మీరు వెన్నునొప్పితో బాధపడుతున్నారా?
“నొప్పి చాలా భయంకరంగా ఉండేది. ఎవరైనా అగ్గిపుల్ల తీసుకుని నా వెన్నుకు నిప్పంటించారేమో అన్నట్లు ఉండేది! నాకు జ్ఞాపకమున్నదల్లా ఏమంటే, నేను నా చెల్లి కొడుకును విరిగిన గాజుపెంకుల దగ్గరనుండి జరపడానికి వంగాను, ఉన్నట్టుండి నా వీపంతా భగ్గుమంది. నేను ఆ స్థితిలో కొన్ని రోజులవరకు ఉన్నాను, నేను సరిగ్గా నిలబడలేకపోయాను. అటువంటి నొప్పి నాకు అంతకు ముందు ఎప్పుడూ రాలేదు,” అని ఓ గృహిణి, ఇద్దరు పిల్లల తల్లి అయిన 32 సంవత్సరాల కారెన్ చెబుతోంది.
అమెరికాలోని ప్రజల్లో తలనొప్పితో బాధపడేవారి సంఖ్య తరువాత రెండవ స్థానాన్ని పొందేది వెన్ను నొప్పే. అది 45 సంవత్సరాలకంటే తక్కువ వయస్సుగల ప్రజలకు ఉండే దీర్ఘకాల అస్వస్థతలలో మొదటిది, 45 సంవత్సరాలు పైబడిన వారికి ఎక్కువగా వచ్చే నొప్పుల్లో మూడవది. బాధితులు ఉపశమనం కొరకు సంవత్సరానికి 2,400 కోట్ల డాలర్లను ఖర్చు చేస్తారు—అది 1991లో ఎయిడ్స్ చికిత్స కొరకు ఖర్చు చేసిన దానికి నాలుగంతలు ఎక్కువ.
వెన్ను సమస్యలకు సంబంధించిన వైజ్ఞానిక పరిశోధకుడైన డా. ఆల్ఫ్ ఎల్. నాకెమ్‌సెన్ ప్రకారం, గత దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల రోగులు కొద్దిపాటి వెన్ను నొప్పితో బాధపడ్డారు. “మన జీవితాల్లో హుషారుగా ఉన్న సమయాల్లో మనలో 80 శాతం మంది వెన్ను నొప్పిని కొంత మేరకు అనుభవించాము,” అని ఆయన చెప్పాడు.
తరచుగా వచ్చే నొప్పి
వెన్ను నొప్పి విచక్షణ చూపదు. శ్రామికులకు, కార్యాలయాల్లో పనిచేసేవారికి కూడ నడుం నొప్పులు వచ్చే అవకాశం ఉంది. పురుషులు, స్త్రీలు, యౌవనులు, వృద్ధులు కూడ ఈ నొప్పికి గురికాగలరు. ఆ నొప్పి పునరావృతమవ్వడం, తగ్గక పోవడం జరిగినప్పుడు, అది భావోద్రేక శ్రమలను ఉత్పన్నం చేస్తూ, అలాగే ఉద్యోగాన్ని, రాబడిని, కుటుంబాన్ని, కుటుంబంలో వారి పాత్రను ప్రభావితం చేయగలదు. ఎలా?
ప్రజలు తాము తరచూ నొప్పితో ఉన్నట్లు కనుగొంటారని, ది ఫైట్ అగేన్‌స్ట్ పేన్ అనే పుస్తకం పేర్కొంటుంది. భౌతిక నొప్పి ఆవేదనను, కృంగుదలను కలిగించవచ్చు, అది మళ్లీ చాలా తీవ్రమైన, పీడించే నొప్పికి దారి తీయవచ్చు. ఉదాహరణకు, ఒక యౌవన తండ్రి లేక సంపాదనపరుడు వెన్ను సమస్యలవల్ల రాగల అస్వస్థత వలన ఉద్యోగం, కుటుంబం, మరియు స్నేహితులనుండి వచ్చే ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది.
“నా కుటుంబం, స్నేహితులు దానిని అర్థం చేసుకుని, సానుభూతి చూపక పోవడమే నేను పెద్ద సమస్యగా భావిస్తాను. మీరు వాస్తవంగా ఎంత బాధపడుతున్నారో అర్థం చేసుకోకుండా ప్రజలు నొప్పిని చిన్నచూపు చూస్తారు,” అని 1986లో మొదటిసారి వెన్నునొప్పిని పొంది, అప్పటినుండి అనేకసార్లు వెన్నునొప్పికి గురైన, 35 సంవత్సరాల సెక్రటరీ, పాట్ చెబుతోంది. “నొప్పి ఎప్పుడు లేక ఎక్కడ వస్తుంది అన్నది మీకు తెలియదు గనుక, మీరు ఎక్కువ కార్యకలాపాలను కలిగి ఉండడానికి పథకం వేసుకోలేరు. ఆహ్వానాన్ని అంగీకరించకుండా, ఎవరికైనా జన్మించిన చిన్న పాపను ఎత్తుకోకుండా, చిరునవ్వు నవ్వకుండా, మీరు అమర్యాదస్థులుగా కనిపించవచ్చు, అంతా ఎందుకంటే మీకు నొప్పిగా ఉంది. ఒకవేళ మీరు అనుమతిస్తే, ఆ నొప్పి మిమ్మల్ని నియంత్రణ చేయగలదు.”
వెన్నునొప్పెందుకు వస్తుంది
వెన్ను నొప్పి నివారించబడలేదా? దాన్ని తగ్గించడానికి లేక నిరోధించడానికి మీరేమి చేయగలరు? మీ వీపు కొరకు మీరు వైద్య సహాయం ఎప్పుడు పొందాలి? తదేకంగా వచ్చే వెన్ను నొప్పి అనేక లోలోపలి వ్యాధులను గురించి సూచనలు యివ్వవచ్చు గానీ, ఈ చర్చ మాత్రం వెన్ను నొప్పికి కారణమైన రెండు మూలాలపైనే దృష్టి నిలుపుతుంది—అవి అంత్రవృద్ధి చెందిన ఫలకాలు మరియు కండరాల సంకోచము.
యౌవన మరియు మధ్య వయస్సుగల పెద్దవారికి కలిగే వెన్ను నొప్పుల్లో అంత్రవృద్ధి చెందిన ఫలకాలే ముఖ్య కారకాలు. అటువంటి ఫలకాలు తరచూ “జారిన ఫలకాలుగా,” అపప్రయోగం చేయబడుతున్నాయి. ఎందుకంటే అవి తమ స్థలంలోనుండి ప్రక్కకు జారలేవు.
ఒక వ్యక్తి 20 సంవత్సరాల వయస్సుకు చేరేసరికల్లా, ఫలకం కుంచించుకుపోయేలా చేస్తూ, స్పాంజివంటి ఫలకాల లోపలి భాగం దాని సాగే గుణాన్ని, తేమను కోల్పోతుంది. కానీ సాధారణంగా ఇది నొప్పికి దారితీయదు. అయితే, కొంతమంది ప్రజలకు, స్పాంజివంటి లోపలి భాగం నారతో కూడిన కణజాలం యొక్క బయటి వలయాన్ని దాటి అంత్రవృద్ధి చెందినప్పుడు, లేక ఉబ్బినప్పుడు, తీవ్రమైన నొప్పి కలుగుతుంది.
ఈ ఫలకాలను గురించి ఫార్ట్యూన్ అనే పత్రిక యిలా వ్యాఖ్యానిస్తుంది: “అవి ఒకసారి ఒక ప్రత్యేక స్థాయిని మించి క్షీణిస్తే, అతి చిన్న బాధ—తుమ్మడం లేక స్ట్రీరియోను కదపడానికి ముందుకు వంగడంవంటి చాలా అల్పమైనవి కూడ—నొప్పికి కారణం కాగలవు.”
ఫలకాలు, మొదటి 24 వెన్నుపూసలు, లేక వెన్నెముక యొక్క ఎముకల మధ్య భయోత్పాతాన్ని తట్టుకునే వాటిలా పనిచేస్తాయి. కశేరు నాడీ దండము ఉండే, నిలువు సొరంగమైన కశేరు కుల్యం ఏర్పడడానికి ఈ ఎముకలు ఒకదాని పైన ఒకటి అమర్చబడతాయి. ప్రతి వెన్నుపూస జత మధ్య, ఒక చిన్న రంధ్రం ఉంటుంది, అక్కడినుండి నాడీ మూలమని పిలువబడే నరాల గుచ్చాలు, కుల్యం దాటి, ఒక్కో గుచ్చం ఒక వైపు వెళ్తాయి. ఒక ఫలకం అంత్రవృద్ధి చెంది ఒక ప్రత్యేక నరానికి ఒత్తుకుపోవచ్చు. శరీరం యొక్క ఇతర భాగాలకు పంపబడే, అలాగే వాటినుండి వచ్చే ఉద్వేగాలను ప్రసరణచేసే నరాల సంకేతాలను ఈ ఒత్తిడి అడ్డగించవచ్చు.
ఉదాహరణకు, ఆసన నరం యొక్క మొదట్లో గనుక ఒత్తిడి కల్గిస్తే, తుంటినొప్పి అని పిలువబడే, చాలా నొప్పి కలిగించే పరిస్థితి ఏర్పడగలదు. వెన్నెముక యొక్క క్రింది భాగంనుండి వచ్చే అనేక నరాలు ఆసన నరం అవుతాయి. రెండు వైపులా ఒక్కొక్కటి ఉంటాయి, అవి తొడల వెనకనుండి మోకాళ్ల వరకు వెళ్లి ఇతర నరాలుగా విడిపోతాయి. సాధారణంగా తుంటినొప్పి నడుము క్రింది భాగంలో మొదలై, తుంటి, పిరుదుల నుండి తొడల వరకు ప్రాకవచ్చు, కొన్నిసార్లు పిక్కలు, పాదాల వరకు కూడ వెళ్లవచ్చు. దాని ఫలితంగా, ఒక వ్యక్తి కాళ్లు పడిపోవచ్చు—ఆ పరిస్థితిలో కాలి కండరాలు కాలి ముందుభాగాన్ని ఎత్తలేవు. అప్పుడు బాధితుడు, నొప్పి కలిగిన కాలు తిమ్మిరెక్కడం, మెద్దుబారడం, కండరాలు బలహీనంగా ఉండడాన్ని కూడ అనుభవించవచ్చు.
మూత్రాశయానికి, పేగుకు సహాయపడే, నడుముకు కొంచెం క్రిందుగా ఉండే నరాల సముదాయమైన కవుడా ఎక్వీనా యొక్క నాడీ మూలాల్లో గనుక ఫలకం ఒత్తిడి కలిగిస్తే, ఒక వ్యక్తికి మూత్ర లేక మల విసర్జన సమస్యగా ఉండవచ్చు. అవి నరాలకు సంబంధించిన గంభీరమైన సమస్యలకు సూచనలు కావచ్చు గనుక, ఈ లక్షణాలలో వేటినైనా కలిగి ఉన్న వ్యక్తులు వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.
ఈ నరాలు ముడుచుకుని, సడలినప్పుడు, వెనుక ఉన్న కండరాలు ఆధారం కొరకు స్నాయతంతు బంధనాలకు కలుస్తాయి, అలా వెన్ను పడిపోకుండా, వంగడానికి, మలుపు తిరగడానికి వీలు కలిగిస్తాయి. ఒత్తిడి కలిగినప్పుడు ఆరోగ్యంగా లేని కండరం, ఒక గట్టి వాపులా అయ్యేంతగా ఉద్రిక్తం చెందేలా ఆ కండరంలో సంకోచం కలుగవచ్చు. హెచ్చరిక చేయకుండా సంభవిస్తు, ఒక వ్యక్తిని తాత్కాలికంగా కదలకుండా చేసే, ఈ వీపులో కలిగే సంకోచాల ఉపాఖ్యానాలు చాలా బాధాకరంగా ఉండగలవు. ఒక బాధితుడు, ఆ నొప్పిని, “మీ వీపులో కలిగే భూప్రకంపనల పరంపరలు” అని వివరించాడు.
ఒక వ్యక్తి యొక్క బలహీనమైన కండరాలకు మరింత నష్టం వాటిల్లకుండా రక్షించడానికే కండరాల ఆకస్మిక పరిణామాలు సంభవిస్తాయని వైద్యులు అంగీకరిస్తున్నారు. టైమ్ లైఫ్ కంపెనీ వారి పుస్తకమైన, ది ఫిట్ బ్యాక్, ఈ విషయాన్ని గమనించింది: “మీ వీపును కదలనివ్వకుండా చేయడం ద్వారా, మీరు సరైన చర్యను తీసుకుని, పడుకోడానికి సంకోచం మిమ్మల్ని బలవంతం చేస్తుంది. ఈ స్థితి మీ వెన్నుమీద తక్కువ శాతం ఒత్తిడిని కలిగించడమే కాక, మండుతున్న కణజాలానికి దానికది సరిచేసుకోడానికి కూడ వీలు కలిగిస్తుంది.”
తరచూ సంకోచాన్ని కలిగించే వెన్ను నొప్పిని నిరోధించడానికి, వీపు కండరాలు, పొత్తి కడుపు, తొడలు దృఢంగాను, బలంగాను ఉండాలి. ఉదాహరణకు, దృఢంగా లేని పొత్తి కడుపు కండరాలు, వెన్ను నొప్పిని కలిగించవచ్చు, ఎందుకంటే అవి సరైన ఆధారాన్ని ఇవ్వలేవు, వెన్నుపై పడే శరీర బరువును ఓర్చుకొనలేవు. పొత్తి కడుపు కండరాలు మంచిగా దృఢంగా ఉంటే, వీపు క్రింది భాగం జారగిల్లే స్థితికి రాకుండా చేసే “కండరాల దట్టిని” అది సృష్టిస్తుంది. జారగిలపడటం, అంటే నడుము క్రింది భాగం మరీ సొట్టగా అవ్వడం, నడుము క్రిందిబాగం దాని సమరేఖ నుండి పక్కకు తొలిగేలా చేస్తుంది.
నొప్పిని తగ్గించడానికి మీరేమి చేయగలరు
సరిలేని అంగ విన్యాసం, లావుగా ఉండడం, బలహీనమైన కండరాలు, మరియు ఒత్తిడి వెన్ను నొప్పికి దారితీయగల నాలుగు కారకాలైయున్నవి. సాధారణ పనులైన కూర్చోడం, నిలబడడం, లేక ఎత్తడం వంటివాటిని తప్పుగా చేయడం నొప్పికి అనుకూలమైన ఇతర కారకాలు.
మంచి అంగవిన్యాసం, బలమైన పొత్తి కడుపు, వెన్ను కండరాల మధ్య పరస్పర సంబంధం ఉంటుంది. సరైన అంగవిన్యాసం కండరాలు సరిగ్గా పని చేయడానికి వీలు కలిగిస్తుంది, అలాగే మంచి కండరాల స్థితి సరైన అంగవిన్యాసానికి ప్రాముఖ్యం. మంచి అంగవిన్యాసం కొరకు వెన్ను ప్రకృతి సిద్ధమైన ఎస్ ఆకృతిలో మంచి సమరేఖను కలిగి ఉండడం అవసరం. మంచి అంగవిన్యాసం అంటే నిట్టనిలువుగా ఉండే వెన్ను అని అర్థం కాదు.
సరిగా లేని అంగవిన్యాసాన్ని సరిచేస్తే, అంగవిన్యాసం వలన కలిగే నొప్పి తొలగించ బడగలదని ట్రీట్ యువర్ ఓన్ బ్యాక్, అనే పుస్తకంలో రాబిన్ మెకెన్జీ సూచించాడు. అతనిలా కూడ చెప్పాడు: “అయితే, సమయం గడిచే కొలది, దాన్ని సరిచేయక పోతే, అలవాటుపడిపోయిన తప్పుడు అంగవిన్యాసం, కీళ్ల ఆకృతిని మారుస్తుంది, అధిక అలసట కలుగుతుంది, దానివలన కీళ్లు సమయానికి ముందే క్షీణించడం జరుగుతుంది.”
అధిక బరువు, ప్రాముఖ్యంగా పొత్తి కడుపులో అది ఉండడం, వెన్నుకు ఒత్తిడిని కలిగించవచ్చు, ఎందుకంటే అది వెన్నుకు ఆధారానిచ్చే కండరాలపై గురుత్వాకర్షణ ఒత్తిడిని సృష్టిస్తుంది. సరైన, ఆరోగ్యవంతమైన వీపును కలిగి ఉండడానికి క్రమమైన వ్యాయామ కార్యక్రమం ఒక కీలకము. ఒకవేళ నొప్పి ఇప్పుడు ఉండక పోయినా, వ్యాయామం ప్రాముఖ్యం ఎందుకంటే పోయిన వెన్ను నొప్పి మళ్లీ అనుకోని విధంగా రావచ్చు. వ్యాయామ కార్యక్రమాన్ని ప్రారంభించక ముందు సంపూర్ణ వైద్య సంప్రదింపు ఎంతైనా మంచిది. ఒక వ్యక్తి యొక్క వీపు సమస్యకు వైద్యుడు సరైన వ్యాయామాన్ని గురించి సలహా ఇవ్వవచ్చు, లేక అతను ఒక శరీర చికిత్సకున్ని సందర్శించమని ఒక రోగికి చెప్పవచ్చు.
ఒత్తిడి కూడ ఒక వ్యక్తిని వెన్నెముక సమస్యలకు లోను చేయవచ్చని అనేకమంది పరిశోధకులు విశ్వసిస్తున్నారు. ఒత్తిడి కొందరు ప్రజల్లో నరాల బలహీనతను (స్పాస్మ్) కలిగించవచ్చు ఎందుకంటే ఉపశమనం లేని ఒత్తిడి కండరాలను బిగింపజేసి, వెన్ను నొప్పికి దారి తీయగలదు. ఒత్తిడికిగల మూలాలను తగ్గించడం లేక తీసి వేయడమనేది, వెన్ను నొప్పి వచ్చే ప్రమాదాన్ని తగ్గించగలదు.
పని వద్ద ఎక్కువ సమయం కూర్చుని గడిపే ప్రజలు లేక చాలా దూరాలు ప్రయాణిస్తూ ఉండే వారు నడుము బాధను అనుభవించవచ్చు. స్వీడన్‌లో జరపబడిన ఒక అధ్యయనం ప్రకారం, కూర్చొని ఉన్నప్పుడు వీపు క్రింది భాగంపైన చాలా ఎక్కువ బరువు పడుతుంది. దురదృష్టకరంగా, వీపుకు సరిపోయేంతగా ఆధారం లేని ఆఫీసు కుర్చీలను ఉపయోగించడం వలన ఈ ప్రమాదం ఎక్కువ అవుతుంది. ఎప్పుడూ కూర్చొని ఉండకుండా అప్పుడప్పుడూ క్రమంగా కొద్ది నిమిషాలపాటు నిలబడడం, అలా నడవడం వంటివి చేయడం సహాయకరంగా ఉండగలదు.
బరువైన లేక సులభమైన వస్తువులను ఎత్తేటప్పుడు, ప్రజలు తమ వీపు కండరాలను ఉపయోగించకుండా జాగ్రత్తపడాలి. ఎత్తేటప్పుడు మోకాళ్లను వంచాలని సలహా ఇవ్వబడింది, ఎందుకంటే అప్పుడు వీపు కండరాలే ఒత్తిడినంతా ఓర్చుకొనవలసి ఉండదు.
కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో పని చేసే వ్యక్తి కూడ వీపు సమస్యలకు గురికాగలడు. ఫ్యాక్టరీలో వరుసగా నిలబడి పనిచేసే వారు, నర్సులు, కరెంటు పనివారు, ఇంటి పని చేసే వారు, వ్యవసాయం చేసే వారు తమ పనులు చేసేటప్పుడు ఎక్కువసేపు వంగి ఉండాల్సి వస్తుంది. నడుముకు కష్టం కలిగించకుండా ఉండడానికి, క్రమంగా ఆలసట తీర్చుకోమని లేక స్థానాన్ని మార్చుతూ ఉండమని శారీరక చికిత్సకులు సలహా యిస్తున్నారు. ఎక్కువసేపు నిలబడి ఉండే ప్రజలకు, చిన్న స్టూలునైనా లేక కాలు పెట్టుకొనడానికి ఇతర దానిని దేనినైనా ఉపయోగించమని, క్రింది నడుమును నిటారు చేయడానికి ఒక కాలును కొద్దిగా పైకి లేపమని సలహా ఇవ్వబడుతుంది.
చికిత్స కొరకు వెదకడం
కండరాల వలన వచ్చే వెన్ను నొప్పిని అనుభవించే వారికి అనేకులకు, వైద్యులు సాధారణ చికిత్సను సూచిస్తున్నారు—అదేమంటే పడకలో అలసట తీర్చుకోడం, వేడిని ఉపయోగించడం, మర్దనా చేయడం, వ్యాయామం చేయడం, మరియు ప్రాముఖ్యంగా మొదట్లోనే మంటను నిరోధించి నొప్పిని తగ్గించే మందులు. మందులను గురించి, మియామి వైద్య పాఠశాల యొక్క విశ్వవిద్యాలయానికి చెందిన డా. మార్క్ బ్రౌన్ జాగ్రత్త కొరకు ఒక మాట చెప్పాడు. అమెరికాలో, వెన్ను నొప్పులకు ముఖ్య కారణం, మందులను దీర్ఘకాలం వరకు ఉపయోగించడం వలన ఆ మందు యొక్క పార్శ్వ ప్రభావమే అని అతను పేర్కొన్నాడు. ప్రజలు ఒక మందుకు తట్టుకొనే సామర్థ్యాన్ని పెంపొందించుకోకుండా జాగ్రత్తపడవలసిన అవసరం ఉంది, ఎందుకంటే అది మందు మోతాదును పెంచడానికి, తద్వారా దానికి బానిసలవ్వడానికి దారితీయగలదు.
శరీర చికిత్స, వెన్నెముక మర్దన ద్వారా రోగమును నయం చేసే విధానానికి సంబంధించిన (సీరోప్రాక్టిక్) వైద్యున్ని సందర్శించడం కూడ కొంతమంది బాధితులకు సహాయాన్ని, ఉపశమనాన్ని అందించగలవు. అమెరికాలో, సీరోప్రాక్టిక్ శ్రద్ధ అందరు రోగుల సందర్శనాలకు మూడింట రెండొంతుల వరకు ఉంటుందని హెల్త్‌ఫ్యాక్ట్స్ అనే పత్రిక పేర్కొన్నది.
హెర్నియేటెడ్ డిస్క్‌లకు సంబంధించిన సమస్యలను సరిచేయడానికి లేక నొప్పికి ఉపశమనం కలిగించడానికి శస్త్రచికిత్స అవసరం కావచ్చు. అయితే, వెన్నునొప్పి బాధితులనేకులకు వైద్యులు చాలా తరచుగా మొదట జాగ్రత్తపడవలసిన చికిత్సను సూచిస్తారు. వారికి శస్త్ర చికిత్స అవసరం అని చెప్పబడిన ప్రజలు రెండవ లేక మూడవ అభిప్రాయం కొరకు సంప్రదించడం ఎంతైనా మంచిది.
లక్షలాదిమంది బాధితులకు, తదేకంగా వస్తున్నా సహించగలిగే వెన్ను నొప్పి జీవితంలో ఒక భాగము. అనేకులు ఈ నొప్పికి లోబడతారు కానీ అది అనుదిన కార్యకలాపాలకు అడ్డుపడకుండా ఉంచడానికి కృషిచేస్తారు. నొప్పిని కలిగించే మూలములు వారికి తెలుసు, దాన్ని నిరోధించడానికి లేక త్రిప్పికొట్టడానికి చర్యలు గైకొంటారు. వారు క్రమంగా వ్యాయామం చేస్తారు, తగిన బరువుండేలా చూచుకుంటారు, తమ అంగవిన్యాసాన్ని మెరుగుపరచుకుంటారు, మరియు తమ జీవితాల్లో ఒత్తిడిని తగ్గిస్తారు. అంత్రవృద్ధి చెందిన ఫలకాలు మరియు కండరాల సంకోచం వలన నొప్పి మళ్లీ మళ్లీ వస్తునప్పటికీ, మొదట్లో చెప్పబడిన కారెన్, యెహోవా సాక్షులు చేస్తున్న ప్రకటించే, బోధించే పనిలో చాలా సమయాన్ని గడుపుతూ, పనిరద్దీగల పట్టికను సంతోషంగా నిర్వహిస్తుంది. కారెన్ వలెనే, చాలామంది బాధితులు అనుకూల దృక్పథాన్ని కలిగి ఉండి, తమ నొప్పిని అదుపులో ఉంచుకొనడానికి ప్రయత్నిస్తున్నారు. (g94 6/8)
[24వ పేజీలోని బాక్సు]
వెన్నునొప్పిని నిరోధించడంలో కొన్ని సహాయకాలు
☞ దేన్నైనా తొందర్లో, గబాలున ఎత్తడం మానండి. నడుమును వంచే బదులు, మోకాళ్లను వంచండి.
☞ బరువైన వస్తువులను ఎత్తేటప్పుడు సహాయం కోరండి.
☞ ఎక్కువ బ్యాగులను మోసేటప్పుడు, బరువును రెండు వైపులకు సమతూకంగా ఉంచండి. ఒకే బరువైన వస్తువును మోస్తుంటే, రెండు చేతులతో, శరీరానికి దగ్గరగా ముందుకు పట్టుకోండి; లేక ప్రక్క వైపుగా పట్టుకొంటె, బరువును రెండు వైపులకు మార్చుకోండి.
☞ ప్రయాణం కొరకు, మడత పెట్టగల లగేజి కారియర్లను మరియు/లేక భుజాలకు తగిలించుకునే బద్దెలుండే తక్కువ బరువున్న లగేజిని ఉపయోగించండి.
☞ కారు వెనుక భాగంనుండి వస్తువులను ఎత్తేటప్పుడు, వస్తువులను ఎత్తక ముందు వాటిని శరీరానికి దగ్గరగా ఉంచండి.
☞ ఇల్లు తుడిచేటప్పుడు, పొడవు చీపురును ఉపయోగించండి. సామానుల క్రింద తుడిచేటప్పుడు నడుము వంచే బదులు, మోకాలు చిప్పలను ఉపయోగిస్తూ, ఒక మోకాలు మీద ఊనండి. ఒకవేళ మీరు నడుము వంచ వలసి వస్తే, వీలైనప్పుడు, మీరు దేనిమీదనైనా బరువు వేయడానికి ఒక చేతిని ఉపయోగించండి.
☞ ఆఫీసు పని చేసేటప్పుడు, ఎప్పుడూ బల్లవద్దనే కూర్చోకుండా, అప్పుడప్పుడూ నడుము వరకు ఎత్తు ఉండే పని స్థలం వద్ద నిలబడండి.
☞ తోటపని చేసేటప్పుడు మోకాళ్లూనండి, పనిని చిన్న భాగాలుగా విభజించి చేయండి. నిలబడి ఉన్నప్పుడు నడుము వంచకండి.
☞ రోజుకు కనీసం 10 నుండి 15 నిమిషాలైనా నడుముకు సంబంధించిన వ్యాయామాలు క్రమంగా చేయండి. మీరు పెద్దవారైతే వ్యాయామం తగుమాత్రం చేయండి.
☞ పరుపు పరిచేటప్పుడు, పరుపు ఇంకో వైపును అందుకోడానికి, పరుపు మీద ఒక కాలు మోపి, శరీరం పైభాగం బరువుకు ఆధారం కొరకు ఒక చేతిని ఆనించండి. దుప్పటి చివర్లను పరుపు క్రిందకు పరుపు రెండు వైపులా దోపేటప్పుడు, మోకాళ్లూనండి.
☞ చాలా దూరం కారులో వెళ్లేటప్పుడు, అక్కడక్కడా ఆగండి. కారు సీటు వెనక భాగం సౌకర్యంగా లేకపోతే, సీటు సరిపోకుండా ఉండే నడుము క్రింద ఉండే స్థలం భాగానికి సరిపోయేలా ఒక దిండును ఉపయోగించండి.
☞ గట్టి నేలమీద జాగింగ్ చేయకండి. సరైన వ్యాయామ షూలను తొడుక్కోండి.
☞ ఈజీ చైరు లేక సోఫాలో కూర్చునేటప్పుడు ఒక దిండును లేక వీపు కొరకు ఇతర సహాయకాన్ని ఉపయోగించండి. పైకి లేవడానికి మీ కాళ్లపై బరువు వేస్తూ మెల్లగా లేవండి.
☞ మీరు పని దగ్గర గంటల తరబడి కూర్చోవలసి ఉంటే, వీపును సరిగ్గా ఆన్చగల కుర్చీనే తీసుకోండి. అప్పుడప్పుడూ లేచి, అలా తిరగండి.
☞ ఫైల్ కాబినెట్ డ్రాయర్లపై ఎక్కువ సమయం వంగి ఉండకండి, వీలైనప్పుడు కుర్చీలో కూర్చోండి.
☞ మీరు రోజంతా ఎత్తు చెప్పులను వేసుకోవలసి ఉంటే, వీలైనప్పుడు ఎత్తు చెప్పులకు బదులు ఎక్కువ సౌకర్యంగా ఉండే చెప్పులను తొడుక్కోడానికి, వాటిని కూడా తెచ్చుకోండి. (g94 6/8)