కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g93 9/8 పేజీలు 23-25
  • నేనెందుకు అంగవైకల్యంతో బాధపడాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నేనెందుకు అంగవైకల్యంతో బాధపడాలి?
  • తేజరిల్లు!—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • వైకల్యత కల్గినవారి సమస్యలు
  • ఈ విషయంలో దేవుని ధృక్కోణం
  • ఇతరులతో విజయవంతంగా వ్యవహరించుట
  • నిరీక్షణ సమస్య పరిష్కారానికి సహాయం చేస్తుంది
  • నా అంగవైకల్యతను నేనెలా ఎదుర్కోగలను?
    తేజరిల్లు!—1993
  • నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తతతో జీవించడం
    తేజరిల్లు!—1997
  • ప్రపంచ వ్యాప్తముగా కుటుంబములను తయారుచేయుట ప్రేమ, క్రమశిక్షణ, మాదిరి మరియు ఆత్మీయ విలువలతో పెంచుట
    తేజరిల్లు!—1992
  • యౌవనస్థులారా, యెహోవాను సేవించాలనే కోరికను పెంపొందించుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
మరిన్ని
తేజరిల్లు!—1993
g93 9/8 పేజీలు 23-25

యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .

నేనెందుకు అంగవైకల్యంతో బాధపడాలి?

“ఒక స్నేహితుడు నన్ను సైకిలుపై తీసుకు వెళ్తుండగా, రోడ్డు మలుపుతిరిగే ప్రదేశంలో ఒక కారు వచ్చి మమ్మల్ని ఢీకొన్నప్పుడు, నేను ఐదేండ్ల వయస్సు కల్గియున్నానని” బెకీ జ్ఞాపకం చేసుకుంటున్నది. దాని ఫలితం? “కాలు విరిగి, తలకు గాయాలు గట్టిగా తగిలి బాధపడ్డాను. నేను జీవిస్తానని వైద్యులు అనుకోలేదు.” అయినప్పటికి, బెకీ జీవించింది, మరి ఈనాడు ఆమె ఒక 16ఏండ్ల ముద్దుగుమ్మ. అయిననూ, ఆ దుర్ఘటన దాని ప్రభావాన్ని చూపించింది. “అది నన్ను చాలా బలహీనం చేసింది” అని ఆమె అంటున్నది.

మెదడు పక్షవాతం (సెరిబ్రల్‌ పల్సి) అనే వ్యాధి ఫలితంగా, క్రేగ్‌ అను పేరుగల ఒక యౌవనుడు కూడ వికలాంగుడయ్యాడు. క్రేగ్‌ యిలా వివరిస్తున్నాడు, “మెదడు పక్షవాతం నా కండరాలు, నాడీవ్యవస్థలపై ప్రభావం చూపింది, నా మెదడు పంపే వార్తలకు నా కండరాలు సరిగా ప్రతిక్రియ చూపవు. తద్వారా, నేను నడచుటకు, మాట్లాడుటకు, నా శరీర సమతుల్యతను కాపాడుకొనడానికి ప్రయాసపడ్డాను. నేను ఇవన్నీ చేయగలను కాని అంత సులభంగా కాదు.”

మీరు కూడ అదేరకంగా ఏదో ఒక అంగ వైకల్యతను కల్గియున్నారా? ప్రపంచవ్యాప్తంగా, 2000సంవత్సరం వచ్చేసరికి, వైకల్యం గల యౌవనుల సంఖ్య 5.9కోట్లకు చేరుకుంటుందని గణాంకాలు చూపెడుతున్నాయి. (వరల్డ్‌ హెల్త్‌, జనవరి/ఫిబ్రవరి 1985) అయినను, మీరు యితర యౌవనుల వలెనే పరుగెత్తుటకు, దుముకుటకు, ఆట్లాడుటకు ఆశించి అలా చేయలేకపోతే, చాలామంది మీరు కల్గిన సమస్యనే కల్గియున్నారనే వాస్తవం కొంత ఓదార్పునిస్తుంది.

వైకల్యత కల్గినవారి సమస్యలు

అంగవైకల్యతలు అనేవి కొత్తేమికావు. బైబిలు కాలంలో కొందరు అవిటితనం (2 సమూయేలు 4:4; 9:13), గ్రుడ్డితనం (మార్కు 8:22), వికృత రూపాలతో బాధపడవలసివచ్చింది (మత్తయి 12:9). అలాంటి వైకల్యం కల్గినవారు జీవితంలో అతిచిన్న పనులు చేయడంలో తరచు బాధననుభవించేవారు.—ద్వితీయోపదేశకాండము 28:29; సామెతలు 26:7 పోల్చండి.

మీపైనున్న ప్రతిబంధకాలతో మీరు కూడ అదేరీతి పోరాటం కల్గియుండవచ్చును. దుస్తులు ధరించడానికి, భుజించడానికి, లేదా పాఠశాలకు వెళ్లడానికి గట్టి కృషి—మరియు ఇతరులనుండి తగినంత సహాయం అవసరం కావచ్చును. బెకీ యిలా చెబుతున్నది, “నా కుడిప్రక్క అవయవాలతో సరిగ్గా ఏపనీ చేయలేను, అందుకే నేను నా ఎడమచేతితో వ్రాయడం నేర్చుకోవాల్సివచ్చింది. నడవడం కూడ కష్టంగా ఉండేది. నేను ప్రస్తుతం సాధారణంగా మంచిగానే నడుస్తున్నాను, కాని కొన్ని రోజులు కుంటుకుంటూ నడిచేదాన్ని.” లేదా మఱుగుజ్జుతనంతో పీడించబడుతున్న ఒక యౌవనుడు ఎదుర్కున్న సమస్యలను పరిశీలించండి. అతను హాస్యంగా కాకుండా, యిలా చెబుతున్నాడు: “గోడపైనున్న లైట్‌ స్విచ్‌లను అందుకోవడం నాకు నిజంగా విసుగుపుట్టించేది . . . గృహాలు ఖచ్చితంగా పొడవున్న వారికొరకే నిర్మించబడ్డాయి.”—హవ్‌ యిట్‌ ఫీల్స్‌ టు లివ్‌ విత్‌ ఎ ఫిజికల్‌ డిజెబిలిటి, రచయిత జిల్‌ క్రిమెంజ్‌.

అయినను, మీకున్న దుఃఖపూరిత సమస్యలు ఇటువంటి భౌతికమైనవి కాకపోవచ్చును. పేరెంట్స్‌ పత్రిక యిలా వివరిస్తున్నది: “ప్రత్యేక అవసరతలతోనున్న యౌవనులకు జీవితాన్ని ప్రాముఖ్యంగా కష్టభరితం చేస్తూ, ఇతరుల ప్రతిక్రియలకు యౌవనులు చాలా పట్టింపు కల్గివుంటారు. . . . వారి ఆకారాన్ని గూర్చి ఇతరులేమని తలస్తారోనని ఆలోచిస్తారు, స్నేహితులనుండి వచ్చే వ్యాఖ్యానాలను తరుచూ నమ్మరు, అర్థవంతమైన ఈ భావసూచనలను జాలితో చేసిన అశుభ వ్యాఖ్యానాలుగా భావిస్తారు.” ఇతరులచేత అంగీకరించబడాలని కోరుకోవడం సహజమే. అయినా, మిమ్మల్ని దూరం చేస్తున్నట్లు మీరు భావించవచ్చును. యౌవనుడైన మిషెల్‌ చెబుతున్నట్లుగా: “నా జీవితమంతా నేను ఇతరులకు భిన్నంగా ఉంటున్నాను. కారణమేమంటే నాకు నా ఎడమచేయి లేదు.”

అంగవైకల్యంకల్గి ఉండడమనేది మిమ్మును నిరంతర వేధింపుకు లోనుచేస్తుంది. క్రేగ్‌ యిలా గుర్తుకు తెచ్చుకుంటున్నాడు, “నేను ప్రత్యేకమైన వికలాంగుల పాఠశాలలో 5వ తరగతికి వచ్చేవరకు చదువుకున్నాను. కాని 5వ తరగతిలో నేను మామూలు పాఠశాలకు వెళ్లడం ప్రారంభించాను. ఒకరోజు కొంతమంది బాలురు నన్ను చూసి నవ్వేంత వరకూ, నిజంగా నాకు ఎక్కువ సమస్యలు లేవు. నా నడకనుచూచి వారలా నవ్వడం జరిగింది.” బెకీ కూడ తన తోటివిద్యార్ధులు క్రూరంగా వ్యవహరించిన తీరు ఆమెకు బాధాకరమైన జ్ఞాపకాలుగా మిగిలినవి. ఎందుకంటే క్రితం జరిగిన శస్త్రచికిత్సలో ఆమె కంఠధ్వని దెబ్బతిన్నది, దాంతో ఆమె గొంతు కొద్దిగా గరగరమంటుంది. “పాఠశాలలో పిల్లలంతా నన్ను రాక్షసగొంతు అని పిలిచేవారు” అని ఆమె చెబుతున్నది.

పెద్దవాళ్లు కూడ అలాగే అనుచిత దురభిమానాన్ని ప్రదర్శిస్తారు. కొందరు మిమ్మును కంటితో కూడ చూడకపోవచ్చును. కొందరు మీరు అదృశ్యంగావున్నట్లు లేదా మానసికంగా వికలులైనట్టు—వారి కథనాలు మీ తలిదండ్రులతో లేదా మీ సహవాసులతోనే చెబుతూ, మీతో అసలు మాట్లాడకపోవచ్చును. శ్రేయోభిలాషులు తదేకంగా మిమ్మును జాలిగా పొగుడుచూ, మీరొక పాడైపోయిన వస్తువనే భావనలను మీలో కలుగజేయడం, వీటన్నింటికంటే అత్యంత విసుగు పుట్టించేదై యుండ వచ్చును.

ఈ విషయంలో దేవుని ధృక్కోణం

అయితే, దేవుడు మీ విషయమై ఎలా భావిస్తాడు? మీ వైకల్యత అనేది ఆయన అనంగీకారానికి ఏదో రకమైన సూచనా? యేసు “పుట్టు గ్రుడ్డియైన యొక మనుష్యుని” చూచినపుడు ఆయన ఏం చెప్పాడో గమనించండి. ఆయన శిష్యులు యిలా అడిగారు: “వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా?” యేసు యిలా సమాధానమిచ్చాడు: “వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు.” (యోహాను 9:1-3) గ్రుడ్డితనమనేది గ్రుడ్డివాడు, లేదా అతని తలిదండ్రులు చేసిన ఏదో విశేషమైన పాపానికి ఫలితంగా వచ్చిందికాదు. అయితే ఆదాము నుండి మనమంతా సంక్రమించుకున్న అపరిపూర్ణత ఫలితమే అది. అపొస్తలుడైన పౌలు యిలా వివరిస్తున్నాడు: “ఇట్లుండగా ఒక మనుష్యునిద్వారా పాపమును పాపముద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.”—రోమీయులు 5:12.

అయితే, అంగ వైకల్యములు దైవిక జోక్యం లేదా శిక్ష ఫలితంగా వచ్చినవికాదు. కొన్ని నిర్లక్ష్యం వల్ల ఏర్పడినవి. అయినా మరికొన్ని కేవలం “ముందుగా ఊహించకుండా, కాలవశము చేతనే” జరిగినవి. (ప్రసంగి 9:11) తమ తలిదండ్రులు కొట్టడంవల్ల లేదా నిర్లక్ష్యంవల్ల, అంగ వైకల్యంచేత బాధననుభవించే యౌవనులు కూడ ఉన్నారు.

మీ కష్టాలకు కారణమేమైనప్పటికి, దేవుడు మిమ్మును పాడైనవానిగా దృష్టిస్తాడని మీరు భావించనవసరం లేదు. అయితే ఆయన మిమ్మును విలువైన వ్యక్తులుగా, అమూల్యంగా పరిగణిస్తాడు, ప్రాముఖ్యంగా మీరు దైవభయంగలవారైతే. (లూకా 12:7) ఆయన వ్యక్తిగతంగా “మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు,” మిమ్మును ఆయన సేవలో ఉపయోగించుటకు ఎంతో ఆనందిస్తున్నాడు. (1 పేతురు 5:7) దేవుని సేవకులందరిలో ప్రాముఖ్యమైనవాడైన అపొస్తలుడైన పౌలు, “శరీరంలో ఒక ముల్లు” అనగా అంగ వైకల్యంతో బాధపడినట్లు కనబడుచున్నది. (2 కొరింథీయులు 12:7) “మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును” అని తెలిసికొనుట ఎంత ఓదార్పుకరమైనది. (1 సమూయేలు 16:7) మీ సామర్ధ్యత, ఆయన నూతన ప్రపంచంలో మీరు తిరిగి పరిపూర్ణతకు వచ్చినప్పుడు మీరు చేయగలిగేది ఆయనకు పూర్తిగా తెలుసు.—ప్రకటన 21:3, 4.

ఇతరులతో విజయవంతంగా వ్యవహరించుట

బహుశా, మీ తోటివిద్యార్ధులు, యితరులు ఉన్నతమైన దేవుని దృక్కోణంతో ఏకీభవించకపోవచ్చును. నిజమే, జనులు కొన్నిసమయాల్లో మొరటుగా, క్రూరంగా ఉంటారు. అయితే, మీ తోటిసహవాసులలో కొందరు, మీ బాధను గూర్చి అలాగే నిర్దయగా ఉంటారనుటలో ఆశ్చర్యపడవద్దు. అయినా, సాధారణంగా జనులు నొప్పించాలని, ఇబ్బంది పెట్టాలని నిజంగా భావించరు; కొన్ని సమయాల్లో వారు కేవలం తెలుసుకోవాలనే ఆరాటంతో ఉంటారు. మీ బాధను గూర్చిన ఆతురతతో లేదా బహుశా ఆలోచన లేకుండా, వారు నొప్పించే లేదా అవివేకమైనదేదో అనవచ్చును.

మీరేం చేయగలరు? కొన్నిసార్లు మీరు ఇబ్బందిపెట్టే పరిస్థితులను అడ్డుకోవచ్చును. ఉదాహరణకు, ఇతరులు ఉద్రిక్తంగానున్నారని, లేదా ఏం చెప్పాలో తెలియని స్థితిలో ఉండటం మీరు గ్రహిస్తే, వారిని మీరు ఆ కష్టంనుండి విడిపించుటకు ఒకవేళ ప్రయత్నించవచ్చును. మనమంతా మనకు అర్థంకాని వాటిగురించి భయపడతామనేది గుర్తించండి. మీ వైకల్యతకు సంబంధించిన గతాన్ని యితరులు తెలిసికొనుటకు సహాయపడండి, తద్వారా వారు మీ నిజత్వాన్ని తెలిసికోగలరు. పరిస్థితి దాన్ని ఆకట్టుకొనేదిగా కనబడితే, మీరొకవేళ యిలాంటిదేదైనా అనడానికి ప్రయత్నించవచ్చును: “వీల్‌చైర్‌ నేనెందుకు ఉపయోగించవలసి వచ్చిందని మీరు ఆలోచిస్తున్నారా?” పేరెంట్స్‌ పత్రిక ప్రకారంగా, అంగచ్ఛేదం గావింపబడ్డ ఒక ఉపాధ్యాయురాలు, సంభాషణ యిలా ప్రారంభిస్తూ, తన విద్యార్థుల ఆరాటాన్ని తృప్తిపరచింది: “ఏం జరిగిందా అని మీరు ఆలోచిస్తున్నారని నేననుకుంటున్నాను. మీరు తెలిసికొనడానికి యిష్టపడతారా?”

మీరు మంచి ప్రయత్నాలు చేసినప్పటికి, మీరింకా అప్పుడప్పుడు బాధపడతారు. యౌవనురాలైన బెకీ యిలా చెబుతున్నది: “నా చిన్నతనంలో, ఇతరులు నన్ను విసిగించినపుడు, నిజంగా నేను బాధపడేదాన్ని; నా జీవితమంతా నేను సున్నితంగానే వున్నాను. కాని ప్రస్తుతం నేను దాన్ని నన్ను బాధించడానికి అనుమతించను. కొన్నిసార్లు నేను పరిస్థితిని చూసి నవ్వుకుంటాను కూడ.” నిజమే, నొప్పించే వ్యాఖ్యానాలను ప్రక్కకు నెట్టుటకై నవ్వడం అనేది మంచిదే. “నవ్వుటకు” సమయం కలదు. (ప్రసంగి 3:4) రాజైన సొలొమోను యింకనూ ఈ సలహా యిచ్చాడు: “చెప్పుడు మాటలు లక్ష్యపెట్టకుము.” (ప్రసంగి 7:21) కొన్నిసార్లు అవివేకమైన మాటలను పట్టించుకోకుండా ఉండటమే మంచిది. “జనులు చెప్పేదాని గురించి బాధపడవద్దు” అని బెకీ చెబుతున్నది.

నిరీక్షణ సమస్య పరిష్కారానికి సహాయం చేస్తుంది

వాస్తవంగా, మానవజాతంతయు వైకల్యత కల్గివుంది. “సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచునున్నదని” బైబిలు చెబుతున్నది. (రోమీయులు 8:22) కాని మీరు భవిష్యత్తు కొరకు నిరీక్షణ పొందగలరు. ఉదాహరణకు, కారెల్‌ అని మేము పిలిచే ఒక యౌవన బాలికను తీసుకోండి. ఆమె వాస్తవంగా చెవిటిదై జన్మించింది. ఆ తర్వాత సైకిలు ప్రమాద ఫలితంగా ఆమె కాలునొకదానిని తీసివేశారు. కారెల్‌ చనిపోవాలని కోరుకుంది. కాని ఆమె యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం ప్రారంభించింది, ఒక నీతియుక్తమైన నూతన ప్రపంచం గూర్చి, దానిలో “నాకు దేహములో బాగులేదని అందులో నివసించువాడెవడును అనడు” అని నేర్చుకుంది. (యెషయా 33:24) నిజంగా, ఒకరోజు ఆమెకున్న వైకల్యత చమత్కారంగా బాగుచేయబడుతుందనే నిరీక్షణను పొందింది!—యెషయా 35:5, 6.

దేవుని గూర్చి నేర్చుకోవడమనేది కారెల్‌ స్వభావంపై ఏ ప్రభావం కల్గించింది? సన్నిహిత క్రైస్తవ స్నేహితులు కొందరు ఆమెను గూర్చి యిలా చెబుతున్నారు: “ఆమె ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది, ఆమె ఎప్పుడూ తన అంగవికలత గురించి ఆలోచించదు.” అయినను, వారు చెప్పేదింకను ఆసక్తికరంగా వుంది: “ఆమె అంత చెవిటిదని, ఆమె కృత్రిమ కాలు ఉపయోగిస్తుందని తన స్నేహితులలో చాలామంది గుర్తించరు.” ఎందుకు? “ఆమె పెదవుల కదలికలపై, వినికిడికి సంబంధించిన సాధనాలపై ఆధారపడుతుంది.” స్పష్టంగా, భవిష్యత్తును గూర్చిన నిరీక్షణకంటే కారెల్‌ ఎక్కువ చేసింది. మీరు కూడ అదేవిధంగా ఎలా చేయగలరో అనేదే ఈ థారావాహికలోని తరువాతి శీర్షికలోని అంశమైయుంది. (g93 5/22)

[24వ పేజీలోని చిత్రం]

వారు తమ పరిస్థితిని తెలిసికోవాలనే ఆరాటమున్న వారికి వివరించడమనేది సహాయకరంగా ఉన్నట్లు కొందరు కనుగొన్నారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి