బైబిలు ఉద్దేశం
స్వతంత్రంగా ఆలోచించడాన్ని బైబిలు నిరుత్సాహపరుస్తుందా?
జర్మనీ అధికారులు అగ్నిలోకి విసిరేసిన అమూల్యమైన గ్రంథాలు కాలుతుండగా జ్వాలలు ఆకాశం వైపుకు ఎగసాయి. అది నాజీ జర్మనీలోని దృశ్యమా? అవును, అయితే, అది 1199లో జర్మనీ భాషలోని బైబిళ్ళనన్నింటినీ కాల్చివేయాలని రోమన్ కాథోలిక్ ఆర్చ్ బిషప్ ఆజ్ఞ జారీ చేసినప్పటి దృశ్యం కూడా కావచ్చును.
నిజానికి, పుస్తకాలను కాల్చివేసిన సంఘటనలు—ఆలోచించే, మాట్లాడే స్వాతంత్ర్యాల అణచివేతకు విశ్వజనీన ప్రతీకంగా అనేక దేశాల్లోను, అనేక శతాబ్దాల్లోను సంభవించాయి. ఆలోచించే స్వాతంత్ర్యం సామాన్య మానవునిపై చూపించగల ప్రభావానికి భయపడిన మత నాయకులు తరచూ యిలా చేయడానికి ప్రేరేపించారు.
అరమరికలు లేకుండా వివేచనతో విచారించడానికి వ్యతిరేకంగా, బైబిలు కర్కశమైన కట్టడలను విధిస్తుందని నేడు అనేకులు ఊహించడంలో ఆశ్చర్యం లేదు. అయితే అది నిజమా? స్వతంత్రంగా ఆలోచించడాన్ని ఆటంకపర్చాలని బైబిలు ప్రోత్సహిస్తుందా?
‘నీ పూర్ణ వివేకముతో యెహోవాను ప్రేమించు’
వివేకాన్ని ఉపయోగించడాన్ని బైబిలు నిరుత్సాహపరచడం లేదు. నిజానికి, ‘యెహోవాను మన పూర్ణ వివేకముతో ప్రేమించాలని’ యేసు మనలో ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాడు. (మార్కు 12:30) ఆయనకు సరిక్రొత్త సాంఘిక రాజకీయ సంఘటనల్లో (లూకా 13:1-5), జీవశాస్త్రంలో (మత్తయి 6:26, 28; మార్కు 7:18, 19), వ్యవసాయంలో (మత్తయి 13:31, 32), మానవ స్వభావంలో (మత్తయి 5:28; 6:22-24) ఎంతో శ్రద్ధ ఉండేదని ఆయన పరిచర్య చూపిస్తుంది. దేవుని వాక్యంలోని సూత్రాలను, తన శ్రోతల పరిస్థితులను, తలంపులను గూర్చి ఆయన స్పష్టంగా అర్థం చేసుకున్నాడని, బైబిలుతో తన శ్రోతలు ఏకీభవించేలా చేయడమెలా అనే విషయాన్ని గూర్చి ఆయన బాగా యోచించాడని ఆయన ఉపమానాలు సూచిస్తున్నాయి.
తమ “వివేకంతో” దేవునికి సేవ చేయాలని పౌలు క్రైస్తవులందరినీ బ్రతిమాలాడు. (రోమీయులు 12:1) తప్పుదోవ పట్టించే ‘ప్రేరేపిత వాక్యాలు వారిని చంచలమనస్కులుగా’ చేయనివ్వకూడదని ఆయన థెస్సలొనీకయులను ప్రోత్సహించాడు. (2 థెస్సలొనీకయులు 2:2) ఆయనకు గ్రీకు మరియు క్రేతీయులు పద్యాలను గూర్చి (అపొస్తలుల కార్యములు 17:28; తీతు 1:12) మరియు సైనిక పరికరాలను గూర్చి, పద్ధతులను (ఎఫెసీయులు 6:14-17; 2 కొరింథీయులు 2:14-16) గూర్చిన జ్ఞానముంది. ఆయన అక్కడి ఆచారాలను బాగా గమనించేవాడు.—అపొస్తలుల కార్యములు 17:22, 23.
యేసు, పౌలు ముందు ఆలోచించే స్వాతంత్ర్యాన్ని ఎంతగానో అనుభవించినప్పటికీ, మంచి చెడులను గూర్చిన తుది అధికారం తమకే ఉందని వారు దృష్టించలేదు. తన వాదం కొరకై బైబిలును త్రోసిపుచ్చడానికి బదులుగా, యేసు పదే పదే లేఖనాల నుండి ఉదాహరించాడు. దేవుని చిత్తమైన బలి మరణం కాక భిన్నమైన దానిని గూర్చి తలంచమని పేతురు కోరినప్పుడు, తక్షణమే యేసు యిచ్చిన కఠినమైన జవాబు, ఆ విధమైన ఆలోచనా విధానాన్ని గూర్చి తాను తలపోయడం కూడా లేదని చూపిస్తుంది. (మత్తయి 16:22, 23) అలాగే, పౌలు కొరింథీయులతో యిలా చెప్పాడు: “నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు, నా ఉపన్యాస సామర్థ్యాన్ని లేదా తత్వశాస్త్ర జ్ఞానాన్ని చూపించడానికి కాదు గాని, దేవుడు వాగ్దానం చేసిన దానిని చెప్పడానికే వచ్చాను.” (1 కొరింథీయులు 2:1, ది జెరుషలేమ్ బైబిల్) యేసువలెనే ఆయన తర్కం కచ్చితంగా లేఖనాలపై ఆధారపడింది.—అపొస్తలుల కార్యములు 17:2.
ఏ మాత్రం కట్టుబాట్లు లేకుండా కాదు గాని, ఒకడు తన మానసిక సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించుకోడాన్ని బైబిలు ప్రోత్సహిస్తుంది. యెహోవా ఆలోచనలకు అనుగుణంగా మన ఆలోచనలను ఉంచుకోవడమన్న బాధ్యత, సంఘం మీద కాదు గాని, వ్యక్తిగతంగా ఒక్కో క్రైస్తవునిపైనే మోపబడింది. కాబట్టి, అనేక మంది ఎఫెసీయులు బహిరంగంగా తమ అభిచార వృత్తిని వదిలేసి, క్రైస్తవులైనప్పుడు, వారి పుస్తకాలను కాల్చివేసే బాధ్యతను పౌలు తానుగా తీసుకోలేదు గాని, “మంత్ర విద్యనభ్యసించిన వారనేకులు తమ పుస్తకాలను సేకరించి బహిరంగంగా వాటిని కాల్చివేశారు.” (అపొస్తలుల కార్యములు 19:19, జెబి) ఈ క్రైస్తవులు తమ స్వంత పుస్తకాలను కాల్చివేయవలసిన అవసరముందని ఎందుకు భావించారు?
రక్షణకొరకైన మొదటి చర్య
ఈ ఉపమానాన్ని గమనించండి. విజయవంతమైన సైనిక రక్షక దళంలో తరచూ పంక్తులు తీరిన అనేక రక్షక దళాలుంటాయి. విజయశాలియైన ఏ జనరల్ కూడా వాటిలో ఏ ఒక్కటైనా ప్రాముఖ్యత లేనిదిగా, పోరాడకుండా విడిచి పెట్టవలసినదిగా భావించడు. పాపానికి వ్యతిరేకంగా జరిపే క్రైస్తవ పోరాటంలో కూడా అనేక రకాలైన రక్షక చర్యలు గైకొనవలసి ఉంటుంది.
“ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.” అని యాకోబు 1:14, 15 చెబుతుంది. తప్పుడు కోరికను మనస్సులో పెట్టుకోవడమే పాపానికి మొదటి మెట్టు. కాబట్టి, ఆ కోరికను వృద్ధిచేసుకోకుండా ఉండడం అంటే తన ఆలోచనా విధానాన్ని అదుపులో ఉంచుకోవడమే మొదటి చర్య.
ఆలోచనలకు, చర్యలకు గల యీ సంబంధం వల్లనే బైబిలు మనల్నిలా హెచ్చరిస్తుంది: “పైనున్నవాటిమీదనేగాని, భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి.” (కొలొస్సయులు 3:2) ఆ తలంపులు బైబిలు సత్యాల కన్నా ఉన్నతంగా నిరూపించబడతాయన్న భయంతో కాదు గాని, పాప కార్యాల్లోకి నడిపే దేనినైనా విసర్జించాలని ఆశించడం వల్లనే క్రైస్తవులు అవినీతి, అభిచారం, మతభ్రష్టత్వంవంటి వాటిపై మనస్సు నిలపడానికి నిరాకరిస్తారు.
‘సకలము వెల్లడి చేయబడ్డాయి’
మన ఆలోచనా విధానాన్ని అదుపులో ఉంచడానికి మరొక ముఖ్యమైన కారణం యెహోవాపై మనకు గల ప్రేమ, మన తలంపులను తెలుసుకోగల ఆయన సామర్థ్యం యెడల మనకు గల గౌరవం. దుమ్ము ధూళి ఉంటే బాధపడే ఒక ప్రియమైన స్నేహితుడో, దగ్గరి బంధువో మీకున్నాడని ఊహించుకోండి. మీ యింటిని మరెక్కువగా శుభ్రం చేయవలసి వస్తుందని మీ స్నేహితున్ని ఆహ్వానించడం మానేస్తారా? వస్తువులను శుభ్రంగా ఉంచడానికి అవసరమైన అదనపు ప్రయత్నాలు చేయడానికి ప్రేమ మిమ్మల్ని పురికొల్పదా? మన ఆంతరంగిక ఆలోచనలను కూడా పసిగట్టగల యెహోవా సామర్థ్యం కీర్తన 44:21లో చూపబడింది: “హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు.” మన ఆలోచనలను బట్టి మనం లెక్క ఒప్పజెప్పవలసినవారమని పౌలు చెప్పాడు: “ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు. మనమెవనికి లెక్కయొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది.”—హెబ్రీయులు 4:13; కీర్తన 10:4; సామెతలు 6:16, 18.
మానవుడు తన ఆలోచనలను బట్టి యెహోవా యెడల బాధ్యత కలిగియున్నాడని యోబు గుర్తించాడు. “యోబు, ‘తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని’ . . . దహనబలి నర్పించుచు వచ్చెను.” (యోబు 1:5) ఏదైనా చెడు పనిని గూర్చి యిష్టపూర్వకంగా ధ్యానం చేయడాన్ని కూడా యెహోవా పాపంగానే దృష్టిస్తాడు.—నిర్గమకాండము 20:17 పోల్చండి.
ఆలోచించడానికి నిజమైన స్వాతంత్ర్యం
“ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్టు చెరపట్టి” తీసుకురావాలన్నది ఒక లక్ష్యంగా ఉంచుకోవాలని బైబిలు ప్రతి క్రైస్తవుడిని ప్రోత్సహిస్తుంది. (2 కొరింథీయులు 10:5) ఇది మత నాయకులు విధించే కట్టడల వలన కాదు గాని, వ్యక్తులు ఆత్మ నిగ్రహాన్ని, యెహోవాను ఆయన సూత్రాలను అర్థం చేసుకొని, వారిపట్ల ప్రేమను కనబరచడం ద్వారా మాత్రమే సాధ్యమౌతుంది. ఈ లక్ష్యాన్ని సాధించడంతోటే ఆలోచించడానికి నిజమైన స్వాతంత్ర్యం వస్తుంది, దేవుని ప్రమాణాలకు మాత్రమే పరిమితమై, మన తలంపుల్లో కూడా యెహోవాను ప్రీతిపరుస్తున్నామని తెలుసుకోవడం వలన నిజమైన స్వాతంత్ర్యం వృద్ధి అవుతుంది.
(g94 6/8)
[Picture Credit Line on page 18]
From the book Bildersaal deutscher Geschichte
బిల్డెర్జాల్ డాయిచర్ గెసిక్టె అనే పుస్తకం నుండి