యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .
దేవుడు నా స్నేహితుడుగా ఉంటాడా?
రాజైన దావీదు దేవుని స్నేహాన్ని అనుభవించి ఆనందించిన వ్యక్తి. అయితే ఒక సందర్భంలో, “నా హృదయవేదనలు విస్తారములు” అని ఆయన అన్నాడు. దావీదు కష్టమనుభవించినది ఇతరులు ఆయనతో నీచంగా వ్యవహరించినందువల్ల మాత్రమే కాదు. తన స్వంత తప్పిదాల వల్ల కూడా ఆయన కష్టాలననుభవించాడు. దేవుడు కూడా తనను నిరాకరించాడని భావించనారంభించాడు. “నేను ఏకాకిని, బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపుము” అని ఆయన ప్రార్థించాడు.—కీర్తన 25:11, 16-19.
ఒకవేళ మీరు కూడా విషాదాన్ని అనుభవిస్తున్నారేమో. ఇంట్లోనో స్కూల్లోనో అధిగమించడానికి కష్టంగానున్న అసంతోషకరమైన పరిస్థితిలో మీరు ఉండవచ్చు. అంతే కాక, మీకు ఆరోగ్య సంబంధమైన తీవ్రమైన సమస్యలు ఉండవచ్చు లేదా ఏదో బలహీనతను ఎదుర్కోవలసి వస్తున్నందువల్ల నిరుత్సాహంగా అనిపించవచ్చు. ఏమైనప్పటికీ, మీరు ఒంటరిగా బాధననుభవించనవసరం లేదు; దేవుడు ఉదారంగా తన స్నేహాన్ని మద్దతును అందిస్తున్నాడు.a మీరు ఇప్పటికే ఆయనతో సంబంధాన్ని వృద్ధిచేసుకోనారంభించినట్లయితే, తన స్నేహితులు కష్టసమయాల్లో ఉన్నప్పుడు ఆయన వారిని వదిలిపెట్టడని తెలుసుకుని మీరు ఊరట పొందవచ్చు. అయినప్పటికీ, ఇబ్బందులు మిమ్మల్ని ముట్టడి చేసినప్పుడు దేవుడు దూరస్థుడైనట్లు మీరు భావించవచ్చు. ఆయన మీకు సహాయం చేయడమే లేదని కూడా మీకనిపించవచ్చు. కానీ అది నిజమా?
“శరీరములో ఒక ముల్లు”
మొదటిగా, 2 కొరింథీయులు 12:7-10 దయచేసి చదవండి. అక్కడ, అపొస్తలుడైన పౌలు “శరీరములో” ఏదో “ముల్లు” లాంటిది ఉండడం వలన తాను ఎలా బాధననుభవించాడో చెబుతున్నాడు. ఆ “ముల్లు” ఏదో ఒక రకమైన శరీర దౌర్బల్యమై ఉండవచ్చు, బహుశా కంటిచూపుకు సంబంధించినది కావచ్చు. ఏది ఏమైనప్పటికీ, అది ఆయనను భావోద్వేగ సంబంధంగా “నలగగొట్టు”తూ ఉండేది. దానిని తీసివేయమని మూడుసార్లు దేవునిని వేడుకున్నప్పటికీ, ఆ “ముల్లు” అలాగే ఉండిపోయింది.
యెహోవా పౌలు ప్రార్థనలను నిర్లక్ష్యం చేశాడా? కానే కాదు! “నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని” దేవుడు ఆయనతో చెప్పాడు. ఆ “ముల్లును” తీసివేయవద్దని యెహోవా తీర్మానించినప్పటికీ, ఆయన పౌలును ఎడబాయలేదు. దేవుని కృప మూలంగా పౌలు ఆయనతో సన్నిహిత స్నేహాన్ని కలిగి ఉండడంలో ఆనందించాడు. పౌలు తన దౌర్బల్యాన్ని భరించేందుకు ఆయన సన్నిహిత స్నేహం “చాలు.” పౌలు అలా చేసేందుకు కఠిన యత్నం చేస్తుండగా, ఆసరా ఇచ్చే దేవుని శక్తిని క్రొత్త రీతిలో వ్యక్తిగతంగా అనుభవించేవాడు.
ఇబ్బందులను భరించడంలో సహాయం
పౌలులాగే, మిమ్మల్ని గుచ్చిగుచ్చి వేధిస్తూ నిరాశకు, నిరుత్సాహానికీ కారణమయ్యే ఏదో “ముల్లు,” లేదా సమస్య మీకూ ఉండవచ్చు. పౌలు విషయంలోలాగే, ఆ ఇబ్బంది అలాగే ఉండేందుకు దేవుడు అనుమతించి ఉండవచ్చు. దానర్థం ఆయన మీకిక స్నేహితుడు కాడని కాదు. “బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని” అపొస్తలుడైన పౌలుతో దేవుడు చెప్పాడు. (ఇటాలిక్కులు మావి.) మీరు మీ స్వశక్తిమీద కాక దేవుని శక్తి మీద ఆధారపడితే, మీరు సహించగలరు. సాధ్యమౌతాయని మీరెన్నడూ అనుకోని కార్యాలను దేవుని ఆత్మ సహాయంతో మీరు సాధించగలుగుతున్నారని కూడా మీరు కనుగొనవచ్చు. “నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను” అని పౌలు అన్నాడు.
మాయb అనే యువతి ఇది నిజమని కనుగొనింది. గ్లూకోమా మూలంగా 14 ఏండ్లప్పుడు ఆమె తన కంటిచూపును కోల్పోయింది. అదే సంవత్సరం అకస్మాత్తుగా ఆమె తల్లి చనిపోయింది. ఈ వేదనాకరమైన “ముల్లు”లను ఎదుర్కోనారంభిస్తూ “నాకు ఇప్పుడు యెహోవా మాత్రమే ఉన్నాడు. నేను ఈ పరిస్థితిని విజయవంతంగా అధిగమించాలంటే ఆయనను ఆశ్రయించాలని నాకు తెలుసు” అని మాయ చెబుతుంది. మాయ అలాగే చేసింది, చివరికి ఆమె పూర్తికాల సువార్తికురాలిగా సేవచేస్తోంది. “ప్రతి విషయంలోనూ నాకు సహాయం చేయాలని నేను యెహోవాను కోరాను. ఆయన నిజంగానే సహాయం చేశాడు” అని ఆమె అంటోంది.
శ్రమలను అనుభవించడం నిజానికి తమను దేవునికి మరింత సన్నిహితులనుగా చేస్తుంది అని చాలా మంది యౌవనస్థులు కనుగొన్నారు. యువకుడైన జెఫ్‌ను తీసుకోండి. జెఫ్ తండ్రి ఏడుగురు పిల్లలను పెంచే బాధ్యతను తల్లికి విడిచిపెట్టి కుటుంబాన్ని వదిలి వెళ్ళాడు. “తండ్రి లేని లోటు ఎంతో ఉన్నట్లు భావించాను. ప్రతిరోజూ నేననుభవిస్తున్న ఆ లోటును ఎవరైనా తీరుస్తే బాగుండునని కోరుకున్నాను” అని ఆ సమయంలో 12 ఏండ్ల వయస్సే ఉన్న జెఫ్ ఒప్పుకుంటున్నాడు. అయితే జెఫ్ ఏమి చేశాడు? “ఆ అవసరాన్ని తీర్చి సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించాను” అని ఆయన అంటున్నాడు. జెఫ్ తన ప్రార్థనలకు అనుగుణ్యంగా ప్రవర్తించాడు. ఆత్మీయ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యాడు. కొంత సమయం గడిచేసరికి, మద్దతునిస్తున్న యెహోవా హస్తాన్ని గ్రహించగలిగాడు—బలపరచే తన పరిశుద్ధాత్మ ద్వారా, తన క్రైస్తవ సంఘం ద్వారా ఆయన సహాయాన్ని అందించాడు. (సామెతలు 27:10 పోల్చండి.) ఇప్పుడు 27 ఏండ్ల వయస్సులోవున్న జెఫ్ గతాన్ని వెనుదిరిగి చూస్తూ, “భద్రత కోసం ఆశ్రయించదగ్గవారెవరూ నాకు లేరు, కనుక నేను యెహోవాకు మరింత చేరువయ్యాను” అని అన్నాడు. ఆ సన్నిహిత సంబంధం “ఆ శ్రమ నుండి వచ్చిన అమూల్యమైన ఆశీర్వాదం” అని ఆయన అంటున్నాడు.
దేవుని సహాయాన్ని ఎలా పొందాలి
మీ పరలోక తండ్రి మీ కష్టాల్లో మీకూ అలాగే సహాయం చేస్తాడు. కానీ మీరు తప్పనిసరిగా చేయవలసినదేమిటి? అవును, ఏ స్నేహమైనా వృద్ధి అవ్వాలంటే, మంచి సంభాషణ ఉండవలసిందే. ప్రార్థన మనం దేవునితో సంభాషించే మార్గం. మనకు ఆయన సహాయం అవసరమని ప్రార్థన ద్వారా ఆయనకు తెలియజేస్తాం. అయితే ప్రార్థన ఉదాసీనంగాను, యాంత్రికంగాను చేస్తే దానికి ఏ ప్రయోజనమూ ఉండదు. పైన పేర్కొనబడిన యౌవనస్థుల్లాగే, తప్పకుండా మీరూ దేవుని ఎదుట “మీ హృదయములు కుమ్మరించుడి”! (కీర్తన 62:8) మీరు విజ్ఞాపనలను చేసుకోవలసిన అవసరం కూడా ఉండవచ్చు. (ఫిలిప్పీయులు 4:6) విజ్ఞాపనలు అనేవి చాలా తీవ్రంగాను పట్టుదలగాను చేసే ప్రార్థనలు.
మీకు మీ తలంపులను నియంత్రించుకోవడం సమస్యగా ఉందనుకోండి లేదా ఒక చెడు అలవాటును అధిగమించడం కష్టంగా ఉందనుకోండి. అలాగైతే యెహోవాకు విజ్ఞాపన చేయండి! ఆ ప్రలోభం కలిగే సమయంలో ఆయన సహాయం కొరకు యాచించండి. ఇది ఎల్లప్పుడూ సులభంగా ఉండకపోవచ్చు. “ఏదైనా తప్పిదాన్ని చేయాలన్న కోరిక బలంగా ఉన్నప్పుడు ప్రార్థన చేసేందుకు నన్ను నేను బలవంతపెట్టుకుంటాను” అని గారీ ఒప్పుకున్నాడు. “‘నేను యెహోవాను ఎలా సమీపించగలను?’ అని కొన్నిసార్లు అనుకుంటాను. అయినప్పటికీ సహాయం కొరకు నేను ఆయనను వేడుకునేవాడ్ని. నేను సహించేందుకు ఆయన నాకు అవసరమైన బలాన్నిస్తాడు” అని ఆయన అంటున్నాడు. మొదట్లో అది కష్టంగా ఉన్నప్పటికీ, మీ హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరిస్తూ ఉండండి.
కానీ మీ ప్రార్థనలకు జవాబివ్వనట్లుగా అనిపిస్తే అప్పుడేమిటి? ఉదాహరణకు, లీల హస్తప్రయోగం అనే చెడు అలవాటును అధిగమించేందుకు చాలా పోరాడేది. “నా సమస్య గురించి నిజాయితీగా యెహోవాతో మాట్లాడేదాన్ని, కానీ దాన్ని మానుకోలేనని అనిపించేది” అని ఆమె వివరిస్తుంది. మనం చేసే అభ్యర్థనలను మనమెంత గంభీరంగా తీసుకుంటున్నామో చూపించేందుకు దేవుడు కొన్నిసార్లు మనలను అనుమతిస్తుండవచ్చు. (కీర్తన 88:13, 14 పోల్చండి.) కనుక మనం ప్రార్థనలో తప్పకుండా పట్టుదల కలిగి ఉండాలి! (మత్తయి 7:7; రోమీయులు 12:12) లీల అదే చేసింది. అదే సమయంలో, వాచ్ టవర్ సొసైటీ ప్రచురణలలోc ఆ అంశంపై ఇవ్వబడిన సమాచారంలో కనిపించిన సలహాలను పాటించనారంభించింది. కాలం గడుస్తుండగా, ఆమె దాని ఫలితాలను చూడనారంభించింది. “యెహోవా నాతో ఉన్నాడని నాకు తెలుసు కనుక నేను ప్రలోభాన్ని విజయవంతంగా ఎదుర్కున్న ప్రతిసారీ ఆయనకు కృతజ్ఞతలు చెల్లించేదాన్ని” అని ఆమె గుర్తుచేసుకుంటుంది. నిజమే, మీ సమస్యను అదుపులో పెట్టుకోవడానికి మీరు కఠిన ప్రయత్నం చేస్తుండగా అదే సమస్య మళ్ళీ మళ్ళీ తలెత్తవచ్చు. కానీ మీరు పోరాడుతున్నంత వరకూ, మీ బలహీనతలకు మనఃపూర్వకంగా లొంగిపోనంత వరకూ మీ ‘యథార్థమైన ప్రయత్నాలను’ చూసి దేవుడు సంతోషిస్తాడు, మీ స్నేహితునిగానే ఉంటాడు.—2 పేతురు 1:5.
దేవునితో పని చేయడం
దేవుని సహాయానికి మిమ్మల్ని మీరు అందుబాటులో ఉంచుకునే మరో మార్గమేమిటంటే, ఆయన ‘జత పనివారిలో’ ఒకరవ్వాలన్న ఆయన ఆహ్వానాన్ని అంగీకరించడమే. (1 కొరింథీయులు 3:9) దేవునిని గురించి నేర్చుకునేందుకు ఇతరులకు సహాయపడడంలో భాగం వహించడం ఇందులో ఇమిడి ఉంది. (మత్తయి 28:19, 20) మీకు విషాదంగా అనిపించినప్పుడు లేదా నిరుత్సాహంగా ఉన్నప్పుడు పనిలో నిమగ్నమవ్వడం అనే తలంపు—అది ఎలాంటి పని అయినా సరే—ఆకర్షణీయంగా అనిపించకపోవచ్చు. అయితే, “ప్రభువు పనిలో విస్తారంగా చేయడానికి ఉండడం” మీకు నిజంగా సహాయపడగలదు. (1 కొరింథీయులు 15:58, NW) కనీసం, మీరు మీ సొంత సమస్యలను మర్చిపోతారు. (సామెతలు 18:1 పోల్చండి.) ముందు ఉదాహరించబడిన మాయ తన కష్ట సమయాలను గురించి ఇలా చెబుతుంది: “యెహోవా కొరకు నేను పనిచేయడమే నేను సహించేందుకు నాకు సహాయపడింది!”
దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడని మళ్ళీ మళ్ళీ వచ్చే ఏ తలంపునైనా అధిగమించేందుకు దేవునితో పనిచేయడం సహాయపడగలదు. తరచూ ఇద్దరు వ్యక్తులు ఒకే లక్ష్యం కోసం ఒక జట్టుగా కలిసి పని చేసినప్పుడు వారు స్నేహితులుగా మరింత సన్నిహితులవ్వరా? మీరు ప్రకటనా పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు మీరు ఎడతెగక సవాళ్ళను ఎదుర్కుంటూనే ఉంటారు. మీరు సహాయం కొరకు దేవుని వైపుకు మరలుతున్నట్లు మీకై మీరే కనుగొంటారు. దేవుడు మీ ప్రయాసలను ఆశీర్వదిస్తుండగా, ఆయన స్నేహం మరింత నిజమైనదౌతుంది. జతపనివానిగా దేవుడు మీయందుంచిన నమ్మకాన్ని మీరు గుర్తించనారంభిస్తారు. మీరు మరింత నమ్మకం కలిగి ఉండేందుకు ఇది మీకు నిజంగా మంచి సహాయం కాగలదు.
ఉదాహరణకు, మంజుకు అసలు భద్రత అనేదే లేదు. ఆమె తల్లి ఆత్మహత్య చేసుకుంది. దుర్భాషలాడే ఆమె తండ్రి ఆమెను ఎడతెగక కించపరచేవాడు. అయితే 17 ఏండ్ల వయస్సులో ఆమె యెహోవాసాక్షియై, ప్రకటనా పనిని చేపట్టింది. ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత, పూర్తికాల సువార్తికురాలిగా ఇలా అంటోంది: “యెహోవా ఆశీర్వాదాలు నా మీద ఉండడాన్ని చూశాను కనుక ఈ పని నాకు ఎంతో సహాయపడింది. ‘దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడంటే దానర్థం నేను పనికిరానిదానిని కానన్నమాట’ అని నాకు నేనే అనుకుంటాను. తన నామాన్ని ప్రకటించడంలో యెహోవా నన్ను ఉపయోగించుకోవడం నాకు చాలా భద్రతా భావాన్నిచ్చింది.”
“యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి”
రాజైన దావీదు ప్రాణాంతకమైన ప్రమాదకరమైన పరిస్థితి నుండి తప్పించుకున్న తర్వాత “నాకు కలిగిన భయములన్నిటిలోనుండి ఆయన నన్ను తప్పించెను” అని వ్రాశాడు. (కీర్తన 34:4, 6, పైవ్రాత; 1 సమూయేలు 21:10-12) “యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు” అని దావీదు తన అనుభవం నుండి చెప్పగలిగాడు.—కీర్తన 34:8.
దావీదులా మీ జీవితం అంత అపాయంలో ఉండకపోయినప్పటికీ, మీరూ కొన్నిసార్లు ఒత్తిళ్ళను బాధలను అనుభవిస్తారన్నది నిశ్చయమే. ‘మీ హృదయవేదనలు విస్తారంగా’ ఉన్నప్పుడు దేవునికి విజ్ఞాపన చేయండి. (కీర్తన 25:17) దేవుడు తన స్నేహాన్ని కొనసాగించడం ఆపివేస్తాడని భయపడవద్దు. మీరు ఓపికతో సహిస్తూ యెహోవా మద్దతును, శ్రద్ధను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నప్పుడు, “యెహోవా ఉత్తముడని” మీకై మీరే ‘రుచి చూసి తెలుసుకుంటారు.’ ఆయన కలకాలం మీ స్నేహితుడుగా ఉంటాడు.—యాకోబు 4:8.
[అధస్సూచీలు]
a మా ఆగస్టు 8, 1995 సంచికలోని “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . మనం నిజంగా దేవుని స్నేహితులం కాగలమా?” అనే శీర్షికను చూడండి.
b కొన్ని పేర్లు మార్చబడ్డాయి.
c వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించిన యౌవనస్థులు అడిగే ప్రశ్నలు—ఆచరణయోగ్యమైన సమాధానాలు (ఆంగ్లం) అనే పుస్తకంలోని 25, 26 అధ్యాయాలను చూడండి.
[12వ పేజీలోని చిత్రం]
దేవుడు తన స్నేహితులను ప్రతికూల సమయాల్లో వదిలిపెడ్తాడా?