సంస్థీకృత నేరంతో సంబంధాలను తెంచుకోవడం “నేను యాకూజాగా ఉండేవాడిని”
“నాన్నా, నీవు ఇంటికొచ్చినప్పుడు మనం కూటాలకు కల్సి వెళ్దాం. నాకు వాగ్దానం చెయ్యి, చెయ్యవూ?” నేను మూడవసారి జైల్లో ఉన్నప్పుడు ఈ ఉత్తరాన్ని నా రెండవ కూతురునుండి అందుకున్నాను. ఆమె నా భార్యతోపాటు యెహోవాసాక్షుల కూటాలకు క్రమంగా హాజరౌతోంది. నా కుటుంబంనుండి వచ్చే ఉత్తరాలే నా ఓదార్పుకు మూలం గనుక నేను ఆమె అడిగినట్లే చేస్తానని వాగ్దానం చేశాను.
‘నన్ను నా కుటుంబంనుండి దూరంగా ఉంచే నేరజీవితాన్ని నేనెందుకు గడుపుతున్నాను?’ నేను ఆలోచించాను. నేను చాలా చిన్నవాడిగా ఉన్నప్పటి రోజుల్ని జ్ఞాపకం చేసుకున్నాను. నేను 18 నెలలవానిగా ఉన్నప్పుడే మా నాన్న చనిపోయారు, అందుకని ఆయన ఎలా ఉంటారో కూడా గుర్తులేదు. ఆ తర్వాత అమ్మ రెండుసార్లు పెళ్లి చేసుకుంది. అటువంటి కుటుంబ పరిస్థితులు నన్ను చాలా ప్రభావితం చేశాయి, హైస్కూలులో ఉన్నప్పుడు నేను దాదాగిరి చేసేవారితో సహవసించడం ప్రారంభించాను. నేను హింసాత్మకంగా తయారయ్యాను, తరచూ స్కూలు బయట పోరాటాల్లో పాల్గొనేవాడిని. నేను హైస్కూలులో రెండవ సంవత్సరంలో ఉన్నప్పుడు, వేరొక గుంపుతో పోరాడేందుకు నేను ఒక విద్యార్థుల గుంపును సంస్థీకరించాను. తత్ఫలితంగా, నన్ను అరెస్టు చేసి, ఒక సంస్కరణ సంస్థకి కొంతకాలం కోసం పంపించారు.
నేను హింసాత్మక జీవితం దిశగా కొండమీదినుండి క్రిందికి దొర్లుకుంటూ వెళ్తున్న ఒక బంతిలా ఉన్నాను. త్వరలోనే నేను అపరాధాలు చేసేవారితో కూడిన ముఠానొకదాన్ని తయారుచేసి, ఒక యాకూజా గుంపు కార్యాలయం చుట్టూ తిరుగుతూ కాలం వెళ్లబుచ్చేవాడిని. నాకు 18 ఏండ్లున్నప్పుడు నేను ఆ గుంపులో సభ్యుడినైపోయాను. నాకు 20 ఏండ్లున్నప్పుడు వేర్వేరు హింసాత్మక కార్యకలాపాల నిమిత్తం నన్ను అరెస్టు చేసి, మూడేళ్ల జైలుశిక్ష వేశారు. మొదట, నేను నారా బాలనేరస్థుల జైలులో శిక్ష అనుభవించాను, కానీ నా ప్రవర్తన మెరుగవ్వలేదు. అందుకని నన్ను మరో జైలుకి పంపించారు, ఇది పెద్దల కొరకైన జైలు. కానీ నేను మరింత ఘోరంగా తయారయ్యాను, చివరికి నేను క్యోటోలోని కఠోర నేరస్థుల కొరకైన జైలుకి చేరుకున్నాను.
‘నేను అటువంటి నేరాలకు ఎందుకు పాల్పడుతూ ఉన్నాను?’ నన్ను నేను ప్రశ్నించుకున్నాను. నేను వెనుదిరిగి చూసినప్పుడు, మూర్ఖత్వంతో కూడిన నా తర్కం మూలానేనని గ్రహించాను. ఆ సమయంలో అటువంటి ప్రవర్తన మగతనానికి చిహ్నమనీ, నా పురుషత్వానికి రుజువనీ అనుకునేవాడిని. నాకు 25 ఏండ్లున్నప్పుడు జైలునుండి విడుదలయ్యాను, అప్పుడు తోటి గుండాలు నేను ప్రముఖుడినన్నట్లు నన్ను గౌరవంతో చూశారు. నేర ప్రపంచంలో పైస్థాయికి వెళ్లడానికి నాకు ఇప్పుడు దారి సుగమమయ్యింది.
నా కుటుంబ ప్రతిస్పందనలు
ఆ సమయంలోనే నేను పెళ్లి చేసుకున్నాను, త్వరలోనే మాకు ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. అయినా, నా జీవితం మారలేదు. నేను నా ఇంటికీ జైలుకీ మధ్య అటూ ఇటూ తిరుగుతూ ఉండేవాడిని—నేను ప్రజల్ని కొడుతూ, డబ్బు గుంజుతూ ఉండేవాడిని. ప్రతి సంఘటనద్వారా నేను నా తోటి ముఠా సభ్యుల గౌరవాన్ని గెల్చుకునే వాడిని, నా బాస్ నమ్మకాన్ని చూరగొనేవాడిని. చివరికి, నా యాకూజా “అన్న” గ్యాంగ్‌లో పైస్థాయికి చేరుకుని బాస్ అయ్యాడు. నేను రెండవవాడిగా ఉండడం నాకు గర్వంగా తోచింది.
‘నా జీవిత విధానం గురించి నా భార్యా, నా కుమార్తెలు ఎలా భావిస్తున్నారు?’ అని నాలో నేను తలంచాను. ఒక నేరస్థుడ్ని తన భర్తగా, తమ తండ్రిగా కల్గివుండడం వారికి అవమానకరంగా ఉండివుండవచ్చు. నాకు 30 ఏండ్లున్నప్పుడు నన్ను మరల జైలులో పెట్టారు, మళ్లీ నాకు 32 ఏండ్లున్నప్పుడు జైల్లో పెట్టారు. ఈసారి మూడేళ్ల జైలు శిక్షను అనుభవించడం నాకు నిజంగానే కష్టంగా ఉంది. నా కుమార్తెలు నన్ను సందర్శించడానికి అనుమతించబడేవారు కారు. నేను వారితో మాట్లాడలేకపోవడంతో, వారిని ఎత్తుకోలేకపోతుండడంతో నేను ఎంతో కోల్పోతున్నట్లు భావించేవాడిని.
నేను ఈ ఆఖరి జైలు శిక్షను అనుభవించడం ప్రారంభించిన సమయంలో నా భార్య యెహోవాసాక్షులతో బైబిలు పఠించడం ప్రారంభించింది. ప్రతిరోజు ఆమె తాను నేర్చుకుంటున్న సత్యం గురించి నాకు వ్రాసేది. ‘నా భార్య మాట్లాడుతున్న ఈ సత్యం ఏమిటి అసలు?’ అని నేను తలంచేవాడిని. నేను జైల్లో ఉన్నప్పుడు పూర్తి బైబిలును చదివేశాను. నా భార్య తన ఉత్తరాల్లో భవిష్యత్తు కొరకైన ఒక నిరీక్షణ గురించీ, దేవుని సంకల్పం గురించీ చెబుతున్న దానిని పరిశీలించాను.
మానవులు పరదైసు భూమిపై నిరంతరమూ జీవించే నిరీక్షణ నాకు ఆకర్షణీయంగా అనిపించింది, ఎందుకంటే మృత్యువు నన్ను నిజంగా భయపెట్టేది. నేనెప్పుడూ, ‘నీవు చనిపోయావంటే, నీవు ఓడిపోయినట్లే’ అని అనుకునేవాడిని. నేను పునరావలోకనం చేసుకుంటుండగా, ఇతరులు నన్ను గాయపర్చడానికి ముందే నేను వారిని గాయపర్చేలా నన్ను ముందుకు తోసింది మృత్యువుపట్ల నాకున్న భయమేనని గ్రహించాను. నా భార్య ఉత్తరాలు గ్యాంగ్ ప్రపంచంలో పైస్థాయికి వెళ్లాలనే నా లక్ష్యంలోని శూన్యతను నేను గ్రహించేలా చేశాయి.
అయినప్పటికీ, నేను సత్యాన్ని అధ్యయనం చేయాలని కదిలింపబడలేదు. నా భార్య తనను తాను యెహోవాకు సమర్పించుకుని బాప్తిస్మం తీసుకుని ఆయనకు సాక్షి అయ్యింది. నా ఉత్తరంలో నేను వారి కూటాలకు రావడానికి అంగీకరించినా, నేను ఒక యెహోవాసాక్షిని కావాలని అనుకోవడం లేదు. నా భార్యాబిడ్డలు నన్ను ఒంటరిని చేసి దూరంగా వెళ్లిపోయినట్లు నాకు అన్పించింది.
జైలు బయటికి రావడం
నేను స్వేచ్ఛను పొందే రోజు వచ్చేసింది. నాగోయ జైలు గేటు దగ్గర నాకు స్వాగతం పలకడానికి చాలామంది గుండాలు వచ్చారు. అయినా, ఆ పెద్ద గుంపులో నేను కేవలం నా భార్యాబిడ్డల కొరకు మాత్రమే వెదుకుతున్నాను. మూడు సంవత్సరాల ఆరు నెలల కాలంలో ఎంతో ఎదిగిపోయిన నా కుమార్తెలను చూస్తూనే విచలితుడినై ఏడ్చేశాను.
ఇంటికి వెళ్లిన రెండురోజుల తర్వాత, నేను నా రెండవ కుమార్తెకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుని, యెహోవాసాక్షుల కూటాలకు హాజరయ్యాను. అక్కడున్నవారందరి ఉత్సాహభరితమైన మనోభావం చూసి నేను ఆశ్చర్యపోయాను. సాక్షులు నన్ను హృదయపూర్వకంగా ఆహ్వానించారు, కానీ నేను అక్కడుండాల్సినవాడినికానన్నట్లు భావించాను. తర్వాత నన్ను పలకరించినవారికి నా నేర చరిత్ర తెలుసని నేను తెల్సుకున్నప్పుడు నేను సందిగ్ధంలో పడిపోయాను. అయినా, నేను వారి సహవాసంలో ఉన్న వాత్సల్యాన్ని అనుభవించాను, అక్కడ ఇవ్వబడిన బైబిలు ఆధారిత ప్రసంగాన్నిబట్టి కూడా నేను ఆకర్షితుడినయ్యాను. అది పరదైసు భూమిపైన ప్రజలు నిరంతరం జీవించడం గురించిన ప్రసంగం.
నా భార్యాబిడ్డలు బ్రతికి పరదైసులోనికి వెళ్లడం, నేను నాశనం చేయబడడం గురించిన ఆలోచన నన్ను చాలా మనస్తాపానికి గురిచేసింది. నేను నా కుటుంబంతోపాటు నిత్యం జీవించడానికి ఏమి చేయాలన్న దానిగురించి గంభీరంగా ధ్యానించాను. నేను నా గుండా జీవితంతో సంబంధాల్ని తెంచుకోవడం గురించి ఆలోచించడం మొదలుపెట్టాను, అలా బైబిలును పఠించడం ప్రారంభించాను.
నా నేర జీవితంతో సంబంధాలను తెంచుకోవడం
నేను గ్యాంగ్ కూటాలకు హాజరవ్వడం అపేశాను, యాకూజాలతో సహవసించడమూ మానేశాను. నా ఆలోచనా సరళిని మార్చుకోవడం సులభంగా లేదు. నేను ఒక పెద్ద ఇంపోర్టెడ్ కారులో తిరిగేవాడిని, కేవలం దాని ద్వారా వచ్చే ఆనందం కొరకే—అది నా అహాన్ని సంతృప్తిపర్చడానికైన ఒక చర్య. నేను నా కారును మార్చి ఒక సాధారణ కారును తీసుకోవడానికి నాకు మూడేళ్లు పట్టింది. ప్రతీ విషయంలో సులువైన మార్గాన్ని ఎన్నుకోవడానికి ప్రయత్నించే దృక్పథం ఉండేది నాకు. అయితే, నేను సత్యాన్ని నేర్చుకొనేకొలది నేను మారాలన్నది గ్రహించగల్గాను. కానీ యిర్మీయా 17:9 చెబుతున్నట్లుగా, “హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది.” సరైనదేదో నాకు తెల్సు కానీ నేను నేర్చుకుంటున్నది అన్వయించుకోవడంలో నేను చాలా శ్రమపడవల్సివచ్చింది. నేను ఎదుర్కొంటున్న సమస్యలు ఒక పెద్ద కొండలా కన్పించసాగాయి. నేను కలవరపడి, పఠనం మానివేద్దామని చాలాసార్లు అనుకున్నాను, అంతేగాక ఒక యెహోవాసాక్షినయ్యే ఆలోచనను విరమించుకుందామని కూడా అనుకున్నాను.
అప్పుడు, నాలాంటి గత చరిత్రేవున్న ఒక ప్రయాణ పైవిచారణకర్తను మా సంఘంలో ప్రసంగమివ్వడానికిగాను నా బైబిలు పఠన నిర్వాహకుడు ఆహ్వానించాడు. 640 కిలోమీటర్ల అవతలవున్న అకిటానుండి నన్ను ప్రోత్సహించడానికి సజూక వరకు వచ్చాడు ఆయన. దాని తర్వాత, నేనెప్పుడు అలసిపోయినా, ఇదంతా వదిలిపెట్టేద్దామన్న ఆలోచన వచ్చినా, నేను ప్రభువు మార్గంలో నిలకడగా నడుస్తున్నానో లేదో అడుగుతూ నాకు ఆయన దగ్గరనుండి ఒక ఉత్తరం వచ్చేది.
యాకూజాతో నాకున్న సంబంధాలన్నింటినీ తెంచుకోవడానికి నాకు సహాయం చేయమని నేను యెహోవాకు ప్రార్థిస్తూ ఉన్నాను. యెహోవా నా ప్రార్థనకు జవాబిస్తాడని నాకు నమ్మకం ఉంది. 1987 ఏప్రిల్‌లో నేను చివరికి యాకూజా సంస్థనుండి బయటకు రాగల్గాను. నా స్వంత వ్యాపార పనులపై నేను ప్రతినెలా నా కుటుంబానికి దూరంగా సముద్రాంతరయానం చేయాల్సివచ్చేది, అందుకని నేను నా ఉద్యోగం మార్చేసి క్లీనింగ్ పనిని మొదలుపెట్టాను. ఇది నాకు మధ్యాహ్న సమయాలు ఆత్మీయ కార్యకలాపాల నిమిత్తం ఖాళీగా ఉండేలా చేసింది. మొట్టమొదటిసారిగా నా జీతం ఒక కవరులో అందింది. అది తేలిగ్గా ఉంది, కానీ నన్ను చాలా సంతోషపెట్టింది.
నేను యాకూజా సంస్థలో రెండవవానిగా ఉన్నప్పుడు వస్తుదాయకంగా నా దగ్గర చాలా ఉండేది, కానీ ఇప్పుడు నాకు వాడబారని ఆత్మీయ సంపదలు ఉన్నాయి. నాకు యెహోవా తెలుసు. ఆయన సంకల్పాలు తెలుసు. నేను అనుసరించేందుకు కొన్ని సూత్రాలు ఉన్నాయి. నాకు శ్రద్ధవహించే నిజమైన స్నేహితులు ఉన్నారు. యాకూజా ప్రపంచంలో గుండాలు పైపైనే శ్రద్ధవహించేవారు, కానీ నాకు తెలిసిన ఒక్క యాకూజా కూడా ఇతరుల కొరకు తనను తాను త్యాగం చేసుకోడు. అలాంటివారు ఎవ్వరూ లేరు.
1988 ఆగస్టులో నేను యెహోవాకు చేసికొన్న సమర్పణను నీటి బాప్తిస్మం ద్వారా సూచించాను, ఆ తర్వాతి నెలనుండి నేను నా జీవితాన్ని మార్చిన సువార్తను గురించి ఇతరులకు చెప్పడంలో ప్రతినెలా కనీసం 60 గంటలు గడపడం ప్రారంభించాను. నేను 1989 మార్చినుండి ఒక పూర్తికాల పరిచారకునిగా సేవచేస్తున్నాను, ఇప్పుడు సంఘంలో ఒక పరిచర్య సేవకునిగా సేవచేసే ఆధిక్యత నాకివ్వబడింది.
నా యాకూజా జీవితపు మరకలను చాలామట్టుకు తుడిచివేయగల్గాను. అయితే, ఒక్కటి మాత్రం మిగిలిపోయింది. అది నాకూ, అలాగే నా కుటుంబానికీ ఇతరులకూ నా యాకూజా గతాన్ని గుర్తు చేస్తూ నా శరీరంపైన ఉండే పచ్చబొట్టు. ఒకసారి, నా పెద్ద కుమార్తె స్కూలు నుండి ఏడుస్తూ ఇంటికి తిరిగివచ్చి తన స్నేహితులు తనతో నేనొక యాకూజాననీ, నాకు పచ్చబొట్లు ఉన్నాయనీ చెప్పారని అంటూ తను ఇక ఎన్నడూ స్కూలుకి వెళ్లబోనని అంది. నేను నా కుమార్తెలతో ఈ విషయాన్ని గురించి చర్చించగల్గాను, వారు పరిస్థితిని అర్థం చేసుకోగల్గారు. ఈ భూమి పరదైసుగా తయారై, నా శరీరము “బాలురమాంసముకన్న ఆరోగ్యముగా” తయారయ్యే దినంకొరకు నేను ఎదురుచూస్తున్నాను. అప్పుడు నా పచ్చబొట్లూ, వాటితోపాటు 20 సంవత్సరాల యాకూజా జీవితపు జ్ఞాపకాలూ గతానికి చెందినవౌతాయి. (యోబు 33:25; ప్రకటన 21:4)—యాసూవో కాటావోకా చెప్పినది.
[26వ పేజీలోని చిత్రం]
నా పచ్చబొట్లు తుడిచిపెట్టుకుపోయే దినం కొరకు నేను ఎదురుచూస్తున్నాను
[28వ పేజీలోని చిత్రం]
నా కుటుంబంతో రాజ్యమందిరం దగ్గర