కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 4/8 పేజీలు 14-15
  • కోపపడడం అన్నివేళలా తప్పేనా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కోపపడడం అన్నివేళలా తప్పేనా?
  • తేజరిల్లు!—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సమతుల్య దృష్టి
  • నీతియుక్తమైన కోపం
  • సరైన విధంగా కోపాన్ని వ్యక్తం చేయడం
  • కోపం గురించి బైబిలు ఏం చెప్తుంది?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • మీ కోపాన్ని ఎందుకు అదుపు చేసుకోవాలి?
    తేజరిల్లు!—1997
  • కోపం మిమ్మల్ని ఏలనివ్వకండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • కోపాన్ని ఎలా తగ్గించుకోవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
మరిన్ని
తేజరిల్లు!—1994
g94 4/8 పేజీలు 14-15

బైబిలు ఉద్దేశం

కోపపడడం అన్నివేళలా తప్పేనా?

“కోపమనేది తాత్కాలికమైన పిచ్చి.” భావోద్రేకాలన్నింటిలో ఒకానొక బలీయమైన దానిని గూర్చిన సాధారణ అభిప్రాయాన్ని ఒక ప్రాచీన రోమా రచయితయైన హొరోట్యస్‌ పై విధంగా వ్యక్తపర్చాడు. కోపమనేది తాత్కాలికమైన పిచ్చి అని ప్రతి ఒక్కరు ఒప్పుకోకపోయినప్పటికీ, చాలా మంది దాన్ని చెడు స్వభావమనే దృష్టిస్తారు. సా. శ. ఆరవ శతాబ్దం నాటికే కాథోలిక్‌ మతగురువులు “ఏడు ప్రాణాంతకమైన పాపాలతో” కూడిన పట్టికను తయారు చేశారు. కోపమన్నది ఆ పట్టికలో ఉండడం ఆశ్చర్యమేమీ కాదు.

వారు యీ విధంగా ఎందుకు భావించారో అర్థంచేసుకోవడం చాలా సులభం. బైబిలు యిలా అంటుంది: “కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము.” (కీర్తన 37:8) అలాగే అపొస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి యీ విధంగా ఉపదేశించాడు: “సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.”—ఎఫెసీయులు 4:31.

‘కోపమును గూర్చిన బైబిలు ఉద్దేశము యిదేనా? అంతెందుకు, మనం జీవిస్తున్న ఈ “అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని” పౌలు కూడా ప్రవచించలేదా?’ (2 తిమోతి 3:1-5) అని మీరు ఆశ్చర్యపోవచ్చు. ప్రజలు ‘అనురాగరహితులు, క్రూరులు, సజ్జనద్వేషులు’గా ఉన్న యీ కాలాల్లో మనం ఎన్నటికీ కించింత కూడా కోపపడకుండా జీవించాలని, దేవుడు నిజంగా అపేక్షిస్తున్నాడా?

సమతుల్య దృష్టి

ఈ విషయాన్ని గూర్చిన బైబిలు దృక్పథం మరీ అంత సరళమైంది కాదు. ఉదాహరణకు, ఎఫెసీయులు 4:26లోని పౌలు మాటలను గమనించండి: “కోపపడుడి గాని పాపము చేయకుడి.” కోపమనేది నిత్య శిక్షకు అర్హమైన “ప్రాణాంతక పాపమైతే” యీ వచనం నిజంగా కలవరపర్చేదిగా ఉంటుంది.

పౌలు కీర్తన 4:4 నుండి ఉదాహరిస్తున్నాడు, అక్కడ మనమిలా చదువుతాము: “భయమునొంది పాపము చేయకుడి.” వైన్స్‌ ఎక్స్‌పోజిటరీ డిక్షనరీ ఆఫ్‌ బిబ్లికల్‌ వర్డ్స్‌ ప్రకారం యిక్కడ “భయపడుడి” అన్నది రాగజ్‌ అనే హెబ్రీ పదం నుండి అనువదించబడింది. దానికి “తీవ్రమైన భావోద్రేకంతో వణుకుట” అని అర్థము. అది తీవ్రమైన ఏ భావోద్రేకం? కోపమా? సెప్ట్యూజింట్‌ అనువాదంలో కీర్తన 4:4లోని రాగజ్‌ గ్రీకులో “ఆగ్రహించుడి” అని అనువదించబడింది. యిక్కడ స్పష్టంగా పౌలు ఉద్దేశించిన భావమదే.

బైబిలు కోపానికి తావెందుకిస్తుంది? ఎందుకంటే అన్ని రకాల కోపాలు చెడ్డవి కావు. ఒక బైబిలు వ్యాఖ్యాత చెప్పినట్లు, “మానవుని కోపం ఎన్నడూ న్యాయమైనదిగా, అనుమతించదగినదిగా లేదు,” అనడం లేఖనానుసారం కాదు. బైబిలు విద్వాంసుడైన ఆర్‌. .సి. హెచ్‌. లెన్‌స్కీ ఎఫెసీయులు 4:26ను సరిగ్గానే ఉదాహరించాడు: “ఎలాంటి పరిస్థితుల్లోనైనా సకల విధములైన కోపాన్ని నిషేధించి, అచంచలమైన నెమ్మదితనాన్ని కోరే నైతికశాస్త్రం వేదాంతమేగాని, క్రైస్తవత్వం కాదు.” ప్రొఫెసర్‌ విలియమ్‌ బార్‌క్లే యిదే విధంగా రాశాడు: “క్రైస్తవ జీవితంలో కోపం తప్పకుండా ఉండవలసిందే, కాని ఆ కోపం సరైనదై ఉండాలి.” అయితే “సరైన కోపమంటే” ఏది?

నీతియుక్తమైన కోపం

కోపమన్నది యెహోవాకున్న ముఖ్యమైన లక్షణాల్లో ఒకటి కాకపోయినప్పటికీ, ఆయన కోప్పడినట్లు, కోపాన్ని వ్యక్తం చేసినట్లు లేఖనాల్లో అనేకసార్లు వర్ణించబడింది. రెండు కారణాలనుబట్టి ఆయన కోపం అన్నివేళలా నీతియుక్తంగానే ఉంటుంది. మొదటిగా, ఆయన సరైన కారణం లేకుండా ఎప్పుడూ కోప్పడడు. రెండవదిగా, ఎల్లవేళలా ఆయన అదుపు తప్పిపోకుండా, న్యాయమైన విధంగా, నీతియుక్తంగానే తన కోపాన్ని వెల్లడి చేస్తాడు.—నిర్గమకాండము 34:6; కీర్తన 85:3.

ఉద్దేశపూర్వకమైన అవినీతి మూలంగా యెహోవా ఉగ్రుడయ్యాడు. ఉదాహరణకు, ఇశ్రాయేలీయులు దిక్కులేని స్త్రీలను, పిల్లలను బాధపెడితే, తాను అలాంటి వారి ‘మొఱ తప్పక వింటానని’ యెహోవా చెప్పాడు. ఆయన ‘నా కోపాగ్ని రవులుకొంటుంది’ అని వారిని హెచ్చరించాడు. (నిర్గమకాండము 22:22-24; సామెతలు 21:13 పోల్చండి.) తన తండ్రి వలె, యేసుకు పిల్లలయెడల అనురాగముంది. ఒకసారి కొందరు పిల్లలు ఆయనను సమీపిస్తుండగా సద్భావంగల ఆయన శిష్యులు అభ్యంతరం చెప్పినపుడు, “యేసు” అది చూచి “కోపపడి” ఆ పిల్లలను ఎత్తుకున్నాడు. (మార్కు 10:14-16) “కోపం” అనే పదం మొదట్లో “శారీరక వేదన లేదా ఆగ్రహం” అనే భావాన్ని సూచించిందని జ్ఞాపకముంచుకోవాలి. నిజంగా తీవ్రమైన భావోద్రేకాలే!

అలాగే వ్యాపారస్థులు, రూకలు మార్చేవారు తన తండ్రి ఆరాధనాలయాన్ని “దొంగల గుహగా” మార్చినప్పుడు యేసు హృదయంలో నీతియుక్తమైన కోపం చెలరేగింది. ఆయన వారి బల్లలను పడద్రోసి వారిని అక్కడినుండి బయటికి వెళ్ళగొట్టాడు! (మత్తయి 21:12, 13; యోహాను 2:15) పరిసయ్యులు, శాస్త్రులు సహాయం అవసరమున్న రోగులకన్నా విశ్రాంతి దినానికి సంబంధించిన నియమాలకు ఎక్కువ ప్రాధాన్యత యిచ్చినప్పుడు, యేసు “వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి, కోపముతో తన చుట్టూ ఉన్న వారిని కలయచూచాడు.”—మార్కు 3:5, ఫిలిప్స్‌.

అలాగే, ప్రాచీన కాలంలోని నమ్మకస్థుడైన మోషే, ధర్మశాస్త్రం వ్రాయబడిన రాతి పలకలను పడవేసినప్పుడు, నీతియుక్తమైన కోపంతో అపనమ్మకస్థులైన ఇశ్రాయేలీయులపై మండిపడ్డాడు. (నిర్గమకాండము 32:19) అలాగే, వివాహమునకు సంబంధించిన దేవుని ధర్మశాస్త్రానికి ఇశ్రాయేలీయులు అవిధేయులైనప్పుడు, నీతిమంతుడును, శాస్త్రియునైన ఎజ్రా ఎంతో కోపపడి, తన వస్త్రములను చింపుకొని, తన వెంట్రుకలలో కొన్నింటిని పెరికి వేసుకున్నాడు!—ఎజ్రా 9:3.

వీరందరు ‘కీడును ద్వేషించి మేలును ప్రేమించడానికి’ ప్రయత్నించారు. (ఆమోసు 5:15) కాబట్టి, ఉద్దేశపూర్వకమైన, పశ్చాత్తాపం లేని క్రూరమైన చర్యలను, కపటాన్ని, అన్యాయాన్ని, అపనమ్మకాన్ని, అవినీతిని చూసినప్పుడు నేడు క్రైస్తవులు తమ హృదయాల్లో నీతియుక్తంగా కోపపడతారు.

సరైన విధంగా కోపాన్ని వ్యక్తం చేయడం

బైబిలు తరచూ కోపాన్ని నిప్పుతో పోల్చడం యాదృచ్ఛికం కాదు. నిప్పులాగే దీని పాత్ర దీనికుంది. అయితే యిది భీతినిగొల్పే వినాశకారిణి కూడా కాగలదు. యెహోవా వలె, యేసుక్రీస్తు వలె కాక, మానవులు బహు తరచుగా సరైన కారణం లేకుండానే కోప్పడతారు, లేదా తమ కోపాన్ని అన్యాయమైన రీతిలో వ్యక్తపరుస్తారు.—ఆదికాండము 4:4-8; 49:5-7; యోనా 4:1, 4, 9 చూడండి.

మరొక వైపు, తన కోపాన్ని అణచివేసుకొని, కోపం లేనట్లు నటించడం కూడా నీతియుక్తమైనది కాకపోవచ్చు. పౌలు ఉపదేశించినది గుర్తుంచుకోండి: “సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచియుండకూడదు.” (ఎఫెసీయులు 4:26) ‘మీ హృదయంలో ధ్యానము చేసి ఊరుకోవడం,’ మీ భావాలను పరిపక్వతగల ఆప్తునితో చెప్పడం, లేదా తప్పు చేసిన వ్యక్తితో ముఖాముఖిగా నెమ్మదిగా చెప్పడం అన్నవి కోపాన్ని వ్యక్తం చేయడానికి లేఖనానుసారమైన మార్గాలు.—కీర్తన 4:4; సామెతలు 15:22; మత్తయి 5:23, 24; యాకోబు 5:14.

కాబట్టి, కోప్పడడం ఎల్లవేళలా నిశ్చయముగా తప్పుకాదు. యెహోవా, యేసుక్రీస్తు కోప్పడ్డారు—మరలా కోప్పడతారు కూడా! (ప్రకటన 19:15) మనం వారిని అనుకరించాలంటే, కోప్పడకుండా ఉంటే తప్పుకాగల పరిస్థితులను కూడా మనమెదుర్కోవచ్చు! బైబిలు ఉపదేశాన్ని అనుసరించడానికి, మన భావోద్రేకాలకు సరైన కారణముందని, వాటిని మనం నీతియుక్తమైన విధానంలో క్రైస్తవ మార్గంలో వ్యక్తపరుస్తున్నామని రూఢి చేసుకోవడమే కీలకమైయున్నది.

[14వ పేజీలోని చిత్రం]

కయీను, హేబెలు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి