నీటి గేదె—విశ్వాసముగలది మరియు ప్రయోజనకరమైనది
బ్రెజిల్‌లోని తేజరిల్లు! విలేఖరి
‘పారిపో, పారిపో! అదిగో పులి!’ అని అబ్బాయిలు అరుస్తున్నారు. వారు తమ గేదెల దగ్గరకు పరుగు లంకించుకుని, వాటిపైకెక్కి పారిపోతున్నారు. ఆ అబ్బాయిల్లో ఒకడైన సైద్జా అకస్మాత్తుగా జారి వరి చేనులో పడ్డాడు—అతడు దగ్గరికొస్తున్న పులికి ఎరయ్యేలా ఉన్నాడు. అయితే సైద్జా వాళ్ళ గేదె ఏమి జరుగుతుందో చూస్తుంది. అది తన పెద్ద శరీరంతో తన చిన్న స్నేహితుని మీద పైకప్పులా నిలబడి, పులిని ఎదిరించి అతనికి రక్షణనిస్తుంది. ఆ పులి దాడిచేస్తుంది, అయితే గేదె గట్టిగా నిలబడి, సైద్జా ప్రాణాన్ని కాపాడుతుంది.
ఆసియాలో నివసించిన 19వ శతాబ్దంలోని ఎడువార్డ్ డవిస్ డెక్కర్ అనే పేరుగల రచయిత వివరించిన ఈ పోరాటం నీటి గేదె యొక్క ప్రశంసనీయమైన లక్షణమైన విశ్వాసాన్ని చూపిస్తుంది. నేటికీ విశ్వాసమే దాని గుర్తింపు చిహ్నం. “ఈ నీటి గేదె పెంపుడు కుక్క వంటిది. మీరు దానిని చక్కగా చూసుకున్నంత కాలం అది తన జీవితాంతం ప్రేమను కనబరుస్తుంది,” అని ఒక నిపుణుడు చెబుతున్నాడు.
ఆసియాలోని పిల్లలకు నాలుగేండ్ల పిల్లలకు కూడా వాటినెలా చూసుకోవాలో తెలుసు. వారు ప్రతిరోజు స్థూల శరీరులైన తమ నేస్తాలను నీళ్ళలోకి తీసుకువెళ్ళి, తమ చిన్ని చేతులతో జంతువు చెవులను, కళ్ళను, ముక్కును, దాని శరీరాన్నంతటినీ కడిగి శుభ్రం చేస్తారు. దాని ఫలితంగా అవి సంతృప్తితో దీర్ఘంగా నిశ్వసిస్తాయి. దాని నల్లని చర్మము ఎక్కువ వేడిని గ్రహిస్తుంది, మరి ఆవులకన్నా దీనికి స్వేద గ్రంథులు చాలా తక్కువ ఉన్నందువల్ల దాని శరీరం చల్లబడడం కష్టంగా ఉంటుంది. అది ప్రతి రోజు నీటిలో మునగడాన్ని ఇష్టపడడంలో ఆశ్చర్యం లేదు మరి! గేదె “నీళ్ళలో లేదా బురదలో మునిగి, కళ్ళు సగం మూసుకుని నెమరువేయడం కనులకింపైన దృశ్యము” అని ఒక సమాచార మూలం చెబుతుంది.
నీళ్ళను ఇష్టపడడం వాటి లక్షణాల్లో ఒకటి మాత్రమే. వాటికున్న ఇతర లక్షణాలేవి? అవి ఎందుకు ప్రయోజనకరమైనవి? అవి చూడడానికి ఎలాగుంటాయి? అనే వివరాలతో వాటిని గూర్చిన చర్చనారంభిద్దాము.
ప్రపంచమంతటా కనిపించే కండగల మృగం
నీటి గేదె (బుబలస్ బుబలిస్) పెద్ద ఎద్దులా కనిపిస్తుంది, 900 కిలోలు లేదా అంతకన్నా ఎక్కువ బరువుంటుంది. దాని చర్మం మీద చాలావరకు వెండ్రుకలు ఉండనే ఉండవు, అది బూడిద రంగులో ఉంటుంది. అది భుజాల వరకు 1.8 మీటర్ల ఎత్తుతో, వంకరగా ఉండే కొమ్ములు, నేరుగా ఉండే వీపు, పొడవుగా ఉన్న శరీరంతో, క్రిందకు వంగి ఉండే మెడ, దృఢమైన శరీరం కలిగి ఉంటుంది—నిజంగా అది బలానికి సమగ్రస్వరూపము. సులభంగా వంగే కీళ్ళతో కలపబడిన చతురస్రాకారంలోని పెద్ద గిట్టలు గల దాని కాళ్ళ క్రింది దృఢమైన భాగం బురదలో నడిచేవారి పాదరక్షల నమూనా అన్నట్లు ఉంటాయి. అలా సులభంగా వంగగలగడం గేదె తన డెక్కలను వంచడానికి అడ్డంకులను దాటడానికి వీలు కలిగిస్తుంది, ఆవులు నడవలేని బురద నేలల్లో నడవడానికి కూడా అది సహాయపడుతుంది.
ప్రపంచంలో మచ్చిక చేయబడిన 15 కోట్ల నీటి గేదెల్లో రెండు రకాలున్నాయి: బురద రకం (బురదలో ఉండగలవి) మరియు నది రకం (నదిలో ఉండగలవి). ఫిలిప్పీన్స్ నుండి భారతదేశం వరకు కనిపించే బురద రకం గేదెలు 1.2 నుండి 1.8 మీటర్ల పొడవులో వెనక్కు ఉండే కొమ్ములు కలిగి, పోస్టుకార్డుపై కనిపించే ప్రఖ్యాత మోడలులాగా ఉంటాయి. అవి ఫోటో కొరకు ఫోజ్ చేయనప్పుడు పైరులో గుండా మోకాళ్ళ వరకున్న బురదలో నడుస్తాయి లేదా ఏ ట్రక్కు డ్రైవరైనా ప్రయాణించడానికి వణికిపోయే కాలిబాట గుండా బండ్లను ఈడుస్తాయి.
నది రకం గేదె బురద రకం గేదెలాగే ఉంటుంది. దాని శరీరం ఇంక కొంచెం చిన్నగా ఉంటుంది మరియు దాని కొమ్ములు ఇంకాస్త చిన్నగా ఉంటాయి—బిగుసుగా చుట్టుకొని ఉంటాయి లేదా నిటారుగా క్రిందికి వ్రేలాడుతూ ఉంటాయి. అయితే 900 కిలోగ్రాముల బరువు కలిగి అది కూడా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. గతంలో అరబ్ వర్తకులు ఈ రకం గేదెలను పశ్చిమ ఆసియా నుండి మధ్య ప్రాచ్యానికి తీసుకువెళ్ళారు; తరువాత, స్వంత ప్రాంతానికి తిరిగి వెళ్ళిన క్రూసేడర్లు వాటిని ఐరోపాకు తీసుకువచ్చారు, అక్కడ అవి ఇప్పటికీ వృద్ధిచెందుతున్నాయి.
నీటి గేదెలు వేగంగా నడవకపోయినప్పటికీ—అవి గంటకు మూడు కిలోమీటర్ల దూరం వరకు ఒకే వేగంతో నడుస్తాయి. బురద రకం గేదెలు మరియు నది రకం గేదెలు ప్రపంచ వ్యాప్తంగా అన్ని చోట్ల ఉన్నాయి. అవి ఉత్తర ఆస్ట్రేలియా తీరప్రాంతాన నివసించాయి, మరి పసిఫిక్ దీవుల్లోని తీరప్రాంతాల గుండా నడిచాయి, అలా అమెజాన్ అడవుల్లోకి మార్గాన్నేర్పరచుకుంటున్నాయి. అమెజాన్కా?
వలసజీవులు వృద్ధిచెందడం
అమెజాన్‌ను పరిశోధించే పర్యావరణ పర్యాటక శాస్త్రజ్ఞులు తప్పించుకు తిరిగే చిరుతపులుల కొరకు, కొండచిలువల కొరకు తరచూ నదీతీరాల్లో వ్యర్థంగా వెదుకుతారు. అయితే, అడవికి క్రొత్తగా వచ్చే వేవేల కొలది అడవి గేదెలను చూడడానికి బైనాకులర్స్ గాని లేదా కళ్ళజోళ్ళు గాని వారికి అవసరం లేదు.
అమెజాన్‌లో తిరుగులాడుతున్న ఈ ఆసియా వలసజీవులు పర్యావరణానికి హానికరమైనవని మీరు భావిస్తున్నట్లయితే, డెల్టా ప్రాంతంలోని ఒక దీవియైన మారోజ్లోని పోలీసులకు ఫిర్యాదు చేయాలని మీరు తలంచవచ్చు. అయితే జాగ్రత్తగా ఉండండి! మీరు స్టేషన్‌కి వెళ్ళినప్పుడు నిష్పక్షపాతమైన వాదాన్ని వినలేరు, ఎందుకంటే డ్యూటీ మీదనున్న పోలీసు అధికారి అప్పుడే వీధి పహరాకు నీటి గేదె మీద బయలుదేరడానికి సిద్ధమవుతుండవచ్చు. మీ ఊహ సరైనదే—అది గేదె, బురద గేదె కూడా! ఇంకెవరు ఫిర్యాదు చేస్తారు?
నిజానికి, అమెజాన్ ప్రాంతంలో నీటి గేదె ఒక ఆస్తివంటిది అని బ్రెజిల్‌లోని నీటి గేదెల రెండు పరిశోధనా కేంద్రాల్లో పనిచేసే పశువైద్యుడైన డా. పియెట్రో బారూసెలె అంటున్నారు. ఈ గేదెకు అద్భుతమైన జీర్ణమండలం ఉందని, అందువల్ల ఆవులు క్షీణించిపోయేలా వాటికి ఏమీ మిగల్చకుండా పచ్చికను తినేస్తాయని ఆయన తేజరిల్లు!తో చెప్పారు. ఆవులను కాసేవారు క్రొత్త పచ్చిక మొలకెత్తేందుకు ఎడతెగక అడవిని శుభ్రం చేస్తూనే ఉండాలి, అయితే గేదెలు అప్పటికే అక్కడ పెరిగి ఉన్న పచ్చికతో బాగా వృద్ధిచెందుతాయి. డా. బారూసెలె చెప్పేదేమంటే నీటి గేదె “వర్షపాత అడవులను కాపాడుకోవడానికి సహాయపడగలదు.”
అయితే, గేదె అడవిలో జీవనం సాగించాలంటే ఎప్పుడేది దొరికితే దాన్ని తినేదై ఉండాలి—అది అలాంటిదే. వర్షాకాలంలో, అమెజాన్‌లో పచ్చిక బయలంతా నీళ్ళలో మునిగినప్పుడు గేదె తడిగా ఉన్న పరిసరాలకు అలవాటుపడుతుందని ది వాటర్ బఫెలో: న్యూ ప్రోస్ప్క్ట్స్ ఫర్ ఆన్ అండర్యూటిలైజ్డ్ ఆనిమల్ అనే పుస్తకం చెబుతుంది. తమ చుట్టూవున్న నీళ్ళలో నడుస్తూ, నీటి పై తేలుతున్న మొక్కలను తింటూ, నీటి అడుగున ఉన్న వాటిని కూడా మేస్తూ ఉండే గేదెలను ఎత్తైన స్థలాల్లోకి వదిలివేయబడిన ఆవులు అసూయ కళ్ళతో, ఆకలి కడుపుతో చూస్తాయి. మళ్ళీ పచ్చిక మొలిసినప్పుడు గేదె ఇంతకు ముందులాగే నిగనిగలాడుతూ కనిపిస్తుంది.
రాణీ మాత
బ్రెజిల్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కూడా నీటి గేదెలు వృద్ధిచెందుతున్నాయి. ఆ దేశంలో 1980వ పడి ఆరంభంలో నాలుగు లక్షలుగా ఉన్న గేదెల సంఖ్య 30 లక్షల కన్నా ఎక్కువయ్యింది. నిజానికి గేదెలు ఆవులకన్నా ఎంతో ఎక్కువ సంఖ్యలో వృద్ధి అవుతున్నాయి. ఎందుకని?
బ్రెజిల్లో గేదెను పెంచే వాండర్లే బెర్నార్డెస్ చెప్పేదేమంటే గేదె రెండేండ్ల వయస్సులో సంపర్కానికి సిద్ధమవుతుంది. పది నెలల గర్భధారణ తరువాత అది తన మొదటి దూడను ఈనుతుంది. దాదాపు 14 నెలల తరువాత, రెండవ దూడ పుడుతుంది. దూడల మరణ రేటు తక్కువగాను వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగాను ఉండడం వల్ల గేదె దీర్ఘకాలం సంతానవృద్ధి కలిగి జీవిస్తుంది. ఎంత కాలం? సరాసరి 20 కన్నా ఎక్కువ సంవత్సరాలు జీవిస్తుంది. ఎంత సంతానాభివృద్ధితో?
సావోపౌలోకు పశ్చిమాన 160 కిలోమీటర్ల దూరాన మెట్టపల్లాలున్న 750 ఎకరాల తన పొలంలోకి నడుస్తూ దీర్ఘకాలం జీవించిందని చూపించే ముసలి చర్మము, విరిగిన కొమ్ములు గల ఒక గేదెను ఆప్యాయతతో చూపిస్తూ బెర్నార్డెస్గారు ఇలా చెబుతున్నారు, “ఇదే రాయిన్యా (రాణి). ఇది 25 సంవత్సరాల వయస్సుగల అమ్మమ్మ, దీని బిడ్డ చాలా దూడలను ఈనింది.” చిరునవ్వుతో ఆయన ఇంకా ఇలా అన్నారు, “అంతే కాదు, ఇది 20వ దూడను కూడా ఈనింది.” రాయిన్యావంటి అమ్మమ్మలున్నందువల్ల, తరువాయి శతాబ్దంలో, లోకంలోని గేదెల అతిపెద్ద మంద బ్రెజిల్‌లోనే ఉంటుందని కొందరు నిపుణులు ముందుగా సూచించడంలో ఆశ్చర్యం లేదు మరి!
సజీవ ట్రాక్టర్, మరి అంతకన్నా గొప్పది
అయితే, ఆ మాటలు ప్రపంచంలోని దాదాపు సగం గేదెలకు పుట్టినిల్లయిన భారతదేశానికి వర్తిస్తాయి. ఇక్కడ మరియు ఆసియాలోని ఇతర దేశాల్లో, సాగుచేయడానికి కష్టమైన భూమిపై కోట్లకొలది నిరుపేద కుటుంబాలు గేదె సహాయాన బ్రతుక గలుగుతున్నాయి. డీసెల్ ఆయిల్ లేదా స్పేర్ పార్ట్స్ అవసరం లేకుండానే, వారి “సజీవ ట్రాక్టరు” 20 కన్నా ఎక్కువ సంవత్సరాలు బండ్లను లాగుతుంది, పొలం దున్నుతుంది, పాపటంతోలుతుంది, సామానున్న బండిని లాగుతుంది, కుటుంబాన్ని పోషిస్తుంది. “నా కుటుంబంలో నా కంటే గేదే ప్రాముఖ్యమైనది. నేను చనిపోతే, వారు నా కోసం ఏడుస్తారు; కాని మా గేదె చనిపోతే, వారు పస్తులుండవలసి రావచ్చు” అని ఒక ఆసియా మహిళ చెప్పింది.
గేదె పొలం పని చేయడమే గాక, ఆహారాన్ని కూడా ఇస్తుంది. భారతదేశంలో ఉత్పత్తయ్యే పాలలో దాదాపు 70 శాతం పాలను నది రకం గేదె ఇస్తుంది. గేదె పాలకు అంత గిరాకీ ఉండడం వల్ల ఆవు పాలను అమ్మడం చాలా కష్టంగా ఉండగలదు. అనేకులు దానినే ఎందుకిష్టపడతారు? ది వాటర్ బఫెలో: న్యూ ప్రోస్పెక్ట్స్ ఫర్ ఆన్ అండర్యూటిలైజ్డ్ ఆనిమల్ అనే పుస్తకం ఈ విధంగా వివరిస్తుంది, “గేదె పాలలో ఆవు పాలలో కన్నా నీళ్ళు తక్కువగా ఉంటాయి, ఘనపదార్థాలు ఎక్కువగా ఉంటాయి, క్రొవ్వు అధికంగా ఉంటుంది, పాలచక్కెర (లాక్టోస్) కొంత అధికంగా ఉంటుంది, మరిన్ని మాంసకృత్తులుంటాయి.” ఇది ఎంతో శక్తినిస్తుంది, మంచి రుచిగా ఉంటుంది, మొజారెల్లా, రికోటా మరియు ఇతర రుచికరమైన చీస్లను తయారు చేయడానికి ఇది ఉపయోగించబడుతుంది.
గేదె మాంసాన్ని గూర్చిన మాటేమిటి? “మేము డిమాండును తీర్చలేకపోతున్నాము,” అని గేదెల పెంపకందారుడైన బెర్నార్డెస్ చెబుతున్నారు. దేని రుచి ఎక్కువ ఇష్టమనే దానిని గూర్చి ఆస్ట్రేలియా, వెనిజ్యులా మరియు అమెరికాల్లో జరిగిన సర్వేలో, ఆవు మాంసం కన్నా గేదె మాంసాన్నే ఎక్కువ మంది ఇష్టపడ్డారు. నిజానికి, ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రజలు తరచూ గేదె మాంసాన్ని భుజిస్తూ రసమయమైన ఎద్దు మాంసం తింటున్నామని అనుకుంటారు. “గేదె మాంసం రుచికరమైనదని ఎద్దు మాంసంకన్నా మంచిదని ప్రజలు తరచూ తలస్తారు,” అని డా. బారుసెలె అభిప్రాయపడుతున్నారు.
గేదె బరువు తగ్గడం
గేదెల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, అవి అపాయంలో ఉన్నాయి. “అనువంశిక లక్షణాలను సంక్రమింపజేసే పెద్ద ఎద్దులు పెంచదగినవి, అవి తరచూ పనికిరాని జంతువులుగా ఎంచబడి, వాటి బీజకోశాలు తీసివేయబడుతున్నాయి లేదా చంపబడడానికి పంపబడుతున్నాయి,” అని ఎర్త్స్కాన్ బుల్లెటిన్ చెబుతుంది. ఆ విధంగా, పెద్దవాటికి జన్మనిచ్చే సామర్థ్యం తొలగించబడుతుంది, గేదెల బరువు తగ్గిపోతుంది. “థాయ్‌లాండ్‌లో పది సంవత్సరాల క్రితం, 1,000 కిలోల [2,200 ఎల్బి] బరువున్న గేదెలు అన్నిచోట్ల కనిపించేవి; ఇప్పుడు 750 కిలోల [1,700 ఎల్బి] బరువున్న వాటిని మచ్చుకైనా కనుగొనడం చాలా కష్టం.” ఈ సమస్య పరిష్కరించబడుతుందా?
పరిష్కరించబడుతుంది, కాని “ప్రత్యేకమైన గేదె జాతులను కాపాడి, సంరక్షించడానికి . . . వెంటనే చర్య తీసుకోవాలి,” అని 28 మంది జంతు శాస్త్రజ్ఞులు కూర్చిన ఒక నివేదిక చెబుతుంది. ఇంతవరకు గేదె నిర్లక్ష్యం చేయబడింది, అయితే “గేదెను గూర్చి సరిగ్గా తెలుసుకోవడం అనేక వర్ధమాన దేశాలకు చెప్పలేనంత ప్రయోజనకరంగా ఉండగలదు,” అని ఇప్పటికీ వారు ఒప్పుకుంటున్నారు. ఎక్కువ పరిశోధన జరపడం “నిజమైన లక్షణాలను తెలుసుకోవడానికి” సహాయపడుతుందని వారు చెబుతున్నారు.
విశ్వాసముగల మరియు ప్రయోజనకరమైన నీటి గేదె మానవుని మంచి స్నేహితులలో ఒకటని ఆసియా రైతులకు శతాబ్దాలుగా తెలిసిన విషయాన్నే చివరికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.
[19వ పేజీలోని బాక్సు]
అపార్థము చేసుకొనబడిన వ్యక్తిత్వం
“నీటి గేదె శత్రువని, క్రూరమైనదని సాధారణంగా అందరూ తలస్తారు. విజ్ఞాన సర్వస్వాలు ఈ ప్రతికూల అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయి” అని ది వాటర్ బఫెలో: న్యూ ప్రోస్పెక్ట్స్ ఫర్ ఆన్ అండర్యూటిలైజ్డ్ ఆనిమల్ అనే పుస్తకం చెబుతుంది. అయితే, నిజానికి మచ్చిక చేయబడిన నీటి గేదె “పెంపుడు జంతువులలో అతి సాధువైనవాటిలో ఒకటి. ఇది భయానకంగా కనిపిస్తున్నప్పటికీ, ఇంట్లో గారాబంగా పెరిగే పెంపుడు జంతువులాంటిది—అందరితో కలిసిపోయేది, సాధువైనది, స్థిమితం గలది.” తనకు తగని పేరును ఈ నీటి గేదె ఎలా పొందింది? ఆఫ్రికా కేప్ బఫెలోను (సిన్సెరోస్ కాఫెర్) చూస్తే గుర్తుపట్టలేనంతగా నీటి గేదెలాగే ఉండడమే కారణం కావచ్చు. నిజానికి అది దీని దూరపు బంధువే అయినప్పటికీ, అది దుష్ట స్వభావము గలది. అయినప్పటికీ, నీటి గేదెలు వాటితో కూడుకోవు. అవి తలబిరుసైన తమ బంధువులను ఎక్కడుంచాలో అక్కడే ఉంచడానికి ఇష్టపడతాయి.