బైబిలు ఉద్దేశ్యము
“క్రొత్తనిబంధన” యూదులకు విరుద్ధమైనదా?
అమెరికా సువార్తీకుడు ఒకసారి యిలా వివరించాడు: “వ్యవస్థీకరించబడిన చర్చి దాని చరిత్రలో ఎక్కువభాగం పాపం చేసింది, ప్రాముఖ్యంగా యూదులకు వ్యతిరేకంగా అమలుపర్చిన యూదావ్యతిరేకత నిమిత్తం, తీర్పుసమయంలో సమాధానం చెప్పుకోవల్సింది చాలావుంది.”
ఈ 20వ శతాబ్దంలో కూడా కొనసాగుతున్న యూదావ్యతిరేకతకు ఎందుకంత దీర్ఘకాలిక, నీచ చరిత్రవుంది? కొందరు క్రొత్తనిబంధన అని పిలువబడే, క్రైస్తవ గ్రీకు లేఖనాలను నిందిస్తారు. ఉదాహరణకు, హార్వార్డ్ డివినిటీ స్కూల్‌నందు క్రైస్తవ మతాచార్యుడైన క్రిష్టర్ ష్టెండేల్ యిలా అంటున్నాడు: “అది . . . క్రొత్తనిబంధన ప్రవచనాలు యూదులకు వ్యతిరేకంగా ఉన్న ద్వేషమనే ‘దైవిక’ శిక్షగా పనిచేశాయని అందరికీ తెలిసినదే మరియు సాధారణంగా అంగీకరించిన సత్యం.” ఇది ఒకవేళ సాధారణంగా అంగీకరించినదే అయినప్పటికి, మరిది నిజంగా వాస్తవమేనా?
యేసుక్రీస్తు మరణానికి కారణమెవరని నిందించబడ్డారు?
“క్రొత్తనిబంధన” యూదుల వ్యతిరేకతకు ఆధారంగా తరచు ఎత్తివ్రాసే వాక్యభాగమేదనగా, మత్తయి 27:15-25. అక్కడ మనకు చెప్పబడిందేమనగా, యేసును సిలువ వేయుమని యూదుల జనసమూహము రోమీయుల అధిపతియైన పొంతి పిలాతును బలవంతం చేస్తూ, “వాని రక్తము మా మీదను మా పిల్లలమీదను ఉండునుగాకని” కూడా కేకలు వేసిరి. ఇక్కడ మొదటి శతాబ్దపు యూదులందరూ యేసు మరణానికి కారకులని, యూదులు నిరంతరం యేసును చంపినవారుగానే పరిగణించబడతారని “క్రొత్తనిబంధన” బోధిస్తుందా?
మొట్టమొదటిగా, యేసు పరిచర్య సమయంలో చాలామంది యూదులు ఏ విధంగా ప్రతిస్పందించారు? “క్రొత్తనిబంధన” బయలుపర్చేదేమంటే, యూదుల జనసమూహాలతో, ప్రాముఖ్యంగా ఆయన అత్యధికంగా పరిచర్య చేసిన గలిలయలో యేసు మంచి ప్రసిద్ధిచెందాడు. (యోహాను 7:31; 8:30; 10:42; 11:45) ఆయన బంధింపబడి, చంపివేయబడక ముందు కేవలం ఐదురోజుల క్రితమే, యూదుల జనసమూహములు ఆయనను మెస్సీయగా యెరూషలేముకు ఆహ్వానించారు.—మత్తయి 21:6-11.
అయితే, యేసును మరణానికి అప్పగించాలని కోరినదెవరు? “క్రొత్తనిబంధన” పేర్కొనేదేమనగా, యేసు ప్రధానయాజకుల, పరిసయ్యుల, సద్దూకయ్యుల వేషధారణను బయటపెట్టినందువల్ల ఆయన వారి మన్నన పొందలేదు. (మత్తయి 21:33-46; 23:1-36)a ప్రధాన యాజకుడైన కయప యేసు వ్యతిరేకులలో ప్రాముఖ్యుడు. ఎందుకంటే యేసు రూకలు మార్చువారిని దేవాలయం నుండి వెళ్లగొట్టినప్పుడు అతడు స్వయాన ఆర్థికంగా దెబ్బతిన్నాడు. (మార్కు 11:15-18) అంతేకాకుండా, యూదులతో యేసుకుగల ప్రఖ్యాతి చివరకు రోమీయుల అంతరాయానికి నడిపిస్తుందని, కయిప వ్యక్తిగతంగా తన సామర్ధ్యాన్ని కోల్పోతాడని భయపడ్డాడు. (యోహాను 11:45-53) ఆవిధంగా, ప్రధానయాజకులు, మరితర మతనాయకులు యేసు మరణానికి కుట్రపన్ని, ఆయనను చంపించుట కొరకు రోమీయుల న్యాయస్థానానికి అప్పగించారు. (మత్తయి 27:1, 2; మార్కు 15:1; లూకా 22:66–23:1) యేసుకు యూదుల జనసమూహాలతో గల ప్రఖ్యాతి ఆయన మరణానికి నడిపించడం ఎంత క్రూరమో గదా!
యేసు ప్రఖ్యాతిని దృష్టిలో పెట్టుకు చూస్తే, యూదులు యేవిధంగా ఆయన మరణం కొరకు నినాదాలు చేస్తారు? యేసు మద్దతుదారుల్లో చాలామంది గలిలయులు గనుక, ఆయనను చంపాలని కోరిన జనసమూహం ముఖ్యంగా యూదాప్రాంతం వారే అయ్యుండొచ్చు. గలిలయులు సహజంగా జాలిహృదయులు, నమ్రతగలవారు, నిర్మొహమాటంగా మాట్లాడే ధోరణి గలవారైయుండగా, యూదాప్రాంతంవారు, ప్రాముఖ్యంగా యెరూషలేమువారు గర్విష్టులును, సంపన్నులు, ఎక్కువ విద్యాభ్యాసం చేసినవారునై ఉన్నారు. స్పష్టంగా, “ప్రధానయాజకులును, పెద్దలును,” జనసమూహాలను ప్రేరేపించారని మత్తయి బయల్పరచాడు. (మత్తయి 27:20) ఈ విధంగా వారిని పురికొల్పడానికి వారెలాంటి అబద్ధమాడి ఉండవచ్చు? దేవాలయాన్ని పడగొడతానని యేసు చెప్పాడని ఆరంభంలో యేసును శ్రమపెట్టినప్పుడు, మరియు యేసు మరణించే సమయంలో మరలా జనసమూహములు చెప్పింది అబద్ధమా?—మార్కు 14:57, 58; 15:29.b
సమాజపు బాధ్యత
ఈ యూదుల జనసమూహం మొత్తం యూదా ప్రజలు కానట్లైతే, పెంతెకొస్తు దినమునకు ఏభైరెండురోజుల తర్వాత అపొస్తలుడైన పేతురు, “యీయనను (యేసును) మీరు దుష్టులచేత సిలువ వేయించి చంపితిరి” అని ఎందుకు అన్నాడు? (అపొస్తలుల కార్యములు 2:22, 23) నిజంగా అక్కడున్న వారిలో ఎక్కువమందికి, యేసుక్రీస్తును మరణానికి నడిపిన సంగతుల విషయంలో సంబంధం లేదని పేతురుకు తెలుసు. అయితే, పేతురు భావమేమైయుంది?
లేఖనాల ప్రకారం, పాపం లేకుండా హత్యచేసిన అపరాధం, హత్యచేసిన వాళ్లపైనేగాకుండా ఆయనకు న్యాయం జరిగించుటలో విఫలులైన సమాజంపై కూడ ఉంటుంది. (ద్వితీయోపదేశకాండము 21:1-9) ఉదాహరణకు, ఒకప్పుడు వారిమధ్యనున్న హంతకులను శిక్షించని కారణంగా, మొత్తం బెన్యామీను గోత్రము వారందరు రక్తాపరాధులుగా తీర్చబడ్డారు. ఆ గోత్రంలో చాలామంది ఆ హత్యలో భాగం వహించనప్పటికి, దానిని సహించడంద్వారా, వారు దానిని క్షమించి తద్వారా కొంత పరిమాణంలో బాధ్యులయ్యారు. (న్యాయాధిపతులు 20:8-48) అవును, “మౌనమే అంగీకారంగా” గుర్తించబడుతుంది.
అదేరీతిలో, మొదటి శతాబ్దపు యూదా జనాంగం రక్తాపరాధులైన వారి నాయకుల నేరానికి మౌనంగా సమ్మతించారు. ప్రధానయాజకుల, పరిసయ్యుల హత్యాకాండను సహించడంద్వారా, మొత్తం జనాంగమే దానికి బాధ్యతవహించింది. దీని నిమిత్తమే పేతురు తన యూదా ప్రేక్షకులను పశ్చాత్తాపం చూపించమని కోరాడనుటలో అనుమానంలేదు.c
యేసును మెస్సీయగా అంగీకరించనందున వచ్చిన ఫలితాలేవి? యేసు యెరూషలేము పట్టణానికి యిలా చెప్పాడు: “ఇదిగో మీయిల్లు [దేవాలయం] మీకు విడువబడియున్నది.” (మత్తయి 23:37, 38) ఔను, దేవుడు తన సంరక్షణను విరమించుకున్నాడు, మరి ఫలితంగా రోమా సైన్యాలు యెరూషలేమును దాని దేవాలయంతో సహా నాశనం చేశాయి. ఒక మనిషి తన ఆస్తినంతయు వ్యయంచేస్తే యేవిధంగా తన కుటుంబం భావిస్తుందో, అలాగే యేసు మరణించాలని కేకలు వేసినవారే కాకుండా, వారి కుటుంబాలు కూడ దైవిక సంరక్షణను కోల్పోయాయి. ఈ భావంలో యేసు రక్తాపరాధం వారిపైన వారి పిల్లలపైన వచ్చింది.—మత్తయి 27:25.
అయినను, “క్రొత్తనిబంధన”యందు భవిష్యత్తులో యూదా వంశీయులు యేసు మరణం నిమిత్తం ప్రత్యేకమైన దోషాన్ని భరించాలని ఏమీ చెప్పడంలేదు. బదులుగా, వారి పితరుడైన అబ్రాహాము యెడలగల దేవుని ప్రేమ కారణంగా, ఆయన మొట్టమొదట క్రైస్తవులయ్యే ఆధిక్యతను యూదులకిచ్చి వారియెడల ప్రత్యేక శ్రద్ధ చూపాడు. (అపొస్తలుల కార్యములు 3:25, 26; 13:46; రోమీయులు 1:16; 11:28) చివరిగా ఈ అవకాశం అన్యులకు కూడ విస్తరింపజేసినప్పుడు, దేవుడు వంశాలనాధారం చేసుకుని యే వ్యక్తితోకూడ వ్యవహరించడం మానుకున్నాడు. పేతురు యిలా చెప్పాడు: “దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.” (అపొస్తలుల కార్యములు 10:34, 35) అపొస్తలుడైన పౌలు తర్వాత యిలా వ్రాశాడు: “యూదుడని గ్రీసుదేశస్థుడని భేదము లేదు.” (రోమీయులు 10:12) ఆనాటి యూదులు, దేవునియొద్ద అన్యులకున్న హోదానే కల్గియుండిరి, అది యింకనూ ఈనాడు వాస్తవమైయుంది.—యెహెజ్కేలు 18:20 పోల్చండి.
క్రైస్తవ మతసామ్రాజ్యం యూదులనెందుకు ద్వేషిస్తుంది?
కాబట్టి “క్రొత్త నిబంధన” యూదులను ద్వేషించడం లేదని చెప్పగలము. బదులుగా, యూదునిగా జన్మించి, చనిపోయిన, మోషే ధర్మశాస్త్ర నియమాలను గౌరవించమని తన యూదా అనుచరులకు బోధించిన ఒక మనుష్యుని బోధలను ఈ “క్రొత్త నిబంధన” రికార్డు చేసింది. (మత్తయి 5:17-19) కాని “క్రొత్త నిబంధన” దోషంలేనిదైతే, క్రైస్తవ మతసామ్రాజ్యంలో యూదుల యెడల ద్వేషభావం ఏకధాటిగా ఎందుకు కొనసాగుతుంది?
క్రైస్తవత్వాన్ని మాత్రమే నిందించకూడదు. యూదా కాలంలో “దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగ పరచిన” అబద్ధ క్రైస్తవులవలే, క్రైస్తవులమని చెప్పుకొంటున్నవారు చరిత్రంతటిలోనూ క్రీస్తు నామాన్ని, పక్షపాతం, స్వాభిమానం అనే బురదలోకి ఈడ్చారు. (యూదా 4) ఆవిధంగా, క్రైస్తవ మతసామ్రాజ్యంలో కేవలం పేరుకు మాత్రమే క్రైస్తవునిగా ఉంటున్న ప్రజల స్వార్థపూరిత పక్షపాతం వల్ల యూదుల యెడల ద్వేషభావం అనేది ఏర్పడింది.
యేసు తానే ముందుగా ప్రవచించిందేమంటే, కొందరు ఆయన నామమున అన్నిరకాల అద్భుతక్రియలు చేశామని చెబుతారు కాని వారు నిజంగా “అక్రమము చేయువారే”గాని—ఆయన స్నేహితులు కారు! (మత్తయి 7:21-23) వీరిలో చాలామంది వారి ద్వేషాన్ని, దురభిమానాన్ని సమర్థించడానికి “క్రొత్త నిబంధన”ను ఉపయోగించుటకు ప్రయత్నిస్తారు, కాని కారణహేతుకంగా మాట్లాడే ప్రజలు అట్టి వేషధారణను గ్రహించగలరు.
అబద్ధ క్రైస్తవులు యూదుల యెడల వారి ద్వేషభావానికి దేవునికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాని నల్లడబ్బు ఉనికిలో ఉందికదాయని వాస్తవమైన డబ్బు లేదని ఎలాగైతే నిరూపించలేమో, అలాగే క్రైస్తవులుగా నటించేవారు ఎట్టి పరిస్థితుల్లో కూడ, దురభిమానానికి కాకుండా ప్రేమకు పేరుగాంచిన క్రైస్తవులున్నారనే వాస్తవాన్ని నిజంగా వమ్ముచేయలేరు. మీ సమీపంలోని యెహోవాసాక్షుల రాజ్యమందిరాల్లో అలాంటి ప్రజలతో ఎందుకు పరిచయం చేసుకోకూడదు? (g93 8/8)
[అధస్సూచీలు]
a మొదటి శతాబ్దపు యూదుల చరిత్రకారుడైన జోసఫ్ బెన్ మత్తియాస్ (ఫ్లేవియస్ జోసిఫస్) వ్రాసేదేమంటే ఈ యుగంలోపే, ఇశ్రాయేలీయుల ప్రధానయాజకులు రోమా ప్రతినిధుల ద్వారా దాదాపు ప్రతి సంవత్సరమూ గద్దెక్కిదిగడం జరుగుతుంది. ఇలాంటి వాతావరణంలో, సమాజంలో నీచులను ఆకర్షించిన కిరాయి సైనికుల పదవిలో ప్రధానయాజకులు భ్రష్టులైపోయారు. ఈ ప్రధానయాజకులలో కొందరి నైతిక అత్యాచారాలను గూర్చి ది బాబిలోనియన్ టాల్ముడ్ వివరిస్తున్నది. (పిసాహిమ్ 57ఎ) ది టాల్ముడ్ అలాగే వేషధారణ యెడల పరిసయ్యుల ధోరణిని పేర్కొంటున్నది. (సోతా 22బి)
b యేసు నిజంగా తన విరోధులతో అలానే చెప్పాడు: “ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో దాని లేపుదునని వారితో చెప్పెను.” (యోహాను 2:19-22) కాని యోహాను సూచించినట్లుగా, యేసు యెరూషలేములోని దేవాలయాన్ని గూర్చి మాట్లాడలేదుగాని, “తన శరీరమనే దేవాలయం” గూర్చి మాట్లాడాడు. ఆవిధంగా యేసు ఎదురుచూచిన మరణ పునరుత్థానాలు, ఒక కట్టడాన్ని పడగొట్టి, తిరిగి నిర్మించడంతో పోల్చాడు.—మత్తయి 16:21 పోల్చండి.
c ఆధునిక కాలంలో కూడా అదేవిధమైన బాధ్యత గుర్తించబడింది. నాజీ జర్మను పౌరులందరూ ఘోరకృత్యాల్లో బహిరంగంగా పాల్గొనలేదు. అయినప్పటికి, జర్మను దేశం నాజీ హింసల్లో బాధితులైన వారికి నష్టపరిహారం చెల్లించుటను సమాజ బాధ్యతగా గుర్తించి, స్వచ్ఛందసేవ చేయుటకు పూనుకుంది.
[22వ పేజీలోని చిత్రం]
క్రైస్తవ మతసామ్రాజ్యంలో పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉన్న ప్రజలు యూదుల యెడల ద్వేషభావాన్ని అవలంభిస్తున్నారు
[20వ పేజీలోని చిత్రం]
యేసుగాని, ఆయన శిష్యులుగాని యూదుల యెడల ద్వేషభావాన్ని ప్రోత్సహించలేదు