటలవాట్లను అలవర్చుకోవాలని కోరుకోవడం తప్పకుండా మంచిదే మరి.
మీరు తినేదాన్ని జ్ఞానయుక్తంగా ఎంపిక చేసుకోవడంద్వారా మీరు బరువును తగ్గించుకోగలరు. శరీర స్వస్థతను అనుభవించగలరు. కొన్ని వ్యాధుల్ని నివారించగలరు లేక వాటిని రూపుమాపగలరు. ఈ విషయంలో సలహాలు తర్వాతి శీర్షికలో చర్చించబడ్డాయి.
[అధస్సూచీలు]
a కొలెస్ట్రాల్‌ను డెసీలీటర్‌కు మిల్లీగ్రాముల చొప్పున కొలుస్తారు. పూర్తి కొలెస్ట్రాల్ మోతాదు—LDL, HDL, రక్తంలోని ఇతర లిపోప్రొటీన్‌లలోని కొలెస్ట్రాల్ ఈ మూడింటి మొత్తం—డెసీలీటర్‌కు 200 మిల్లీగ్రాములకన్నా తక్కువుండడం వాంఛనీయం. HDL మోతాదు డెసీలీటర్‌కు 45 మిల్లీగ్రాములు లేదా అంతకు ఎక్కువుంటే అది మంచిదని పరిగణించబడుతుంది.
b అమెరికన్ల కొరకైన 1995 ఆహార నియమాల నిర్దేశకాలు ప్రతిదినం తీసుకునే కేలరీల్లో, క్రొవ్వులు 30 శాతంకన్నా ఎక్కువ ఉండకూడదనీ, సంతృప్త క్రొవ్వులను 10 శాతంకన్నా తక్కువకు తగ్గించాలనీ సిఫారసు చేస్తుంది. తీసుకునే కేలరీల్లోని సంతృప్త క్రొవ్వుల్లో ఒక్క శాతం తగ్గింపు, సాధారణంగా రక్త కొలెస్ట్రాల్ మోతాదులో ప్రతి డెసీలీటర్‌కు 3 మిల్లీగ్రాముల తగ్గుదలకు నడిపిస్తుంది.
[8వ పేజీలోని చిత్రం]
కరోనరీ ధమనుల పార్శ్వరేఖా చిత్రం: (1) పూర్తిగా తెరవబడినది, (2) పాక్షికంగా అడ్డంకు ఏర్పడినది, (3) దాదాపు పూర్తిగా మూసుకుపోయినది