కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 6/8 పేజీలు 20-22
  • మీ జీవితంలో హాస్యాన్ని నింపండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ జీవితంలో హాస్యాన్ని నింపండి
  • తేజరిల్లు!—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నవ్వాలా లేక నవ్వొద్దా
  • హాస్యము, మీ ఆరోగ్యం
  • కుటుంబ వలయం లోపల
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1995
  • అతడు వదిలిపెట్టలేదు
    తేజరిల్లు!—1998
తేజరిల్లు!—1994
g94 6/8 పేజీలు 20-22

మీ జీవితంలో హాస్యాన్ని నింపండి

అది శీతాకాలంలోని ఒక చల్లని దినం, మెట్లు మంచుతో కప్పబడి ఉన్నాయి. క్రిందకు దిగడానికి ప్రయత్నించిన మొదటి వ్యక్తి పడ్డంతపనే అయ్యింది. వరుసలో తరువాత ఉన్న వ్యక్తి యిలా ప్రకటించాడు: “సరిగ్గా దిగవలసిన పద్ధతి ఇది!” ఆ మాటలు అతని నోటినుండి వచ్చాయోలేదో అతను క్రింద—వెల్లకిలా పడ్డాడు. ఒక క్షణంపాటు అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు, అతనికి దెబ్బలు తగల్లేదని గమనించిన తరువాత నిలబడిన వారందరు గొళ్లున నవ్వారు.

‘నవ్వుటకు . . . సమయము కలదు.’ దాదాపు మూడు వేల సంవత్సరాల క్రితం జ్ఞానియైన సొలొమోను ఆ విషయాన్ని పేర్కొన్నాడు. (ప్రసంగి 3:4) అది నేడు కూడ నిజమే. నవ్వగల సామర్థ్యం దేవుడిచ్చిన లక్షణం, అది బైబిలులో “శ్రీమంతుడగు దేవుడు,” అని వర్ణింపబడిన వానినుండి వచ్చిన బహుమానం.—1 తిమోతి 1:11.

అందుకనే సృష్టంతా తమాషా జీవులతో నింపబడి ఉండడంలో ఆశ్చర్యంలేదు. అవేవంటే, పిల్లికూనలు, కుక్కపిల్లల చిలిపిపనులు, తల్లి దాన్ని కొట్టేంతవరకూ సింహంపిల్ల తల్లి తోకను కొరుకుతూ ఉండడం, కోతిపిల్లలు చెట్టు కొమ్మల్లో ఒకదాన్ని ఒకటి తరుముతూ, వేలాడుతూ ఉండడం వంటివి. హాస్యం మనచుట్టూ ఉంది, మనం గమనించాలని, మనచే మెచ్చుకోబడాలని ఎదురుచూస్తుంది.

ప్రజలందరూ ఒకే విషయాన్నిబట్టి నవ్వుతారని దీనర్థం కాదు. దానికి భిన్నంగా, తమాషా అనేది ఒకరి సాంప్రదాయం, వ్యక్తిత్వం, పూర్వానుభవం, మనఃస్థితి అలాగే ఇతర విషయాలపై ఆధారపడి ఉంటుంది. అయితే, వాస్తవంగా, అందరూ ఒక నవ్వొచ్చే కథ, ఒక చక్కని విస్మయం, ఒక జోక్‌, ఒక తెలివైన పదబంధ ప్రహేలికను బట్టి నవ్వుతూ ప్రతిస్పందిస్తారు.

హాస్యం ఏ సంకల్పాన్ని నెరవేరుస్తుంది? క్లుప్తంగా చెప్పాలంటే, ఇతరులతో మంచిగా సంభాషించడానికి అది ఒక మాధ్యమం. ఒక వ్యాఖ్యానం నవ్వును, “ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే అతిస్వల్ప దూరం,” అని పిలిచింది. వాస్తవానికి, హాస్యాన్ని వివాహ సహజీవనానికి కొలమానంలా ఉపయోగించ వచ్చని కొందరు నమ్ముతారు. ఏది నవ్వు తెప్పిస్తుంది అనే విషయంపై ఒకే అభిప్రాయంగల జంటలు, హాస్యం విషయంలో అంతగా కలవని అభిప్రాయాలుగల వారికన్నా, ఒకరినొకరు ఇష్టపడడం, ప్రేమించడం, వివాహం చేసుకోడానికి కోరుకోడం జరుగుతుందని హాస్యంపైన చేయబడిన ఒక అధ్యయనంలో తేలింది. ఎందుకు? ఎందుకంటే హాస్యం అనేక విషయాలను అంటే విలువలను, ఆసక్తులను, పూర్వ వృత్తులను, తెలివిని, ఊహాశక్తిని, మరియు అవసరాలను తెలియజేస్తుంది. “హాస్య లక్షణంగల ప్రజలు ఎక్కువ సృజనాత్మకంగా ఉంటారు, క్రొత్త ఆలోచనలను, పద్ధతులను పరిగణించడానికి, వాటికి హత్తుకొనడానికి ఎక్కువ ఇష్టత కలిగి, తక్కువ సంకుచితత్వం కలిగి ఉంటారని” 1985లో, అమెరికాలోని వెయ్యి కార్యాలయాలపై జరిపిన సర్వే తెలియజేసింది.

నవ్వాలా లేక నవ్వొద్దా

ఏదైనా ఏ విషయాన్నిబట్టి హాస్యంగా అవుతుందో నిజానికి ఎవ్వరికీ కచ్చితంగా తెలియదు. అప్రస్తుత విషయాలను బట్టి అంటే—అయోగ్యమైనవిగా అనిపించే రెండింటిని కలపడం వలన నవ్వొస్తుందని కొందరు నమ్ముతారు. సర్కస్‌ జోకర్‌లా బట్టలు ధరించిన ఒక పెద్దమనిషి, ఒక చిన్న పాపకు నవ్వు పుట్టించవచ్చు. అయితే, జీవితంలో తాను కలిగి ఉన్న అధిక అనుభవం, అధిక గ్రాహ్య కౌశలాలుగల ఒక పెద్ద వయస్కుడికి మాత్రం అటువంటి జోకరులాంటి పనులు నవ్వు తెప్పించవు. అతను మానసికమైన హాస్య విషయాలను ఇష్టపడవచ్చు. శారీరకమైన దానికి బదులు వ్యాఖ్య సంబంధమైన అప్రస్తుత విషయాలను కలిగి ఉండే శ్లేషాలను, పదాలతో ఆటలను, లేక జోకులను ఇష్టపడవచ్చు.

గూడుకట్టిన మానసిక శక్తి బహిర్గతమవ్వడం వలన హాస్యం రావచ్చని కొందరు పరిశోధకులు విశ్వసిస్తున్నారు. హాస్యం ఉద్రిక్తతను, బాధను కప్పిపుచ్చగలదు. బైబిలిలా చెబుతుంది: “ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండ వచ్చును. సంతోషము తుదకు వ్యసనమగును.”—సామెతలు 14:13.

అనేక రకాల హాస్యాల్లో అతిగా ప్రవర్తించడం యిమిడి ఉంటుంది. ఒక వ్యక్తి దేనికైనా తట్టుకొని పడతాడు లేక అకస్మాత్తుగా నీళ్లలో పడతాడు. అది నవ్వు తెప్పిస్తుంది కదూ? ఒకవేళ, ఎవ్వరికీ దెబ్బ తగలక పోతేనే నవ్వొస్తుంది.

ఒక క్రైస్తవుడు ఆత్మీయంగా లేక నైతికంగా సరిలేని లేక క్రూరమైన హాస్యంపట్ల మెప్పు పెంపొందించుకోకుండా ఉండడానికి కృషిచేస్తాడు. ఎంతైనా, ప్రేమ “దుర్నీతివిషయమై సంతోష”పడదు. (1 కొరింథీయులు 13:6) ఏ దేశాన్ని లేక జాతిని చిన్నచూపు చూసి నొప్పించే జోకులను కూడ మానివేయాలి. అతను తన హాస్య లక్షణానికి “సుఖదుఃఖముల”ను జోడిస్తాడు. (1 పేతురు 3:8) ఉదాహరణకు, దోగాడే పాప బెదురుతూ కొన్ని అడుగులు వేసి దబాల్లున పడిపోతే అది చూడటం ముచ్చటగా, ఆనందంగా ఉండవచ్చు. కానీ ఒకవేళ పెద్దవయస్కులు లేక వికలాంగులు పడితే, నవ్వడం కాకుండా, అతనికి సహాయపడేందుకు వెంటనే వెళ్లడం సరైన ప్రతిస్పందన అవుతుంది.

హాస్యము, మీ ఆరోగ్యం

సరిగ్గా ఉపయోగిస్తే, హాస్యానికి అత్యంత విలువ ఉంది. నిజానికి, హాస్యం చికిత్సాపర పనిముట్టుగా కూడ పనిచేయగలదనే సాక్ష్యాధారాలు నెమ్మదిగా సమకూడుతున్నాయి. నవ్వే క్రియ ఒకరి అంతర్గత భాగాలను ఆరోగ్యకరంగా మర్దనా చేస్తుందన్నది తెలిసిందే. అంతే కాకుండా, అమెరికన్‌ హెల్త్‌ పత్రిక ప్రకారం, “నవ్వు రోగనిరోధక వ్యవస్థను శక్తివంతం చేయవచ్చని కొందరు పరిశోధకులు భావిస్తున్నారు.” తరువాత, ఇమ్యూనాలజిస్టు అయిన లీ ఎస్‌. బెర్క్‌ యిలా చెప్పడాన్ని ఆ పత్రిక ఉదహరించింది: “ప్రతికూల భావోద్రేకాలు రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తాయి, అయితే అనుకూలమైనవి కూడ అలాంటిదే చేయగలవని ఇప్పుడు అనిపిస్తుంది.” ఇది బైబిలు మాటల జ్ఞానాన్ని ఉన్నతపరుస్తుంది: “సంతోషముగల మనస్సు ఆరోగ్యకారణము.”—సామెతలు 17:22.

హాస్యం యొక్క స్వస్థతా శక్తిని ఉపయోగించుకోవాలన్న నిరీక్షణతో, కొన్ని ఆసుపత్రులు నవ్వుల గదులు అని పిలువబడే వాటిని నెలకొల్పాయి. అందులో రోగులు ఆటలు ఆడుకోవచ్చు, నవ్వొచ్చే సినిమాలు చూడవచ్చు, జోకులు వినవచ్చు, లేక తమ బంధువులను ఆహ్లాదకరమైన వాతావరణంలో కలుసుకోవచ్చు. నవ్వు తెప్పించే పనేదైనా మీకైమీరు చేయగలరా? రోగగ్రస్థమైన మీ స్నేహితుడు లేక బంధువు ఆసుపత్రిలో ఉన్నాడనుకుందాము. ఏ పరిస్థితుల్లో అది సరిగ్గా ఉంటుందో గమనించి, అనారోగ్యంతో ఉన్నవారి దృక్పథాన్ని ఉత్తేజవంతం చేయడానికి అతనికి లేక ఆమెకు ఒక తమాషాగా ఉండే పుస్తకాన్ని లేక నవ్వొచ్చే కార్డును ఎందుకు పంపకూడదు?

నవ్వు కోపాన్ని కూడ శాంతపరచగలదు. డా. ఆర్‌. బి. విలియమ్స్‌, జూనియర్‌, యిలా చెబుతున్నాడు: “కోపోద్రేకులవ్వడం మీ ఆరోగ్యానికి చెరుపు.” అదే విధంగా, బైబిలిలా చెబుతోంది: “సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్లు.” (సామెతలు 14:30) డా. విలియమ్స్‌ యిలా నొక్కి చెబుతున్నాడు: “మీరు నవ్వుతున్నప్పుడు కోపంగా ఉండటం చాలా కష్టం.” అవును, ఒక పరిస్థితిలోని హాస్యాన్ని గమనించడం కోపాన్ని అదుపులోపెట్టగల అత్యంత ప్రయోజనాత్మకమైన పద్ధతుల్లో ఒకటి.

కుటుంబ వలయం లోపల

గృహంలో కూడ హాస్యాన్ని ఉపయోగించవచ్చు. ఒక భర్త యిలా చెబుతున్నాడు: “అది ఎన్నో పనులు చేయగలదు గనుక, ఒక మోటారు వాహనానికి, బహుప్రయోజక పనిముట్టు ఎలా ఉంటుందో, అది నాకు అంతగా ఉపయోగపడుతుంది. అది సంరక్షిస్తుంది, ప్రోత్సహిస్తుంది, ఫలవంతమైన సంభాషణలను ప్రారంభిస్తుంది, అది ముందే ఏర్పర్చుకున్న ఉద్దేశాలను తుంచేస్తుంది, సమస్యలను తెచ్చిపెట్టే మాటలను, సహేతుకమైన, అర్థంచేసుకొనగలిగే మాటలుగా మారుస్తుంది.”

ప్రాముఖ్యంగా, చిరాకు కలిగించే అలవాట్లు సంబంధాలను బెడిసికొట్టేలా చేస్తునప్పుడు, హాస్యభావం సహాయకరంగా ఉండగలదు. ఎన్నిసార్లు చెప్పినా మీ అబ్బాయి తన ఆటబొమ్మలను ఎత్తిపెట్టడం మర్చిపోతాడు. మీ భర్త తన మురికి బట్టలను స్నానాలగదిలోనే వదిలేసి వస్తాడు. మీ భార్య వంటలను మాడ్చేస్తుంది. తప్పుపట్టడం, సిగ్గుతీయడం, నిందించడం, అరవడం, కేకలేయడం పరిస్థితిని క్షీణింపజేస్తాయి. రెడ్‌బుక్‌ అనే పత్రికలో ఒక ఆరోగ్య పరిశోధకురాలు యిలా ఉదహరించింది: “మీరు ఒక వ్యక్తిని ఎదిరిస్తే లేక ఎగతాళి చేస్తే, అతను ప్రతిఘటిస్తాడు. హాస్యం ప్రజలను తమ ప్రవర్తన వైపు దూరంనుండి చూడడానికి—దాన్ని మార్చుకోడానికి ఆహ్వానిస్తుంది.”

దీని అర్థం, అజాగ్రత్త వహించిన వ్యక్తిని ఎగతాళి చేయాలని కాదు. అది సహజంగా బాధను కలిగిస్తుందే గాని నవ్వు పుట్టించదు. మీ హాస్యాన్ని పరిస్థితి వైపు మళ్లించడానికి ప్రయత్నించండి. హాయిగా నవ్వడం ఉద్రిక్తతను తగ్గించడానికి సహాయం చేయగలదు. ఒక భార్య యిలా చెబుతోంది: “నాకు కోపం రాబోతుందని నా భర్త గమనించి, ఎదైనా హాస్యపు మాట లేక క్రియ ద్వారా తను దాన్ని తగ్గించిన సందర్భాలు చాలా ఉన్నాయి. నాకు తెలిసేలోపే, నేను నవ్వుతుంటాను. అది అంత గంభీరమైన విషయమేకాదని నేను తరువాత గ్రహిస్తాను.”

అయితే, ఓ హెచ్చరిక మాట. గంభీరంగా లేక దయాపూర్వకంగా ఉండవలసిన పరిస్థితిలో నవ్వు పుట్టించేలా ఉండకుండా జాగ్రత్తపడండి. సామెతలు 25:20న్ని గమనించండి: “దుఃఖచిత్తునికి పాటలు వినుపించువాడు చలిదినమున పైబట్ట తీసివేయువానితోను సురేకారముమీద చిరకపోయువానితోను సమానుడు.” భావోద్రేకంగా లేక భౌతికంగా హాని కలిగించకుండా, హాస్యాన్ని కేవలం విచక్షణతోనే ఉపయోగించవలసి ఉంది. హాస్యాన్ని ఎప్పుడు కూడ తుంటరితనంగా లేక అగౌరవంగా ఉండనివ్వకండి. పెద్ద పిల్లలు తమ చిన్న చెల్లెళ్లు తమ్ముళ్లను ఎప్పుడూ ఏడిపించడం తగదు. మృదువుగా వెక్కిరించడం ఒకెత్తు, కఠినమైన వ్యాఖ్యానాలు చేయడం మరో ఎత్తు. వివాహ సహచరులు కూడ హాస్యాన్ని హద్దుల్లో ఉంచడానికి ప్రయత్నించాలి, దానిని, విమర్శించడానికి ఒక ఆయుధంలా లేక అవమానించడానికి ఒక అదునుగా ఉపయోగించకూడదు.

కవియైన లాంగ్‌స్టన్‌ హగ్స్‌ ఒకప్పుడు యిలా వ్రాసాడు: “హాస్యం ఒక ఆహ్వానింపబడే వేసవి జల్లులా ఉన్నట్టుండి భూమిని, గాలిని, నిన్ను, శుభ్రపరిచి చల్లబరుస్తుంది.” నిజంగా హాస్యం మన జీవితాల్లో ప్రాముఖ్యమైన పాత్ర వహించగలదు. అది మనల్ని మనం మరీ ఉన్నతంగా భావించుకోకుండా ఉంచుతుంది. మనం ఉత్సాహంగా, సేదతీర్చుకొని ఉండడానికి సహాయం చేస్తుంది. అది ఇతరులతో మన సంబంధాలను సుగమం చేయగలదు. మనం కష్టాలను తట్టుకోడానికి అది సహాయం చేయగలదు. అది మన ఆరోగ్యాన్ని కూడ మెరుగుపర్చగలదు.

కావున మీ జీవితాన్ని హాస్యంతో నింపండి. దాన్ని పెంచిపోషించండి. అది మీపై మీ చుట్టూ ఉన్న వారిపై చాలా మంచి ప్రభావాన్ని చూపుతుంది! (g94 5/22)

[21వ పేజీలోని చిత్రం]

హాస్యం యింట్లోని ఒడుదుడుకులను సుగమం చేయగలదు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి