యుద్ధంలేని లోకం సాధ్యమేనా?
యుద్ధం యొక్క భయానకమైన వాస్తవాన్ని, దాని పరిణామాన్ని మరలా ఇక ఎన్నడూ చూడకుండానూ ఎన్నడూ అనుభవించకుండానూ ఉండడం ఊహించుకోండి. తుపాకీ ప్రేలుళ్ళనూ లేక బాంబుల శబ్దాన్ని ఎన్నడూ వినకుండా ఉండడం, సగం నిండిన కడుపులతో గుంపులు గుంపులుగా శరణార్థులు పారిపోవడాన్ని ఎన్నడూ చూడకపోవడం, ఏ క్రూరమైన లేక కారణరహిత పోరాటాల్లో తాము లేక తాము ప్రేమించే వారు చనిపోతారేమోనని ఎన్నడూ బెంబేలు పడకపోవడాన్ని ఒక్కసారి ఊహించండి. యుద్ధంలేని లోకంలో జీవించడం ఎంత అద్భుతంగా ఉంటుందోకదా!
‘అది బహుశ ఆశకు అందనిదేమో’ అని మీరనవచ్చు. అయినప్పటికీ, శాంతియుత లోకం అన్న విషయాన్ని కొన్ని సంవత్సరాల క్రితం ప్రజలు ఎంతో ఆసక్తిగా పరిగణించారు. 1990 మరియు 1991లో, భద్రతా సహకారాల నూతన యుగపు వాకిట రాజ్యాలున్నాయని అనేకులు చెప్పారు. ఆ కాలంలో ఉన్న ధోరణిని జ్ఞాపకంచేస్తూ అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ అనేక సందర్భాల్లో ఓ “నూతన లోక విధానం” ఉద్భవించడాన్ని గూర్చి మాట్లాడాడు.
అంతటి ఆశావాదం ఎందుకుంది? ప్రచ్ఛన్న యుద్ధం అంతమైంది. 40 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం వరకూ ఓ సన్నని తాడుతో కత్తిని వ్రేలాడదీసినట్లు అణ్వస్త్ర యుద్ధ భయం మానవజాతి మీద అపాయకరంగా వ్రేలాడుతోంది. అయితే కమ్యూనిజం అంతమైపోవడం వల్ల మరి సోవియట్ యూనియన్ విడిపోవడం వల్ల, అణు విపత్తు అపాయం అదృశ్యమైనట్లు కన్పిస్తుంది. లోకం హాయిగా ఊపిరి పీల్చుకుంది.
ప్రజలు భవిష్యత్తువైపు నమ్మకంతో చూసినందుకు, ఇప్పటికీ అనేకులు అలా చూసేందుకు మరో ముఖ్యమైన కారణముంది. తూర్పు, పడమరల మధ్య జరిగిన నాలుగు దశాబ్దాల వివాదం ఐక్య రాజ్య సమితిని కేవలం వివాదాలు చర్చించుకునే స్థలంగా మార్చింది. అయితే ప్రచ్ఛన్న యుద్ధం, ఐక్య రాజ్య సమితి దేనికొరకు రూపొందించబడిందో అది చేసేందుకు విడుదల పొందినట్లయింది—అదే అంతర్జాతీయ శాంతి భద్రతల కొరకు పనిచేయడం.
యుద్ధాన్ని నిరుత్సాహపర్చేందుకు చేసే ప్రయత్నాలను ఐక్య రాజ్య సమితి తీవ్రతరం చేసింది. సభ్య దేశాల సైనిక దళాలతో సంసిద్ధమై, అంతకు క్రితం 44 సంవత్సరాలకంటే ఎక్కువగా 1994కు ముందున్న 4 సంవత్సరాల్లో ఈ ఐక్య రాజ్య సమితి శాంతి పరిరక్షక చర్యల్లో పాల్గొంటోంది. సుమారు 70,000 మంది ప్రజలూ, సైనిక సిబ్బంది, ప్రపంచవ్యాప్తంగా 17 సైనిక చర్యల్లో పనిచేశారు. కేవలం రెండు సంవత్సరాల్లోనే శాంతిని కాపాడేందుకయ్యే స్థూలవ్యయం 1994 నందు రెండింతలు అంటే 330 కోట్ల డాలర్లు అయ్యింది.
ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బుట్రోస్ బుట్రోస్ ఘలీ ఇటీవల ఇలా వ్రాశాడు: “సుమారు 50 సంవత్సరాల క్రితం [ఐక్య రాజ్య సమితి స్థాపించబడినప్పుడు] శాన్ ఫ్రాన్సిస్కోనందు స్థాపించబడిన సామూహిక భద్రతావ్యవస్థ, ముందు అనుకున్నట్లుగా ఇప్పుడు పనిచేయడం ప్రారంభమైంది . . . పనిచేసే అంతర్జాతీయ విధానాన్ని సాధించే మార్గంలో మనం ఉన్నాము.” వీటన్నిటినీ సాధించినప్పటికీ, నూతన లోకపు కల త్వరగా కనుమరుగౌతోంది. యుద్ధంలేని లోకాన్ని గూర్చిన నిరీక్షణపై కారుమబ్బులు కమ్మేందుకు కారణమేమిటి? మనం ప్రపంచవ్యాప్త శాంతిని చూస్తామని నమ్మేందుకు ఓ కారణముందా? తర్వాతి శీర్షికలు ఈ ప్రశ్నలకు జవాబిస్తాయి.
[Picture Credit Lines on page 3]
War planes: USAF photo
Anti-aircraft guns: U.S. National Archives photo