కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g97 4/8 పేజీలు 6-8
  • సంస్థీకృత నేరం ఎందుకు వర్ధిల్లుతోంది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సంస్థీకృత నేరం ఎందుకు వర్ధిల్లుతోంది?
  • తేజరిల్లు!—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మిథ్యా కుటుంబ వ్యవస్థ
  • వెలుగు దూత
  • నేరం లేని లోకం ఎలా?
    తేజరిల్లు!—1997
  • సంస్థీకృత నేరంతో సంబంధాలను తెంచుకోవడం “నేను యాకూజాగా ఉండేవాడిని”
    తేజరిల్లు!—1997
  • సంస్థీకృత నేరం మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తోంది?
    తేజరిల్లు!—1997
  • ఎందుకింతటి ఎక్కువ నేరమున్నది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
మరిన్ని
తేజరిల్లు!—1997
g97 4/8 పేజీలు 6-8

సంస్థీకృత నేరం ఎందుకు వర్ధిల్లుతోంది?

అమెరికాలో మద్యనిషేధ శకానికి (1920-33) చెందిన అల్‌ కాపోన్‌ అనే ఒక పేరు గాంచిన గుండా, తాను కేవలం సప్లై మరియు డిమాండ్ల సూత్రానికి అనుగుణ్యంగా పనిచేస్తున్న ఒక వ్యాపారిని మాత్రమేనని చెప్పుకున్నాడు. జపాన్‌లోని అత్యంత పెద్ద యాకూజా సిండికేట్‌ కొరకు లాయరుగా ఉన్న వ్యక్తి ఇలా అన్నాడు: “[సెక్స్‌, మాదకద్రవ్యాలు, జూదంవంటి] కార్యకలాపాలకు గొప్ప డిమాండు ఉందన్నది ఖండించలేని విషయం.” ఆ డిమాండు సంస్థీకృత నేరాన్ని పోషిస్తుంది. తాము నేరానికి బలవ్వాలని ఎవరూ కోరుకోకపోయినప్పటికీ, కొందరు నేర సంస్థలవైపుకి తిరిగి వాటి సేవలను అందుకోవచ్చు.

ఉదాహరణకు, సంరక్షణా ముఠాల సంగతే తీసుకోండి, వీటిని అనేక దేశాల్లోని రౌడీలు తమ ఆదాయ మూలంగా ఉపయోగిస్తారు. కొన్నిసార్లు, వారి గురి నిజాయితీగల షాపు యజమానులపైనే ఉన్నప్పటికీ, సాధారణంగా వారు చీకటి వ్యాపారాలు చేసేవారిపైబడుతుంటారు. టోక్యోలోని షిన్యుకూలో ఆటల పార్లర్‌ ముసుగులో తమ వ్యాపార కార్యకలాపాలు సాగించే ఒక కాసినో యజమాని ఇలా అన్నాడు: “ఒక గుమస్తాని కత్తితో పొడిచేసి, 20 లక్షలు [యెన్‌లు (20,000 అమెరికా డాలర్లు)] దొంగిలించారు. కానీ మేం పోలీసుల్ని పిలవలేదు.” ఎందుకు? “ఎందుకంటే మేం చట్టవిరుద్ధమైన పనులను (జూదం) చేస్తున్నాము గనుక మేం పోలీసులతో ఏ సంబంధమూ పెట్టుకోదల్చుకోము. మా స్టోరులో ఎవరైనా కస్టమరు అల్లరిగా ప్రవర్తిస్తే మేం యాకూజాని పిలుస్తాము.” ఈ కాసినో నిర్వాహకుడు నెలకు 4,000 డాలర్లు యాకూజాకి చెల్లిస్తాడు, ఆ నెలలో ఈ చట్టవిరుద్ధ కార్యకలాపాల ద్వారా అతను సంపాదించే 3,00,000 డాలర్ల లాభంతో పోల్చుకుంటే అది చాలా తక్కువ మొత్తమే. అంత డబ్బు ఎక్కడినుండి వస్తుంది? చట్టవిరుద్ధమైన జూదం ఆడుతూ ఆనందించే వ్యక్తుల జేబుల్లోంచే.

సమస్యల్ని నివారించాలనుకునే గౌరవనీయమైన వ్యాపారాల విషయంలోనూ ఇదే వాస్తవమై ఉంది. సాలీనా 1.5 కోట్ల డాలర్లు సంపాదించే ఒక పెయింటింగ్‌ కాంట్రాక్టరు, గుండాలకు లంచాలివ్వడంద్వారా 38 లక్షల డాలర్లను ఆదా చేశాడని న్యూయార్క్‌లోని ఒక అథారిటీ అంచనా వేసింది. ఇలా చేయడం తక్కువ వేతనం తీసుకునే కార్మికులను ఉపయోగించుకోవడానికీ, గుండాల నియంత్రణలో ఉండే యూనియన్‌నుండి సంఘర్షణను నివారించడానికీ ఆ కాంట్రాక్టరుకి సాధ్యమయ్యింది. జపాన్‌లో, ఆర్థిక సౌభాగ్యం ఉన్న కాలంలో పెట్టుబడిదార్లు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో తమ డబ్బుని ధారాళంగా ఖర్చుపెట్టి, గొప్ప నిర్మాణాల్ని కట్టడానికిగాను పాత ఇండ్లనీ దుకాణాల్నీ కూలగొట్టారు. నివాసులు అక్కడినుండి కదలడానికీ లేక తమ భూమిని అమ్మడానికీ నిరాకరించినప్పుడు వారిని ఖాళీచేయించడానికిగాను ఆ పెట్టుబడిదార్లు చాలామట్టుకు యాకూజా-సంబంధిత కంపెనీలైన జీయాగేయాలను పిలిపించారు.

యాకూజాలు 80లలో ఎరువు తెచ్చుకోవడమూ, డబ్బు సంపాదించడమూ ఎంత సులభమో గ్రహించినప్పుడు వారు రియల్‌ ఎస్టేట్‌ మరియు స్టాక్‌ ఊహాకల్పనచేసే కంపెనీలుగా తయారై ఆ వ్యాపారాల్లో మునిగిపోయారు. బ్యాంకులు, ఆర్థిక సహాయ సంస్థలు డబ్బుని ఈ కంపెనీలలోకి ధారపోశాయి, స్పష్టంగా తమ స్వంత లాభాల కొరకే అవి అలా చేశాయి. కానీ చివరికి సున్నితమైన ఆ బుడగ బ్రద్దలైనప్పుడు బ్యాంకులు తమ డబ్బుని తిరిగి సంపాదించడం చాలా కష్టంగా ఉన్నట్లు కనుగొన్నాయి. జపాన్‌లో తగ్గుతున్న మాంద్యం గురించి మాట్లాడుతూ ఒక మాజీ పోలీసు అధికారి న్యూస్‌వీక్‌లో ఇలా అన్నాడు: “గడువు మీరిన ఋణాల సంబంధిత సమస్యలు త్వరగా పరిష్కరించలేకపోవడానికి నిజమైన కారణం ఏమంటే వాటిలో ప్రాముఖ్యమైన భాగం సంస్థీకృత నేరంతో సంబంధంవున్నవి కావడమే.”

నిజానికి, ప్రజలు ఏ మార్గాల్లోనైనప్పటికీ, తమ లైంగికేచ్ఛలను తృప్తిపర్చుకోవాలనే తీవ్రమైన ఆకాంక్ష ఉన్న చోట్లలో సంస్థీకృత నేరం వేళ్లూని, వర్ధిల్లుతోంది. సుఖానుభూతి కొరకు, సెక్స్‌ కొరకు, డబ్బు కొరకు దురాశ కల్గివుండడం అనేది మాదకద్రవ్యాలను చట్టవిరుద్ధంగా అమ్మడం, వేశ్యావృత్తి, జూదం, హెచ్చైన వడ్డీలపై డబ్బు గుంజడం వంటి కార్యకలాపాలకు సరైన వాతావరణంగా తయారయ్యింది. అటువంటి కార్యకలాపాల్లో పాలుపంచుకోవడమంటే సాధారణంగా అల్లరిమూకను పోషించడమూ, వారు బలిసేలా చేయడమూ అనే అర్థం. తమ స్వంత శరీరేచ్ఛలను తీర్చుకోవడానికి కృతనిశ్చయంగలవారి డిమాండ్లకు అనుగుణ్యంగా సంస్థీకృత నేరం పనిచేస్తుందన్నది ఎంత వాస్తవం!

మిథ్యా కుటుంబ వ్యవస్థ

చట్టవిరుద్ధ కార్యకలాపాలకైన డిమాండుకు తోడు నేడు సంస్థీకృత నేరం వర్ధిల్లడానికి తోడ్పడే అవసరత మరోటి ఉంది. జపాన్‌లోని అత్యంత పెద్ద యాకూజా సిండికేట్లలో ఒకదానికి నాయకుడిగావుండి ఇటీవల మరణించిన ఒక వ్యక్తి, తాను న్యాయబహిష్కృతులను చేరదీస్తూవున్నాననీ వారియెడల శ్రద్ధవహిస్తూవున్నాననీ, తద్వారా వారు చెడ్డవారిగా తయారవ్వకుండా కాపాడుతూవున్నాననీ నొక్కిచెప్పాడు. తన గ్యాంగు సభ్యులకు తాను ఒక తండ్రిగా ఉన్నాననీ ఆయన చెప్పుకున్నాడు. చాలామట్టుకు నేర సిండికేట్లు జాతీయతతో సంబంధం లేకుండా, తమ సంస్థలను అటువంటి మిథ్యా కుటుంబ బాంధవ్యాలపై నిర్మించుకుంటాయి.

ఉదాహరణకు, హాంగ్‌ కాంగ్‌లోని ఒక బీద కుటుంబంలోనుండి వచ్చిన చీ సన్‌నేa తీసుకోండి. ఆయన తండ్రి ఆయన్ను తరచూ చిన్ని చిన్ని కారణాలకే తీవ్రంగా కొట్టేవాడు. యౌవనుడైన చీ సన్‌ తిరుగుబాటు చేసి చివరికి 12 సంవత్సరాల వయస్సులో పేరుమోసిన ట్రయాడ్స్‌తో కలిసిపోయాడు. ఆ నేర సంస్థలో, వారు ఆయనను “మనవాడు” అనుకున్నట్లు ఆయన భావించాడు. మారణాయుధాలతో పోరాటం చేయడంలో ఆయన సాహసవంతుడుకావడం మూలాన త్వరలోనే తన క్రింద కొంతమంది మనుష్యులు ఉండే స్థానానికి చేరుకున్నాడు. చివరికి, ఆయనకు కేవలం 17 సంవత్సరాలు ఉన్నప్పుడే ఆయన జైలుకు పంపించబడ్డాడు.

చీ సన్‌లాంటి అనేకమంది ఇంటివద్ద లేని కుటుంబ బంధాలను కనుగొనడానికి నేర సంస్థలవైపుకి తిరుగుతున్నారు. ఆ సభ్యులు శ్రద్ధవహించేవాళ్లమని చెప్పుకుంటారు, కానీ ప్రతి సభ్యుడూ తనపైనే ప్రాముఖ్యంగా ఆసక్తికల్గివున్నట్లు కనుగొన్నప్పుడు యౌవనులు తరచూ నిరాశాపూరితులౌతారు.

వెలుగు దూత

1992లో క్రొత్తగా ప్రవేశపెట్టబడిన గ్యాంగ్‌ వ్యతిరేక చట్టం క్రింద జపాన్‌లోని అత్యంత పెద్ద నేర సిండికేట్‌ హింసాత్మక గుంపుగా నిర్ధారితం చేయబడినప్పుడు, దాని నాయకుల్లో ఒకరు తమ గుంపులోని వారు దుష్టత్వానికి విరుద్ధంగా యుద్ధం చేస్తున్న “వీరోచితులు” అని తమను తాము పరిగణిస్తున్నట్లు ఉద్ఘాటించాడు. 1995లో కోబెలో దారుణమైన భూకంపం సంభవించినప్పుడు, ఇదే గ్యాంగు ఆహారం, నీరు, మరితర అత్యవసర వస్తువులను తమ పొరుగువారికి పంచిపెట్టింది. “ఆ విధంగా ఔదార్యం కనపర్చడం, జపాన్‌లోని యాకూజాలు గౌరవార్హులైన న్యాయబహిష్కృతులు అని వారి ప్రతిష్టకు అదనపు బలాన్ని చేకూర్చగలదు” అని ఆసాహి ఈవెనింగ్‌ న్యూస్‌ నివేదిస్తుంది.

నేర సిండికేట్ల బాస్‌లు తరచూ పరోపకారబుద్ధి గలవారనే ముసుగును తగిలించుకుని ఉండడానికి ప్రయత్నిస్తూనేవున్నారు. కొలంబియాలో మెడెల్లిన్‌ మాదకద్రవ్యాల చట్టవిరుద్ధ సంస్థల పేరొందిన నాయకుడైన పాబ్లో ఎస్కోబార్‌ను ఆయన నగరంలోని మురికివాడల్లో నివసించేవారు ఒక “ఊహల్లోని వ్యక్తిగా—కొంచెం మెస్సీయాలాగా, కొంచెం రాబిన్‌ హుడ్‌లాగా, జమీందారువంటి పాత్రోన్‌ అంటే బాస్‌ అనే అర్థంలో కొంచెం గాడ్‌ఫాదర్‌లాగా” దృష్టిస్తారని ఆనా కారగన్‌ న్యూస్‌వీక్‌లో వ్రాసింది. ఆయన పిల్లలకొరకు స్కేటింగ్‌ రింక్‌లనూ, బీదవారికొరకు చక్కని గృహాలనూ కట్టించాడు, వీధిపిల్లలకు ఉద్యోగాలనిచ్చాడు. ఆయన ఔదార్యం వలన ప్రయోజనం పొందినవారికి ఆయన ఒక హీరోయే.

అయితే, తమ సిండికేట్ల వెనుక భద్రంగా దాక్కున్నట్లుగా కన్పించే నేరస్థులు కేవలం ఒక విశ్వవ్యాప్త మాస్టర్‌ క్రిమినల్‌ చేతిలో బంటుల్లాంటివారు మాత్రమే. ఆయన ఎవరో బైబిలు వెల్లడిస్తుంది. “సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు. గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారికంతము కలుగును.” (2 కొరింథీయులు 11:14, 15) నేడు, సాతాను ఒక నిజమైన వ్యక్తియని చాలామంది నమ్మరు. 19వ శతాబ్దికి చెందిన ఒక ఫ్రెంచి కవి ఇలా అన్నాడు: “అపవాదియొక్క అత్యంత తెలివైన మాయోపాయం ఏమంటే తాను ఉనికిలో లేడని మీరు నమ్మేలా చేయడమే.” ఆయన తెరవెనుక కదలాడుతూ, కేవలం నేర సిండికేట్లలోనే కాదు గానీ ప్రపంచమంతటా జరుగుతున్నదాన్నంతటినీ చాకచక్యంతో ప్రభావితం చేస్తూ ఉంటాడు. ‘లోకమంతయు దుష్టునియందున్నది’ అని బైబిలు వివరిస్తోంది. సాతాను ‘ఆదినుండి నరహంతకుడైయుండి, అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు’ అని యేసు వర్ణించాడు.—1 యోహాను 5:19; యోహాను 8:44.

అపవాదియైన సాతాను ప్రాముఖ్యంగా 1914 నుండి క్రియాశీలంగా ఉన్నాడని బైబిలు ప్రవచనాలు వెల్లడిస్తున్నాయి. ఆ సంవత్సరం నుండీ, ఆతడు దేవుని ప్రజలను సమూలంగా తుడిచిపెట్టేందుకు వారికి విరుద్ధంగా తన యుద్ధసమూహాన్ని సన్నద్ధం చేస్తున్నాడు. ఆతను మానవజాతిని పూర్తి గందరగోళమనే సుడిగుండంలోనికి లాగుతున్నాడు. నేడు నేరమూ, నేర సంస్థలూ ఎందుకు వర్ధిల్లుతున్నాయన్నదానికి ప్రధానమైన కారణం ఆయనే.—ప్రకటన 12:9-12.

భూమ్మీది నేర సంస్థల వెనుకనున్న కీలకమైన వ్యక్తి ఎప్పటికైనా తొలగించబడతాడా? మానవజాతి ఎన్నడైనా శాంతిభద్రతలను అనుభవిస్తుందా? భూమిపైన సాతాను నేడు నిర్మించిన దుష్ట సామ్రాజ్యపు బంధకాలనుండి మీరు స్వేచ్ఛను పొందగలరా?

[అధస్సూచీలు]

a దీనిలో ఇమిడివున్న వ్యక్తుల సంక్షేమార్థం కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

[7వ పేజీలోని బాక్సు]

మీ కుటుంబాన్ని కాపాడుకోవడం ఎలా?

వాత్సల్యపూరిత, ఐక్య కుటుంబ వాతావరణం లోపించడం యౌవనులు నేర సిండికేట్లకు సులభంగా బలయ్యేలా చేయగలదు. అమెరికాలో, గ్యాంగ్‌ హత్యల్లో పాల్గొనే యౌవనుల్లో అత్యధికులు అంత సంపన్నులు కాని కుటుంబాలనుండీ లేక విడిపోయిన కుటుంబాలనుండీ వస్తున్నారని నివేదించబడింది. “నిమ్నతరగతులకు చెందినవారిగా ఉండడం వలన, బాస్‌కీ ఆయన నమ్మినబంట్లకీ మధ్యవుండే శక్తివంతమైన బంధంచే, ఒక సంస్థలోని సభ్యునిగా ఐకమత్యంచే వారు సులభంగా కదిలించబడుతున్నారు. దీన్ని వారు తమ జీవితాల్లో మొట్టమొదటిసారిగా అనుభవిస్తారు” అని నార్త్‌ కారోలినాలో ఒక నిర్బంధ కేంద్రంలోని ఒక అధికారి అన్నాడు.

అదే విధంగా, ఒక తూర్పు దేశంలో తన బాస్‌కొరకు సజీవ కవచంగా ఉండడానికి ఇష్టపడే ఒక యౌవనుడైన యాకూజా ఇలా అంటున్నాడు: “ఇంట్లో నేనెప్పుడూ ఒంటరిగా ఉండేవాడిని. మేము ఒక కుటుంబంగా ఉన్నప్పటికీ, మేము హృదయపూర్వకంగా మాట్లాడుకోగల్గుతున్నట్లు నాకెప్పుడూ అన్పించలేదు. . . . కానీ నేనిప్పుడు నా తోటి సభ్యులతో హృదయపూర్వకంగా మాట్లాడుకోగలను.” తమను కుటుంబంలాంటి వ్యవస్థలోనికి లాగే నేర సంస్థలోని సభ్యులకు తాము ఋణపడివున్నట్లుగా ఒంటరి యౌవనులు భావిస్తారు.

“యాకూజావారు చాలా చాలా శ్రద్ధగలవారు” అంటుంది ఒకినావాలోని ఒక బైకర్‌ గాల్స్‌ గుంపు నాయకురాలు. “బహుశ అది వారి పన్నుగడ అయ్యుండవచ్చు; కానీ, మీకు తెలుసా, మాతో ఎవరూ ఎప్పుడూ సున్నితంగా వ్యవహరించనందున ఇది మమ్మల్ని కదిలిస్తుంది.” గుండాలు “అమ్మాయిల హృదయాలను చూరగొనడంలో అద్భుతమైన పాటవాన్ని” కలిగివుంటారని నేరాలు చేసిన బాలికలకొరకైన ఒక సంస్థలోని సూపరింటెండెంట్‌ ధ్రువీకరిస్తోంది. ఒంటరి అమ్మాయిలు అర్ధరాత్రి సమయంలో వారికొరకు ఫోనుచేసినప్పుడు ఆ గుండాలు వారిదగ్గరికి పరుగెత్తుకుని వెళ్లి, ప్రతీసారీ లైంగికపరంగా ఏమాత్రం ముందుకు వెళ్లకుండానే వారి గోడును వింటారు.

వారి శ్రద్ధాపూర్వక వైఖరి తాము పొంచివుండి వెదుకుతున్న ఆ యౌవనులను పూర్తిగా గుప్పిట్లో పెట్టుకునేంత వరకే నిలుస్తుంది. ఒక్కసారి యౌవనులు వలలో చిక్కారంటే చాలు—అమ్మాయిల్ని వేశ్యాగృహాల్లోనూ, అబ్బాయిల్ని నేర సంస్థల్లోనూ పీల్చిపిప్పి చేస్తారు.

మీరు మీ ఆత్మీయులను ఎలా కాపాడుకోవచ్చు?

“తండ్రులారా, మీ పిల్లల మనస్సు క్రుంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి” అని బైబిలు ఉద్బోధిస్తుంది. (కొలొస్సయులు 3:21) తలిదండ్రులు వారిని విచ్చలవిడిగా విడిచిపెట్టాలని ఇది ప్రోత్సహించడం లేదు. ఒక బైబిలు సామెత ఇలా అంటోంది: “అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును.” (సామెతలు 29:15) దానికి బదులుగా, తమ పిల్లల్తో వ్యవహరించేటప్పుడు తండ్రులు—తల్లులు కూడా—సహేతుకంగా ఉండాలని, వారు చెప్పేది వినాలని, వారితో సంభాషించడానికి సుముఖంగా ఉండాలని బైబిలు ప్రోత్సహిస్తోంది. అప్పుడు, పిల్లలు తాము దుర్దశలో ఉన్నప్పుడు తమ తలిదండ్రులతో మనస్సువిప్పి మాట్లాడేందుకు పురికొల్పును పొందుతారు.

సంభాషించడానికి సుముఖంగా ఉండడానికి తోడు, తలిదండ్రులు తమ పిల్లలకు జీవితంలో కొన్ని ప్రమాణాలను ఏర్పర్చాల్సిన అవసరం ఉంది. ఒక తండ్రి అటువంటి నిర్దేశక సూత్రాలను ఎక్కడ కనుగొనగలడు? బైబిలు ఇలా చెబుతుంది: “తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.” (ఎఫెసీయులు 6:4) కుటుంబ బైబిలు పఠన కార్యక్రమాలద్వారా మీ పిల్లలతోపాటు బైబిలును పరిశీలించడానికి సమయం తీసుకోండి. యెహోవా ఎడల ఆరోగ్యకరమైన భయాన్ని వారి హృదయాల్లో నాటండి, తద్వారా వారు ఎల్లప్పుడు తమ స్వంత ప్రయోజనార్థం యెహోవా నడిపింపును అనుసరిస్తారు.—యెషయా 48:17.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి