నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తతతో జీవించడం
ఆరు సంవత్సరాల డేవిడ్‌కి రోజు మొత్తంలో కథలు వినే సమయమే చాలా ఇష్టం. వాడి తల్లి వాడికి చదివి వినిపిస్తున్నప్పుడు చాలా ఆనందిస్తాడు, తాను విన్నది జ్ఞాపకముంచుకోవడంలో వాడికి ఏ కష్టమూ లేదు. కానీ డేవిడ్‌కి ఒక సమస్య ఉంది. వాడు తనకు తానుగా చదవలేడు. నిజానికి, దృష్టి అవసరమయ్యే ఎటువంటి పనియైనా వాడికి బాధను కల్గిస్తుంది.
సారా అనే పాప స్కూలుకు వెళ్లడం మొదలుపెట్టి మూడు సంవత్సరాలయ్యింది, అయినా ఆమె వ్రాత చాలా వంకరటింకరగా ఉంటుంది. ఆమె వ్రాసే అక్షరాల ఆకృతి సరిగా ఉండదు, వాటిలో కొన్నింటిని ఆమె తిరగవేసి వ్రాస్తుంది. తన తలిదండ్రుల చింతను ఎక్కువచేసేదేమంటే సారా తన స్వంత పేరు వ్రాయడంలోనే కష్టాన్ని అనుభవించడం.
జాష్ టీనేజ్‌లో ఉన్న ఒక యౌవనుడు, స్కూలులో లెక్కలు తప్పించి మిగతా సబ్జెక్టులన్నీ బాగా చదువుతాడు. లెక్కలను గూర్చి ఆలోచిస్తేనే ఆయనకు తలతిరిగిపోతుంది. అంకెల్ని చూస్తే జాష్‌కు కోపం వస్తుంది, ఆయన తన లెక్కల హోమ్‌వర్కును చేయడానికి కూర్చున్నప్పుడు చాలా త్వరగా ఆయన మూడ్ పాడౌతుంది.
డేవిడ్, సారా, జాష్లకి ఏమయ్యింది? వాళ్లు కేవలం బద్ధకంగానూ, మొండిగానూ, బహుశ మానసికంగా మందులుగానూ ఉన్నారా? ఎంతమాత్రం కాదు. ఈ పిల్లలందరూ సాధారణ తెలివితేటలో లేదా అసాధారణమైన తెలివితేటలో గలవారే. అయినా, ఒక్కొక్కరిని నేర్చుకోవడానికి సంబంధించిన ఒక్కొక్క అశక్తత నిరోధిస్తోంది కూడానూ. డేవిడ్ డిస్లెక్జియాతో బాధపడుతున్నాడు, చదవడానికి సంబంధించిన అనేక సమస్యలకు ఆ పదం అన్వయింపబడుతుంది. సారా వ్రాయడంలో ఎదుర్కునే తీవ్రమైన కష్టాన్ని డిస్గ్రాఫియా అంటారు. గణితశాస్త్రంలోని మౌలిక భావనల్ని ఆకళింపు చేసుకోవడంలో జాష్కివున్న అశక్తత డిస్కాల్క్యులియా అని పిలువబడుతుంది. ఇవి నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తతల్లో కేవలం మూడు మాత్రమే. ఇంకా ఎన్నోవున్నాయి, అవన్నీ కలిసి అమెరికాలోని కనీసం 10 శాతంమంది పిల్లల్ని ప్రభావితం చేస్తున్నాయని కొంతమంది నిపుణులు అంచనా వేస్తున్నారు.
నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తతల నిర్వచనం
నిజమే, అప్పుడప్పుడు యౌవనుల్లో చాలామంది నేర్చుకోవడం అనేది సవాలుగా ఉన్నట్లు కనుగొంటారు. అయితే, సాధారణంగా వారికి నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తత ఒకటి ఉందని ఇది సూచించదు. దానికి బదులుగా, నేర్చుకోవడంలో పిల్లలందరికీ వివిధ సామర్థ్యాలూ, బలహీనతలూ ఉంటాయని చూపిస్తోంది అంతే. కొంతమందికి వినికిడి చాలా శక్తిమంతంగా ఉంటుంది; వారు వినడం ద్వారా సమాచారాన్ని చక్కగా గ్రహించగల్గుతారు. ఇతరులకు దృశ్యాలు చూడడం ఆనందకరంగా ఉంటుంది; వారు చదవడం ద్వారా బాగా నేర్చుకోగలరు. అయితే, స్కూల్లో విద్యార్థులందరూ ఒక తరగతిగదిలో ఒక్క గుంపుగా చేర్చబడతారు, మరి ఎటువంటి బోధనా పద్ధతిని ఉపయోగించినప్పటికీ అందరూ నేర్చుకుంటారని అపేక్షించబడుతుంది. అందువలన, నేర్చుకునే విషయంలో కొందరికి తప్పకుండా సమస్యలుంటాయి.
అయితే, కొంతమంది అధికారుల ప్రకారం, సామాన్యంగా ఉండే నేర్చుకోవడానికి సంబంధించిన సమస్యలకూ, నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తతలకూ తేడావుంది. నేర్చుకోవడానికి సంబంధించిన సమస్యల్ని ఓర్పుతోనూ, ప్రయత్నంతోనూ అధిగమించవచ్చని వివరించబడుతుంది. దానికి విరుద్ధంగా, నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తతలు మరింత లోతుగా పాతుకుపోయివుంటాయని చెప్పబడుతుంది. “నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తత ఉన్న పిల్లవాని మెదడు, కొన్ని రకాలైన మానసిక పనుల్ని గ్రహించడంలోనూ, ప్రక్రియలో పెట్టడంలోనూ, లేక గుర్తుంచుకోవడంలోనూ తప్పు పద్ధతిలో పనిచేస్తున్నట్లుగా అనిపిస్తోంది” అని డా. పాల్ వెండర్, డా. ఎస్తేర్ వెండర్లు వ్రాస్తున్నారు.a
అయినప్పటికీ, నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తత ఉండడమంటే పిల్లవాడు మనోవైకల్యం గలవాడని అర్థంకాదు. దీన్ని వివరించడానికి, పాల్ వెండర్, ఎస్తేర్ వెండర్లు సంగీత స్వరాల్లో భేదాల్ని గుర్తించలేని ప్రజలైన సంగీత-బధిరులతో ఒక సామ్యాన్ని చూపించారు. “సంగీత-బధిరులంటే మెదడుకు హానికల్గినవారు కాదు, వారి వినికిడిలో ఏ లోపమూ లేదు” అని పాల్ వెండర్, ఎస్తేర్ వెండర్లు వ్రాస్తున్నారు. “వారు బద్ధకం మూలాన, బోధన సరిగ్గా పొందకపోవడం మూలాన, లేక సరైన ప్రేరణ లేకపోవడం మూలాన సంగీత బధిరులుగా అయ్యారని ఎవరూ అనరు.” నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తత ఉన్నవారి విషయం కూడా అంతే అని వారు అంటున్నారు. తరచూ, వారికెదురయ్యే కష్టం నేర్చుకోవడంలోని ఒక్క అంశంపై కేంద్రీకరించబడివుంటుంది.
నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తతలు ఉన్న చాలామంది పిల్లలకు సాధారణ తెలివితేటలో లేదా అసాధారణమైన తెలివితేటలో ఎందుకు ఉంటాయో దీన్నిబట్టి అర్థమౌతుంది; నిజానికి, కొంతమందికి అసామాన్యమైన తెలివితేటలుంటాయి. పరస్పర విరుద్ధంగా ఉన్నట్లు కన్పించే ఈ వాస్తవం నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తత ఉండవచ్చని వైద్యులు అనుకునేందుకు దోహదపడుతుంది. నా పిల్లవాడు స్కూల్లో ఎందుకు కష్టాన్ని అనుభవిస్తున్నాడు? (ఆంగ్లం) అనే పుస్తకం ఇలా వివరిస్తుంది: “నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తత ఉన్న ఒక పిల్లవాడు, అపేక్షించబడుతున్న స్థాయికన్నా తన వయస్సుకూ, తన నిర్ధారిత ఐక్యూకూ రెండు లేక మూడు సంవత్సరాలు తక్కువ స్థాయిలో పనిచేస్తున్నాడు.” వేరే మాటల్లో చెప్పాలంటే, పిల్లవాడు తన తోటివారి స్థాయికి సమానంగా ఉండడంలో కష్టాన్ని అనుభవిస్తున్నాడనేదే కాదు అసలు సమస్య. బదులుగా, అతడు కనపర్చే నైపుణ్యం తన స్వంత సామర్థ్యానికే సమానమైనది కాదన్నదే అసలైన సమస్య.
అవసరమైన సహాయాన్ని అందించడం
నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తతవల్ల వచ్చే భావోద్రేక ప్రభావాలు తరచూ సమస్యను మరింత జటిలంచేస్తాయి. నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తత ఉన్న పిల్లలు స్కూలులో సరిగా చదవకపోతే వారి ఉపాధ్యాయులూ, తోటిపిల్లలూ, చివరికి బహుశ తమ స్వంత కుటుంబంలోని వారూ వారిని మొద్దులుగా పరిగణించవచ్చు. విషాదకరంగా, అటువంటి పిల్లల్లో చాలామంది తమ గురించి తాము ప్రతికూల అభిప్రాయాలు ఏర్పర్చుకుంటారు, ఇవి వారు పెరుగుతుండగా వారిలో ఆలాగే ఉండిపోగలవు. ఇది యుక్తమైన చింతే, ఎందుకంటే సాధారణంగా నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తతలు పోవు.b “నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తతలు అనేవి జీవితాంతం ఉండే అశక్తతలు” అని డా. లారీ బి. సిల్వర్ వ్రాస్తున్నాడు. “చదవడంలో, వ్రాయడంలో, గణితశాస్త్రంలో జోక్యంచేసుకునే అశక్తతలే క్రీడలూ, మరితర కార్యకలాపాలూ, కుటుంబజీవితమూ, స్నేహితులతో ఆహ్లాదకరమైన సంబంధాలూ వంటివాటిలో కూడా జోక్యంచేసుకుంటాయి.”
అందువలన, నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తతలు ఉన్న పిల్లలు తలిదండ్రుల సానుభూతిపూర్వకమైన మద్దతును పొందడం ప్రాముఖ్యం. “తమ తలిదండ్రులు తమకు బలమైన మద్దతునిస్తారని తెల్సిన పిల్లలకు, తాము ప్రతిభావంతులనే ఒక విధమైన భావాన్నీ, ఆత్మగౌరవాన్నీ పెంపొందించుకోవడానికి ఒక ఆధారముంటుంది” అని నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తత ఉన్న ఒక పిల్లవాడిని పెంచడం (ఆంగ్లం) అనే పుస్తకం అంటుంది.
కానీ మద్దతునిచ్చేవారిగా ఉండాలంటే, తలిదండ్రులు తమ స్వంత భావాలను మొదట పరీక్షించుకోవాలి. తమ పిల్లల పరిస్థితికి ఏదోవిధంగా తామే నిందార్హులన్నట్లు కొంతమంది తలిదండ్రులకు అపరాధ భావన కలుగుతుంది. ఇతరులు తమ ముందున్న సవాళ్లవలన ముంచెత్తబడుతున్నట్లుగా భావించి ఖంగారుపడతారు. ఈ రెండు ప్రతిక్రియలూ సహాయకరమైనవి కావు. అవి తలిదండ్రులను కదలకుండా కట్టిపడవేసినట్లుగా చేసి, పిల్లవాడు తనకు అవసరమైన సహాయాన్ని పొందకుండా వాడిని నిరోధిస్తాయి.
అందువలన నిపుణుడైన ఒక స్పెషలిస్టు మీ పిల్లవానికి నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తత ఉందని నిర్ధారిస్తే నిరాశ చెందవద్దు. నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తతలు ఉన్న పిల్లలకు నేర్చుకునే ఒకానొక నైపుణ్యంలో కాస్త అదనపు మద్దతు మాత్రమే అవసరమనేది గుర్తుంచుకోండి. మీ ప్రాంతంలో నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తతలు ఉన్న పిల్లలకొరకైన కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాటిని గురించి తెలుసుకోవడానికి సమయం వెచ్చించండి. అటువంటి పరిస్థితులతో వ్యవహరించడంలో చాలా స్కూళ్లు సంవత్సరాల క్రితంకంటే ఇప్పుడు ఎక్కువ సంసిద్ధంగా ఉన్నాయి.
మీ పిల్లవాడు ఏదైనా సాధించినప్పుడు, అది ఎంత చిన్నదైనప్పటికీ దానిగురించి మీరు వాణ్ణి మెచ్చుకోవాలని నిపుణులు నొక్కిచెబుతున్నారు. ప్రశంసించడంలో ఔదార్యాన్ని కనపర్చండి. అదే సమయంలో, క్రమశిక్షణను అలక్ష్యం చేయకండి. పిల్లలకు సరైన వ్యవస్థీకరణ అవసరం, మరి నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తతలు ఉన్న పిల్లల విషయంలో ఇది మరింత వాస్తవం. మీ పిల్లవానినుండి మీరు ఏమి ఆశిస్తున్నారో మీ పిల్లవానికి తెలియనియ్యండి, మీరు పెట్టిన ప్రమాణాలకు వాడు కట్టుబడివుండేలా చూడండి.
చివరిగా, మీ పరిస్థితిని వాస్తవికంగా దృష్టించేందుకు నేర్చుకోండి. నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తత ఉన్న ఒక పిల్లవాడిని పెంచడం అనే పుస్తకం దాన్నిలా దృష్టాంతపరుస్తుంది: “మీకిష్టమైన రెస్టారెంటుకు వెళ్లి తందూరీ చికెన్కొరకు ఆర్డరు ఇచ్చారని ఊహించుకోండి. వెయిటర్ ప్లేటును మీ ముందు పెట్టినప్పుడు అవి మటన్ ముక్కలు అని మీరు గ్రహిస్తారు. రెండూ రుచికరమైన వంటకాలే, కానీ మీరేమో తందూరీ చికెన్ కొరకు ఎదురుచూస్తూవున్నారు. చాలామంది తలిదండ్రులు తమ ఆలోచనలో మార్పు చేసుకోవలసి ఉంటుంది. మీరు మటన్ కొరకు సిద్ధపడివుండకపోవచ్చు, కానీ దాని రుచి అద్భుతంగా ఉందని మీరు కనుగొంటారు. ప్రత్యేక ఆవశ్యకతలున్న పిల్లలను పెంచుతున్నప్పుడూ విషయం అదే.”
[అధస్సూచీలు]
a జన్యుసంబంధమైన లేదా గర్భధారణ సమయంలో లెడ్ పాయిజనింగ్ జరగడమూ లేదా మాదకద్రవ్యాల, మద్యపానీయాల వినియోగమూ వంటి పర్యావరణ కారకాలు నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తతలకు కారణమౌతూవుండవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇప్పటికింకా కచ్చితమైన కారణం లేక కారణాలు తెలియరాలేదు.
b కొన్ని సందర్భాలలో, పిల్లలు తాత్కాలికంగావుండే నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తతలను కల్గివుంటారు ఎందుకంటే కొన్ని విషయాల్లో వారి అభివృద్ధి ఆలస్యమౌతుంది. అటువంటి లక్షణాలు పిల్లలు పెరిగి పెద్దవారవుతుండగా సకాలంలో పోతాయి.