యెహోవా నాపట్ల కృపగల దేవుడు
జాన్ ఆండ్రోనీకొస్ చెప్పినది
అది 1956వ సంవత్సరం. మా వివాహమై తొమ్మిది రోజులయ్యిందంతే, నేను ఉత్తర గ్రీస్‌లోని కోమోటీనీలోని అప్పీలు కోర్టులో ఉన్నాను. దేవుని రాజ్యాన్ని ప్రకటించినందుకు నాకు విధించబడిన 12 నెలల శిక్ష కొట్టివేయబడుతుందని నేను ఎదురు చూస్తున్నాను. అప్పీలు కోర్టు నిర్ణయం—ఆరు నెలల జైలు శిక్ష—నా ఆశలను అడియాసలు చేస్తూ, రానున్న శ్రమల పరంపరకు నాందీ అయ్యింది. అయితే, ఆ శ్రమలన్నిటిలోనూ యెహోవా నాపట్ల కృపగల దేవునిగా ఉన్నాడు.
నేను 1931 అక్టోబరు 1న జన్మించినప్పుడు, మా కుటుంబం కవాల్లా నగరంలో నివసిస్తుంది. అది, అపొస్తలుడైన పౌలు తన రెండవ మిషనరి యాత్రలో సందర్శించిన, మాసిదోనియలోని నియపోలిస్. నాకు ఐదేళ్లున్నప్పుడు అమ్మ యెహోవాసాక్షి అయ్యింది, ఆమె దాదాపు నిరక్షరాస్యురాలే అయినప్పటికీ, నాలో యెహోవా పట్ల ప్రేమను, భయాన్ని పెంపొందింపజేయడానికి ఆమె తాను చేయగలిగినదంతా చేసింది. మా నాన్న చాలా పూర్వాచార పరాయణుడు, గ్రీకు ఆర్థడాక్సు సాంప్రదాయాన్ని మొండిగా పట్టుకుని వ్రేలాడేవాడు. ఆయనకు బైబిలు సత్యమంటే ఏమాత్రం ఆసక్తిలేదు, అమ్మను ఎంతో వ్యతిరేకించేవాడు, తరచూ దౌర్జన్యానికి పాల్పడేవాడు.
అలా నేను విభాగింపబడిన గృహంలో పెరిగాను, నాన్న ఎప్పుడూ అమ్మను కొడుతూ ఉండేవాడు, దౌర్జన్యం చేసేవాడు, మమ్మల్ని వదిలేశాడు కూడా. నా చిన్నతనం నుండే, అమ్మ నన్ను, చెల్లిని క్రైస్తవ కూటాలకు తీసుకువెళ్లేది. అయితే, నాకు 15 ఏళ్లు వచ్చేసరికి యౌవనేచ్ఛలూ, స్వేచ్ఛాభిలాషా నన్ను యెహోవాసాక్షుల నుండి దూరం తీసుకువెళ్లాయి. అయినప్పటికీ, నమ్మకస్థురాలైన మా అమ్మ ఎంతో తీవ్రంగా ప్రయత్నించింది, నాకు సహాయం చేయాలనే ప్రయత్నంలో ఆమె ఏకధాటిగా కన్నీళ్లు కార్చింది.
పేదరికం మూలంగానూ, నేను గడుపుతున్న చెడు జీవితం మూలంగానూ, నేను చాలా జబ్బు పడ్డాను, మూడు నెలలకంటే ఎక్కువకాలంపాటు మంచంలో ఉండాల్సి వచ్చింది. అప్పుడే, ఎంతో వినమ్రుడైన ఒక సహోదరుడు, అంటే అమ్మ సత్యం నేర్చుకోవడానికి సహాయం చేసిన సహోదరుడు, నాకు దేవుని పట్లవున్న యథార్థమైన ప్రేమను గ్రహించాడు. నేను ఆధ్యాత్మికంగా కోలుకునేలా నాకు సహాయం చేయవచ్చునని ఆయన భావించాడు. “జాన్‌కు సహాయం చేయడానికి ప్రయత్నిస్తూ మీరు మీ సమయం వ్యర్థం చేసుకుంటున్నారు; అతడిక మళ్లీ ఎన్నడూ ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తిని పెంపొందింపజేసుకోలేడు” అని ఇతరులు ఆయనకు చెప్పారు. కాని ఈ సహోదరుడు చూపించిన సహనం, నాకు సహాయం చేయడంలో ఆయన కనబర్చిన పట్టుదల ఫలించాయి. 1952, ఆగస్టు 15న, అంటే 21 ఏళ్ల వయస్సులో నేను నీటి బాప్తిస్మం ద్వారా యెహోవాకు నా సమర్పణను సూచించాను.
క్రొత్తగా వివాహమై, కారాగారంలో
మూడు సంవత్సరాల తర్వాత నాకు మార్తతో పరిచయమైంది, ఆమె ఆధ్యాత్మిక విషయాల్లో ఎంతో ఆసక్తి ఉన్న సద్గుణసంపన్నురాలు, త్వరలోనే మేము పెళ్లి నిశ్చయం చేసుకున్నాము. ఒకరోజు, “నేను ఈ రోజు ఇంటింటికీ ప్రకటించడానికి వెళ్తున్నాను. మీరు కూడా నాతో వస్తారా?” అని మార్త నన్ను అడిగేసరికి నేను నిజంగా అమితాశ్చర్యపోయాను. అంతవరకూ నేనెప్పుడూ దానిలో పాల్గొనలేదు, నేనెక్కువగా అనియత సాక్ష్యమిచ్చేవాడిని. ఆ కాలంలో, గ్రీసులో ప్రకటనా పని నిషేధించబడింది, మేము మా ప్రకటనా పనిని రహస్యంగా కొనసాగించవలసి వచ్చేది. తత్ఫలితంగా, ఎన్నో అరెస్టులు, కోర్టు కేసులు, కఠినమైన జైలు శిక్షలు. అయినా, నేను నా కాబోయే భార్యకు కాదని చెప్పలేకపోయాను!
1956లో మార్త నా భార్య అయ్యింది. అప్పుడే, మా వివాహమైన తొమ్మిది రోజుల తర్వాత, కోమోటీనీలోని అప్పీలు కోర్టు నాకు ఆరు నెల్ల జైలు శిక్షను విధించింది. దానితో, “నేను నిజంగా యెహోవాసాక్షినని నేనెలా నిరూపించుకోగలను? నా విశ్వాసాన్ని నిరూపించుకునే అవకాశం నాకెప్పుడూ లభించలేదు” అని నేను కొంతకాలం క్రితం ఒక క్రైస్తవ సహోదరికి వేసిన ప్రశ్న నాకు జ్ఞాపకం వచ్చింది, ఆ సహోదరి మా అమ్మ స్నేహితురాలు. ఆమె నేను జైల్లో ఉండగా నన్ను చూడటానికి వచ్చినప్పుడు, ఆ ప్రశ్నను నాకు జ్ఞాపకం చేసి, “ఇప్పుడు నీవు యెహోవాను ఎంతగా ప్రేమిస్తున్నావో నిరూపించుకోవచ్చు. ఇది నీకివ్వబడిన నియామకం” అన్నది.
నన్ను జైల్లో నుండి విడిపించడానికి నా లాయరు డబ్బు పోగుచేయడానికి ప్రయత్నిస్తున్నాడని నేను తెలుసుకున్నప్పుడు, నేను శిక్ష అనుభవించడానికే ఇష్టపడతానని ఆయనకు చెప్పాను. ఆరు నెలల జైలు శిక్ష ముగిసే సమయానికి నేనెంతో సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే నాతోపాటు ఉన్న ఇద్దరు ఖైదీలు సత్యాన్ని అంగీకరించారు! తర్వాతి సంవత్సరాల్లో, సువార్త నిమిత్తం నేను అనేకానేక కోర్టు కేసుల్లో నిమగ్నమవ్వవలసి వచ్చింది.
మేము తీసుకున్న నిర్ణయాలను బట్టి మేమెన్నడూ చింతించలేదు
నేను విడుదలైన రెండు సంవత్సరాల తర్వాత, అంటే 1959లో, నేను సంఘ సేవకునిగా అంటే ప్రిసైడింగ్ పైవిచారణకర్తగా సేవచేస్తున్నప్పుడు, రాజ్య పరిచర్య పాఠశాలకు హాజరుకమ్మని ఆహ్వానాన్ని అందుకున్నాను, ఈ పాఠశాలలో సంఘ పెద్దలకు శిక్షణనిస్తారు. అయితే, అదే సమయంలో, ఒక ప్రజా ఆసుపత్రిలో నాకు శాశ్వత స్థానాన్నిచ్చే ఒక ఉద్యోగావకాశం వచ్చింది, ఆ ఉద్యోగం నాకూ నా కుటుంబానికీ జీవితమంతా ఆర్థికపరమైన భద్రతనిస్తుంది. నేనేది ఎంపిక చేసుకోవాలి? నేను ఆ ఆసుపత్రిలో అప్పటికే మూడు నెలలుగా పనిచేస్తున్నాను, నా పనిని చూసి డైరెక్టరు ఎంతగానో సంతృప్తి చెందాడు, కాని పాఠశాలకు వెళ్లేందుకు ఆహ్వానం వచ్చినప్పుడు, నేను జీతం నష్టం మీద సెలవు తీసుకోవడానికి కూడా ఆయన అనుమతించలేదు. ఆ సందిగ్ధం గురించి ప్రార్థనాపూర్వకంగా ఆలోచించిన తర్వాత, రాజ్యాసక్తులకు ప్రథమ స్థానమిచ్చి, ఉద్యోగావకాశాన్ని నిరాకరించడానికే నేను నిర్ణయించుకున్నాను.—మత్తయి 6:33.
ఆ సమయంలోనే, జిల్లా, ప్రాంతీయ పైవిచారణకర్తలు మా సంఘంలో సేవచేయడానికి వచ్చారు. గ్రీకు ఆర్థడాక్స్ పాదిరీలూ, అధికారుల కఠినమైన వ్యతిరేకత మూలంగా మేము మా కూటాలను స్వంత ఇళ్లల్లో రహస్యంగా జరుపుకోవాలి. ఒకసారి కూటం ముగిసిన తర్వాత, జిల్లా పైవిచారణకర్త నా దగ్గరికి వచ్చి, పూర్తికాల సేవను చేపట్టే ఆలోచన ఉందా అని అడిగారు. ఆయన సూచన నా హృదయ తంతువుల్లో ఒకదాన్ని తాకింది, ఎందుకంటే నేను బాప్తిస్మం తీసుకున్నప్పటి నుండి దాని గురించి కలలు కనేవాడిని. “మహదానందంగా చేపడతాను” అని నేను జవాబిచ్చాను. అయితే అప్పటికే, మా అమ్మాయిని పెంచవలసిన అదనపు బాధ్యత కూడా నాకుంది. ఆ సహోదరుడు నాకిలా చెప్పాడు: “యెహోవాపై నమ్మకముంచండి, మీ పథకాలను నెరవేర్చుకోవడానికి ఆయన సహాయం చేస్తాడు.” అలా, మా కుటుంబ బాధ్యతలను అలక్ష్యం చేయకుండా, నేను, నా భార్యా పరిస్థితులకు తగినవిధంగా సర్దుకుపోగలిగాము, కాబట్టి 1960 డిసెంబరులో, నేను తూర్పు మాసిదోనియలో ప్రత్యేక పయినీరుగా సేవచేయడం ప్రారంభించాను—ఆ దేశంలో ఉన్న ఐదుగురు పయినీర్లలో నేనొకడిని.
నేను ఒక సంవత్సరంపాటు ప్రత్యేక పయినీరుగా సేవచేసిన తర్వాత, ఏథెన్సులోని బ్రాంచి కార్యాలయం నన్ను ప్రయాణ పైవిచారణకర్తగా సేవచేసేందుకు ఆహ్వానించింది. ఈ విధమైన సేవలో నేను ఒక నెల శిక్షణపొంది ఇంటికి తిరిగి వచ్చి, నా అనుభవాల గురించి మార్తకు చెప్తుండగా, ఒక పెద్ద మాంగనీస్ గని డైరెక్టర్ మా ఇంటికి వచ్చి, దాని రిఫైనింగ్ విభాగంలో మేనేజరుగా చేరమని నన్ను ఆహ్వానించాడు, నాకు ఉదారంగా ఐదేళ్ల కాంట్రాక్టు, ఒక చక్కని ఇల్లు, వాహనం ఇస్తానని కూడా చెప్పాడు. సమాధానం చెప్పడానికి ఆయన నాకు రెండు రోజుల గడువిచ్చాడు. మళ్లీ, ఎంతమాత్రం సంకోచించకుండా, “చిత్తగించుము నేనున్నాను, నన్ను పంపు”మని యెహోవాకు ప్రార్థన చేశాను. (యెషయా 6:8) నా భార్య నాతో పూర్తిగా ఏకీభవించింది. దేవునిపై నమ్మకముంచి, మేము ప్రయాణ పనిని ప్రారంభించాము, యెహోవా తన కృపతో, మమ్మల్ని ఎన్నడూ నిరుత్సాహపర్చలేదు.
కష్టనష్టాల్లో సేవచేయడం
ఆర్థికపరమైన సమస్యలున్నప్పటికీ, మేము ముందుకెళ్లాము, యెహోవా మాకు అవసరమైనవి అనుగ్రహించాడు. మొదట్లో నేను ఒక చిన్న మోటార్ సైకిల్ మీద దాదాపు 500 కిలోమీటర్లు ప్రయాణిస్తూ సంఘాలను దర్శించేవాడిని. ఎన్నోసార్లు కష్టాలు ఎదురయ్యాయి, కొన్నిసార్లు దుర్ఘటనలు జరిగాయి. ఒకసారి చలికాలంలో నేను ఒక సంఘం నుండి తిరిగి వస్తూ, పొంగిపొర్లుతున్న కాలువను దాటుతుండగా, మోటార్ సైకిల్ పాడైపోయింది, నేను మోకాళ్ల వరకు నీళ్లలో తడిచిపోయాను. తర్వాత మోటార్ సైకిల్ టైరు పంక్చరైంది. గాలికొట్టే పంపువున్న దారినపోయే వ్యక్తి నాకు సహాయం చేశాడు, దానితో నేను దగ్గరలోవున్న గ్రామానికి చేరుకుని టైరు రిపేరు చేయించుకున్నాను. చివరికి నేను ఉదయం మూడు గంటలకు చలికి వణికిపోతూ, పూర్తిగా అలసిపోయి ఇంటికి చేరుకున్నాను.
మరో సందర్భంలో, నేను ఒక సంఘం నుండి మరో సంఘానికి వెళ్తుండగా, మోటార్ సైకిల్ జారి నా మోకాలిపై పడింది. దానితో నా పాంటు చినిగిపోయి, రక్తంతో తడిసిపోయింది. నా దగ్గర మరో పాంటు లేకపోవడంతో, ఆ సాయంకాలం నేను మరో సహోదరుని పాంటు వేసుకుని ప్రసంగించాను, ఆ పాంటు నాకు మరీ పెద్దదైపోయింది. అయినా, యెహోవాకు, నా ప్రియ సహోదరులకు సేవచేయాలన్న నా కోరికను ఏ కష్టమూ అణచివేయలేకపోయింది.
మరో దుర్ఘటనలో, నాకు బాగా గాయాలయ్యాయి, నా చెయ్యి, ముందు పళ్లు విరిగిపోయాయి. అప్పుడే, అమెరికాలో నివసిస్తున్న నా చెల్లి నన్ను చూడటానికి వచ్చింది, ఆమె సాక్షి కాదు. నేను ఒక వాహనం కొనుక్కోడానికి ఆమె సహాయం చేయడంతో ఎంతో ఉపశమనం కలిగింది! ఏథెన్సు బ్రాంచిలో ఉన్న సహోదరులు నాకు జరిగిన దుర్ఘటన గురించి విన్నప్పుడు, నన్ను ప్రోత్సహిస్తూ ఒక ఉత్తరం వ్రాశారు, అందులో ఇతర విషయాలతోపాటు, “దేవుని ప్రేమించువారికి . . . మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగు”తాయని చెప్తున్న రోమీయులు 8:28లోని మాటలను కూడా చేర్చారు. ఈ నిశ్చయత నిజమని నా జీవితంలో పదే పదే రుజువయ్యింది!
సంభ్రమాశ్చర్యం
1963లో, నేను ఒక ప్రత్యేక పయినీరుతో కలిసి, ప్రజలు అంతగా ప్రతిస్పందించని ఒక గ్రామంలో పనిచేస్తున్నాను. వీధిలో చెరొకవైపున విడి విడిగా పని చేయాలని మేము నిర్ణయించుకున్నాము. ఒక ఇంట్లో, నేను ఒక ఇంటి తలుపు తట్టగానే ఒక స్త్రీ నన్ను లోనికి లాగి తలుపు మూసేసింది. ఏమి జరుగుతుందా అని నేను భయపడిపోయాను. కొంతసేపటికి, ఆమె ఆ ప్రత్యేక పయినీరును కూడా హడావిడిగా ఇంట్లోకి పిలిచింది. తర్వాత ఆ స్త్రీ, “హుష్! అస్సలు కదలకండి!” అని మాకు చెప్పింది. కొద్దిసేపటి తర్వాత, బయటి నుండి మాకు వ్యతిరేకుల స్వరాలు వినిపించాయి. ప్రజలు మాకోసం చూస్తున్నారు. పరిస్థితి కాస్త సద్దుమణిగిన తర్వాత, ఆ స్త్రీ మాతో ఇలా అంది: “మిమ్మల్ని కాపాడటానికే నేనిలా చేశాను. నేను మిమ్మల్ని గౌరవిస్తాను, ఎందుకంటే మీరు నిజ క్రైస్తవులని నేను నమ్ముతున్నాను.” మేము ఆమెకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసి, ఆమెకు చాలా ప్రచురణలిచ్చి, అక్కడి నుండి బయలుదేరాము.
పద్నాలుగు సంవత్సరాల తర్వాత, నేను గ్రీసులో ఒక జిల్లా సమావేశానికి వెళ్లాను, ఒక స్త్రీ నా దగ్గరికొచ్చి, “బ్రదర్, నేను మీకు జ్ఞాపకమున్నానా? మీరు మా గ్రామంలో సాక్ష్యమివ్వడానికి వచ్చినప్పుడు వ్యతిరేకుల చేతుల్లో నుండి మిమ్మల్ని కాపాడింది నేనే” అన్నది. ఆమె జర్మనీకి వలస వెళ్లి, బైబిలు పఠించి, యెహోవా ప్రజలతో సహవసించింది. ఇప్పుడు, ఆమె కుటుంబమంతా సత్యంలో ఉంది.
నిజానికి, ఈ సంవత్సరాలన్నిటిలో, మేము అనేక “సిఫారసు పత్రికల”తో ఆశీర్వదించబడ్డాము. (2 కొరింథీయులు 3:1) బైబిలు సత్య జ్ఞానాన్ని పొందేందుకు అనేకమందికి సహాయం చేసే ఆధిక్యత మాకు లభించింది, వాళ్లలో అనేకులు ఇప్పుడు పెద్దలుగా, పరిచర్య సేవకులుగా, పయినీర్లుగా సేవచేస్తున్నారు. నేను 1960 తొలి భాగాలలో సేవచేసిన సర్క్యూట్లలో పిడికెడుమందిగా ఉన్న ప్రచారకులు 10,000 మంది యెహోవా ఆరాధకులుగా అభివృద్ధి చెందడాన్ని చూడటం ఎంతో ఉత్తేజకరంగా ఉంది! తన స్వంత విధానంలో మనల్ని ఉపయోగించుకునే, కృపగల దేవునికే ఘనత అంతా చెందుతుంది.
“రోగశయ్యమీద”
మేము ప్రయాణ పనిలో ఉండగా, మార్త ఎంతో విశేషమైన సహాయకారిగా నిరూపించుకుంది, ఎప్పుడూ ఆనందభరితమైన దృక్పథం కల్గివుండేది. అయితే, 1976 అక్టోబరులో, ఆమె తీవ్ర అస్వస్థతకు గురై, శస్త్రచికిత్స చేయించుకుంది. తర్వాత ఆమె నడుము క్రింది భాగం మొత్తం పక్షవాతానికి గురై చక్రాల కుర్చీకే అంకితమైపోయింది. మేము ఆ ఖర్చును, మానసికాందోళనను ఎలా తట్టుకోగలము? మళ్లీ ఒకసారి యెహోవాయందు నమ్మకముంచి, ఆయన ప్రేమపూర్వకమైన, ఉదారమైన హస్తాన్ని చవిచూశాము. నేను మాసిదోనియలో సేవచేయడానికి వెళ్లినప్పుడు, మార్త ఫిజికల్ థెరపీ కోసం ఏథెన్సులో ఒక సహోదరుని ఇంట్లో ఉండిపోయింది. ఆమె నాకు ఫోన్ చేసి, “నేను బావున్నాను. మీరు మీ పనిలో కొనసాగండి, నేను మళ్లీ కదలగలిగినప్పుడు నా చక్రాల కుర్చీలో మీతోపాటు వస్తాను” అంటూ ప్రోత్సహించేది. ఆమె సరిగ్గా అలాగే చేసింది. బేతేలులో ఉన్న ప్రియమైన సహోదరులు ఎన్నో ప్రోత్సాహకరమైన ఉత్తరాలు వ్రాశారు. “రోగశయ్యమీద యెహోవా వానిని ఆదరించును రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు” అని ఉన్న కీర్తన 41:3లోని మాటలు మార్తకు పదే పదే జ్ఞాపకం చేయబడేవి.
ఈ గంభీరమైన ఆరోగ్య సమస్యల కారణంగా, 1986లో, నేను కవాల్లాలోనే ప్రత్యేక పయినీరు సేవ చేయడం సబబుగా ఉంటుందని నిర్ణయించడం జరిగింది, అక్కడ మా అమ్మాయి కుటుంబానికి దగ్గరలో ఉంటాము. నా ప్రియమైన మార్త చివరి వరకు నమ్మకంగా ఉండి, గత మార్చిలో మరణించింది. ఆమె మరణించక ముందు, “ఎలా ఉన్నారు?” అని సహోదరులు ఆమెను అడిగినప్పుడు, ఆమె సాధారణంగా, “నేను యెహోవాకు దగ్గరగా ఉన్నాను గనుక, నేను బావున్నాను” అని చెప్పేది. మేము కూటాల కోసం సిద్ధపడుతున్నప్పుడు, లేదా కోత విస్తారంగా ఉన్న ప్రాంతాల్లో సేవ చేయడానికి ఆహ్వానాలను అందుకున్నప్పుడు, మార్త, “జాన్, అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో సేవ చేయడానికి మనం వెళదాం” అనేది. ఆమె ఎన్నడూ తన ఆసక్తిని కోల్పోలేదు.
కొన్ని సంవత్సరాల క్రితం, నేను కూడా తీవ్రమైన అస్వస్థతకు గురయ్యాను. 1994 మార్చిలో, నాకు ప్రాణాంతకమైన గుండె జబ్బు వచ్చింది, శస్త్ర చికిత్స తప్పనిసరి అయ్యింది. మళ్లీ ఒకసారి యెహోవా ప్రేమగల హస్తం నాకు క్లిష్టసమయంలో మద్దతునివ్వడాన్ని నేను చవిచూశాను. నేను ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో నుండి బయటకు వచ్చాక నా మంచం ప్రక్కన నిలబడి ఒక ప్రాంతీయ పైవిచారణకర్త చేసిన ప్రార్థననూ, నేనున్న ఆసుపత్రి గదిలోనేవున్న, సత్యంపట్ల ఆసక్తి చూపించిన నలుగురితో నేను జ్ఞాపకార్థ దినాన్ని ఆచరించడాన్నీ నేను ఎన్నడూ మరచిపోలేను.
యెహోవా మా సహాయకునిగా ఉన్నాడు
కాలం కరిగిపోతుంది, మన శరీరాలు బలహీనమైపోతాయి, కాని మన ఆత్మ మాత్రం పఠనం ద్వారా, పరిచర్య ద్వారా పునర్నూతనం చేయబడుతుంది. (2 కొరింథీయులు 4:16) “చిత్తగించుము నేనున్నాను, నన్ను పంపు”మని నేను చెప్పి ఇప్పటికి 39 సంవత్సరాలవుతుంది. సంపూర్ణమైన, సంతోషభరితమైన, ప్రతిఫలదాయకమైన జీవితాన్ని గడిపాను. అవును, కొన్నిసార్లు “నేను శ్రమలపాలై దీనుడనైతిని” అనుకుంటాను, కాని “నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే” అని నేను యెహోవాతో నమ్మకంగా చెప్పగలను. (కీర్తన 40:17) నిజంగా ఆయన నాపట్ల కృపగల దేవుడు.
[25వ పేజీలోని చిత్రం]
1956లో మార్తతో
[26వ పేజీలోని చిత్రం]
కవాల్లాలోని ఓడరేవు
[26వ పేజీలోని చిత్రం]
1997లో మార్తతో