యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .
దొంగతనం—ఎందుకు చేయకూడదు?
“నాకు 16 ఏండ్లు, నాకో పెద్ద సమస్య ఉంది. ఈ మధ్య నేను విపరీతంగా దొంగతనం చేయడం మొదలెట్టాను. రోడ్డు ప్రక్కన అమ్మేవారి దగ్గరికి వెళ్ళి ఏడు జతల చెవి రింగులను దొంగతనం చేశాను. నా సమస్య గురించి ఎవరితోనైనా చెప్పుకోవాలంటే నాకు భయంగా ఉంది. దయచేసి నాకు సహాయం చేయండి!”
మానసిక సంఘర్షణలో ఉన్న ఓ అమ్మాయి ఒక పత్రికలోని సలహా కాలమ్‌లో పైవిధంగా వ్రాసింది. ఒక రచయిత ఇలా నివేదించాడు: “[అమెరికాలో] ప్రతిసంవత్సరం వెయ్యి కోట్ల డాలర్ల విలువగల వినియోగ వస్తువులు . . . అపహరించబడుతున్నాయి, దోపిడీ చేయబడుతున్నాయి, దోచుకోబడుతున్నాయి, లేదా చిల్లర దుకాణాల నుండి దొంగిలించబడుతున్నాయి. దుకాణాలను దోచుకున్నందుకు అరెస్ట్ చేయబడినవారిలో దాదాపు సగం మంది ముఖ్యంగా యౌవనస్థులే.”
ఇటీవలి ఓ సర్వే ప్రకారం, ఉన్నత పాఠశాలలోని (సెకండరీ స్కూల్) మూడింట ఒక వంతు మంది విద్యార్థులు దుకాణాలను దోచుకున్నట్లు ఒప్పుకుంటున్నారు. పరిశోధకులైన జేన్ నార్మన్ మరియు మిరాన్ హారిస్ చేసిన మరొక సర్వే ప్రకారం “దాదాపు అందరు [యౌవనులు] ఒకప్పుడు, కాకపోతే మరొకప్పుడు డబ్బు చెల్లించకుండానే ఏదో ఒకటి తీసుకున్నారని ఒప్పుకుంటున్నారు.”
వాళ్ళు ఎందుకు దొంగతనం చేస్తారు
ఇతరులకు చెందిన ఒక వస్తువును వారి అనుమతి లేకుండానే మనఃపూర్వకంగా తీసుకునేవాడే దొంగ. కొన్నిసార్లు వ్యక్తిగత అవసరం వల్ల దొంగతనం సమర్ధించబడుతున్నట్లు కనిపించవచ్చు. “నేను అప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉండేవాడ్ని, నేను రెస్టారెంటు వెనుక భాగానికి వెళ్ళి తలుపును తన్ని, తెరిచి, కొంత కోడి మాంసం తీసుకునేవాడిని. అంతే. నేను ఆకలితో ఉండడం వల్లే అలా చేశాను,” అని పేదవాడైన ఒక యౌవనస్థుడు గుర్తుచేసుకుంటున్నాడు.
“దొంగ ఆకలిగొని ప్రాణరక్షణకొరకు దొంగిలిన యెడల యెవరును వాని తిరస్కరింపరు గదా” అని ఒక బైబిలు సామెత చెబుతుంది. అలాగైనప్పటికీ, దొంగతనమనేది నైతికంగా తప్పే. బైబిలులోని తరువాతి వచనం చూపించేదేమంటే, ఆకలిగొన్న దొంగ కూడా కఠిన జరిమానాను చెల్లించడం ద్వారా “పరిహారం చేయవలసి” ఉండేది.—సామెతలు 6:30, 31 (NW).
వింతేమంటే, యౌవనస్థులైన కొందరు దొంగలు మాత్రమే నిజంగా అవసరతలో ఉన్నందువల్ల దొంగతనం చేస్తున్నారు. ఉదాహరణకు, యౌవనస్థురాలైన మేరి జేన్ ఈ విధంగా ఒప్పుకుంది: “అవును, నేను దుకాణం నుండి దొంగతనం చేశాను, నిజంగా అది ఆశ్చర్యం కలిగించేదే. ఎందుకంటే నేనెందుకలా చేశానో నాకు తెలియదు. మా తలిదండ్రులు ప్రతి అవసరానికి నాకు డబ్బిస్తారు. నాకు దేని అవసరమూ లేదు.”a సెవెంటీన్ అనే పత్రిక కూడా దాదాపు ఇలాగే నివేదించింది: “నేషనల్ క్రైమ్ ప్రివెన్షన్ కౌన్సిల్ చేసిన సర్వేలో, నేరస్థులు చెప్పిన కారణమేమిటంటే, వాళ్ళకు ఏదైనా ఉచితంగా కావాలి.” దుకాణదారులు ‘మరీ ఎక్కువగా తీసుకుంటారు’ అని వాదిస్తూ కొందరు యౌవనస్థులు తాము చేసిన దొంగతనాన్ని సమర్థించుకున్నారు!
చాలా మంది యౌవనస్థుల దృష్టిలో దొంగతనమంటే కేవలం విసుగును తొలగించుకునేందుకు ఒక మార్గము. “పాఠశాల ముగిసిన తర్వాత ఏదో ఒకటి చేయడం, అంతే,” అని జెర్మీ అనే పేరుగల మునుపటి ఒక దొంగ వివరిస్తున్నాడు. దొంగతనం చేయడం సాహసోపేతమైన క్రీడలా అనిపిస్తుంది; దొంగిలించిన జాకెట్‌ను పర్సులో కుక్కుకునేటప్పుడు లేక కాంపాక్ట్ డిస్క్‌ను బ్యాగ్‌లో వేసుకునేటప్పుడు కలిగే ఉద్వేగాన్ని కొందరు ఇష్టపడతారు.
బాధను కప్పిపుచ్చుకోవడమా?
నిజంగా, జైలుకు వెళ్ళే ప్రమాదం లేకుండానే విసుగును పారద్రోలే మరింత సురక్షితమైన మార్గాలున్నాయి. అలాగైతే, సరదా కొరకు కాకుండా, మరింత ఉత్సాహం కోసం అలా చేయడానికి ఏవైనా కారణాలుండి ఉండవచ్చా? కారణాలున్నాయని అనేక మంది నిపుణులు నమ్ముతున్నారు. ది లేడీస్ హోమ్ జర్నల్ ఏమని అభిప్రాయపడిందంటే, కొందరు యౌవనస్థులకు “పెద్దవారవుతున్న కొలది, ఈ ఒత్తిడిని ఎదుర్కోవడం కష్టంగా ఉంటుంది. తమ తలిదండ్రులతో పోట్లాడడం, స్నేహబంధాన్ని తెంచుకోవడం, పరీక్షల్లో తక్కువ మార్కులు రావడం వారికి తమ జీవితాలపై తమ స్వాధీనం తప్పినట్లు భావించేలా చేస్తాయి; నియమాలను ఉల్లంఘించడం మరల శక్తిని పుంజుకున్న అనుభూతిని వారికి కలిగిస్తుంది.”
అవును, ఒక దొంగ ఆ సాహసం చేయడానికి వెనుక ఎంతో బాధ, వేదన ఉండవచ్చు. బైబిలు చెబుతున్నట్లు, “ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును.” (సామెతలు 14:13) మళ్ళీ మళ్ళీ దొంగతనం చేయడం నిరాశకు సూచన కావచ్చని రుజువులు చూపిస్తున్నాయి. కొందరు యౌవనస్థులైన దొంగలు చిన్నప్పుడు అత్యాచారానికి గురైన చరిత్ర గలవారని కనుగొనబడింది. బాధకు కారణమేదైనప్పటికీ, దొంగతనంలో కలిగే ఉల్లాసం బాధను కనీసం కొంతసేపటికైనా అణచివేస్తుంది.b ఉదాహరణకు, కార్లను దొంగతనం చేసి, వాటిని పిచ్చిగా నడపడంలో సంతోషాన్ని పొందే ఒక అమెరికా యౌవనస్థుని విషయం తీసుకోండి. “మంచిగా అనిపిస్తుంది, మీరు భయపడినట్లు, భావోద్రేకం చెందినట్లు మీకనిపిస్తుంది,” అని అతడు చెబుతున్నాడు.
తోటివారు మరియు వారి ఒత్తిడి
“చెడు సహవాసాలు ప్రయోజనకరమైన అలవాట్లను పాడు చేయును” అని బైబిలు చెబుతుంది. (1 కొరింథీయులు 15:33 NW) ఈ సత్యం అంతటా గుర్తించబడింది. రచయితయైన డెనెజ్ వి. లాంగ్ ఈ విధంగా అభిప్రాయపడ్డాడు: “సాధారణంగా ఒక యౌవన వ్యక్తి, ఆమెంతట ఆమె లేక ఆయనంతట ఆయనే సమస్యలో చిక్కుకోరు.” తరచూ, దేనినైనా దొంగిలించేందుకు తోటివారు ఒకరినొకరు సవాలు చేసుకుంటారు. చాలా మంది యౌవనస్థులు ఒత్తిడికి లోనవుతారన్నది విచారకరము.
“నేను జూనియర్ హైస్కూల్‌లో అమ్మాయిల ఓ గుంపులో చేరాను,” అని కేథి అనే బాలిక చెబుతుంది. వారి ప్రత్యేక క్లబ్బులో సభ్యురాలగుటకైన వెల ఎంత? ఖరీదైన ఒక స్వెట్టర్‌ని దొంగిలించడమే దానికైన వెల. “నేను ఆ క్లబ్బులో చేరడానికి ఇష్టపడ్డాను, కాబట్టి నేను ఒక అంగడిలోనికి వెళ్ళి, స్వెట్టర్‌ను దొంగిలించేశాను,” అని ఆ బాలిక ఒప్పుకుంటోంది.
దేవుని దృక్పథాన్ని తెలుసుకోవడం
మీరు కొనలేని వస్తువులను సొంతం చేసుకోవడం, మరింత ప్రమాదకరమైన పనుల్లో అనుభూతిని పొందడం లేదా తోటివారి అంగీకారాన్ని పొందడం అనేవి దొంగిలించడాన్ని ఆకర్షణీయంగా చేస్తాయి. అయితే, “దొంగిలకూడదు” అన్నది బైబిలులోని పది ఆజ్ఞల్లో ఒకటి. (నిర్గమకాండము 20:15) ‘దొంగలు దేవుని రాజ్యమునకు వారసులు కారు,’ అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (1 కొరింథీయులు 6:10) దేవుని దృక్పథం ముఖ్యంగా క్రైస్తవులుగా పెరిగిన యౌవనస్థులను ప్రభావితం చేయాలి. పైకి నీతిమంతుల్లా కనిపిస్తూ, లోపల దొంగతనం చేయడం ఎంత వేషధారణయై ఉంటుందో! ఈ విషయాన్ని గూర్చి అపొస్తలుడైన పౌలు ఈ విధంగా అన్నాడు: “ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా?”—రోమీయులు 2:21.
అరెస్ట్ చేయబడే అవమానకరమైన సాధ్యతే, అవినీతికరమగు దొంగతనాన్ని చేయకుండా ఉండేందుకు కావలసినంత కారణం. యౌవనస్థుడైన ఒక దొంగ అరెస్టు చేయబడిన తర్వాత, “నాకు చావాలనుంది,” అని అన్నాడు. యెహోవా ‘అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుటను అసహ్యించుకుంటాడని’ తెలుసుకోవడం, దొంగిలించాలనే ప్రలోభానికి, ఒత్తిడికి లోనవ్వకుండా ఉండేందుకు ఒక బలమైన కారణం. (యెషయా 61:8) ఒకడు దొంగతనం చేసి దుకాణాదారులకు, పోలీసులకు, తలిదండ్రులకు పట్టుబడకుండా ఉన్నా, యెహోవా నుండి మాత్రం దానిని దాచలేడు. బయటపడతాడన్నది తథ్యం.—యెషయా 29:15.
పాపం మనిషి హృదయాన్ని కఠినపరుస్తుందని కూడా గుర్తుంచుకోండి. (హెబ్రీయులు 3:13) చిన్న దొంగతనాలు మరింత క్రూరమైన, అలక్ష్యమైన పనులకు దారితీస్తాయి. ఉదాహరణకు, యౌవనస్థుడైన రాజర్ నేరస్థునిగా తన జీవితాన్ని తన తల్లి పర్సులోని డబ్బును దొంగిలించడంతో మొదలెట్టాడు. చివరికి, వృద్ధురాండ్రను నేలపై పడవేసి, వారి పర్సులను కూడా దొంగిలించాడు!
ప్రలోభానికి వ్యతిరేకంగా పోరాడడం
ఒకడు రహస్యంగా దొంగిలించడాన్ని ఆరంభించినట్లయితే, దానిని మానుకోవడం సులభం కాదన్నది ఒప్పుకోవలసిందే. “అది ఒక రకమైన వ్యసనం” అని ఒక యువకుడు ఒప్పుకున్నాడు. ఒక యువకుడైనా, యువతియైనా తన మార్గాలనెలా విడనాడగలరు?
దేవుని ఎదుట మీ తప్పును ఒప్పుకోండి. తమ తప్పిదాలను గూర్చి పశ్చాత్తాపపడి నిష్కపటంగా ఆయన ఎదుట ఒప్పుకునేవారిని ఆయన “బహుగా క్షమించును.”—యెషయా 55:7.
సహాయాన్ని పొందండి. ఈ పత్రికా పాఠకులలో అనేకులకు వారి ప్రాంతంలోని యెహోవాసాక్షుల క్రైస్తవ సంఘంతో పరిచయం ఉంది. అలాంటివారు స్థానిక క్రైస్తవ అధ్యక్షుల దగ్గరకు వెళ్ళి, దిద్దుబాటును, ఆత్మీయ సహాయాన్ని అభ్యర్థించవచ్చు. (యాకోబు 5:14, 15) నైతిక సూత్రాలుగల తలిదండ్రులు కూడా సహాయానికి, మద్దతుకు మంచి మూలమని రుజువు చేయగలరు. బాధ, వేదన లేక కేవలం విసుగు మాత్రమే చెడునడవడికి కారణాలైతే, దయాపూర్వకంగా వినేవారితో ఆ విషయాలను మాట్లాడడం నిజంగా చాలా సహాయకరంగా ఉండగలదు.—సామెతలు 12:25.
తిరిగి ఇచ్చేయండి. మోషే ధర్మశాస్త్రం క్రింద, దొంగలు దొంగిలించిన వస్తువులను వడ్డీతో సహా తిరిగి ఇవ్వవలసి ఉండేది. (లేవీయకాండము 6:4, 5) అలా చేయడం ఒకరు మనస్సాక్షిని పవిత్రం చేసుకోవడానికి సహాయపడడమే కాక, దొంగిలించడంవల్ల ఇతరులకు వచ్చే కష్టాలను అర్థం చేసుకోవడానికి కూడా సహాయపడుతుంది. ఒక వ్యక్తి “దొంగిలినదానిని మరల ఇచ్చివేసి పాపము జరిగింపక యుండి, జీవాధారములగు కట్టడలను అనుసరించినయెడల అతడు మరణము నొందక అవశ్యముగా బ్రదుకును,” అని బైబిలు వాగ్దానం చేస్తోంది.—యెహెజ్కేలు 33:15.
అసూయను, పేరాశను అణచివేయండి. “నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు” అన్నది పది ఆజ్ఞల్లో చివరిది. (నిర్గమకాండము 20:17) మీకు ఏదైనా నిజంగా అవసరమైతే—లేదా కావాలనుకుంటే—మరి దానిని కొనుక్కోలేనట్లయితే, దానిని కొనుక్కోవడానికి డబ్బు సంపాదించేందుకు బహుశ మీరు ఒక మార్గాన్ని కనుగొనగలరు. అపొస్తలుడైన పౌలు ఈ విధంగా సలహా ఇచ్చాడు: “దొంగిలువాడు ఇకమీదట దొంగిలక . . . తన చేతులతో మంచి పనిచేయుచు కష్టపడవలెను.”—ఎఫెసీయులు 4:28.
మీ సహవాసాలను గూర్చి మెలకువగా ఉండండి. “ఏదైనా ఒక తప్పును లేదా నేరాన్ని చేసే ఒక స్నేహితునితో లేదా స్నేహితుల గుంపులో మీరు ఉన్నట్లయితే, ఆ సన్నివేశంలో వారితో పాటు ఉన్నందుకు మీరు కూడా నేరస్థులుగా ఎంచబడతారు,” అని రచయితయైన డినైస్ లాంగ్ గుర్తుచేస్తున్నారు. చట్టవిరుద్ధమైన దేనినైనా చేయమని మీ తోటివారు చెప్పినట్లయితే, చేయను అని చెప్పగలిగే ధైర్యాన్ని కలిగి ఉండండి.—సామెతలు 1:10-19.
దొంగతనం వల్ల ఇతరులకు కలిగే హానిని గూర్చి పరిశీలించండి. ఒక దొంగ తనను గూర్చి మాత్రమే చింతిస్తాడు. కాని యేసు మనకిలా బోధిస్తున్నాడు: “కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి.” (మత్తయి 7:12) ఇతరులపై శ్రద్ధ చూపించడం ఒకడు నేర్చుకున్నప్పుడు, సహజంగానే అతడు ఇతరులకు బాధ కలిగించే దానిని ఎక్కువగా చేయడు.
మీరు అనుభవించవలసి వచ్చే పర్యవసానాలను గూర్చి తలంచండి. (గలతీయులు 6:7) మీరు కొనుక్కోలేని తళుక్కుమంటున్న ఆ చిన్న నగను, లేదా చిన్న యంత్రాన్ని సొంతం చేసుకుంటే ఎంత బాగుంటుందోనని తలంచే బదులు, పట్టుబడి, శిక్షించబడడం ఎంత వేదనాకరంగా ఉంటుందో తలంచండి; మీ తలిదండ్రుల మీదికి, అలాగే దేవుని మీదికి కూడా మీరు తీసుకుని వచ్చే నిందను గూర్చి తలంచండి! దొంగిలించడమనేది మంచి తలంపు కానే కాదనే నిర్ధారణకు మీరు తప్పక వస్తారు.
[అధస్సూచీలు]
a కొన్ని పేర్లు మార్చబడ్డాయి.
b క్లెప్టొమానియాను గూర్చి అంటే, దొంగిలించుదామనే వెర్రిబుద్ధిని గూర్చి, అంటే మానసిక దౌర్భల్యం వల్ల దొంగతనం చేయాలనే బలమైన కోరిక కలగడాన్ని గూర్చి మేము చర్చించడం లేదు. క్లెప్టొమానియా చాలా అరుదని, అది దుకాణాలను దోపిడీ చేసే వారిలో 5 శాతం మందిని మాత్రమే బాధించిందని వైద్యులు చెబుతున్నారు. ఈ లోపం తరచూ మందుతో చికిత్స చేయబడుతుంది.
[19వ పేజీలోని చిత్రం]
దుకాణాలను దొంగతనం చేసేవారు తరచూ పట్టుబడి అవమానాన్ని భరించవలసి వస్తుంది