బైబిలు ఉద్దేశం
మీరు ఎదుటివారి మనస్సు నొప్పించినప్పుడు ఏమి చేయాలి
ఏదో జరిగింది. మీకు అంతమాత్రమే తెలుసు. మీ క్రైస్తవ సహోదరుడు కావాలని మిమ్మల్ని తప్పించుకు తిరుగుతున్నాడు. తానెందుకు బాధపడుతున్నాడో ఆయన చెప్పలేదు కానీ, ఆయన ఎప్పుడైనా ఒకసారి పలకరిస్తాడు—అదీ మీరు ముందు పలకరిస్తేనే! అసలేమి జరిగిందో తెలుసుకునేందుకు మీరు ఆయన్ను సమీపించాలా?
‘అది ఆయన సమస్య, నాకు విరోధంగా ఆయనకు ఏమైనా ఉంటే ఆయనే వచ్చి నాతో మాట్లాడాలి’ అని మీరనుకోవచ్చు. నిజమే, నొచ్చుకున్న వ్యక్తే తన సహోదరునితో సమాధానపడేందుకుగాను చొరవ తీసుకోమని బైబిలు ప్రోత్సహిస్తోంది. (మత్తయి 18:15-17 పోల్చండి.) మరి నొప్పించిన వ్యక్తి విషయమేమిటి? ఒకవేళ ఆయనపై ఏ బాధ్యతైనా ఉంటే అది ఏమైవుంటుంది?
కొండమీది తన ప్రసంగంలో యేసు ఇలా చెప్పాడు: “నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధమేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము.” (మత్తయి 5:23, 24) ఇక్కడ యేసు చెప్పిన మాటలు నొప్పించిన వ్యక్తిని ఉద్దేశించినవని గమనించండి. ఈ విషయాన్ని పరిష్కరించడంలో ఆయన బాధ్యతేమిటి? దానికి జవాబు పొందేందుకు, తన మొదటి శతాబ్దపు యూదా శ్రోతలకు యేసు మాటల భావం ఏమైవుండవచ్చో మనం పరిశీలిద్దాం.
“నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా”
యేసు ఇక్కడ స్పష్టమైన వివరణనిస్తున్నాడు: వార్షిక పండుగల్లో ఒకదానికొరకు ఓ యూదా ఆరాధికుడు యెరూషలేముకు వచ్చాడు. ఆయన ఓ అర్పణను, బహుశ ఓ జంతువును యెహోవాకు బలియర్పించేందుకు తెచ్చాడు.a బలినర్పించడం అంటే అర్థవిహీనమైన ఓ ఆచారకర్మ ఏమాత్రం కాదు. యూదా మతం—దాని ఆచారాలూ విశ్వాసాలు అనే పుస్తకం ఇలా వివరిస్తోంది: “బలిష్టంగా ఉండే ఏ లోపమూ లేని జంతువును ఎన్నుకోవడం, నిపుణులతో దాన్ని పరిశీలనగా చూపించడం, అక్కడనుండి కొన్ని గజాల దూరంలోనున్న మండే బలిపీఠంవద్దకు వాటితో వెళ్లడం, వాటిని అప్పగించడం, తలపై చేతులనుంచడం, అపవిత్రతనూ లేక అపరాధాన్ని ఒప్పుకుని, లేక జంతువు గొంతుకోసి లేక కేవలం దాన్ని పట్టుకొని అర్పించడం—ఇవన్నీ ఆ సమయానికిగల ప్రాముఖ్యతను లేక ప్రత్యేకతను గట్టిగా నొక్కిచెబుతుంది. . . . ఈ సేవనంతటినీ చేయమని దేవుడే ఆజ్ఞాపించాడని విశ్వసించే ఏ వ్యక్తినైనా . . . అందులో ఉద్వేగపూరితంగా సంపూర్ణంగా ఇమిడిపోకుండా ఉండలేడు.”
అలా, మత్తయి 5:23, 24 నందు యేసు చెప్పిన మాటలు, యూదా ఆరాధికుడు అనుభవించే భావగర్భితమైన భక్తిపూర్వక భయముతో నిండిన క్షణానికి తన ప్రేక్షకులను తీసుకువెళ్లింది. ఓ బైబిలు పండితుడు ఆ సన్నివేశాన్ని ఇలా వర్ణిస్తున్నాడు: “ఆరాధికుడు ఆలయంలోకి ప్రవేశించాడు; ఆయన ప్రాంగణాలను అంటే, అన్యుల ప్రాంగణాన్నీ, స్త్రీల ప్రాంగణాన్నీ, పురుషుల ప్రాంగణాన్నీ, అలా అన్నింటినీ దాటి వచ్చాడు. వాటిపైగా, సామాన్య మానవుడు వెళ్లలేని యాజకుల ప్రాంగణం ఒకటి ఉండేది. తానివ్వబోయే బలిని యాజకునికి అందించేందుకు ఆ ఆరాధికుడు దాని గ్రాది వద్ద నిలుచుని ఉన్నాడు; తప్పుచేశానని ఒప్పుకునేందుకు ఆయన తన చేతులు [ఆ జంతువు తలపై] పెట్టాడు.”
అంతటి ప్రధానమైన సమయంలో, తన సహోదరునికి తనమీద ఏదో ఉందని ఆ ఆరాధికునికి జ్ఞాపకం వస్తుంది. బహుశ ఆయన మనస్సాక్షే ఆయనకు ఇలా చెప్పవచ్చు, లేక బహుశ తన సహోదరుడు తనతో వ్యవహరించే విధానాన్నిబట్టి నొచ్చుకున్నాడన్న భావనేదో ఉన్నట్లు ఆయన తానే స్వయంగా గ్రహించివుండవచ్చు. అలాంటప్పుడు ఆయనేమి చేయాలి?
‘నీ యర్పణము విడిచిపెట్టి . . . వెళ్లుము’
‘బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, . . . వెళ్లుము’ అని యేసు వివరించాడు. ఎందుకు? ఆ సమయంలో యెహోవాకు అర్పణనను అర్పించడం కన్నా ప్రాముఖ్యమైన మరో విషయమేముంటుంది? “మొదట . . . నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము” అని యేసు ఇంకా వివరించాడు. కనుక ఆ ఆరాధికుడు తన అర్పణను సజీవంగానే బలిపీఠంవద్ద విడిచిపెట్టి, నొచ్చుకున్న తన సహోదరున్ని వెతుక్కుంటూ వెళతాడు.
అది ఓ పండుగ కనుక, యెరూషలేముకు తండోపతండాలుగా వచ్చిన యాత్రికుల్లో నొచ్చుకున్న తన సహోదరుడు తప్పకుండా ఉంటాడు. ఇరుకైన వీధులతోనూ ఇళ్లన్నీ దగ్గిరదగ్గిరగా ఉండడంతోనూ యెరూషలేములో జనాభా ఎక్కువగా ఉండేది. అయితే, ఇది ఓ పండుగ, మరి ఈ పట్టణం సందర్శకులతో నిండివుంది.b
అదే ప్రాంతంలోని ప్రజలు అక్కడికి ప్రయాణించి ఒకే చోట కలిసి బసచేసినప్పటికీ, అలా ప్రజలెక్కువగా ఉన్న పట్టణంలో ఒక వ్యక్తిని కనుక్కోవడానికి కొంత ప్రయత్నం అవసరమౌతుంది. ఉదాహరణకు, పర్ణశాలల పండుగ సమయంలో యెరూషలేము పట్టణమంతటనూ దాని చుట్టూ ఉన్న రోడ్లలోనూ తోటల్లోనూ సందర్శకులు పర్ణశాలలను వేస్తారు. (లేవీయకాండము 23:34, 42, 43) అయినప్పటికీ, యూదా ఆరాధికుడు, నొచ్చుకున్న తన సహోదరున్ని కనుగొనేంతవరకూ వెతకాల్సివుంది. ఆ తర్వాత ఏం చేయాలి?
“నీ సహోదరునితో సమాధానపడుము” అని యేసు చెబుతున్నాడు. “‘మార్పును ప్రభావితం చేయడం, లేక ఇచ్చిపుచ్చుకోవడం’ అన్న భావంవుంది అంటే ‘సఖ్యపర్చడం’ అనే భావంగల క్రియాపదం (డయాలస్స్సో) నుండి “సమాధానపడుము” అని అనువదించబడిన గ్రీకు పదం వచ్చింది. నొచ్చుకున్న తన సహోదరున్ని కనుగొనేందుకు అంత ప్రయత్నించిన యూదా ఆరాధికుడు ఆయనతో సమాధానపడేందుకు యత్నిస్తాడు. తర్వాత, ఆయన ఆలయానికి తిరిగి వచ్చి తన అర్పణను అర్పిస్తాడు, ఇక ఇప్పుడు దేవుడు దాన్ని అంగీకరిస్తాడని యేసు చెబుతున్నాడు.
ఆ విధంగా, మత్తయి 5:23, 24 నందు యేసు చెప్పిన మాటలు ఓ ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తున్నాయి: సఖ్యపడడం, లేక సమాధానపడడం అనేది బలికి ముందు వస్తుంది. మనం మన తోటి ఆరాధికులతో వ్యవహరించే విధానం, దేవునితో మనం కల్గివున్న సంబంధంపై నేరుగా ప్రభావాన్ని చూపిస్తుంది.—1 యోహాను 4:20.
మీరు ఎవరినైనా నొప్పించినప్పుడు ఏమి చేయాలి
ఈ శీర్షికారంభంలో వర్ణించబడిన పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు కనుగొంటే, అంటే మీరు మీ తోటి ఆరాధికుని నొప్పించినట్లు మీరు భావించినట్లయితే, అప్పటి సంగతేమిటి? మీరు ఏమి చేయాలి?
యేసు సలహాను అన్వయిస్తూ, మీరు మీ సహోదరుని దగ్గరకు వెళ్లేందుకు చొరవ తీసుకోండి. ఏ ఉద్దేశంతో వెళ్లాలి? ఆయన నొచ్చుకునేందుకు అసలు ఏకారణమూ లేదని ఆయన్ని నమ్మించేందుకా? కానేకాదు! అసలు సమస్య అపార్థం మాత్రమే కాకపోవచ్చు. “సమాధానపడుము” అని యేసు చెప్పాడు. సాధ్యమైతే, ఆయన మనస్సులోనుండి ద్వేషభావాన్ని తీసివేయండి. (రోమీయులు 14:19) అందుకు, ఆయనకు బాధకలిగిందన్న విషయాన్ని మీరు కాదనకుండా వాటిని ఒప్పుకోవల్సిన అవసరం ఉండవచ్చు. ‘దాన్ని పరిహరించేందుకు నేను ఏమి చేయగలను’ అని మీరు అడగవల్సి కూడా ఉండవచ్చు. తరచూ హృదయపూర్వకంగా క్షమాపణను కోరడమే సరిపోతుంది. అయితే, కొందరి విషయంలో మాత్రం నొచ్చుకున్న వ్యక్తి తన భావాలను తొలగించుకునేందుకు కొంత సమయం అవసరమవ్వవచ్చు.
అయితే, పదేపదే ప్రయత్నించిన తర్వాత కూడా మీరు సఖ్యపర్చుకోలేకపోయినట్లయితే అప్పుడేమి చేయాలి? రోమీయులు 12:18 ఇలా అంటోంది: “శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.” (ఇటాలిక్కులు మావి.) అలా మీరు సమాధానపడేందుకు ఒకసారి ప్రయత్నించిన తర్వాత, యెహోవా మీ ఆరాధనను ఆనందంగా అంగీకరిస్తాడనే నమ్మకాన్ని మీరు కల్గివుండగలరు.
[అధస్సూచీలు]
a సాధారణంగా మూడు నియామక కాలాల్లోనే అంటే పస్కా, పెంతెకొస్తు, పర్ణశాలల పండుగల సమయంలోనే బలి అర్పణలు తీసుకురాబడేవి.—ద్వితీయోపదేశకాండము 16:16, 17.
b పండుగలకని పురాతన యెరూషలేముకు తండోపతండాలుగా వచ్చిన యాత్రికుల సంఖ్యను గూర్చిన అంచనాలు విభిన్నంగా ఉన్నాయి. మొదటి శతాబ్దపు చరిత్రకారుడైన జోసిఫస్ ప్రకారం, సుమారు 30 లక్షలమంది యూదులు పస్కాను ఆచరించేందుకు వచ్చేవారు.—జూయిష్ వార్, 280 (xiv, 3); VI, 425 (ix, 3).