త్వరలో మతాలకు ఏం జరుగుతుంది?—బైబిలు ఏం చెప్తుంది?
మీకు మతం మీద నమ్మకం పోయిందా? మతం అంటేనే విసిగిపోయారా? మతం వల్ల కొంతవరకు మంచి జరిగినా, ఎక్కువ శాతం నష్టమే జరిగింది. ఎన్సైక్లోపీడియా ఆఫ్ రిలీజియన్ అండ్ వార్ ఇలా చెప్తుంది, “ఇప్పటివరకు జరిగిన ఘోరమైన యుద్ధాల్లో కొన్నిటికి కారణం మత నమ్మకాలు కలవకపోవడమే అని చరిత్ర చూపిస్తుంది.” మతనాయకులు దేవున్ని ఆరాధించాల్సింది పోయి, మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాల్లో తలదూరుస్తున్నారు. అంతేకాదు తోటి మతనాయకుల్ని వెనకేసుకొస్తూ వాళ్లు చేసిన లైంగిక వేధింపుల్ని, ఆర్థిక మోసాల్ని కప్పిపుచ్చుతున్నారు.
మతం మీద మీకే చిరాకు పుడుతుంటే, దేవునికి ఎలా అనిపిస్తుండవచ్చు? చాలా మతాలు చేసే పనుల్ని దేవుడు అస్సలు ఇష్టపడడం లేదని బైబిలు చెప్తుంది. అంతేకాదు ఈ విషయంలో ఆయన ఏం చేస్తాడో కూడా బైబిలు చెప్తుంది. ప్రపంచంలో ఉన్న మతాలన్నిటి మీద దేవుడు త్వరలో కనీ వినీ ఎరగని విధంగా చర్య తీసుకుంటాడని బైబిలు సూచనలతో వివరిస్తుంది.
రాబోయే రోజుల్లో మతాలకు ఏం జరుగుతుందని బైబిలు చెప్తుంది?
ప్రవచనం: బైబిల్లో ప్రకటన అనే పుస్తకం, మహాబబులోను అనే వేశ్య గురించి చెప్తుంది. ఆ వేశ్య ఎర్రని క్రూర మృగం మీద కూర్చుని ఉంటుంది. కానీ కొంతకాలం తర్వాత, ఆ మృగం తిరగబడి ఆమెను చంపేస్తుంది.—ప్రకటన 17:3, 5, 16.
అంటే: మహాబబులోను అనే వేశ్య అబద్ధ మతానికి సూచనగా ఉంది. దేవునికి ఇష్టంలేని మతాలన్నీ అబద్ధ మతం కిందికే వస్తాయి.a ఎర్రని క్రూరమృగం ఐక్యరాజ్య సమితికి (UN) సూచనగా ఉంది.b ఈ వేశ్య ఎర్రని క్రూరమృగం మీద కూర్చుని ఉంది అంటే అబద్ధ మతం, ఐక్యరాజ్య సమితిని తన చెప్పుచేతల్లో పెట్టుకుందని అర్థం. అలాగే మృగం వేశ్యను చంపేస్తుందంటే ఐక్యరాజ్య సమితి, దానికి మద్దతిచ్చే దేశాలు ఈ లోకంలో ఉన్న అబద్ధ మతాలన్నిటిపై తిరగబడి పూర్తిగా నాశనం చేస్తాయి. అది చూసి లోకమంతా అవాక్కైపోతుంది.
అబద్ధ మతం ఎలా నాశనం అవుతుంది?
ప్రవచనం: “నువ్వు చూసిన ఆ పది కొమ్ములు, అలాగే ఆ క్రూరమృగం ఈ వేశ్యను ద్వేషించి, ఆమెను కొల్లగొట్టి, . . . అగ్నితో ఆమెను పూర్తిగా కాల్చివేస్తాయి. ఎందుకంటే తాను అనుకున్నట్టు జరగాలని దేవుడే తన ఆలోచనను వాళ్లలో [ప్రపంచ నాయకుల మనసుల్లో] పెట్టాడు. వాళ్లందరికీ ఒకే ఆలోచన ఉంది. దేవుని మాటలు నెరవేరేవరకు తమ రాజ్యాన్ని క్రూరమృగానికి ఇవ్వాలన్నదే ఆ ఆలోచన. . . . ఒక్క రోజులోనే ఆమె మీదికి తెగుళ్లు, అంటే మరణం, దుఃఖం, కరువు వస్తాయి. ఆమె అగ్నితో పూర్తిగా కాల్చేయబడుతుంది. ఎందుకంటే, ఆమెకు తీర్పు తీర్చిన యెహోవాc దేవుడు శక్తిమంతుడు.”—ప్రకటన 17:16, 17; 18:8.
అంటే: దేవుడు “తన ఆలోచనను” దేశదేశాల నాయకుల మనసుల్లో నాటుతాడు. “తమ రాజ్యాన్ని” అంటే తమ అధికారాన్ని ఐక్యరాజ్య సమితికి ఇచ్చేయాలనే ఆలోచన దేవుడు వాళ్ల మనసుల్లో పుట్టిస్తాడు. దాంతో ఐక్యరాజ్య సమితి బలం పుంజుకుని, ప్రపంచంలో ఉన్న అబద్ధ మతాలన్నిటినీ నాశనం చేస్తుంది. ఇదంతా ఎంత వేగంగా, అనుకోకుండా జరుగుతుందంటే “ఒక్క రోజులోనే” అయిపోయినట్టు ప్రజలంతా నోరెళ్లబెడతారు.—ప్రకటన 18:21.
అబద్ధ మతం ఎందుకు నాశనం అవుతుంది?
ప్రవచనం: “ఆమె పాపాలు ఆకాశాన్నంటాయి. ఆమె చేసిన అన్యాయాల్ని దేవుడు గుర్తుచేసుకున్నాడు.”—ప్రకటన 18:5.
అంటే: ఎన్నో వందల సంవత్సరాల నుండి అబద్ధ మతం దేవునికి ఇష్టంలేని చాలా చెడ్డ పనుల్ని చేస్తూ ఉంది. దేవుడు ఆమెను ఎందుకు నాశనం చేస్తాడో తెలుసుకోవడానికి ‘ఆమె చేసిన పాపాల్లో’ కొన్నిటిని ఇప్పుడు చూద్దాం:
రాజకీయాల్లో తలదూర్చడం. యేసుక్రీస్తు తన శిష్యులకు రాజకీయాల్లో తలదూర్చొద్దని చెప్పాడు. దానికి బదులుగా, దేవుని రాజ్యం మీద అంటే మనుషుల ప్రభుత్వాల స్థానంలో వచ్చే పరలోక ప్రభుత్వం మీద ఆశ పెట్టుకోమని చెప్పాడు.d (దానియేలు 2:44; మత్తయి 6:9, 10; యోహాను 6:15; 18:36) కానీ యేసు చెప్పినదానికి, అబద్ధమతం చేసినదానికి అసలు పొంతనే లేదు. దేవునికి నమ్మకంగా ఉండాల్సిందిపోయి ఆమె రాజకీయాలతో పొత్తుపెట్టుకుంది. అందుకే ఆమె “లైంగిక పాపాన్ని” చేసిందని ప్రకటన పుస్తకంలో ఉన్న ప్రవచనం చెప్తుంది. బైబిలు ఆమెను “గొప్ప వేశ్య” అని పిలవడంలో ఏ తప్పూ లేదు.—ప్రకటన 17:1, 2; యాకోబు 4:4.
హింస. “భూమ్మీద దారుణంగా చంపబడిన వాళ్లందరి” హత్యలకు అబద్ధ మతం కారణమని బైబిలు చెప్తుంది. (ప్రకటన 18:24) చాలా మతాలు ప్రజలకు శాంతిగా ఉండమని చెప్పే బదులు యుద్ధాల్ని ప్రోత్సహించాయి, ఉగ్రవాద దాడుల్ని ఉసిగొల్పాయి.
అత్యాశ. అబద్ధ మతం సిగ్గులేకుండా “ఎన్నో సుఖభోగాలు అనుభవించింది.” (ప్రకటన 17:4; 18:7) చాలా మతాలు అడ్డదారిలో వెళ్తూ, తమ పలుకుబడిని ఉపయోగించి లెక్కలేనంత ఆస్తిపాస్తుల్ని సంపాదించుకున్నాయి. అలాంటి అత్యాశ దేవునికి అస్సలు నచ్చదు.—తీతు 1:7.
అబద్ధాలు. అబద్ధ మతం చెప్పే విషయాలు, చేసే పనులు బైబిల్లో ఉన్న సత్యాలకు పూర్తి వ్యతిరేకం.e ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ, దేవునికి చెడ్డ పేరు తెస్తున్న చాలా బోధలకు, ఆచారాలకు అబద్ధ మతమే మూలం కాబట్టి ఆమె “భూమ్మీదున్న అసహ్యమైన వాటికి తల్లి” అని ప్రవచనం చెప్తుంది.—ప్రకటన 17:5; 18:23.
అన్ని మతాలు నాశనం అవుతాయా?
లేదు. ప్రకటన పుస్తకం ఒక “గొప్పసమూహం” గురించి చెప్తుంది. అందులో అన్ని దేశాల నుండి వచ్చిన ప్రజలు ఉన్నారు. (ప్రకటన 7:9) ఈ గొప్పసమూహంలోని “వాళ్లు తెల్లని వస్త్రాలు వేసుకొని,” ఉన్నారు అంటే వాళ్లు దేవుని ప్రమాణాల ప్రకారం ఆయన్ని నమ్మకంగా ఆరాధిస్తున్నారు. వాళ్లు “మహాశ్రమను” అంటే అబద్ధ మతం అలాగే దేవుని శత్రువులు నాశనమయ్యే కాలాన్ని తప్పించుకుంటారు. (ప్రకటన 7:13, 14; 19:11, 19-21) తెల్లని వస్త్రాలు వేసుకుని ఉన్న గొప్పసమూహంలోని ప్రజలు నిజమైన మతానికి చెందినవాళ్లు. ఆ మతం మాత్రమే శాశ్వతంగా ఉంటుంది.f
దేవున్ని నిజంగా ఆరాధిస్తున్న గొప్ప సమూహం అబద్ధ మత నాశనాన్ని తప్పించుకుంటుంది
అబద్ధ మతం నాశనం గురించి ఎందుకు తెలుసుకోవాలి?
అబద్ధ మతం చేసే చెడ్డ పనుల్ని దేవుడు ఇష్టపడడు అని తెలుసుకున్నప్పుడు మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. దేవుని పేరు పాడుచేసే, మనుషుల్ని ఇబ్బంది పెట్టే అన్ని రకాల మతాలు ఇక ఉండవని తెలుసుకున్నప్పుడు, భవిష్యత్తు వైపు ఆశతో చూస్తాం.
దేవున్ని సరైన విధంగా ఆరాధించడం సాధ్యమే అని కూడా తెలుసుకుని సంతోషిస్తాం. “తండ్రిని సరైన విధంగా ఆరాధించేవాళ్లు పవిత్రశక్తితో, సత్యంతో ఆరాధించే సమయం రాబోతుంది. . . . నిజానికి తనను అలా ఆరాధించే వాళ్ల కోసమే తండ్రి చూస్తున్నాడు” అని బైబిలు చెప్తుంది. (యోహాను 4:23) ఆయన వాళ్లతో ఇలా అంటున్నాడు: “నా ప్రజలారా, మీరు ఆమె [మహాబబులోను] పాపాల్లో భాగస్థులు అవ్వకూడదని, ఆమె తెగుళ్లలో పాలుపంచుకోకూడదని అనుకుంటే అక్కడి నుండి బయటికి రండి.” (ప్రకటన 18:4, 5) అవును, దేవుడు తనను సత్యంతో ఆరాధించమని ప్రజల్ని ఆహ్వానిస్తున్నాడు. (1 తిమోతి 2:3, 4) తన ఆహ్వానాన్ని అందుకున్నవాళ్లు, ఎల్లప్పుడూ జీవిస్తారని ఆయన మాటిస్తున్నాడు.—1 యోహాను 2:17.
a మహా బబులోనును గుర్తుపట్టే నాలుగు విషయాల గురించి తెలుసుకోవడానికి “మహాబబులోను అంటే ఏంటి?” అనే ఆర్టికల్ చదవండి.
b క్రూర మృగాన్ని గుర్తుపట్టే ఆరు విషయాల గురించి తెలుసుకోవడానికి “ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలోని ఎర్రని మృగం ఎవరు?” అనే ఆర్టికల్ చదవండి.
c యెహోవా అనేది దేవుని పేరు. (కీర్తన 83:18) “యెహోవా ఎవరు?” అనే ఆర్టికల్ చూడండి.
d ఎక్కువ తెలుసుకోవడానికి దేవుని రాజ్యం అంటే ఏమిటి? అనే వీడియో చూడండి.
e ఉదాహరణల కోసం “మహాబబులోనులో క్రైస్తవులం అని చెప్పుకునే మతాలు కూడా ఉన్నాయా?” అనే బాక్సు చూడండి.
f మీరు నిజమైన మతాన్ని గుర్తుపట్టేలా బైబిలు ఎలా సహాయం చేస్తుందో తెలుసుకోవడానికి “నిజమైన మతం ఏదో నేనెలా తెలుసుకోవాలి?” అనే ఆర్టికల్ చదవండి.