సంస్థీకృత నేరం మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తోంది?
జపాన్‌లోని తేజరిల్లు! విలేఖరి ద్వారా
ఒక మాఫియా ముఠాలోని డాన్ (నాయకుడు), నేరస్థుల ఆ ముఠాలో క్రొత్తగా చేరిన ఒక వ్యక్తి వ్రేలిని సూదిమొనతో గుచ్చుతాడు. ఒక “సెయింట్” చిత్రంపైకి రక్తం బొట్లుబొట్లుగా కారుతుంది. తర్వాత, ఆ చిత్రం అగ్నికి ఆహుతి ఔతుంది. ‘సంస్థకు చెందిన రహస్యాలను వేటినన్నా నువ్వు బయటపెట్టావో, ఈ సెయింట్లాగే నువ్వూ అగ్నికి ఆహుతి ఔతావు’ డాన్ ఆ యౌవనునితో అంటాడు.
మౌనసూత్రం—ఇటాలియన్లో, ఓమెర్టా—అనేది సంస్థీకృత నేరాన్ని చాలా సంవత్సరాల వరకు చాలా మేరకు గుప్తంగా ఉంచింది. అయితే నేడు, గుండాల్లోని కొంతమంది ఇన్ఫార్మర్లుగా మారుతూండడంతో అన్నిచోట్లా నేరస్థుల గ్యాంగ్‌లు పతాకశీర్షికల్లోకి ఎక్కుతున్నాయి. ఈ పెన్టీటీలు అంటే మాఫియా వెన్నుపోటుదార్లు నిందించే అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తి ఇటలీకి ఏడుసార్లు ప్రధానమంత్రిగా ఉన్న జూల్యో ఆంద్రేయొట్టి, మాఫియాతో ఆయనకున్న సంబంధాల విషయమై ఆయనపై ఇప్పుడు విచారణ జరుగుతుంది.
నేర సంస్థలు అన్నిచోట్లా అన్ని జీవనరీతుల్లోకి తమ వ్రేళ్లు ప్రాకిపోయేలా చేశాయి, ఉదాహరణకు: ఇటలీలోనూ, అమెరికాలోనూ ఉన్న మాఫియా, అక్కడది కోసా నోస్త్రా అని పిలువబడుతుంది; దక్షిణ అమెరికాలోని మాదకద్రవ్యాల చట్టవిరుద్ధమైన సంస్థలు; చైనాలోని ట్రయాడ్స్; జపాన్‌లోని యాకూజా. వాటి దుష్ట కార్యకలాపాలు మనలనందరినీ ప్రభావితం చేస్తాయి, మన జీవన వ్యయాన్ని మరింత అధికం చేస్తాయి.
అమెరికాలో, జులుం చేయడంద్వారా, సంరక్షక ముఠాలద్వారా, హైచ్చైన వడ్డీలపై డబ్బు గుంజడంద్వారా, జూదంద్వారా, మాదకద్రవ్యాల వర్తకంద్వారా, వేశ్యావృత్తిద్వారా వందల కోట్ల డాలర్లు సంపాదిస్తూ, మాఫియా న్యూయార్క్ నగరాన్ని ఐదు ముఠాల మధ్య విభజిస్తుందని చెప్పబడుతుంది. చెత్తను ఎత్తుకెళ్లడానికి సంబంధించిన వ్యాపారాలూ, ట్రక్కు రవాణా, భవన నిర్మాణమూ, ఆహార పంపిణీ, వస్త్ర పరిశ్రమలూ వంటి వ్యాపారాల్లోని కార్మిక సంఘాలపై మాఫియా ముఠాలకు గట్టిపట్టు ఉంటుందని ఆరోపించబడుతుంది. కార్మిక సంఘాలపై వాటికున్న ఆధిపత్యంతో అవి ఇటు కార్మికుల తగాదాలను పరిష్కరించనూగలవు, అటు విధ్వంసం సృష్టించి ఏదైనా ప్రాజెక్టును ఆపుచేయనూగలవు. ఉదాహరణకు, నిర్మాణ పని జరుగుతున్న ఏదైనా స్థలంవద్ద ఒకరోజు బుల్డోజరు కదలదు, మరోరోజు బాక్హో యంత్రంలోని బ్రేకులు ఫెయిలౌతాయి, అంతేగాక ఆపరేటింగ్ ఇంజినీర్లు ప్రాజెక్టు పనిని “నత్త నడక”తో చేస్తారు—ఇవేగాక మరెన్నో సంఘటనలు ఆ గుండాలు చేసే డిమాండ్లకు బిల్డరు తల ఒగ్గేంతవరకూ జరుగుతునే ఉంటాయి, ఆ డిమాండ్లు లంచాలైనా కావచ్చు లేక పని కాంట్రాక్టులైనా కావచ్చు. నిజానికి, “గుండాలకు లంచాలిస్తే, వ్యాపారస్తులకు బట్వాడా సత్వరంగా జరుగుతుంది, కార్మికులతో శాంతియుత సంబంధాలుంటాయి, తక్కువ వేతనం తీసుకునే పనివాళ్లను ఉపయోగించుకోగల్గడం సాధ్యమౌతుంది” అని టైమ్ పత్రిక నివేదిస్తుంది.
మెడెల్లిన్లోని చట్టవిరుద్ధ సంస్థ అధినేత పాబ్లో ఎస్కోబార్ 1993లో కాల్చిచంపబడేంత వరకూ కొలంబియాలో మాదకద్రవ్యాల రెండు చట్టవిరుద్ధ సంస్థలు ఒకదానితో ఒకటి పోటీపడ్డాయి. దానితర్వాత, కాలీలోని చట్టవిరుద్ధ సంస్థ కొకైన్ వ్యాపారంలో గుత్తాధిపత్యం సాధించింది. 1994లో కేవలం అమెరికాలోనే 700 కోట్ల డాలర్లు సంపాదించి, అది ప్రపంచంలోనే బహుశ అత్యంత పెద్దదైన సంస్థీకృత నేర సిండికేటుగా తయారయ్యింది. కానీ దాన్ని నడిపించే మూలపురుషుడు హోసే సాంతాక్రూస్ లాన్డోన్యో 1995లో అరెస్టు చేయబడడంతో ఆ చట్టవిరుద్ధ సంస్థకు చావుదెబ్బ తగిలింది. అయినా, తర్వాతి బాస్‌గా ఆ ఖాళీ స్థానాన్ని భర్తీ చేయడానికి ఉత్సాహం చూపే ఒక వ్యక్తి ఎప్పుడూ ఉంటాడు.
ఇనుప తెర చీల్చబడడంతో రష్యాకు చెందిన మాఫియా అంతర్జాతీయ వేదిక మీదికి రంగప్రవేశం చేసింది. తత్ఫలితంగా, “రష్యాలోని ప్రతీ వ్యాపారం మాఫియాతో వ్యవహరించవలసి వస్తోంది” అని న్యూస్‌వీక్‌లో ఉదాహరించబడిన ఒక బ్యాంకరు అన్నాడు. చివరికి న్యూయార్క్‌లోని బ్రైటన్ బీచ్‌లో కూడా రష్యాకు చెందిన మాఫియా పెట్రోలు సంబంధంగా క్లిష్టమైన మోసకరమైన పథకాలద్వారా గొప్ప లాభాలను ఆర్జిస్తోందని నివేదించబడుతుంది. దీనివల్ల కారు యజమానులు పెట్రోలుకు ఎక్కువ మొత్తంలో డబ్బు చెల్లించాల్సివస్తుంది, ప్రభుత్వం పన్నులను నష్టపోతుంది. రష్యా గ్యాంగులు తూర్పు యూరప్‌లో వేశ్యాగృహాలను కూడా నడిపిస్తున్నాయి. చాలామట్టుకు వారు తమ నేరాలకు శిక్షపడకుండా తప్పించుకుంటారు. భారీ మారణాయుధాలను ధరించివున్న మాజీ క్రీడాకారులకూ, అఫ్ఘన్ యుద్ధంలోని మాజీ సైనికులకూ ఎవరు మాత్రం ఎదురు నిలిచే సాహసం చేస్తారు?
తూర్పు దేశాల్లో పరిస్థితి ఏమాత్రం భిన్నంగా లేదు. జపాన్‌లోని వినోద పరిశ్రమలో ఉన్నవారు స్థానిక యాకూజా గుంపును గౌరవిస్తూ, వారికి ముడుపులు చెల్లించుకోకపోతే అన్ని రకాల సమస్యల్నీ ఎదుర్కోవల్సిందే. ఇక్కడ కూడా బార్లనుండీ, చివరికి వేశ్యలనుండి కూడా సంరక్షణా డబ్బు వసూలు చేస్తారు. దానికితోడు, తమ స్వంత కంపెనీలను నడపడంద్వారా, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలనుండి జులుంచేసి డబ్బును గుంజడంద్వారా, విదేశాల్లోని నేర సిండికేట్లతో సంబంధాలు పెట్టుకోవడంద్వారా యాకూజాలు జపాను ఆర్థిక వ్యవస్థ లోపలికంటా చొచ్చుకుపోయారు.
హాంగ్ కాంగ్, తైవాన్లలో స్థాపితమైవున్న నేర సంస్థలు కూడా ప్రపంచమంతటికీ ఒక నెట్వర్కును వ్యాపింపజేస్తున్నాయి. ట్రయాడ్స్ అనే వారి పేరు తప్పించి వారు ఎలా సంస్థీకరించబడివున్నారో ఏమిటో ఏమీ తెలియదు. వారి చరిత్ర 17వ శతాబ్దంనుండి మొదలౌతుంది, ఆ కాలంలో చైనాలోని సన్యాసులు చైనాని ఆక్రమించిన మంఛూరియన్లకు విరుద్ధంగా ముఠాలుగా ఏర్పడ్డారు. వారి సభ్యుల సంఖ్య పదుల వేలల్లో ఉన్నప్పటికీ, హాంగ్ కాంగ్‌లోని ట్రయాడ్స్ నిర్దిష్టమైన నేరాలు చేయడానికి లేక ఒక పరంపరలో నేరాలను చేయడానికై తాత్కాలిక సిండికేట్లుగా ఏర్పడుతూ పోలీసులకు వారి జాడ పసికట్టడమే కష్టంగా ఉండేలా తయారయ్యారు. హెరాయిన్‌ను దొంగరవాణా చేయడంద్వారా వారు వందల కోట్ల డాలర్లను సంపాదిస్తారు, వారు హాంగ్ కాంగ్‌ను క్రెడిట్-సార్డుల ఫోర్జరీ కేంద్రంగా తయారు చేసేశారు.
ద న్యూ ఎత్నిక్ మాబ్స్ అనే తన పుస్తకంలో విలియమ్ క్లైంక్నెక్ట్ అమెరికాలోని నేరం గురించి వ్రాస్తున్నాడు: “సంస్థీకృత నేరానికి సంబంధించిన క్రొత్త లోకంలో చైనీయులకు ఉన్నంత గొప్ప భవిష్యత్తు మరే ఇతర జాతిసంబంధ ముఠాలకూ లేదు. . . . దేశం చుట్టు ప్రక్కలావున్న నగరాల్లో చైనా నేర గుంపులు వేగంగా బలాన్ని సంపాదిస్తున్నాయి. . . . న్యూయార్క్‌లోని మాఫియా తర్వాత వచ్చేది వీరే.”
హాంగ్ కాంగ్నుండి ఉద్భవించే మరొక తరహా చట్టవిరుద్ధ ట్రాఫికింగ్ గురించి యు.ఎస్. న్యాయ విభాగం అధికారి ఒకాయన ఇలా అంటున్నాడు: “విదేశీయుల స్మగ్లింగ్ అనేది సంస్థీకృత నేరంయొక్క ఒక వ్యక్తీకరణ.” ప్రతి సంవత్సరం 1,00,000 మంది చైనీయులు అమెరికాలోనికి చట్టవిరుద్ధంగా ప్రవేశిస్తున్నారని కొందరు అధికారులు అంచనా వేస్తున్నారు. స్మగుల్ చేయబడ్డ ఒక వలసదారుడు ఒక సంపన్న దేశానికి కొనిపోబడడానికి కనీసం 15,000 అమెరికా డాలర్లు చెల్లించాలి, దానిలో చాలామొత్తం తాను తన గమ్యం చేరిన తర్వాత ఆయన కడతాడు. ఆ విధంగా, అనేకమందికి తమ కలల దేశంలోని జీవితం చివరికి ఫ్యాక్టరీల్లోనో, అనారోగ్యకర పరిసరాల్లో చెమటోడ్చి పనిచేయాల్సొచ్చే దుకాణాల్లోనో లేక వేశ్యాగృహాల్లోనో అనేక గంటల వెట్టి చాకిరీ అనే పీడకలగా మారుతుంది.
మీరు నేర కార్యకలాపాల్లో పాలుపంచుకోరు గనుక సంస్థీకృత నేరం మిమ్మల్ని ప్రభావితం చేయదని మీరు భావించవచ్చు. కానీ అది నిజమేనా? దక్షిణ అమెరికాలోని మాదకద్రవ్యాల చట్టవిరుద్ధ సంస్థలు సరఫరా చేసే మాదకద్రవ్యాలకు డబ్బు చెల్లించడానికి, అనేక ఖండాల్లో నివసించే మాదకద్రవ్యాల వ్యసనపరులనేకమంది నేరాలకు పాల్పడతారు. పబ్లిక్ సర్వీసుల కాంట్రాక్టులు సంస్థీకృత నేర గుంపులతో జతచేయబడిన కంపెనీలకు నియుక్తిచేయబడేలా సంస్థీకృత నేరం రూఢిపర్చుకుంటుంది; తత్ఫలితంగా, పౌరులు ఎక్కువ మూల్యం చెల్లిస్తారు. అమెరికాలో “దొంగిలించడం, జులుంచేసి డబ్బుగుంజడం, లంచమివ్వడం, వెల నిర్ణయం, వాణిజ్యాన్ని నిరోధించడం వంటివాటిద్వారా సంస్థీకృత నేరం ధరలను వక్రీకరిస్తుందనీ,” వినియోగదారులు “నిజానికి సర్‌ఛార్జి అని పిలువబడగలదానిని” మాఫియాకు బలవంతంగా చెల్లించాల్సివస్తుందనీ ప్రెసిడెంట్స్ కమిషన్ ఆన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఒకసారి పేర్కొంది. అందువలన, నేరంయొక్క ప్రభావాలను ఎవరూ తప్పించుకోలేరు. మనమందరమూ ఆర్థికంగా నష్టపోతాము.
కానీ నేడు సంస్థీకృత నేరం ఎందుకు వర్ధిల్లుతోంది?
[5వ పేజీలోని బాక్సు]
మాఫియా—దాని ప్రారంభం
“మాఫియా మధ్య యుగాల చివర్లో సిసిలిలో ఉద్భవించింది. అదక్కడ ఆ ద్వీపాన్ని జయించిన అరబ్లూ, నార్మన్లూ, స్పెయిన్వారూ వంటి వేర్వేరు విదేశీ శక్తుల పరిపాలనను కూలద్రోయడానికి తమను తాము సమర్పించుకున్న ఒక రహస్య సంస్థగా బహుశ మొదలైవుండవచ్చు. ఆ శతాబ్దాల్లో సిసిలీలోని చాలా భాగంలో నెలకొనివున్న అరాచక పరిస్థితుల్లో పరోక్ష భూస్వాములు తమ భూ ఎస్టేట్లను దోపిడీదార్లనుండి కాపాడడానికి మాఫీయే అనే చిన్న ప్రైవేట్ సైన్యాల్ని కూలికి పెట్టుకునేవారు. మాఫియా ఆరంభం ఈ సైన్యాలనుండే మొదలైంది, దాని సభ్యులూ వీటినుండే వచ్చారు. 18, 19 శతాబ్దాల్లో ఈ ప్రైవేట్ సైన్యాల్లోని బలంగల గుండాలు తమను తాము సంస్థీకరించుకుని ఎంత శక్తిమంతంగా తయారయ్యారంటే వారు భూస్వాములకు విరుద్ధంగా తిరుగుబాటు చేసి చాలామట్టుకు ఎస్టేట్లలో ఏక న్యాయనిర్ణేతలుగా తయారయ్యారు. భూస్వాముల పంటలను కాపాడినందుకు ప్రతిఫలంగా వీరు వారినుండి డబ్బును గుంజేవారు.” (ది న్యూ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా) సంరక్షణా డబ్బును జులుంచేసి గుంజడం వారి మోడస్ ఆపరాండీ అయ్యింది. వారు తమ పద్ధతులను అమెరికాకు తీసుకెళ్లి, అక్కడ జూదం, కార్మిక కుంభకోణం, హైచ్చైన వడ్డీలపై డబ్బు గుంజడం, మాదకద్రవ్యాల ట్రాఫికింగ్, వేశ్యావృత్తి వంటివాటిలో పాల్గొనడం ప్రారంభించారు.