ఐస్‌క్రీమ్ చరిత్ర
ఐస్‌క్రీమ్ దాని తొలి రోజులకన్నా ఎంతో ప్రగతిని సాధించింది. ప్రాచీన రోమన్లు సోర్బెట్ను కనిపెట్టారు. మంచు, పండ్లు, తేనె కలిపి వండిన సగంగడ్డ కట్టిన యీ ఫలహారాన్ని ధనవంతులు కొన్ని సార్లు తినేవారు. కాలం గడిచే కొలది సోర్బెట్ ఉత్పాదన సంస్కరించబడి, మధ్యయుగాల్లో అరబ్బీయుల పాకశాస్త్ర నిపుణుల చేతిలో పూర్తిగా మారిపోయింది. “సోర్బెట్,” “షెర్బెట్” అనే పదాలు బహుశ, అరబ్బీ పదాలనుండే ఉద్భవించాయి.
ముఖ్యంగా నీటితో తయారు చేసే శ్రేష్ఠమైన సోర్బెట్, ఆధునిక దిన ఐస్‌క్రీమ్‌కి ముందుగా వచ్చినదని చెప్పవచ్చు. మీగడతోకూడిన రుచికరమైన ఐస్‌క్రీమ్‌ను తయారు చేయడానికి పాలు, గుడ్లు, పంచదార, రుచినిచ్చే పదార్థాల ఉపయోగంతో దీనికి పెద్ద మార్పే వచ్చింది. మీరు 1600లలో ఫ్రెంచ్ రాజైన లూయిస్ XIV కోర్టులో జీవించివున్నట్లయితే, నాగరిక సమాజంలోనికి ఐస్‌క్రీమ్ ప్రవేశాన్ని గూర్చి సాక్ష్యమిచ్చి ఉండేవారు. ఆ కాలంలో ఐస్‌క్రీమ్ జీర్ణానికి మంచిదా, కాదా అని వైద్యుల మధ్య, యితర పండితుల మధ్య వాదనలు జరిగేవి.
శీతలీకరణం చేసే ఐస్‌క్రీమ్ యంత్రాలు లేని ఆ కాలంలో ఐస్‌క్రీమ్‌ను తయారు చేయడం ఎలా సాధ్యం? మొదట్లో, చెక్కతోనో, సత్తు అనే లోహముతోనో తయారు చేయబడిన రెండు పాత్రలు ఒకదానిలో ఒకటి ఉంచేవారు. ఐస్‌క్రీమ్ మిశ్రమాన్ని చిన్నపాత్రలో వేసి, రెండు పాత్రలకు మధ్య ఉన్న ఖాళీ స్థలంలో మంచును, ఉప్పును నింపేవారు. కావలసిన పదార్థాలు కలిసిన తర్వాత, ఆ మిశ్రమాన్ని పాత్రలోనే ఉంచేవారు. అలా ఐస్‌క్రీమ్ తయారయ్యేది. మంచుగడ్డ ఎక్కడ నుండి వచ్చేది? శతాబ్దాలకు పూర్వం, ప్రజలు, చలికాలంలోని మంచును పోగుచేసి, మూటకట్టి గుంటల్లో పెట్టి, వాటిని గడ్డితోను, సింధూర కొమ్మలతోను కప్పి మంచుగడ్డలను తయారు చేసి, నిల్వ ఉంచవచ్చని కనుక్కున్నారు. మంచుగడ్డలను తయారు చేసే యంత్రాలను 19వ శతాబ్దంలో కనుగొని, అత్యధికంగా ఉత్పాదించడానికి వాటిని ఉపయోగించారు. ఇండ్లలో కొయ్యతోను, బెండుతోను తయారు చేసిన ఐస్‌బాక్సుల్లో మంచుగడ్డలను నిల్వ ఉంచేవారు.
ఈ శతాబ్దం ఐస్‌క్రీమ్ తయారు చేసే విధానాల్లో మరింత ప్రగతిని సాధించింది. ఇప్పుడు పరిశ్రమల్లోను, యిండ్లలోను మెరుగైన ఆరోగ్యనియమాలతో ఐస్‌క్రీమ్ తయారు చేయడానికి, రెఫ్రిజిరేటర్లు, ఐస్‌క్రీమ్ యంత్రాలు, మరితర పరికరాలు తోడ్పడుతున్నాయి.
ఐస్‌క్రీమ్‌ను తయారు చేసే కళ
ఐస్‌క్రీమ్‌ను తయారు చేసే నిపుణుడు తన వృత్తి ఏమిటో తెలుసుకోవాలి, దాని అర్థం, ఆయన మిఠాయి అంగడివాడై ఉండాలి, వంటగాడై ఉండాలి, కొన్నిసార్లు కళాకారుడై ఉండాలి, కొంతమట్టుకు రసాయనాలను కలిపేవాడుగాను, సూక్ష్మక్రిములను గూర్చి ఎరిగినవాడునై ఉండాలి. ఐస్‌క్రీమ్ చిక్కగాను మీగడతోను, రుచికరంగాను ఉండడానికి ఏది తోడ్పడుతుంది? సరే పరిశ్రమల్లో తయారైన ఐస్‌క్రీమ్‌ను ఉదాహరణగా తీసుకోండి. తయారు చేసే సమయంలో, మిశ్రమాన్ని చిక్కగా చేయడానికి క్రొవ్వులను, పండ్ల చిక్కని సారాన్ని కలుపుతారు. సరైనపాళ్ళలో గుడ్లను, పంచదారను, అవసరమైతే, సహజ రంగును, రుచిని యిచ్చే కోకో, కాఫీ, పండ్లు వంటి పదార్థాలను కూడా దానిలో కలుపుతారు. పీనట్ బటర్‌తో చేసే ఐస్‌క్రీమ్ కూడా ఉంది.
ఆ మిశ్రమాన్ని 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో బాగా కలిపిన తర్వాత, అందులో ఏమైనా సూక్ష్మక్రిములు ఉంటే వాటిని చంపడానికి దాని ఉష్ణోగ్రత 90 డిగ్రీల సెల్సియస్ అయ్యేంత వరకు వేడి చేస్తారు. కొన్ని గంటలు దాన్ని 4 డిగ్రీల సెల్సియస్ దాకా చల్లార్చిన తర్వాత అది గడ్డకట్టుకుంటుంది. రెండవ పనేమంటే దాన్ని ఘనీభవించడమే. మిశ్రమాన్ని మెల్లగా కలియబెడుతూ త్వరగా -6 డిగ్రీల నుండి -10 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతను తగ్గించాలి. గాలి దానిలోనికి ప్రవేశించడానికిది అనుమతిస్తుంది, మీగడ గల అసలైన ఐస్‌క్రీమ్‌ను తయారు చేయడానికి తోడ్పడే పద్ధతుల్లో యిది ఒకటి.
రోమన్లు తమ సోర్బెట్లను రుచించినప్పటి నుండి, లూయిస్ XIV కోర్టులో ఐస్‌క్రీమ్ ప్రవేశపెట్టబడినప్పటినుండి అనేక శతాబ్దాలు గడిచాయి. అయితే యీసారి మీకిష్టమైన గడ్డకట్టిన ఫలహారాన్ని, సోర్బెట్ని గాని, ఐస్‌క్రీమ్‌ని గాని తినేటప్పుడు, ప్రాచీన రోమన్లకు యిలాంటి ఆహారాన్నిగూర్చిన తలంపు వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పండి!