అబద్ధ మతం దాని నాశనానికి చేరుకుంటోంది!
ఈ ప్రాపంచిక మతాలు తమ అంతానికి సమీపిస్తున్నాయేమో తెలుసుకునేందుకు, బైబిలులోని అత్యంత నాటకీయమైన ఒక ప్రవచనాన్ని మనం ఇప్పుడు స్పష్టంగా పరిశీలిద్దాం. అది బైబిలు చివరి పుస్తకమైన ప్రకటనలో వర్ణించబడిన మర్మపూరితమైన సూచనార్థక స్త్రీని గురించినది.
చరిత్రంతటిలో కోట్లాదిమంది ప్రజలను ప్రభావితం చేస్తూ ఊదా మరియు రక్త వర్ణంగల వస్త్రాలలో విపరీతంగా ముస్తాబై, బంగారము వెలగల రత్నాలు మరియు ముత్యాలను మెండుగా ధరించి, రాజ్యాలపై రాణిగా పరిపాలించిన స్త్రీని మీరు ఊహించుకోగలరా? ఆమె నొసటిపై ఒక పెద్ద పేరు వ్రాసి ఉంది, ఒక మర్మం: “వేశ్యలకును భూమిలోని ఏహ్యమైనవాటికిని తల్లియైన మహా బబులోను.” ఈ లోక పరిపాలకులతో “వ్యభిచరించి” ఆమె తన విచ్చలవిడియైన, నీచమైన జీవిత విధానాన్నిబట్టి తిరుగులేని రీతిలో గుర్తించబడుతుంది. ఆమె పాపాలు ఆకాశాన్నంటుతున్నాయి. విపరీతమైన ఏడు తలల, పది కొమ్ముల రక్తవర్ణంగల క్రూరమృగంపై ఆమె స్వారీ చేస్తుంది.—ప్రకటన 17:1-6; 18:5.
ఒకవేళ మీరు ఈ స్త్రీని ఊహించుకోగల్గితే, యేసు యొక్క అపొస్తలుడైన యోహానుకు దేవదూత ద్వారా ఇవ్వబడిన దర్శనంలోని ముఖ్య పాత్రను గురించి మీరు కొంత తెలుసుకుంటారు. ప్రకటన 17 మరియు 18 అధ్యాయాల్లో ఆయన దాన్ని విపులంగా వివరించాడు. మీ స్వంత బైబిలులో ఈ అధ్యాయాలను చదవండి. ఈ మర్మపూరితమైన స్త్రీ యొక్క గుర్తింపును వెల్లడి చేయడం నుండి ఆమె మరణకర అంతం వరకూ ఉన్న స్థాయిలను మీరు గమనించగల్గుతారు.
వేశ్యను గుర్తించడం
ఆమె ఎవరో అర్థం చేసుకునేందుకు ఆచూకీ, వేశ్య రాణి సూచనార్థకంగా కూర్చునే రెండు విషయాలలో కనుగొనబడుతుంది. ప్రకటన 17:18 నందు ఆమె ‘భూరాజులనేలు మహాపట్టణము’ అని వర్ణింపబడుతుంది. ప్రకటన 17:1, 15 నందు చూపబడిన విధంగా “ప్రజలను, జనసమూహములను, జనములను, ఆ యా భాషలు మాటలాడు” వారిని సూచించే “విస్తార జలములమీద” ఆమె కూర్చునేందుకు అది ఆమెకు వీలు కలిగిస్తుంది. అదే అధ్యాయంలోని మూడవ వచనం ప్రకారం, ఆమె ఏడు తలల క్రూరమృగంపై కూర్చుని ఉంది, బైబిలులో మృగాలు సాధారణంగా ప్రపంచ రాజకీయ శక్తులకు లేక సంస్థలకు చిహ్నాలుగా వాడబడ్డాయి.
వేశ్యయైన మహాబబులోను ఇతర అధికారాలపై మరియు వాటికి లోబడే వారిపై ఆధిపత్యం చేసే ఉన్నతపర్చుకున్న సామ్రాజ్యం యొక్క ప్రతిరూపమని ఇది సూచిస్తుంది. ఇది ప్రపంచ అబద్ధ మతాల సామ్రాజ్యమే అయ్యుంటుంది.
ప్రభుత్వ విధానం మరియు రాజకీయాల విషయాల్లో మత నాయకుల ప్రభావం చరిత్రలో ఎంతో ఖ్యాతి గాంచింది. ది వరల్డ్ బుక్ ఎన్‌సైక్లోపీడియా ఇలా పేర్కొంటుంది: “పశ్చిమ రోమా సామ్రాజ్యం [5వ శతాబ్దం] పతనమైన తర్వాత, యూరప్‌లో మరేయితర వ్యక్తికంటే పోప్‌కు ఎక్కువ అధికారం ఉండేది. . . . పోప్ రాజకీయ మరియు ఆత్మీయ అధికారాన్ని చెలాయించాడు. 800లో పోప్ లియో III జర్మనీకి చెందిన పరిపాలకుడైన చార్ల్‌మాగ్నేను [చార్లెస్ ద గ్రేట్] రోమన్లపై చక్రవర్తిగా చేశాడు. . . . ఒక చక్రవర్తి అధికారాన్ని చట్టబద్ధం చేయడానికి పోప్‌నకుగల హక్కును లియో III స్థాపించాడు.”
కాథోలిక్ చర్చి మరియు దాని “రాకుమారులు” పరిపాలకులపై చెలాయించిన అధికారం ఎట్టిదో కార్డినల్ థోమాస్ వోల్‌సే (1475?-1530) ద్వారా ఇంకా సోదాహరణగా చూపబడింది. “ఇంగ్లాండులో అనేక సంవత్సరాలు అత్యధిక అధికారాన్ని కలిగిన వ్యక్తిగా” అతను వర్ణింపబడ్డాడు. రాజైన హెన్రీ VIII పరిపాలన క్రింద అతడు, “అనతి కాలంలోనే ప్రభుత్వ వ్యవహారాలన్నింటిని అదుపు చేసే వ్యక్తి అయ్యాడు. . . . అతడు రాజ వైభవంతో జీవించాడు, అధికారంలో ఉండి బాగా ఆనందించాడు.” ఆ సర్వసంగ్రహ నిఘంటువు యొక్క వృత్తాంతం ఇలా కొనసాగుతుంది: “కార్డినల్ వోల్‌సే రాజనీతివేత్త మరియు పాలకునిగా తనకున్న గొప్ప సామర్థ్యాలను ప్రధానంగా హెన్రీ VIII కొరకు ఇంగ్లాండు విదేశీ వ్యవహారాలను నిర్వహించడంలో వెచ్చించాడు.”
ప్రభుత్వపు లౌకిక విషయాల్లో కాథోలిక్ అధికారానికి మరొక ఉత్కృష్టమైన ఉదాహరణ ఫ్రాన్సుకు చెందిన కార్డినల్ రిషల్యూ (1585-1642), అతను “18 సంవత్సరాలకంటే ఎక్కువ కాలం . . . ఫ్రాన్స్‌ను తానే పరిపాలించాడు.” ముందు ఉదాహరింపబడిన మూలం ఇలా పేర్కొంటుంది: “అతను అమిత అత్యాశపరుడు, త్వరలోనే ఉన్నత అధికారం కొరకు తహతహలాడిపోయాడు.” అతను 1622లో కార్డినల్ అయ్యాడు “అనతి కాలంలోనే అతడు ఫ్రెంచ్ ప్రభుత్వంలో ప్రముఖుడయ్యాడు.” అతను యుద్ధ శూరుడని అర్థమౌతుంది, ఎందుకంటే “లా రషెల్‌పై ఆక్రమణ చేసేటప్పుడు రాజ్య సైన్యానికి అతనే స్వయంగా నాయకత్వం వహించాడు.” “రిషల్యూకి విదేశీ వ్యవహారాల్లో అత్యంత గొప్ప ఆసక్తి ఉండేదని” ఆ శీర్షిక చెబుతుంది.
విదేశీ దౌత్యవేత్తలు తమ యోగ్యతాపత్రాలను సార్వభౌమ పోప్‌కు అందించారనే ప్రకటనలు వాటికన్ వార్తాపత్రికైన లాస్సేర్‌వాటోరే రోమానోలో ఎడతెగక ప్రచురించబడుటనుబట్టి రాజకీయ అధికారాలతో వాటికన్‌కున్న ఎడతెగని జోక్యం స్పష్టంగా కన్పిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ మరియు దౌత్య సంబంధమైన వ్యవహారాలను గురించి పోప్‌కు ఎప్పటికప్పుడు తెలియజేసే నమ్మకమైన కాథోలిక్‌ల వర్గం వాటికన్‌కు ఉంది.
ఈ లోక రాజకీయ విషయాల్లో, క్రైస్తవ మత సామ్రాజ్యానికి చెందిన, దానికి చెందని మత నాయకుల శక్తివంతమైన పలుకుబడిని గురించి తెల్పేందుకు అనేకానేక ఉదాహరణలను ఇవ్వవచ్చు. సూచనార్థక వేశ్య (‘ప్రజలకు, జనసమూహములకు, దేశాలకు’ ప్రాతినిధ్యం వహించేది) ‘విస్తార జలములు’ అన్నిటి మీద మరియు (అన్ని రాజకీయ ప్రపంచ శక్తులకు ప్రాతినిధ్యం వహించే) క్రూరమృగం మీద కూర్చుందన్న వాస్తవం, ప్రజలు, జనసమూహములు మరియు శక్తులపై దాని ప్రభావం కేవలం రాజకీయ ఆధిపత్యం కంటే ఎంతో విభిన్నమైన, ఉన్నతమైన రీతిలో ఉంటుందనే విషయాన్ని సూచిస్తుంది. ఇది ఏ విధమైనదో ఇప్పుడు చూద్దాం.
ఆమె నొసటిపై ఉన్న పొడవైన పేరులో కొంతభాగం “మహాబబులోను.” దాదాపు 4,000 సంవత్సరాల పూర్వం, సత్య దేవుడైన ‘యెహోవాకు’ విరోధంగా వచ్చిన నిమ్రోదు స్థాపించిన ప్రాచీన బబులోనును అది సూచిస్తుంది. (ఆదికాండము 10:8-10) ఆమె ఈ పేరును ధరించడం, ప్రాచీన బబులోను కలిగి ఉన్న అవే అభిముఖాలకు సంబంధించిన శ్లాఘనీయ ప్రతిష్ఠను సూచిస్తుంది. ఏ అభిముఖాలు? ప్రాచీన బబులోను మర్మపూరితమైన మతం, నీచమైన ఆచారాలు, విగ్రహారాధన, ఇంద్రజాలము, జ్యోతిశ్శాస్త్రం మరియు మూఢనమ్మకాలతో నిండిపోయి ఉంది, ఇవన్నీ కూడా యెహోవా వాక్యం చేత ఖండింపబడ్డాయి.
సా.శ.పూ. 18వ శతాబ్దంలో మర్దుక్ “దాదాపు 1300 దేవతల సమూహమైన సుమేరియన్-అక్కాద్ యొక్క అధిపతిగా, బబులోను నగర దేవునిగా నియమింపబడ్డాడు. అది మతపరమైన ఆచారాలను అన్నింటినీ ఒక వ్యవస్థ క్రిందకు తెచ్చింది. . . . ఆది. 11:1-9లో బబులోనులోని గొప్ప ఆలయ నిర్మాణ పనితనం, పరలోకంపై ఆధిపత్యం చేయాలని కోరుకునే మానవ అహం యొక్క వ్యక్తీకరణ అని నిందింపబడుతుంది” అని ది న్యూ ఇంటర్నేషనల్ డిక్షనరీ ఆఫ్ న్యూ టెస్టమెంట్ థియాలజీ చెబుతుంది.
అలా, ప్రాచీన బబులోను అబద్ధ మతానికి ముఖ్య కేంద్రం అయ్యింది, కొంత కాలానికి అది యావత్ ప్రపంచాన్నే కలుషితం చేసింది. బబులోను సంబంధమైన మతపరమైన అలవాట్లు, సిద్ధాంతాలు, ఆచారాలు మరియు చిహ్నాలు భూమి నలుదిక్కులకూ విస్తరించాయి మరియు ప్రపంచం యొక్క అనేక వేల మతాల కలగూర గంపలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజకీయ రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు ఏలి కూలాయి, అయితే బబులోను సంబంధమైన మతం వాటినన్నిటినీ తట్టుకుని నిలిచింది.
నాశనం అంత సమీపంలో ఎందుకు ఉంది?
ఈ పత్రిక యొక్క మునుపటి సంచికల్లో తరచుగా వివరించిన విధంగా, మనం ఇప్పుడు “ఈ యుగసమాప్తి”లో జీవిస్తున్నామని బైబిలు ప్రవచనం మరియు 1914 నుండి సంభవించిన ప్రపంచాన్ని కుదిపే సంఘటనలు పొరబడకుండా సూచిస్తున్నాయి. (మత్తయి 24:3) అంటే క్రూరమృగం వంటి ప్రపంచ వ్యవస్థ యొక్క అలాగే వేశ్య ఇప్పుడు స్వారీ చేస్తున్న పది కొమ్ముల “ఎఱ్ఱని క్రూర మృగము” యొక్క అంతం త్వరగా సమీపిస్తుందని అర్థము. (ప్రకటన 17:3) ఈ మృగం భూమిపైనున్న దాదాపు అన్ని దేశాల రాజకీయ కూటమిని అంటే ఐక్యరాజ్యసమితిని సూచిస్తుందనే దానికి రుజువులు ఉన్నాయి. ప్రవచింపబడిన అంతం అంటే మానవజాతిని పరిపాలిస్తున్న విభాగిత, దైవరహిత రాజకీయ పరిపాలన నిర్మూలింపబడటం అని అర్థం. అయితే మృగంపై స్వారీ చేస్తున్న వేశ్య రాణి సంగతేమిటి?
దేవుని దూత ఇలా వివరిస్తున్నాడు: “నీవు ఆ పది కొమ్ములుగల ఆ మృగమును చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించి, దానిని దిక్కులేనిదానిగాను దిగంబరిగాను చేసి, దాని మాంసము భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు. దేవుని మాటలు నెరవేరువరకు వారు ఏకాభిప్రాయముగలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుటవలన తన సంకల్పము కొనసాగించునట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను.”—ప్రకటన 17:16, 17.
రాజకీయ క్రూరమృగం నాశనం అయ్యేందుకు కొంచెంముందు అది తనపై స్వారీ చేసే స్త్రీని ద్వేషించి ఆమెకు ఎదురు తిరుగుతుందని ఆ ప్రవచనం చూపుతుంది. ఎందుకు? తమ పరిధుల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంఘటిత మతం వలన తమ బలానికి మరియు అధికారానికి ముప్పు వాటిల్లనున్నదని పాలకులు మరియు ప్రభుత్వాలు భావిస్తాయన్నది స్పష్టం. అకస్మాత్తుగా, ఒక ప్రేరణాత్మక శక్తి ద్వారా పురికొల్పబడి, వ్యభిచార సంబంధమైన, రక్తాపరాధియైన ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యంపై ఆయన తీర్పులను అమలు చేయడం ద్వారా వారు దేవుని “సంకల్పము”ను, ఆయన నిర్ణయాన్ని నెరవేర్చుతారు.a—యిర్మీయా 7:8-11, 34 పోల్చండి.
ఈ ప్రపంచ అబద్ధ మతాలు ఇంకా పటిష్ఠంగా మరియు ప్రభావవంతంగా ఉన్నట్లు అనిపిస్తున్నప్పుడే వాటి అంతం వస్తుంది. అవును, ఆ వేశ్య నాశనమయ్యేందుకు కొంచెంముందు, “నేను రాణినిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనే చూడ”ను అని అది తన మనస్సులో ఇంకా అనుకుంటూ ఉంటుందని ప్రవచనం చూపుతుంది. (ప్రకటన 18:7) అయితే, దాని నాశనం దాని కోట్ల కొలది పౌరులకు ఒక ఆశ్చర్యకర సంఘటనవలె సంభవిస్తుంది. అది మానవ చరిత్రలోని అత్యంత అనూహ్యమైన మరియు విపత్కరమైన సంఘటనయై ఉంటుంది.
ప్రాచీన బబులోను బహిర్గతమైనప్పటినుండి, వాటి నాయకులు మరియు మద్దతుదారులు; వాటి సిద్ధాంతాలు, ఆచారాలు మరియు అలవాట్లు; వాటికున్న అనేక ప్రభావవంతమైన ఆరాధనా కట్టడాలు; వాటి మితిలేని సంపద ద్వారా అబద్ధ మతాలు మానవజాతిపై విపరీతమైన ప్రభావాన్ని చూపించాయి. అవి ఎంతమాత్రం గమనింపబడకుండా అదృశ్యమవ్వవు. కాబట్టి, “ఒక్క దినముననే దాని తెగుళ్లు, అనగా మరణమును దుఃఖమును కరవును వచ్చును; దానికి తీర్పుతీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్నిచేత బొత్తిగా కాల్చివేయబడును” అని ప్రకటించేటప్పుడు, ఆ తీర్పు వర్తమానాన్ని అందించే బాధ్యత అప్పగింపబడిన దేవదూత నిర్మొహమాటంగా మాట్లాడతాడు. కాబట్టి మహాబబులోను యొక్క నాశనం అకస్మాత్తుగా వస్తుంది మరియు “ఒక్క దినమున” అన్నట్టు అది చాలా త్వరగా గతిస్తుంది.—ప్రకటన 18:8; యెషయా 47:8, 9, 11.
ఏ మతమైనా మిగిలి ఉంటుందా, ఒకవేళ ఉంటే ఏ మతం మరియు ఎందుకు? ప్రవచనం ఏమి చూపుతుంది? అనే ప్రశ్నలు తలెత్తేందుకు దేవదూత యొక్క శక్తివంతమైన మాటలు దారి తీస్తాయి, ఈ విషయం తదుపరి శీర్షికలో చర్చించబడుతుంది.
[అధస్సూచి]
a ఈ ప్రవచనాల సవివరమైన పరిశీలన కొరకు, వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించిన ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది!, 33వ అధ్యాయం చూడండి.
[6వ పేజీలోని బాక్సు]
ఆఫ్రికాలో క్రైస్తవమత సామ్రాజ్యం యొక్క రక్తాపరాధం
“భూమిమీద వధింపబడిన వారందరి యొక్క” రక్తము మహాబబులోనులో కనుగొనబడిందని ప్రకటన 18:24 నందు బైబిలు చెబుతుంది. మతపరమైన విభేదాల మూలంగా మరియు వాటిని తొలగించడంలో మత నాయకుల వైఫల్యం మూలంగా జరిగిన యుద్ధాల గురించి ఆలోచించండి. దీనికిగల ఇటీవలి ఉదాహరణ రువాండాలోని జాతి విధ్వంసకాండ, అందులో 5,00,000 మంది ప్రజలు హత్యగావించబడ్డారు, వారిలో మూడొంతులు పిల్లలే.
కెనడా దేశ రచయితయైన హ్యూ ముక్యూలమ్ రువాండా నుండి ఇలా నివేదిస్తున్నాడు: “నైతిక నాయకత్వాన్ని అందించడంలో చర్చి వైఫల్యం విచిత్రమైనదని [రువాండా నందలి] కిగాలిలోని ఒక హుటు ప్రీస్టు అంటున్నాడు. రువాండా సమాజంలో బిషప్పుల స్థానం ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉండవలసినది. ఆ హత్యాకాండ ప్రారంభమయ్యేందుకు ఎంతో ముందే రాబోయే వినాశనాన్ని గురించి వారికి తెలుసు. జాతి విధ్వంసకాండను నివారించగలిగే ప్రభావవంతమైన వర్తమానాన్ని వినగల అవకాశాన్ని చర్చి ప్రసంగవేదికలు ప్రజలందరికీ అందించగలిగేవి. దానికి బదులు, నాయకులు మౌనం వహించారు.”
1994లో నీచమైన హత్యాకాండ ముగిసిన తర్వాత, ఒక చర్చి పెద్ద అయిన జస్టిన్ హకీజిమానా కిగాలీలోని ఒక ప్రెస్బటేరియన్ చర్చిలో జరిగిన ఒక చిన్న కూటంలో ఇలా చెప్పాడు: “హబ్యారిమానా [రువాండా అధ్యక్షుడు] రాజకీయాలతో చర్చి చేతులు కలిపింది. మేము కూడా అవినీతిపరులమే గనుక జరుగుతున్న దాన్ని మేము ఖండించలేదు. మన చర్చీల్లోని వారెవరూ ప్రత్యేకంగా కాథోలిక్‌లు ఆ హత్యాకాండను ఖండించలేదు.”
జాతి విధ్వంసకాండ తర్వాత రువాండాలో జరిగిన మరొక కూటంలో చర్చి పాస్టర్ అయిన ఏరాన్ ముగెమేర ఇలా అన్నాడు: “చర్చి పరిస్థితి సిగ్గుకరమైనది. . . . ఇక్కడ 1959 నుండి హత్యలు జరుగుతున్నాయి. వాటిని ఎవ్వరూ ఖండించలేదు. . . . మేము భయపడ్డాము గనుక, మేము హాయిగానే ఉన్నాము గనుక మేము వాటిని గురించి పైకి మాట్లాడలేదు.”
[7వ పేజీలోని చిత్రం]
ఈ “వేశ్య” సర్వజగత్తును ప్రభావితం చేస్తుంది
[క్రెడిట్ లైను]
Globe: Mountain High Maps® Copyright © 1995 Digital Wisdom, Inc.