కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g97 4/8 పేజీలు 22-25
  • పోటు అల రద్దీ సమయం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పోటు అల రద్దీ సమయం
  • తేజరిల్లు!—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నదీముఖద్వారాల ప్రాముఖ్యత
  • పోటు అల
  • పెరుగుతున్న అల
  • రద్దీ మొదలౌతుంది
  • పక్షుల విశ్రమస్థలం
  • వలసవెళ్లడంలోని రహస్యాలను పరిశోధించడం
    తేజరిల్లు!—1995
  • వాస్కోడ గామా—పేరుపెట్టబడిన ఒక వంతెన
    తేజరిల్లు!—1998
తేజరిల్లు!—1997
g97 4/8 పేజీలు 22-25

పోటు అల రద్దీ సమయం

బ్రిటన్‌లోని తేజరిల్లు! విలేఖరిద్వారా

ప్రతి సంవత్సరమూ దాదాపు ఒక కోటి పక్షులు వాయవ్య యూరప్‌లో శీతాకాలాన్ని గడుపుతాయి. అవి ఆర్కిటిక్‌ జన్మ స్థానాలనుండి మాత్రమే కాక సుదూర ప్రాంతాలైన కెనడానుండీ, మధ్య సైబీరియానుండి కూడా వస్తాయి. ఆఫ్రికాకు వెళ్లే మార్గంలో అవి, అనేక ఇతర పక్షులు బ్రిటీష్‌ దీవుల మీదుగా ఒక వలస మార్గమైన ఈస్ట్‌ అట్లాంటిక్‌ ప్లైవేలో కలుస్తాయి.

బ్రిటీష్‌ జలాల్లోని 30కి పైగా ఉన్న నదీముఖద్వారాల శ్రేణి వాటికి ఆహారమూ, విశ్రాంతికి ఆశ్రయమూ అందిస్తాయి. వీటిలో ఒక్కొక్కటీ 20,000 కన్నా ఎక్కువ పక్షులకు నివాసం కల్పిస్తుంది, కానీ ఇంగ్లాండ్‌ తూర్పు తీరంలో ఉన్న ది వాష్‌ అనేది అన్నింటికన్నా ప్రాముఖ్యమైనది. ఇది 2.5 లక్షలకన్న ఎక్కువ పక్షులకు ఆతిథ్యమిస్తుంది—వీటిలో కర్‌ల్యూలు, డన్‌లిన్‌లు, గాడ్‌విట్‌లు, నాట్‌లు, ఎర్రకాలి ఉల్లంకిపిట్టలు, ప్లొవర్లు, రెడ్‌షాంక్‌లు, టర్న్‌స్టోన్‌లు ఉన్నాయి. నదీముఖద్వార ప్రాంతాలు ఎటువంటి ఆహారాన్ని అందిస్తాయి, అవి ఎందుకంత ప్రాముఖ్యమైనవి?

నదీముఖద్వారాల ప్రాముఖ్యత

సముద్రపునీరు తాజానీటితో సంగమించే తీర ప్రాంతంలో సగభాగాన్ని భూమి ఆవరించివుంటే ఆ ప్రాంతాలను నదీముఖద్వారాలు అంటారు. ఇక్కడి వెచ్చని జలాల్లో ఖనిజాలూ, సేంద్రియ పోషకాలూ సమృద్ధిగా ఉండడంతో ప్రపంచ సముద్రాలలోని సగంవంతు జీవజాలాన్ని అవి పోషిస్తాయి. ఇసుకలో ష్రింప్‌లు, సాండ్‌ హాపర్‌లు, మరితర జీవాలూ ఉంటాయి, కానీ నదీముఖద్వారాలలోని బురదమట్టి మరింత సమృద్ధియైన జీవజాలాన్ని పోషిస్తుంది.

నీట్లో కొట్టుకొచ్చి పేరుకున్న రాళ్ల పరిమాణం ఎంతన్న దానిమీద మట్టి రకం మారుతూంటుంది. ఒక్కొక్క రకమైన బురదమట్టిలో వేడర్‌లుa ఆహారంగా తీసుకునే ఒక్కొక్క ప్రత్యేక రకమైన సముద్రపు జంతువులు ఉంటాయి. ఉదాహరణకు, ఒక చదరపు మీటరు వైశాల్యంలోని ఒక రకమైన బురదమట్టిలో మూడు మిల్లీమీటర్లకన్నా తక్కువ పొడవుండే చిన్ని చిన్ని నత్తలు లక్షల సంఖ్యలో ఉండవచ్చు! దానికి తోడు మొలస్కలను, లగ్‌వార్మ్‌లను, రాగ్‌ వార్మ్‌లను, మరితర అకశేరుకాలను బురదమట్టి పోషిస్తుంది.

పోటు అల

నదీముఖద్వారంలో వేడర్‌లు వేలకొలది ఉన్నప్పటికీ, వాటిని గుర్తించడం కష్టంగా ఉండవచ్చు, ఎందుకంటే అవి సాధారణంగా విస్తారమైన ప్రాంతాల్లో ఎక్కడెక్కడో ఉంటాయి. అయితే, పోటు అల వచ్చినప్పుడు, పరిస్థితి నాటకీయంగా మారిపోతుంది. నీరు ఉవ్వెత్తున వెల్లువలా వచ్చిపడడంతో ఇసుకా, బురదమట్టీ మునిగిపోతాయి, దీంతో ఈ వేడర్లు ఉప్పుపర్రలపైకీ,b మరితర ఎత్తైన ప్రాంతాల్లోకీ ఎగిరిపోతాయి. అప్పుడు వేర్వేరు జాతుల పక్షులు కలిసి ఒకేచోట విశ్రమించడానికి గుమిగూడతాయి కాబట్టి వాటిని గమనించడం మరింత సులభం.

ఈరోజు ఏప్రిల్‌లోని ఒక ప్రకాశవంతంగా ఎండ కాస్తున్న ఉదయం, ఇప్పుడు ఒక పోటు అల రాబోతుంది. ఇంగ్లీష్‌ మండలమైన సఫోక్‌గుండా ఓల్డ్‌ నది పాములా మెలికలు తిరుగుతూ ప్రయాణిస్తూ ఉత్తర సముద్రంలోకి కలిసిపోయే చోట ఒక చిన్న నదీముఖద్వారం ఉంది. అందమైన ప్రకృతి దృశ్యాలున్న ఆ నదీముఖద్వారానికి మేం చేరుకుంటూ ఉండగా చల్లని ఈశాన్య పవనాలు వీస్తూవున్నాయి. ఇక్కడ, శీతాకాలంలో వేడర్‌ల సంఖ్య 11,000కి కాస్త ఎక్కువగావుండి శిఖరాగ్ర సంఖ్యను చేరుతుంది, ఈ నదీముఖద్వారం వెడల్పు కేవలం 0.8 కిలోమీటర్లే ఉంటుంది గనుక ఇక్కడినుండి మేము వాటి కార్యకలాపాలను గమనించడం మరింత సులభంగా ఉంటుంది.

సముద్ర ఆక్రమణను ఆపడానికి నదీ ప్రవాహం వెంబడి నిరోధకాలు నిర్మించబడ్డాయి. కొన్ని గట్లు రెల్లుతోనూ మరామ్‌ గడ్డితోనూ నిండివుంటాయి. మిగతా భాగంలో నల్లని కలప, రాళ్లు మాత్రమే ఉంటాయి. నదికి కాస్త ఎగువ భాగాన, విశిష్టంగా కన్పించే విక్టోరియన్‌ భవనాల మధ్య ఓల్డ్‌బర్‌ సంగీతోత్సవానికి పుట్టినిల్లు అయిన స్నేప్‌ మోల్టింగ్స్‌ కాన్సర్ట్‌ హాల్‌ ఉంది. కానీ మేం ఆశ్రయం కొరకు నది దిగువ భాగానికి నడవాలి. ఎముకలు కొరికే చలితో గాలి ఇప్పుడు తీవ్రంగా ఉంది, మా కళ్లు త్వరలోనే మంటలుపుట్టడం మొదలుపెట్టాయి.

మేము నది చివరికి వచ్చేసరికి (చిత్రంలో పాయింట్‌ ఏ చూడండి), అవసెట్‌ల జత ఒకటి స్పష్టంగా, సుమధురంగా కూస్తూ మాకు ఆహ్వానం పలికింది. నదీముఖద్వారానికి మావైపున అవి 40 మీటర్ల కన్నా ఎక్కువ దూరంలో లేవు, ప్రస్తుతం ఆ జత ముక్కులతో ఈకల్ని సవరించుకుంటున్నాయి. ఒక్కోపక్షీ పైకివంగివున్న తన సన్నని ముక్కుతో ఛాతీ ప్రక్క భాగాన్ని సవరించుకుంటుంది. ఇది చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది, కానీ మేం చూడాల్సింది ఎంతో ఉంది గనుక ముందుకు సాగిపోవాలి.

పెరుగుతున్న అల

ఇప్పుడు అల చాలా త్వరగా పెరుగుతుంది, అందుకని మేం వెంటనే ముందే ఎన్నుకున్న పరిశీలనా పాయింటు దగ్గరికి వెళ్తాం. (చిత్రంలో పాయింట్‌ బి చూడండి.) దార్లో ఒక రెడ్‌షాంక్‌—నదీముఖద్వార కాపలాదారుడని తనకున్న పేరుకు తగ్గట్లే—హెచ్చరికవంటి కీచుగొంతుతో “టూహూహూ-టూహూహూ” అని అరుస్తూ ఉప్పుకయ్య మీదినుండి గాల్లోకి ఎగురుతుంది! ఎర్రని దాని కాళ్లను సూర్యకాంతిలో తెల్లగా తళతళలాడుతూ ఉన్న దాని రెక్కల చివర్లతో పోల్చినప్పుడు తేడా కొట్టవచ్చినట్లు అగుపడుతుంది. మా గమ్యస్థానం చేరుకున్న తర్వాత ఇసుకా, చదునైన బురదమట్టి ప్రాంతాలూ కుంచించుకుపోతున్న దృశ్యం మాకు కన్పిస్తుంది.

కాస్తంత దూరంలో దాదాపు ఇరవై రెడ్‌షాంక్‌లు బురదమట్టిని తరచి చూస్తూ నెమ్మదిగా ఆహారం తీసుకుంటున్నాయి, వేరేవి మరింత సురక్షితంగావున్న సముద్రశాఖల్లో ఆహారం కొరకు వెదుకుతున్నాయి. క్రిందికి వంగివున్న ముక్కు డన్‌లిన్‌కు గుర్తు. అవి చిన్న గుంపుల్లో ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. తర్వాత అవి చెదిరిపోయి త్వరత్వరగా కొన్ని పురుగుల కొరకు వెదుకుతూ నీటి ఒడ్డుకు సమీపంగా ఉండడానికి ప్రయత్నిస్తూ నడుస్తూంటాయి. చెదిరిపోయిన కర్‌ల్యూలు మెత్తగా, జిగురుజిగురుగా ఉన్న బురదను జాగ్రత్తగా పరిశీలిస్తూ, నింపాదిగా నడుస్తూంటాయి. ఇంకా ఎగువన కొన్ని టర్న్‌స్టోన్‌లు పొట్టిగా, కాస్తంత పైకి వంగివున్న తమ ముక్కులతో మునుపటి సముద్రపు ఒడ్డున ఉన్న చెత్తలో ఆహారం కొరకు వెదుకుతున్నాయి.

అకస్మాత్తుగా, “ట్లీ-ఊ-ఈ” అంటూ తీవ్రంగా, విషాదకరంగా అన్పించే గ్రే ప్లొవర్‌ చేసిన మూడు అక్షరాల ఈలవంటి శబ్దంతో గాలి నిండిపోయింది. అది తలమీదుగా ఎగురుతుండగా, ఈ పక్షి చంక క్రిందుగా ఉండే నల్లని ఈకలు బూడిద రంగులో ఉండే దాని మిగతా క్రిందిభాగంతో పోల్చినప్పుడు అవి స్పష్టంగా కన్పిస్తాయి. నాలుగువందల గోల్డెన్‌ ప్లొవర్‌లు గ్రుడ్డు ఆకారంలో దగ్గరదగ్గరగా ఉంటూ తలను తమ రెక్కల క్రింద ఉంచుకుని విశ్రమిస్తాయి, ఇవన్నీ గాలికి ఎదురుగా ఉంటాయి. కొన్ని జంటల మధ్య అప్పుడప్పుడూ గొడవలు జరిగినప్పుడు ఏది బలమైందో నిరూపించబడుతుంది. చాలావాటికి ఇంకా శీతాకాలంలోని మచ్చలమచ్చల ఈకలే ఉన్నాయి—బంగారువన్నెలోనూ నలుపు రంగులోనూ ఉన్న పైభాగం; బూడిద రంగుతో ఉన్న కళ్లూ, ముఖమూ, క్రిందిభాగం; ఒక నల్లని ముక్కు. మా టెలిస్కోపును ఇటు త్రిప్పినప్పుడు మేము రింగ్‌డ్‌ ప్లొవర్లను కూడా చూడగల్గుతాము.

విస్తారంగా వ్యాపించి ఉన్న దాదాపు 1,000 తీతువు పిట్టల గుంపు ఉన్నట్లుండి వచ్చిపడుతుంది. ఈ పక్షులు క్రమశిక్షణ ఏ మాత్రం లేదన్నట్లుగా, ఎవరూ అనుకరించలేని విధంగా గాల్లో ఎగురుతూ వస్తాయి. తీతువు పిట్టలూ, గోల్డెన్‌ ప్లొవర్‌లూ పశ్చిమాన పంట పొలాల్లో ఉన్నాయి, ఇది వాటికిష్టమైన ఆహారం దొరికే ప్రాంతం. అవి నదీముఖద్వారం దగ్గరికి వచ్చేది కేవలం ఆహారం కొరకు మాత్రమే కాదు కానీ స్నానం చేయడానికీ, తమ ఈకలను సవరించుకోవడానికీ వస్తాయి.

నేపథ్యంలో ప్రధానంగా వినబడేది కర్‌ల్యూలు గుడగుడమని చేసే శబ్దమూ, రెడ్‌షాంక్‌లు చేసే సంతృప్తిపూర్వకమైన ఉండే ఈలలూ, బ్లాక్‌-హెడెడ్‌ గల్‌లు చేసే కీచుకీచుమనే శబ్దాలే. రెండు బార్‌-టెయిల్డ్‌ గాడ్‌విట్‌లు బురదమట్టి లోపలికంటా పరిశీలిస్తాయి. కొన్ని ఎర్రకాలి ఉల్లంకిపిట్టలు నారింజ-ఎరుపువన్నెలోని తమ గట్టి ముక్కులతో కొన్ని సముద్రపు పురుగులను బయటికి లాగుతున్నాయి. ఒక ఒంటరి గ్రే ప్లొవర్‌ ఠీవిగా కొన్ని అడుగులు వేసి, ఆగి, తన కుడికాలిని విదిలించి, తన వేట వెంటబడి దాన్ని మింగివేస్తుంది. కానీ మీదికి రాబోతున్న అల వాటినన్నింటినీ త్వరగా ముంచెత్తబోతోంది!

రద్దీ మొదలౌతుంది

అకస్మాత్తుగా, పక్షులు గుంపులు గుంపులుగా పైకి లేస్తాయి, ప్రాముఖ్యంగా తమ స్వంత జాతి పక్షులతో అవి లేస్తాయి. అదొక ఆకర్షణీయమైన దృశ్యం, ఎందుకంటే వేడర్‌లు ఒకదానికొకటి దగ్గరగా అంటిపెట్టుకుని ఒక ప్రత్యేకమైన ఆకృతిని ఏర్పరుస్తూ ఎగురుతాయి. వాటిపైన సూర్యకిరణాలు ప్రసరిస్తుండగా పక్షుల గుంపులు రంగులు మారుస్తూంటాయి—ముదురు గోధుమవర్ణంనుండి మెరుస్తున్న వెండివర్ణంలోకి మారుతూ—ఒక క్షణం స్పష్టంగా కనబడుతూ మరోక్షణంలో బూడిద రంగులో ఉన్న అల నేపథ్యంలోకి దాదాపు కలిసిపోతూ అదృశ్యమౌతూంటాయి. నలుపు నుండి వెండివర్ణంలోకీ, వెండి నుండి నలుపు రంగులోకీ, చక్కని లయతోనూ—అదే సమయంలో గ్రుడ్డు ఆకారంలో నుండి గుండ్రని ఆకారంలోనికీ, తర్వాత చుట్ట చుట్టినట్లుగా, ఆ తర్వాత చివరికి నిలువైన గీత ఆకారంలోనికీ మారుతూ ఉంటాయి. వీటిలో చాలామట్టుకు మళ్లీ అల రావాల్సివున్న చదునైన బురదమట్టిమీదికి వ్రాలతాయి.

త్వరలోనే మా చుట్టూవున్న బురదమట్టీ, ఇసుక ప్రాంతాలూ మునిగిపోతాయి, అందుకని మేం వెంటనే నది ఎగువభాగానికి పరుగెట్టాలి, మాతోపాటు వేడర్‌ల గుంపు నెమ్మదిగా వస్తుంది. మమ్మల్ని మొదట దాటిపోయేది చిన్ని చిన్ని డన్‌లిన్‌ల చిన్న గుంపులు, అవి వేగంగా కొట్టుకునే తమ రెక్కల సహాయంతో, అప్పుడప్పుడూ చిన్నగా కీచుగా అరవడం ద్వారా ఒకదానికొకటి దగ్గరగా ఉంటూ ఎగురుతాయి. ఆ తర్వాత, వాటికన్నా పెద్దవైన రెడ్‌షాంక్‌లు దాటిపోతాయి, వీటి గుంపులు ఎక్కువ విస్తారంగా ఉంటాయి, ఠీవిగా ఎగురుతాయి. పెద్ద సముద్రపు పక్షుల పరిమాణంలోని కర్‌ల్యూలు మమ్మల్ని దాటి ఎగురుకుంటూ వెళ్లిపోతాయి, వెళ్తూ వెళ్తూ సమ్మోహనకరమైన తమ మెత్తని స్వరాన్ని వినిపిస్తూ ఎగురుతాయి. నీలి ఆకాశంలో నలుపూ తెలుపుల సమ్మేళనంతో అవసెట్‌లు ఒక పెద్ద గుంపులో వాటిననుసరిస్తాయి. అవి నదీముఖద్వారానికి ఎగువన స్థిరపడతాయి, వాటి పొడవైన నీలి ఊదారంగులోని కాళ్లు నీటికిపైగా కనబడతాయి.

పక్షుల విశ్రమస్థలం

మేం వడిగా నడిచి నదీముఖద్వారం సన్నగా అయ్యే ఎత్తైన స్థలానికి చేరుకుంటాము. (చిత్రంలో పాయింట్‌ సి చూడండి.) ఒకే జాతికి చెందినవి ఒక గుంపుగా ఏర్పడతాయి, అయినా ఇది కచ్చితమైన నియమం కాదు. అల క్రమక్రమంగా పెరుగుతుండగా మరిన్ని పక్షులు ఆ గుంపుల్లో కలుస్తాయి. ఆలస్యంగా వస్తూ ఉండేవాటికి స్థలం కొరకైన డిమాండు పెరుగుతూనే ఉంటుండడంతో తీరప్రాంతాల్లో నిలబడడమే కష్టమైపోతుంది, అందుకని ఇలా మరిన్ని పక్షులు చేరడంతో మిగతావి వాటి స్థానాలు మారుస్తూ ఉండవలసివస్తుంది.

పోటు అల ఇప్పుడు వచ్చేసింది. తీతువు పిట్టలూ, గోల్డెన్‌ ప్లొవర్‌లూ పంట పొలాలకు తిరిగి ఎగిరి వెళ్లిపోయాయి. మిగతా పక్షులన్నీ బురదమట్టి మీదినుండి లేచిపోయి, పాత నదీ తీరాలపై విశ్రమించేలా నెట్టివేయబడ్డాయి. ఎర్రకాలి ఉల్లంకిపిట్టలు ఎడతెగక చేసే శబ్దాలు వాటి సంఖ్యకు మించిపోయి ఉన్నాయి. రెడ్‌షాంక్‌లూ, కర్‌ల్యూలూ నేపథ్యంలో కూతలు కూస్తున్నాయి, ఇప్పుడు వాటికిమీదుగా ఎగురుతున్న ఒక స్కైలార్క్‌ పాటతో ఇది చరమాంకానికి చేరుకుంటుంది—నిజంగా ఒక అద్భుతమైన వాతావరణం.

వేడర్‌లు ఈ అపరాహ్ణ వేళలో హెచ్చైన పోటు అలనుండి దూరంగా తమ విశ్రమ స్థలంలో చక్కగా విశ్రమిస్తుండగా మేం సెలవు తీసుకుంటాము. సముద్రపు నీటిని ఆపడానికైన నిర్మాణాల వెనుక కొన్ని నీటిని చూడలేవన్నది వాస్తవమైనప్పటికీ ఈ పక్షులకు చదునైన బురదమట్టిమీదకి లేక ఇసుక తీరాలకి ఎప్పుడు మరలి వెళ్లాలో తెల్సు. కచ్చితమైన సమయపాలనతో, సహజబుద్ధితో ఉన్న వాటికి అలలు ఎప్పుడు ఎలా వస్తాయో తెలుసు.

అవును, పోటు అల రద్దీ సమయం చూడడానికి అద్భుతంగా ఉంటుంది, ప్రత్యేకంగా అది మొదటిసారైతే మరీనూ!

[అధస్సూచీలు]

a అమెరికాలోనూ, కెనడాలోనూ వేడర్‌లు (కారాడ్రిఫార్మ్‌ల క్రమం) ఎక్కువగా తీరపక్షులని పిలువబడతాయి.

b సముద్రపు అలలు నిరంతరం ముంచివేస్తూండే నేల.

[24వ పేజీలోని బాక్సు/చిత్రం]

రద్దీ సమయంలో ఆనందించండి

పోటు అల రద్దీ సమయంలో ఆనందించడానికిగాను, మొట్టమొదట అనువైన నదీముఖద్వారాన్ని వెదకండి. ఆ ప్రాంతం గురించి కొంచెం సమాచారం మీకు అవసరమౌతుంది, ఉదాహరణకు వేడర్‌లు ఎక్కడికి వెళ్తాయి, వాటిని ఎక్కడ చూడవచ్చు వంటివాటిని గురించిన సమాచారం అవసరం. పౌర్ణమి లేదా అమావాస్యల తర్వాత వెంటనే వచ్చే హెచ్చైన పోటు అల ఎప్పుడు వస్తుందనే దానిగురించిన అలల పట్టికలను చూడండి. ప్రయాణానికి పట్టే సమయానికితోడు పక్షులను బాగా చూసేందుకు మూడు గంటలు వెచ్చించేలా చూసుకోండి, పోటు అల రావడానికి కనీసం రెండు గంటల ముందు వెళ్లండి.

మీకు ఏ పరికరాలు అవసరమౌతాయి? వేడర్‌లను మీరు గుర్తించలేకపోతే వాటిని గుర్తించడానికి సహాయపడే పుస్తకాన్ని తీసుకెళ్లండి. బైనాక్యులర్‌ కూడా చాలా ఉపయోగకరంగా ఉండగలదు. వేడర్‌లలోని ప్రతీ జాతికి దానిదాని స్వంత లక్షణాలు ఉన్నాయనీ, దాని ముక్కు ఎలా సృష్టించబడిందో దానికి తగ్గట్టుగా ఆహారాన్ని తీసుకుంటాయనీ మీరు త్వరలోనే గమనిస్తారు. టెలిస్కోపు అంతగా అవసరం లేదు—కానీ నీరు లోపలికి ప్రవేశించని వెచ్చని వస్త్రాలు అవసరం! ప్రమాదాలను గుర్తించేలా అప్రమత్తంగా ఉండండి. బురదమట్టి గురించి మీకు బాగా తెలిస్తేనే తప్ప దానిపై నడిచే సాహసం చేయవద్దు. శీఘ్రంగా పైకి పెరుగుతున్న అలలో సులభంగా చిక్కుకుపోగలరు. అంతేగాక, కేవలం సముద్రపు మంచు ఆవరిస్తే చాలు మీరు సులభంగా తప్పిపోతారు. గాలులు వీచడం కూడా గమనిస్తుండాలి. తుపానులు అలలు ఉప్పొంగేలా చేయగలవు, ఇది ఏ నదీముఖద్వారంలోనైనా అపాయకరమైనదిగా ఉండవచ్చు.

[25వ పేజీలోని బాక్సు/చిత్రం]

ప్రపంచంలోని ప్రముఖ నదీముఖద్వారాలు

యూరప్‌లో నెదర్లాండ్స్‌లోని వాడెన్‌ జీ అత్యంత ప్రాముఖ్యమైన ఇంటర్‌టైడల్‌ ప్రాంతం, కొన్నిసార్లు ఇక్కడకు దాదాపు 40 లక్షల వేడర్‌లు వస్తాయి. ఇది ఉత్తరదిశగా నైఋతి జట్‌లాండ్‌ వరకు విస్తరించి ఉంటుంది. ఈ విస్తారమైన ప్రాంతంలో సందర్శించదగ్గ మంచి ప్రాంతాలు మూడు ఉన్నాయి: డెన్మార్క్‌లోని రామా కాజ్‌వే ఒకటి; జర్మనీలోని ఒక పెద్ద పోటు అల విశ్రమ స్థలమైన వేజర్‌ నదీముఖద్వారం రెండవది; నెదర్లాండ్స్‌లోని గ్రోనింగన్‌ దగ్గర్లోని లావర్స్‌ జే మూడవది. ఐబీరియన్‌ ద్వీపకల్పంపై అత్యంత ప్రాముఖ్యమైన నదీముఖద్వారం ఏదంటే పోర్చుగల్‌లోని టేగస్‌ నది.

ఉత్తర, దక్షిణ అమెరికాల పసిఫిక్‌ తీరాల్లోని నదీముఖద్వారాలు దాదాపు 60 నుండి 80 లక్షల వలసపోయిన వేడర్‌లకు ఆహారాన్ని అందిస్తాయి. ప్రాముఖ్యమైన ప్రాంతాలు ఏవంటే, కాలిఫోర్నియాలో సాన్‌ ఫ్రాన్సిస్కో, హమ్‌బోల్ట్‌ అఖాతాలు; కెనడాలో వాంకూవర్‌ బౌండరీ అఖాతం నుండి మొదలుకొని బ్రిటిష్‌ కొలంబియాలోని అయోనా ద్వీపం వరకున్న 200 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలోని ప్రాంతము; అలాస్కాలోని స్టికైన్‌ నదీముఖద్వారమూ, కాపర్‌ నది డెల్టా.

వేడర్‌లను చూడడానికి అద్భుతమైన ప్రాంతాలు అమెరికానందలి టెక్సస్‌లోని బాలవర్‌ ఫ్లాట్‌ మరియు గ్లేవ్‌స్టన్‌; హాంగ్‌ కాంగ్‌లోని టై-పో; ఈశాన్య ఆస్ట్రేలియాలోని కార్నజ్‌; కెన్యాలోని మొంబాసాలవద్ద ఉన్నాయి.

[22వ పేజీలోని చిత్రం]

ఐదు ఎర్రకాలి ఉల్లంకిపిట్టలు

[23వ పేజీలోని చిత్రం]

తమ విశ్రమస్థలం నుండి బయటపడుతున్న నాట్‌లు

[23వ పేజీలోని చిత్రం]

సఫోల్క్‌లోని ఓల్డ్‌ నదీముఖద్వారం

పరిశీలనా పాయింట్‌ బి

వ్యూపాయింట్‌ సి

ఏ వద్ద తొలి దృశ్యం

[క్రెడిట్‌ లైను]

Snape Maltings Riverside Centre

[24వ పేజీలోని చిత్రం]

నాట్‌

[24వ పేజీలోని చిత్రం]

రెడ్‌షాంక్‌

కర్‌ల్యూ

[25వ పేజీలోని చిత్రం]

పైన: కర్‌ల్యూలు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి