ఆరోగ్యకరమైన వినోదాన్ని మీరు కనుగొనవచ్చు
వినోదం తీసుకొచ్చే ఆహ్లాదాన్ని బైబిలు ఖండించడం లేదు, సరదాగా సంతోషించడాన్ని సమయం వ్యర్థం చేయడమనీ సూచించడంలేదు. దానికి విరుద్ధంగా, ప్రసంగి 3:4 “నవ్వుటకు” ‘నాట్యమాడుటకు సమయము కలదు’ అని చెబుతుంది.a ప్రాచీన ఇశ్రాయేలులో దేవుని ప్రజలు సంగీతం, నృత్యం, ఆటలు వంటివాటితోపాటుగా వివిధ రకాలైన వినోదాన్ని ఆనందించేవారు. యేసు ఒక పెద్ద వివాహ విందుకు హాజరయ్యాడు. మరో సందర్భంలో “గొప్ప విందు”కు హాజరయ్యాడు. (లూకా 5:29; యోహాను 2:1, 2) కాబట్టి బైబిలు సంతోషకరమైన సమయం గడపడానికి విరుద్ధంగా లేదు.
అయితే, నేటి వినోదంలోని చాలాభాగం దేవున్ని అప్రీతిపర్చే ప్రవర్తనను ఘనపరుస్తోంది గనుక ఉత్పన్నమయ్యే ప్రశ్నేమిటంటే, వినోదాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు మీ ప్రమాణాలు ఆరోగ్యకరమైనవిగానే ఉండేలా నిశ్చయపర్చుకోవడానికి మీరేమి చేయవచ్చు?
ఎంపిక చేసుకోండి
తమ వినోదాన్ని ఎంపిక చేసుకోవడంలో క్రైస్తవులు బైబిలు నియమాలచే నిర్దేశించబడాలని కోరుకుంటారు. ఉదాహరణకు, కీర్తనల గ్రంథకర్త దావీదు ఇలా వ్రాశాడు: “యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులును బలాత్కారాసక్తులును ఆయనకు అసహ్యులు.” (కీర్తన 11:5) పౌలు కొలొస్సయులకు ఇలా వ్రాశాడు: “కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపివేయుడి . . . కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి.”—కొలొస్సయులు 3:5, 8.
నేడు లభ్యమౌతున్న వినోదంలో చాలావరకు ఈ ప్రేరేపిత సలహాను స్పష్టంగా అతిక్రమిస్తుంది. ‘కానీ తెరపైన నేను చూసే విషయాల్ని నేనెన్నడూ చేయను’ అని కొంతమంది అభ్యంతరం తెల్పవచ్చు. అది నిజమైయుండవచ్చు. కానీ మీరు ఎంపిక చేసుకునే వినోదం మీరు ఎటువంటి వ్యక్తిగా తయారౌతారో సూచించకపోయినా, మీరు ఇప్పటికే ఎలాంటి వ్యక్తి అయివున్నారు అన్న దానిగురించి అది కొంతైనా వెల్లడిచేయవచ్చు. ఉదాహరణకు, మీరు ‘బలాత్కారాసక్తుల్లో’ లేక ‘జారత్వము, కామాతురత, ధనాపేక్ష, బూతులు’ వంటివాటిలో నిమగ్నమయ్యేవారిలో చేరివుంటారో లేకపోతే “చెడుతనమును అసహ్యించు”కొనేవారిలో చేరి ఉంటారో అది చెప్పవచ్చు.—కీర్తన 97:10.
పౌలు ఫిలిప్పీయలకు ఇలా వ్రాశాడు: “యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యానముంచుకొనుడి.”—ఫిలిప్పీయులు 4:8.
కానీ ఏదో ఒక విధమైన అవినీతీ, బహుశ నేరమూ వంటివివున్న ప్రతి చిత్రమూ, పుస్తకమూ, లేక టీవీ కార్యక్రమమూ వాటంతటవే చెడ్డవనా ఈ లేఖనం అర్థం? లేక అన్నిరకాల హాస్య కథనాలూ ‘మాన్యమైనవి’ కావు గనుక అవి నిషిద్ధమని అర్థమా? కాదు, ఎందుకంటే పౌలు వినోదం గురించి కాదుగానీ యెహోవాను ప్రీతిపర్చే విషయాలపై కేంద్రీకరించాల్సిన హృదయ ధ్యానం గురించి చర్చిస్తున్నాడని సందర్భం చూపిస్తోంది. (కీర్తన 19:14) ఏదేమైనప్పటికీ, వినోదాన్ని ఎంపిక చేసుకునే విషయానికొస్తే, పౌలు చెప్పింది మనకు సహాయపడగలదు. ఫిలిప్పీయులు 4:8లోని సిద్ధాంతాన్ని ఉపయోగిస్తూ మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు, ‘నేను ఎంపిక చేసుకునే వినోదం పవిత్రం కానివాటిపై నేను ధ్యానముంచేలా చేస్తున్నాయా?’ ఆలాగైతే, మరి మనం సర్దుబాట్లు చేసుకోవల్సిన అవసరం ఉంది.
అయితే, వినోదాన్ని మదింపు చేసేటప్పుడు క్రైస్తవులు తమ ‘సహనం (“సహేతుకతను,” NW) సకల జనులకు తెలియబడనిచ్చేందుకు’ ప్రయత్నిస్తారు. (ఫిలిప్పీయులు 4:5) స్పష్టంగా, నిజ క్రైస్తవులకు పూర్తిగా అయుక్తమైన విపరీత ధోరణులు వినోదంలో ఉన్నాయి. అది మాత్రమే గాక, ప్రతివ్యక్తీ విషయాల్ని జాగ్రత్తగా తూచిచూసుకుని దేవుని ఎదుటా, మనుష్యుల ఎదుటా తన మనస్సాక్షిని స్వచ్ఛంగా ఉంచే నిర్ణయాల్ని తీసుకోవాలి. (1 కొరింథీయులు 10:31-33; 1 పేతురు 3:21) చిన్న చిన్న విషయాలపై ఇతరులకు తీర్పుతీర్చడం, లేక ఇతరులు ఏమి చెయ్యాలన్నదాని విషయమై హేతుబద్ధంకాని నియమాలను చేయడం యుక్తం కాదు.b—రోమీయులు 14:4; 1 కొరింథీయులు 4:6.
తలిదండ్రుల పాత్ర
వినోదం విషయంలో తలిదండ్రులు కీలకమైన పాత్రను వహిస్తారు. పౌలు ఇలా వ్రాశాడు: “ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపక పోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును.” (1 తిమోతి 5:8) అందుకని, తమ కుటుంబ సభ్యులను భౌతికంగా మాత్రమే కాదుగానీ ఆత్మీయంగానూ, భావోద్వేగపరంగానూ సంరక్షించాల్సిన బాధ్యత తలిదండ్రులకు ఉంది. ఆరోగ్యకరమైన ఆటవిడుపులకు ఏర్పాటు చేయడం కూడా దీన్లో ఇమిడివుంది.—సామెతలు 24:27.
కొన్నిసార్లు కుటుంబ జీవితంలోని ఈ అంశం నిర్లక్ష్యం చేయబడుతుంది. “విషాదకరంగా, కొంతమంది తలిదండ్రులు సరదా పనులను సమయం వ్యర్థం చేయడంగా పరిగణిస్తారు. తత్ఫలితంగా, కొంతమంది పిల్లలకు సరైన నిర్దేశనం లేకుండాపోతుంది, తద్వారా వారు తప్పుడు స్నేహితుల్నీ తప్పుడు సరదానూ కనుగొంటారు” అని నైజీరియాలోని ఒక మిషనరీ అంటున్నాడు. తలిదండ్రులారా, ఇలా జరగనివ్వకండి! మీ పిల్లలు నిజంగా సేదదీర్చే ఆరోగ్యకరమైన వినోదాన్ని ఆనందించేలా నిశ్చయపర్చుకోండి.
కానీ జాగ్రత్త అవసరం. క్రైస్తవులు “దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించు”వారైన నేటి అనేకమందిలా తయారవ్వకూడదు. (2 తిమోతి 3:1-4) అవును, వినోదాన్ని అది ఉండాల్సిన స్థానంలోనే ఉంచాలి. అది సేదదీర్పునివ్వాలి—ఒకరి జీవితాన్ని అదుపు చేయకూడదు. అందుకని సరైన రకమైన వినోదం మాత్రమే కాదుగానీ సరైన మొత్తంలోనే పిల్లలకూ, అలాగే పెద్దలకూ అవసరం.—ఎఫెసీయులు 5:15, 16.
ఇతర కార్యకలాపాల్ని ఆనందించండి
నేటి ప్రజాదరణపొందిన వినోదంలో చాలాభాగం ప్రజలు క్రియాశీలులుగా ఉండడంకన్నా నిష్క్రియులుగా ఉండడాన్నే నేర్పిస్తుంది. ఉదాహరణకు టీవీని తీసుకోండి. మీరు టీవీ కట్టేసిన తర్వాత ఏమి చేయాలి (ఆంగ్లం) అనే పుస్తకం ఇలా చెబుతుంది: “అది [టీవీ] సహజంగానే మనకు నిష్క్రియులుగా ఉండడాన్ని నేర్పిస్తుంది: వినోదమూ, చివరికి ఏదైనా నేర్చుకోవడం కూడా, మన చురుకైన సృజనాత్మకతతో నిమిత్తం లేకుండానే మన ప్రయత్నం లేకుండానే పొందేవిగా అవుతాయి.” నిజమే, నిష్క్రియాత్మక వినోదానికి కూడా ఒక స్థానం ఉంది. కానీ అది ఒక వ్యక్తి ఖాళీ సమయంలోని చాలామొత్తాన్ని తీసేసుకుంటే, ఆయన ఉత్తేజం కల్గించే అవకాశాలను పోగొట్టుకునేలా అది చేస్తుంది.
తాను “టీవీపూర్వ తరంవాడినని” చెప్పుకునే జెర్రీ మాండర్ అప్పుడప్పుడు తన చిన్నతనంలో పట్టి పీడించిన విసుగుదల గురించి వివరిస్తున్నాడు: “ఆ విసుగుదలతోపాటు అస్థిరతా భావంవుండేది” అంటున్నాడాయన. “అది చాలా అసంతోషకరంగా ఉండేది, ఎంత అసంతోషకరంగానంటే నేను చివరికి చర్యతీసుకోవడానికి—ఏదైనా చేయడానికి నిర్ణయించుకునేవాడిని. నేనొక స్నేహితునికి ఫోను చేసేవాడిని, నేను వాహ్యాళికి వెళ్లేవాడిని. బంతాట ఆడేవాడిని. చదివేవాడిని. ఏదో ఒకటి చేసేవాడిని. వెనక్కితిరిగి చూస్తే, నేను ‘చేయడానికేమీ లేదు’ అనేటటువంటి ఆ విసుగుదల అనిపించిన కాలాన్ని, సృజనాత్మక క్రియ ఉత్పన్నమయ్యే పరిస్థితిగా దృష్టిస్తాను.” నేడు, పిల్లలు విసుగుదలకి సుళువైన పరిష్కారంగా టీవీని ఉపయోగిస్తారని మాండర్ అంటున్నాడు. “విసుగుదలతోపాటు వచ్చే అస్థిరతా భావాన్నీ, సృజనాత్మకతనూ టీవీ తుడిచిపెట్టేస్తుంది” అని జతచేస్తున్నాడాయన.
ఆ విధంగా నిష్క్రియాత్మకంగా ఉండేదానికన్నా పాల్గొనాల్సిన అవసరత ఉన్న ఏవైనా కార్యకలాపాలు తాము ఊహించిన దానికన్నా మరింత సంతృప్తికరంగా ఉన్నట్లు అనేకమంది కనుగొన్నారు. కొంతమంది ఇతరుల సమక్షంలో బిగ్గరగా చదవడం ఆనందాన్నిచ్చే ఒక మూలంగా ఉన్నట్లు కనుగొన్నారు. ఇతరులు ఏదైనా సంగీత వాయిద్యాన్ని వాయించడం లేక ఏదైనా చిత్రాన్ని గీయడం వంటి హాబీలను కొనసాగించారు. అంతేగాక ఆరోగ్యకరమైన కార్యకలాపాల నిమిత్తం సమకూడడానికి ఏర్పాటుచేసే అవకాశాలు ఎన్నో ఉన్నాయి.c (లూకా 14:12-14) ఆరుబయట సరదాగా సమయం గడపడంలో కూడా ప్రయోజనాలు ఉన్నాయి. స్వీడన్‌లోని ఒక తేజరిల్లు! విలేఖరి ఇలా నివేదిస్తున్నాడు: “కొన్ని కుటుంబాలు ఆరుబయట డేరాలు వేసుకుని సెలవులు గడపడానికో లేక చేపలు పట్టడానికో వెళ్తారు, లేకపోతే అడవిలో విహారయాత్రలకి, పడవలో ప్రయాణించడానికి, పర్వతాల్లో నడవడానికీ, ఇంకా అలాంటివే చేయడానికి వెళ్తారు. యౌవనులు ఆహ్లాదంతో ఉంటారు.”
వినోదంలో భ్రష్టపర్చే విషయాలు ఉండడం మనల్ని ఆశ్చర్యపర్చకూడదు. అన్యజనులు “తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (ఎఫెసీయులు 4:17, 18) అందుకని, వినోదమని వాళ్లు ఎంచేదానిలో చాలావరకు “శరీరకార్యములు” అనేవే ఉంటాయని అనుకోవడం యుక్తమే. (గలతీయులు 5:19-21) అయితే, తాము ఎంపిక చేసుకునే వినోదం యొక్క నాణ్యతా, పరిమాణాల విషయమై సరియైన నిర్ణయాలు తీసుకోవడానికి క్రైస్తవులు తమకు తాము శిక్షణనిచ్చుకోవచ్చు. వారు వినోదాన్ని తమ కుటుంబమంతా కల్సి చేసేదిగా కూడా చేయవచ్చు. రాబోయే సంవత్సరాల్లో తీపి గురుతులుగా మిగిలే సేదదీర్పునిచ్చే క్రొత్త కార్యకలాపాలను చేయడానికి కూడా ప్రయత్నించవచ్చు. అవును, మీరు ఆరోగ్యకరమైన వినోదాన్ని కనుగొనవచ్చు.
[అధస్సూచీలు]
a ఇక్కడ ‘నవ్వడం’ అని అనుదింపబడిన హెబ్రీ పదం యొక్క ఇతర రూపాలను “ఆడడం,” “కొంత ఆనందాన్ని కలిగించడం,” “వేడుక చేసుకోవడం,” లేక “సరదాగా ఉండడం” అని అనువదించవచ్చు.
b మరింత సమాచారం కొరకు తేజరిల్లు! యొక్క మార్చి 22, 1978, 16-21 పేజీలు (ఆంగ్లం), మరియు డిశంబరు 8, 1995, 6-8 పేజీలు చూడండి.
c సామాజికంగా సమకూడడానికి సంబంధించిన లేఖనాధార నిర్దేశకాల కొరకు కావలికోట (ఆంగ్లం) యొక్క ఆగస్టు 15, 1992, 15-20 పేజీలు, అక్టోబరు 1, 1996, 18-19 పేజీలు చూడండి.
[9వ పేజీలోని చిత్రం]
ఆరోగ్యకరమైన వినోదం ప్రతిఫలదాయకంగా ఉండగలదు