కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g96 3/8 పేజీలు 23-25
  • “రోజుకొక ఆపిల్‌ వైద్యున్ని దూరంగా ఉంచుతుంది”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “రోజుకొక ఆపిల్‌ వైద్యున్ని దూరంగా ఉంచుతుంది”
  • తేజరిల్లు!—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆపిల్‌ వ్యవసాయం
  • కోత
  • నిల్వచేయడం
  • ఆరోగ్య విలువ
  • ఒక హెచ్చరికా మాట
  • శత్రువులకు భయపడకండి!
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • శత్రువులకు భయపడకండి!
    యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
  • పాఠం 5
    బైబిలు పాఠాలు నేర్చుకుందాం
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1996
మరిన్ని
తేజరిల్లు!—1996
g96 3/8 పేజీలు 23-25

“రోజుకొక ఆపిల్‌ వైద్యున్ని దూరంగా ఉంచుతుంది”

ఆకర్షణీయమైన ఆ ఎర్రని ఆపిళ్ళను చూడండి. అవి ప్రలోభపెట్టేవిగా కనిపించడం లేదా? అవలా నిశ్చయంగా కనిపిస్తున్నాయి—మరి నిస్సందేహంగా మంచి కారణాన్నిబట్టే. ఆపిళ్ళు మీ క్షేమం కొరకు మరియు మంచి ఆరోగ్యం కొరకు రూపించబడ్డాయి. ఆహారానికి ప్రయోజనకరమైన అనేక రకాలైన పండ్లలో ప్రథమమైనవాటిలో ఆపిల్‌ ఒకటి. కాబట్టి, అవి మీ మంచికొరకే మిమ్మల్ని ప్రలోభపెడతాయి.

బేరి పండు, సీమదానిమ్మ, వైట్‌థార్న్‌ మరియు సర్వీస్‌ చెట్టు వంటివాటిలాగానే ఆపిల్‌ చెట్టు కూడా గులాబీ (రోజాసీ) కుటుంబానికి చెందుతుంది. ఈ చెట్లన్నింటి రసాల్లోను చక్కెర పుష్కలంగా ఉంటుంది. ఎంతో సువాసనగల వాటి ఫలాలు ఆకుపచ్చ, పసుపుపచ్చ మరియు ఎరుపు వంటి వివిధ ఛాయలను, పుల్లదనం నుండి తీయదనం వరకు వివిధ రుచులను కలిగివుంటాయి.

ప్రపంచవ్యాప్తంగా ప్రతిసంవత్సరం దాదాపు 200 కోట్ల బుషెళ్ళ—170 నుండి 180 లక్షల టన్నుల ఆపిళ్ళు ఉత్పత్తి చేయబడుతున్నాయి. అమెరికాలో, దాదాపు వాటిలో సగం తాజాగా భుజిస్తారు. మిగతా వాటిని ఆపిల్‌ బట్టర్‌, ఆపిల్‌ రసం, ఆపిల్‌సాస్‌, ఆపిల్‌ జెల్లీ, ఆపిల్‌ బ్రాందీ, ఆపిల్‌ సారాయి, ఆపిల్‌పైలు, మరితర పిండివంటలు, ఆపిల్‌ వినెగర్‌ మరియు ఆపిల్‌ మద్యం వంటివాటి తయారీకి ఉపయోగిస్తారు. యూరప్‌నందు, ఈ పంటలో అధిక భాగం సారాయి, మద్యం మరియు బ్రాందీల తయారీకి ఉపయోగిస్తారు. మొత్తం ప్రపంచ ఉత్పత్తిలో దాదాపు నాలుగవ భాగాన్ని సారాయి తయారీకి ఉపయోగిస్తారు.

కానీ పండు మన అంగిలికి రుచికరంగా తయారవ్వకముందే, పూర్తి పూతతోవున్న ఆపిల్‌ చెట్టు మన కళ్ళకు ఆహ్లాదకరంగా ఉంటుంది. చివర్లో గులాబీ రంగున్న తెల్లని పూతతో ఎంత అమితంగా అలంకృతమై ఉంటుందంటే, ఒకవేళ అవన్నీ ఆపిళ్ళుగా తయారైతే ఆ బరువును చెట్టు భరించలేదు. తొలి వేసవి తుపాను సామాన్యంగా ఈ పూతలో కొన్ని కొట్టుకుపోయేలా చూస్తుంది.

ఆపిల్‌ వ్యవసాయం

సమశీతోష్ణమండలాలలో ఆపిల్‌ చెట్టు చక్కగా పెరుగుతుంది. మరి అది అనాదికాలం నుండి వ్యవసాయం చేయబడుతుంది. ఆపిల్‌ చెట్లు, ఆపిళ్ళు బైబిల్‌లో ఆరు సార్లు పేర్కొనబడ్డాయి.a రోమన్లు వాటిని తిని ఆనందించారు, వారి అసంఖ్యాక సైనిక విజయాలలో, వారు వివిధ రకాల ఆపిళ్ళను ఇంగ్లాండు అంతటా మరియు యూరప్‌లోని ఇతర భాగాలలోను వ్యాప్తి చేశారు. తొలి అమెరికా వలస స్థాపకులు, ఆపిల్‌ విత్తనాలను ఆపిల్‌ చెట్లను ఇంగ్లాండునుండి తమతోపాటు తెచ్చారు.

ఎన్నో ప్రయోగాల ద్వారా, అనేక తరాల వ్యవసాయదారులు పెంపకంద్వారా ఆపిళ్ళ నాణ్యతను మెరుగుపరచారు. అయితే ఇది వేగంగా జరిగే ప్రక్రియ కాదు. అమ్మదగిన క్రొత్త బ్రాండు ఆపిల్‌ను ఉత్పత్తి చేయడానికి 20 సంవత్సరాల వరకు పట్టవచ్చు. కానీ ఈనాడు, వ్యవసాయదారుల పట్టుదల వలన మనం ఎన్నుకోవడానికి రసంగల మరియు రంగు రంగులున్న అనేక రకాలైన ఆపిళ్ళు మనకున్నాయి.

కోత

ఉత్తరార్ధగోళంలో ఆపిల్‌ సీజన్‌ జూలైలో లేక ఆగస్టులో మొదలౌతుంది. కానీ జేమ్స్‌ గ్రీవ్‌ లేక ట్రాన్స్‌పరెంట్‌ వంటి మొదట పక్వానికి వచ్చే రకాలను ఎక్కువ కాలం పాటు నిల్వవుంచలేము. వాటిని పచ్చిగానైనా లేక ఉడకబెట్టి అయినా త్వరగా భుజించాలి. అయితే అవి, రాబోయేవాటి కొరకు మన ఆకలిని తీవ్రతరం చేస్తాయి: సమ్మర్రెడ్‌, గ్రేవెన్‌స్టీన్‌, కాక్స్‌ బత్తాయి, జోనాథాన్‌, బాస్కోప్‌, రెడ్‌ డెలిషియస్‌, గోల్డెన్‌ డెలిషియస్‌, మకన్‌టాష్‌, గ్రాన్నీ స్మిథ్‌—వేల రకాలలో చెప్పడానికి ఇవి కేవలం కొన్ని మాత్రమే.

ఆపిళ్ళను పొడి వాతావరణంలో కోయాలి. క్రొత్త చిగుళ్ళు మరియు వాటి ఆకులు పాడవకుండా ఉండేలా వాటిని జాగ్రత్తగా కోయాలి. ఆపిళ్ళు నిజంగా పక్వమైనప్పుడు, పండును మెల్లిగా త్రిప్పడం అది కొమ్మనుండి విడివడేలా చేస్తుంది. ఆపిల్‌ నుండి తొడిమ విరగకుండా చూడడం ప్రాముఖ్యం ఎందుకంటే అది పండు తాజాదనాన్ని తగ్గించి దానికి హాని కలుగజేస్తుంది.

ఆ తరువాత పక్వానికి వచ్చే రకాలను సాధ్యమైనంత కాలం—వాతావరణం అనుమతించినంత మేరకు చెట్టుపైనే ఉండనివ్వాలి. కాలానికి ముందే మంచు కురవడం వల్ల ఆపిళ్ళు చెట్టుపైనే ఘనీభవిస్తే, అవి మరలా మామూలుగా అయ్యేంతవరకు కోయడాన్ని వాయిదా వేయాలి. అవి ఎంతమేరకు పక్వమయ్యాయన్నదానిపై మరియు వాటి చక్కెర సారంపై ఆధారపడి, ఆపిళ్ళు ఘనీభవన స్థానానికి కొన్ని డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకోగలవు, కానీ ఒక్కసారి ఘనీభవించి మరల మామూలుగా అయితే అవి నిల్వవుంచబడలేవు. వాటిని త్వరగా రసంగా, ఉడకబెట్టిన పండుగా, లేక వినెగర్‌గా విధాయితం చేయాలి, వాటిని ఎండబెట్టలేము.

నిల్వచేయడం

ఆపిళ్ళలో ఒక ఆసక్తిదాయకమైన విశేషత ఏమంటే అవి ఊపిరి పీలుస్తాయి. అవి గాలిలోనుండి ప్రాణవాయువును పీల్చుకొని, నీటిని మరియు బొగ్గుపులుసు వాయువును బయటికి విడుస్తాయి. అందువలన, పర్యావరణం ఎంత వేడిగా ఉంటుందో అంత త్వరగా అవి జలరహితమై వడలిపోతాయి. పీల్చడం ద్వారా అవి తమ పర్యావరణం నుండి వాసనలను కూడా గ్రహిస్తాయి. అందువలన, వాటిని ఐదు డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో వాటికవే నిల్వవుండేలా చేయడం మంచిది.

ఆపిళ్ళను బంగాళదుంపలతోపాటు నేలమాళిగలో నిల్వవుంచడం, ఆపిళ్ళు వాటి తాజా రుచిలో కొంత కోల్పోవడానికి కారణమౌతుంది. అంతేగాక, వివిధ రకాలను వేర్వేరుగా పెట్టాలి. ఆపిళ్ళను ఒక్కొక్కటిగా కాగితంలో చుట్టిపెట్టడం మంచిది. ఇది జలరహితం అవ్వడాన్ని మందగింపజేస్తూ, దాని చుట్టుప్రక్కలనున్న కుళ్ళిపోతున్న వాటి ద్వారా కలుషితంకాగల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఆరోగ్య విలువ

“రోజుకొక ఆపిల్‌ వైద్యున్ని దూరంగా ఉంచుతుంది” అని చెప్పబడింది. ఎప్పుడూ విషయమది కాకపోయినా ఆపిల్‌కు ఈ అనుకూల కీర్తి ఉంది. ఎందుకు? ఎందుకంటే దానిలో ఒకరి ఆరోగ్యాన్ని మంచిగా ప్రభావితం చేయగల అంశాలు ఉన్నాయి.

ఒక్కొక్క ఆపిల్‌, ప్రధాన పోషకాల ఒక చిన్న భండారమైయుంది. పక్వమైనప్పుడు, అది B1, B2, B6, C, E విటమిన్లను కలిగివుంటుంది. డెక్స్‌ట్రోస్‌, ఫ్రక్టోస్‌ మరియు సుక్రోస్‌ వంటి వివిధ రకాలైన చక్కెరలను కూడా అది అందిస్తుంది. దానిలోని ఆమ్లాల కలయిక ఆ రుచికి కారణమౌతుంది. అదనంగా కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం మరితర ఖనిజ పదార్థాలు, పెక్టిన్‌ మరియు పీచు ఉంటాయి. ఆపిల్‌లో దాదాపు 85 శాతం నీరు ఉంటుంది.

ఆపిళ్ళలో కనుగొనబడే మరొక పదార్థం ఈథలిన్‌, అది ప్రాముఖ్యంగా సహజ పెరుగుదల క్రమకర్తగా పనిచేస్తూ పండు పక్వమవ్వడాన్ని త్వరపెడుతుంది. మీకొకవేళ పచ్చ టమాటాలు లేక గట్టి అవకాడోలుంటే, ఈ వాయు పదార్థాన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. కొన్ని పక్వమైన ఆపిళ్ళతోపాటు వాటిని కాగితపు సంచిలో పెట్టండి, అప్పుడవి ఇంకా త్వరగా పక్వమౌతాయి.

ఆపిళ్ళకు ఆరోగ్యపు విలువ ఉన్నందున, వాటినెప్పుడు, ఎలా తినాలో తెలుసుకోవడం ప్రాముఖ్యం. మొట్టమొదటిగా, అవి పక్వమై ఉండాలి. ఇంకా, చల్లటి ఆపిళ్ళను తినకుండా ఉండడం శ్రేష్ఠం; అవి గది ఉష్ణోగ్రతకు తగ్గేవరకూ కొంతసేపు ఉంచండి. వాటిని బాగా నమలడం కూడా ప్రాముఖ్యం.

ఆసక్తికరంగా, ఆపిళ్ళకు జీర్ణ వ్యవస్థను పరిశుభ్రం చేయడానికి ప్రయోజనకరమైనవని చెప్పబడే లక్షణాలు ఉన్నాయి. ఇవే లక్షణాలు మలబద్ధకం మరియు అతిసారాల చికిత్స కొరకు సహాయం చేస్తాయి.

ఒక హెచ్చరికా మాట

ఆపిళ్ళు, అలాగే ఇతర ఫలాలు, బూజు పట్టవచ్చు. ఇందువలన, కొంత జాగ్రత్త యుక్తమే. దాన్నుండి వెలువడే విషయుక్త పదార్థాలు అసౌకర్యాన్ని మరియు వికారాన్ని కలిగించగలవు. అందువలన, బూజు ఉందేమో చూడండి, విషపదార్థం విస్తరిస్తుంది కాబట్టి, బూజుపట్టిన భాగాన్ని మాత్రమే కాదు గానీ పాడైన స్థలం చుట్టూవున్న ముక్కను కూడా కోసివేయండి.

అయినప్పటికీ, ఆపిళ్ళు మీ మంచి ఆరోగ్యానికి తోడ్పడతాయి. కాబట్టి మీరు “వైద్యున్ని దూరంగా” ఉంచాలనుకొంటే రోజుకొక ఆపిల్‌ను తినడానికి ప్రయత్నించండి!

[అధస్సూచి]

a ఆపిల్‌ చెట్టు: పరమగీతము 2:3; 8:5; యోవేలు 1:12, [NW]. ఆపిళ్ళు: సామెతలు 25:11; పరమగీతము 2:5; 7:8, [NW].

[24వ పేజీలోని చిత్రాలు]

పూర్తిగా పూతతోవున్న ఆపిల్‌ చెట్టు కళ్ళకు ఆహ్లాదకరంగా ఉంటుంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి