కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 6/8 పేజీలు 8-13
  • పొగాకు ప్రతివాదుల మాటలు నీటిమూటలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పొగాకు ప్రతివాదుల మాటలు నీటిమూటలు
  • తేజరిల్లు!—1995
  • ఇలాంటి మరితర సమాచారం
  • పొగాకు కంపెనీలు అగ్నిజ్వాలల్లో చిక్కుకున్నాయి
    తేజరిల్లు!—1996
  • ఆటంకాలకు ముందే సిద్ధపడి ఉండండి
    తేజరిల్లు!: సిగరెట్‌ తాగే అలవాటును ఎలా మానుకోవచ్చు?
  • లక్షలాది ప్రాణాలు పొగలోనే కలిసిపోతున్నాయి
    తేజరిల్లు!—1995
  • పొగతాగడం గురించి దేవుడు ఏమంటున్నాడు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
మరిన్ని
తేజరిల్లు!—1995
g95 6/8 పేజీలు 8-13

పొగాకు ప్రతివాదుల మాటలు నీటిమూటలు

లండన్‌ 1940 లో యుద్ధదాడిక్రింద నున్న ఒక పట్టణం. జర్మన్‌ యుద్ధవిమానాలు, విమానచోదకుడు లేకుండా ఎగిరి బాంబులను కురిపించే విమానాలు విపరీతమైన భయోత్పాతాన్ని, వినాశనాన్ని సృష్టించాయి. పరిస్థితి అంత భయంకరంగా ఉండకపోతే, ఆ అసాధారణ దృశ్యాన్ని చూసి ప్రజలు ఆనందించి ఉండేవారేమో.

పొడవాటి మోకులతో కట్టబడియున్న వేలాది పెద్ద గాలిబుడగలు గాలిలో ఎగిరాయి. వాటి ఉద్దేశ్యమేమంటే తక్కువ ఎత్తులో విమానదాడులు జరుగకుండ, మధ్యాకాశంలోనే కొన్ని బాంబులను ఆపేయాలన్నదే. బెలూన్‌ ప్రతిరోధకాన్ని జ్ఞానపూర్వకంగా చేసినప్పటికీ, అది అంతగా సఫలీకృతం కాలేదు.

సిగరెట్‌ కంపెనీలు కూడ అలాగే దాడికి గురయ్యాయి. ఒకనాడు రాజకీయాలకు, సంపదకు కంచుకోటలుగావుంటూ, ఇష్టారాజ్యంగా వ్యాపారం సాగించిన పొగాకు సామ్రాజ్యాలు నలుదిశల నుండి ముట్టడికి గురౌతున్నాయి.

వైద్య రంగం దోషారోపణా అధ్యయనాలతో విపరీతంగా దులుపుతోంది. పరిష్కారాసక్తిగల ఆరోగ్యాధికారులు స్వలాభంకొరకు పరిస్థితిని తమవైపు తిప్పుకుంటున్నారు. ఆగ్రహించిన తల్లిదండ్రులు తమ పిల్లలు దీనికి బలిచేయబడుతున్నారని నిందిస్తున్నారు. కార్యాలయాలలో, రెస్టారెంట్లలో, మిలిటరీ స్థావరాలలో మరియు విమానాలలో సిగరెట్‌ కాల్చడాన్ని దీక్షబూనిన శాసనసభ్యులు నిషేధించారు. అనేక దేశాల్లో దూరదర్శినీ మరియు రేడియోలో సిగరెట్‌ ప్రకటనలు నిషేధించబడ్డాయి. అమెరికాలోని అన్ని రాష్ట్రాలు ఆరోగ్యనష్టపరిహారం కొరకు కోర్టుకెక్కాయి. న్యాయవాదులు సహితం ఈ పోరాటంలో చేరుతున్నారు.

కాబట్టి తమనెదిరించే వారిని తిప్పికొట్టడానికి పొగాకు కంపెనీలు తమను సమర్ధించుకొనే వట్టి మాటలను చెప్పనారంభించాయి. అయినా, అవి కేవలం ఊకదంపుడు మాటలుగా ఉన్నట్లున్నాయి.

ఆగ్రహించిన శాసనసభ్యులు, ప్రభుత్వ ఆరోగ్య అధికారులు పొగాకు పరిశ్రమను గత సంవత్సరం తీవ్రంగా వ్యతిరేకించిన విషయాన్ని అమెరికా ప్రజలు స్పష్టంగా గమనించారు. అమెరికా ప్రజా ప్రతినిధుల సభ ఎదుట 1994 ఏప్రిల్‌ నెలలో జరిగిన ఒక విచారణలో, పొగత్రాగడంవల్ల అమెరికావారు ఏటా 4,00,000 మంది చనిపోతున్నారని, లక్షలాదిమంది రోగగ్రస్తులై మరణ శయ్యపై ఉన్నారని మరియు వ్యసనపరులయ్యారనే ఆరోపణతో కూడిన గణాంకాలను అమెరికాలోని పెద్ద పొగాకు కంపెనీల అధికారులు ఏడుగురు ఎదుర్కోవలసి వచ్చింది.

మరి వారే సమాధానం చెప్పగలిగారు? పోరుకు సిద్ధమైన ఈ అధికారులు తమ ప్రతివాదంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పారు: “పొగత్రాగడం . . . రోగాన్ని వృద్ధిచేస్తుందని ఇంకా రుజువుకాలేదని,” ఒక పొగాకు సంస్థ ప్రతినిధి అన్నాడు. అంటే తీపి పదార్థాలను తినడం, కాఫీ త్రాగడంవంటి ఏ ఇతర ఆనందకరమగు అలవాటువలెనే పొగతాగే అలవాటు నిరపాయకరమైందిగా వర్ణించబడింది. “వాటిలో ఉండే నికోటిన్‌ సిగరెట్లను మత్తుపదార్ధాలుగా చేయదని, లేక పొగత్రాగడం వ్యసనంకాదని,” ఒక పొగాకు కంపెనీ ముఖ్యాధికారి అన్నాడు. “సిగరెట్లలోని నికోటిన్‌ ఎంత మోతాదులోనైనా మత్తు కల్గించేదనే ఊహ తప్పు,” అని ఒక పొగాకు కంపెనీ శాస్త్రజ్ఞుడు నొక్కిచెప్పాడు.

మరి సిగరెట్లు వ్యసనపూరితమైనవి కాకపోతే, పొగాకు కంపెనీలెందుకు తమ ఉత్పత్తుల్లో నికోటిన్‌ మోతాదును తగ్గించాలని ప్రయత్నిస్తున్నాయ్‌? అని ప్రజాప్రతినిధుల సభ ఎదురు ప్రశ్న వేసింది. “రుచికొరకే” అని మరో పొగాకు కంపెనీ అధికారి వివరించాడు. రుచిలేని సిగరెట్‌కంటే హీనమైందేమీ లేదా? అతని కంపెనీ ఫైళ్లలోనుండే నికోటిన్‌ మత్తు కల్గించే గుణంకలదని సూచించే పరిశోధనను కుప్పతెప్పలుగా చూపించినప్పటికీ ఆయన తన కథకే కట్టుబడ్డాడు.

వాస్తవానికి, పొగాకు బాధితులతో సమాధి స్థలాలు ఎన్ని నిండిననూ, ఆయన మరితరులు ఆ అభిప్రాయానికే కట్టుబడివుంటారు. అమెరికన్‌ మెడికల్‌ అసోషియేషన్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ చైర్మన్‌, డాక్టర్‌ లోనీ బ్రిస్టో, 1993 తొలిభాగంలోనే ఓ ఆసక్తికరమైన సవాలును విసిరాడు. ది జర్నల్‌ ఆఫ్‌ ది అమెరికన్‌ మెడికల్‌ అసోషియేషన్‌ ఇలా నివేదిస్తోంది: “ఆసుపత్రి వార్డుల్లో తనతోపాటు నడుస్తూ, పొగతాగడం ఫలితంగా కలిగే బాధల్లో ఒకదాన్ని—అంటే ఊపిరితిత్తుల క్యాన్సర్‌ గలవారిని, ఇతర శ్వాసకోశ వ్యాధులు గలవారిని చూసేందుకు రమ్మని అమెరికాలోని పెద్ద పొగాకు కంపెనీ అధికారులను ఆయన ఆహ్వానించాడు. అందుకెవ్వరూ స్పందించలేదు.”

నిరుద్యోగ సమస్యతో సతమతమౌతున్న ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మంచి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు పొగాకు పరిశ్రమ డంబంగా చెప్పుకుంటోంది. ఉదాహరణకు, అర్జెంటీనాలో ఈ పరిశ్రమ 10 లక్షల ఉద్యోగాలను, పరోక్షంగా మరో 40 లక్షల ఉద్యోగాలను కల్పించింది. పొగాకు కంపెనీలు అధికమొత్తంలో చెల్లించే పన్నులమూలంగా అనేక ప్రభుత్వాల మన్ననలను పొందాయి.

ఒక పొగాకు కంపెనీ—ప్రజోపకార బుద్ధిని కనబరుస్తున్నట్లు—అల్పసంఖ్యాకులకు విస్తారంగా దానధర్మాలు చేసింది. అయిననూ, ఇలాంటి “నియోజకవర్గ అభివృద్ధి బడ్జెట్‌” వెనుకగల ఉద్దేశం భవిష్యత్‌ ఓటర్లను ఆకట్టుకోవడానికేనని కంపెనీ రహస్య పత్రాలు బహిర్గతం చేశాయి.

అదే పొగాకు కంపెనీ మ్యూజియంలకు, పాఠశాలలకు, నాట్య అకాడమీలకు మరియు సంగీత సంస్థలకు పెద్దమొత్తంలో విరాళాలివ్వడంద్వారా కళారంగంలోనూ స్నేహితులను సంపాదించింది. కళాసంస్థల అధికారులుకూడ పొగాకు కంపెనీలిచ్చే ఎంతో అవసరమైన డబ్బును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటీవల, న్యూయార్క్‌ నగరంలోని కళాసంస్థ, పొగత్రాగడాన్ని నిషేధించబోయే చట్టానికి వ్యతిరేకంగా ప్రజల సానుభూతిని పొందడానికి తాము చేయబోయే ప్రయత్నానికి మద్దతునివ్వాలని ఆ పొగాకు కంపెనీ సభ్యులను కోరినప్పుడు వారు ఇరకాటంలో పడ్డారు.

నిజమే, పొగాకు వ్యాపారానికి మింగుడుపడని ఏ ప్రతిపాదనకైనా వ్యతిరేకంగా తమ పలుకుబడిని ఉపయోగించగల రాజకీయ చతురులకు డబ్బు పంచడానికి బలిసిన పొగాకు కంపెనీలు భయపడవు. ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు పొగాకు కంపెనీల పక్షాన వాదించారు. కొందరికి ఆ కంపెనీలతో ఆర్ధికపరమైన లావాదేవీలున్నాయి, లేక పొగాకు కంపెనీలు ఎన్నికల ప్రచారం కొరకు ఉదారంగా ఇచ్చిన డబ్బును తిరిగి చెల్లించాలనే ఒత్తిడి క్రింద ఉన్నారు.

ఓ అమెరికా రాజకీయ నాయకుడు సిగరెట్టు కంపెనీల నుండి 21,000 డాలర్లకంటె ఎక్కువే స్వీకరించాడని, అందుచేత అతడు పలు పొగాకు వ్యతిరేక తీర్మానాలకు విరుద్ధంగా ఓటువేయాల్సి వచ్చిందని భోగట్టా.

గతంలో పొగాకు కంపెనీల తొత్తుగా పనిచేసి, విపరీతంగా సిగరెట్లు తాగిన ఒకనాటి సెనెటర్‌, ఇటీవల తనకు గొంతు, ఊపిరితిత్తులు, కాలేయపు క్యాన్సర్‌ ఉన్నట్లు తెలుసుకున్నాడు. “ఒకడు తనకుతానే రోగశయ్యపై పడవేసుకోవడం” తాను బుద్ధిహీనుడని తలంచేలా చేస్తుందని ఇప్పుడాయన ఎంతో పశ్చాత్తాపపడుతూ, బాధపడుతున్నాడు.

ప్రచారధనం సాధించే శక్తితో బలిసిన పొగాకు కంపెనీలు వ్యతిరేకతను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాయి. ఒక ప్రకటన, “నేడు సిగరెట్లు నిషేధిస్తే, మరి రేపో,” అని గంభీరంగా హెచ్చరిస్తూ స్వతంత్ర్య జెండాను రెపరెపలాడిస్తోంది. అంటే తర్వాత కాఫీ, మద్యపానం మరియు మాంసాహారం బహుశ నిషేధింపబడబోయే వాటిలో ఉంటాయని అర్ధం.

వదిలేపొగగా పరిగణించబడినదానిలో క్యాన్సర్‌ కారకాలు ఉన్నాయని విస్తృతంగా చెప్పబడిన అమెరికా పర్యావరణ పరిరక్షణా సంస్థ చేసిన అధ్యయనాన్ని వార్తాపత్రికల ప్రకటనలు నీరుగార్చడానికి ప్రయత్నించాయి. పొగాకు పరిశ్రమ చట్టరీత్యా పోరాడాలనే పథకాలను ప్రకటించింది. ఒక కంపెనీ నికోటిన్‌ పరిమాణాన్ని పెంచి దుర్వ్యసనాన్ని ప్రోత్సహిస్తుందని ఒక దూరదర్శిని కార్యక్రమం ఆరోపించింది. దాన్ని ప్రదర్శించిన నెట్‌వర్క్‌ 1,000 కోట్ల డాలర్ల దావా మొత్తాన్ని చెల్లించాల్సివచ్చింది.

పొగాకు కంపెనీలు ఇంకా గట్టిగా పోరాడాయి గానీ నిందారోపణలతో పొగ మరింత దట్టంగా అవుతోంది. గత నాల్గుదశాబ్దాల కాలంలో, పొగాకు నుపయోగించడం వల్ల వచ్చే అపాయాలను గూర్చి పెరుగుతున్న కొండంత సాక్ష్యాధారాలు తెల్పే అధ్యయనాలు దాదాపు 50,000 నిర్వహించబడ్డాయి.

సిగరెట్‌ కంపెనీలు వాటిపై మోపబడిన నిందనెలా నెట్టివేశాయి? పొగత్రాగేవారు మానుకోగలరనే ఊహాసత్యాన్ని వారు మొండిగా పట్టుకు కూర్చున్నారు. అందుకే, నికోటిన్‌ వ్యసనపరులనుగా చేయదని వారు అంటారు. అయిననూ, గణాంకాలు మరో విధంగా చూపిస్తున్నాయి. నిజమే నాలుగు కోట్లమంది అమెరికావారు పొగత్రాగడం మానేశారు. గానీ ఇంకా ఐదుకోట్లమంది పొగ త్రాగుతూనే ఉన్నారు, మరి వీరిలో 70 శాతం మంది తమకు మానుకోవాలని ఉందని అంటున్నారు. ప్రతిసంవత్సరం మానుకోవడానికి ప్రయత్నించే 1 కోటి 70 లక్షలమందిలో 90 శాతం మంది ఒక ఏడాదిలోనే విఫలులైపోతున్నారు.

ఊపిరితిత్తుల క్యాన్సర్‌ శస్త్రచికిత్స తర్వాత త్రాగే అమెరికావారిలో 50 శాతంమంది మరల అదే అలవాటుకు తిరుగుతున్నారు. పొగ త్రాగడంవల్ల గుండెపోటు వచ్చినవారిలో 38 శాతంమంది ఆసుపత్రినుండి బయటికి రాకముందే మరల సిగరెట్‌ కాలుస్తున్నారు. క్యాన్సర్‌ సోకిన స్వరపేటిక తీసివేయబడిన ధూమపానప్రియులు మరల సిగరెట్‌ త్రాగడానికి ప్రయత్నిస్తారు.

అమెరికాలోని లక్షలాదిగావున్న పొగత్రాగే యౌవనస్థుల్లో మూడువంతులు తాము మానుకోవడానికి ఒక్కసారైనా తీవ్రంగా ప్రయత్నించాము గానీ మానుకోలేకపోయామని అంటున్నారు. యౌవనస్థుల్లో ఇంకా శక్తివంతమైన మత్తు పదార్ధాలు తీసుకోవడానికి పొగత్రాగడం మొదటి మెట్టు అని కూడ గణాంకాలు చూపెడుతున్నాయి. పొగత్రాగనివారికంటె బహుశ పొగత్రాగే పెద్దవారే 50 శాతం ఎక్కువ కొకాయిన్‌ను ఉపయోగిస్తారు. పొగత్రాగే ఓ 13 ఏండ్ల అమ్మాయి ఒప్పుకుంటుంది. “సిగరెట్లు ఇతర మత్తు పదార్ధాలకు నాందియనే విషయంలో నాకు అనుమానంలేదు. నాకు తెలిసిన ప్రతివ్యక్తి, ముగ్గురు తప్ప, మత్తుపదార్థాలు తీసుకోవడానికి ముందు పొగత్రాగనారంభించారు,” అని ఆ అమ్మాయి వ్రాసింది.

తక్కువ తారు పదార్ధమున్న సిగరెట్ల విషయమేమిటి? రెండు కారణాలనుబట్టి అవింకా అపాయకరమైనవి కాగలవని అధ్యయనాలు చూపెడుతున్నాయి: ఒకటి, తన శరీరం ఆశించే నికోటిన్‌ కొరకు సిగరెట్‌ తాగేవ్యక్తి గట్టిగా పీలుస్తాడు, అలా ఊపిరితిత్తుల ధాతువు పొగలోని విషపదార్ధానికి గురయ్యేలా చేస్తాడు; రెండు, తాను మంచి “ఆరోగ్యకరమైన” సిగరెట్‌ను త్రాగుతున్నానని అనుకోవడం అతను పూర్తిగా సిగరెట్‌ను మానుకోవడానికి ప్రయత్నించకుండా చేయవచ్చును.

కేవలం నికోటిన్‌మీదే 2,000 పైచిలుకు అధ్యయనాలు జరిగాయి. మానవునికి తెలిసిన పదార్ధాలలో అదొక అత్యంత వ్యసనపూరితమైనదని, అత్యంత హానికరమైనదని అవి బయల్పర్చాయి. నికోటిన్‌ గుండె వేగాన్ని పెంచి, రక్తనాళాలను కుంచింపజేస్తుంది. రక్తనాళంగుండా నేరుగా ఇవ్వబడిన ఇంజక్షన్‌కంటే వేగంగా—ఏడు సెకండ్లలోనే అది రక్తంలో కలిసిపోతుంది. ఇంకా కావాలనే వాంఛను పెంచుతూ, కొందరంటున్నట్లు హెరాయిన్‌కన్న రెండింతలు కోరికను పుట్టించేలా అది మెదడును త్రిప్పగలదు.

పొగాకు కంపెనీలు, తాము సమ్మతింపకపోయిననూ, నికోటిన్‌లోని వ్యసనగుణాలను గుర్తెరుగుతున్నాయా? వాటికా విషయం చాలాకాలంగా తెలుసుననే సూచనలున్నాయి. ఉదాహరణకు, ఒక పొగాకు కంపెనీ పరిశోధకుడు పరిశోధనాలయంలోని ఎలుకలు వాటి కాలేయానికి క్రమంగా ఎక్కించిన నికోటిన్‌ కొరకు పదేపదే కావాలన్నట్లు ప్రవర్తించేవని 1983లో జరిపిన అధ్యయనం తెల్పుతోంది. అయితే పొగాకు పరిశ్రమ వెంటనే ఆ అధ్యయనాన్ని తెరమరుగు చేసిందని తెలిసింది, ఇటీవలే అది బయల్పడింది.

అన్ని వైపులనుండి అగ్ని బాణాలు సంధింపబడుతూవుంటే పొగాకు కంపెనీలు మౌనంగా కూర్చోవడంలేదు. “అమెరికా వాణిజ్య చరిత్రలోకెల్లా దీర్ఘకాలం నడిచే అతిపెద్ద తప్పుడు సమాచార దండయాత్ర” అని ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ పేరుపెట్టిన ఒక మీటింగ్‌ను న్యూయార్క్‌ నగరంలోని పొగాకు పరిశోధనా కౌన్సిల్‌ నిర్వహిస్తుంది.

స్వతంత్ర్య పరిశోధనయనే నినాదంతో, శత్రువులను ఎదుర్కోవడానికి ఆ కౌన్సిల్‌ లక్షలాది డాలర్లను వెచ్చించింది. ఒక ఎలుకమీద పూసిన సిగరెట్‌లోని తారు అనే నల్లని పదార్ధంవల్ల దాని వీపుపై పుండ్లు పుట్టగా, మెమోరియల్‌ స్లోయన్‌-కెట్టరింగ్‌ క్యాన్సర్‌ సెంటర్‌ యొక్క డాక్టర్‌ ఎర్నెస్ట్‌ విండర్‌ గమనించినప్పుడు, 1953లో ఇదంతా ప్రారంభమైంది. ఆ పరిశ్రమ తమ స్వంత విజ్ఞానశాస్త్ర ఆధారంతోనే, తమ ఉత్పత్తికి వ్యతిరేకంగా వస్తున్న స్పష్టమైన రుజువును త్రిప్పికొట్టాలని ఆ కౌన్సిల్‌ను స్థాపించింది.

అయిననూ, మిగతా పరిశోధనా శాస్త్రజ్ఞులకు భిన్నమైన ఫలితాలను కౌన్సిల్‌ విజ్ఞాన శాస్త్రజ్ఞులెలా కనుగొనగల్గారు? ఇటీవల విడుదలైన విషయాలు ఓ పెద్ద కుట్రను బయల్పర్చాయి. లిఖితపూర్వక ఒప్పందాలవల్ల నిర్భందించబడి, సూక్ష్మ బుద్ధిగల లాయర్ల గుంపు మూలంగా అదుపుచేయబడిన అనేకమంది కౌన్సిల్‌ పరిశోధకులు, పెరుగుతున్న ఆరోగ్యసమస్యల భయాలు మంచి ఆధారం కల్గివున్నాయని కనుక్కున్నారు. అయితే, ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ ప్రకారం, కౌన్సిల్‌ సభ్యులు వాస్తవాల నెదుర్కున్నప్పుడు మాత్రం “పొగత్రాగడం ఆరోగ్యానికి హానికరమని సూచించిన తమ పరిశోధనలనే కొన్నిసార్లు లక్ష్యపెట్టలేదు లేక పరిశోధనలు జరపకుండానే మానుకున్నారు.”

సురక్షితమైన సిగరెట్‌ తయారీ కొరకు కొన్ని సంవత్సరాలుగా రహస్యపరిశోధన సాగింది. బహిరంగంగా అలా చేస్తే, పొగత్రాగడం ఆరోగ్యానికి నిజంగా హానికరమని మౌనంగా అంగీకరించినట్లు అయ్యుండేది. మరి 1970వ పడి చివరికల్లా, ఒక పొగాకు కంపెనీ సీనియర్‌ లాయర్‌, “సురక్షిత” సిగరెట్ల తయారు చేయాలనే ప్రయత్నాలు వ్యర్ధం గనుక, వాటిని విరమించుకోవాలని, దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను తగులబెట్టాలని సిఫారసు చేశాడు.

నికోటిన్‌ నిజంగా వ్యసనపూరితమైనది మరియు సిగరెట్‌ త్రాగడంవల్ల చావు తథ్యం అనే రెండు విషయాలు, సంవత్సరాల తరబడి చేసిన పరిశోధనల ద్వారా స్పష్టమయ్యాయి. పొగాకు కంపెనీలు ఈ వాస్తవాలను బహిరంగంగా మొండిగా కాదన్ననూ, వాటికీ వాస్తవాలన్నీ బాగా తెలుసని వాటి క్రియల ద్వారా చూపిస్తున్నాయి.

బుద్ధిపూర్వకంగా తప్పుడు పనులు చేస్తున్నాయని నిందిస్తూ, అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (యఫ్‌.డి.ఎ.) కమీషనర్‌ డేవిడ్‌ కెస్లర్‌ ఇలా అన్నాడు: “నిజానికి, ఈనాటి కొన్ని సిగరెట్లు, వ్యసనాన్ని కలిగించి, దానిని పోషించేందుకు కావలసినంత . . . ఖచ్చితమైన మోతాదులలో నికోటిన్‌ను అందించేలాగున ఉన్నతమైన సాంకేతిక పరిజ్ఞానంతోకూడిన నికోటిన్‌ సరఫరా పద్ధతులున్నవిగా అర్హత కల్గివుండొచ్చును.”

పొగాకు కంపెనీలకు తమ ఉద్దేశ్యాన్ని నిరూపించే ఎన్నో స్వంత పేటెంట్లున్నాయని కెస్లర్‌ బయల్పర్చాడు. ఒక పద్ధతేమో, అత్యధిక నికోటిన్‌ మోతాదుతో జన్యురీత్యా మార్చబడి వడగట్టిన పొగాకును తయారుచేస్తుంది. మరొక పద్ధతేమిటంటే, ఉత్తేజాన్నిపెంచే నికోటిన్‌ను సిగరెట్‌ ఫిల్టర్లలోను, పేపర్లలోను ఉపయోగించడమే. మరింకో పద్ధతైతే, సిగరెట్‌ పొగపీల్చేవారి ఆఖరి దమ్ముకంటే, మొదటి దమ్ములోనే ఎక్కువ నికోటిన్‌ను అందిస్తుంది. ఇంకను, సిగరెట్లనుండి అధిక మోతాదులో నికోటిన్‌ను విడుదల చేసేందుకుగాను వాటికి అమ్మోనియా మిశ్రమాలు కలుపుతారని ఆ పరిశ్రమ డాక్యుమెంట్లు తెల్పుతున్నాయి. “సాధారణంగా పీల్చుకున్న దానికంటె రెండింతల నికోటిన్‌ పొగతాగే వారి రక్తంలోకి ప్రవేశించింది,” అని న్యూయార్క్‌ టైమ్స్‌ నివేదిక తెల్పుతోంది. నికోటిన్‌ వ్యసనాన్ని కల్గించే మత్తుపదార్ధం గనుక సిగరెట్లను గట్టి అదుపులో పెట్టాలని యఫ్‌.డి.ఎ. ప్రకటించింది.

ప్రభుత్వాలు తమవైన మార్గాల్లో సిగరెట్లపై ఆధారపడివున్నాయి. ఉదాహరణకు, అమెరికా ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులమీద స్టేట్‌ మరియు ఫెడరల్‌ పన్నుల ద్వారా సంవత్సరానికి 1200 కోట్ల డాలర్లు వసూలుచేస్తోంది. అయిననూ, ఆరోగ్య సంరక్షణ ఖర్చు మరియు కోల్పోయే ఉత్పాదన సామర్ధ్యాలను గూర్చిన లెక్కల ఆధారంగా, పొగత్రాగడానికయ్యే ఖరీదు 6800 కోట్ల డాలర్లని ది ఫెడరల్‌ ఆఫీస్‌ ఆఫ్‌ టెక్నాలజి అసెస్‌మెంట్‌ అంచనావేస్తుంది.

ఆర్ధికవనరులు, అధిక ఉద్యోగాలు, కళాసంస్థలపోషణ, ఆరోగ్యప్రమాదాలను మొండిగా తిరస్కరించడం వంటివాటిని—నిజంగా పొగాకు పరిశ్రమ స్వరక్షణకొరకు వింతగా కనబడే కొన్ని వ్యర్ధపోకడలను ఏర్పర్చుకుంది. లండన్‌లో ఎగురవేసిన గాలిబుడగల వంతెనకంటె ఎక్కువగా వారు సఫలీకృతులౌతారో లేదో చూడవలసి ఉంది.

అయితే పెద్దపెద్ద కంపెనీలు వాటి అసలు రూపాన్ని ఇక దాచలేవన్నది మాత్రం వాస్తవం. అవి లక్షలు గడించాయి, లక్షలాదిమందిని చంపాయి, గానీ మానవజీవితాల్లో సంభవించే భయంకరమైన తుదిఫలితం వాటికి పట్టనట్టుంది.

[8వ పేజీలోని చిత్రం]

వారి మాటలు నీటిమూటలన్నట్లు కనిపిస్తున్నాయి

[9వ పేజీలోని చిత్రం]

త్రాగి వదిలే పొగ క్యాన్సర్‌ కారకం గలదని ఒక ప్రభుత్వ అధ్యయనం సూచిస్తుంది

[10వ పేజీలోని చిత్రం]

నికోటిన్‌ అత్యంత వ్యసనపూరిత పదార్థాలలో ఒకటి

[11వ పేజీలోని చిత్రం]

అవి లక్షలు గడించాయి; లక్షలాదిమందిని చంపాయి

[10వ పేజీలోని బాక్సు]

మరి 50,000 అధ్యయనాలు—ఏమి కనుగొన్నాయి?

పొగాకు ఉపయోగించడం వల్ల వచ్చే ఆరోగ్య అనర్ధాలనుగూర్చి పరిశోధకులు వెలిబుచ్చిన ఆందోళనలలో ఇదో చిన్న ఉదాహరణ:

ఊపిరితిత్తుల క్యాన్సర్‌: ఊపిరితిత్తుల క్యాన్సర్‌ మరణాలలో 87 శాతం మంది పొగతాగేవారే ఉన్నారు.

గుండె జబ్బు: పొగతాగేవారిలో 70 శాతంవరకు గుండెనాళాలకు సంబంధించిన రోగానికి గురౌతారు.

రొమ్ము క్యాన్సర్‌: రోజుకు 40 లేక అంతకుమించి సిగరెట్లు తాగేవారిలో రొమ్ము క్యాన్సర్‌తో చనిపోయే అవకాశం 74 శాతం అధికం.

చెముడు: సిగరెట్లు కాల్చే తల్లులున్న పిల్లలు సరిగ్గా వినలేరు.

మధుమేహవ్యాధి చిక్కులు: మధుమేహపు రోగులు పొగ త్రాగినా, పొగాకు నమిలినా మూత్రపిండం పాడయ్యే అవకాశం చాలా ఎక్కువ, మరియు త్వరగా కంటిచూపు (రెటీనా) దెబ్బతినే అవకాశం అధికం.

పురీషనాళపు క్యాన్సర్‌: పొగతాగడానికి పురీషనాళపు క్యాన్సర్‌కు దగ్గరి సంబంధమున్నట్లు 1,50,000 మందిపై జరిపిన పరీక్షలు స్పష్టంగా వెల్లడిస్తున్నాయి.

ఉబ్బసం: వేరేవారుతాగే సిగరెట్లను తాగితే యౌవనస్థుల్లో ఉబ్బసం ఎక్కువకాగలదు.

పొగతాగాలనే సంకల్పం: గర్భంతోనున్నప్పుడు పొగ త్రాగిన తల్లులకు పుట్టిన పిల్లల్లో పొగ త్రాగే అవకాశం నాలుగురెట్లు అధికం.

ల్యుకేమియా: పొగతాగడంవల్ల మైలోయిడ్‌ ల్యుకేమియా రకపు తెల్లపొడ వస్తుంది.

వ్యాయామ దెబ్బలు: అమెరికా సైనిక అధ్యయనం ప్రకారం, వ్యాయామం చేసేటప్పుడు పొగతాగేవారే ఎక్కువ దెబ్బలుతినే అవకాశముంది.

జ్ఞాపకశక్తి: నికొటిన్‌ను అధికమోతాదులో వాడితే క్లిష్టమైన పనులు చేసేటప్పుడు ఒకవ్యక్తి మానసిక నైపుణ్యత కోల్పోవచ్చు.

మానసికవ్యధ: పొగతాగడానికి గొప్ప మానసికవ్యధకు మరియు జ్ఞాపకశక్తి లోపానికి మధ్యగల సంబంధానికి ఆధారమున్నదాయని మానసికవైద్యులు పరిశోధనలు చేస్తున్నారు.

ఆత్మహత్య: నర్సులమీద జరిపిన అధ్యయనం ప్రకారం సిగరెట్‌ తాగేనర్సుల్లో రెండింతలు ఆత్మహత్య చేసుకుంటారని తేలింది.

ఈ లిస్ట్‌కు జతగా ఇతర ప్రమాదాలివి: నోరు, స్వరపేటిక, గొంతు, అన్నవాహిక, వృక్వకము, ఉదరము, చిన్న ప్రేవులు, మూత్రాశయము, మూత్రపిండం మరియు కంఠం మొదలగు వాటికి క్యాన్సర్‌; పక్షవాతం, గుండెపోటు, దీర్ఘకాల ఊపిరితిత్తుల రోగం, ప్రసరణరోగం, జీర్ణకోశ వ్రణములు, మధుమేహం, సంతానహీనత, బలహీన సంతానం, కీళ్లవాపువ్యాధి మరియు చెవిలోపుండ్లు కలుగుతాయి. ఇండ్లలో, హోటల్‌లో, ఆసుపత్రుల్లో జరిగే అగ్ని ప్రమాదాలకు కారణం ముఖ్యంగా సిగరెట్లే గనుక అగ్ని ప్రమాదాలను కూడ ఈ లెక్కల్లో చేర్చవచ్చును.

[12వ పేజీలోని బాక్సు]

పొగలేని పొగాకు—ప్రమాదకరమైన ప్రత్యామ్నాయం

నూటపది కోట్ల డాలర్ల పరిశ్రమలో అగ్రగామియైన, నశ్యం కంపెనీ క్రొత్తగా అలవాటు చేసుకోనారంభించిన కొందరిని సువాసనగల పొడితో తెలివిగా ప్రలోభపెడుతుంది. దానియొద్ద ప్రసిద్ధిగాంచిన సువాసనల బ్రాండ్లున్నాయి. అవి అందించే “ఆ కొంచెం నశ్యం పొడి ఘమఘమలు” తృప్తినిస్తాయి గాని శాశ్వతంగా ఇవ్వవు. ఈ పొగాకు కంపెనీ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇలా అన్నాడు: “అనేకమంది ప్రజలు ఎక్కువ సువాసనగల ఉత్పత్తులనే వాడనారంభిస్తారు గానీ, వారు చివరికి [ఘాటైన రకం] కొరకే వస్తారు.” అది “బలాఢ్యులకు బలమైనదని, సంతృప్తినిచ్చేదని,” ప్రచారం చేయబడింది.

ఈ కంపెనీ యొక్క ఈ పద్ధతినిగూర్చి, “నికొటిన్‌ హెచ్చుతగ్గులు చేయడాన్ని” నిరాకరించడం గురించి ఉటంకించినదని ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ నివేదించింది. ఆ కంపెనీకి చెందిన ఇద్దరు మాజీ కెమిస్టులు మొదటిసారిగా ఈ విషయంపై మాట్లాడుతూ, “నికొటిన్‌ మోతాదుల్లో కంపెనీ ఏ మార్పులను చేయకపోయినప్పటికీ, దాన్ని వాడేవారు పీల్చుకునే నికొటిన్‌ మోతాదును మారుస్తున్నదని” చెప్పారని కూడా ఆ జర్నల్‌ తెలియజేసింది. పొగాకులోని ఆల్కాలిన్‌ను పెంచేందుకుగాను ఆ కంపెనీ రసాయన పదార్ధాలను చేరుస్తుందని కూడా వారంటున్నారు. ఆ పొడిలో ఎంత ఎక్కువ ఆల్కాలిన్‌వుంటే “అంతెక్కువ నికొటిన్‌ విడుదలౌతుంది.” ఆ జర్నల్‌ పీల్చేపొడినిగూర్చి, నమిలే పొగాకును గూర్చి ఇంకా ఈ విషయాన్ని జోడిస్తుంది: “కొన్నిసార్లు పొరపాటున నమిలే పొగాకు అని అనుకునే పీల్చేపొడి దవడలక్రింద పెట్టుకునేదేగానీ నమిలేదికాదు. దాన్నివాడేవారు కొంచెం తీసుకుని లేక వేలితో ‘అద్దుకొని’ బుగ్గల్లోపెట్టుకుని తమ నాలుకతో అటు ఇటు కదుపుతూ, అప్పుడప్పుడు ఉమ్ముతుంటారు.”

క్రొత్తగా పొగత్రాగే వారికొరకు, 7 నుండి 22 శాతం నికోటిన్‌ మాత్రమే రక్తప్రసరణలో ప్రవేశించే రుచికరమైన బ్రాండ్లు తయారు చేయబడ్డాయి. ఘాటైన రకంపొడి కొత్తవారు వాంతి చేసుకునేలా చేస్తుంది. అది “నిజమైన” పురుషులకొరకు చక్కగా కత్తిరించబడిన రకం. అందులోని 79 శాతం నికొటిన్‌, తక్షణం రక్తంలో కలిసిపోవడానికి లభించే “ఉచిత” పదార్ధం. అమెరికాలో సరాసరి తొమ్మిదేండ్ల నుండే ఈ పొడిని ఉపయోగిస్తారు. మరి తొమ్మిదేండ్ల ఏ బాలుడు ఘాటైన రకాన్ని ఉపయోగించకుండా, “నిజమైన” పురుషులలో కలవకుండా ఉండగలడు?

దీనివల్లవచ్చే నికొటిన్‌ సిగరెట్‌వల్ల వచ్చేదానికన్న శక్తివంతమైంది. దాన్నుపయోగించే వారికి ఉపయోగించని వారికంటె 4 రెట్లు ఎక్కువ నోటి క్యాన్సర్‌, 50 రెట్లు ఎక్కువ గొంతు క్యాన్సర్‌ వచ్చే అవకాశాలున్నాయి.

నోటి క్యాన్సర్‌వల్ల చనిపోయిన హైస్కూల్‌ మాజీ పరుగులరాజు తల్లి పొగాకు కంపెనీమీద కోర్టులోవేసిన దావా అమెరికా ప్రజల్లో తాత్కాలిక అలజడిని రేపింది. అతనికి 12 ఏండ్లున్నప్పుడు రౌండ్‌తిరిగే ఆటసమయంలో ఒక డబ్బాపొడి ఉచితంగా దొరికింది, వాడు వారానికి నాలుగు డబ్బాలు వాడేవాడయ్యాడు. అతని నాలుక, దవుడ మరియు మెడలను వంకరచేసిన అనేక బాధాకరమైన శస్త్రచికిత్సల అనంతరం అతని వైద్యులు ఇక వదిలేశారు. ఈ కుర్రాడు 19వ ఏట చనిపోయాడు.

[13వ పేజీలోని బాక్సు]

మానుకోవడమెలా?

లక్షలాదిమంది ప్రజలు తమ నికోటిన్‌ వ్యసనాన్ని మానుకోవడంలో సఫలీకృతులయ్యారు. మీరు పొగతాగేవారైనా, దీర్ఘకాలంగా పొగతాగుతూవున్నా, ఈ హానికరమైన అలవాటును మీరు కూడా మానుకోగలరు. అందుకు సహాయపడగల కొన్ని చిట్కాలు:

• మానుకుంటే వచ్చే ఫలితాలను ముందే తెలుసుకోండి. మానుకోవడంవల్ల ఆదుర్దా, చికాకు, కళ్లుతిరగడం, తలనొప్పి, నిద్రలేమి, కడుపులో తిప్పడం, ఆకలి, విపరీతమైన దాహం, అవధానం తగ్గడం మరియు వణకురావడం వంటి రోగలక్షణాలు అందులో చేరివుండొచ్చు. నిశ్చయంగా ఇవి అంత సంతోషభరితమైనవి కాకపోయినా, రోగలక్షణాలెంతటి గట్టివైనా అవి మహావుంటే కొన్నిరోజులే ఉంటాయి, ఒకసారి శరీరంనుండి నికొటిన్‌ లేకుండాపోతే అప్పుడు అవి క్రమేపి మటుమాయమౌతాయి.

• ఇప్పుడు నిజంగా మానసిక యుద్ధం ప్రారంభమౌతుంది. మీ శరీరం నికొటిన్‌కొరకు వాంఛించడమేగాక, మీ మనస్సుకూడ పొగతాగడంతో వచ్చిన ప్రవృత్తుల మూలంగా మార్చబడుతుంది. మామూలుగా మీరెప్పుడు సిగరెట్‌ తాగేవారో ఆ పరిస్థితిని గమనించి ఆ పద్ధతిని మార్చుకోండి. ఉదాహరణకు, మీరు ఎప్పుడూ అన్నం తిన్నవెంటనే సిగరెట్‌ కాలుస్తూవుంటే, ఇప్పుడు అదిమాని తిన్నవెంటనే నడవడానికో లేక పాత్రలు కడగడానికో ఉపక్రమించండి.

• బహుశ ఒత్తిడిగల సమయంవల్ల తాగాలని తీవ్ర వాంఛ కలిగినా, సాధారణంగా ఐదు నిమిషాల్లో ఆ కోరిక తగ్గిపోతుందని జ్ఞాపకముంచుకోండి. ఉత్తరాలు రాయడం, వ్యాయామం చేయడం లేక మంచి ఫలహారం తినడం వంటివాటితో మీ మనస్సుకు పనిపెట్టడానికి సిద్ధపడివుండండి. ప్రార్థన ఆశానిగ్రహానికి ఎంతో తోడ్పడుతుంది.

• మానుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలమవ్వడం వల్ల మీరు నిరాశపడినా, ప్రయత్నాన్ని విరమించుకోకండి. ప్రయత్నిస్తూ ఉండడమే ముఖ్యం.

• బరువు పెరిగే అవకాశం మిమ్మల్ని అడ్డగిస్తే, కొన్ని కిలోల బరువు పెరిగే ప్రమాదంకన్నా సిగరెట్‌ మానుకోవడంవల్ల వచ్చే ప్రయోజనాలే ఎక్కువని జ్ఞాపకముంచుకోండి. పండ్లు, కూరగాయలు దగ్గరుంచుకుంటే మంచిది. మంచినీళ్లు ఎక్కువ త్రాగండి.

• పొగత్రాగకుండ మానుకోవడం ఒక ఎత్తు. మానుకొని అలాగే ఉండడం మరో ఎత్తు. పొగ త్రాగకుండా ఉండవలసిన కాలవ్యవధులను నిర్ణయించుకోండి—ఒకరోజు, ఒకవారం, మూడునెలలు, శాశ్వతంగా.

యేసు ఇలా అన్నాడు—“నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను.” (మార్కు 12:31) మీ పొరుగువారిని ప్రేమించడానికి పొగ త్రాగడం మానుకోండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడానికి పొగ త్రాగడం మానుకోండి.—జూలై 8, 1989 తేజరిల్లు! (ఆంగ్లం) నందలి 13-15 పేజీలలోని “పొగత్రాగడం—క్రైస్తవ దృక్కోణం” అనే శీర్షికను కూడ చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి